Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చెన్నపట్టణము

వికీసోర్స్ నుండి

చెన్నపట్టణము :

చెన్నపట్టణము దక్షిణ భారతమునందు గల ప్రముఖ పట్టణము. ఇది 13.4 ఉత్తర అక్షాంశముల మీదను, 80.12 తూర్పురేఖాంశముల మీదను నెలకొని యున్నది. దీనికి చెన్నపురి, చెన్నపురము, చెన్ననగర మనియు నామాంతరములు తెలుగు వాఙ్మయమునందు కనబడు చున్నవి. ఇదియొక ఆంధ్రనగరము. ఆంధ్ర ప్రముఖుడగు చెన్నప్ప పేర నిర్మితమైనది. ఆంధ్ర నృపతియగు అయ్యప్ప దీనిని నిర్మించినాడు. ప్రారంభమున ఆంధ్రప్రజలచే నివాసితమై తెలుగుదొరలచే, తెలుగు వణిక్పుంగవులచే ప్రవర్థమానమై నెగడిన దీ చెన్నపట్టణము. చెన్నపట్టణము నిర్మాణమును గూర్చి మనకు మొట్టమొదట “ఉషాపరిణయము” అను ప్రబంధమువలన తెలియ నగుచున్నది. ఉషాపరిణయ ప్రబంధమును కాళహస్తి సంస్థానాధీశ్వరులలో పూర్వుడైన దామెర్ల అంక భూపాలుడు రచించి యున్నాడు. అందిట్లు గలదు :


"ప్రళయకావేరి మైలాపురంబుఁ గల్మి
 బీరమున బోర నది మట్టుపెట్టఁ దండ్రి
 పేరఁ దన్మధ్య భూమినిఁ బృథువిభూతి
 నలవరిచెఁ జెన్నపట్టణ మయ్య నృపతి. "


ఈ పద్యములో బేర్కొనబడిన 'అయ్యనృపతి' అంకభూపాలుని సోదరుడు. ఈ అయ్యనృపతి తన తండ్రియగు చెన్నప్పనాయని పేర ప్రళయకావేరి — మైలాపురము ప్రదేశముల మధ్య "చెన్నపట్టణము” అను నొక పట్టణమును నిర్మించెనని అంక భూపాలుడు తెలిపినాడు. ప్రళయకావేరి అనగా నేటి "పులికాట్". ఈ పులికాట్ (నేటి) మైలాపూరుల మధ్య చెన్నపట్టణము నిర్మితమైనదని స్పష్టమగుచున్నది. అంకభూపాలుడు, అయ్యపనాయకుడు, వెంకటప్పనాయకుడు అనువారు ముగ్గురు సోదరులు. దామెర్ల చెన్నప్పనాయని కుమారులు. ఈ వంశ వృక్షమును ఉషాపరిణయ ప్రబంధము తెలుపుచున్నది. చెన్నపట్టణ నిర్మాణము క్రీ. శ. 1544 అని శ్రీ టంగుటూరి ప్రకాశంగారును, క్రీ. శ. 1550 అని శ్రీ నిడుదవోలు వేంకటరావుగారును తెలుపుచున్నారు.

ఈ చెన్నపట్టణమును ఎందుకు నిర్మాణము చేయవలసి వచ్చినదో అంకభూపాలుడు తెలిపియున్నాడు. ఆ కాలములో "పులికాట్" (ప్రళయకావేరి) నందు డచ్చివారును, మైలాపురమునందు పోర్చుగీసువారును వర్తకము చేయుచు పరస్పరము కలహము లాడుచుండిరి. ఆ కలహములను నివారించుటకు అయ్యనృపతి ఈ రెంటి మధ్యభాగమున చెన్నపట్టణము నిర్మించినాడట !

దామెర్ల చెన్నప్పనాయకుని పుత్రులలో జ్యేష్ఠుడగు వేంకటప్ప “వందవాసి" ని రాజధానిగా చేసికొని ప్రళయకావేరి (పులికాట్) నుండి కడలూరువరకు గల ప్రాంతమును ఏలుచుండెను. అయ్యప్ప పూనమల్లిని ముఖ్యపట్టణముగా చేసికొని సముద్రతీర ప్రాంతములను పాలించుచుండెను. వీరు విజయనగర సామ్రాజ్యాధిపతి యగు వెంకటపతిరాయల బావమరదులు. ఈ కాలమున వెంకటపతిరాయలు తన రాజధానిని వేలూరు నగరమునకు మార్చుకొనెను. అప్పటినుండి వేలూరు రాయవేలూరుగా ప్రసిద్ధి చెందెను. వెంకటాద్రి (వేంకటప్ప) నాయకుడు చంద్రగిరిరాజుల పక్షమున రాజ్య పాలనాధికారియై యుండెను.

దామెర్ల వెంకప్పనాయకుడు అప్పటి విజయనగర సామ్రాజ్యాధిపతి యగు పెద్ద వెంకటపతిరాయల యాజ్ఞచొప్పున నాయకరాజు లందరిలోను ప్రధానుడుగా నుండెడివాడు. ఈ వెంకటప్పనాయకుడు తన తండ్రి చెన్నప్పనాయకుని పేర చెన్నసాగరము కట్టించినాడు. ఈ చెన్నసాగరము నార్తార్కాటు జిల్లాలో నున్న పెద్ద తటాకము. దామెర్ల వెంకటప్ప తన తండ్రిపేర చెన్న సాగరము కట్టించగా ఆతని సోదరుడు అయ్యప్ప నాయకుడు తన తండ్రిపేర చెన్నపట్టణమును గొప్ప సంపదతో కట్టించినాడు.

చెన్నప్పనాయకుడు అసామాన్యవ్యక్తి. చెన్నపనాయని తమ్ముడగు వెంగళరాజు రచించిన బహుళాశ్వ చరిత్ర మను ప్రబంధములో చెన్నపనాయకుడు ఇట్లు వర్ణింప బడినాడు:


“తన భుజాభుజగ ప్రతాపానలంబునకు
          బ్రత్యర్థకీర్తి పారదముగాఁగ
 దనధాటికారటత్పటహ గర్జక రాతి
          పార్థివావలి హంసపటలిగాఁగ
 .......... .......... ......... ........
          ..... ....... ...... ....... .....
 వరలు దామెర్లవంశ పావనచరిత్రుఁ
 డాహవ కిరీటి యర్థిదై న్యాంధ తమస
 భాస్కరుండు శోభమాన యశస్కరుండు
 చెన్నభూపాలుఁ డరిరాజ సన్నుతుండు
 ......... ......... .......... ......... .........
 .......... ........ ........... ........ ........."


ఇట్టి మహాయోద్ద, మహారాజు, మహారసికుడు, మహానుభావుడు అగు చెన్నప్ప పేర గట్టబడిన దీ చెన్నపట్టణము .

ఈ చెన్నపట్టణము పుట్టుకకు బూర్వమే ఇదే స్థలముననో, దీనికి కొంచె మిటో, అటో ఒక చిన్న యూరు ఉండియుండును. ఈ యూరు ఒకప్పుడు పట్టణముగానుండి క్షీణదశకు వచ్చినదై యుండును. ఈ పట్టణము పేరు మాదిరాజు లేక మాదరాజు లేక ముదిరాజు అను పేర్లను కలిగియుండును. ఈ నామములను బట్టియే పాశ్చాత్యులు దానిని మాదిరాస్స, మద్దరాస అను అపభ్రంశ రూపములతో తమ రికార్డులలో వ్రాసి యున్నారు. అదియే తుదకు మద్రాసుగా రాజకీయ చరిత్రలో స్థిరపడిపోయినది. ఏమైనను అది ఆంధ్రరాజుల పరిపాలన లోని దేశమనుట నిక్కము. ఆ ప్రాంతము దామెర్ల వెంకటప్ప పరిపాలనమున అయ్యనృపతి యేలుబడిలో నున్నదనుట నిస్సందేహము దామెర్ల వంశీయులు వెలమదొరలు.

పాశ్చాత్యులు ఆ పట్టణమును మద్రాసు అని పేర్కొన్నను, ఆంధ్రులు నాటినుండి నేటివరకును దానిని చెన్నపట్టణముగానే వ్యవహరించుచున్నారు.

ఆంధ్రకౌముది క్రీ. శ. 1600 లకుముందు రచితమైనది. అందు 'శ్రీలచే మించి చెన్నపురి విలసిల్లు' అని కలదు. ఆలూరి కుప్పనకవి రచించిన (1740 ప్రాంతము) శంకర విజయమునందు “చెన్నపురి చిరత్సచివవరులు" అని కలదు. క్రీ. శ. 1819 చెన్నపురిలో అచ్చుపడిన పుస్తకము లన్నింటను 'చెన్నపట్టణ' మనియే యున్నది 1828 లో ఏనుగుల వీరాస్వామయ్యగారు తమ కాశీయాత్రా చరిత్రలో 'చెన్నపురి' అనియే పేర్కొని యున్నారు. క్రీ. శ. 1846 లో కోలాశేషాచల కవి తన 'నీలగిరి యాత్ర' యను వచన కావ్యమునందు చెన్నపురిని ఒక సీసమాలికలో వర్ణించి యున్నాడు. క్రీ. శ. 1850 ప్రాంతమున మహోద్దండకవి శిష్టుకృష్ణమూర్తిశాస్త్రి తన 'వీక్షారణ్య మహాత్మ్యము'న చెన్నపురిని పేర్కొనినాడు. 1855 ప్రాంతమున తడకమళ్ళ వేంకట కృష్ణారావు తన లీలావతి గణితమున చెన్నపురిని పేర్కొనియున్నాడు. 1861 లో మతుకుమల్లి నృసింహకవి "చెన్నపురీ విలాస"మను పేరుతో ఒక పద్య కృతినే రచించియున్నాడు. ఈ చెన్నపురీ విలాసకావ్యము 1862 లో "శ్రీ చెన్ననగరాభరణాయమాన తండియార్పేట శాఖానగర విహి తాదిసరస్వతీనిలయ వివేక రత్నాకర ముద్రాక్షరశాల" యందు ముద్రితమైనది. ఇంతయేల అరవవారుకూడ చెన్నై అనియు, చెన్ననగర మనియు పిలుచుచున్నారు.

చెన్నపట్టణ మప్పుడు రెండు సీమలుగా విభజింపబడి నట్టులుగా కనబడుచున్నది. ఒకటి ముత్యాలపేట. రెండవది పెద్దినాయనిపేట. ఈ రెండు నామములు తెనుగు తనమునే సూచించుచున్నవి. "చెన్నపురి విలాసము" అను కావ్యములోని వర్ణనలనుబట్టి పటము వ్రాయించినచో నేడు క్రొత్తగా బయలుదేరినవి గాక మిగిలిన వీధులు, కట్టడములు, కార్యస్థానములు, వాని పేళ్లలో మార్పులు, మార్పులకు కారణములు చెన్నపట్టణ ప్రాచీన స్వరూపము యొక్క యధార్థ స్థితులు మనకు తెలియగలవు.

క్రీ. శ. 1645 నాటికే చెన్నపట్టణములో తెలుగువా రుండి రనుట చారిత్రక సత్యము. ఇంగ్లీషువారికి బందరులో వర్తకశాల లున్నందువలన వారివద్ద తెలుగువారే ఉండియుండిరి. అంతేగాక ఇంగ్లీషు వారితో వచ్చినట్లు చెప్పబడిన బేరి తిమ్మన్న, కాశి వీరన్న, ముత్తు వీరన్న, సూరె వెంకన్న, ముత్తుశెట్టి, కాశి వీరయ్య, పసుమర్తి కాశయ్య, పట్టకాల బాలశెట్టి, రంగాశెట్టి, నారాయణప్ప, వెంకటాద్రి, శేషాద్రి మున్నగువారందరు తెలుగువారే. నాగాబత్తుడు (రాఘవబత్తుడు) చెన్నపట్టణమునకు కరణము. ఇతడు కంసాలి. ఈతడు ధర్మము లాచరించి దేవాలయములు కట్టించెను.

వెంకటపతి రాయల మునిమనుమరాలు పాపమ్మ. ఆమె భ ర్త సుబ్రాయుడు. వీరిరువురి పేర్లమీదుగా 'పాపమ్మ - సుబ్రాయుడు వీధి' యని ప్రారంభమున నామము ధరించి, క్రమముగా 'పావ్ హామ్' అను ఇంగ్లీషు ధనికుని పేరుమీదుగా పావ్ హామ్స్ బ్రాడ్వే అను పేరు వాడుకలోకి వచ్చెను.

చింతాద్రిపేట : ఇది తెలుగు పేరు. చింత - అద్రి అనగా చింతచెట్లుండే ప్రదేశమని అర్థము. శ్రోత్రియందారైన జి. ఆర్. ఆదికేశవులు నాయుడుగారి కుటుంబము ఇచ్చటనే ఉండుచుండెను. సుప్రసిద్ధులైన బండ్లపేరిటి కుటుంబాలవారు కూడా ఇక్కడనే యుండెడువారు. బండ్ల వేణుగోపాలనాయుడు, వెంకటరామానుజులు నాయుడు, ఆ కుటుంబములోని వారే. ఈ ప్రాంతములోనే సుంకువారి అగ్రహారమను పేట గలదు. సుంకువారు తెలుగువారే.

చెట్ పట్ : ఇది 'చేతిపట్టు' అను శబ్దము యొక్క భ్రష్టరూపము ఇది తెలుగు పేరు. తెలుగువారగు ముత్యాల వర్తకులపేర నిర్మింపబడిన పేటకు ముత్యాలపేట యనియు, పగడాల వర్తకులుండిన వీధికి పగడాల వర్తక వీధి (Coral Merchants Steet) అనియు పేర్లు వచ్చినవి. ఈస్టిండియా కంపెనీ ఉద్యోగి యైన పెదనాయకుడు నివసించియున్న ప్రదేశము పెద్దినాయనిపేట యని పిలువబడుచు వచ్చెను. 'బ్రాడ్వే' అనువీధి ఒక కాలువగానున్న కాలమున తూర్పు పడమరల యందుండిన ముత్యాలపేట, పెదనాయకుని పేట నడుమ, మార్గమేర్పరచుటకై ఈ కాలువయందు మన్నుపోసి మరమ్మతు చేయబడినందున దానికి 'మన్నడి' యను పేరు కల్గినదందురు. రాయపురము రాయలపేర ఏర్పడి యుండవచ్చును.

వాషర్‌మన్‌పేట : మొట్టమొదట ఇంగ్లీషు వారితో బాటు, చాకలివారు రంగులు వేసెడివారు బందరునుండి చెన్నపట్టణమునకు వచ్చియుండిరి. వారు నూలును తడిపి ఉతికి, ఎండవేసి, రంగులతో అద్దకముచేయుట కుపయోగించిన ప్రాంతము చాకలిపేటయని (వాషర్ మన్ పేట) పిలువబడుచు వచ్చెను. అచ్చట నివసించిన చాకలివారందరు తెలుగువారు. బందరువారు కలంకారి అద్దకమునకు ప్రసిద్ధులుగదా !

జనసంఖ్య : 1639 లో చెన్న పట్టణమునందు 7,000 మంది జనులుమాత్ర ముండిరి. వీరందరు తెలుగువారే. కొలదిమంది ఇంగ్లీషువారుండిరి. 1640 లో కోట పరిసరము లందు వసతిగృహము లేర్పరుప బడి యుండెను. ఈ గృహనిర్మాణముల కనేకులగు పనివారు అవసరమయిరి. ఇందువలన జనసంఖ్య క్రమముగా పెరిగెను. 1646 నాటికి దాదాపు 17,000 వరకు హెచ్చెను. అప్పటికిని అందరు తెలుగువారే కాని తమిళు లున్నట్లు కనిపించదు. దానితో జనాభా 1681 నాటికి రెండులక్షలును, 1685 నాటికి మూడు లక్షలును, 1691 నాటికి నాల్గు లక్షలు కాజొచ్చెను. 1774 నాటికి చెన్నపట్టణములో పట్టణ పరిసరములందుగాని ఎక్కడా తమిళులులేకుండిరి. గాని, 1891 నాటికి జనాభా 5 లక్షలు. వీరు తెలుగువారే యని విశ్వసింపవలెను.

17, 18 శతాబ్దులలో తెలుగువారు విశేషమైన పలుకుబడి కలిగియుండిరి. 1687 లో చెన్నపట్టణమందు ప్రప్రథమముగా మ్యునిసిపాలిటీ ఏర్పడినపుడు, వెంకటాద్రి, ముద్దు వీరన్న, రంగనాథము అను మువ్వురాంధ్రులు అందు సభ్యులుగా నుండిరి. 1690 లో న్యాయస్థాన మేర్పడినప్పుడు గూడ న్యాయాధిపతిగా ఆంధ్రుడే నియమింపబడెను. అతని పేరు రంగనాథము. ఆకాలపు ఇంగ్లీషువారి 'సీలు' (అధికారముద్ర) ఇంగ్లీషు, తెలుగు భాషలయం దుండెడిది. తెలుగుభాష రాజభాషగా నుండెను.

18 వ శతాబ్దాంతమునకు బందరు పట్టణమందుండిన ఈస్టిండియా కంపెనీ ప్రాంతీయ కార్యాలయము ఎత్తి వేయబడినది. అప్పటినుండియు చెన్నపట్టణమునకు, తెలుగు దేశమునకు రాకపోకలు తగ్గినవి. దీనికితోడు, చెన్నపట్టణమునుండి దక్షిణదేశమునకు, 19 వ శతాబ్దిలో సౌత్ యిండియన్ రైలుమార్గము నిర్మింప బడుటచే దక్షిణ ప్రాంతమునకు చెన్నపట్టణమునకు సంబంధ బాంధవ్యములు హెచ్చెను. దక్షిణాదిని ఉన్న తమిళులకు చెన్నపట్టణ ద్వారములు తెరచినట్లయినది. క్రమముగా చెన్నపట్టణముననున్న తెలుగు వారికిని, తెలుగు దేశముననున్న తెలుగు వారికిని నడుమ సంబంధములు దూరమయ్యెను.

ఆకాలమున చెన్నపట్టణమునుండి తెలుగు దేశమునకు, తెలుగుదేశమునుండి చెన్నపట్టణమునకు రాకపోకలు చేయవలసి యున్నచో, సముద్రముపై ప్రయాణము చేయవలసి యుండెను. స్థానికముగా అరవల ప్రాబల్యము హెచ్చసాగెను.

చెన్నపట్టణమునకు ఆది పురుషులు ఆంధ్రులు. చెన్నపట్టణము ఆంధ్రదేశములోనిది, చెన్నపట్టణము ఆంధ్ర నాయకుల ఏలుబడిలోనిది. చెన్నపట్టణమున ఆంగ్లేయుల కాస్కార మిచ్చినవారు ఆంధ్రులు.

చంద్రగిరిరాజుల పక్షమున రాజ్యము చేయుచుండిన దామెర్ల వెంకటప్పనాయకుని (వెంకటాద్రి నాయకుని) యనుగ్రహమున ఇంగ్లీషువారి ప్రధానాధికారియగు సర్ ఫ్రాన్సిస్ డే యనువాడు 1639 లో చెన్నపట్టణములో వ్యాపారార్థము గిడ్డంగులు కట్టుకొనుటకు ఆజ్ఞను పొందెను. సముద్రతీరము వెంట 5 మైళ్ళ పొడవున, కొన్ని మైళ్ళ వెడల్పుగల ఒక చీలికను, సామంతుడగు పూనమల్లి నాయకరాజు సర్ ఫ్రాన్సిస్ డేకు మంజూరి చేసి సనదు ఇచ్చెను. ఆ ప్రదేశమునకు ఈస్టిండియా కంపెనీ వారు 1200 పగోడాలు అద్దెగా చెల్లించునట్లు చెన్నపట్టణపు కరణం రాఘవబత్తుడు (నాగబత్తుడు) కట్టడిచేసెను. అప్పటినుండియే చెన్నపట్టణమునకు మద్రాసు అను పేరు రాజకీయముగా వ్యవహారములోనికి వచ్చి స్థిరపడిపోయినది. అప్పటినుండి మద్రాసు నౌకాశ్రయమై వాణిజ్య కేంద్రమై, రాజధానియై, మహానగరముగా పెంపొంది ఎన్నియో రాజకీయ పరిణామములను పొందినది. ఆ విషయములన్నియు 'మద్రాసు నగర' శీర్షిక క్రింద వర్ణితమగును.

వి. సూ.