సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చిత్తూరు నాగయ్య
చిత్తూరు వి. నాగయ్య : తెలుగు సినిమా కళాలక్ష్మికి గత రెండున్నర దశాబ్దముల నుండి పాదపూజ సలిపి, కర్పూరహారతులు పట్టిన మహానటులలో చిత్తూరు నాగయ్య అగ్రతాంబూలమునకు అర్హుడనుటలో అతిశయోక్తి యుండబోదు.
శ్రీ నాగయ్య 1907 ఏప్రిల్ 12 వ తేదీన గుంటూరు మండలము నందలి రేపల్లెలో జన్మించిరి. ఆయన తండ్రి వి. ఆర్. శర్మ రేపల్లెయందు కొంతకాలము తహసీల్‌దారుగా పనిచేసిరి. శర్మ సంగీతమునందు చక్కని అభిరుచి గలిగి యుండెను. వయొలిన్ వాయించుచు వారు తీరిక సమయములలో నాదబ్రహ్మమును ఉపాసించెడి వారు. ఆ నాదమే పసితనమున నున్న నాగయ్య చెవులలో పడి ఆయనకు సంగీత కళాపిపాసను చేకూర్చెను.
నాగయ్య అయిదు నెలల పసికందుగా నున్నప్పుడు, ఆతని జీవితములో ఒక చారిత్రక సంఘటన జరిగెను. తల్లి వెంకటలక్ష్మమ్మ పసిబిడ్డను ఒంటరిగా తొట్టెలో పండు
చిత్రము - 191
పటము - 1
మహానటుడు చిత్తూరు నాగయ్య
కొనబెట్టి మంచినీరు కొరకై సమీపమున నున్న బావికి వెళ్ళెను. మంచినీరుతో తిరిగి ఇంటిలో అడుగుపెట్టిన తల్లి, తన బిడ్డమీద ఒక నల్లని నాగుబాము పడగవిప్పి ఆడుట చూచెను. ఒకక్షణము వరకు ఆమె గుండెలో గుండె లేకుండెను. భక్తురాలగుటచే, ఆమె మరుక్షణములో తేరుకొని నాగేంద్రుని సమక్షమున ధూప, దీప, నైవేద్యాదు లుంచెను. అనంతరం మా నాగుబాము నైవేద్యమును స్పృశించి వచ్చిన మార్గముననే బయటకు సాగిపోయెను. భర్త ఇంటికివచ్చిన వెంటనే ఆమె ఈ యుదంతమును అతని కెరుకపరచెను. దంపతు లిరువురు నాగప్రతిష్ఠ జరపి, పిల్లవానికి 'నాగయ్య' యని నామకరణము చేసిరి.
అయిదేళ్ళ వయస్సొచ్చిన నాగయ్యకు ఇతర విద్యలతోపాటు సంగీతమునుగూడ తండ్రి స్వయముగ నేర్పెను. పాఠశాల చదువుమాట అటుండనిచ్చి, నాగయ్య ఎక్కడెక్కడ సంగీతకచేరీలు జరుగునో అక్కడక్కడకు పరుగెత్తెడివాడు. ఒక దూరగ్రామములో మహావిద్వాంసు డొకడు సంగీతము పాడుచుండెనని విని, నాగయ్య తన చెవులపోగులను తెగనమ్ముకొని, వాటివలన వచ్చిన డబ్బుతో రై లెక్కి, ఆ యూరికి వెళ్ళి, ఆ విద్వాంసుని సంగీతమును విని ఇంటికి మరలివచ్చెను. పుత్రుని సంగీత కళాతృష్ణను అవగాహన చేసికొన్నతండ్రి, సంగీతవిద్వాంసుడయిన చిత్తూరు పేరయ్యపిళ్ళేకు నాగయ్యను అప్పగించెను.
నాగయ్య దృష్టి కేవల సంగీతముపైననే కాక, నాటకములమీద కూడ ప్రసరించెను. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించు నాటకములలో ఆతడు పాల్గొని పెక్కు పారితోషికములను పొందెను. ప్రహ్లాదుని భూమికలో ఆయన తన్మయత్వమును పొంది, ప్రేక్షకులను తన్మయులుగా చేయగలిగెను.
ఒకసారి సంగీత మహావిద్వాంసు లయిన పుష్పవనం అయ్యర్, గోవిందస్వామిపిళ్ళేల సంగీతకచేరీకి నాగయ్య వెళ్ళుట తటస్థించెను. కచేరీ పూర్తయిన వెంటనే ప్రేక్షకులు వారి వారి ఇండ్లకు వెడలిపోయిరి. కాని నాగయ్య అట్లే ఉండిపోయి, పుష్పవనం అయ్యరు ముఖమువంక ఆదేపనిగా చూడసాగెను. తనను తదేక ధ్యానముతో చూచుచున్న కుఱ్ఱవానిని అయ్యరు: "ఏమిట్రా అబ్బాయి నీ పేరు ?" అని ప్రశ్నించెనట. కుఱ్ఱవాడు తన అసలు పేరు చెప్పక, నాటకములలో తన అభిమాన పాత్రను స్మరించి, “నా పేరు ప్రహ్లాదుడు" అని జవాబిచ్చెనట. ఈ కుఱ్ఱవా డెవరో కళాపిపాసి అని గ్రహించిన పుష్పవనం అయ్యరు, “నీ కేమైనా సంగీతము వచ్చునా?" అని ప్రశ్నించగా, “ఓ! వచ్చును!” అని పిల్లవాడు బదులు పలికెనట ! వెంటనే అచ్చట నున్న గోవిందస్వామి పిళ్ళె వయొలిన్ తీసికొని వాయించుచుండగా, కుఱ్ఱవాడు సుమారు రెండుగంటల పర్యంతము ప్రహ్లాదుని పాత్రలో తాను పాడిన పాటలు, పద్యములు కంఠమెత్తి పాడెను. అయ్యరుయొక్క ఆనందమునకు అవధులు లేకపోయెను తన చల్లని చేతితో ఆయన నాగయ్యమీద పుష్పవృష్టిని కురిపించి, "భవిష్యత్తులో నీవు చక్కని కళాకారుడ వయ్యెదవు!" అని ఆశీర్వదించెను. నాగయ్య ఈ సంఘటనను ఇప్పటికిని తన స్మృతిపథమునకు తెచ్చుకొని ఆత్మానందము ననుభవించుచుండును.
నాగయ్య జీవితములో మరపురాని మరియొక సంఘటన, విఖ్యాత నటుడు ఎస్. జి. కిట్టప్పయొక్క దర్శనము. 'దశావతారములు' అను నాటక మునందు శ్రీ కిట్టప్ప కృష్ణుని భూమిక దాల్చి ప్రేక్షకుల హృదయమును చూరగొనెడివాడు. నాగయ్య కృష్ణపాత్రనుచూచి తన్మయుడై కిట్టప్పను సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మగా భావించి, రంగస్థల మెక్కి, ఆతనిముందు కొబ్బరికాయ కొట్టి, కర్పూరహారతి వెలిగించి, సాష్టాంగ దండప్రణామ మొనరించెను. ఇది చూచి ప్రేక్షకులలో పెక్కురు వింతగా నవ్వసాగిరి. ప్రాజ్ఞులు కొందరు పిల్లవాని భక్తి తత్పరతను ప్రశం
చిత్రము - 192
పటము - 2
(దశరథ పాత్రధారి)
కంచిలో నయనపిళ్లె అను సంగీతవిద్వాంసు డుండెను. ఆతనియొక్క ఖ్యాతిని నాగయ్య విని, ఆయన యొద్దకు వెళ్ళి, సంగీతమందు కొన్ని వత్సరములు ఆతని శిష్యరికము సలిపెను. తిరిగి చిత్తూరు వచ్చి పాఠశాలయందు ప్రవేశించి స్కూల్ ఫైనల్ పరీక్షయం దుత్తీర్ణుడయ్యెను. అనంతర మాతడు మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో కొంతకాలము చదివి, విద్యకు స్వస్తిజెప్పెను. కళాశాలలో విద్య నభ్యసించుచున్నప్పుడు గూడ, నాగయ్య నాటకకళామతల్లి శుశ్రూషను వదలలేదు. 'శకుంతల' నాటక మును ఆంగ్లభాషలో ప్రదర్శించి అతడు ప్రేక్షకుల ప్రశంసల నందుకొనెను.
మద్రాసునుండి చిత్తూరునకు తిరిగి వచ్చిన నాగయ్య రకరకముల ఉద్యోగములను చవిజూచెను. కళాకారునకు ఇట్టి యుద్యోగము లెట్లు రుచింపగలవు? తుట్టతుద కాతడు చిత్తూరు జిల్లాబోర్డు కార్యాలయమందు ఉద్యోగములో ప్రవేశింప గల్గెను. అచ్చట వారికి ఒకవిధముగా ఆత్మశాంతి లభించెను. చిత్తూరు 'రామవిలాససభ ' నాగయ్య యందుగల 'నటునిని' బహిర్గతము చేసెను.
నాగయ్య ప్రప్రథమములో సావిత్రి, దమయంతి, చిత్రాంగి మొదలయిన స్త్రీ వేషములు ధరించెడివాడు. దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు ఆతని స్త్రీభూమికలను చూచి ముగ్ధుడై ఆతనికి రంగస్థలముపై బంగారు పతకమును బహూకరించిరి.
నాటకకళాక్షేత్రములో తిరుగాడుతున్న నాగయ్యకు ఆర్. బి. రామకృష్ణరాజు, బళ్ళారి రాఘవాచారి, పర్వతనేని రామచంద్రారెడ్డి మొదలయిన కళాకారులతో పరిచయము కల్గెను. వారితో కలిసి ఆయన పెక్కు ప్రదర్శనము లిచ్చెను. నాటక రంగస్థలముపై 'కబీరు ' ఆయన అభిమానపాత్ర, కాని ఆతడు కిరాయిరూపములో ఏ పాత్ర పోషణమునకును దిగలేదన్న సత్యమును స్మరింప నగును. చిత్తూరు 'రామవిలాస సభ'లో ఆయన నటుడుగనే కాక సంగీత దర్శకుడుగ కూడ పనిచేసెను. నాగయ్య కర్ణాటక సంగీతమందేకాక హిందూస్థానీ సంగీతమందు కూడ మంచి పాండిత్యమును సంపాదింపగల్గెను. సుప్రసిద్ధ హిందూస్థానీ సంగీతగాయకుడు అబ్దుల్ ఫయాజ్ ఖాన్ ఆతని ప్రత్యక్ష గురుపుంగవులు.
కళాక్షేత్రమునకు తన జీవితమును అంకితము చేసిన నాగయ్యను కొన్ని గృహచ్ఛిద్రములు చుట్టుముట్టెను. ఒకవంక తండ్రి పరమపదించెను; మరొక వంక అర్ధాంగియు, తన చిన్నపుత్రికయు కాలధర్మము చెందిరి. తిరిగి ఆతడు ద్వితీయ కళత్రమును గైకొనెను. ఆమె గూడ కొద్దికాలమునకే దూరమయ్యెను. జీవితములో ఆతనికి నిరాశ, నిస్పృహలు వెన్నాడుట మొదలిడెను.
చిత్తూరు వదలి నాగయ్య ఆత్మశాంతికొరకై ఎక్కడెక్కడో తిరిగెను. పెక్కు క్షేత్రములు దర్శించెను. సన్యాసాశ్రమ స్వీకారమునకై గూడ అతడు సిద్ధమయ్యెను. 'కళాక్షేత్రమే నీ కర్మరంగము; దానిని వదలి
చిత్రము - 193
పటము - 3
(భక్త రఘునాథ్‌లో)
అనతికాలములో ఆతనికి సినిమారంగపు కవాటములు తెరువబడినవి. 'గృహలక్ష్మి' చిత్రములో ఆతడు పాడిన 'కల్లు మానండోయ్ బాబూ-కళ్ళు తెరవండోయ్' అనెడి పాట ఇప్పటికిని ఆంధ్ర సినిమా ప్రేక్షకుల చెవులలో గింగురు మనుచునే యుండును. అనంతరము ఆయన 'వాహిని' శిబిరములో చేరి చరిత్రను సృష్టించెను. 'వందేమాతరం', 'సుమంగళి', 'దేవత', 'స్వర్గసీమ' మొదలయిన చిత్రములలో నాగయ్య ప్రధానపాత్రలు ధరించడమేకాక, వాటికి సంగీతదర్శకుడుగా పనిచేసెను. నాగయ్య, వాహిని పరస్పరము ఉద్దీపితులై ఆంధ్రదేశ సినిమా కళారంగమును ప్రభావితము గావించిరి.
పోతన, వేమన, త్యాగయ్య పాత్రలు నాగయ్య మూర్తిని ఆంధ్రసినిమా ప్రేక్షకుల హృదయ ఫలకముల మీద అచ్చు గ్రుద్దినవి. ఆతని నటనకును, అమరగానమునకును ముగ్ధుడయి, 'ఫిల్ము ఇండియా' పత్రిక సంపాదకుడు బాబూరావుపటేల్ నాగయ్యను 'ఆంధ్ర పాల్ ముని' అని ఉగ్గడించెను. అశేష ఆంధ్ర ప్రజానీకము ఆతనికి అప్పటినుండి బ్రహ్మరథము పట్టుచున్నది. 'నటసమ్రాట్ ' 'నట శేఖర' మున్నగు బిరుదములు ఆతనికి ప్రదానము చేయబడినవి. బహుముఖప్రజ్ఞ కలవాడగుటచే నాగయ్య తాను ధరించిన ప్రతిభూమిక యందును హిమగిరి శృంగము నెక్కగల్గెను.
తెలుగులోనే కాక నాగయ్యకు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో చక్కని ప్రవేశమున్నది. ఇంతవరకు వివిధ భాషలలో నిర్మింపబడిన సుమారు నూటయేబది చిత్రములలో ఆతడు కనిపించియుండును.
నటుడుగను, సంగీత దర్శకుడుగ'నే కాక నాగయ్య దర్శకత్వములో కూడ అశేష ప్రతిభ నార్జించెను. 'త్యాగయ్య', 'నాయిల్లు' అను చిత్రముల యందలి ప్రతి 'ఫ్రేము' అద్భుతమైన ఆతని “వీక్షణాశక్తికి”ని, సినిమా సాంకేతిక శాస్త్రపరిజ్ఞానమునకును గొప్ప సాక్ష్యమివ్వ గలదు.
నాగయ్యకు ఆంధ్ర దేశములోని వివిధ కేంద్రములలో పెక్కు సన్మానపత్రములును, పారితోషికములును ముట్టినవి. మహానటుడుగను, గొప్ప గాయకుడుగను, ప్రతిభావంతుడయిన దర్శకుడుగను ఆతడు తెలుగు ప్రజల హృదయపీఠిని అధిష్ఠించడమే ఇందుకు కారణము.
నాగయ్య వితరణఖని యనుటలో సందేహములేదు . ఆంధ్రదేశములోని వివిధ సంస్థలకు, వ్యక్తులకు ఉదారబుద్ధితో ఆతడు అధిక ధనమును దానము చేసెను. ఆతని కుడిచేయి ఎవరికి ఏ సమయములో ఎంత దానమిచ్చెనో ఆతని ఎడమచేతికే ఎంతమాత్రమును తెలియదు.
నాగయ్య సంగీతములో ప్రత్యేకమయిన బాణికి ప్రాణప్రతిష్ఠ సలిపినవాడు. ఆతని పాట గంగానిర్ఝరి వంటిది. ఆతని సంగీతములో భావ, రాగ, తాళములు సమైక్యము చెంది, శ్రోతలమీద తమ సమ్మోహనాస్త్రమును వదలును. ఆతని జీవితమునకు చరితార్థత చేకూర్చిన "త్యాగయ్య" సినిమా చిత్రము 'యునెస్కో' (United Nations Economic, Social and Cultural Organization) ఆధ్వర్యవమున త్వరలో పారిస్ నగరమందు జరుగబోవు 'అంతర్జాతీయ సంగీతోత్సవము'లో పాల్గొనబోవుచున్నది. ఆతడు ఇప్పుడు నిర్మించుచున్న 'రామదాసు' చిత్రము తెలుగు సినిమా చరిత్రలో నూతనాధ్యాయమును ప్రారంభింపనున్నది.
గత రెండున్నర దశాబ్దములు నాగయ్య నటలోకమున మకుటములేని మహారాజుగా పరిగణింపబడెను. ఆంధ్రప్రదేశ్ సంగీత, నాటక అకాడమీ వారును, మద్రాసు సంగీత నాటక అకాడమీ వారును ఇతనికి తమ సంస్థలలో సభ్యత్వమిచ్చి సముచితరీతిని సత్కరించిరి. వరుసగా పదేళ్ళపాటు ఇతడు తెలుగు, తమిళ భాషలలో ఉత్తమనటుడుగా “మద్రాసు ఫిల్ముఫాన్స్ అసోసియేషన్" చేతను, ఇతర సంస్థలచేతను ఎన్నుకొనబడెను. కొలది సంవత్సరముల క్రిందట నాగయ్యను ఉత్తమనటునిగా పేర్కొని, మద్రాసు ప్రభుత్వము ఆతనికి నిండుసభలో పారితోషికమును అందజేసెను.
వృద్ధాప్యచ్ఛాయలు క్రమముగా ఆతనిని అలముకొనుటచే, నాగయ్య ఈనాడు కొన్ని చిత్రములలో ప్రధాన భూమికలను కాక చిన్న చిన్న పాత్రలను ధరించుట సంభవించుచున్నది. ఎట్టి చిన్న పాత్ర అయినను, ఆతడు దానిలో విద్యుల్లతవలె ఈనాటికిని మెరయుచుండుటయే విశిష్టమయిన విషయము.
ఆతని జీవిత నిఘంటువులో 'వ్యాపారము' క్రొత్త పదము. సినిమా విశిష్టతతో కూడిన ఒక కళ యనియు, దాని ద్వారా జీవిత పరమార్థమును సాధించి, మానవ సంఘమునకు సేవ చేయుటకు వీలులేకపోలేదనియు ఆతని దృఢ విశ్వాసము. తన జీవిత పథములో ఎన్ని అవాంతరములు సంభవించినను మేరుపర్వతమువలె చలించక పరమవిశ్వాసముతో ఈనాటికిని ఇతడు ముందడుగు వేయ గల్గుచున్నాడు. నిజమయిన కళాకారులందరిలో నాగయ్య ఆదర్శప్రాయుడనుటలో అత్యుక్తి యుండబోదు.
ఇ. వెం.