సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చికిత్సాశాస్త్రము (వై)
చికిత్సాశాస్త్రము-(వై) :
చికిత్సాశాస్త్ర మనగా వ్యాధులకు చికిత్సచేయు విధానమని అర్థము. మొదట ఇది మిగుల శాస్త్రజ్ఞాన రహితమై యుండెను. ఒక జబ్బునకు ఒక ప్రత్యేక ఔషధము ఉపయోగకరమని చెప్పుచుండెడివారు. కాని అది ఎట్లు ప్రయోజనకరమో వారికి తెలియకుండెను. ఉదా : గుండెజబ్బునకు డిజిటాలిస్ ఉపయోగించునను నమ్మకము వారికి గలదు. అది నిజముగా చాలా విలువగలదని గ్రహించి, దానిని దరిమిలా నవీన వైద్యశాస్త్రములోనికి స్వీకరించిరి. అది పనిచేయుపద్ధతి, విషతత్వ శాస్త్రము, మోతాదు, అది పనిచేయుటకు కావలసిన లక్షణములు, సంతృప్తికరముగా ప్రమాణబద్దము చేయబడినవి. జీవరసాయన శాస్త్రమువంటి శాస్త్రములు వృద్ధిపొందినవి. అందువలన ముడివస్తువులనుండి వాస్తవముగా ప్రయోజన కరములైన ఔషధ భాగములను వేరుచేసి, ప్రమాణ బద్దము చేయజాలిరి. జంతువులమీద చేయబడు ప్రయోగములు ప్రయోజనకరములే. కాని, మానవునిపై కలుగు ఫలితములను గూర్చి అనిర్దిష్టముగా చెప్పజాలవు.
రోగనివారణ చర్యలు : ఒకరినుండి మరొకరికి, మశూచికపు టీకాలు వేసినయెడల మశూచికము రాదని ప్రాచీన చైనాదేశస్థులకు తెలిసియుండెను. 19 వ శతాబ్ది మధ్యలో జన్నరు అను నతడు, గోస్తనవ్యాధి (కౌపాక్సు) రసిని మనుష్యులకు టీకాలుగా వేసినచో మశూచికమురాదని నిర్ధారణచేసెను. టీకాలు వేయుటవలన ఎట్టి సత్ఫలితములు కలుగుచున్నవో ఈనాడు మనకెల్లరకు తెలిసినవిషయమే. గ్రుడ్డువంటి సజీవ పదార్థములలోని శరీరజన్య విషమునుండితీసిన రసి, సూదిద్వారా ఇచ్చు చున్నారు. అందువలన రసిద్వారా సంక్రమించు పోలియో వంటి వ్యాధులు కట్టుబాటు చేయబడుట మనము చూచుచునే యున్నాము.
సూక్ష్మ జీవులద్వారా వ్యాపించు వ్యాధులకు చనిపోయిన సూక్ష్మజీవులతో ఇచ్చిన ఇంజక్షనులు కొంతవరకు మాత్రమే ఫలితముల నియ్యగలవు. అయితే ఈ వ్యాధివలన కలుగు ప్రమాదము చాలవరకు నిరోధింప బడుననుటకు సందేహములేదు. టైఫాయిడు రాకుండా టి. ఎ. బి.. రసి, కలరా నిరోధకరసి, ఘటసర్పి, (డెఫ్తీరియా) నిరోధకరసి ఇందులకు ఉదాహరణములు. ఈ చర్యలు కట్టుదిట్టమైన సంరక్షణము కలుగచేయుటకు సుమారు ఒక వారమురోజులు పట్టును. ధనుర్వాయువు (టిటానస్) మొదలగు వ్యాధులు కొంతకాలముపాటు రాకుండా శరీరజన్య విషవ్యతిరేక ద్రవ్యములను (ఆంటీ టాక్సిన్) సూదిద్వారా పుచ్చుకొని సంరక్షణము పొందవచ్చును.
ఔషధములు : ఎక్కువ మందులను కలిపి వాడెడు పద్ధతి గెలనీ కాలమునందు ఆచారముగ నుండెను. క్లుప్తమగు ఔషధ నిర్ణాయకములైన చీటీలను వ్రాయుట, ఏ మందుల విలువ సుస్పష్టముగా తెలిసియున్నదో వాటినే వ్రాయుట, ఈనాడు అమలులోనున్న ఆచారము. ఔషధములు, మిక్శ్చరులు, పొడి, మాత్రలు ఇట్టిరూపములలో ఇచ్చుచున్నారు. మిక్శ్చరులను సాధారణముగా నీటిని ఉపయోగించి తయారుచేయుదురు. బిస్మత్, కాడ్ లివర్ ఆయిల్ వంటి కొన్నివస్తువులు నీటిలో కరుగవు. అట్టి వాటిని కరగించుటకు ఎ కేసియా అనుదానిని సహకారిగా వాడుదురు. కొన్ని మాత్రలపై చక్కెరపూత యుండ వచ్చును, ఎట్లయినను అవి లోపలికి పోయిన తర్వాత సత్వరముగా విచ్ఛిన్నమగు రీతిని వాటిని తయారుచేయవలెను.
ప్రతిమందు వలనను మనము కోరెడు ఫలితములతో పాటు, మనము ఆశించని పర్యవసానముకూడ కలుగును. ఉదా : సెలిసిలేట్సువలన కీళ్ళవాతము, వ్రేళ్ళ నొప్పులు, జ్వరము పోవును. అందువలన జఠరబాథ, తలతిరుగుడు సంభవించును. సోడియం బైకార్బనేట్సును సెలిసిలేట్సుతో కలిపియిచ్చి, దానిని పోగొట్టుదురు. ఇందులకు మరియొక ఉదాహరణ మేమనగా మార్ ఫిన్ ఇయ్యబడిన రోగికి శ్వాసనిరోధము కలుగవచ్చును. అట్టి వ్యక్తికి ఎట్రపిన్ ను, మార్ ఫిన్ తో కలిపి ఇచ్చెదరు.
ఒకొక్కప్పుడు రెండు మందులు వాడి, వాటిద్వారా ఒకదానిశక్తిని మరొకటి ఇనుమడింపచేయునట్లు చేయుదురు. తద్వారా ప్రతిఔషధముయొక్క మోతాదును తగ్గించవచ్చును. ఉదా : నిద్ర కల్గించుటకు బ్రోమైడ్సును బార్చిటు రేట్సును కలిపి ఇచ్చెదరు.
కొన్ని మందులవలన మరొక వింత ఫలితముకూడ సంభవింపవచ్చును. తీసికొనిన మందు లన్నిటిని బయటికి విసర్జించుశ క్తి శరీరమునకు లేక, కొంత భాగము లోపల నిలువ యుండును. ఇట్టి ఔషధములను వ్యవధిలేకుండా చాలాకాలము పుచ్చుకొనినయెడల, అవి లోపల ఉండిపోయి మిక్కిలి ప్రమాదకరములైన శరీరజన్య విషదోషములు సంభవించును. బరువైన లోహపు ఔషధములు, డిజిటాలిస్ ఇందులకు ఉదాహరణములు. డిజిటాలిస్ చాలకాలము లోపల నిలువయుండిపోయినయెడల, అందువలన నాడి జారిపోవుట, వాంతులు, విరేచనములగుట, తుదకు మరణించుట కూడ సంభవించవచ్చును.
వ్యక్తి నైజము (ఇడియసింక్రసిస్) : కొందరువ్య క్తులు కొన్నిమందులను సహింపలేరు. ఆ మందులు ఎంత స్వల్పమైన మోతాదులో ఇచ్చినను వారి ఆరోగ్యము తలక్రిందులగును. ఇందులకు గల కారణము స్పష్టముగా తెలియదు. ఉదా. క్వినైన్ కాని, సల్ఫావర్గపు ఔషధములను గాని ఎంత తక్కువగా ఇచ్చినను కొందరకు తీవ్ర ఫలితములు కలుగును.
అల్లెర్జీ : లివర్ ఎక్ స్ట్రాక్టు, పెన్సిలిన్ మొదలగు ధాతు సంబంధమైన మిశ్రమద్రవ్యముల మూలమున ఔషధములకు సంబంధించిన “అల్లెర్జీ” తరచుగా సంభవించు చుండును. ఒక మోతాదు ఇయ్యగానే శరీరమందు అంతట చక్రములతో గోకుచున్నట్లు రోగి బాధపడును. తీవ్రమైన కేసులలో ఆఘాతము (షాక్) వచ్చుట, నాడి జారిపోవుట, స్మృతితప్పుట, విరేచనములు, వాంతులు తుదకు మరణము కూడ సంభవించవచ్చును.
ఎనాఫిలాక్టిక్ ఆఘాతము : ఘటసర్పి, ధనుర్వాతము వంటి వ్యాధులకు గుఱ్ఱపు రక్తమునుండి తయారుచేయ బడిన ఆంటీటాక్సిన్ సేనా ఉపయోగించినప్పుడు మొదటి మోతాదువలన ఎట్టి ఫలితమును ఉండదు. కాని శరీరము శీఘ్రగ్రాహక పరిస్థితిని పొందును. మరికొన్ని రోజుల తర్వాత రెండవ మోతాదును ఇంజక్షనుగా వాడిన వెనువెంటనే, ఆఘాతమువలన రోగి మృతినొందును. ఇదివరకు ఒక ఇంజక్షను ఇచ్చిన సంగతి తెలిసియున్న యెడల మొదట 1/4 సి. సి. లో చిన్న మోతాదులు ప్రయోగించి అందువలన ఫలితములు గమనించుట మంచిది. ఎట్టి దుష్ఫలితములు కలుగని యెడల ఇయ్యవలసిన మోతాదులో ఆ ద్రవమును ఇయ్యవచ్చును. రోగికి వ్యతిరేక ఫలితములు కలుగుచున్న యెడల ఆ సీరమును క్రమానుగతముగ కొద్ది మోతాదులలో ఇయ్యవలెను.
మందులను ఇచ్చు విధానము : నోటి ద్వారా లోపలికి మందులను ఇచ్చు పద్ధతి సర్వసాధారణమైన విధానము. రోగికి వాంతులు అగుచున్నప్పుడు, లేక స్పృహతప్పినపుడు, మందులను సూది ద్వారా ఇత్తురు. క్వినైన్ మ్రింగించుటవలన చలిజ్వరము పోవును. రోగికి వాంతులు అగుట కాని, స్పృహతప్పుటకాని సంభవించినచో లేక దానిని జీర్ణించుకొను పరిస్థితులలో రోగి లేని యెడల, దానిని సూదిద్వారా ఇయ్యవలెను.
సాధారణముగా ఈ ఇంజక్షనులను కండరాంతర్గత మార్గముద్వారా ఇచ్చెదరు. కాని కొన్నిటిని తప్పనిసరిగా సిరాంతర్గతమార్గము (ఇంట్రావీనస్ ) ద్వారా ఇయ్యవలసి యుండును. లేనియెడల అవి మిగుల బాధాకరము లగును. పాషాణ ఔషధములు (ఆర్సెనిక్ డ్రగ్సు) ఇందులకు ఉదాహరణములు. నీరుపోయిన రోగికి ద్రవము వలన సత్ఫలితములు కలుగుటకు సిరాంతర్గత పద్ధతిని ఇయ్యవలెను. ఇన్సులిన్ వంటి మందులు జీర్ణరసములవలన నశించును. అందువలన వాటిని ఇంజక్షనుల ద్వారానే ఇయ్యవలెను.
గ్లూకోసు, సోడియం క్లోరైడులవంటి కొన్ని మందులను ఇముడ్చుకొనగల శక్తి పురీషనాళము (రెక్టము)నకు కలదు. వాటిని పురీషనాళ మార్గముద్వారా ఇయ్యవచ్చును. కాని అటుల చేయబడుటలేదు. ఆ ఔషధములు ఇముడ్చుకొనబడగలవను నమ్మకము లేకపోవుటయే ఇందులకుగల కారణము. ఆ నష్టమును భర్తీచేయు నిమిత్తము ఆ ఔషధములను పెద్దమోతాదులో ఇయ్యవలసి యుండును. వాటిని రోగికి ఇచ్చుట, అతడు వాటిని ఇముడ్చుకొనుట కూడ మిగుల కష్టసాధ్యములే. రోగికి స్మృతి తప్పించుటకై వాడబడు క్లోరోఫారం, హిమద్రవము (ఈధర్ ) త్వరగా హరించి పోవునట్టివి. వాటిని పీల్పించవలెను. వైట్రస్ ఆక్సయిడునుకూడ ఇట్లే ఉపయోగింతురు. ఒక్కొక్కప్పుడు ఒకమందు శరీరములోని అన్నిమూలలకు చేరి అచ్చటి సూక్ష్మజీవులపై పని చేయుట సాధ్యము కాక పోవచ్చును. అప్పుడు ఆ మందును శరీరములోని అదే స్థానములోనుంచి, అచ్చటి సూక్ష్మజీవులపై చర్య కనబరచునట్లు చేయవలసి యుండును. రొమ్ము యొక్క తేజోమండల రంధ్రములోనికి పెన్సిలిన్ ఉంచుట, క్షయరోగులకు చిల్లిచేసి స్ట్రెప్టోమైసిన్ ఇంజక్షన్ ఇచ్చుట, శస్త్రచికిత్స నిమిత్తము స్పృహతప్పించుటకొరకు వెన్నెముకలోనికి చిల్లిచేసి ప్రోకెన్ మిశ్రమములు ఇంజక్షన్ ద్వారా పంపుట —— ఇందులకు ఉదాహరణములు. ఒక ప్రత్యేకస్థానములో మత్తు కల్గించుటకు 1/2 - 2% గల ప్రొకేన్ ద్రవమును శస్త్రచికిత్స కావలసినచోట స్థానికముగా ఇంజక్షను యిచ్చెదరు. నరములపని ఆపు చేయుటకు, నొప్పిని తగ్గించుటకు మందును నరములలోనికి ఇంజక్షనుల ద్వారా పంపుదురు. గజ్జి మొదలగు చర్మవ్యాధులకు కూడ మందులను నోటిద్వారా ఇచ్చుట వ్యర్థము. ఆ మందులను మలామా (ఆయింట్ మెంటు) రూపములో వేసలైనులో కలిపి ఇచ్చినయెడల, వాటిని కావలసినచోట రాచుకొనుటకు వీలుగా నుండును. కావున ఒక మందును ఏరీతిని ఇచ్చుట అను విషయము ఆ మందు శరీరములో ఏ భాగముపై పనిచేయగలదు ? అది ఎంతత్వరగా పనిచేయగలదు? అను రెండువిషయములపై నాధారపడును.
మోతాదు : రోగి వయస్సునుబట్టి తదనుగుణముగా మోతాదును నిర్ణయించవలెను. ఆ వ్యక్తి బరువును కొలిచి దానినిబట్టి మోతాదును నిర్ణయించుట అంతకన్న సరియగుపద్ధతి.
కిలోశరీరపు బరువు (2.2 పౌనులు) నకు ఇన్ని మిలీగ్రాములని మోతాదును వ్యక్తముచేయుదురు. పరస్పరానుగుణ్యములేని రెండుమందులు కలిపినయెడల ప్రతీఘాతకరముగ పరిణమించును. ఆమ్లములు, క్షారములు ఇందులకు ఉదాహరణములు. వాటిని ఒకే ఔషధములో కలుపగూడదు.
రాసాయనిక ద్రవ్యములో జీవాణువులను చంపు (కేమో తెరపీ) చికిత్సాశాస్త్రము : శరీరములోని జీవాణువులను చంపినను శరీరమునకు హానిచేయని ఔషధములను కనుగొనుట సాధ్యమే అని ఎర్‌లిక్ అభిప్రాయము. సవాయి రోగమునకు అతడు మొదట సల్వార్ సన్‌ను, ఆ పిమ్మట నియోసల్వార్ సన్‌ను కనుగొనెను. ఈనాడు వాడకములో నున్న రసాయనిక చికిత్సౌషధములు కొన్ని ఈ క్రింద పేర్కొనబడినవి.
విషపాండు జ్వరము (కాలేజరు) వ్యాధికి యూరియా స్టిబమైన్ .
సవాయిరోగమునకు నియోసల్వార్ సన్; చలిజ్వరమునకు మెపాక్రిన్, పాలుడ్రిన్, క్లోరోక్విన్.
ట్రిపనాసోమయాసిస్‌కు ట్రిపార్సమైడ్.
ఆంటీబయటిక్స్ : ఒక వ్యుత్పన్నత (కల్చరు)లో పెన్సిలిన్ నొటేటమ్‌ను ఒక అచ్చులో పోసినయెడల ఆ వ్యుత్పన్నతా మార్గములోనికి పెన్సిలిన్ వ్యాపించి, అందువలన సూక్ష్మజీవుల అభివృద్ధి తీవ్రముగా నివారింప బడునని ఫ్లెమింగ్ కనుగొని యున్నాడు.
సంపర్కదోషములయందు పెన్సిలిన్ చాల ఉపయోగకారి అని కనుగొనబడినది. క్రొత్తక్రొత్త యాంటీబయటిక్సు పెక్కింటిని కనుగొనుచున్నారు. అందు ముఖ్యమైనవి ఈ క్రింద పేర్కొనబడినవి.
క్షయరోగమునకు స్ట్రెప్టోమైసిటిన్, టైఫాయిడునకు క్లోరోమైసిటిన్, టైఫస్ మరియు ఇతర సూక్ష్మజీవులవలన సంక్రమించు సంపర్క దోషములకు ఆరోమైసిన్, టెఱ్ఱామైసిన్.
డిసెంట్రీ మొదలగు వ్యాధులకు బేసిబ్రేసిడ్, క్లోరోమైసిటిన్‌లో అంతర్భాగములను విభజించి దాని స్వరూప సూత్రమును కనుగొని, దానిని ఈ నాడు సమ్మేళన పరచుట జరుగుచున్నది. ఎరిత్రోమైసిన్, పెట్రోమైసిన్, నియోమైసిన్, ఫిలికామైసిన్, పోలీమైసిన్ మొదలగునవి ఈ వర్గమునకు క్రొత్తగా చేర్చబడిన ఔషధములు.
ఇందులో పెన్సిలిన్ మిక్కిలి విశిష్టత గలది. ఎందువల్ల ననగా దీనివలన సాధారణముగా ఎట్టి ప్రకోపనము ఉండదు. అయితే అప్పుడప్పుడు అల్లెర్జీవలన కొందరు మరణించినట్లు తెలియుచున్నది.
వీటి నన్నిటినికూడ విచక్షణా రహితముగా వాడ కూడదు. వాడినచో అవి శరీరజన్య విషకారణములు కాగలవు. ఇవి ప్రేగులపైగల సూక్ష్మజీవులను నాశనముచేసి, తద్వారా 'బి' విటమిన్ లోపమును కలుగచేయును. మధుశిలీంద్రపు క్రిములు హద్దుపద్దులులేకుండ పెరుగును. ఇందువలన కొందరికి సన్నిపాత జ్వరము వచ్చినట్లు తెలియుచున్నది. క్లోరోపిలికా వలన రక్తలోపముకూడ కలుగవచ్చును. పై ఔషధముల వలన పెక్కుమంది ప్రాణములు రక్షింపబడినవి. ట్యుబర్ క్యులర్ మెనంజైటిస్ వలన ఒకప్పుడు ప్రాణాపాయము అనివార్యముగ నుండెను. అయితే వీటిని వాడుటలో జాగ్రత్త అవసరము. ఈ సూక్ష్మజీవులు తొందరగా అదృశ్యమగును. వరుసగా ఆపుచేయకుండా సరిపడిన మోతాదులో ఇయ్యని యెడల అందుకు తట్టుకొనజాలిన సూక్ష్మజీవులు పెరిగి వ్యాధి లక్షణములు తిరుగబెట్టును. అప్పుడు ఈ మందువలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. క్షయ మొదలగు వ్యాధులలో ఇట్టి పరిస్థితిని నివారించుటకు కొన్ని మందులను కలిపి వాడుదురు. ఉదా : స్ట్రెప్టోమైసిన్‌ను అయినెకొటినిక్ ఆసిడ్, హైడ్రొజైడ్ లేక పి. ఎ. యస్, మరియు ఐ. యన్. హెచ్. తో కలిపి ఇచ్చెదరు.
ఈస్టువంటి క్రిములమీద కూడ కొన్ని ఆంటీబయటిక్ ఔషధములు పని చేయుచున్నవి. గ్రీసియో ఫోలిన్ మాత్రలు ఒక నెల రోజులు తీసుకొనిన యెడల తామర తగ్గిపోవును. నిస్టాటిన్, ఈస్టువలను కలుగు వ్యాధులపై పని చేయుచున్నది. తెల్లబట్ట వ్యాధి ఇందులకు ఉదాహరణము.
పెన్సిలిన్‌లు : ఇటీవల పెన్సిలిన్ యొక్క మాలిక్యూలును కనుగొని వివిధరకముల పెన్సిలిన్‌లను తయారు చేయుచున్నారు.
పెన్సిలిన్‌ను మాత్రల రూపములో కూడ తీసుకొన వచ్చును. క్రొత్తగా కనుగొనబడిన నోటిద్వారా ఇచ్చు పెన్సిలిన్‌లు ఇంజక్షనంత సమర్ధతతో పనిచేయుచున్నవి.
బెక్టీరియోఫేజస్ : ఇవి ప్రాణ అణువులు. సూక్ష్మజీవులు బేక్టీరియా, వైరసుల మీద బ్రతుకును. సల్‌ఫా ఔషధములు వచ్చుటకు పూర్వము, విరేచనములు, రక్త గ్రహణి మొదలగు రోగములకు బేక్టీరియాఫేజస్‌ను ఉపయోగించు చుండిరి. ఒక రకపు బేక్టీరియోఫేజస్ ఒకరకపు బేక్టీరియా లేక వైరసును భక్షించును. కాని ఇంకొక రకమును ముట్టవు. కావున ఇటీవల విరివిగా, బేక్టీరియా వైరసుల రకములను వేరుచేయుటకు ఉపయోగించుచున్నారు. పెక్కింటి సూత్రము లీనాడు తెలిసికొనబడినవి. సమ్మిళిత పద్ధతిపై ఈనాడు వాటిని ప్రయోగశాలలో తయారు చేయుచున్నారు. వాటిని విస్తృతముగా వినియోగించుట జరుగుచున్నది.
వైరుధ్య సూచనలు : వైరుధ్యసూచనలు గోచరించుటకు ముందుగా ఒకమందు శరీరమునందు ఏమి అగును? అను విషయమును గమనించుట అవసరము. నిద్రమందుగా వాడబడుచున్న బార్చిటురేటు కాలేయముపై ఫలితములు కనపరచును. కావున, కాలేయము మంచిస్థితిలో లేనప్పుడు దానిని ఇయ్యకూడదు. అట్లే కాలేయముపై ఫలితములు కనబరచు క్లోరోఫారమును, పాషాణము కలసిన ఔషధములను కూడ ఉపయోగింప కూడదు. గుండెజబ్బులలో మూత్రప్రవాహమును పెంపొందించుటకై ఇయ్యబడు పాదరసము కలసిన మందులు మూత్రకోశములపై పనిచేయును. కావున మూత్రకోశముల పరిస్థితి సరిగాలేనప్పుడు వాటిని ఇయ్యకూడదు. రోగనిర్ధారణ చేయుటకు పూర్వమే రోగికి మందులు ఇచ్చుట, మనదేశములో సామాన్యముగ చేయబడుచున్న పొరబాటు. అందువలన నిరుపయోగకరమైన వ్యయమునకు రోగిని అనవసరముగా గురిచేయుట కాగలదు.
ఎక్సురేలు : రేడియం : పుట్టకురుపు (కాన్సరు), లుకేమియా వంటి భయంకరవ్యాధుల చికిత్సకు వీటిని ఉపయోగింతురు. వ్యాధి యుండగనే అవి ఒకవిధమైన ఉపశమనము కలుగచేయును. పుట్టకురుపులలో కొన్నిటియందు వెంటనే ఫలితములు కనబడును. మరికొన్ని ఇట్టి చికిత్సలకు లొంగవు.
క్షకిరణ విసర్జన మూలద్రవ్యములు - రేడియో ఆక్టివ్ ఎలిమెంట్సు : మన శరీరమునందలి ఇనుము, సోడియము మొదలగు మూలపదార్థములయొక్క శరీర శాస్త్రవిషయముల పరిశీలనమునకు వీటిని వాడుదురు. ధైరోటాక్సి యాసిస్ చికిత్సకు క్షకిరణ విసర్జనమును, అయొడిన్‌ను, లుకేమియాకు ఈకిరణ విసర్జనమును, ఫాస్ఫరసును వాడుదురు.
శారీరక చికిత్స : పునరావాసము : ఎముకలు విరుగుట, లేక శిశుపక్షవాతము మొదలగు వ్యాధులకు చికిత్స చేయబడిన తర్వాత కండరములు వాడుకలో లేక స్తంభించిపోవుట తటస్థించును. రోగిచేత మిక్కిలి తొందరగా నడిపించుట చాలా అవసరము. మర్దనచేయుట, పిల్లల విషయములో బొమ్మలద్వారా అప్రయత్నముగను, ప్రయత్న సహితముగను చలనము కల్గించుట, విద్యుచ్ఛక్తిద్వారా కండరములకు చలనము కల్గించుట- ఇందు నిమిత్తమై అవలంబించవలసిన పద్ధతులు. శరీరములో గూడు కట్టుకొనియున్న సంపర్క దోషములకు, కండరములలో నొప్పులకు, “షార్టువేవ్” చికిత్సాపద్ధతి ఉపయోగకరము. అస్థిమార్దవరోగము (రికెట్సు) నకు రోగియొక్క సాధారణ ఆరోగ్యము కుదుటపరచుటకు, "అల్ట్రావైలెట్" చికిత్సా విధానము ప్రయోజనకరము.
నర్సింగ్ (రోగులకు పరిచర్య) : మహాజ్యోతిస్స్వరూపిణిగా వాసికెక్కిన ఫ్లారెన్సు నైటింగేలు అను నామె రోగులకు పరిచర్య చేయు వృత్తిని సువ్యవస్థితము చేయుటకు ఎనలేని సేవచేసినది. నర్సులు బహువిధములైన పనులు చేయవలసియుందురు. నిజమునకు వీరి తోడ్పాటు లేక వైద్యులు నిర్వహింపజాలిన పని చాలా స్వల్పము. రోగుల సౌకర్యములు చూచుట, సకాలములో మందు మాకులు ఇచ్చుట, రోగికి అధికముగా జ్వరము వచ్చినచో వాని దేహము తుడుచుట, రోగిని నిద్రపుచ్చుట — ఇవన్నియు వారి బాధ్యతలే. శస్త్రచికిత్స శాలలో సుశిక్షితులైన సిస్టరులు పరికరములు సిద్ధపరచి, శస్త్రచికిత్స చేయుటలో వైద్యునకు వీలైనన్ని విధముల సహాయపడుదురు. మన దేశములోని రోగుల సంఖ్యతో పోల్చినయెడల, నర్సుల సంఖ్య బహు స్వల్పము. వారు నిర్లక్ష్యము చేయబడు చున్నారు. వారికి ఆకర్షణీయములగు జీతములను ఇయ్యవలసియున్నది. రోగుల పరిచర్యకై నర్సులకు శిక్షణ ఒసగబడు కాలము 4 సంవత్సరములు, పరిచర్యాశిక్షణమునకు సంబంధించిన డిగ్రీ కోర్సు ఏర్పాటుచేయబడినది.
శస్త్రచికిత్సాపరికరములను సూక్ష్మ క్రిమి రహితముగా చేయుట : పిచికారీలు (సిరంజిలు), సూదులు మొదలగు వాటిని వేడినీటిలో ఉడకపెట్టినచో సాధారణముగా సరిపోవును. అందువలన ఒక్క బీజకణములు (స్పోర్సు) తప్ప, తక్కిన సూక్ష్మజీవులన్నియు నశించును. శస్త్రచికిత్స చేయుటకు ఇంతమాత్రము చాలదు. కావున పరికరములు మొదలగువాటిని 120° ఉష్ణోగ్రతగల నీటిలో 30 నిమిషముల కాలము ఉడికించెదరు. అందువలన అవి క్రిమిరహితములై బీజకణములు గూడ నశించును.
నవీన వైద్య విధానము, ఎందుండి ఉత్పత్తియైన మందులనైనను స్వీకరించుటకు సంసిద్దముగా నున్నది. మందులు బజారులో విక్రయించుటకు, విడుదలచేయుటకు ముందు వాటిని పరీక్షించి, అందలి మూలసూత్రములను నిర్ణయించి మానవులపైన జంతువులపైన, అందుమూలమున కల్గు శరీరజన్య విష ఫలితములను నిర్ణయింతురు. కండరముల సడలింపునకు ఇప్పుడు వాడబడుచున్న టూబర్ కేన్ అనునది అమెరికాలోని రెడ్ ఇండియనులు ఉపయోగించు బాణవిషము (ఆరోపాయిజన్) నుండి తీయబడినది. సర్పినా అను పేరిట నేడు ఉపయోగించ బడుచున్న మందు ఆయుర్వేదము నుండి స్వీకరింపబడినది. నవీన వైద్యశాస్త్రము అంతర్జాతీయ దృక్పథము కలది. అది స్తబ్ధముకాదు. చైతన్యవంతము. నూతనఔషధములు కనుగొని వైద్యశాస్త్రమునకు పుష్టినిచేకూర్చుటకు ప్రపంచములో నలుదిశల పరిశోధనములు జరుపబడుచున్నవి.
యస్. వేం.