సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చెకోస్లావేకియా దేశము (చ)
చెకోస్లావేకియాదేశము (చ) :
ప్రథమ ప్రపంచ సంగ్రామానంతరము 1918 సంవత్సరము అక్టోబరు 28 తేదీన చెకోస్లావేకియా ప్రజాప్రభుత్వము ఏర్పడినది. చెకోస్లావేకియా యూరప్ ఖండములో, కీలకమయినస్థానములో, పర్వతశ్రేణులచే చుట్టబడి యున్నది. వైశాల్యములో ఇది పెద్దదేశము కాక పోయినను, నైసర్గికస్వరూపమువలనను, అమరికవలనను, ఐరోపా ఖండములో చెకోస్లావేకియాకు ప్రాముఖ్యము లభించుచున్నది. దీనికి ఉత్తరమున జర్మనీ, పోలండ్ దేశాలు; తూర్పున రష్యా; దక్షిణమున హంగేరి, ఆస్ట్రియాలు ; పశ్చిమమున జర్మనీ దేశమును ఉన్నవి. ఈ దేశము బొహీమియా, మొరేవియా - సై లేషియా, స్లావేకియా, రుధేనియా, అను నాలుగు భూభాగములచే ఏర్పడియున్నది. పశ్చిమ భాగములోని బొహీమియా, మధ్య భాగములోని మొరేవియా ప్రాంతములు చాలవరకు పర్వతములచే చుట్టబడి, సమతల పీఠభూమిగాను, తూర్పుననున్న రుధేనియా, స్లావేకియాలు తూర్పునకు ఏటవాలుగా నున్న కార్థేసియన్ పర్వత శ్రేణులలోని పచ్చిక బయళ్ళుగాను ఏర్పడి యున్నది. మొత్తమునకు ఈ దేశములో అరణ్య భాగమే ఎక్కువగా కనబడును.
చెకొస్లావేకియా యొక్క వైశాల్యము 49,381 చ. మైళ్ళు. ఈ దేశములోని ప్రధానమైన నదులు లాబె, వటావా, వ్జోడర్, మొరావా, వాః, డాన్యూబ్ అనునవి. దీనికి రాజధాని ప్రేగ్ నగరము. ఈ దేశ వాసులలో సుమారు 70% వరకు రోమన్ కాథలిక్కు మతస్థులున్నారు. దేశములోని క్రైస్తవ దేవాలయము లన్నియు ప్రభుత్వాధీనమున నున్నవి. 1958 డిసెంబరు నాటికి ఈ దేశపు జనాభా 13,518,021. పర్వత ప్రాంతములలోని పల్లెలలో, వస్త్రములు నేయుట, వస్త్రములపై రంగు రంగు ఎంబ్రాయిడరీ చిత్రముల నల్లుట, ఆట బొమ్మలను చేయుట మున్నగునవి ముఖ్య వృత్తులు. పశువులను వీరు పచ్చిక బయళ్ళలో మేయుటకై విచ్చలవిడిగ వదలరు.
చెకోస్లావేకియా అను పేరు క్రీ. శ. 1880 సం. నుండి ప్రచారమున నున్నది. స్థూలముగా 'స్లావ్ ' జాతికి చెందిన చెక్కులు, స్లావెక్కులు అను రెండు తెగలతో నిండిన ఈ దేశములో, చెక్కులు బొహీమియా, మొరేవియా ప్రాంతములలోను, స్లావెక్కులు స్లావేకియాలోను ప్రధానముగ నివసింతురు. రష్యనులుకూడా ఈ 'స్లావ్’ జాతికి చెందినవారే. ప్రారంభములో చెక్కులు, స్లావెక్కులు అను నీ రెండు తెగల మధ్య చెప్పుకోదగినన్ని విభేదములు లేవు. చారిత్రక రీత్యా ఏర్పడిన ఈ వి భేదముల వలన పశ్చిమ భాగములోని బొహీమియన్ చెక్కులు పదునాల్గవ శతాబ్దమునకే, యూరప్ ఖండమునందు, విశిష్టమైన సంస్కృతిని, నాగరకతను, ఖ్యాతిని గడించిరి. ప్రేగ్ నగరమున, ఆరువందల సంవత్సరములకు పూర్వమే ఒక విశ్వ విద్యాలయము వెలసినది. ఈ బొహీమియన్ చెక్కులు, పదునారవ శతాబ్దమునుండి, జర్మన్ దేశస్థుల అధీనమున నుండుటచే, పారిశ్రామిక జాతిగా వీరు దిద్దితీర్చ బడిరి. తూర్పు తీరములోని స్లావెక్కులు సుమారు వేయి సంవత్సరములుగ హంగేరియన్ల అధీనమున నుండి, కర్షక జాతిగా తయారయిరి. అందులకే 1918 వ సం॥న చెకోస్లావేకియన్ ప్రజాప్రభుత్వ మేర్పడిన తర్వాత, స్లావేకియాలోకూడ పరిశ్రమలు స్థాపించుటకుగాను ప్రయత్నములు జరుగుచున్నవి. యాదృచ్ఛికముగ ఏర్పడిన ఈ రెండు తెగల మధ్య పెంపొందిన విభిన్న ప్రవృత్తులకు పొందిక కల్పించుట చెకోస్లావేకియన్ ప్రజాప్రభుత్వమును ఎదుర్కొను గడ్డు ప్రశ్నలలో నొకటి. ఈ దేశపు నైసర్గిక స్వరూపముకూడ ఈ సమస్యను మరింత చీకాకు పెట్టినది. ఇట్టి విషమ సమస్య లెన్నో బయలుదేరినను, ఈ ప్రభుత్వము వాటి నెదుర్కొని, విజయవంతముగ పురోగమించుచున్నది.
క్రీ. శ. ఆరవ శతాబ్దమున 'స్లావ్ ' జాతివారు తూర్పు తీరమునుండి బొహీమియా రాజ్యమునకు వలస వచ్చిరి. పిమ్మట సుమారు మూడు వందల సంవత్సరములకు సెయింట్ సిరిల్ మున్నగు మతప్రచారకులు ఈ ప్రాంతమున క్రైస్తవ మత ప్రచారము చేయదొడగిరి. పదునొకండవ శతాబ్దమున స్లావెక్కులు హంగేరిదేశ మాగ్యర్ వంశస్థుల అధీనములోనికి రాగా, చెక్కులు నాల్గవ చార్లెస్ (1346-78) యొక్క పాలనమున, 'హోలీ రోమన్’ (పవిత్ర రోమక) సామ్రాజ్యమునందు ప్రముఖ పాత్రను వహించిరి. బొహీమియాలోని 'హస్సైట్' సంచలనమును యూరప్‌లోని ప్రాటెస్టెంట్ తిరుగుబాటులోని నాందీ ప్రస్తావనలతో సమన్వయింప వచ్చును. జాన్ వైక్లిఫ్ అనుయాయుడును గొప్ప చెక్ పండితుడు నగు జాన్‌హస్‌యొక్క శిష్యసంతతి ప్రారంభించిన 'హస్సైట్ ' ప్రచారమును రోమన్ కాథలిక్కులు నిరసించిరి.
1526 న 'హావ్స్‌బర్గ్ ' (ఆస్ట్రియా) వంశమునకు చెందిన మొదటి ఫర్డినెండ్ బొహీమియా రాజ్యమునకు రాజయ్యెను. 1602 న చెక్కులు స్వాతంత్ర్య పోరాటమును జరిపి, నవంబర్ 8 వ నాడు, హావ్స్‌బర్గులచేత ఓడింప బడిరి. దీని ఫలితముగా ఈ తిరుగుబాటును లేవదీసిన ప్రముఖు లందరును హత్య గావింపబడిరి. నాటినుండి సుమారు మూడు శతాబ్దములవరకు, చెక్కులు స్వాతంత్య్ర జీవితమును కోల్పోవుటయే కాక, బొహీమియన్ ప్రాటెస్టెంట్ మతము సమూలముగ తుడిచి వేయ బడినది.
ప్రథమ ప్రపంచ సంగ్రామము నాటికి, అంతవరకు అసంతృప్తితో అలజడి చేయుచుండిన చెక్కులును, స్లావెక్కులును స్వాతంత్ర్య జీవనోద్దేశమున ఏకమై, దూరదృష్టి గలవాడును కార్యనిర్వహణ ధురీణుడును అయిన మాసరిక్ (Tomas Garrigue Masaryk) అనునతనిని నాయకునిగా గ్రహించిరి. ఆస్ట్రియన్ పోలీసు దళములు తన్ను బంధింప నున్నవని గ్రహించి 1914 లో మాసరిక్, విదేశముల నుండియే చెకోస్లావేకియన్ బలములను కూడబరచుకొనుచు, తన మిత్రుల మూలమున స్వదేశమున జరుగు మార్పుల నరయుచు, స్వాతంత్ర్య సన్నాహములను చేయుచుండెను. అమెరికాలో నున్న చెకోస్లావేకియన్ పౌరులు ఈ స్వాతంత్య్ర పోరాటమునకు వలయు ఆర్థిక సహాయము చేయ సిద్ధపడిరి. నాటి మాసరిక్ ప్రయత్నములకు లండన్ నగరము కేంద్రముగ నుండెను. 1915 లోనే మాసరిక్ ఆస్ట్రియాకు చెకోస్లావేకియా స్వాతంత్ర్యము విషయమై ఒక ప్రకటన గావించెను. 1918 జూన్ 30 వ తేదీ చెకోస్లావేకియన్ నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడైన మాసరిక్, తాను అమెరికాలో నున్నప్పుడు నూతన ప్రజాప్రభుత్వ నిర్మాణమునకు గాను, చెక్కులు స్లావెక్కుల మధ్య నొక యొడంబడికను చేయించెను. అమెరికా సంయుక్త రాష్ట్రములు, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్సు, ఇటలీ దేశము లీ నూతన ప్రభుత్వ నిర్మాణము నామోదించినవి. 1918 అక్టోబర్ 14 వ తేదీ పారిస్ నగరమున డా॥ బినెస్ చెకోస్లావేకియన్ తాత్కాలిక ప్రభుత్వము నేర్పరచెను. అక్టోబరు 18న వాషింగ్టన్ నగరము నుండియు, 28 తేదీన ప్రేగ్ నగరములోను మాసరిక్ చెకోస్లావేకియా స్వాతంత్ర్యమును ప్రకటించెను. 1920 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగినవి. ఫిబ్రవరి 19 తేదీన తొలిసారిగా పౌరులచే ఎన్నుకొనబడిన ప్రతినిధుల 'నేషనల్ అసెంబ్లీ ' సమావేశమయినది.
నేషనల్ అసెంబ్లీ మాసరిక్ ను దేశాధ్యక్షునిగాను, క్రామర్ ను ప్రధానమంత్రిని గాను, డా॥ బినెస్ ను విదేశాంగ మంత్రినిగాను ఎన్నుకొనినది. నానాజాతి సమితి (League of Nations) తోను, ఫ్రాన్సు, రష్యా దేశములతోను ఈ ప్రభుత్వము సన్నిహిత సంబంధములను నిలుపుకొన్నది. అందుకుతోడు ఇరుగు పొరుగు దేశములతోను శాంతియుతమును, నిర్మాణాత్మకమును అయిన స్నేహమును పెంపొందించుకొన్నది. 'లోకార్నో' ఒడంబడిక అనంతరము (1925 - 1926) జర్మనీ దేశముతో గూడ సన్నిహిత సంబంధ మేర్పడినది. 1929 లో మాగ్యర్ల కలహముల నణచుటకును, డాన్యూబ్ నదిమీద వర్తకము నభివృద్ధి గావించుటకును 'లిటిల్ ఎన్టెన్ట్' ఒడంబడికను ఈ ప్రభుత్వము యుగోస్లావియా, రుమేనియా దేశములతో చేసికొన్నది. జర్మనీ రాజకీయరంగములో హిట్లరుఅవతరించుటయు, చెకోస్లావేకియాలోని జర్మన్ దేశస్థులు 'సుడేటన్ జర్మనీ పార్టి 'ని స్థాపించుటయు, ప్రపంచ రాజకీయ రంగములో నాయకుల కొకవిధమైన మనో వైక్లబ్యము బయలు దేరుటయు, ప్రపంచశాంతి రక్షణలో 'నానా జాతి సమితి' విఫలమగుటయు, మున్నగు నంశములు చెకోస్లావేకియా రాజకీయ పరిస్థితిని మరింత సందిగ్ధ పరిస్థితి లోనికి దెచ్చినవి. ఇట్టి పరిస్థితులను పరిశీలించి, చెకోస్లావేకియాలో నాయకులు సుశిక్షిత సైనికదళములను తయారుచేయ నారంభించిరి. ఈ సంక్షోభము 1938 నుండి ప్రారంభ మయిన దనవచ్చును. 1938 లో జర్మనీదేశము ఆస్ట్రియాను వశపరచు కొన్నందున, చెకొస్లావేకియాకు మూడు వైపులను జర్మనీవారి ఆధిపత్యము సాగుచుండినది. ఇట్టి పరిస్థితిని పరిశీలించి, దేశములోని చిన్న చిన్న పార్టీలన్నియు 'సుడేటన్' జర్మన్ పార్టీ'లో కలిసిపోయినవి. 'నానాజాతి సమితి' లోని సంబంధ బాంధవ్యములను పురస్కరించుకొని గ్రేట్ బ్రిటన్, 1924 లో ఏర్పరచుకొనిన ఒడంబడిక ననుసరించి చెకోస్లొవేకియాను ఫ్రాన్సు రక్షింప వలసి యుండగా, ఈ దేశములేవియు ముందడుగు వేయజాలక పోయినవి. 1938 సెప్టెంబరు 29 తేదీన మ్యూనిక్ నగరములో జరిగిన సమావేశము ఫలితముగా చెకోస్లావేకియా దేశము విభజనకు గురియైనది. తత్ఫలితముగా సుమారు 16,686 చ. మైళ్ళను జర్మనీ, హంగేరీ, పోలండ్ దేశములకు చెకోస్లావేకియా కోల్పోయినది. దేశములో రాజకీయ పరిస్థితి మరింత కలుషితమై, మ్యూనిక్ సమావేశా నంతరము, ఆరునెలలలో చెకోస్లావేకియా మొదటి రిపబ్లిక్ అంతరించినది. డా॥ బినెస్ 1938 అక్టోబరు 5 వ తేదీన అధ్యక్ష పదవినుండి విరమించుకొనెను. హిట్లర్ స్లావేకియా, రుధేనియాలను స్వతంత్ర దేశములుగా ప్రకటించెను. తక్కిన భాగమునకు డా॥ ఎమిల్ హాచా అధ్యక్షుడుగా నియమింపబడెను. 1939 మార్చి 15వ తేదీ నాటికి జర్మన్ సైన్యములు ప్రేగ్ నగరము నాక్రమించినవి. ఆ సెప్టెంబరులో, చెలరేగిన ప్రపంచ సంగ్రామము నందు, చెకోస్లావేకియా వాసస్థులు, జర్మన్లకు యుద్ధము నందు సహాయముచేయ ప్రతిఘటించిరి. లండన్‌లో డా॥ బినెస్ చెకోస్లావేకియన్ నేషనల్ కౌన్సిలును పునః స్థాపించి, దానికి అధ్యక్షుడయ్యెను. మంత్రి మండలి, సైనిక దళము ఇత్యాది అంగములతో చెకోస్లావేకియా ప్రభుత్వ మొకటి లండన్ నగరమున ఏర్పడినది. ఈ ప్రభుత్వము సోవియట్ రాజ్యము, అమెరికా సంయుక్త రాష్ట్రములు, బ్రిటిష్ ప్రభుత్వముల అంగీకార ముద్రను పడసినది. 1940, 1941 లలో చెకోస్లావేకియాలో అంతఃకలహములు విపరీతముగా చెలరేగెను.
ఐక్యరాజ్య సమితి (United Nations organisation) పథకమునందు 1942 జనవరి 1 వ తేదీన పాల్గొన్న రాజ్యములలో లండన్‌లో స్థాపితమయిన చెకోస్లావేకియన్ ప్రభుత్వము ఒకటి. 1943 నుండి సోవియట్ ప్రభుత్వముతో దీనికి సంబంధములు బలపడి 1944 మేలో ఈ రెండు ప్రభుత్వములు చేసికొన్న నిబంధనల ఫలితముగా చెకొస్లావేకియా భూభాగములో రష్యన్ సేనలు అడుగు పెట్టినవి. తర్వాత ఒక సంవత్సరమునకు కొంత అమెరికన్ల సాయముతోను, స్వదేశములోని సైన్యముల సహకారముతోను, సోవియట్ సేనలు జర్మనుల ఆక్రమణనుండి చెకోస్లావేకియాను విడుదల చేసినవి. డా॥ బినెస్, అతని ప్రభుత్వము మరల ప్రేగ్ నగరమును చేరిరి.
మరల 1945 జూన్ 29 వ తేదీన చేసికొనిన ఒడంబడిక ననుసరించి రుథేనియా భూభాగము ఆ ప్రాంత వాసస్థుల "అభీష్టానుసారముగ" సోవియట్ రాజ్యములో చేర్చబడినది. దేశములోని ఆంతఃకలహములకును, సంక్షోభములకును కారకులయిన జర్మన్లు, హంగేరియన్లు వారి వారి దేశములకు పంపివేయబడిరి. ప్రపంచ సంగ్రామా నంతరము, 1946 లో చెకోస్లావేకియా దేశమున ఎన్నికలు జరిగినవి. రెండవ రిపబ్లిక్ ఏర్పడినది. దేశమున వివిధ రంగములలోని అస్థిరత్వమును పరిష్కరించుటకు ఈ ప్రభుత్వము నడుము బిగించి పరిశ్రమలను, వ్యవసాయమును, ఇతర సంస్థలను జాతీయ సంస్థలుగా మార్చి దేశములో ఆర్థిక సుస్థిరత్వమును నెలకొల్పుటకు యత్నించినది. సోవియట్ రాజ్యముతో గాఢమైన పొత్తు కలుపుకొన్నప్పటికిని, గ్రేట్‌బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రములతో చెకోస్లావేకియా తన బంధములను తెంపుకొనలేదు. సాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఐక్యరాజ్యసమితి (U.N.O.) సమావేశమునకు ప్రతినిధి వర్గమునుగూడ పంపినది. కాని త్వరలోనే ప్రెసిడెంట్ బినెస్ ప్రభుత్వ వర్గము నేషనల్ అసెంబ్లీయొక్క అభిమానమును కోల్పోయినది. 1948 లో అసెంబ్లీలో కమ్యూనిస్టులు అధిక సంఖ్యాకులై గోట్వాల్డు నాయకత్వమున నూతన ప్రభుత్వమును స్థాపించిరి. మరల దేశమున అంతఃకలహము చెలరేగినది. దేశాభ్యున్నతి కిది భంగకరమగునని తలచి, డా. బినెస్ రాజకీయ జీవితము నుండి విరమించుకొనెను. 1950 లో సోవియెట్ పద్ధతి ననుసరించి, చెకోస్లావేకియాలో, న్యాయపరిపాలనా విధానము మార్చబడినది.
1953 మార్చిలో, ఆన్టొనిన్ జపోటోకి అధ్యక్షుడయ్యెను. మరల 1957 లో జరిగిన ఎన్నికలలో ఆన్టోనిన్ నొవోట్నీ అధ్యక్షుడుగా ఎన్నుకొనబడెను. 1956 లో పోలెండు, హంగేరి దేశములలో చెలరేగిన అలజడుల ప్రభావము, చెకోస్లావేకియాలో గోచరింపకుండుట అభినందింప దగిన విషయము.
ఆర్. రా.