సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చికిత్సాశాస్త్రము (ఆయు)
చికిత్సాశాస్త్రము (ఆయు) :
చికిత్సను గురించి చెప్పునది చికిత్సాశాస్త్రము. చికిత్సయన వ్యాధి నివారణోపాయము - చికిత్సకు రోగప్రతీకారమని పర్యాయపదము కలదు - వ్యాధులనేకములు. తన్ని వారణోపాయములు అనంతములు - వివిధ వ్యాధి శమనోపాయములను అనంతముఖముల సంకలనమొనర్చి అవసరమగునంత విశదముగను, సంగ్రహముగను, క్రమబద్ధముగను, ఏకోన్ముఖముగను, సారాంశమును ప్రపంచితము చేసినది చికిత్సాశాస్త్రము.
శ్లో. యాభిఃక్రియాభిర్జాయంతే శరీరేధాతవస్సమాః,
సాచికిత్సా వికారాణాం కర్మతద్భిషజాంస్మృతమ్.
చ. సూ. 16, 34
వికృతిచెందిన శరీరమందలి వాతాది (వాత, పిత్త, కఫములను) ధాతువులను సమగతికి తెచ్చుట కే యే ఉపాయము లనుసరింపబడునో, ఆయా ఉపాయానుసంధానము చికిత్సయని చరకము నిర్వచించెను. అనగా రోగప్రతీకారము చికిత్స – రోగప్రతీకారమున అవసరమగు ద్రవ్య, గుణ, కర్మ, ప్రయోగ, ఉపాయ, ఉపాదేయ,
క్రియాపాటవమును బోధించునది, తెలియజేయునది 'ఇట్లు చేయుము' అని ఆదేశించునది శాస్త్రము.
ఈ గంభీరార్థ సంగ్రహ సమన్వయము చికిత్సాశాస్త్రము. ఈ చికిత్సాశాస్త్రమునకు ఆయుర్వేదమని వాడుక. ఈ ఆయుర్వేదమును వేదముగను, శాస్త్రముగను, కళగను, మధురార్థ గంభీర భావసంపన్నమగు కావ్యముగను, బహుముఖముల వ్యా ప్తినందించిన ఈ భారతీయ చికిత్సాశాస్త్రమునకు ప్రత్యేకత కలదు. బాహుబల, మేధాబల, ఆత్మబల సంభావితమగు ఉత్తమ మానవసమాజ నిర్మాణము అసలీ శాస్త్రమునకుగల మహదాశయము. అది కారణముగా కేవలము వ్యాధి పీడితావస్థయందు తత్పీడా పరిహారార్థము ఉపయోగించు ప్రయోగ విధానములను మాత్రమే చెప్పక, అవ్యక్తము మొదలు మహదాది, ప్రకృతి, వికృతి తత్త్వాత్మకమగు సృష్టిక్రమమును, పంచభూతాత్మకముగ మానవ కళేబర నిర్మాణమును, శరీర రచనాసామగ్రిని, సమ, విషమ, ప్రకృతి లక్షణములను, శరీర వర్ణాకృతి ప్రమాణములను, సత్వ, రజస్తమో భేదములచేత, సాత్విక, రాజస, తామసాహంకార సహితముగ దేవగంధర్వాది మానవ ప్రకృతుల నిరూపణము, దేశకాల, వయోఽవస్థా విశేషముల చేతను, ఆహారవిహారములు కారణముగను, వాతాదిదోషములు దూషితములై శరీరమున గలిగించు వివిధవ్యాధి విశేషములను, వాతాదిధాతు వికల్పముల వలన వ్యాధుల అనేకత్వమును అనంతముఖముల విస్తృతమైయున్న వ్యాధిశమనక్రియా కలాపములను, రస, గుణ, వీర్య, విపాక, ప్రభావములచే, సువర్ణాదిలోహములు, పారద, గంధక, తాళకాది రసోపరస మహారసములు, ఓషధులు, చికిత్స సామగ్రిగా నుపయోగించు విజ్ఞానమును సంపూర్ణముగ విమర్శించి, విశదీకరించి, నిరూపించినది భారతీయ చికిత్సాశాస్త్రము.
శరీరము రోగములకు గురికాకుండ, సర్వదాపటిష్ఠమై, బలిష్ఠమై యుండునట్లు కాపాడుకొనుటయు - ఆధివ్యాధులకు లోనై ఆయువు క్షీణించి పోకుండ సంరక్షించుకొనుటయు - గళిత జవ్వనమై జరామరణావకుంఠిత మైన శరీరమును నిత్యయౌవనాయతనముగా, అజరామరముగా దిద్దుబాటుచేయుటయు, నిత్యదుఃఖాత్మకమగు జీవితమును నిత్యానంద సంధాయకముగ రూపొందించుటయు = శాసించి చెప్పినది. అందువలన ఇది చికిత్సాశాస్త్రమని భారతీయ విజ్ఞానవిదులు వాడుకచేయుచు వచ్చిరి.
ఇట్లు చెప్పబడిన చికిత్సాశాస్త్రము ఎనిమిది భాగములు గలది. ఈ ఎనిమిది భాగములకు అంగములనియు వాడుక గలదు.
1. కాయచికిత్స : కంఠమునకు దిగువగల కరచరణాది ప్రత్యంగ సంగతమగు కళేబరమున కలుగు వ్యాధులు, నిదానము, జ్యోతిష కర్మవిపాక సిద్ధాంతము, చికిత్సా విధానము, ఇందు చెప్పబడినవి.
2. బాలచికిత్స : జననాదిగ నాలుగైదు సంవత్సరముల వయస్సువరకుగల శిశువులకు కలుగు వ్యాధులు, కారణములు - ఔషధప్రమాణము - నిదానము గ్రహచికిత్స విధానము మొదలైనవి ఇందు చెప్పబడినవి.
3. గ్రహచికిత్స : భూత, ప్రేత, పిశాచాది గ్రహములు మానవుల నావరించుటకుగల కారణములు తొలగించుట కవసరమగు శాంతి, బలి, మంగళ క్రియాకలాపములు ఇందు చెప్పబడినవి.
4. ఊర్ధ్వంగచికిత్స : కంఠమునుండి పైనగల కర్ణాస్య నాసికా నేత్రసంగతమగు శిరస్సునందు గలుగు వ్యాధులు- నిదానచికిత్సావిధానము - ఇందు చెప్పబడినవి.
5. శల్య చికిత్స : శరీరమునందేభాగమునైనను విరిగిన ఎముకల నతుకుట, తీసివేయుట, శస్త్రముచేయుట, వ్రణచ్ఛేదవ, ఆలేపన, బంధనములను చికిత్సా విధానము లిందు చెప్పబడినవి. ఈ శస్త్రచికిత్సావిధానమునందొక విశేషము. నాసికా చ్ఛేదనమునందు, కృత్రిమ నాసికాసంధానమునందు, భగ్నాస్థిసంధాన భేదనచ్ఛేదనములందు మెలకువలు విశేషముగ చెప్పబడినవి. అసలీ చికిత్సా విధానమునందు అస్థిపంజర పరిశోధనయే వేరు.
6. దంష్ట్రా చికిత్స : ఇది విషచికిత్స. సర్పాది విషజంతువుల విషప్రభావము, వ్యాఘ్రాది క్రూరజంతువుల విషప్రభావము - అవి మానవ శరీరమున ప్రసరించినపిమ్మట కలుగు వేగములు, పెట్టుడుమందులు, వీటివేగములు, తెలిసుకొనుట, లేపన, నస్యాంజన చికిత్సావిధానము లిందు చెప్పబడినవి.
7. జరాచికిత్స : దీనిని రసాయన చికిత్సయని వాడుదురు. జరయన యౌవనము సడలిపోవుట (ముసలితనము). ఇందనేక విషయము లంతర్భూతములు. వెండ్రుకలు నెరయుట, చెవులు వినబడకపోవుట, చత్వారము అనగా నలుబది సంవత్సరములకు సహజముగా కనులచూపు మందగించుట, శరీరము ముడతలుపడుట - పండ్లూడుట, మున్నగు లక్షణములు కలుగకుండునట్లును, అజాగ్రత వలన ఇట్టి లక్షణములు పొడచూపిన నివారణ చేయునట్లును, ఈ చికిత్సావిధానము చెప్పబడినది. ఇందొక విశేషము ఏమన, జరాక్రాంతులను, నూతన యౌవన వయస్కులనుగా చేయుట - ఈ చికిత్సయందు ఆహార విహార నియమములు, ధరించుబట్టలు, ఉండుటకు వసతులుగల నివాసము వివరముగా కలవు. 8. వాజీకరణ చికిత్స : అనవచ్ఛిన్నమగు ప్రజాతంతువునకు, అనిర్వచనీయమగు సర్వేంద్రియానంద సందోహమునకు మూలమగు మిధున ధర్మమునందు అనంతపాటవమును సమకూర్చుటను, స్థిరముగ కాపాడుటను, ఈ చికిత్స విధానమునందు చెప్పబడినది.
ఈ తీరునగల అష్టాంగ చికిత్సావిధానమును దైవాసుర మానుషీ చికిత్సా పద్ధతులని తిరిగి మూడు భాగములుగా సులభ గ్రాహ్యమగునట్లు వివరించనైనది.
శ్లో. ఆసురీమానుషీదైవీ చికిత్సా సా త్రిధా మతా
సూత ప్రధానదైవీస్యా చ్ఛేదభేదాత్మికాసురీ
మానుషీ సద్రసాజ్ఞేయా జపహోమాది సంస్కృతా
కలౌచాల్పబలేలోకే మానుషీ తత్రపూజితా.
ఆసురీచికిత్స, మానుషీ చికిత్స, దైవీచికిత్సయని చికిత్స మూడువిధములు.
(1) దైవీచికిత్స : ఇది పాదరసము ప్రధానముగ గలది. ఈ విధానమునకు శైవీచికిత్సా సంప్రదాయమని వాడుక. కైలాసవాసియగు పరమశివుడు ప్రయోక్తగను ప్రవక్తగను చెప్పబడిన శాస్త్రమగుటచే ఈ సంప్రదాయమునకీ వాడుక కలిగినది. శివుడు రససిద్దుడు - మృత్యుంజయు డనుటకు ఇది కారణము. శివుడు హాలాహల భక్షణము చేయుట ఈ రససిద్ధి మహత్వదర్శనమే. రససిద్ధులు జరారహిత దృఢకాయులుగ, అజేయ బలపరాక్రమో పేతులుగ, మృత్యుంజయులుగ, అనంతకల్పములు అమరులుగ నుందురని రసశాస్త్రసిద్ధాంతము - ప్రాచీన గ్రంథము లట్లుంచి పూజ్యపాదులగు శ్రీ గోవింద భగవత్పాదుల "రసహృదయతంత్రము”, శ్రీ మాధవ విద్యారణ్యుల “రసేశ్వర దర్శనము” నిదర్శనములు - రసశాస్త్రమును విరివిగా ప్రచారమున నందించినది “మత్స్యేంద్రనాధాది" నవనాథసిద్ధులు, “సిద్ధేరసేకరిష్యే - మహీమహం నిర్జరా మరణం" - రసహృదయ తంత్రము (అధ్యాయము 1. శ్లోకము - 6) నందు గోవింద భగవత్పాదులు రససిద్ధి కలిగిన, 'నేను లోకమంతయు నిర్జరామరణముగ చేయుదును. మనుష్యుల నందరను ముదిమియు, చావును లేని వారినిగా చేయుదు'నని ప్రతిజ్ఞ చేసెను. విమర్శకులకీ గ్రంథము మహోపయోగ్యము. శ్రీ శంకరులాదిగా మతత్రయా చార్యకోటి ఈ రసశాస్త్ర పారంపర్యము గలవారనియు, ఆయా పీఠములం దీ రసగ్రంథములు ఈనాటికిని గలవనియు ప్రతీతి. శ్రీ మాధవ విద్యారణ్యులు ఇందు అందెవేసినచేయి యని వారి వర్తనయు, రచనయు ప్రమాణములు. వీరు సిద్ధరసజ్ఞానమును ఇట్లు చెప్పిరి. “పూర్వలోహే పరీక్షేతపశ్చాదేహే ప్రయోజయేత్"- తరువాతకాలమున ప్రసిద్ధి సిద్ధనాగార్జునునకు గలదు. శ్రీశైలమునం దీ సిద్ధులు గలరనియు, సిద్ధులును గలవనియు వాడుక.
ఇట్లు మహత్వము, పవిత్రమునగు రసశాస్త్రమును కేవల ధాతువాదముగా మాత్రమే దొరికినంతలో పరిశోధించుచున్న సిద్ధయోగులు, యోగభ్రష్టులు నే డనేకులు గలరు. రసయోగములను సాధించుటలో ఆంధ్రమందు గల ఆయుర్వేదవైద్యు లగ్రగాములు. ప్రత్యేక రసయోగములను, రసకలిత యోగములను విరివిగా ఆంధ్రమునందు వైద్యులు ప్రాచీనమునుండియు వాడుక చేయుచున్నారు. యోగరత్నాకరము, చింతామణి, బసవరాజీయములు ఇందుకు చాలవరకు ప్రమాణములు.
2. ఆసురీచికిత్స : ఇది వివిధాత్మకమైన శస్త్రచికిత్స గలది. ఇందుకు సుశ్రుత సంహిత ప్రమాణము - చికిత్స యందు ఛేదన, భేదనాది క్రియలలో క్రూరముగా ప్రవర్తించవలసి యున్నందున ఆసురీచికిత్సయని చెప్పబడినది.
3. మానుషీ చికిత్స : ఇది మధురాదిరసములు, సకల ఓషధులు, పూర్వజన్మార్జిత కర్మవిపాక, గ్రహ, నక్షత్ర జప, హోమ, బలి, మంగళ క్రియా విశేషములు ప్రధానముగా గలది . ఈ మానుషీ చికిత్సా సంప్రదాయమునకు, బ్రాహ్మీచికిత్సా విధాన మని వాడుక . ఇందుకు చతుర్ముఖబ్రహ్మప్రవక్త. శ్రీమహావిష్ణువు ప్రయోక్త. అమృతోత్పాదనకథ ఇందుకు సంబంధము కలది. కైలాస వాసుడగు శ్రీ శంకరు డెట్లు రసశాస్త్ర నిష్ణాతుడో, క్షీరసాగరశయాను డగు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మీ సాంప్రదాయమునం దంత పరాకాష్ఠ కలవాడు - ఈ సంప్రదాయమునకు ప్రధానముగా చరక సంహిత ప్రమాణము.
చికిత్స ఎట్లుచేయవలయును? చికిత్సచేయువా డెట్లుండ వలయును? రోగి ఎటువంటివాడుగా నుండిన చికిత్సార్హుడు? రోగికి పరిచర్య చేయువా రెట్లుండవలయును ? అనునట్టి ఉత్తమమైన చికిత్సా సంప్రదాయములను నిరూపించినది భారతీయ చికిత్సాశాస్త్రము.
తస్కరవైద్యులు, కువైద్యులు, సంకరవైద్యులు, ప్రజలకు - శాస్త్ర గౌరవమునకు హానికలుగ చేయుచుందురనియు, ప్రభుత్వముయొక్క అజాగ్రతవలన ఇట్టి వేషధారులు చికిత్సకులుగా బయలుదేరుదురనియు, అట్టి వారిని ప్రభుత్వము న్యాయముచే శాసింపవలయుననియు, దండనీతిచే శిక్షించవలయుననియు సుశ్రుతసంహిత బోధించినది, చికిత్సార్హుడగు వైద్యుని గుణదోషములు నిరూపించుటలో రాజర్షియగు సుశ్రుతుని సంహిత ప్రమాణము. అందీ తస్కర వైద్యులును, కువైద్యులును సంకరవైద్యులును నిరూపింపబడిరి.
తస్కర వైద్యులు :
శ్లో. ఆమం విపత్యమానం చ
సమ్యక్ పక్వం చ యో భిషక్
జానీయా త్సభవే ద్వైద్యః
శేషా స్తస్కరవృత్రయః.
(సు. సూ. 17. 7.)
కువైద్యులు :
శ్లో. స్నేహాదిష్వనభిజ్ఞాయే భేద్యాదిషుచ కర్మసు
తే నిహంతి జనంలోభాత్ కువైద్యా నృపదోషతః
(సు. సూ. 3.52)
సంకరవైద్యులు :
శ్లో. క్రియాయాస్తు గుణాలాభే
క్రియామహ్యం ప్రయోజయేత్
పూర్వస్యాం శాంతవేగాయాం
నక్రియా సంకరోహితః.
(సు. సూ. 35, 48)
మోసగాండ్రగు ఈ వైద్యుల లక్షణములు చెప్పి ప్రజయు, ప్రభుత్వమును మోసపోకుండునట్లుద్బోధించినది, శస్త్రచికిత్సా ప్రాధాన్యతగల సుశ్రుత సంహిత.
భారతీయ చికిత్సా శాస్త్రమునందు బ్రాహ్మీచికిత్సా విధానమున చరక, సుశ్రుత సంహితలు రెండును విషయ వివరణమునందును, గౌరవార్థ గాంభీర్య ప్రభావము నందును, సమతులితములుగ ప్రమాణములు గలవి. చరకము బ్రహ్మర్షి గురుకులమునకు చెందిన సంహిత. సుశ్రుతము రాజర్షి గురుకులమునకు చెందిన సంహిత. సుశ్రుత సంహితయందు శస్త్రాస్త్ర జనితములగు వ్రణ బాధోపశమనము, శరీరమునందలి శల్యోద్ధరణము, ప్రమేహాదులవలన బాహ్యాంతర్దేహ జనితములగు పిటికా, విద్రధి, భగందరాద్యపద్రవములందు మూఢగర్భ, కష్టప్రసవ, దుష్టప్రసవ, కష్టార్తవ, దుష్టార్తవ, నష్టార్తవము లందు స్త్రీ, పురుష మర్మావయవములందు జనించు వ్రణములు, మూత్రాశ్మరీ, మూత్ర నిరోధము, అండవృద్ధి మొదలగు ఉపద్రవములందు చికిత్సచేయు విధమును, సర్పాది విషజంతువుల వలనను, గరప్రయోగముల వలనను, కలుగు దుర్మరణములందు శవపరీక్షచేయు విధము, శరీరగతస్నాయు కండరాస్థి సంధి సంఘాత విజ్ఞానార్థము, విద్యార్థి ప్రబోధార్థము అస్థిపంజర నిర్మాణ విధము, పంజరమును రక్షించు విధము, శస్త్ర క్షారాగ్ని కర్మలు, అందు శస్త్ర ప్రయోగము, క్షారములను సిద్ధముచేయుట, ప్రయోగించుట, అగ్నిచే గుర్తులు వేయుట, ఇందు నైపుణ్య ప్రదర్శనము మున్నగు విషయములు విస్తృతముగా గలవు. రసోవరస ప్రయోజనములు, దివ్యౌషధీ ప్రయోగములును విపులముగా చర్చింపబడినవి. సుశ్రుత సంహితా రచనమునకు ధన్వంతరి భగవానుని అవతారమగు దివోదాసు కాశీరాజు ప్రవక్త, విశ్వామిత్ర మహర్షి కుమారుడగు సుశ్రుతుడు విషయ సంధాత. సుశ్రుతుడు విషయ సంధాత యగుటచే గ్రంథమునకు సుశ్రుత సంహితయని వాడుక కలిగినది. ఇందు ఆరు స్థానములు కలవు. (1) సూత్ర, (2) నిదాన, (3) శారీర, (4) చికిత్స, (5) కల్ప, (6) ఉత్తరస్థానములు. మూడుదోషములు (వాత, పిత్త, కఫములు), సప్తధాతువులు, రస, రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జ, శుక్రములు), రెండు మలములు (మూత్ర, పురీషములు), షోడశకలలు. (కలాశబ్దమున కిచట అంగ ప్రత్యంగము లని యర్థము. "శిరో, గ్రీవ, పాణి, పాద, పార్శ్వ, వృష్ఠ, ఉదర, భుజములు, చుబుక, నాస, ఓష్ఠ, వంక్షణ, అంగుష్ఠ, అంగుళీ, పార్ష్ణి, గుల్ఫములు." ఇట్లంగ ప్రత్యంగములు-16), ఏకాదశ ప్రాణములు (అగ్ని, జల, వాయు, సత్వ, రజ, స్తమములు పంచేంద్రియములు) 1120 రోగములు, ఐదువందల డెబ్బదిమూడు ద్రవ్యములు, ఈ ఆరు స్థానములందు చెప్పబడినవి. బ్రహ్మర్షి గురుకులమునకు చెందిన చరకమునకు అగ్నివేశ సంహితయని పేరు. చరకుడు సంస్కరించిన కారణముగా చరకసంహితయని వాడుక కలిగినది. అగ్ని వేశ సంహితకు ప్రవక్త ఆత్రేయ భరద్వాజ మహర్షి. సంధాత అగ్నివేశుడు. సంస్కర్త చరకుడు. ప్రతిసంస్కర్త దృఢబలుడు. అగ్నివేశకృతమగు ఈ చరకసంహితయందు చికిత్సా శాస్త్రము సర్వాంగములతో సంపూర్ణముగ, సవిమర్శనముగ చర్చింపబడినది. ఈ సంహితయందు అగ్నివేశుడు ప్రతిజ్ఞాపూర్వకముగ ఇట్లు చెప్పెను.
శ్లో. చికిత్సా వహ్ని వేశస్య స్వస్థాతు రహితంప్రతి
యదిహాస్థిత దన్యత్ర యన్నేహాస్థి నతత్క్వచిత్.
స్వస్థుని ఆరోగ్యరక్షణమును గురించి రోగి రోగబాధా పరిమోక్షణమును గురించి అగ్ని వేశుని సంహితయందేది.
చెప్పబడినదో ఆ విధినిషేధములు, ఆయా రోగనిదాన లక్షణ చికిత్సా విశేషములు మాత్రమే దేశమంతటను కలవు. అగ్నివేశుని సంహితయందేది చెప్పక విడిచిపెట్ట బడినదో ఆ విషయము మరెచ్చటను గాని కానరాదు.
చికిత్సాశాస్త్రమునందు స్వతంత్రములు, ప్రధానములు నగు గ్రంథములు చరక, సుశ్రుతములు మాత్రమే. అష్టాంగ సంగ్రహమను ప్రసిద్ధిగల ఆయుర్వేద చికిత్సా గ్రంథము చరక, సుశ్రుతముల సంగ్రహస్వరూపము. అష్టాంగహృదయము సంగ్రహానుకరణము. ఈ రెంటిని కూడ సంహితలని వాడుచున్నారు. చరకసుశ్రుతముల పోలికలనుబట్టి శార్జధరసంహిత, యోగరత్నాకరము, భావప్రకాశ, చింతామణి, బసవరాజీయము-ఇవిఅన్నియు చికిత్సాశాస్త్ర మర్యాదను వ్యాపింపచేయునవియే. వీటిని నిబంధనగ్రంథము లనియెదరు, ఇవిగాక, కేవల యోగ గ్రంథములు, చిన్నవి, పెద్దవి చికిత్సా సంప్రదాయమున కేవల ఔషధములను మాత్రము చెప్పునవి చాల గలవు. చరకసంహితకు ప్రాచీన, అర్వాచీనములుగ చెప్పబడు అనేక గ్రంథములు లోకమునందు నామమాత్రముగా వినబడుచున్నవి. ఆయుర్వేదసూత్రము లనునవి, భరద్వాజ సూత్రము లనునవి కొన్ని గలవు. అవి ప్రాచీనములుగా గాని, అర్వాచీనములుగా గాని, భాష, విషయవిశేషములనుబట్టి కనపడవు. సర్వతోముఖ విజ్ఞాన సముచ్చయమగు ఋగ్యజుస్సామాధర్వణాత్మక మైన వేదమంతయు భారతీయుల చికిత్సాశాస్త్రము, నిత్యజీవన ప్రవృత్తమగు సద్వర్తనము (మంచి నడవడిక) హితాహితాత్మకమగు విహారాహార ఆచారవ్యవహార విధినిషేధము చెప్పి, జన్మ జరామరణ దుఃఖిత మగు మానవ జీవనమును అమృతమయముగ, మనుష్యానందమును బ్రహ్మానందమయముగ చేయ ప్రబోధించు మానవధర్మసర్వస్వము చికిత్సా శాస్త్రము.
వే. తి. వెం. రా.