సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చిత్రవస్తు ప్రదర్శనశాలలు
చిత్రవస్తుప్రదర్శనశాలలు :
చిత్రవస్తు ప్రదర్శనశాలలు (మ్యూజియములు) ప్రతి సాంస్కృతిక కేంద్రమునందును అత్యావశ్యకములుగా గుర్తించబడినవి. ఒక దేశము మిక్కిలి పురోగమించిన కొలదియు, లేక ఒక నగరము సాంస్కృతికముగా అత్యభివృద్ధిగాంచినకొలదియు దానియందలి చిత్రవస్తుప్రదర్శన శాలలసంఖ్యయు, వాని వై విధ్యమును పెరుగుచుండును. కాని చిత్రవస్తు ప్రదర్శనశాలల ఆరంభము మిక్కిలి విచిత్రముగా నున్నది. ఓషధులు, నక్కతోకలు, సర్పములు, నాగుబాముల పడగలు మున్నగువాని సేకరణతో చిత్రప్రదర్శనశాలలు ప్రారంభమైనవి. పెక్కుమంది డాంబిక వైద్యులు అట్టి వస్తువులను చూపి తమకు అద్భుతశక్తులు కలవని ప్రకటించుచుండిరి. పదపడి ఇట్టి సంచయము అపురూపమైన, అరుదైన పదార్థముల ప్రదర్శనరూపము తాల్చినది. ప్రేక్షకుల బుద్ధిని భ్రమింపచేయుటకు ఏర్పడిన ఇట్టి ప్రాథమికములు, ప్రాకృతములు అగు వస్తుసంగ్రహణముల నుండి శాస్త్రీయములును, క్రమపద్ధతిపై ఏర్పరుపబడినవియు నగు నేటి ఆధునిక చిత్రవస్తుశాలలు క్రమపరిణతి నొందినవి.
యూరపుఖండమందంతటను చిత్రవస్తుప్రదర్శనశాలల యొక్క సక్రమాభివృద్ధి పందొమ్మిదవ శతాబ్ది చతుర్థ పాదమునుండి పొడగట్టుచున్నది. కాని దీనికన్న ఇంకను పూర్వము కూడ చిత్రవస్తు ప్రదర్శనశాలల ఉద్దేశము ప్రాచీనుల మనస్సులో అణగియుండెను. క్రీ. పూ. 300 ఏండ్లనాడు అలెగ్జాండ్రియా నగరమున టాలమీ అను నాతని కొక చిత్రవస్తుప్రదర్శనశాల యుండెను. కాని దానినుండి విద్వాంసులు మాత్రమే కొంతవరకు ప్రయోజనమును పడయగలిగిరి. ఏథెన్సు నగరమున చెక్కడపు విగ్రహముల సంగ్రహణము జనసామాన్యమునకు చూడ వీలుగా నుండియుండెను. కాని అవి చిత్రవస్తు ప్రదర్శనశాలలుగా పరిగణింప బడలేదు. మధ్యకాలమున క్రైస్తవుల ప్రార్థనా మందిరములు, మఠములు వర్ణచిత్ర ప్రదర్శన మందిరములుగా ఉపయోగింపబడినవి. సంస్థానాధిపతులును, జమీందారులును అరుదైన విలువగల వస్తువులను కొనుటకును, సంపాదించుటకును, వాటిని పదిలముగా భవనములం దుంచి సంరక్షించుటకును సమర్థులగుచుండిరి.
హిందూదేశములోని అజంతా, ఎల్లోరా గుహలును, సాంచీ, అమరావతీ స్తూపములును, దక్షిణోత్తరముల యందలి పెక్కు కోవెలలును, శిల్ప, వాస్తు కళాఖండ సంచయముయొక్క కలిమిచే చిత్రవస్తు ప్రదర్శన శాలలుగా తనరారుటయే గాక, చిత్రకళా మందిరములుగా కూడ ప్రసిద్ధికెక్కినవి. మ్యూజియములు ప్రప్రథమమున వినోదాత్మకములుగా నుండినను, అవి వర్తమాన యుగమున క్రమవికాసము చెంది విద్యావర్ధకములుగా నుండు నంతటి పరిణతి చెందినవి. విజ్ఞానము వివిధ ప్రత్యేక శాఖలుగా విస్తరించిన తరువాత లలితకళలు సువిభక్తములై వేర్వేరు కళావిభాగములుగ రూపొందినవి. మ్యూజియములు ప్రత్యేక విషయములయందు విశిష్ట కృషి చేయజాలుచున్నవి. సంపన్నులు చేసిన వివిధ వస్తుసంగ్రహణములు విస్తారమైన వైనను, వాటి ఆర్థికమయిన విలువ అపారమైన దైనను అవి మ్యూజియములుగా పరిగణింపబడవు. ఒక పద్ధతి, ఒక ఉద్దేశము గలది చిత్రవస్తు ప్రదర్శనశాల యనిపించుకొనును. అవి దాని నిర్మాణములోని పడుగుపేకలు. లండన్ నగరములోని “సోయేన్ మ్యూజియము" ను ఒక గూర్చి అధికారి ఇట్లు పలికెను. “చిత్రవస్తుశాలా నిర్వహణమున ఆధునిక పద్ధతులచే నిషేధింపబడిన దోషము లన్నియు ఇందున్నవి. ప్రదర్శించిన వస్తువుల విషయమున గాని, ప్రదర్శించు విషయమున గాని ఒక పద్ధతి గాని, శాస్త్రము గాని అనుసరింపబడలేదు. ఇందు గొప్ప గుణములుగల ప్రదర్శనీయ వస్తువులున్నను, గుణవిహీనమైన ఇతర వస్తువుల సాన్నిధ్యముచేత వాటి సొంపు తగ్గుచున్నది." ఈ పంక్తులు వ్యతిరేక విధానమున
చిత్రవస్తుప్రదర్శనశాల అన నెట్లుండవలెనో మనకు తెలుపుచున్నవి.
చిత్రవస్తుప్రదర్శనశాల సక్రమమును, శాస్త్రీయమునైన పద్ధతులపై నిర్మింపబడవలెను. ఏ ఉద్దేశములతో వస్తు సంగ్రహణము చేయబడుచున్నదో అది స్పష్టముగా నిర్వచింపబడవలెను. ప్రదర్శనమునకు అమర్చిన వస్తువులు వర్గీకరింపబడి జాబితా చేయబడవలెను. అవి సంఖ్యా బద్ధములు కావలెను. వాటిమీద గ్రంథసంబంధమైన వివరము గల చీటీ ఉండవలెను. ప్రతి వస్తువుయొక్క శోభ హెచ్చునట్లును, ప్రేక్షకులకు గొప్ప సదుపాయము, సౌకర్యము కలుగునట్లును ప్రదర్శనము జరుగవలెను.
వస్తువులను వర్గీకరించుటలో గమనింపదగిన ముఖ్య సూత్రము లేవి అను ప్రశ్న బయలుదేరును. వస్తువులు చారిత్రకములు, వస్తుగతములు. కొన్ని వేళలలో అవి జాతిబద్ధములుకూడ కావచ్చును. కాని ఈ లక్షణములలో కొన్ని ప్రాయశః అతివ్యాప్తి (overlap) చెందవచ్చును. చరిత్ర ననుసరించిన వర్గీకరణము మనుష్యకౌశలము అభివృద్ధి చెందిన జాడలు కనిపెట్టుటకు సహకరించును. కలపతో నిర్మితములైన గీత వాద్య పరికరములను, కలప వస్తువుల క్రిందను, గీతవాద్య పరికరములక్రిందను, వర్గీకరింపవచ్చును. జంతుశాస్త్ర, పక్షిశాస్త్రములకు సంబంధించిన చిత్రవస్తు ప్రదర్శనశాలలయందు గడ్డి నింపిన కళేబరములను (Stuffed Skins) ప్రదర్శించు సందర్భమున వాటికి సరియైన వాతావరణమును, వాటికి తగిన వస్తువులతో పొత్తును కల్పించుటకు ప్రయత్నములు చేయబడుచున్నవి. భిన్నదేశములనుండి వచ్చిన సమానమైన వస్తువులను ప్రదర్శించునపుడు అవి జాతీయతను గాని, ద్రవ్య స్వభావమును గాని అనుసరించి వర్గీకరించబడుచున్నవి. మ్యూజియములలో దీపముల ఏర్పాటు శక్యమైనంత సంపూర్ణముగను, సమృద్ధిగను ఉండవలెను.
అన్ని మ్యూజియములలోను వర్గీకరణమునందు ఏకరూపత ఉండవలెను. యూరపుఖండములోని ప్రతిదేశమును స్వీయపద్ధతి నవలంబించుచున్నను ఇంగ్లండులో ఏకరూపత పాటింపబడుచున్నది. వర్గీకరణము వివేచనా పూర్వకముగా చేయవలెను. అది నిరంకుశముగా ఉండ కూడదు. భూగర్భశాస్త్రము, మానవశాస్త్రము, వాస్తుశాస్త్రము, శిల్పశాస్త్రము, వర్ణచిత్ర రచనము, ఖగోళశాస్త్రము, జంతుశాస్త్రము, పక్షిశాస్త్రము మొదలగు ప్రతి విజ్ఞానశాఖయు చిత్రవస్తు ప్రదర్శనశాలలో జాగరూకతతో ప్రదర్శింపబడవచ్చును. వివరణ పటములు, గారతో చేయబడిన ఆకృతులు, నమూనాలు, రేఖా కృతులు తదితర చిత్రములు వస్తువుల యొక్క నష్టమైన అవాంతరదశలనుచూపుటకు ఉపయోగపడును. శాస్త్రోక్త సంవిభాగములు గల భవనములలో చిత్రవస్తుశాలల నుంచవలెను. యూరవుఖండమం దంతటను అనేక పురాతన భవనములు సంపాదింపబడి, చిత్రవస్తు ప్రదర్శనశాలలకు అనువుగా మార్చబడినవి. ఇంగ్లండులో మాత్రము చిత్ర నస్తు ప్రదర్శనశాలా నిర్మాణమునకు పెద్ద మొత్తములు వ్యయపరచబడినవి. పెద్ద భవనము లభ్యమై సర్వత్ర అమర్చుటకు తగినన్ని చిత్రవస్తువులు లేకపోయినచో కాళీ స్థలములను రెండవ తరగతి నమూనాలతో నింపవలసి వచ్చును. అప్పుడు రెండవ తరగతి నమూనాల రాశి ముందు కొలదిమాత్రపు రమ్యవస్తువులు చూడ ముచ్చట నుండవు.
గ్రేట్‌బ్రిటన్‌లో చిత్రవస్తు ప్రదర్శనశాలలు గొప్పగా అభివృద్ధిచెందినవి. బ్రిటిష్ మ్యూజియము ప్రపంచములో ఉత్తమోత్తమమైనవాటిలో ఒకటి. ఈ మ్యూజియమును స్థాపించునప్పుడు చేయబడిన శాసనము (1751) యొక్క పూర్వ పీఠికలో ఇట్లు పేర్కొనబడినది : "అన్ని కళలును, శాస్త్రములును ఒండొంటితో సంబంధము కలిగియున్నవి. ప్రకృతి తత్త్వ శాస్త్రము నందును, ఇతర అనుమాన ప్రమాణజన్య శాస్త్రములందును, జరిగిన నూత నావిష్కరణములు మిక్కిలి ప్రయోజనవంతములైన ప్రయోగములకు సహాయము నొసగునవిగా ఉన్నవి. ఈ శాస్త్రముల ప్రగతి కొరకే ఈ చిత్రవస్తుశాల ఉద్దేశింపబడినది. " ఆంగ్లదేశములో ప్రేక్షకులు లక్షోపలక్షలు. వారము నందలి అన్ని దినములలోను వారికి ప్రవేశము అనుమతింపబడును. ప్రవేశ రుసుములు క్రమముగా తగ్గింపబడుచున్నవి. అచట మ్యూజియములకు సంబంధించిన చట్టము కూడ ఉన్నది. దానిని బట్టి పురపాలక సంఘములు మ్యూజియములపై పన్ను వసూలుచేయుటకు అనుమతించబడినవి.
ఇంగ్లండు నందు నాలుగు జాతీయ చిత్రవస్తు ప్రదర్శన శాల లున్నవి. వాటిలో బ్రిటిష్ మ్యూజియము, విక్టోరియాఆల్బర్ట్ మ్యూజియము అనునవి అత్యంత పురోగామి చిత్రవస్తు ప్రదర్శనశాలలు. బ్రిటిష్ మ్యూజియము విశేషముగా పురాతత్వ శాస్త్రమునకు సంబంధించినది. అందు అనేక కళానిక్షేపములు, పోతబొమ్మలు, వ్రాత ప్రతికృతులు, వైద్యుత ముద్రణ చిత్రములు ఉన్నవి. ఈచిత్రములలో కొన్ని మూలప్రతుల నుండి గుర్తుపట్టరానంత నేర్పుతో కల్పించబడినవి. బ్రిటిష్ మ్యూజియములో 75,000 ప్రతులు గల కళాగ్రంధ భాండాగార మున్నది. 2,50,000 ముద్రణములు కలవు. ఈ చిత్రవస్తు ప్రదర్శనశాలను నిర్వహించుటకు సమర్థవంతమైన సిబ్బంది కల్పింపబడినది. చిత్రవస్తువుల కొనుగోలు కొరకు విరాళము లివ్వబడు చున్నవి. స్థానికములు, ప్రాంతీయములు ఐన చిత్రవస్తు ప్రదర్శనశాలలకు కళాఖండములు ఒక నిర్ణీత కాలవ్యవధిలో తాత్కాలికముగ అరువు ఇయ్యబడును. ఈ పద్ధతి శీఘ్రముగా పెరుగుచున్నది. ఎందుచేత ననగా వివిధమండలములు, దేశములు చేసిన సహాయమునకు ప్రతిఫల మొసగుటకు మార్గాంతరములేదు. విక్టోరియా - ఆల్బర్టు మ్యూజియము కూడ మిక్కిలి సంపన్నమైనది. దాని మూలసిద్ధాంతము కళను పరిశ్రమకు అనుబంధింప జేయుటయై యున్నది. కళకు సంబంధించిన అందమైన పెక్కు సంగ్రహణములు దీనికి చేర్చబడినవి. బ్రిటిష్ మ్యూజియమంత బాగుగా ఇది సంవిభాగ సంపన్నము కాలేదు. కాని ఆంగ్లదేశపు ప్రభువుచే బదులుగా ఇవ్వబడిన 'రాఫేల్ ' వ్యంగ్య చిత్రములతో సహా చిత్ర పటములు, నేతరకములు, పట్టు నేత వస్త్రములు, జలతారు అల్లిక పనులు, పింగాణి పాత్రలు, ఎనామిల్ సరకు, దంత వస్తువులు, రూపనిర్మాణ కళాత్మక ఖండములు, లోహమయములు, దారు వికారములు, ప్రాచ్య ఖండముల నుండి సేకరించబడినవి. ముఖ్య వస్తువుల సౌందర్యము, అలంకరణాకర్షణము ఇక్కడ ప్రదర్శితములగు ముఖ్యలక్షణములై యున్నవి.
యూరపుఖండమందలి చిత్ర వస్తు ప్రదర్శనశాలలు కళాఖండముల సంగ్రహణవిషయమున వీనికన్న సంపన్న తరములును ; గురుతర వైవిధ్యము కలవియు నై యున్నవి. జర్మనీలో, మ్యూజియములయొక్క విద్యా విషయక లక్షణములు మిక్కిలి ని పుణముగా ఆలోచించబడినవి. ఇటలీదేశము నందలి సార్వజనీన సేకరణములు ఇంగ్లండులో నున్న వానికంటె సంఖ్యలో పదిరెట్లు అధికముగా నున్నవి. ఇవి ముఖ్యముగా జాతీయమైన ఆస్తిగా పరిగణింపబడుచున్నవి. వియన్నా, ఆమ్‌ష్టర్‌డామ్, జూరిక్, మ్యూనిక్‌లలోను, ఈజిప్టులోని గిజేహ్ వంటి చోటులందును అసామాన్య చిత్రవస్తు ప్రదర్శనశాల లున్నవి. ప్యారిస్ నగరములోని “మ్యూస్ కార్నావాలెట్" అను చారిత్రక చిత్రవస్తుప్రదర్శనశాల ప్రపంచములో అత్యంతము పరిపూర్ణమైన నాగరక చిత్రవస్తు ప్రదర్శనశాల. ఫ్రాన్సు కేంద్ర చిత్రవస్తుప్రదర్శనశాల “లూవ్రే” అనునది ఫ్రెంచి విప్లవ సమయమున స్థాపించబడినది. దీనిలో మొదటి ఫ్రాంకోయీ, పదునాలుగవ లూయీ, నెపోలియన్ చక్రవర్తుల సంగ్రహణములున్నవి. ఇందు అధికసంఖ్యగల సంగ్రహణములు చేర్చబడినవి. అందుచే సాధారణముగా ప్రేక్షకులతో ప్రదర్శనశాల క్రిక్కిరిసియుండును. ఇందు వెలుతురు ఏర్పాటు కూడ సంపూర్ణముగాలేదు. ఇటలీలో గల చిత్రవస్తుప్రదర్శనశాలలు అసంఖ్యాకములు. మిక్కిలి బాగుగా అమర్చబడి నటువంటియు, సర్వోత్తమముగా వర్గీకరించబడినట్టియు సంగ్రహణములు నేపిల్స్‌లోని మ్యూజియోనాజియో నేల్ అనుచోట కనబడును. నేపిల్స్‌యొక్క అవ్యహిత, సన్నిహిత ప్రాంతములనుండియే ముఖ్యముగా సేకరించ బడిన రోమక కళాఖండములు వేల సంఖ్యలో ఇందు కానగును.
ఆమ్‌స్టర్‌డామ్‌లోని 'రిక్స్ మ్యూజియము', దాని ఏర్పాటును బట్టి మిక్కిలి విశిష్టమైనది. దీనిలో వరుస వారీగా గదులున్నవి. వీటియందు విభిన్న కాలిక ములయి నడచే కళా సంప్రదాయములకు చెందిన నమూనాలు ఒక్క వీక్షణమున గోచరించును. బెర్లిన్, వియన్నా నగరములయందు అగణ్య వస్తుసంపదగల చిత్రప్రదర్శనశాలలున్నవి. చిత్రశాలా శిల్ప కళాఖండములతోపాటు పురాతన క్రైస్తవ కళాఖండ సముదాయముకూడ సంపూర్ణముగా కొనియాడతగియున్నది. బెర్లిన్‌లోని పురాతనమైన చిత్రవస్తు ప్రదర్శనశాల ప్రాచీనమైన చెక్కడపు ప్రతిమలకును, ఇటాలియన్ కళ చక్కగా ప్రతిబింబిత మైన శిలావిగ్రహములు సంగ్రహణమునకును ప్రసిద్ధిచెందినది. ఇక్కడి నూతన వస్తు ప్రదర్శనశాల కూడ గ్రీసుదేశపు చలువరాతి బొమ్మలకు పేరొందినది. కంచు విగ్రహములును, కట్టెమీద, లోహములమీద తొలిచిన ప్రతిమలును, ఈజిప్షియను కళానిధానముల విశిష్ట సంగ్రహణములును దీనిలో కలవు. రష్యాలోని చిత్రవస్తు ప్రదర్శనశాలలు మిక్కిలి గొప్పగా అభివృద్ధి నొందినవి. ప్రతిసంవత్సరము క్రొత్త మ్యూజియములు స్థాపించబడు చున్నవి. సైబీరియాలోని దూరప్రదేశములలో సైతము మ్యూజియముల సంఖ్య పెరుగుచున్నది. సెంట్‌పీటర్స్ బర్గులోని హెర్మిటేజ్ ప్యాలెస్ లో నమ్మశక్యము గానంత విలువకల మధ్యయుగ కళాసంపద సమకూర్పబడినది. అందు అత్యంత పురాతన యుగకళను దృష్టాంతీకరించు సువర్ణ, రజత నిర్మితములగు వస్తువు లున్నవి. చేతి పనితనములోని నైపుణ్యముయొక్క గొప్ప ప్రగతిదశను రుజువు చేయుచు ఉత్తమ తరగతికి చెందినట్టి సిథియా, క్రిమియా, కకేషియా దేశములు ఆభరణములుకూడ ఇందు పొందుపరచ బడినవి. మాస్కోలోని పారిశ్రామిక చిత్రవస్తు ప్రదర్శనశాల అచట శిక్షను పొందు ఆకృతి రచయితలపై మంచి ప్రభావమును వై చినది.
అమెరికాలో చిత్రవస్తు ప్రదర్శనశాలలు సర్వసామాన్యముగా ఉండును. వాటి సంఖ్యయు పెద్దది. అవి ఎట్టి ఐతిహ్య సంప్రదాయమునకు చెందినవి కావు. కావున వాటినిగూర్చి శాస్త్రీయమైన ప్రశంస చేయుటకు ఎక్కువ అవకాశము ఉన్నది. వాషింగ్టన్‌లోని జాతీయ చిత్రవస్తు ప్రదర్శనశాల ప్రధానముగా చారిత్రకావశేషములకు ప్రసిద్ధి చెందినది. ఆ నగరమునందే యున్న స్మిత్ సోనియన్ ఇన్‌స్టిట్యూటు తత్తుల్య సంగ్రహణములను కలిగియున్నది. బోస్టన్‌లోని లలితకళా చిత్రవస్తు ప్రదర్శనశాల సర్వాంగసంపూర్ణమైనది. విస్మృతకళ యొక్క శ్రేష్ఠమైన పునర్నిర్మాణములతో పాటు అద్భుతమైన మృణ్మయవస్తు సంచయము కూడ అందున్నది. ఈజిప్టుదేశపు పురావస్తు సంపదకు 'గిజేహ్' మ్యూజియము ప్రఖ్యాతిగాంచినది. ఇది మారియట్ బే చే స్థాపింపబడి మాస్పెరోచేత అభివృద్ధి కావింపబడినది. ఇది జాతీయ చిత్రవస్తు ప్రదర్శనశాలలలో అత్యుత్తమమైనది. 1890 వ సంవత్సరమున నిర్మింపబడిన విశాల భవనములలో ఇది స్థాపింపబడి యున్నది. ఇది బాగుగా వర్గీకరింపబడినది. దీనికి విరివిగా ఆర్థికావలంబము చేకూరినది. క్రొత్త సేకరణలు దీనిలో విరివిగా కలవు.
హిందూదేశమునందలి చిత్రవస్తు ప్రదర్శనశాలలు బ్రిటిష్‌వారి ప్రోత్సాహమున అభివృద్ధిచెందినవి. హిందూదేశమందు ఆత్యంతాద్యమైన చిత్రవస్తు ప్రదర్శనశాల 1796 లో స్థాపితమైనది. అప్పుడు కలకత్తాలోని బెంగాలు ఏషియాటికీ సొసైటీవారి మందిరమున పెక్కు వింత వస్తువులు పదిలపరుచబడినవి. మదరాసులో ఒక చిత్రవస్తు ప్రదర్శనశాలను స్థాపించుటకు 1819 లో ప్రయత్నములు చేయబడినవి. కాని 1846 లో తూర్పు ఇండియా కంపెనీవారు ముఖ్యవస్తువుల నన్నిటిని సంపాదించి, ఒకచోట కేంద్ర సంస్థగా ఏర్పాటుచేయుటకు సంకల్పించిరి. ఆ సంకల్ప ఫలితముగా 1851 లో మదరాసు ఫోర్టు సెంటు జార్జి కోటలోని కాలేజియందు కేంద్ర చిత్రవస్తు ప్రదర్శనశాల ఆవిర్భవించెను. 1858 వరకును అనగా కంపెనీ పరిపాలనము సార్వభౌమ ప్రభుత్వము యొక్కయు, రాష్ట్ర ప్రభుత్వముల యొక్కయు హస్తగత మగువరకును చిత్రవస్తు ప్రదర్శనశాలల విషయమున కంపెనీవారి ఉత్సాహము పెరుగజొచ్చెను. హిందూదేశమందలి చిత్రవస్తు ప్రదర్శనశాలలు ప్రధానముగ పురావస్తుశాస్త్ర పక్షపాతమును చూపుచున్నవి. అయినను 1847 లో హిందూదేశపు చిత్రవస్తు ప్రదర్శనశాలలను పరిశీలించిన ఒక ప్రేక్షకుడు వీనిలో ప్రకృతిశాస్త్రము అగ్రస్థానము నాక్రమించి యున్నదని అభిప్రాయపడినట్లు తెలియుచున్నది. హిందూదేశమునందలి పురావస్తు సంభారముల ప్రాధాన్యము కల పెద్ద చిత్రవస్తు ప్రదర్శనశాలలలో కలకత్తా యందలి ఇండియన్ మ్యూజియము, బొంబాయి యందలి ప్రిన్స్ ఆఫ్ వేల్సు మ్యూజియము, మదరాసు, లక్నో, పాట్నా (పాటలీపుత్రము), నాగపూరులోని మ్యూజియములు ఇట్టివి మరికొన్ని పేర్కొనదగినవి. పురావస్తు శాస్త్ర పరిశీలనకృత్యము పురోగమింప మొదలిడిన వెంటనే కలకత్తాలోని చిత్రవస్తు ప్రదర్శనశాలలో గాంధార శిలాప్రతిమలకు స్థానము చేకూరెను. మొదలిడిన
కర్జన్ ప్రభువు ప్రాచీన హిందూదేశ చరిత్ర విషయమున సమున్నతోత్సాహము కలవాడుగా నుండెను. ఆయన ప్రశస్తతర పద్ధతులపై పురావస్తు పరిశీలనమును క్రమబద్ధమొనర్చెను. సర్ జాన్ మార్షల్ పెక్కు వర్షములవరకు ఈ శాఖకు అధిపతిగా నుండెను. ఆయన వివిధ చిత్రవస్తు ప్రదర్శనశాలల నిర్మాణమునకు కారకు డయ్యెను. ఆయన బిజాపూరు, జారిపడా, చంబా,అజ్మీర్, ఖజురాహో, గ్వాలియర్, సాంచీ అను తావులలో చిత్రవస్తు ప్రదర్శనశాలలను నెలకొల్పెను. పురావస్తు పరిశీలనమునకై త్రవ్వకములు జరిగినచోట చిత్రవస్తు ప్రదర్శనశాలలను నెలకొల్పుట భారత ప్రభుత్వపు విధానముగా నుండెను. కలకత్తాలో ఇండియన్ మ్యూజియములో భూగర్భశాస్త్రము, మానవశాస్త్రము, జంతుశాస్త్రము మొదలగువానికి సంబంధించిన ఉత్తమ శాఖలు కలవు. పురావస్తుశాస్త్ర శాఖ మిక్కిలి బాగుగా అభివృద్ధి గాంచెను.
పురావస్తుశాస్త్రము అతి విపులమైన విషయము. ఇది ప్రాక్చారిత్రక యుగము నుండి కూడ మానవ సంస్కృతీ విశేషములకు చెందిన ప్రతి శాఖా విషయము ఇందు చేరగలదు. కావున పురావస్తుశాస్త్రమును పౌర్వాపర్య క్రమబద్ధ మొనర్చుట అత్యంతావశ్యకము. కలకత్తా ఇండియన్ మ్యూజియమునందు సాటిలేని ప్రాచీన హైందవ వస్తు సంగ్రహణము కలదు. ఇది వివిధ దశల యందలి హిందూ సంస్కృతికి దర్పణము. ఇందలి ప్రాచీన వస్తువులు అర్థవంతముగను, ఆకర్షకవంతముగను ప్రదర్శింప బడినవై, పండిత పామరులకు ముదము గొల్పుచుండును. ఈ మ్యూజియము నందలి శిలాప్రతిమాశాలలు మిక్కిలి సుసంపన్నమైనవి. ఇవి కచ్చితముగా చరిత్ర క్రమము ననుసరించి అమర్పబడుట అవసరము. అయినను స్థలసంకోచము ప్రతిబంధకమైనది. ఐనను అవి మౌర్య, శుంగవంశ రాజయుగములకు సంబంధించిన వివిధ దశావళులను భార్‌హట్, మధుర, అమరావతి, భూమార సారనాథ్, బీహార్, బెంగాలు మున్నగు తావులందలి గాంధార శిల్పపరంపరను సమగ్రముగా వివరించుచున్నవి. ఒరిస్సాదేశపు శిలాప్రతిమల సంగ్రహణము కూడ సుందరముగా నున్నది. నేపాళము నుండి, టిబెట్ (త్రివిష్టపము) నుండి, దక్షిణభారతము నుండి సేకరించబడిన భారతీయ కాంశ్య ప్రతిమలు సుందరముగా ప్రదర్శించబడినవి.
భారతీయ నాణెముల సంచయము ప్రపంచ మంతటిలోను అమూల్యమైనది. కెంపులు, సువర్ణాభరణములు, షాహ్‌జహాన్ చక్రవర్తి భూషణములు ఈ సేకరణలో నున్నవి. శిలాశాసనములు, తామ్రశాసనములు బహుళముగా నున్నవి. అరబ్బీ, పార్శీ శాసనములు, శిల్ప కళా ఖండములు, మెరుగుపెట్టబడిన పెంకులు, ప్రకాశమానములైన వ్రాతప్రతులు, పూర్వభారతమున మిక్కిలి ప్రసిద్ధిచెందిన ముస్లిమ్ స్మారక చిహ్నములలో కొన్నింటి చిత్రపటములు ముస్లిం శాఖలో అమర్చబడినవి.
మద్రాసులోను, బొంబాయిలోను గల చిత్రవస్తు ప్రదర్శనశాలలు మిక్కిలి బాగుగా రూపొందించబడినవి. ఇవి ఆ యా రాష్ట్రప్రభుత్వముల శ్రద్ధచే అభివృద్ధిచెందుచున్నవి. మద్రాసు మ్యూజియమునందలి ప్రాక్చారిత్రక యుగమునకు చెందిన వస్తుసంగ్రహణము. బొంబాయి మ్యూజియము నందలి ప్రకృతిశాస్త్ర విభాగస్థమయిన వస్తుజాతము చూపరులకు ప్రత్యేకాభిరుచినికల్పించునవిగా నున్నవి. నాగపూరు పాట్నాలలోని చిత్రవస్తు ప్రదర్శనశాలలు కూడ ప్రశంసనీయములైనవే. ఆగ్రాలోని టాజ్ మ్యూజియము, సారనాథ్ మ్యూజియము, ఢిల్లీకోటలోని మ్యూజియము, నలందా యందలి వాస్తుశాస్త్ర మ్యూజియముల వంటివి కొన్ని మ్యూజియములు స్థానికముగా సేకరించబడిన ప్రాచీన వస్తువులతో అలరారుచున్నవి. ఈ వస్తువులు అత్యుత్తమమైన శిల్పనైపుణికిని, అభిరుచికిని తార్కాణములు.
హైదరాబాద్ మ్యూజియము, అందలి అజంతామండపము విస్తారయశము నందినవి. అజంతా గచ్చువర్ణ చిత్రములు, పార్సీ, అరబ్బీ వ్రాతప్రతులు, శిలాప్రతిమలు, చరిత్రపూర్వయుగపు ప్రాచీన వస్తువులు ప్రత్యేకముగా ఎన్నదగినవి. హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియము సాలార్‌జంగ్ ప్రాసాదములో ఏర్పాటు చేయబడినది. ఈ చిత్రవస్తు ప్రదర్శనశాల నిస్సంశయముగా గొప్ప విలువయు, వైవిధ్యమును కలది. మూడు పురుషాంతరములనుండి కళావిమర్శ కాగ్రేసరులచే కావింపబడిన ఈ సంగ్రహణములు సంస్కృతికి చెందిన ప్రతిశాఖకు దర్పణములు, యూరపుఖండమునకును ప్రాచ్య దేశములకును చెందిన వర్ణచిత్రములు, చైనాదేశపు పింగాణి వస్తువులు, 'జాడె' అను నొక పచ్చరాయితో నిర్మింపబడిన వస్తువులు, తుపాకులు, ఆయుధములు మున్నగువాని సంగ్రహణము కొనియాడతగియున్నది.
కలకత్తాలోని విక్టోరియా మ్యూజియము, లేక క్రొత్త ఢిల్లీలోని గాంధీస్మారక మ్యూజియము వంటివి కొన్ని చిత్రవస్తు ప్రదర్శన శాలలు జీవిత చరిత్రకు ప్రాధాన్య మిచ్చుచున్నవి.
చిత్రవస్తు ప్రదర్శనశాలలు జీవముతో తొణికిసలాడు చుండు నిర్మాణములు. అవి పెరుగుదల పొందదగినవి. వస్తువుల ప్రదర్శనము, ప్రాతినిధ్యము ఎల్లప్పుడు నిలుకడ కలిగి ఒకేరీతిలో నుండరాదు. జాగ్రత్తగ అవగాహనము చేసికొని పరిస్థితుల కనుగుణముగా వాటిని మార్చు చుండవలెను. చారిత్రకాభిరుచికి మాత్రమే చెంది యుండని చిత్రవస్తు ప్రదర్శనశాలల విషయమున పై నియమము ముమ్మాటికి యధార్థము. మ్యూజియము వ్యవస్థ కంతటికి వెనుక పరిశీలనయుతమైన దృష్టి యుండవలెను. చిత్రవస్తు ప్రదర్శనశాల ఎన్నటికిని గిడ్డంగిగా గాని, గోదాముగా గాని దిగజారకూడదు.
చిత్రవస్తు ప్రదర్శన శాలలలో జాగ్రత్తగా తయారు చేయబడిన గ్రంథ సూచికలుండవలెను. ఇవి మంచి వివరణములతోను, బొమ్మలతోను అచ్చై యుండవలెను. ఇటువంటి వస్తు సూచికలు చిత్రవస్తు ప్రదర్శనశాలలలో ప్రదర్శనమునకు ఏర్పాటుచేయబడిన వస్తువులనుగురించి పండితులకు, పామరులకు బాగుగా తెలియపరచగలవు. వారు ఒకానొక నిశ్చితమైన ఆకాంక్షతోను, లక్ష్యముతోను చిత్రవస్తు ప్రదర్శనశాలకు వచ్చుటకు అవి తోడ్పడును.
బ్రిటిష్ మ్యూజియమునందు నాణకశాస్త్రము, చెక్కడపు పనులు, వర్ణ చిత్రములు, వ్రాత ప్రతులు, మొదలైనవాటి బోధనకొరకు సమర్ధముగా కూర్పబడిన అనేక సూచికలున్నవి. బోస్టన్ మ్యూజియములోను, ప్యారిస్ నందలి మ్యూసిగ్విమెట్ చిత్ర వస్తు ప్రదర్శనశాలలోను కల వస్తువుల పట్టికలు శ్రేష్ఠతయందు ఉన్నత శ్రేణికి చెందినవి. ఇండియన్ మ్యూజియము (కలకత్తా) నందును ఢిల్లీ మ్యూజియము నందును, గ్వాలియర్, లక్నో, మధుర, సాంచి, సారనాధ్ అను తావులందుగల చిత్రవస్తు ప్రదర్శన శాలలలోను, ఉత్తమమైన వస్తు పట్టికలు కలవు.
కవిలెభాండారములు చిత్రవస్తు ప్రదర్శనశాలలు అను రెంటికిని సర్వసాధారణములైన విషయములు అనేకములుకలవు. ఈ రెంటికిని అగ్నిభయరహితమైన సుందరభవనములు ప్రశాంత నిశ్శబ్ద ప్రదేశమున నిర్మింపబడవలెను. రెండింటియందును వస్తువులను ప్రదర్శించుటకై శాస్త్రోక్తమైన సంజ్ఞీకరణ ముండవలెను. రెండింటి యందును వస్తువుల విషయమున నిర్దుష్టమును కచ్చితమునైన భావములను వెలిబుచ్చు గైడులు (guides), సూచికలు ఆవశ్యకములు. కవిలెఖాండారములు వాఙ్మయశాఖకు మాత్రము సంబంధించియుండును. ఇక చిత్రవస్తు ప్రదర్శనశాలలు అన్ని లలితకళలతోను సంబంధమును కలిగియుండును. చిత్రవస్తు ప్రదర్శనశాలలలో ప్రదర్శింపబడిన వస్తువులన్నియు సంస్కృతియొక్క వివిధరంగములందు మానవుడధి రోహించిన శిఖరములకు ప్రతినిధులు. ఇక కవిలెభాండారము లన్ననో, అధికారస్థుల బుద్ధికౌశలమునకు సాక్షీభూతమై క్రమపద్ధతిప్రకారము సమగ్రముగా వ్రాసిపెట్టబడిన దస్తావేజులు. చిత్రవస్తు ప్రదర్శనశాలలతో పోల్చినప్పుడు కవిలె భాండారముల వ్యాప్తిరంగము పరిమితమైనదే కాగలదు. కాని అవి అతిమాత్రముగా ప్రత్యేకత గన్నవి; కేంద్రీకరించబడినవి. అవి వివిధ శాఖా విభాగములచే దురవగాహములు. చిత్రవస్తు ప్రదర్శనశాలలు ప్రేక్షకునియొక్క రసపిపాసకు అత్యంత దోహదకారులు. ఇక కవిలె ఖాండారములో, మానవ జీవితములోని జిజ్ఞాసకును, వ్యావహారి కావసరములకును ఉపయోగించును. ఈ రెండు వ్యవస్థలును మానవుని మేధస్సుయొక్క క్షణభంగురములును, దుర్గ్రాహ్యములు నగు వ్యాపారములను, దశలను అందుకొనుటకు యత్నించును. రెండు వ్యవస్థలును వాటికి ప్రత్యక్ష గోచరమగు శాశ్వతత్వమును కల్పించు లక్ష్యముతో ప్రవర్తించును.
ఆర్. ఎమ్. జో.