సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చెవి-ముక్కు-గొంతు వ్యాధులు
చెవి-ముక్కు-గొంతుక :
చెవి
చెవి మూడు భాగములుగ విభజింపబడినది. (1) బయటి చెవి, (2) మధ్య చెవి, (3) లోపలి చెవి. బయటి చెవిలో మన కందరకు గోచరించు భాగము “పిన్నా", మరియు మధ్యచెవిలోనికి దారితీయు మార్గము కలవు. ఈ దారి కొనను ఉల్లిపొర వంటి తెర గలదు. మధ్యచెవియు, లోపలి చెవియు ఎముకలో కలవు. మధ్యచెవి పెట్టెవంటి ఖాళీప్రదేశము. దానిచుట్టును ఒక పై పొర యుండును. ముఖమునకు కండరములను సరఫరాచేయు 7 వ నాడి ఈ మధ్య చెవి గుండా పోవును. 'ఇస్టేసియన్' అను గొట్ట మొకటి కలదు. అది మధ్య చెవిని గొంతు యొక్క
చిత్రము - 210
పటము - 1 చెవి
చెవిని నిలువుగా కోసినచో గోచరించు భాగములు:
1. బయటి చెవి. 2. మధ్య చెవి. 3. లోపలి చెవి.
పై భాగముతో కలుపును. చెవి వెనుక ఒక హృదయపు ఎముక వంటి పదార్థమున్నట్లు మనకు గోచరించును. దానినే 'మేస్టాయిడ్' అందురు. ఇందు వాయు రంధ్రములు గలవు. అవి మధ్య చెవితో అనుబంధింపబడి యున్నవి. ఆసికిల్సు అను పేరుగల చిన్న ఎముక ముక్కలు మూడు కలవు. సుత్తి యెముక చెవి గూబ పొరకు అనుబంధింపబడినది. 'స్టేపీస్' అను భాగము యెముక లోపలి చెవికి (labyrinth) అనుబంధింపబడినది.
చిత్రము - 211
పటము - 2 లోపలి చెవి
1. శంఖాకృతి గల కాలువ (కాక్లియా)- ఇది శబ్దగ్రహణమునకు తోడ్పడును.
2. అర్ధ చంద్రాకారపు కాలువలు; ఇది తల యొక్క ఉనికిని తెలిసికొనుటకు తోడ్పడును.
లోపలి చెవిలో రెండు భాగములు కలవు. అవి (1) కుహరికగానున్న భాగము (వెస్టిబ్యులర్ పార్టు) ; (2) కర్ణరంధ్రభాగము. రెంటికి కూడ 8 వ కర్ణరంధ్రనాడి ద్వారా సరఫరా జరుగును. ఈ కుహరికయందు అర్ధచంద్రాకారముగల కాలువలు మూడు గలవు. అవి వివిధ ప్రదేశములలో నుండును. అందు ద్రవము, స్పర్శ జ్ఞానముగల జీవకణము లుండును. ఈ భాగమువలన మనము మన తలయొక్క ఉనికిని తెలిసికొనుచున్నాము. కర్ణనాడి ప్రాంతములో, అనగా చిక్కుమార్గముగల ప్రదేశములో శంఖాకృతి గల కాలువ యుండును. ఆ కాలువ యందు స్పర్శజ్ఞానము గల జీవకణము లుండును. అవి ఇక్కడ నుండి కర్ణనాడిగుండా, మెదడు లోని కర్ణ వృత్తములోని మెదడుయొక్క కేంద్రములకు శబ్దమును చేరవేయును. మెదడులోని కేంద్రములు చెడిపోయిన యెడల, చెవి మామూలుగానే యున్నను, శబ్దములు వినబడినను, అందుండి మనమేమియు గ్రహింపలేము.
బయటిచెవి : చెవిలో గులిమి యుండుట ఇందలి సర్వసాధారణస్థితి. గ్లిసరిన్ చుక్కలు వేసియు, పిచికారీ కొట్టియు చెవిని మృదువు పరచ వచ్చును. పిల్లలు చిన్న చిన్న వస్తువులను చెవులలో పెట్టుకొందురు. వాటిని తీసి వేయ వచ్చును. ఈ మార్గము వాచినచో దానిని "ఎక్స్‌టర్నల్ ఓటైటిస్" అందురు. చెవి కదిపి నప్పుడు నొప్పి యుండును. కాపడము పెట్టుట మూలమునను; ఆంటీబయటిక్ ఔషధముల మూలమునను ఈ పరిస్థితి గల వారికి స్వస్థత చేకూర్చ వచ్చును.
మధ్యచెవిపోటు : మధ్య చెవి యెక్కువగా వాచిన యెడల 'ఉల్లిపొర' ఎర్రగా నగును. ఆవాపు గొంతు నుండి కంఠ, కర్ణ నాళముల ద్వారా వ్యాపించును. విపరీతమైన నొప్పి యుండును. పెద్ద మోతాదులో ఆంటీబయటిక్సు ఇచ్చిన యెడల అది సాధారణముగా తగ్గును.
ఒక్కొక్కప్పుడు గూబ పగిలి చెవినుండి చీముకారుచుండును. అటువంటి సమయమున గూబలో ఒక రంధ్రము చేసి దానిని క్లోరోమైసిటిన్ పొడితో మూడు వారములు శుభ్రపరచి అదిమానునట్లు చేయవలెను.
మధ్యచెవికి సంబంధించిన దీర్ఘ రోగము : వ్యాధి ప్రకోపించిన దశలో శ్రద్ధ వహించక పోవుట వలన చెవినుండి దీర్ఘకాలముగా రసికారుట సంభవించును. ఇందలి తీవ్ర క్లిష్టపరిస్థితులు :
మస్టోయిడైటిస్ : అనగా (1) 'మస్టాయిడ్ ' ఎముకలో వచ్చు నొప్పి. (2) సప్తమనాడికి పక్షవాతము (3) సంపర్క దోషము పైకి వ్యాపించి మెదడులో వ్రణమును కలిగించ వచ్చును. వినికిడి శక్తి కుంటుపడును. దాదాపు ఈ కేసు లన్నిటిలోకూడ శస్త్ర చికిత్స అవసర మగును.
లోపలిచెవి : లోపలి చెవికి వ్యాధులు అరుదుగా సంభవించును. కాని మధ్య చెవి నుండి లోపలి చెవికి సంపర్క దోషము వ్యాపించ వచ్చును. దీనినే 'లాబ్రిం ధైసిట్' అందురు. ఇందులకు శస్త్ర చికిత్స అవసర మగును.
1. చెవుడు : శబ్దము రెండు విధములుగ లోపలి చెవిలోనికి చేరును. వాయు ప్రసారము అనగా ధ్వని చెవి రంధ్రముగుండాపోయి ఉల్లిపొరకు తగిలి దానిని అంటి పెట్టుకొనును. అప్పుడు ఆ శబ్ద తరంగములు ఎముకలచే నిర్మితములైన ఆసికిల్స్ ద్వారా లోపలి చెవి లోనికి ప్రసారమగును. ఆ వాయు ప్రసారమును చెవిలో గులిమి కాని, మధ్య చెవి వ్యాధికాని, కంఠ కర్ణనాళములుగాని అడ్డగింప వచ్చును. ఈ పరిస్థితికి గల హేతువును చికిత్స చేయుట మూలమున తొలగించ వచ్చును.
2. నాడీ సంబంధమైన చెవుడు లేక నాడీ ప్రసారము : చెవి వెనుకనున్న మసాయిడ్ ఎముక మీద గడియారమును పెట్టిన యెడల ధ్వని నరముల ద్వారా లోపలికి పోవును. నాడీ సంబంధమైన చెవుడు వచ్చి నప్పుడు శబ్ద ప్రసారము తగ్గిపోవును. మామూలు పరిస్థితిలో నున్న వ్యక్తి వినినంత బిగ్గరగా అతడు విన జాలక పోవును. నాడీ సంబంధమైన చెవుడు వచ్చినప్పుడు, ఒక్క పరిస్థితిలో తప్ప, ఏమియు చేయుట సాధ్యముకాదు. సవాయి వ్యాధి వలన అది వచ్చినపుడు మాత్రము చికిత్స చేయుట సాధ్యమగును. లేనిచో వినుటకు వీలు కల్గించు సాధనమును అమర్చుకొనుటయే ఇందులకు చేయవలసిన నివారణోపాయము.
ఆటోస్కీరోసిస్ : అంకవన్నె ఎముక యొక్క 'స్టెపీస్' అను ఎముక లోపలి చెవికి గట్టిగా అనుబంధింప బడును. అనుబంధము ఎముకగా మారుటయే ఈ వ్యాధిలో చెవుడు వచ్చుటకు గల కారణము. ఇట్టి కేసులలో సున్నితమైన శస్త్ర చికిత్స చేసి తద్వారా చెవిటి తనమును అంత మొందించవచ్చును.
టిన్నిటస్ : చెవిలో 'గుయ్య్' అను శబ్దము వినబడుట యని దీనికి అర్థము. 'లాబ్రింతైన్ వెర్టిగోలో ' వలె అది ఒక్కొక్క తూరి ముమ్మరముగా వచ్చి స్వల్పకాలము తరువాత తగ్గిపోవును. లేక తీవ్రమగు నెత్తురుపోటు (బ్లడ్ ప్రెషరు) నందు వలె ఏకధాటిగా కొనసాగవచ్చును. కుహరి కావయవములు పనిచేయుటలో కలిగిన కల్లోలమే ఇందులకు గల కారణము. మధ్య చెవి వ్యాధిలో క్లిష్ట పరిస్థితి రూపమున గూడ ఇది సంభవించ వచ్చును. క్వినైన్, శైలితములు (సేలిసి నేట్సు) వంటివి శరీరములో ఈ భాగముపై పనిచేసి, ఈ పరిస్థితికి కారణము లగును. బ్రొమైడ్ వంటి ఉపశమ నౌషధములను ఇచ్చి 'టిన్నిటిస్ ' వ్యాధిని నివారించ వచ్చును. తలతిరుగుట : (వెర్టిగో) : తలతిరుగుట లేక ఒకవ్యక్తి నిలబడి యున్నపుడు ఒకవైపుకు పడిపోవుచున్న ట్లనిపించుటను వెర్టిగో అందురు. ఈ వ్యాధితోపాటుగా సాధారణముగా చెవిలో హోరువ్యాధి వచ్చుచుండును. లోపలి చెవిలోని వెస్టెబ్యులర్ భాగము పని చేయక పోవుటయే ఇందులకు గల కారణము.
తిరుగుడు కుర్చీలలో కూర్చుని తిరిగి నప్పుడును, లేక మిక్కిలి చల్లనైన నీరు మన చెవిలోనికి పిచికారి కొట్టినపుడును, మనకు తల తిరుగుచున్నట్లు (తలదిమ్ము) అనిపించుట జరుగును. వాంతులు కూడా రావచ్చును. కుహరికా యంత్రములు పూర్తిగా నశించని యెడల ఇట్టిది సంభవించదు.
చెవి లోపల భాగమునకు సంబంధించిన తల తిరుగుడు 40 సంవత్సరములు దాటిన వారికి మాత్రమే వచ్చును. అది నాలుగు రోజుల కన్న ఎక్కువ కాల ముండదు. ఇట్లు వచ్చుటకు పూర్వము రోగి స్వస్థతగా నుండును. రోగికి తలదిమ్ము, తలతిరుగుట, తరచుగా చెవిలో హోరు శబ్దము కలుగును. కొద్ది మోతాదులలో ఫెనో బార్బిటోన్ ఇచ్చిన యెడల రోగికి స్వస్థత కలుగును. అట్టి తీవ్రమైన కేసులలో కుహరికా యంత్రములను శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా తీసి వేయ వలసియుండును. అట్లు చేసినచో వినికిడి శక్తి కూడా పోవును.
విమానయానము : సాధారణముగా మధ్య చెవియొక్క లోపలి భాగము లోని గాలి ఒత్తిడియు, బయటనున్న గాలి ఒత్తడియు గొంతులోనికి తెరుచుకొని యుండు యుస్టేసియన్ ట్యూబ్‌ద్వారా ఒకే స్థాయిలో నుండును. మనము పైకి పోయిన కొలదియు, ఎత్తు నుండి క్రిందికి దిగిన కొలదియు గాలి ఒత్తిడిలో మార్పులు కలుగుచునే యుండును. ఆ ఒత్తిడులను సమపరచుటకు వ్యక్తి తరచుగా మ్రింగుచుండవలెను. అట్లు చేసిన యెడల కంఠ కర్ణ నాళముల ద్వారా ఒత్తిడి సమాన మగును. లేనిచో మధ్య చెవిలో తీవ్రమగు నొప్పి రావచ్చును.
మానవుల వినికిడి శక్తి : 10–20,000 సైకిల్సు వరకు శబ్దములను మనము వినగలము ; దీనిని మించి మనము విన జాలము. జంతువులు, అందులో ముఖ్యముగా కుక్క ఈ పరిమితిని దాటి విన కలుగు చున్నది.
ముక్కు
ముక్కు రెండు పుటములుగా విభజింపబడినది. వీటి మధ్య ఒక గోడ యుండును. అది కొంత వరకు తరుణాస్థులతోను, కొంతవరకు ఎముకలతోను నిర్మితము. ముక్కు ప్రారంభ భాగములో వెంట్రుక లుండి దానిని సంరక్షించును. అవి గాలిని వడగట్టును. బయటి గోడలు మధ్యకు ముడుచుకొని యుండును. వాటిలోపల ఒక పొరవంటిది యుండును. ముక్కు పైభాగము మెదడు నుండి ఒక పలుచని యెముకల పళ్ళెరముతో వేరుచేయబడినది. మొదటి నాడి పైనుండి వచ్చును. వాసనకు కారణ మిదియే. ముక్కు వెనుకటి భాగము సప్తపదికి దారితీయును. ముక్కు చుట్టును గల ఎముకలు లోపల గుల్లగా నుండును. వాటి చుట్టును పొర యుండును. ఇవి గాలితో నిండి యుండును. వీటినే సైనసిస్ అందురు. నుదుటి ఎముకలో రెండు సైనస్ లు ఉండును. ముక్కుకు ఇరుప్రక్కల గల మాగ్జిలరీ సైనస్ లపై నుండి స్పినోయిడల్ సైనస్, ఎథి మోయిడల్ ఎముకల నుండి చిన్న సైనస్ లు
చిత్రము - 212
పటము - 3 ముక్కు
ముక్కును మధ్య గోడ మీదుగా కోసిన యెడల మనకు కనబడుభాగము :
1. ముందువైపున గల నైనస్. 2. తరుణాస్థులతో తయారైన గోడ. 3. వాసనను స్వీకరించు మొదటి నాడి.
చిత్రము - 213
పటము - 4 ముక్కు
{{c|ముక్కును, దాని చుట్టునుగల ఎముకలను అడ్డముగా కోసిన యెడల కనబడు భాగము.
1. మాగ్జిలరీ సైనస్‌లు 2. ముందువైపు సైనస్‌లు 3. ముక్కు రంధ్రములు.
ముక్కుకొన తరుణాస్థితోను, ముక్కువంతెన నాసికాస్థుల ద్వారాను తయారుచేయ బడినది. కంటినుండి కన్నీటిని తీసికొని పోవు కాలువ ముక్కులోనికి తెరచు కొనును.
పుట్టుకతో వచ్చు అంగ వైకల్యములు : ముక్కునకు సంబంధించిన అంగ వైకల్యములను శస్త్రచికిత్స ద్వారా సరిదిద్దవచ్చును.
గాయములు : గాయము కలుగుట వలన నాసికాస్థులు విరుగుట సంభవించిన యెడల, ఆ యెముకలను అమర్చి కట్టుకట్టి తద్ద్వారా వాటిని సరిదిద్దవచ్చును. ప్రమాద వశమున ముక్కు కోసుకొని పోవుట సంభవించిన యెడల, దానిని ప్లాస్టిక్ శస్త్రచికిత్స చేసి, సరి చేయ వచ్చును. ముక్కులోనికి పోయిన బలపములు, గింజలు మొదలగు వాటిని తీసి వేయ వచ్చును.
ముక్కరములను వేరు పరచు గోడ (సెప్టం) స్థానము తప్పుట : ఈ గోడ మధ్యలో నుండుటకు మారుగా, ఒకప్రక్కకు వంగి ముక్కులో ఒక భాగమునకు అడ్డంకిగా నుండును. ఇందువలన ఉబ్బసవ్యాధి లక్షణముల వంటివి గోచరించు చుండును. ఇందుకు తగిన శస్త్రచికిత్స చేసి దీనిని సరిదిద్దవచ్చును.
సైనుసైటిస్ : ముక్కులోనికి తెరచుకొను సైనస్ లు వాచిపోవుట, విషపైత్య (ఇన్ ఫ్లుయంజా) జ్వరము మొదలగు సంపర్క దోషములు వచ్చినపుడు సంభవించును. సైనస్ లో నొప్పులు, తలనొప్పి, జ్వరము వచ్చినట్లు, రోగి చెప్పును. సాధారణముగా కాపడము వలనను, ఆంటీబయటిక్ ఔషధముల వలనను, ఎఫిడ్రిస్ నేసల్ చుక్కలు వేయుట వలనను, కొన్ని పర్యాయములు "షార్టువేవ్ థీరాపి" తీసికొనుట వలనను, సాధారణముగా తీవ్ర పరిస్థితిలోకూడ నయము కావచ్చును. వ్యాధి దీర్ఘమైనచో, సైనస్ చీముతో నిండి, అందువలన దీర్ఘకాలిక మయిన అనారోగ్యమునకు కారణ మగును. సైనస్ రంధ్రమును పదే పదే కడుగుటయే ఇందులకు జరుపవలసిన చికిత్స. ఇందు వలన నయము కానిచో, ఇందుల కవసరమైన శస్త్రచికిత్స చేయవలెను.
ముక్కునకు తీవ్రమైన సంపర్కదోషములు సంభవించుట : రొంప, విషపైత్యజ్వరము, పొంగు మొదలగు వ్యాధులు వచ్చినప్పుడు ముక్కు తీవ్ర సంపర్క దోషమునకు గురియై యెక్కువగా కారుచుండును. ఒకేవైపున కారుట, అన్య పదార్థమేమియు లేకపోవుట జరిగినయెడల, అది “ నాసికో ఘటసర్ఫిరోగము" అని భావించవచ్చును.
ఎట్రోఫిన్ రైనటీస్ : ఈ పరిస్థితిలో, అనగా లోపలిపొర క్షయపడి, పక్కులు కట్టును; దుర్గంధముండును. దీనికి సంతృప్తికరమైన చికిత్సయే లేదు. ముక్కులో కాడ్‌లీవర్ ఆయిల్ చుక్కలు వేయుదురు.
గడ్డలు : ముక్కులో గడ్డలు వచ్చుట సాధారణ విషయము. అవి గాలి రాకుండా అడ్డును. సైనోసైటిస్ వ్యాధిలో వీటి వలన సాధారణముగా క్లిష్ట పరిస్థితులు వచ్చును. వీటిని తీసి వేయుదురు. ముక్కు రంధ్రము ఆవలకొనను, కొండనాలుక లేక మృదువైన అంగిలికి పైనను సాధారణముగా గడ్డలులేచి, క్రమముగా పెరిగి గాలిని అడ్డగించును. ఇందులకు శస్త్రచికిత్స చేయవలెను. ముక్కు ఆవలికొనకు సమీపమున గల సప్తపద యొక్క భాగమునందు పుట్టకురుపు లేచుట అరుదైన విషయము కాదు. అది కప్పి వేయబడిన స్థానములో నుండుటచే, తొలిదశలోనే ఆ విషయమును గ్రహించుట సాధ్యము కాక పోవచ్చును. ఇది నాడీసంబంధమైన చిహ్నములు గోచరించుటకు కారణమగును.
అడినాయిడ్సు : మృదువైన అంగిలికి పైన సాధారణముగా ఒక చిన్న శోషరస ధాతు వుండును. ఒకప్పు డది పెరిగిపోవును. నోటిద్వారా వ్రేలుపెట్టి చూచినచో అది తగులును. అందు వలన ముక్కుతో గాలి పీల్చుకొనుటకు ఆటంకము కల్గును. అప్పుడు ఆ శిశువు నోటితో గాలి పీల్చుకొనును. ముక్కు కారుట, నిద్రలో గురక, పాఠశాలలో మందస్థితిలో నుండుట జరుగును. అడినాయిడ్సును తొలగించి, ఈ పరిస్థితిని సులభముగా సరిదిద్దవచ్చును.
మృదువైన అంతర్గళ పక్షవాతము : ఘటసర్పి రోగము వచ్చిన తరువాత, అంతర్గళ పక్షవాతము వచ్చుట సాధారణమైన విషయము. తరువాత సాధారణముగా 3, 4 వారములలో ఈ పక్షవాత రోగము కనబడును. శిశువు తన నోరు తెరచుకొని 'ఆ' అనినప్పుడు మృదువైన అంగిలి పైకిపోదు. శిశువు ముక్కుతో మాట్లాడును. శిశువు ఏదైన వస్తువును, ముఖ్యముగా ద్రవ పదార్థమును మ్రింగిన యెడల అది ముక్కుల ద్వారా బయటికి వచ్చును. అది తరచుగా కొద్దివారములలో నయమగును.
సవాయి : పుట్టుకతోనే సవాయి వ్యాధి వచ్చినయెడల ముక్కుయొక్క వంతెన కుదించుకొని పోవును. ఒక్కొక్కప్పుడు బిడ్డయొక్క గట్టి అంగిలి సవాయివ్యాధికి గురి యగును. అందులకు చికిత్స జరగని యెడల గట్టి అంగిలిలో ఒక రంధ్రము ఏర్పడి నోటి రంధ్రము ముక్కుతో కలసి పోవును. అందు వలన మాట్లాడుటకు అవరోధము కల్గును.
ముక్కులోని శరీరాశ్రిత క్రిములు : దుర్గంధము, ముక్కు కారుట యున్న యెడల ఈగలు లోనికి పోయి గ్రుడ్లను పెట్టవచ్చును. ఆ గ్రుడ్లు పొదగబడి ప్రాకుట మొదలు పెట్టును. ఇందులకు అవలంబింప వలసిన పద్ధతులలో క్లోరోఫారము ఇచ్చుట ఒకటి. అందువలన అవి చచ్చి బయట పడును. లేక ఏదేని నూనె పదార్థమును తరచుగా రెండు ముక్కుల లోనికి పంపుదురు. ఆ పురుగులు ఉక్కిరి బిక్కిరియై బయటికి వచ్చునట్లు చేయుటయే ఇందలి ఉద్దేశ్యము. రోగి తన ముఖముపై గాజు గుడ్డను వేసికొని పరుండ వలెను. అట్లు చేసినచో ఈగలు లోనికి పోయి గ్రుడ్లు పెట్టుటకు అవకాశముండదు..
గొంతుక
ముక్కును, నోటిని వాటి క్రిందనున్న మార్గములతో కలుపు సాధారణ మార్గము గొంతుక. నోరు తెరచి నాలుక మూసికొన్నచో శ్వేతధాతువు యొక్క ఒక చిన్నముద్ద మనకు ఇరువైపుల కాన వచ్చును. దానినే ఉపజిహ్విక (టాన్సిల్) అందురు.
1. తీవ్రమైన ఉపజిహ్వికవాపు (టాన్సిలిటిస్) : 'స్టెప్టోక్రోకల్ ' సంపర్కదోషము వలన ఉపజిహ్వికులు ఎర్రనై, వాచి, నొప్పి కలుగును. మ్రింగినపుడు నొప్పిపుట్టును. చిలుకాస్థియొక్క (మాండిబిల్) కోణమువద్దగల మాంస
చిత్రము - 214
పటము - 5 గొంతు
1. నాలుక 2. ఉపజిహ్విక (టాన్సిల్) 3. కొండనాలుక
గుణము కనబడును. రొంప, విషపైత్యజ్వరము లేక పొంగు వచ్చినచో, గొంతునందు సంపర్క దోషము కల్గి ఉపజిహ్వికులు వాచుట సామాన్యముగా జరుగును.
క్విన్‌సీ : ఈ పరిస్థితియందు ఒక ఉపజిహ్వికచుట్టును చీము పట్టును; ఒక ఉపజిహ్విక వాచి, నొప్పికల్గి జ్వరము వచ్చును. అది పెన్సిలిన్ వాడినచో నయము కావచ్చును. లేదా రంధ్రముచేసి చీమును తొలగించ వలసి యుండును. ఈపరిస్థితి పదేపదే వచ్చునది కావున, ఉపజిహ్వికలను ఆరు వారముల తరువాత లాగివై తురు.
దీర్ఘకాలికమైన ఉపజిహ్విక వ్యాధి : ఈ పరిస్థితిలో ఉపజిహ్వికలు వాచి, రోగికి గొంతునొప్పి పదేపదే కలుగు చుండును. ఒక్కొక్కప్పుడు ప్రతి ఉపజిహ్విక మీదను తెల్లని మచ్చలు గోచరించును. అవి నొక్కినచో చీము వచ్చును. అట్టి ఉపజిహ్వికలను తీసి వేయవలెను.
ఘటసర్పి వ్యాధివచ్చినపుడు దానితోపాటు సామాన్యముగా ఉపజిహ్విక సంపర్కదోషమునకు గురి యగును. ఉపజిహ్వికమీది పై భాగము (patch) తెల్లపడి గట్టిగా పట్టుకొనియుండును. కొంచెము ముక్కను తీసికొని పరీక్షించిన యెడల, ఘటసర్పి (డెప్తిరియా) క్రిములు గోచరించును. డెప్తిరియాకు చేసిన మాదిరిగానే చికిత్స చేయవలెను.
సవాయి వ్యాధి ద్వితీయ దశలో నున్నప్పుడు ఉపజిహ్వికపై మరకలు (పాచెస్) గోచరించును. తదుపరి ఉపజిహ్విక వాయవచ్చును. ఉపజిహ్విక వాచినప్పుడు, అది వండిన మాంసపు ముద్దవలె గోచరించును. సవాయికి చేసిన చికిత్సనే చేసిన యెడల ఈ పరిస్థితి సత్వరముగా నయమగును.
ఉపజిహ్వికావ్యాధి వచ్చిన మూడు వారముల తర్వాత కీళ్ళవాతము, లేక తీవ్రమైన మూత్రపిండపువాపు సంభవించుట సామాన్యముగా జరుగును. ఇట్టి పరిస్థితులలో పదేపదే మరల రాకుండా ఉపజిహ్వికలను తీసివేయవలసిన పరిస్థితి ఏర్పడ వచ్చును. రోగప్రకోపము తీవ్రముగా నున్నపుడు ఉపజిహ్వికను తీసివేయకూడ దని భావింపబడు చున్నది. రోగము ఉపశమించిన తర్వాతనే ఉపజిహ్వికలను తీసివేయవచ్చును. కాని ఈ రోగమును నిరోధించుటకు గొంతునొప్పి రాగానే పెన్సిలిన్ మోతాదులను పదేపదే ఇచ్చెదరు.
కె. కే.