Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చిత్తూరు జిల్లా

వికీసోర్స్ నుండి

చిత్తూరుజిల్లా :

ఉనికి - ఎల్లలు : చిత్తూరు జిల్లా 12° 37'-14.0' ఉత్తర అక్షాంశముల మధ్యను, 78° 3' - 79° 55' తూర్పు రేఖాంశములమధ్య నున్నది. ఇది ఆంధ్రప్రదేశ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా కేంద్రము చిత్తూరుపురము.

చిత్తూరు జిల్లాకు ఉత్తరమున అనంతపురము, కడప, నెల్లూరు జిల్లాలును - తూర్పున చెంగల్పట్టు జిల్లాయు - దక్షిణమున ఉత్తరార్కాటు జిల్లాయు - పడమట మైసూరు రాష్ట్రమును ఎల్లలుగా నున్నవి.

ఈ జిల్లా భాగము ఒకప్పుడు ఉత్తరార్కాటు జిల్లాకు చెందియుండెను. 1911 లో కొంతభాగమును విడదీసి, కొంతభాగమును చేర్చగా చిత్తూరుజిల్లా క్రొత్తగా ఏర్పాటయ్యెను. ఈ జిల్లా మొదట మద్రాసు రాజధానిలో నుండెను. 1953 లో ఆంధ్రరాష్ట్రము క్రొత్తగా ఏర్పాటు అయినప్పుడు, ఆంధ్రరాష్ట్రములోని భాగ మయ్యెను. 1956 లో ఆంధ్రప్రదేశ రాష్ట్రము భాషాధారముగా ఏర్పడినపుడు ఇది ఆంధ్రప్రదేశ రాష్ట్రములోని 20 జిల్లాలలో నొకటి యయ్యెను. పటాస్కరుతీర్పు ననుసరించి చిత్తూరు జిల్లా సరిహద్దులు తిరిగి మారినవి. (1.4-1960)

ఈ జిల్లాలో 1951 జనాభాలెక్కల ప్రకారము 9 తాలూకాలుండెను. 1951 లో నుండి తిరుత్తని తాలూకా ఇప్పుడులేదు. కాగా బంగారుపాలెం, కుప్పం, సత్యవీడు, అను మూడు తాలూకాలు క్రొత్తగా ఏర్పడినవి (1–4–1960). 1951 లో జనాభా 18,10,377 మంది. 1961 లో జనాభా 19,13,169 మంది.

చిత్తూరుజిల్లా అంకెలు :

1. విస్తీర్ణము (1951) 5931 చ. మై
2. తాలూకాలు (1961) 11
3. గ్రామములు (1961) 2202
4. పురములు (1961) 13
5. జనాభా (1961) 19,13,169
పురుషులు 9,77,809
స్త్రీలు 9,35,360
6. గ్రామవాసులు 16,93,170
పురుషులు 8,64,295
స్త్రీలు 8,28,875
7. పురవాసులు 2,19,999
పురుషులు 1,13,514
స్త్రీలు 1,06,485
8. స్త్రీపురుషుల నిష్పత్తి
పురుషులు 1000
స్త్రీలు 957
9. జనసాంద్రత 333
10. అక్షరాస్యులు 3,93,639
పురుషులు 3,04,117
స్త్రీలు 89,522
11. అక్షరాస్యులు శాతము 20.58
పురుషులు శాతము 31.10
స్త్రీలు శాతము 9.57
12. అక్షరాస్యులు, గ్రామవాసులు 2,95,581
పురుషులు 2,38,712
స్త్రీలు 56,869
13. అక్షరాస్యులు, పురవాసులు 98,058
పురుషులు 65,405
స్త్రీలు 32,653

పటాస్కరు తీర్పు ప్రకారము 1960 లో చిత్తూరు జిల్లాలోని పుత్తూరు తాలూకానుండి 1 గ్రామము, తిరుత్తని తాలూకానుండి 288 గ్రామములు, చిత్తూరు తాలూకానుండి 29 గ్రామములు - మొత్తము 318 గ్రామములు మద్రాసు రాష్ట్రమునకు మార్పబడినవి. ఈ 318 గ్రామముల విస్తీర్ణము 405.15 చ. మైళ్ళు; జనాభా 2,40,357. ఇందుకు బదులుగా మద్రాసురాష్ట్రములోని పొన్నేరి తాలూకానుండి 72 గ్రామములు - తిరువళ్లూరు తాలూకానుండి 76 గ్రామములు - కృష్ణగిరి తాలూకానుండి 3 గ్రామములు, మొత్తము 151 గ్రామములు చిత్తూరు జిల్లాకు మార్పబడినవి. ఈ 151 గ్రామముల విస్తీర్ణము 326.39 చ.మై. జనాభా 95,546.

ఈ మార్పులచేర్పుల కారణమున 1961 జనాభా లెక్కల ప్రకారము చిత్తూరు, బంగారుపాలెము, పలమనేరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లి, వాయల్పాడు, చంద్రగిరి, కాళహస్తి, సత్యవీడు, పుత్తూరు అను 11 తాలూకాలు ఈ జిల్లాలో ఇప్పుడు కలవు (1961).

తాలూకాలు :

1. చిత్తూరు తాలూకా :

విస్తీర్ణము (1951) 778 చ. మై,
గ్రామములు (1951) 374
పురము 1
జనాభా (1961) 2,29,090
పురుషులు 1,16,218
స్త్రీలు 1,12,872
గ్రామవాసులు (1961) 1,81,206
పురుషులు 91,818
స్త్రీలు 89,388
పురవాసులు (1961) 47,884
పురుషులు 24,400
స్త్రీలు 23,484
అక్షరాస్యులు 61,348
పురుషులు 45,340
స్త్రీలు 16,008

2. బంగారుపాలెము తాలూకా :

విస్తీర్ణము -
గ్రామములు -
పురములు లేవు
జనాభా (1961) 1,11,439
పురుషులు 56,832
స్త్రీలు 54,607
గ్రామవాసులు (1961) 1,11,439
పురుషులు 56,837
స్త్రీలు 54,602
పురవాసులు (1961) లేరు
అక్షరాస్యులు 23,666
పురుషులు 18,704
స్త్రీలు 4,962

3. పలమనేరు తాలూకా :

విస్తీర్ణము (1951) 720 చ. మై
గ్రామములు (1951) 324
పురము 1
జనాభా (1961) 1,11,204
పురుషులు 56,668
స్త్రీలు 54,536
గ్రామవాసులు (1961) 1,01,339
పురుషులు 51,710
స్త్రీలు 49,629
పురవాసులు 9,865
పురుషులు 4,958
స్త్రీలు 4,907
అక్షరాస్యులు 18,974
పురుషులు 14,922
స్త్రీలు 4,052

4. కుప్పం తాలూకా :

విస్తీర్ణము ?
గ్రామములు ?
పురము 1
జనాభా (1961) 97,022
పురుషులు 48,965
స్త్రీలు 48,057
గ్రామవాసులు 87,746
పురుషులు 44,244
స్త్రీలు 43,502
పురవాసులు 9,276
పురుషులు 4,721
స్త్రీలు 4,555
అక్షరాస్యులు 13,600
పురుషులు 10,925
స్త్రీలు 2,675

5. పుంగనూరు తాలూకా :

విస్తీర్ణము (1951) 648 చ. మై
గ్రామములు(1951) 105
పురము 1
జనాభా (1961) 1,68,277
పురుషులు 85,754
స్త్రీలు 82,523
గ్రామవాసులు 1,54,475
పురుషులు 78,839
స్త్రీలు 75,636
పురవాసులు 13,802
పురుషులు 6,915
స్త్రీలు 6,887
అక్షరాస్యులు 28,632
పురుషులు 22,660
స్త్రీలు 5,972

6. మదనపల్లి తాలూకా :

విస్తీర్ణము (1951) 836 చ. మై.
గ్రామసంఖ్య (1951) 112
పురము 1
జనాభా (1961) 2,27,810
పురుషులు 1,17,820
స్త్రీలు 1,09,990
గ్రామవాసులు 2,03,409
పురుషులు 1,05,033
స్త్రీలు 98,376
పురవాసులు 24,401
పురుషులు 12,787
స్త్రీలు 11,614
అక్షరాస్యులు 40,060
పురుషులు 31,074
స్త్రీలు 8,986


7. వాయల్పాడు తాలూకా :

విస్తీర్ణము 802 చ. మై.
గ్రామసంఖ్య 126
పురము 1
జనాభా (1961) 2,14,157
పురుషులు 1,10,436
స్త్రీలు 1,03,721
గ్రామవాసులు 2,06,140
పురుషులు 1,06,261
స్త్రీలు 99,879
పురవాసులు 8,017
పురుషులు 4,175
స్త్రీలు 3,842
అక్షరాస్యులు 42,728
పురుషులు 33,874
స్త్రీలు 8,854

8. చంద్రగిరి తాలూకా :

విస్తీర్ణము (1951) 548 చ. మై.
గ్రామములు(1951) 265
పురములు (1961) 4
జనాభా (1961) 1,99,677
పురుషులు 1,03,482
స్త్రీలు 96,195
గ్రామవాసులు 1,37,830
పురుషులు 70,632
స్త్రీలు 67,198
పురవాసులు 61,847
పురుషులు 32,850
స్త్రీలు 28,997
అక్షరాస్యులు 61,338
పురుషులు 45,062
స్త్రీలు 16.276

9. కాళహస్తి తాలూకా :

విస్తీర్ణము (1951) 615 చ. మై.
గ్రామములు (1951) 383
పురము (1961) 1
జనాభా (1961) 1,65,575
పురుషులు 84,565
స్త్రీలు 81,010
గ్రామ వాసులు (1961) 1,39,107
పురుషులు 71,218
స్త్రీలు 67,889
పురవాసులు (1961) 26,468
పురుషులు 13,347
స్త్రీలు 13,121
అక్షరాస్యులు (1961) 32,117
పురుషులు 24,710
స్త్రీలు 7,417

10. సత్యవీడు తాలూకా :

విస్తీర్ణము ?
గ్రామములు ?
పురములు (1961) లేవు
జనాభా (1961) 1,42,398
పురుషులు 72,056
స్త్రీలు 70.342
గ్రామవాసులు 1,42,398
పురుషులు 72,056
స్త్రీలు 70,342
అక్షరాస్యులు (1961) 21,469
పురుషులు 17,378
స్త్రీలు 4,091

11. పుత్తూరు తాలూకా :

విస్తీర్ణము (1951) 564 చ. మై
గ్రామములు (1951) 170
పురములు (1961) 2
జనాభా (1961) 2,46,520
పురుషులు 1,25,013
స్త్రీలు 1,21,507
గ్రామవాసులు (1961) 2,28,081
పురుషులు 1,15,653
స్త్రీలు 1,12,428
పురవాసులు 18,439
పురుషులు 9,360
స్త్రీలు 9,079
అక్షరాస్యులు (1961) 49,697
పురుషులు 39,468
స్త్రీలు 10,229

పురములు 13 (1961)

1. చిత్తూరు :

జనాభా 47,884
పురుషులు 24,440
స్త్రీలు 23,484
అక్షరాస్యులు 23,595
పురుషులు 15,006
స్త్రీలు 8,589

చిత్తూరుపురము జిల్లాకును, తాలూకాకును ప్రధాన కేంద్రము.

2. తిరుపతి :

జనాభా 35,836
పురుషులు 19,258
స్త్రీలు 16,578
అక్షరాస్యులు 19,825
పురుషులు 13,561
స్త్రీలు 6,264

3. కాళహస్తి :

జనాభా 26,468
పురుషులు 13,347
స్త్రీలు 13,121
అక్షరాస్యులు 10,500
పురుషులు 7,222
స్త్రీలు 3,278
4. నగరి :
జనాభా 8,014
పురుషులు 4,069
స్త్రీలు 3,945
అక్షరాస్యులు 2,895
పురుషులు 2,057
స్త్రీలు 838

5. పుంగనూరు :

జనాభా 13,802
పురుషులు 6,915
స్త్రీలు 6,887
అక్షరాస్యులు 4,437
పురుషులు 2,890
స్త్రీలు 1,547

6. వాయల్పాడు :

జనాభా 8,017
పురుషులు 4,175
స్త్రీలు 3,842
అక్షరాస్యులు 2,956
పురుషులు 2,035
స్త్రీలు 921

7. మదనపల్లి :

జనాభా 24.401
పురుషులు 12,788
స్త్రీలు 11,613
అక్షరాస్యులు 11,207
పురుషులు 7,210
స్త్రీలు 3,997

8. పుత్తూరు :

జనాభా 10,425
పురుషులు 5,291
స్త్రీలు 5,134
అక్షరాస్యులు 4,153
పురుషులు 2,946
స్త్రీలు 1.207

9. పలమనేరు :

జనాభా 9,865
పురుషులు 4,958
స్త్రీలు 4,907
అక్షరాస్యులు 4,017
పురుషులు 2,593
స్త్రీలు 1,424

10. కుప్పం :

జనాభా 9,276
పురుషులు 4,721
స్త్రీలు 4,555
అక్షరాస్యులు 3,685
పురుషులు 2,442
స్త్రీలు 1,243

11. తిరుమల :

జనాభా 5,113
పురుషులు 2,833
స్త్రీలు 2,280
అక్షరాస్యులు 2,094
పురుషులు 1,515
స్త్రీలు 579

12. రేణిగుంట :

జనాభా 6,364
పురుషులు 3,292
స్త్రీలు 3,072
అక్షరాస్యులు 2,920
పురుషులు 2,000
స్త్రీలు 920

13. పాకాల :

జనాభా 14,534
పురుషులు 7,467
స్త్రీలు 7,067
అక్షరాస్యులు 5,774
పురుషులు 3,928
స్త్రీలు 1,846
మ్యునిసిపాలిటీలు (1961) :

1. చిత్తూరు :

జనాభా 47,884
పురుషులు 24,400
స్త్రీలు 23,484
అక్షరాస్యులు 23,595

2. తిరుపతి :

జనాభా 35,836
పురుషులు 19,258
స్త్రీలు 16,578
అక్షరాస్యులు 19,825

3. కాళహస్తి :

జనాభా 24,468
పురుషులు 13,347
స్త్రీలు 13,121
అక్షరాస్యులు 10,500

నైసర్గికస్వరూపము : ఈ జిల్లాను రెండు ప్రాంతములుగా విభజింపవచ్చును. 1. గుట్టలు, పీఠభూములు · 2. మైదానములు.

తూర్పుకనుమల గుట్టలు (మహేంద్ర పర్వతశ్రేణి) నైఋతి మూలనుండి ఈశాన్యమునకు పోవుచుండును. నైఋతి యందలి కలగుండి నుండి బయలుదేరి ఉత్తర -ఈశాన్య (North - North eastern) దిక్కుగా పలమనేరు తాలూకాలో నుండి పుంగనూరు తాలూకా తూర్పు భాగము గుండాపోయి, తూర్పువైపు మరలి, చిత్తూరు, చంద్రగిరి వరకు వ్యాపించును. తిరుపతి కవతల ఈ పర్వతశ్రేణి విభక్తమయి గొప్ప వెడల్పయిన లోయ ఏర్పడియున్నది. ఈ లోయను “మామందూరు” లోయ యందురు. తరువాత ఈ గుట్టలవరుస ఈశాన్య దిక్కుగా ప్రయాణముచేసి, కాళహస్తి తాలూకాను తాకుచు, నెల్లూరు జిల్లాలో ప్రవేశించును. పుంగనూరు, మదనపల్లి, వాయల్పాడు తాలూకాలలో గుట్టలకు పడమట నున్న ప్రదేశము 2000 నుండి 2500 అడుగుల ఎత్తున ఉండి మైసూరు రాష్ట్రపు పీఠభూమితో సరిసమానముగా వ్యాపించియుండును. పీఠభూములగు మదనపల్లి, పుంగనూరు, వాయల్‌పాడు తాలూకాలలోను, తూర్పున నున్న కాళహస్తి, పుత్తూరు తాలూకాలలోను చిన్న చిన్న గుట్టలు అసంఖ్యాకముగా నున్నవి. వీటిలో ప్రాముఖ్యము చెందినవి మదనపల్లి తాలూకాలోని 'హార్ల్సీ' కొండలు, పుత్తూరు తాలూకాలోని నగరికొండలు అయి యున్నవి.

నదులు : ఈ జిల్లాలో కొన్ని నదులు జిల్లా ఉత్తరభాగమున ఉత్తర ముఖముగా ప్రవహించుచుండును. ఇతర నదులు జిల్లా దక్షిణభాగమున తూర్పు ముఖముగాను, దక్షిణ ముఖముగాను ప్రవహించుచుండును.

పాపఘ్ని నది, మైసూరు రాష్ట్రములో ఉద్భవించి, మదనపల్లి తాలూకా పడమటిదిశ చివరనపోవుచు అనంతపురం జిల్లాలో ప్రవేశించును.

బాహుదా నది మదనపల్లి తాలూకాలోని హార్ల్సే పర్వతమునందు పుట్టి, వాయల్పాడు తాలూకా ఉ త్తరభాగమున ప్రవహించుచు, కడప జిల్లాలో ప్రవేశించి పెన్నా నది (Pennar) లో సంగమించును.

పెద్దయేరు, చిన్నయేరు అను రెండు చిన్న నదులు మదనపల్లి తాలూకాలో గలవు.

ఫించనది పుంగనూరు తాలూకాలోని ఆవులపల్లి అరణ్యములో పుట్టి, పుంగనూరు, వాయల్పాడు తాలూకాలగుండా ప్రవహించి, కడప జిల్లాలో బాహుదానదిలో పడును.

కౌండిన్యనది పలమనేరు తాలూకా ఈశాన్యభాగమున దక్షిణ దిక్కుగా ప్రవహించి, తరువాత ఉత్తరార్కాటు జిల్లాలో ప్రవేశించి, చివరకు ఆ జిల్లాలోని పాలారునదిలో సంగమించును.

పాలారు నది, మైసూరు రాష్ట్రమునుండి ఈ జిల్లాలో ప్రవేశించి, పలమనేరు తాలూకా దక్షిణ భాగముగుండా ప్రవహించి, పిమ్మట ఉత్తరార్కాటు జిల్లాలో ప్రవేశించును.

పోయిని నది, తూర్పుకనుమలలో ప్రవహించి, చిత్తూరు తాలూకాగుండా దక్షిణమునకు ప్రవహించి, ఉత్తరార్కాటు జిల్లాలో ప్రవేశించి, ఆ జిల్లాలోని పాలారునదిలో పడును. పోయిని నదికి మూడు ఉపనదులు చిత్తూరు తాలూకాలో గలవు. చిత్తూరు నది, బాహుదా నది, గొడ్డువంక అనునవి ఈ ఉపనదులు. అరణీ నది, పుత్తూరు తాలూకా నుండి తూర్పుగా ప్రవహించి చెంగల్పట్టు జిల్లాలో ప్రవేశించును. నగరీ నది పుత్తూరు తాలూకాగుండ ప్రవహించి చెంగల్పట్టు జిల్లాలోని కుశస్థలి నదిలో సంగమించును. స్వర్ణముఖీ నది చంద్రగిరి తాలూకాలోని ఆదెనపల్లెగ్రామ సమీపమున ఉద్భవించి, కాళహస్తి తాలూకాగుండ ప్రవహించుచు, నెల్లూరు జిల్లాలో ప్రవేశించును. కల్కాణీ నది దీని ఉపనది. ఇది చంద్రగిరి తాలూకాలో ప్రవహించుచుండును.

సంవత్సరమునందు అధిక భాగము ఈ నదు లన్నియు ఎండిపోవును, వర్ష కాలమునందు మాత్రమే ఇవి జల ప్రదానము చేయుచుండును. అయితే, ఈ నదులలో పెక్కింటికి నదీగర్భములందు అంతర్వాహినులు కలవు (have a high level of subterranean water). ఈ జిల్లాలో జీవనదులు లేవు.

అడవులు : ఈ జిల్లాలో సుమారు మూడింట నొకవంతు భూమి అరణ్యప్రాంతమై యున్నది. మదనపల్లి, వాయల్పాడు, చంద్రగిరి, చిత్తూరు, పలమనేరు తాలూకాలలో రిజర్వు అడవిప్రాంతము కలదు. దీని విస్తీర్ణము 818.32 చదరపు మైళ్లు. అన్ని విధములైన అడవుల విస్తీర్ణము 1951 జనాభాలెక్కల ప్రకారము 2,355.70 చద రపు మైళ్ళు.

మదనపల్లి తాలూకాలోని రిజర్వుడు అడవీ ప్రాంతములో ఆకులు రాలిపోవుచుండు (deciduous) వృక్ష సంతానము కలదు. ఈ వృక్షములు ఏపుగా పెరిగి, వంట కట్టియలకే గాక, చిన్న చిన్న కలప సామానుగాగూడ ఉపకరించును. వాయల్పాడు, చంద్రగిరి, కాళహస్తి, చిత్తూరు తాలూకాలలోని రిజర్వుడు అడవిప్రాంతము మదనపల్లి తాలూకాలోని చెట్లతో భిన్నించి, ముండ్లపొదలుగాను, శ్యామలముగాను రకరకములుగా నుండును. పలమనేరు తాలూకాలోని అడవులు ఆకులు రాలక ఎల్లప్పుడు శ్యామలపత్ర సంకలితమై యుండును. ఇవియును వంటచెరుకుగా నుపయోగపడును. పలమనేరు తాలూకాలో చందనవృక్ష సంచయముగల భూభాగము కలదు. పుంగనూరు తాలూకాలో వంటచెరుకునకు ఉపయోగించు వృక్షజాతియే కలదు. గిడసబారిన వృక్షములు ఇతర ప్రాంతపు టడవులయందు గలవు (1951).

కాలమానము - వర్షపాతము : ఈ జిల్లాకు ఈశాన్య ఋతుపవనముల, నైఋతి ఋతుపవనముల ప్రభావము కలదు. పీఠభూములగు మదనపల్లి, వాయల్పాడు, పుంగనూరు, పలమనేరు తాలూకాలలో నైఋతి పవనముల సందర్భమున (జూన్ నుండి సెప్టెంబరు వరకు) ఎక్కువగా వానలు కురియును. ఈ తాలూకాలో ఈశాన్య ఋతుపవన కాలములో (అక్టోబరునుండి డిసెంబరువరకు) తక్కువ వర్షము కురియును. ఈ జిల్లా సముద్రమునకు లోతట్టు భాగమునందుండుటచే (interior) ఈ జిల్లాను సమీపించు నప్పటికి మేఘమాలికలు సన్నగిలిపోవును.

మదనపల్లి తాలూకాలోని ఆరోగ్యవరమునందు నెలకొల్పబడిన యంత్రసాధనము ననుసరించి, రికార్డుచేసిన లెక్కలప్రకారము ఈ జిల్లాలో సంవత్సరమునందు వర్ష పాతము సగటున 33.81 అంగుళములు. మొ త్తము మీద జిల్లాయొక్క శీతోష్ణపరిస్థితి ఆరోగ్యప్రదమైనట్టిది. మైదానభూము లగు చంద్రగిరి, పుత్తూరు, కాళహస్తి తాలూకాలు ఉష్ణవంతమై యున్నను, భరించలేనంత వేడి కలవి కావు. ఇక జిల్లాకు పడమటి దిశయందు పీఠభూమిలోనున్న వాయల్పాడు, మదనపల్లి, పలమనేరు, పుంగనూరు తాలూకాలు కొన్నిడిగ్రీలు చల్లగానుండును. ఉష్ణోగ్రత 95° డిగ్రీలకంటే తరచు ఎక్కువగా పెరుగదు. చిత్తూరు తాలూకా మితమైన శీతోష్ణస్థితులు కలిగి యుండును.

భూతత్త్వము : ఈ జిల్లాలోని భూములు ముఖ్యముగా నల్లరేగడి, ఎఱ్ఱనేలలు, మాసాబు (కలగలుపు) నేలలు అయియున్నవి. అధికభాగము ఎఱ్ఱమన్ను భూములే. పుంగనూరు తాలూకా భూములు పలమనేరు భూములను పోలియుండును. పుత్తూరు తాలూకాలో మిక్కిలి ఫలవంతమైన భూములు కలవు. కాళహస్తి తాలూకాలోని భూములు చంద్రగిరి తాలూకాలోని తూర్పుప్రాంతపు భూములను పోలియుండును. చిత్తూరు తాలూకాలో 1,77,000 ఎకరములు, చంద్రగిరి తాలూకాలో 35,000 ఎకరములు, పలమనేరు తాలూకాలో 1,04,000 ఎకరములు, మదనపల్లి తాలూకాలో 2,19,800 ఎకరములు, వాయల్పాడు తాలూకాలో 1,30,400 ఎకరములు - ఈ విస్తీర్ణములుగల నల్ల, ఎఱ్ఱ భూములు కలవు. పలమనేరు, మదనపల్లి తాలూకాలలో రేగడి, గరప (Loam), ఇసుక నేలలు లేవు. వాయల్పాడు తాలూకాలో రేగడి, ఇసుక నేలలు లేవు (1951).

నీటివసతులు : నీటి పారుదల, వ్యవసాయము (irrigation) నకు సంబంధించిన పెద్ద నిర్మాణములు ఈ జిల్లాలో లేవు. మెట్టపంటల, వాణిజ్యపుపంటల వ్యవసాయము విరివిగా సాగుచుండును. ఈ పంటల వ్యవసాయమునకు వర్షపాతమే ఆధారము. రైతు లెక్కువగా పండ్లతోటలను పెంచుటయందు శ్రద్ధ గైకొను చుందురు. వర్షాధారమున నిండిన చెరువుల క్రిందను, కొన్నినదుల కాలువలక్రిందను, ఊటకాలువలక్రిందను వరి పంట సాగగుచుండును. ఈ వసతులకు సహాయముగా రైతులు త్రవ్విన బావులనీరు కొరతను తీర్చుచుండును.

1. చిత్తూరు తాలూకాలో వానకాలములో నిండిన చెరువులు, స్వంతబావులు వ్యవసాయమునకు మూలా ధారములు. ఈ తాలూకాలో వరిపంట ఋతుపవనము (Monsoon) యొక్క వర్షపాతముపై ఆధారపడి యున్నది.

2. పుంగనూరు తాలూకాలో మాగాణి వ్యవసాయమునకు వానకాలములో నిండు చెరువులు, స్వంతబావులు ముఖ్యమైన జలాధారములు. ఈ తాలూకాలో వర్షపాతము అల్పమగుటచే ఇది దుర్భిక్షము పాలగుట కలదు.

3. పలమనేరు తాలూకాలో తూర్పు భూభాగములో నీటిపారుదల వ్యవసాయమునకు కౌండిన్యనది ఆధారముగా నున్నది. వానలతో నిండిన చెరువులు, స్వంతబావులు, మాగాణి వ్యవసాయమునకు ఇతర ఆధారములై యున్నవి.

4. మదనపల్లి తాలూకాలో పెద్దతిప్ప సముద్రము చెరువు, రంగసముద్రము చెరువు, కందుకూరు చెరువు, చిన్న తిప్పసముద్రము చెరువు అను 4 పెద్దచెరువులు గలవు. ఇవి తమ తమ ఆయకట్టులకు తగినంత నీరును సమకూర్చు చుండును. ఈ తాలూకాలోని ఇతర చెరువులు నమ్మదగినవి కావు. మాగాణి వ్యవసాయమునకు స్వంతబావులు అధికముగా తోడ్పడుచుండును. సకాలమందు వానలు సరిగా కురియక పోవుటచే ఈ తాలూకా తరచు ఇబ్బంది పాలగుచుండును.

5. వాయల్పాడు తాలూకాలో వానకాలములో నిండిన చెరువులు, స్వంతబావులు, మాగాణి వ్యవసాయమునకు జలాధారములు. ఈ తాలూకాలో వర్షాభావముచే కరువు కాటకములు తొంగిచూచు చుండును.

6. చంద్రగిరితాలూకాలో స్వర్ణముఖి, కల్యాణి నదులనుండి బయలుదేరు ఊటకాలువలే మంచి జలాధారములై మాగాణి వ్యవసాయమునకు దోహద మొసగుచున్నవి. తక్కువ పడిన నీరును బావులు సమకూర్చు చుండును. ఈ బావులలో నీటి ఊటలు మంచివి కలవు. ఇచ్చట వర్షాధారమున నిండు చిన్న చిన్న చెరువులును కలవు.

7. కాళహస్తి తాలూకాలో స్వర్ణముఖీనది కాలువలు పెక్కు చెరువులను నింపుచుండును. ఈశాన్య ఋతుపవనములు పూర్తిగా లోపించిననే తప్ప ఈ తాలూకాలో కరవుబాధకు ఆస్కారములేదు.

8. పుత్తూరు తాలూకాలో కొంతభాగము ఆరణి, నగరీ నదులు పల్లపు వ్యవసాయానుకూలములుగా నుండును. ఈ తాలూకాలో వర్షాధారమున నిండెడు స్వంత బావులు అధికముగా కలవు. ఈ తాలూకా సాధారణముగా కరవుకాటకములకు గురికాదు. (1951).

పంటలు : ఈ జిల్లాలో వరిపంటయే ముఖ్యమైన ఆహారపు పంట. కుంబు, రాగి పైరులును విరివిగా పెరుగును. చోళము, కొఱ్ఱ, వరిగె, సామలు పరిమితముగాపండును. వేరుసెనగ ముఖ్యమైన వాణిజ్యపుపంట. చిత్తూరు తాలూకాలో కూరగాయలు, పండ్లు పండించు భూమి ఎక్కువగా కలదు. ఈ జిల్లాలో నిమ్మ, మామిడిపండ్ల రకములు విరివిగా పండును.

పెసలు, కందులు, మినుములు, సెనగలు ఎక్కువగా పండును. వేరుసెనగ, ఆముదాలు, నువ్వులు, పొగాకు అను వాణిజ్యపు పంటలలో వేరుసెనగయే హెచ్చుగా పండును.

ఈ జిల్లాలో మామిడిచెట్లు, చింతచెట్లు విరివిగానున్నవి. మామిడిపండ్లు ఎక్కువగా ఇచ్చటినుండి బొంబాయికిని, బొంబాయినుండి ఇతర భారత ప్రాంతములకే గాక పాశ్చాత్యదేశములకును ఎగుమతి యగుచుండును.

మొత్తము విస్తీర్ణము 17,69,290 ఎకరములలో అడవిప్రాంతము 5,23,721 ఎకరములు; సాగునకు పనికి రాని భూమి 13,45,907 ఎకరములు; సాగుకాని భూమి 9,45,274 ఎకరములు; సాగుఅగుచున్న భూమి 9,54,388 ఎకరములు.

ఖనిజములు : ఈ జిల్లాలో పేర్కొనదగిన ఖనిజము ముడి ఇనుము. ఈ ముడి ఇనుము కాళహస్తి తాలూకాలోని సిరసం బేడు ప్రాంతమున లభించును.

చంద్రకాంతశిల (పలుగురాయి), అభ్రకము. బంగారము బలపపురాయి (Steatite), భవననిర్మాణ సామగ్రి ఈ జిల్లాలో లభించును.

పశువులు: పుంగనూరులోని గోజాతి ప్రపంచప్రసిద్ధి చెందినట్టిది. చిత్తూరునకు 25 మైళ్ళ దూరములోనున్న పలమనేరులో గోజాత్యభివృద్ధికి సర్కారువారు ఒక పశు సంవర్థక ప్రతిష్ఠాపనమును నెలకొల్పియున్నారు.

రహదారులు (Communications) : ఈ జిల్లానుండి దీనిని తగిలియున్న ఇతర జిల్లాలకును, మైసూరు రాష్ట్రమునకును పోవు రోడ్లు కలవు. జిల్లాలో 1728 మైళ్ళ పొడవుకల రోడ్లు కలవు. ఇందు 48 మ్యునిసిపల్ రోడ్లును చేరియున్నవి. మదనపల్లి తాలూకాలోను, వాయల్పాడు తాలూకాలోను మిగతా తాలూకాలకంటె హెచ్చు దూరము రోడ్ల నిడివి కలదు. ఈ జిల్లాలో రోడ్లు మంచి స్థితిలోనున్నవి. ఇంకను వీటిని వ్యాప్తిచేయుటకు అవకాశములు కలవు !

రైలు : ఈ జిల్లాలో 681 మైళ్ళు వ్యాప్తి గల రైలుమార్గము కలదు. ఇది జిల్లా యంతటను చక్కగా వ్యాపించి యున్నది. పుత్తూరు, చంద్రగిరి, పలమనేరు తాలూకాలో పెద్దలైను (Broad Guage) రైలుమార్గము కలదు. మద్రాసు-బొంబాయి, మద్రాసు-బెంగుళూరు పోవు రైళ్ళు ఈ జిల్లా గుండ పోవుచుండును.

చిన్నలైను (Metre Guage) కట్పాడి - గూడూరులను కలుపుచుండును. రేణిగుంట నుండి గూడూరు పోవు మార్గము పెద్దలైనుగా మార్చబడినది. చిన్నలైను మార్గ మొకటి పాకాల నుండి బయలుదేరి గుంతకల్లు–బెంగుళూరు మార్గములో నున్న ధర్మవరమును కలిసికొనును. ఈ లైను చంద్రగిరి, పుంగనూరు, వాయల్పాడు, మదనపల్లి తాలూకాలలో నుండి పోవుచుండును. చిత్తూరుజిల్లా ప్రధానస్థానము, వాయల్పాడు, చంద్రగిరి, కాళహస్తి, పుత్తూరుతాలూకా ప్రధానస్థానములు, ఇవన్నియు రైలు మార్గముమీదనే యున్నవి.

తంతి-తపాలా : ఈ జిల్లాలో 419 పోస్టాఫీసులు కలవు. ప్రధానకార్యాలయము, 370 శాఖా కార్యాలయములు, 48 ఉపకార్యాలయములు జిల్లాలో నున్నవి.

తంతి కార్యాలయములు 25 కలవు. ప్రజావసరములు తీర్చు (Public Calls) కార్యాలయములు 17, టెలిఫోన్ ఎక్స్చేంజి ఆఫీసు 1 ఉన్నవి.

వైద్యము : ఈ జిల్లాలో 1951 లెక్కల ప్రకారము 6 ఆసుపత్రులు, 31 గ్రామ వైద్యాలయములు కలవు.

జిల్లా ప్రధావస్థాన మగు చిత్తూరులోని ప్రధాన వైద్యాలయములో ఎక్సురే (X-Ray) యంత్ర పరికరముల జోడు కలదు.

కుష్ఠవ్యాధి బాధితుల చికిత్సకు అక్కరంపల్లెలో వైద్యాలయము కలదు. దీనిని తిరుపతి దేవస్థానమువారు నడుపుచున్నారు.

క్షయవ్యాధి బాధితుల చికిత్సకు మదనపల్లిలో వైద్యాలయము కలదు.

విద్య : ఈ జిల్లాలోని విద్యాపరిస్థితి (1951).

1. కాలేజీలు 2
2. ప్రాచ్య కళాశాలలు 1
3. హైస్కూల్సు 26
4. బాలికల హైస్కూళ్లు 3
5. ట్రైనింగు స్కూళ్లు (బాలుర) 1
6. ట్రైనింగు స్కూళ్లు (బాలికల) 2
7. ట్రైనింగు స్కూళ్లు (ఆంగ్లో ఇండియనుల) 1
8. ప్రాచ్య విద్యాశాలలు 1
9. మిడిల్ స్కూళ్ళు 7
10. ఎలిమెంటరీ స్కూళ్ళు 1120
11. వయోజన విద్యాశాలలు 48
12. విద్యార్థులు 86,571
13. విద్యార్థినులు 33,939

మదనపల్లిలో, తిరుపతిలో కళాశాలలు కలవు.

తిరుపతిలో ప్రాచ్యవిద్యా కళాశాల కలదు.

మదనపల్లి, చిత్తూరు పురములలో బాలికల శిక్షణ పాఠశాలలు (Training Schools), చిత్తూరు పురములో బాలుర శిక్షణ పాఠశాల (Training School) కలవు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము కలదు.

పరిశ్రమలు : చంద్రగిరి తాలూకాలో తేలిక లోహ పరిశ్రమల (Light metal Industries) కు సంబంధించిన 13 ప్రతిష్ఠాపనలు కలవు. పలమనేరు తాలూకాలో చందనపు నూనెకు సంబంధించినవి 6 ప్రతిష్ఠాపనములు, మరికొన్ని రాసాయనిక పరిశ్రమలకు సంబంధించిన ప్రతిష్ఠాపనములు కలవు. ఇవన్నియు భారీ పరిశ్రమాగారములు.

నూలు, ఉన్ని, పట్టు నేతపని, త్రాళ్లు పేనుట, బెల్లము వండుట, పాడిపరిశ్రమ, చర్మకారకర్మ, తట్ట లల్లుట, బీడీలు చుట్టుట, నూనెగానుగపని, కోళ్ళను పెంచుట, కుమ్మరపని, బొమ్మలు చేయుట, కంచరపని మున్నగు కుటీర పరిశ్రములను జనులు వృత్తిగా గలిగియున్నారు.

మతములు : ఈ జిల్లాలో మతములను బట్టి 1951 జనాభాలెక్కల ప్రకారము ఈ క్రిందివిధముగా జనసంఖ్య యున్నది:

1. హిందువులు 16,79,832
2. ముస్లింలు 1,11,358
3. క్రైస్తవులు 18,532
4. పార్సీలు 439
5. సిక్కులు 190
6. బౌద్ధులు 21
7. జైనులు 5
మొత్తము 18,10,377

భాషలు : 1951 జనాభా లెక్కల ప్రకారము 18,10,877 మంది జనులుండిరి. వీరిలో 20 మాతృభాషలు కలవారు ఉన్నారు :

1. తెలుగు 13,34,531
2. తమిళము 3,28,679
3. హిందూస్థాని 1,00,121
4. కన్నడము 21,838
5. మలయాళ ము 7,218
6. లంబాడి 6,760
7. మరాఠి 5,036
8. హిందీ 3,951
9. ఎరుకల, ఇరుల, కొరవ 1,658
10. గుజరాతి 297
11. ఇంగ్లీషు, సింధి, బెంగాలి, బర్మీసు, డచ్, ఫ్రెంచి, సౌరాష్ట్ర,జర్మన్,పంజాబి, స్పానిషు భాషలవారు 293
మొత్తము 18,10,377

1960 లో జరిగిన సరిహద్దు మార్పులవలన తమిళులుఎక్కువగా మద్రాసు రాష్ట్రమునకు మారియుందురు. ఇతరుల సంఖ్యలలో మార్పులు, చేర్పులు జరిగినవి.

పుణ్యస్థలములు : తిరుమలకొండమీద శ్రీ వెంకటేశ్వరస్వామివారి, తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి, శ్రీ రామస్వామివారి దేవాలయములు కలవు. ఈ దేవస్థానములయందు జరుగు రథోత్సవములు, బ్రహ్మోత్సవములు ఘనమైనవి. భారతభూమిలోని నలుదిక్కులనుండి తైర్థికులు వచ్చెదరు. ఈ కొండమీద కొన్ని జలపాతములు కలవు. యాత్రికులు పుణ్యముకొరకు జలపాతములందు గ్రుంకు లిడుచుందురు. యాత్రికుల సౌకర్యార్థము దేవస్థానమువారు చక్కని విడుదుల నేర్పాటు చేసియున్నారు.

శ్రీకాళహస్తి పురములో అత్యంత ప్రాచీనమయిన శివాలయ మొకటి కలదు. ఈ దేవుని శ్రీకాళహస్తీశ్వరు డనెదరు. అపరిమితముగా హిందూస్థానములోని- ముఖ్యముగా దక్షిణదేశము నుండి - తైర్థికులు ఈ దేవుని దర్శనార్థము వచ్చుచుందురు. ఇచ్చట శివరాత్రి సందర్భమున 10 రోజులపాటు మహోత్సవము జరుగును. ఈ సమయముననే శివదేవుని రథోత్సవము కూడ మిగుల వైభవముగా జరుగును. పృథివ్యాపస్తేజోవాయురాకాశములను పంచభూతములకు సంబంధించిన లింగములలో నొక్కటి ఈ దేవాయతనమునందు కలదు. కాళహస్తిలో నున్న లింగము వాయులింగ మని ప్రతీతి కలదు. శ్రీకాళహస్తి స్వర్ణముఖీ నదీతీరమున గలదు.

పుత్తూరులోని ద్రౌపదీ దేవ్యాలయము, కొత్తకోటలోని అగస్త్యేశ్వరాలయము, చిత్తూరులోని రామస్వామి ఆలయము, వెలిమలగ్రామకొండలమీద నున్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయము, బంగారుపాలెం తాలూకాలోని మొగిలి గ్రామమందున్న మొగిలేశ్వరాలయము మున్నగునవి ప్రసిద్ధ దేవాలయములు. దర్శనీయ ప్రదేశములు :

1. హార్ల్సీకొండ : ఇది మదనపల్లి తాలూకాలో నున్నది. ఈ కొండకు గల అసలు పేరు "ఏనుగు మల్లమ్మ కొండ" అనునది. పూర్వకాలములో మల్లమ్మ యను తపస్విని ఈ పర్వతాగ్రమున నివసించుచుండెననియు, ఏనుగులు ఆమెకు ఆహారము తెచ్చి పెట్టుచుండెననియు, ఐతిహ్యము కలదు. అందుచే ఆ కొండకు ఏనుగు మల్లమ్మ కొండ యను పేరు వచ్చినదట !

పరిసర ప్రదేశములకన్న ఇది అత్యంత శీతలప్రదేశముగాను, ఆరోగ్యవంతముగాను, ఆహ్లాదకరముగాను ఉండుటచే, డబ్ల్యు. డి. హర్ల్సే అను జిల్లా కలెక్టరు దీనిని వరణము చేసి ఈ కొండ మీద 1870 లో ఒక బంగళా కట్టించి నివసించసాగినాడు. అప్పటినుంచి ఇది హార్ల్సే కొండ అను పేరుతో ప్రఖ్యాతికి వచ్చినది.

ఈ కొండ సముద్రమట్టమునకు 4,100 అడుగుల ఎత్తున గలదు. ఇతర కొండలవలె బోడిగా (Bare) నుండక, తరులతా గుల్మములతో నిండియుండి మనోహరముగా నుండును. దీని నిప్పుడు వేసవికాలపు నివాసముగా వృద్ధిచేయుటకు ప్రభుత్వము సంకల్పించి కొన్ని భవనములను కొండమీద కట్టించియున్నది.

2. చంద్రగిరి దుర్గము : ఈ దుర్గము ఒక కొండమీద కట్టబడినది. తాళికోట యుద్ధానంతరము విజయనగర రాజన్యులు ఈ దుర్గమునకు పరుగెత్తుకొనివచ్చి, తిరిగి తల యెత్తసాగిరి. ఈ దుర్గమును క్రీ. శ. 1000 లో ఇమ్మడి నరసింహ యాదవరాయలు నిర్మించెను. విజయనగర రాజులు దీని నెక్కువ బలిష్ఠపరచిరి. చంద్రగిరిదుర్గ మొక అభేద్యమగు దుర్గము. రాజప్రాసాదములు, దేవాయ తనములు, దర్బారు హాలు మున్నగు నిర్మాణములు వాస్తు శిల్పనైపుణ్యమును గ్రక్కుచుండును. ఇప్పు డిది కొంత శిథిలావస్థలో నున్నది.

జలపాతములు : పుత్తూరు తాలూకాలో ఒకటి, వాయల్పాడు తాలూకాలో మరియొకటి జలపాతములు ఈ జిల్లాలో కలవు. ఇవి అత్యంత మనోహర ప్రకృతి దృశ్య ప్రదేశములుగా ప్రసిద్ధి చెందినవి. ఈ జలపాతముల నీరు ఖనిజసంపత్తి యుక్తము లని పేరుపొందినవి. ఈ నీటికి వ్యాధినిర్మూలనశక్తి కలదట ! మహాశివరాత్రి పర్వ సందర్భమున యాత్రికులు తండోపతండములుగ విచ్చేసి, ఈ జలపాతములయందు గ్రుంకులిడుచుందురు. తిరుమల కొండమీద పెక్కు జలపాతములు కలవు. ఇవి పవిత్రమైనవి.

చరిత్ర : క్రీస్తుశకము మూడవ శతాబ్దిలో ఈ జిల్లా పల్లవరాజ్య భాగమయి యుండెను. తరువాత ఈ భూ భాగమును చోళులు చాల కాలము పాలించిరి. శాసనాధారములనుబట్టి శ్రీకాళహస్తీశ్వరునకు అంకితమయిన సుప్రసిద్ధ దేవాలయమును క్రీ. శ. 12 వ శతాబ్దిలో రాజేంద్రచోళుడను చోళరాజు నిర్మించినట్లు తెలియుచున్నది. క్రీ. శ. 13 వ శతాబ్దిలో చోళుల రాజ్య మంతరించెను. వారి తరువాత సాళువ రాజులు, యాదవ రాజులు ఈ ప్రాంతము నేలిరి. క్రీ. శ. 1324 ప్రాంతమున అల్లాయుద్దీన్ ఖిల్జీ సేనలు ఈ భాగమును జయించెను. అయితే, ఢిల్లీ సుల్తాను పాలనము ఎక్కువకాలము సాగలేదు. హరిహర బుక్క రాయలు విజయనగర రాజ్యమును స్థాపించినప్పుడు ఈ మండలము ఆయన అధీనములోనికి వచ్చెను.

1646 మొదలుకొని ఈ జిల్లాను గోలకొండ సుల్తానులు పాలించిరి. గోలకొండ సుల్తానుల ఆజ్ఞప్రకారము, కడప నవాబు మదనపల్లి, వాయల్పాడు, పుంగనూరు తాలూకాలపై ఆధిపత్యము వహించెను. మిగత తాలూకాలు ఆర్కాటు నవాబు స్వాధీనమునందుండెను.

గోలకొండ రాజ్యపతనానంతరము కర్ణాటక నవాబు ఈ జిల్లాపయి ప్రభుత్వము సాగించెను. మహారాష్ట్రులు, తరువాత మైసూరు రాజ్యపాలకుడయిన హైదరలీ ఈ భాగమును కొంతకాలము ఆక్రమించి యుండిరి. హైదరు ఆలీని ఇంగ్లీషువారు ఓడించిరి. శ్రీరంగపట్టణ సంధి ప్రకారము మదనపల్లి, వాయల్పాడు, చంద్రగిరి తాలూకాలను హైదరాబాదు నిజామునకును, మిగత తాలూకాలను ఆర్కాటు నవాబునకును ఇంగ్లీషువారు ఇచ్చివేసిరి.

ఇంగ్లీషువారి సైన్యమునకగు వ్యయభారమును పూర్తిచేయుటకు నిజాము ఈ జిల్లాను, రాయలసీమలోని ఇతర జిల్లాలను 1800 లో ఇంగ్లీషువారి కిచ్చివేసెను.

ఇది మొదట మద్రాసు రాజధానిలో ఒక జిల్లాగా నుండెను. 1953 లో ఆంధ్రరాష్ట్రము ఏర్పడినపుడు ఆంధ్రరాష్ట్రములో ఒక జిల్లాగా నుండెను. 1956 లో ఆంధ్రప్రదేశ రాష్ట్రము (విశాలాంధ్రము) నిర్మాణము కాగా, చిత్తూరుజిల్లా ఆంధ్రప్రదేశ్ 20 జిల్లాలలో నొకటిగా నున్నది[1].

ఆ. వీ.

  1. The 1961 figures enumerated in the article are the "Provisional Figures" supplied to us by the courtesy of the census Commissioner, Andhra Pradesh, Hyderabad. 1961-Editor.