సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చార్వాకము
చార్వాకము :
క్రీ. పూ. 6 వ శతాబ్దికిని, క్రీ. శ. 2 వ శతాబ్దికిని నడుమ నుండిన కాలము పురాణయుగమని (Epic period) చరిత్రకారు లభిప్రాయపడుచున్నారు. ఆయుగము మేధావిభూతికిని, అత్యంతగాఢతత్త్వవిచారమునకును, సర్వతోముఖ వికాసమునకును తావలమయి యుండెను.
అది చార్వాకులయొక్క యు, బౌద్ధులయొక్కయు, శకముగా పరిగణింపబడుచు వచ్చెను. సహజజ్ఞాన నిర్ణయము (intuition) నకు ప్రతిగా విచారపద్ధతియు, ప్రవృత్తికి బదులుగా తాత్త్వికచింతనమును ప్రాబల్యము నొందసాగెను. ఆ పురాణయుగమందు పెక్కు తాత్త్విక సిద్ధాంతములలో మీమాంసలు జరుపబడి, ప్రయోగములు చేయబడెను. లెక్కకు మిక్కిలిగా నూతన తాత్త్విక ధోరణులు ప్రతిపాదింపబడెను. సాంఖ్య, యోగ - దర్శనములు ప్రాథమిక రూపములలోను, న్యాయ, వైశేషిక దర్శనములు, స్వతంత్ర ప్రతిపత్తిలోను వికాసము చెందినవి. మీమాంసాద్వయము మాత్రము వేదమంత్ర ప్రతిపాదనలనుండియే సరాసరి యుద్భవించినది. ఈదర్శన విధానములన్నియు పురాణ యుగాంతములోనే నిస్సంశయముగను, అసందిగ్ధముగను ప్రచారములోనికి వచ్చినవి.
చార్వాకముయొక్క ఆవిర్భావము : తత్త్వశాస్త్రమువలె భౌతికవాదము ప్రాచీనమైనది. బౌద్ధ యుగమునకు పూర్వమే భౌతికవాదము ఒక సిద్ధాంతరూపములో ప్రచారమం దుండెను. ఋగ్వేదమునందలి మంత్రములలో భౌతికవాదము బీజరూపములో కాననగును. రామాయణము, భారతమువంటి ఇతిహాసములలోగూడ భౌతిక వాదమునుగూర్చి ప్రసక్తి కలదు. మనుస్మృతికారుడు నాస్తికులను గూర్చియు, పాషండులనుగూర్చియు, వక్కాణించి యున్నాడు. “బృహస్పతి సూత్రములు" అనునది భౌతికవాద సిద్ధాంతముపై సాధికారముగా రచించబడిన యొక ప్రాచీనగ్రంథమయి యున్నది. కాని ఈ సూత్రములు అంతరించినవి. 'సర్వదర్శన సంగ్రహము' అను గ్రంథముయొక్క ప్రథమాధ్యాయమును, వాత్స్యాయన 'కామసూత్రముల' యందలి ప్రథమ, ద్వితీయ అధ్యాయములును, హరిభద్రుని 'షడ్దర్శన సముచ్చయము' ను, భిన్నధోరణులను ప్రతిపాదించిన తత్త్వవేత్తల యొక్క వాదోపవాదములును ప్రధానములైన మూలాధారముగ నున్నవి.
భౌతికవాదమునకు అర్థము : చార్వాకనామము సాధారణముగా భౌతికవాదికి అన్వయింప బడుచున్నది. 'చార్వాక" అనునది ఏతన్మత ప్రవక్తయొక్క నిజ నామముగా ఒక వాదము కలదు. 'చార్వాక ' పదము ప్రారంభములో భౌతికవాదికి పెట్టిన వర్ణనాత్మక నామధేయమై యుండునని మరియొకవాదము కలదు. ఏలయన "తిని, త్రాగి, తందనా లాడుటయే జీవితలక్ష్యము" (చర్వ్=తినుట; నమలుట) అని చార్వాకుడు బోధించుటచేతనో, లేక ఆతని వాక్కు మనోహరముగను, మధురముగను (చారు=మనోహరమైన; వాక్ = వాక్కులు) ఉండుట వలననో, ఆతని కాపేరు కల్గినదని వీరి ఊహ. భౌతిక వాదమునకు 'లోకాయతమతము' అని కూడ నామాంతరము గలదు. లోకాయతమత మనగా సామాన్యమానవుల భావన. అనగా ప్రపంచ సుఖాభిలాష పరత్వము అని అర్థము.
చార్వాకజ్ఞాన మీమాంస : చార్వాక తత్వశాస్త్రమంతయు ఆతడు ప్రతిపాదించిన జ్ఞానసముపార్జనా సామగ్రి శాస్త్రము (epistemology) పై ఆధారపడి యున్నట్లు భావింపబడు చున్నది. యధార్థానుభవము, నిజమైన కారణము, “ప్రమ" అనబడును. అట్టి ప్రమకు కారణము “ప్రమాణము" అనబడుచున్నది. ప్రత్యక్షజ్ఞాన మొక్క టే (ప్రత్యక్ష) ప్రమాణమని, అనగా అదొక్క టే జ్ఞాన సముపార్జనమునకు విశ్వసనీయమైన మూలాధారమని చార్వాకుడు ప్రతిపాదించెను. అందుచే పెక్కు తాత్వికులచే యుక్తప్రమాణములుగా పరిగణింపబడు చున్న అనుమాన ప్రమాణము (inference), 'శబ్దప్రమాణము' (testimony) అనువాటి అస్తిత్వమునే ఆతడు పూర్వపక్ష మొనర్చెను.
అనుమానము (Inference) : ఏది ప్రత్యణానుభవము (perceptible) కాజాలదో, దానికి ఉనికియేలేదు (non-existent). ఏలయన, అది గోచరము కాకుండుటయే అని చార్వాకుడు వక్కాణించెను. ఇచ్చట అనుమాన (inference) ప్రసక్తియే లేదు. మనము పొగను చూచినప్పుడు అచ్చట నిప్పు ఉన్నదని అనుకొందుము. ఇది జ్ఞాపకశక్తి ల్లనో, గత ప్రత్యక్షానుభవము వలననో సాధ్యమగుచున్నది. ఈ కారణమునే 'అనుమానము' (inference) అను సూత్రము ఒకప్పుడు సత్యముగా భాసించును. మరొకప్పుడు అసత్యబద్ధ మగుచున్నది. అనంతర కాలమునకు చెందిన భౌతికవాదులు (దేహాత్మవాదులు) 'అనుమాన ప్రమాణము'ను గూర్చిన తమ భావమునకు కారణములను పేర్కొనిరి. వ్యాప్యము (ధూమము) నకును, వ్యాపకము (అగ్ని) నకును సర్వ సామాన్యముగ సంబంధ ముండునను జ్ఞానము ఉన్ననే గాని మనము 'అనుమానము'లను గైకొన జాలము. అయితే ఇది సాధ్యముకాని పని. ఏలయన, ప్రపంచములో ఇప్పుడు పలుతావులందున్న ధూమాగ్నులను మనము చూడజాలము; అట్టియెడ, భూతకాలమందు వ్యా ప్తిచెందిన ధూమాగ్నులుగాని, భవిష్యత్కాలమందు వ్యాప్తి చెందనున్న ధూమాగ్నులుగాని మనము చూడజాలము. అట్టియెడ భూతకాలమందు వ్యాప్తిచెందిన ధూమాగ్నులుగాని, భవిష్యత్కాలమందు వ్యాప్తి చెందనున్న ధూమాగ్నులుగాని ప్రత్యక్ష విషయములుగా నుండవు. కాబట్టి వీటి విషయమున నిత్యమైనట్టియు, స్థిరమైనట్టియు (invariable) సర్వసామాన్యమైనట్టియు (universal) సంబంధము (వ్యాప్తి) ప్రత్యక్ష జ్ఞానము (perception) చే నిర్ణయింపబడజాలదు. ఈ స్థిర సంబంధము (invariable relation = వ్యాప్తి) మరియొక 'అనుమానము' పై గూడ ఆధారపడి యుండునని భావింపజాలము. దీనిలో 'అనవస్థ' అను సమస్య ఉత్పన్నమగును. ఈ 'అనుమానము' యొక్క ప్రామాణ్యము కూడ మరల ధ్రువపరచవలసి యుండును. ఉపమాన ప్రమాణము (analogy) అనునది 'అనుమాన ప్రమాణము' కాజాలదు. అందుచే అనుమానము అప్రామాణ్య మగును (invalid). అనుమానము విషయగతమైన (subjective) సంబంధము మాత్రమే యగును. ఈ విషయగతమయిన సంబంధము ఒకవేళ సమర్థనీయమే అయినచో అది విశేష ధర్మమే యగును (అది ఆకస్మిక సంఘటనముగా నుండును).
శబ్దప్రమాణము : చెవుల వలన ప్రత్యక్షముగ విననగు మాటలు శబ్దప్రమాణ మనబడును. కాబట్టి శబ్దజ్ఞాన మనగా (knowledge of words) శబ్దములను చెవుల ద్వారా ప్రత్యక్షముగా వినుటవలన కలిగెడి జ్ఞానమని అర్థము. ఇదియే పరమ ప్రామాణికమైనది. కాని జ్ఞానేంద్రియముల ద్వారా సిద్ధించని జ్ఞానము, అనగా జ్ఞానేంద్రియములకు అతీతములయినట్టి, పరోక్షమైనట్టి, పదార్థములనుగూర్చి మనకు ప్రసాదింపయత్నించు జ్ఞానమునుగూర్చి సందేహములుండకపోవు. అట్టి జ్ఞానమునందు ప్రమాదము, పొరపాటు ఉండగలవు. అనుమానప్రమాణముచే బలపరుప బడిన శబ్దప్రమాణము (testimony), అనుమానప్రమాణమువలెనే అనిశ్చయమైనది. చార్వాకుడు వేదముల ప్రమాణమును తీవ్రముగా ఖండించెను. చార్వాకుల సిద్ధాంతములను బట్టి, వేదములు అసత్యసంగతము, స్వవచనవ్యాఘాతము, పునరుక్తి అను దోషములచే దూషితము లైనవి.
ఆధ్యాత్మికవాదము (metaphysics) : పదార్థమనున దొక్కటే యథార్థమైనది. ఎందుకనగా అదొక్కటే ఇంద్రియములకు గోచర మగును. భూమి, జలము, అగ్ని, వాయువు అను చతుర్భూతములు శాశ్వతము లైనవి. సృష్టిలో ప్రాక్తనజాతి జంతువులనుండి, తాత్త్వికునివరకు ప్రపంచముయొక్క పరిణామమునుగూర్చి వివరింప గల్గినవి. ఈ చతుర్భూతములు మాత్రమే. మేధ అనునది చతుర్భూతములయొక్క వికారమే (Modification). చతుర్భూతములనుండి ఉత్పన్నమైన మేధకూడ చతుర్భూతములు విడివడి పోవుటతో నశించును. చతుర్భూతములు సంఘటితమైనచో, ఆత్మచైతన్యముగల ప్రాణము విచిత్రముగా ఉద్భవింపగలదు. ఆత్మ అనునది శరీరము కంటె భిన్నమైనదిగ మనము పరిగణింప నవసరములేదు. తమలపాకు, సున్నము, పోకచెక్క, ఈ మూడింటిని కలిపి తాంబూల చర్వణము చేసినప్పుడు ఏర్పడు ఎరుపు రంగువలెనో, లేదా ప్రారంభములో మత్తులక్షణములు లేని బెల్లపు నీటిని పులియబెట్టినచో అది మత్తుపదార్థముగా పరివర్తనము చెందునట్లుగానో, నాలుగు భూతములు మానవశరీరముగా సంఘటితమైన వెంటనే మేధాశక్తి ఉత్పన్నమగును. ఆత్మఅనగా శరీరమే. ఆ శరీరమే " నేను లావుగా నున్నాను”, “నేను యువకుడను”, “నేను వృద్ధుడను” ఇత్యాది వాక్యములలో ఇమిడియున్న లక్షణములతో అభివర్ణింపబడు చున్నది. మానవుని చిత్తవృత్తి అతడు భుజించు ఆహారపదార్థములపై ఆధారపడి యుండును. సదానందుడు, తాను రచించిన 'వేదాంతసారము' నందు చతుర్విధములైన భౌతికవాదసంప్రదాయములనుగురించి ప్రస్తావించియుండెను. ఒక సంప్రదాయము ఆత్మ, శరీరముల ఏకత్వమును భావించును. మరియొక సంప్రదాయము ఆత్మ. జ్ఞానేంద్రియముల ఏకత్వమును భావించును. మూడవ సంప్రదాయము ఆత్మ, శ్వాసల ఏకత్వమును భావించును. నాల్గవ సంప్రదాయము ఆత్మ మస్తిష్కముల ఏకత్వమును భావించును. ఏ సంప్రదాయ భావనలోను ఆత్మ అనునది ఆధిభౌతిక రూపదర్శనమే (material phenomenon).
పరలోకమున్నదని భావించుట పొరపాటు. ఈ ప్రపంచము తప్ప, స్వర్గనరకము లనునవి లేనేలేవు. ఇవన్నియు వంచకులు భ్రమలు కలుగజేయుటకై పన్నిన కల్పనలు. మతమనునది యొక మానసరుగ్మతవంటిది. ప్రపంచము యొక్క ఆవిర్భావమునకు భగవంతుని ప్రసక్తి అనవసరము.
ప్రపంచమును గూర్చిన చార్వాకుని సిద్ధాంతము ఒక్కొక్కప్పుడు స్వభావవాదము (Naturalism) అనియు, యదృచ్ఛావాదము (Mechanism) అనియు పేర్కొనబడుచున్నది. విశ్వసృష్టికి కారణభూతముగ చిన్మయానంద స్వరూపుడగు భగవంతుని అస్తిత్వమును అంగీకరింపక, ప్రపంచము కేవలము చతుర్భూతాత్మకమైన సంఘటిత పదార్థ సంజన్యమే యని చార్వాకుడు వివరించుటచేత, ఆతనిమతమును 'స్వభావవాద' మనియు, 'యదృచ్ఛావాద' మనియు కొందరు పేర్కొనుచున్నారు.
చార్వాక సిద్ధాంతముతో 'ఎంపెడోకిల్స్' (Empedocles) అను నాతడు ప్రతిపాదించిన తాత్త్విక సూత్రములను పోల్చనగును. ఈతని తత్త్వసిద్ధాంతమందును చతుర్భూతముల ప్రసక్తి కలదు. అంతేకాక రెండు పరివర్తన సూత్రముల ప్రసక్తియు కలదు. 1. ప్రేమ ఐక్యమును సిద్ధింపజేయును; 2. ద్వేషము వైరుద్ధ్యమును కలుగజేయును.
నైతికశాస్త్రము (Ethics) : మానవజాతియొక్క శీలవంతమైన ప్రవర్తనమే నైతికశాస్త్ర మనబడుచున్నది. దేహాత్మవాదము (materialism) నకు సంబంధించిన శాస్త్రము లన్నియు 'లోకాయతము'ను గూర్చి ముచ్చటించుటచే, ఆనందము, ఆవేదనము జీవితములో ముఖ్యములైన అంశములై యున్నవి. "తిని, త్రాగి, ఆనందించుడు. ఏలయన సకలజీవులకు జీవితాంతమున మరణము సంభవించును. (జాతస్య మరణం ధ్రువం). జీవించియున్నపుడే సౌఖ్యానందములతో జీవింపుము అనునదే చార్వాక మతములోని సారాంశము. “మరణమును ఎవ్వరును తప్పించుకొనలేరు. మృత్యువుయొక్క శోధకదృక్కును ఎవ్వరును తప్పించుకొనలేరు. ఈ మన కళేబరము ఒకసారి అగ్నిలో భస్మమైనపుడు అది ఎన్నటికైనను ఎట్లు తిరిగిరాగలదు? అపరిచ్ఛిన్నమైన సుఖ ప్రయోజనతా వాదమే (unqualified Hedonism) దేహాత్మవాదము ప్రతిపాదించిన నైతికాదర్శము. చార్వాకులు ప్రతిపాదించిన సుఖ ప్రయోజనతా వాదము వలననే వారు ప్రజల దృష్టిలో అప్రతిష్ఠ పాలయిరి. అయితే ప్రాచీన భారతదేశమునందలి దేహాత్మ వాదులలో పెక్కురు సంస్కృతీపరులైన మేధావు లుండియుండిరి. వాత్స్యాయన ప్రతిపాదితమైన నైతిక తత్త్వములో ఆతనిచే రచితమయిన ' కామసూత్రములలో' రెండవ అధ్యాయ మందు అత్యుత్తమమైన శిష్టప్రయోజనతా వాదము (Refined Hedonism) నకు సంబంధించిన స్పష్ట నిదర్శనములు (Positive Evidences) కాననగును. వాత్స్యాయనుని సుఖప్రయోజనతా వాదమునందలి శిష్టత, ఆతడు 'ఆత్మ సంయమనము, ఆధ్యాత్మిక పరమయిన స్వయంశిక్షణము, నాగరికవృత్తి అనునవి అవశ్యానుష్ఠేయము ' లని నొక్కి పలుకుటయందే గలదు. ఈ మూడు ఉత్తమ లక్షణములును అలవరచుకొని అనుష్ఠించనిదే మానవుడు పశుప్రాయమగు ఆనందమును మాత్రమే అనుభవింపగలడు. అనగా కామపీడితుడై అధమస్థితికి దిగజారును. ఇట్టి మహా మేధావులైన వారియందే “సాంస్కృతిక రసికులు" (సుశిక్షిత చార్వాకులు) అను పదము అన్వయ మగును.
దేహాత్మవాదము ప్రాచీనమత సంప్రదాయములను, ఇంద్రజాలము మున్నగు మంత్ర విద్యలను త్రోసిరాజనెను. ఈ వాదము మానవునియొక్క స్వేచ్ఛా స్వాతంత్య్రములకు ప్రాధాన్య మొసగును. ఇతర ప్రమాణాధిక్యమును తిరస్కరించును. భారత తత్వశాస్త్రమందలి పిడివాదమును (dogmatism) తొలగించుటకు చార్వాకము సాయపడెను. ఈ పిడివాదము తొలగిననేగాని తాత్విక విచారములో నిర్మాణాత్మకమైన కృషి జరుగజాలదు. పాశ్చాత్య తత్వ శాస్త్రమును హ్యూం అను నాతనిచే ప్రతిపాదింపబడిన 'సంశయవాదము' (Scepticism) రక్షించినట్లుగా, చార్వాకము భారతీయ తత్వశాస్త్రమును చాల వరకు రక్షించెను. వివిధములైన భారతీయ తాత్విక సిద్ధాంతములు చార్వాకుడు వెల్లడించిన ఆక్షేపణములకు సమాధానము లిచ్చుటకు ప్రయత్నించెను. కాని చార్వాక సిద్ధాంతములకు అవి మెరుగు పెట్టిన వాయెను.
బి. కె. భ.