సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చెకోస్లావేకియా దేశము (భూ)
చెకోస్లోవేకియాదేశము (భూ) :
చెకొస్లోవేకియా దేశము మధ్యయూరపులో నున్నది. పశ్చిమమున, వాయవ్యమున జర్మనీ, ఉత్తరమున, ఈశాన్యమున పోలెండు, తూర్పున సోవియట్ రష్యా, దక్షిణమున ఆస్ట్రియా, హంగేరీ దేశములు చెకొస్లోవేకియాకు సరిహద్దులు.
ఈ దేశపు విస్తీర్ణము 49,366 చ. మైళ్ళు; 1957 లెక్కలనుబట్టి దీని జనాభా 1,31,61,542. ఈ దేశము పొడవుగా, ఇరుకుగానుండి, పశ్చిమమునుండి తూర్పునకు వ్యాపించియున్నది. ఆస్ట్రియా - హంగేరీ సామ్రాజ్య విచ్ఛిత్తియు, సన్నిహిత సంబంధముగల చెక్స్, స్లోవక్స్ అను జాతుల కలయికయు హేతువులుగా, 1918 వ సంవత్సరములో చెకొస్లోవేకియా ప్రజాస్వామిక రాజ్యము ఉదయించినది. 1918 - 1939 వరకు బొహీమియా, మొరేవియా, స్లోవేకియా ప్రాంతములును, ప్రస్తుతము సోవియట్ రష్యాలో భాగమైయున్న రుధీనియాయు కలిసి చెకొస్లోవేకియా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వము (Republic) గా నేర్పడి యుండెను.
ఆరంభమునుండి ఈ దేశము పెక్కు క్లిష్ట సమస్యల నెదుర్కొనవలసిన దయ్యెను. ఆ సమస్యలు ప్రజాతంత్ర ప్రభుత్వముయొక్క స్థయిర్యమునకు, ఐక్యసాధనమునకు ప్రతికూలములై యుండెను. ద్వితీయ ప్రపంచ సంగ్రామ కాలమున (1939-1945) చెకొస్లోవేకియా జర్మను ప్రభుత్వ సేనల ఆక్రమణము క్రింద పెక్కు కష్ట నష్టములను అనుభవించెను. ఈ సంగ్రామానంతరము చెకొస్లోవేకియాకు దాస్య విముక్తి ఘటిల్లెను. తుద కీదేశము 1948 లో సామ్యవాద (Communist) దేశముగా మారెను. ఈ ప్రజాస్వామిక రాజ్యముయొక్క నామము చెక్కులు, స్లోవకులు అను రెండు ప్రధాన మానవ జాతి గణములను సూచించును. వీరి మధ్యగల మానవజాతి సంబంధ భేదములు స్వల్పములు.
భౌతిక లక్షణములు : ఈ దేశమును సహజమైన మూడు ప్రధాన ప్రాంతములుగా విభజించ వచ్చును : (1) పశ్చిమమున గల బొహిమియను పీఠభూమి. (2) మధ్యభాగమున నున్న మొరేవియన్ నిమ్న ప్రాంతము, (3) తూర్పున నున్న స్లోవక్ – కార్పేథియన్ పర్వతప్రాంతము. ఈ మూడు విభాగములు పరస్పర భిన్నములై వేర్వేరు భౌగోళిక - భౌతిక లక్షణములు కలిగి యున్నవి.
బొహీమియను పీఠభూమి : దీని ఆకారము పళ్ళెమువలె నుండును. ఇది అన్నివైపులయందును పర్వతారణ్యములచే ఆవరింపబడి యున్నది. నైరృతి దిశయందు బొహమర్ వాల్డ్, వాయవ్యమున ఎర్జ్ గేబెర్గ్ (Erzgeberge), ఈశాన్యమున సుడేటన్ (Sudetan), తూర్పున మొరేవియన్ పర్వతములు ఇందు చేరియున్నవి. ఈ ప్రాంతమున గల ఓహిరే (Ohre), బెరౌంకా (Beraunka), వటావా (Vatava), ఎల్బ్ (Elbe) నదులయొక్క పరీవాహ ప్రదేశములు అడవులతో కూడుకొనిన కొండలచే వ్యాప్తమై యున్నవి.
మొరేవియన్ నిమ్నప్రాంతము : ఇది ఒక ఏటవాలుగా నుండు పల్లపు ప్రాంతము. ఇది పశ్చిమమున నున్న బొహీమియను పీఠభూమికిని, తూర్పున నున్న స్లోవక్ - కార్పేధియన్ పర్వతములకును నడుమ నున్నది. ఇందులో విశేషభాగము విశాలమైన నిమ్నప్రాంతము. ఇది పశ్చిమమున గల మొరేవియన్ పర్వతముల దిశకును, తూర్పున నున్న కార్పేధియను పర్వతముల దిశకును క్రమముగా ఎత్తగుచుండును. డాన్యూబు నదికి ఉపనదియైన 'మార్చ్' నది, మధ్యగా నున్న నిమ్నప్రాంతము గుండా ప్రవహించి డాన్యూబులో కలియును.
స్లోవక్ - కార్పేథియన్‌ప్రాంతము : స్లోవేకియాప్రాంతము మొరేవియాకు తూర్పున నున్నది. ఇందు ఎక్కువ భాగము ఉన్నతముగా నుండును. నదీలోయలను వదలినచో, స్లోవేకియాలోని విశేషభాగము కార్పేథియన్ పర్వతముల పశ్చిమ భాగముచే ఆక్రమింపబడి యున్నది. కొంత వైశాల్యముగల నిమ్న ప్రాంతము దక్షిణమున కలదు. వియన్నా నగరమునకు తూర్పున బ్రటిస్లేవియా యొద్ద ఆల్పైన్ పర్వతశ్రేణులు డాన్యూబునదిని అడ్డగించును. 'లిటిల్ కార్పేధియన్స్' అను స్వల్పాకృతిగల కార్పేథియను కొండలు ఉత్తరముగా వ్యాపించుచు, మొరేవియాకును, స్లోవేకియాకును నడుమ సరిహద్దును బోలు నొక అడ్డంకిగా నేర్పడియున్నవి.
శీతోష్ణస్థితి : చెకోస్లోవేకియా దేశముయొక్క శీతోష్ణస్థితి ద్వివిధము. పశ్చిమ భాగమున మహాసముద్ర వాతావరణ పరిస్థితియు (oceanic), తూర్పుభాగమున మహాఖండ వాతావరణ పరిస్థితియు (continental) గోచరించును. ఇది భౌతిక, భౌగోళిక పరిస్థితులను బట్టి విశేషముగా మారుచుండును. బొహీమియను పీఠభూమికి సరిహద్దున గల పర్వతములు చల్లనై, ఘన వర్షపాతముతో నొప్పుచుండును. ఈ పర్వతములు పీఠభూమి చుట్టుననే శీతోష్ణ ప్రతిరోధకముగా వర్తించుచుండును. అచట మహాఖండ శీతోష్ణవాతావరణములు అధికముగ లేకున్నను, సుస్పష్టమగుచుండును. రాజధాని యగు ప్రేగ్ నగరము వద్ద శీతాకాలమునందు శీతోష్ణస్థితి చల్లగనుండును. వేసవిలో ఎండలు తీవ్రముగ నుండును. జులై నెలలో వాతావరణము సగటున 67° ఫా. ఉండును. కనీస వర్ష పాతము తారతమ్యముచే 20 అంగుళములు గాని, అంతకంటె తక్కువ గాని ఉండును. ఏటవాలుగనుండు పశ్చిమ పర్వతప్రాంతములు సౌమ్యములై, వర్షోపేతములై యుండును. పరీవాహప్రదేశములు (basins) శీతకాలమున చల్లనై, వేసవియందు వెచ్చనై యుండును. మిట్ట ప్రదేశము (uplands) లన్నియు అట్లాంటిక్ మహాసముద్రమునుండి వీచు పశ్చిమవాతప్రభావమును ప్రకటించును. తత్ఫలితముగ ఇచ్చట గాఢమైన వర్షముపడును.
మొరేవియన్ నిమ్న ప్రదేశమందు శీతాకాలపు శీతోష్ణస్థితి సౌమ్యముగ నుండును. ఇచ్చట వేసవియందు ఉష్ణ మధికముగ నుండును; వర్షపాతము గూడ హెచ్చుగ నుండును. కార్పేథియను పర్వతముల ఔన్నత్యమే పర్వత సంబంధమైన శీతోష్ణస్థితికి కారణము. మహాఖండ శీతోష్ణ స్థితికిలక్షణములైన శీతాకాలపుచలియు, వేసవికాలపు వేడిమియు తూర్పు ప్రాంతమందు గోచరించుచున్నవి. ఆల్ ఫోల్డు పర్వతములపైన, బ్రటిస్లేవియా సమీపమున, జులై నెలయందు శీతోష్ణస్థితి సగటున 70° ఫా. ఉండును. వేసవి యందు వర్షపాతము అత్యంత గాఢముగ నుండును. పర్వతములు సమీపమున నుండుటచే, వర్షపాతము 28 అంగుళముల వరకు పెరుగును.
అడవులు : ఈ దేశముయొక్క వైశాల్యమును బట్టి చూడగా, అటవీ సంపద విషయములో, అత్యంత భాగ్యోపేతములైన ఐరోపాఖండ దేశములలో చెకోస్లొవేకియా ఒకటిగా పరిగణింప బడుచున్నది. దేశము మొత్తములో గల చెట్లుచేమ లన్నిటిలో అడవులు ప్రాధాన్యము వహించు చున్నవి. దేశపు మొత్తము వైశాల్యములో అరణ్యములు 31 వ శాతము నాక్రమించి యున్నవి. పర్వత పంక్తులన్నియు 'కోనిపెరస్' (Coneferous) అను జాతి వనములతో ఆవరింపబడి యున్నవి. వాటిలో 'స్ప్రూస్', 'ఫిర్' జాతి వృక్షములు అధికముగ నుండును. 'బీచ్', 'ఓకు', 'ఫిర్', జాతుల చెట్లతో మిశ్రమారణ్యములు 2500 అడుగుల క్రిందున నున్న ఏటవాలు ప్రాంతములందు పెరుగును.
పంటలు : చెకోస్లావేకియాలో మొత్తము వైశాల్యము నందు 40 వ శాతము పంటలకై వినియోగింపబడు చున్నది. అచ్చటి వ్యవసాయ విధానము గుణాత్మకముగా ప్రసిద్ధిచెంది యుండుట ఒక ముఖ్య విశేషము. సస్య క్షేత్రములలో సగము భాగమునకు మించి ఆహార ధాన్యములు పండించబడును. అన్ని ఆహార ధాన్యములకు తుల్య ప్రాధాన్య మియ్యబడినది. రై, ఓట్లు, గోధుమలు, బార్లీ ధాన్యములు పండించుటకు నిర్ణయించబడిన ప్రదేశములలో మాత్రము కొంచెము వ్యత్యాసములుండును. పశుగ్రాసమున కుపయోగపడు పైరులుకూడ అచ్చట పెంచబడు చున్నవి. సుగర్ బీట్సు (Sugar beats) విశేషముగా ఉత్పత్తి చేయబడుచున్నది. చెరకుపంట విషయములో యూరపునందు జర్మనీ తర్వాత, చెకోస్లావేకియా రెండవస్థాన మాక్ర మించుచున్నది. గోధుమలు, ఇతర ధాన్యములు ముఖ్యముగా దక్షిణప్రాంత మందును, బార్లీ ఉత్తర మొరేవియా యందును సుగర్ బీట్సు దక్షిణ బొహీమియా, మొరేవియా పల్లపు భూము లందును పండించ బడును.
డాన్యూబు నదీమైదానపు సరిహద్దులందు ద్రాక్ష పండించ బడును. ఆపిల్ పండ్లు, బేరిపండ్లు (pears), చెర్రీపండ్లు (cherries), రేగుపండ్లు (plums) మున్నగు ఇతర ఫలములు బొహీమియా పీఠభూమియందు సాధారణముగా పండును. మొరేవియను నిమ్న భూభాగము సారవంతము, వ్యవసాయోపయోగకరమునై యున్నది. వ్యవసాయాభివృద్ధి మిగుల విశేషముగా జరుగుటచే ఈ దేశము ఆహారధాన్యముల విషయములో దాదాపు స్వయంపోషక మనదగి యున్నది.
ఇచ్చట వస్తూత్పత్తిని పెంపుచేయు పరిశ్రమలు (stock raising) అంతగా అభివృద్ధి చెందలేదు. ముఖ్యముగా పాడి పరిశ్రమ వెనుకబడి యున్నది. మాంసోత్పత్తి దేశావసరములకు చాలినంతగా జరుగుచున్నది.
పరిశ్రమలు : వివిధములైన ఖనిజములు లభించుటవలన జనసాంద్రత అధికముగా నుండుటవలన, చెకోస్లావేకియా ప్రముఖమైన పారిశ్రామిక దేశముగా గణుతి కెక్కినది. దేశ ప్రజలలో మూడవ వంతు పరిశ్రమల వలన జీవించు చున్నారు. ఈ దేశము యొక్క పారిశ్రామిక పాటవమునకు బొగ్గు ముఖ్యమైన ఆధారముగ నున్నది. ఇతర పారిశ్రామిక దేశములతో పోల్చిచూచినచో ఈ దేశమున జలవిద్యుచ్ఛక్తి ఎక్కువగా అభివృద్ధి నొందలేదు. ఆస్ట్రియా సరిహద్దునగల ప్రాంతములలో పెట్రోలియము ఉత్పత్తి స్వల్పముగా జరుగుచున్నది. బొగ్గు ఉత్పత్తి స్థానము లన్నియు దాదాపు ఆస్ట్రేలియా - కార్విన్నా ప్రాంతములందు కేంద్రీకృతములైనవి. ఇవి బెల్జియము, ఫ్రాన్సుదేశము లందలి ఉత్పత్తిస్థానములకంటె మిగుల గొప్పవి. 1949 వ సంవత్సరములో అన్ని ఉత్పత్తి క్షేత్రములు కలిసి 1 కోటి 70 లక్షల టన్నులు గట్టిబొగ్గును, 2 కోట్ల 60 లక్షల టన్నులు లిగ్నైటును ఉత్పత్తి గావించెను. ఇనుము స్వల్పముగ మాత్రమే ఉత్పత్తియగు చున్నది; సాలీనా ఉత్పత్తి 500,000 టన్నులు. ముఖ్యముగా బొహీమియను పరీవాహప్రదేశ మందును, ఎర్జ్ గెబెర్గ్ యందును అనేకవిధములైన ఖనిజములు సామాన్యమైన పరిమాణములో ఉత్పత్తి యగుచున్నవి. స్లోవేకియా పర్వతప్రాంతమందు వివిధములైన ఖనిజములు లభించుచున్నవి. బొగ్గు, ఇతరములైన ఖనిజములు ఇచ్చట పుష్కలముగా లభించుటవలన, ఇంజనీరింగు, వస్త్రపరిశ్రమలు, గాజు, తోలు, రసాయన పరిశ్రమలు భారీ యెత్తున అభివృద్ధినొందుటకు దోహదము చేకూరుచున్నది. అరణ్యములు గూడ దేశ సంపదాభివృద్ధికి ముఖ్యాధారములుగా నున్నవి. ఆటవిక పదార్ధములు కాగితములు తయారు చేయుటకు, ఇండ్లసామానులు తయారు చేయుటకు, గృహోపకరణములు నిర్మించుటకు ఉపయోగపడుచున్నవి.
చెకోస్లోవేకియా రాజధాని 'ప్రేగ్' నగరవాసులు పెక్కువిధములైన పరిశ్రమలందు వ్యాషృతులై యున్నారు. ఆస్ట్రవా నగరమందు భారీ యంత్రములు ఉత్పత్తియగు చున్నవి. ప్రథమ, ద్వితీయ ప్రపంచ మహా సంగ్రామా వసరములకును, 1948 వ సంవత్సర కాలమున కమ్యూనిస్టు సైన్యములకొరకును ఆయుధములు సమకూర్చిన పారిశ్రామిక క్షేత్రములలో 'స్కోడా' ప్రధానమైనది. ఇచ్చట వ్యవసాయోపకరణములు, యంత్రసామగ్రి, రైలు ఇంజనులు, వాగనులు తయారగును. ఎర్ట్ గెబెర్గ్, సుడేటను ప్రాంతములవెంబడి అవిచ్ఛిన్నమగు పారిశ్రామిక మండల మొకటి విస్తరించియున్నది. అందు యంత్రసామగ్రి, నేతవస్తువులు ఉత్పత్తియగుచున్నవి. లిబెరక్, బ్రూనో ప్రాంతీయులు నేత పరిశ్రమలో నిమగ్నులై యున్నారు. బొహీమియను పీఠభూమియందలి వాయవ్య మండలమునందు పెక్కు గాజు పరిశ్రమ కేంద్రములు గలవు. 'బ్రూనో' సమీపమున నున్న జ్లిన్ (zlin) అను తావునందు గల 'బాటా' షూ ఫ్యాక్టరీ (పాదరక్షల కర్మాగారము) ప్రపంచ విఖ్యాతమైనది. పెక్కు దేశములందు దానికి చెందిన కర్మాగారములు గలవు. 'బీర్' అను సారాయము ముఖ్యముగా 'ప్లాజన్' (Plazan) అను చోట ఉత్పత్తియగు చున్నది. జనాభా; పట్టణములు : 1957 సం. లెక్కలనుబట్టి ఈ దేశపు జనసంఖ్య 13,16,542. వీరిలో భిన్న జాతుల వారు కలరు. కాని వీరిలో చెక్స్ (czecks), స్లోవక్స్ (slovaks) అనువారు ప్రధానములైన మానవ జాతి గణములకు చెంది యున్నారు. మొత్తము జనాభాలో చెక్కులు 66.7 శాతము, స్లోవకులు 27 శాతము గలరు. జర్మనులు, మగ్యారులు, యుక్రేనియనులు, పోలులు (Poles) యూదులు మున్నగు వారు ఇతర తెగలకు చెందియుండిరి. రోమను క్యాథలిక్కు మతావలంబకులు ప్రజలలో అత్యధికముగ నుందురు.
ప్రేగ్ : ఇది చెకోస్లావేకియాకు ముఖ్యపట్టణము. ఈ నగరము బొహీమియాకు మధ్యగా నున్నది. జనాభా 9,78,694 (1957). దేశములో కెల్ల ఇది గొప్పపట్టణము. ఇది ముఖ్యమగు పారిశ్రామిక నగరములలో నొకటి. చర్మ పరిశ్రమ, పంచదార శుద్ధి పరిశ్రమ, ఇంజనీరింగు పరిశ్రమ ఇచ్చటి ప్రధాన పారిశ్రామికసంస్థలు.
బ్రూనో (Bruno or Brunn) అనునది చెకోస్లోవేకియాలో రెండవ గొప్ప నగరము. 1957 సం. జనాభా ప్రకారము దీని జనసంఖ్య 3,06,871. ఇచ్చట నూలు, ఉన్ని పరిశ్రమలు నెలకొని యున్నవి.
ఆస్ట్రవా అనునది మరియొక ముఖ్యమైన పారిశ్రామిక నగరము. దీని జనాభా 1957 సం. లెక్కలను బట్టి 1,99,206. లోహ పరిశ్రమలకు ఈ నగరము ప్రసిద్ధి గన్నది.
బ్రటిస్లేవియా (Bratislavia) : ఇది డాన్యూబ్ నదిపై నున్న ఓడ రేవు పట్టణము. ఇది ఈ క్రింది మూడుమార్గములకు కూడలి. (1) పశ్చిమదిశనున్న డాన్యూబ్ లోయమీదుగా దక్షిణ జర్మనీకిని, పశ్చిమ యూరపునకును; (2) ఉత్తర దిక్కుగా మొరేవియా నిమ్నప్రాంతముల పైగా పోలెండునకును; (3) దక్షిణపువైపున హంగేరియా మైదాన ప్రాంతముల మీదుగా బుడాపెస్టు బెల్‌గ్రేడ్ నగరములకును, మెడిటరేనియన్ సముద్రమునకును, ఇచ్చటనుండి ఓడమార్గములు కలవు. ఈ నగరపు జనసంఖ్య 1957 సం. లెక్కలనుబట్టి 2,46,695.
వి. వి.