సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చిత్రలేపనసామగ్రి
చిత్రలేపనసామగ్రి :
ప్రాచీనకాలమునుండి మానవుడు వర్ణచిత్రములను రచించుచునేయుండెను. గ్రీసు, ఈజిప్టు, భారతదేశముల యందలి దేవాలయ కుడ్యములు, అందలి విగ్రహములు వర్ణములతో లేపనము చేయబడుచు వచ్చెను. చైనా, మెసొపొటేమియా, గ్రీసు, మెక్సికో, భారతదేశములందు క్రీ. పూ. కనీసము వెయ్యి సంవత్సరములనాటి వర్ణాలంకారితములగు మృణ్మయ పాత్రలు ఈనాటికిని కానబడును. చిత్రలేపనమునకు పూర్వమే వర్ణలేపన పదార్థములు గోచరించినను, వర్ణలేపన పదార్థములను గూర్చి 'హిమయుగము' (Ice Age) నుండి మానవు డెరిగి యున్నట్లు తెలియుచున్నది. హిమయుగము క్రీ. పూ. సుమారు 10,000 సంవత్సరములతో అంతమైనది. ఆ యుగములో కేవలము శిలలే చిత్రలేఖనమునకు భూమికలు (grounds) గా నుపయోగింపబడెడివి. పసుపు, ఎరుపు మున్నగు జేగురు రంగులతోడను, లోహమయమైన పదార్థముల తోడను రంగులు తయారు చేయబడెను. గ్రుడ్డునందలి తెల్లని సొన వివిధ వర్ణములను మిళితము చేయుటకు సాధనముగా ఉపయోగపడెను. అనంతరము క్రీ. పూ. 2000– క్రీ. శ. 1200 సం. మధ్యకాలములో క్రీటు, గ్రీసు, ఎట్రుస్కన్, ఈజిప్టు, ఇండియా దేశములలో కుడ్యచిత్రములు అవతరించెను. ఇదికాక, ప్రాచీన వర్ణచిత్రములు దారువులపైన, వస్త్రములపైన, చర్మములపైన, కాగితములపైన రచింపబడుచు వచ్చెను. ఆ దినములలో రకరకములైన జిగురుపదార్థములతో మిళితమైన నీటిరంగులను (Water Colours), 'ఎగ్ టెంపీరా' ను (egg tempera) ఉపయోగించి చిత్రములను తయారు చేయుచుండిరి. ఈజిప్టు కళాకారులకు తేనెటీగలు పెట్టు మైన మునం దభిమాన మెక్కువగుటచే, దానిని రంగులు కలుపుటకు సాధనముగా ఉపయోగించిరి. 15 వ శతాబ్ది నాటి డచ్చి, ఫ్లెమిష్ వర్ణచిత్రకారులు తైలవర్ణముల ప్రయోజనమును కనుగొనిన తరువాత, మొట్టమొదట ఐరోపాఖండము నందును, 18 వ శతాబ్దిలో ఇతరదేశముల యందును తైలవర్ణ చిత్రముల యొక్క ప్రాధాన్యము అధికము కాజొచ్చెను. 18 వ శతాబ్దిలో ప్రపంచమందలి పెక్కు దేశములతో యూరపునకు బంధములు వృద్ధికా నారంభించెను. ఆ నాటికే కృత్రిమముగా చేయబడిన లోహపు రేకులపైన, దృఢమైన గాజు పలకలపైన, ఆస్బెస్టాస్ (Asbestos) ఫలకములపైన వర్ణచిత్రములు రచింపబడెడివి. పెక్కు విధములైన రసాయన పదార్థములచే తయారు కాబడిన రంగు బిళ్ళలు, రంగు ట్యూబులు ఆనాడు కూడ లభ్యము లయ్యెను. ఆధునిక యుగమున రంగుసుద్దలు (Coloured crayons or pastels). రంగు పెన్సిళ్ళు వర్ణచిత్రముల యందుపయోగమున నున్నవి. రంగులను కలుపుటకు పెట్రోలు, ప్లాస్టిక్ రసాయన ద్రవములవంటి పెక్కు పదార్థములు ఈనాడు ఉపయోగింపబడుచున్నవి. శాస్త్ర విజ్ఞానము అభివృద్ధి యగుటచే వివిధములైన వర్ణలేపన పదార్ధములు కనుగొనబడుటయే గాక, గుణాత్మకముగ గూడ అవి అభివృద్ధి నొందెను.
వర్ణచిత్ర రచనమునకు సంబంధించిన పలు తెరగుల సాంకేతిక విధానములను గూర్చియు, చిత్రఫలకము (grounds) లను గూర్చియు, రంగులను 'గూర్చియు, ఇతర సాధన సామగ్రిని గూర్చియు ఈ దిగువ వివరింప బడును.
సాంకేతిక విధానములు : 1. కుడ్య చిత్రములు (fresco); 2. ఎగ్ టెంపీరా (egg tempera); 3. గ్వాష్ (Gouache); 4. నీటిరంగులు (Water colours); సుద్ద, బొగ్గు (Pastel and charcoal) అను వివిధములైన సాంకేతిక విధానములు వర్ణ చిత్రములందు వ్యవహారములో నున్నవి.
కుడ్య చిత్రములు(Fresco) : గోడలపై 'ఫ్రెస్కో సెక్కో' (Fresco Secco), 'ఫ్రెస్కో బ్యూన్ ' (FrescoBuan), టెంపీరా అను రచనా శైలులను అనుసరించి గీయు వర్ణచిత్రము లన్నియు 'కుడ్య చిత్రములు' (Fresco or Mural) అనబడుచున్నవి. ఇది అతి ప్రాచీనమైన వర్ణచిత్ర విధానము. నల్ల రాయితో గాని లేక ఇసుక రాయితో గాని నిర్మింపబడిన గోడపై, ఈ దిగువ పదార్థములు మిళితమైన చెక్క సున్నముతో గాని, లేక మన్నుతో గాని గిలాబా చేయవలెను. (1) ఇసుకతో గాని, అచేతనమైన (inert) రాతిపొడితో గాని లేక వెండ్రుకలు, గడ్డి, నార మున్నగు పదార్థములతో గాని సున్నమును మిళితము చేయుట. (2) పైన పేర్కొనిన జడ పదార్థముతో మిళితమైన మట్టిగిలాబా (clay plaster) జడపదార్థములను కలుపుటచే గిలాబాయందు బిగుమాన మేర్పడి అది సంకోచము (shrink) చెందదు. 3. జిప్సమ్ (gypsum), పోజోలానిక్ (pozzolanic) అను పదార్థములతో గిలాబా చేయుట. తడిసున్నములో రంగును కలిపి చేయు గిలాబా 'ఫ్రెస్కో బ్యూన్ ' (fresco buan) అను సాంకేతిక నామమున పిలువబడుచున్నది. ఈ విధముగా చేయబడు కుడ్యాలంకారము అన్నిటికంటె శాశ్వతముగా నుండగలదు. ఈ సాంకేతిక పద్ధతి ప్రకారము ఒక్క దినములో పనిచేయ గల విస్తీర్ణము ఆఖరుసారిగా గిలాబా చేయబడి తుదిరూప మొసగబడును. దానిపై రేఖాచిత్రము (cartoon) రచింపబడి, తడి ఆరక పూర్వమే చిత్రముపై మామూలు నీటిలోగాని, సున్నపునీటిలో గాని కలిపిన రంగులు అద్దబడును. రంగులు వేయునపుడు గిలాబా తేమగా నుండుటచే చిత్రమునందు రాసాయనిక పరివర్తనము (chemical reaction) కలుగును. అందువలన రంగులన్నియు గోడయందు చక్కగా లీనమై ఎన్నటికిని మాసిపోజాలవు. లోహసంబంధమైన మన్నుతో తయారైన రంగులనే ఈ సాంకేతిక విధానమునందు ఉపయోగింపవలెను. క్రీ. శ. 14–16 శతాబ్దముల నడుమ నిర్మింపబడిన ఇటలీ కుడ్యచిత్రములును, క్రీ. శ. 16-19 శతాబ్దములనాటి రాజస్థాన్ కుడ్యచిత్రములలో అధికభాగమును ( ఇవి జయపూరు విధానమని పిలువబడును). 'ఫ్రెస్కో బ్యూన్' (Fresco Buan) అను సాంకేతిక విధానమునకు చెందియున్నవి.
ఫ్రెస్కో సెక్కో (Fresco Secco) : ఈవిధానముకూడ కుడ్య చిత్రరచనావిధానమును పోలియుండును. కాని ఈ విధానమునందు గిలాబా (సున్నము లేక మన్ను లేక జిప్సమ్)గాలికి ఆరపెట్టబడును. రంగువేయుటకుపూర్వము తొలినాటి రాత్రియంతయు గిలాబాను పూర్తిగా సున్నపు నీటితో గాని, లేక ముగ్గురాతి (baryta) నీటితో గాని తడిపెదరు. మరుసటి ఉదయము కూడ మరొక పర్యాయము అట్లే చేయవలసియుండును. ముందుగా సిద్ధమై యున్న నమూనా చిత్రమును గోడపైన ఎక్కించు విధానము, రంగులు కలుపు పద్ధతి. కుడ్య చిత్రమునకు వివిధ వర్ణములు దిద్ది తుదిరూపము తయారుచేయు విధానము - ఇది యంతయు కుడ్య చిత్ర విధానమువలెనే యుండును. కొంచెము సున్నపురాతి నీటితోగాని, ముగ్గురాతి నీటితోగాని రంగులు కలుపవలయును. ఇట్టి విధానము నవలంబించినచో చిత్రములను తయారుచేయుట సులభమగును.
కాని ప్రామాణికులైన కొందరు చిత్రకారులు ఈ విధానము కూడ 'ఫ్రెస్కో బ్యూన్' అను తరగతికి చెందిన విధానమే అని భావించుచున్నారు. ఎండిన గిలాబాపై సున్నపు నీటియందు కలిపిన వేర్వేరు రంగులతో రచింపబడు వర్ణచిత్రములు సిసలైన 'ఫ్రెస్కో సెక్కో' తరగతికి చెందినవని వీరి నమ్మకము. కుడ్య చిత్ర విధానము లన్నిటియందును సహజముగా ఇది అత్యంత సులభమైనది. ఈ విధానములో గ్రుడ్డు సొన గాని, లేక గోందుగాని, రంగులను కలుపుటకు ఉపయోగింపబడును. అంతేకాక, సాధ్యమైనన్ని ఎక్కువ సంఖ్య గల రంగులలో వేటినైనను ఈ సాంకేతిక విధానమునం దుపయోగించ వచ్చును. అజంతా, ఎల్లోరా కుడ్యచిత్రములు, మధ్యాసియా, ఈజిప్టు మొదలగు ప్రాంతములందలి సమకాలీన కుడ్యచిత్రములు ఈ విధానము ననుసరించి రూపొందించ బడినవే. చిత్రములను గీయు భూమికను (ground) తయారుచేయుట యందును, రంగులను కలుపు ద్రవపదార్థములయందును కొన్ని భేదము లుండవచ్చును. కళాకారుని అభీష్టమును బట్టియు, ఆయా పదార్థముల లభ్యా లభ్యములను బట్టియు ఈ భేదములు మారుచుండును.
తైలవర్ణచిత్రములు : ఐరోపాలో 16వ శతాబ్దినుండియు తైలవర్ణములు కళాకారులచే మిగుల అభిమానింపబడు చుండెను. అట్లే 19 వ శతాబ్దమునుండి తైలవర్ణచిత్ర విధానము ప్రపంచమున అన్నిదేశములందును ప్రాచుర్యము వహించెను. తైలవర్ణములను జిగురుపాకములో తయారుచేయుటకు, రంగులలో సరిపడునంత పరిమాణములో అవిసెనూనె, గసగసాలనూనె కలుపబడి మెత్తగా నూరబడును. తైలవర్ణచిత్రములు శీఘ్రముగా ఆరిపోవుటకు అవిసెనూనెలో కొన్ని పదార్థములు కలుపబడును. ఇండ్లకు రంగులువేయుటకును. ఇతర అలంకరణము లొన గూర్చుటకును అవసరమైన రంగుల సమ్మేళనము ప్రాచీన కర్మకారులకు (craftsmen) బాగుగా తెలియును. కాని జాన్ వాన్ ఐక్ (Jan Van Eyck) మున్నగు డచ్చి కళాకారులచే వర్ణసమ్మేళన విధానము క్రమముగా అభివృద్ధి చేయబడినది. తైలవర్ణచిత్రములు దారుఫలకములమీదను, కాన్వాసుమీదను, కార్డుబోర్డు అట్టలమీదను, కుడ్యములమీదను, ప్రాచీనకాలములో తయారుఅగుచుండెను. కాని ఈ కాలమున లోహపురేకులపైన, గాజుపలకలపైన, 'ఆస్బెస్టాస్ ' అనబడు సిమెంటు రేకులపైన గూడ తైలవర్ణ చిత్రములు రచింపబడుచున్నవి. చిత్రము చిరకాలము నిలిచియుండుటకై భూమిక (ground) మీద ముందుగా తెల్లని రంగు పూయబడును. పంది వెండ్రుకలతోగాని, బిరుసుగానుండు ఇతరములైన వెండ్రుకలతోగాని తయారు కాబడిన కుంచెలు తైలవర్ణ చిత్రములు గీయుటకు ఉపయోగింప బడుచున్నవి. ఈ కాలములో పెక్కురు కళాకారులు వివిధరకములైన నాజూకు కత్తులతో (Palette knives) రంగులను పూయుచున్నారు. ప్రాచీనకళాకారులు తమ కిష్టమైన రంగులను తామే స్వయముగా నూరుకొని వర్ణచిత్రములను గీయుటకు పూర్వము తైలమును అందులో కలిపెడివారు. కాని ఈ కాలమున తైలవర్ణములు విపణివీథియందు ట్యూబులలో సిద్ధముగా విక్రయింపబడు చున్నవి. తైలవర్ణ చిత్రములు నీటితాకిడికి చెడిపోకుండుట వలనను, కుంచెపని మూలముగా చిత్రములకు అంద చందములు చేకూరుట వలనను, ఈ విధానము ప్రజామోదమును బడసినది. తైలవర్ణ చిత్రము సిద్ధమైన పిమ్మట, దాని మీద వార్నీసు పలుచగా పూయబడును. ఇందు వలన చిత్రములు వాతావరణ ప్రభావములకు లోబడక, నునుపుగా నుండి నిగనిగ మెరయుచుండును. కాని వార్నీసువలన, రంగులలో కలియు తైలపదార్థముల వలన, కాలము గడచిన కొలది తైలవర్ణ చిత్రములు నలుపెక్క నారంభించును.
టెంపీరా (Tempera) : ఈ పదము “ఎగ్ టెంపీరా” (Egg Tempera) అనుదానికే పరిమితమై యున్నది. 15 వ లేక 16 వ శతాబ్ది వరకు ఐరోపా ఖండమందంతట ఈ వర్ణచిత్ర విధానము సామాన్యముగ వాడుక యందుండెను. చిత్రము రచింపబడు భూమిక ప్లాస్టరు (gesso) తో సిద్ధముచేయబడును. నునుపుదనము ఏర్పడుటకై జిగురు పదార్థము పులుమబడు దళసరిగుడ్డ 'ప్లాస్టరు' అని పిలువబడును. జిగురుపదార్థము ఆరిపోయి, చిత్రమును రచించుటకు తగినస్థితి ఏర్పడును. పొడిరంగులలో గ్రుడ్డు సొన కలుపగా తయారైన వర్ణములు భూమికపై వేయబడును. గ్రుడ్డు సొనలో నీటిని గూడ కలిపి పలుచన చేయబడును. రంగులు వేసిన వెంటనే చిత్రము ఆరిపోయి నీటి తాకిడిని తట్టుకొనగలిగి యుండును. కాలము గడచిన కొలది ఈ వర్ణచిత్రములు గట్టిపడును. కొండరు వర్ణ చిత్రకారులుగ్రుడ్డు నందలి ద్రవపదార్థమంతటిని రంగులు కలుపుట కుపయోగింతురు. 'టెంపీరా' వర్ణములు ప్రపంచమంతట ఆధునికులైన కళాకారులచే అభిమానింప బడుచున్నవి. ఈ వర్ణములు తైలముల కంటె ఎక్కువ నిర్మలముగ నుండి ఎక్కువకాలము మన్నును; తైలవర్ణము లందలి నునుపుదనము, నిగనిగ వీటి యందు కానరావు. ఇప్పు డీ వర్ణములు కుడ్యముల మీద, కాగితముల మీద, కాన్వాసు మీద, కార్డుబోర్డు అట్టలమీద, హార్డుబోర్డు మున్నగు భూమికల మీద చిత్రములు రచించుటకు ఉపయోగింపబడుచున్నవి.
నీటివర్ణములు : ఇదియొక సాంకేతిక వర్ణ విధానము. ఈ విధానమును బట్టి నీటిలోకరగు జిగురుపదార్థమును, గోందు పదార్థమును రంగులలో కలిపి చూర్ణము చేయుదురు. ఇది చాల పురాతనమైన వర్ణచిత్ర విధానము. ఈ కాలమున గూడ ఈ విధానము వ్యవహారముననున్నది. నీటి రంగుల విధానములో 1. శుద్ధనీటి వర్ణము (pure water colour). 2. తేనె, ఇతర జిగురు పదార్థములతో మిళితమైన “ గ్వాష్” (guache) వర్ణము అను రెండు రకములు గలవు.
శుద్ధనీటి వర్ణములు తెల్లని కాగితములపై వేయు చిత్రముల కుపయోగపడును. రంగులు మనోహరముగ కన్పట్టి అందచందములు చిందుటకై ఒక సారి వేసిన రంగులపై అవసరమగునన్ని పర్యాయములు మరల మరల రంగులు వేయబడును. 19 వ శతాబ్దమునుండి శుద్ధనీటివర్ణచిత్రములలో ప్రపంచ మంతటి యందును ఇంగ్లండు కళాకారులు విశేష ప్రతిభ నార్జించిరి. కాని ఈ నాటికిని ఇతరదేశములయందలి కొందరు కళాకారులు ఈ విధానమును అనుసరించుచున్నారు.
గ్వాష్ (Guache) : ఇది కూడ ఒకరకమైన నీటివర్ణము, ఈ విధానమందలి రంగులలో చిక్కగానుండు తెల్లని పదార్థములు కలియుటచే ఇట్టి వర్ణచిత్రములు శుద్ధనీటి వర్ణచిత్రములవలె కాక, ప్రకాశనిరోధక (opaque) లక్షణములు కలిగి మబ్బు మబ్బుగానుండును. మధ్యయుగములో ప్రపంచ మంతటి యందును తయారు కాబడిన అల్పాకార వర్ణచిత్రములలో (miniature paintings) అధికభాగము “గ్వాష్" అను సాంకేతిక విధానమునకు చెందినవే. అట్లే, ఇండియా. చైనా, జపాను, ఈజిప్టు దేశములలోని కుడ్య చిత్రములును ఈ కోవను అనుసరించినవి. ఈ విధానమునకు చెందిన చిత్రరచనము చురుకుగా జరుగదు. నీటి తాకిడివలన ఈ చిత్రము క్రమముగా చెరగిపోవుటయే ఈ విధానము నందలి లోపము.
సుద్ద రంగులు (Pastel Colours) : వివిధ వర్ణములలో సుద్ద పదార్థము కణికలుగా తయారుచేయబడు చున్నవి. గరుకుగా నుండు లేచాయరంగు కాగితముపై సుద్ద రంగులతో చిత్రములు రచించబడును. సుద్దరంగుతో వేయు చిత్రములను కళాకారులలో ఎక్కువమంది అభిమానించుట లేదు. వర్ణములయొక్క నైర్మల్యము, అంద చందములు ఈ విధానమువలన కళంక మగునని వారి అభిప్రాయము. ఈ వర్ణచిత్ర విధానము 16 వ శతాబ్ది నుండి అనుష్ఠింపబడుచున్నది. డేగల్స్, మానెట్, రెనాయిర్ ప్రభృతులు ఈ సుద్ద రంగులను సవ్యముగా నుపయోగించిరి. కాని పాఠశాలలలో ఈ విధానము జనరంజకముగ లేదు.
భూమికలు (Grounds) : వర్ణచిత్రములు రచించు ఫలకములను భూమిక లందురు. కాగితము, కాన్వాసు (నూలుగుడ్డ, సిల్కు, లేక నారవస్త్రము), దారుఫలకము, గోడ, కార్డు బోర్డు అట్ట, లోహపు రేకు, దంతము, గాజుపలక, హార్డు బోర్డు మున్నగు వాటిని సాధారణముగా వర్ణచిత్రములు రచించుటకు, భూమికలుగా నుపయోగింతురు. చిత్రము యొక్క వర్ణ సమ్మేళనము మున్నగు లక్షణములనుబట్టి, ప్రారంభములో ఈ భూమికలయొక్క ఉపరితలములపై రంగు పూతపూయబడును. సాధారణముగా కాన్వాసుమీదను, దారుఫలకములమీదను చిత్రము రచించుటకు పూర్వము తెల్లని తైలవర్ణముమ, 'గ్వాష్ ' లేక ‘టెంపీరా’ వర్ణచిత్ర విధానమందు 'గెస్సో' అను ప్లాస్టరు వర్ణమును పూయుదురు. వర్ణములు తయారుచేయుటకు పెక్కు విధానములు కలవు. కళాకారుల అభీష్టమును అనుసరించియు, చిత్రరచనా స్వభావ లక్షణములను బట్టియు పలురకములైన ఇతర వర్ణములనుగూడ ఉపయోగించెదరు. తైలవర్ణచిత్రములను కాన్వాసు, హార్డు బోర్డును, నీటివర్ణములతోను, గ్వాష్ లేక టెంపీరా వర్ణములతో వేయుచిత్రములకు కాగితములును భూమికలుగా ఉపయోగింపబడుచున్నవి. వివిధములైన సాంకేతిక చిత్రరచనములకు వివిధ తరగతుల కాగితములు వాడుకయందు గలవు. చైనీయులు, జపానీయులు బియ్యముతో తయారైన కాగితములపై చిత్రములు వేయుచున్నారు. స్వల్ప పరిమాణములలో వర్ణచిత్రములు రచించుటకు ఇండియా, పర్షియా, ఈజిప్టు మున్నగు దేశములలో గడ్డి, నార, నూలు మొదలైన పదార్థములతో చేతిమీద తయారైన కాగితములు ఉపయోగము నందున్నవి. ఈ రకమైన కాగితమునకు విశేషమైన మన్నిక కలదు. భారతదేశములో 13 వ శతాబ్దినుండి కాగితములపై రంగు చిత్రములు వేయబడు చున్నవి. ఈ వర్ణచిత్రములు వ్రాతప్రతులమీదనో, లేక 'వాస్లీస్' (waslies) అను నొకరకమైన కాగితముల మీదనో రచింపబడుచుండెను. ఈ కాగితములు ఒకదానిపై నొకటి బొత్తిగా అమర్చబడి వాటికి జిగురు పూయబడును. ఈ కాగితములను విస్తృతపరచి, వాటికి మెరుగు పెట్టిన పిమ్మట 'ఆగేట్' (agate) అను రంగురాయితో గాని, నునుపైన మరియొక రకమైన రాయితోగాని వర్ణములు దిద్దుదురు. తరువాత ఈ చిత్రము 'వాన్లీ' మీద ఎక్కించబడును. తెల్లని నీటిరంగు దానిమీద పూయబడి చిత్రములో అవసరమైన సవరణలు చేయబడును. అనంతరము ఇష్టము వచ్చిన రంగులుచిత్రమునందు ఇముడ్చబడును. నీటిరంగులతోను, గ్వాష్ అను పదార్థముతోను చిత్రించు సిల్కుభూమికపై పటిక కలుపబడిన బంకపదార్థము పలుచగా పూతపూయబడును.
రంగుపదార్దములు (pigments) : రంగుపదార్థములు సామాన్యముగా చూర్ణముల రూపములో నుండును. చిత్రరచనమున కుపయోగించుటకై ఈ చూర్ణములను తైలములోను, గ్రుడ్డుసొనలోను, గోందులోను కలిపెదరు. ఈ రంగుపదార్థములు, వాటి మూలాధారమును (source of origin) అనుసరించి ఈ క్రింది తరగతుల క్రింద విభజింపబడును.
1. లోహవర్ణములు (mineral colours); 2. రసాయన వర్ణములు (chemical colours); 3. సేంద్రియ వర్ణములు (organic colours).
లోహ వర్ణములు (Mineral Colours) : ఇవి శిలారూపములో గాని, మన్నురూపములో గాని లభించును. రంగులు వేయుటకు ఉపయోగించు రీతిగా ఈ పదార్థము మెత్తగా చూర్ణము చేయబడును. వైట్ కాలిన్ (White Kaolin), ఎల్లో ఓకర్ (Yellow Ochre), టెర్రీవర్టీ (Terreverte), బరన్ట్ టింబర్ (Burnt Timber), బరన్ట్ సీన్నా (Burnt Sienna), రా అంబర్ (Raw Umber), రా సీన్నా (Raw Sienna), ఇండియన్ రెడ్ (Indian Red), లాపిస్ - లజూలి (Lapis-Lazuli), మాలకైట్ (Malachite) అనెడి రంగులు ఈ వర్గములోనివే.
రసాయన వర్ణములు (Chemical colours) : ఈ వర్ణములు కృత్రిమముగా తయారుచేయబడును. తుత్తునాగము లేక తెల్లసీసము (Zinc or lead-white), సిందూరము, (Syngraph) మణిశిల, (Cobalt blue). విరిడియన్ (Viridian), కాడ్‌మియమ్ (Cadmium=తగరమువంటి యొక లోహము), అవ్రోలిన్ (Avrolin), వెర్డిగ్విస్ (Verdigvis), దంతము (Ivory), దీపపు మసి (Lamp-black) మున్నగు నూతనముగా కనుగొనబడిన పెక్కు వర్ణములు ఈ తరగతికి చెందినవి.
సేంద్రియవర్ణములు (Organic Colours) : ఇవి రెండురకములు (1) జంతు సంబంధములు; (2) ఉద్భిజ్జ
సంబంధములు.
జంతు సంబంధములు : ఇండియన్ ఎల్లో (Indian yellow), కార్మైన్ (Carmine = ఎర్రని చాయ), సెపియా (Sepia=గోధుమరంగు ముద్ద).
ఉద్భిజ్జ సంబంధములు : చిరువేరును పోలిన వేరు (madders), నీలి (indigo), రేవలచిన్నివంటి పదార్థము (gamboge). బంగారము, వెండి, తగరము గూడ ఆకు రూపమునను, చూర్ణము రూపమునను రంగులుగా ఉపయోగించబడును.
లోహసంబంధములైన రంగు పదార్థములు శాశ్వతముగా నిలిచి యుండగలవు. కాని సేంద్రియవర్ణములు అన్నిటికంటె తక్కువకాలము మన్నును ప్రాచీనకాలములో ఈ రంగులను కళాకారులో లేక తత్సంబంధీకులో స్వయముగా చేతితో నూరుకొనెడివారు. కాని ఆ పనిని ఈనాడు విశేషాభివృద్ధి చెందిన యంత్రములే చేయు చున్నవి. ఆ దినములలో రంగుచూర్ణమును అవసరమైన ద్రవములలో కళాకారులు కలుపుచుండెడివారు. కాని ఆధునిక కాలమునందు అట్లు కలిపి తయారుచేయబడిన వర్ణములు ట్యూబుల రూపములోను, కణికల రూపములోను, సీసాల రూపములోను విపణివీథిలో సిద్ధముచేసి అమ్మబడుచున్నవి.
ద్రవరూప సాధనములు (media) : చూర్ణ రూపములో నుండు రంగులను మిళితము చేయుటకు ద్రవపదార్థము అవసరము. తైలముతో మిళితమగు వర్ణము తైల వర్ణమనబడుచున్నది. ఈ విధానమందు సాధారణముగా ఉపయోగింపబడు అవిసె నూనెకు అనుగుణ్యముగా రంగుకూడ చిక్కగా మిళితము చేయబడును. "ఎగ్ టెంపీరా” (Egg tempera) అను విధానమునకు గ్రుడ్డుసొన, నీటిరంగులకు తుమ్మబంక (gum arabic), జిగురుగానుండు గోందుబంక (glue), పాలవిరుగుడు(cascin), సుద్ధరంగులకు (pastels) తుమ్మబంక సాధనములుగా వాడబడుచున్నవి. మైనముగూడ కొందరిచే ఉపయోగింపబడుచున్నది.
ఉపకరణములు (Tools & Equipments) :
పెన్సిలు : గ్రాఫైట్ అను నొక రకపు శిలాసంబంధమైన ఖనిజము పెన్సిళ్లు తయారుచేయుటకు ప్రధాన ద్రవ్యముగా ఉపయోగించ బడుచున్నది. గ్రాఫైటు మెత్తని బంకమన్నులో మిళితము చేయబడును. గ్రాఫైటును అధిక పరిమాణములో బంకమన్నుయందు కలిపినచో పెన్సిలు నల్లగను, మెత్తగను వ్రాయును. మన్నుభాగము ఎక్కువగానున్నచో పెన్సిలు కఠినముగను, గరుకుగను వ్రాయును. ఈ విధానమునందు గ్రాఫైటు రంగు పదార్థముగను, బంకమన్ను రంగును పాకమునకుతెచ్చు సాధనముగను ఉపయోగపడును. ఇట్లు తయారైన పాకమును మెత్తగా నూరి, పిసికి, వండి, సిద్ధముగానుంచు బడిన కొయ్య కోపులయందు ఇముడ్చబడును. పెన్సిళ్లు అతి మెత్తగా వ్రాయు '6 బి' మొదలు అతి కఠినముగా వ్రాయు '6 హెచ్' వరకు పెక్కు రకములలో తయారు చేయబడును.
బొగ్గు : 'విల్లో' (willow) అను జాతి చెట్ల యొక్క రెమ్మలను, ద్రాక్షరెమ్మలను కాల్చగా వచ్చు బొగ్గు, వర్ణచిత్రములు రచించుటకు ముందుగా తయారగు నమూనా డ్రాయింగులు గీయుటకు ముఖ్యముగా నుపయోగింప బడుచున్నది. ఈ డ్రాయింగులను గోడల మీదను, కాన్వాసు మీదను, కాగితము మీదను వేయుదురు.
రంగు బలపములు (crayons) : నల్లని బొగ్గుపదార్థము నుండి కురుచైన రంగుకణికలు తయారగును. ఎర్రని జేగురుమన్నుతో చేయబడిన కణికలు 'రక్తవర్ణపు కణికలు ' (sanguines) అనబడుచున్నవి. ఈ పదార్థము ప్రాచీన కాలము నుండి వర్ణచిత్రములు రచించుటకు ఉపయోగమున నున్నది. కణికల రూపముననే కాక, పెన్సిళ్ల రూపమున గూడ ఇవి లభ్యములగుచున్నవి. రంగు కణికలనే (coloured crayons) సుద్దకోపులని(pastels) వ్యవహరింతురు. వివిధములైన రంగులను మిళితముచేసి ఒక కణికగా రూపమిచ్చుటకై వాటి యందు అవసరమైనంత జిగురు పదార్థమును ఉపయోగింతురు.
తుడుపుడు సాధనములు (Erasers) : పెన్సిలు గుర్తులను, బొగ్గు గుర్తులను కాగితము మీదినుండి గాని, తోలు కాగితము (parchment) మీదినుండి గాని తుడిచివేయుటకు సామాన్యముగా మన మీనాడు రబ్బరు ముక్కలను ఉపయోగించుచున్నాము. ఒక శతాబ్ది క్రిందట ఇట్టి గుర్తులను మెత్తని రొట్టె (soft bread) ముక్కలతో తుడిచెడివారట. కాని 18 వ శతాబ్ది ఉత్తరార్ధములో చిత్రములను గీయుట యందు ఇట్టి పనికి రబ్బరు ఉపయోగింపబడుచు వచ్చెను.
కుంచెలు : వర్ణచిత్రములను గీయుట ప్రారంభమైనప్పటినుండి, రంగులు వేయుటకు పీచువంటి పదార్థము కుంచెగా నిర్మింపబడి ఉపయోగింపబడు చున్నది. ఈ కుంచెలు ముఖ్యముగా రెండు రకములలో దొరకుచున్నవి. తైలవర్ణ చిత్రములకు పంది వెండ్రుకలును, నీటిరంగు చిత్రములకు, టెంపీరా (tempera) వర్ణ చిత్రములకు 'నేబిల్' (Sable) అను నొక జంతువుయొక్క వెండ్రుకలును ఉపయోగింతురు. కాని కొందరు వర్ణ చిత్రకారులు, వారి వర్ణచిత్ర రచనా విధానము ననుసరించి ఈ రెండింటిలో దేనినైనను వాడెదరు. పూర్వము ఉడుత రోమములతోను, ఒక్కొక్కప్పుడు దూడ చెవి రోమములతోను లేక మేక రోమములతోను కుంచెలను తయారు చేసెడివారు. రష్యాదేశమందు లభ్యమగు 'ఎర్ర' వర్ణముగల సేబిల్ (Red Sable) జంతు రోమపు కుంచెలు ఉత్తమములైనవి. కుంచెలు రెండు విధములుగా నుండును. 1. గుండ్రనివి; 2. బల్లపరుపుగా నుండునవి. వీటి చివరి భాగములందలి వెండ్రుకల నిడివి ఉద్దిష్టములైన వర్ణ చిత్ర రచనా విధానముపై ఆధారపడి యుండును. వెండ్రుకలను విభాగములుగా చేసిన పిమ్మట కోరిన ఆకారములలో లోహపు గొట్టములయందు వాటికి తుదిరూపమివ్వబడును. కుచ్చులు కట్టబడిన ఆ వెండ్రుకలు చేతికి అమరునట్లుగా పిడిరూపములో నుండు లోహపు గొట్టమునందు రబ్బరుతోగాని, కృత్రిమ పదార్థముతోగాని తాపడము చేయబడును. దూరప్రాచ్య దేశములలో కుంచెకు వెదురు (bamboo) ముక్కను పిడిగా అమర్చెదరు. వర్ణ చిత్ర రచనమునుబట్టి కుంచెలు రకరకములుగా మారుచుండును. కొన్ని వర్ణచిత్రములకు తోడేళ్ళయొక్క, దుప్పులయొక్క రోమములతో చేయబడిన కుంచెలు ఉపయోగించబడును. చిత్రమునందు సూక్ష్మమైన వివరములను దిద్దుటకు దుప్పి రోమములతో చేయబడిన కుంచెలు ఉపయోగించబడును. కొలది రకముల కుంచెలు తప్ప తక్కినవన్నియు చివరిభాగమున మొనదేలి యుండును. ఈజిప్షియను కళాకారులు ఎర్రని పీచుతో చేయబడిన కుంచెలను ఉపయోగింతురు. భారతదేశములో తయారైన కుంచెలు ముందుగా పక్షి ఈకెలయందు చొప్పించబడి తరువాత వెదురు పుల్లలయందు తాపటము చేయబడును.
ఈనాడు కుంచెలు పెక్కురకములలో తయారగు చున్నవి. అతి నిశితమైన '00' అను సంఖ్యా చిహ్నము మొదలు గరిష్ఠప్రమాణముగల '12' వ సంఖ్యాచిహ్నము వరకు కుంచె లీనాడు లభ్యమగుచున్నవి.
రంగులు కలుపు పళ్లెరములు (Palettes) : వర్ణ చిత్ర కారుల యొక్క సాధన సామగ్రిలో రంగులు కలుపు పళ్లెరము కూడ ముఖ్యమగువాటిలో నొకటి. సాధారణముగా ఈ పళ్లెరము ఒక్క చేతితో పట్టుకొనుటకు అనుకూలముగా నుండును. దృఢమైన కొయ్యతో గాని, పోర్సిలెయిన్‌తో గాని లేక ఎనామిలు లోహముతో గాని ఈ పళ్లెరము నిర్మించబడును. ఇట్టి పళ్లెరములను సాధారణముగా వర్ణచిత్రకారులే ఉపయోగింతురు. నీటిరంగులను కలుపుటకు ఏటవాలు గిన్నెలు, సాసర్లు, ప్లేట్లు (slant cups, saucers, and plates) ఉపయోగింపబడును. ఇవి పోర్సిలెయినుతో గాని లేక గాజుతోగాని తయారగును. చైనావారు, జపానువారు 'చీనాసిరా' ను రుద్దుటకు ఏటవాలైన రాతి ఫలకములను ఉపయోగించి యుండిరి. ఇవిగాక పెక్కు రకముల ప్లేటులు కూడ ఉపయోగమున నుండెడివి.
రంగులు కలుపు కత్తి (Palette Knife) : ఎటువంచిన అటు వంగు కత్తి, రంగులు కలుపుటకు ఉపయోగించబడును. ఇప్పుడు అనేకవిధములైన కత్తులు సందర్భానుసారముగ కాన్వాసుమీద గాని లేక కాగితముమీద గాని వర్ణలేపనమునకు ఉపయోగించబడుచున్నవి.
కలము, సిరా : వ్రాయుట కుపయోగించు పాళీవలె, ఈ సాధనమును రంగులు వేయుటకు ప్రాచీనకాలము నుండి వర్ణచిత్రకారు లుపయోగించుచుండిరి. ముందుగా చిత్రముల నమూనాలను తయారుచేసి, అనంతరము సిరాతో వాటిని తీర్చిదిద్ది తుదిరూప మిచ్చుటకు రక రకములైన మొనలుగల పాళీలతో కలము లీనాడు ఉపయోగింపబడు చున్నవి.
ఉల్లిపొర కాగితము (Tracing Paper) : ముందుగా తయారైన నమూనాలను కాగితముపై గాని, కాన్వాసుపై గాని ఎక్కించుటకు ఉల్లిపొర కాగితము అవసరమగును. ఆ కాగితము లీనాడు చుట్టల రూపములోను, విస్తృతములైన కాగితముల రూపములోను తయారగుచున్నవి.
చిత్తరువులను అమర్చు చట్రము (Easel) : ఇది బిగువుగా నిర్మింపబడు నొక మూడు కాళ్ల చట్రము. వర్ణ చిత్రమును వ్రాయునపుడు, అది ఈ చట్రమునం దమర్చబడి నిట్రముగ నిలబెట్టి యుంచబడును. ఈ సాధనము ఐరోపా ఖండములో సాధారణముగా వాడుకయం దున్నది. ప్రాగ్దేశములలో కళాకారులు ఎల్లప్పుడును కూర్చుండియే చిత్రములు రచింతురు. చిత్తరువు గీయు కాగితమును సమమైన కొయ్యచట్రములో పరచి, దానిని నేలపై పరుండబెట్టి గాని, లేక మేజాబల్లకు ఏటవాలుగా నిలబెట్టి గాని ప్రాగ్దేశముల కళాకారులు తమ వ్యాసంగమును కొనసాగింతురు. కాని ఈ కాలమున వర్ణచిత్రములు విస్తృతమైన పరిమాణములో రచించబడుట వలన, పైన ఉదహరించిన ఏటవాలు చట్రములే (easels)అవసరమగుచున్నవి.
డ్రాయింగు బోర్డు (Drawing Board) : డ్రాయింగు బోర్డు దేవదారు కొయ్యతో చిత్రము యొక్క పరిమాణము ననుసరించి వివిధములైన సైజులలో తయారుచేయ బడును. చిత్రమును రచించునపుడు కాగితమును గాని, గుడ్డను గాని బల్లపైన సాగదీసి నలువైపుల సూదులు గ్రుచ్చెదరు. ప్రాచీనకాలమునుండి సాధారణమైన చిత్రములను, వర్ణచిత్రములను రచించుటకు ఏదో యొక రకమైన డ్రాయింగు బోర్డులు ఉపయోగమున నున్నవి.
స్ట్రెచర్ (Stretcher) : ఇది యొక కొయ్యచట్రము. దీనికి కాన్వాసు అల్లబడెడిది. చిత్రమును గీయునప్పుడు ఈ కాన్వాసుముక్క చట్రములో అమర్చబడి, నలుప్రక్కల తాపటము చేయబడెడిది. కాని 18 వ శతాబ్దము నుండి చిత్రముపై రంగులు వేయుటకు పూర్వము విడిగా నుండు కాన్వాసు ముక్కను చట్రముపై నాల్గు ప్రక్కల సాగదీసి మేకులు కొట్టు విధానము ఆచరణమునం దుండెను.
చిత్ర నిర్మాతల కుపయోగపడు పరికరముల సంఖ్య పలువిధములుగా పెరుగుటచేతను, నూతనమైన సాంకేతిక విధానములు అభివృద్ధిచెందుటచేతను, కళాకారునియొక్క స్టుడియో సాధన సామగ్రి ఆధునికయుగములో అంతకంతకు అధికమగుచున్నది. పైన వివరించిన పరికరములు అట్టి సాధన సామగ్రిలో ముఖ్యములైనవి.
జ. మి.