సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చార్లీ చాప్లిన్
చార్లీ చాప్లిన్ :
“అన్ని రసముల మరపించు హాస్యరసము” అని పూర్వమొక కవిపుంగవుడు పలికెను. హాస్యరసము రెండు విధములుగా నుండును. ఒకటి మోటుహాస్యము; రెండు సున్నితమైన హాస్యము. భౌతిక సంబంధమయిన వెకిలి చేష్టలవలన మోటుహాస్యము ఉత్పన్నమగును. కాగా సున్నితమైనహాస్యమును సృష్టించుటకు హృదయాంతరాళ మందుండెడి జీవతంతువులు స్పందించవలసియుండును. మోటు హాస్యరస పోషణమునకు అంతగా పరిశ్రమ అవసర ముండదు. కాని సున్నితమైన హాస్యరసమును పోషించుట ఎవరెస్టు శిఖరమును ఎక్కినంతపనిగా భావింప వచ్చును. సున్నితమైన హాస్యరస పోషణములో అంతర్జాతీయముగా కీర్తి నార్జించిన నటులు అత్యంత స్వల్ప సంఖ్యలో మాత్రమే కలరు. వీరిలో అగ్రతాంబూలమునకు చార్లీ స్పెన్సర్ చాప్లిన్ ఒక్కడే అర్హుడు.
చాప్లిన్ 1889 ఏప్రిల్ 16 వ తేదీన లండన్ నగర
చిత్రము - 190
చార్లీ చాప్లిన్ వివిధ హావభావభంగిమలు
మందు జన్మించెను. ఆతని తండ్రి పేరు చార్లెస్; తల్లి పేరు హన్నా. వీరిద్దరు తమ జీవితములను నాటకరంగముపై గడపిరి. వీరితో కలిసి ఊరూరు తిరిగిన చార్లీకి నాటక కళాభిరుచి నరనరములకు ప్రాకుటలో ఆశ్చర్యముండదు.
కళాకారులు కాసైనను లేకయే కాలము చేసెదరనెడి వాక్యము చార్లీయొక్క తలిదండ్రుల విషయములో అక్షరశః సార్థక మయినది. నాటకరంగముపై వెలిగినన్నిదినములు వెలిగి ఈ వృద్ధదంపతులు తుట్టతుదకు అష్టదరిద్రము లనుభవించి అసువులను బాసిరి. తలిదండ్రులు సంపాదించిపెట్టిన ఆస్తులెవ్వియు లేకయే చార్లీ తన జీవితయాత్రను సాగించవలసి వచ్చెను. కాని తల్లిచూపించిన అకుంఠిత కార్యదీక్షయు, తండ్రి ప్రకటించిన అసమాన మైన సాహసనిరతియు చార్లీయొక్క జీవితశకటమునకు రెండు చక్రములవంటి వయ్యెను.
ఆర్థిక స్తోమతు అణుమాత్రమైనను లేని చాప్లిన్ ఆత్మబలముతో జీవితగహనమున తిరుగాడసాగెను. చిన్న చిన్న వేషములకొరకు ఆతడు ఎన్నియో నాటకకంపెనీల యొక్క గడపలు ఎక్కి దిగవలసివచ్చెను. ఆశ, నిరాశల నడుమ ఊగిసలాడుచున్న చార్లీకి “ఫ్రెడ్ కార్నో" అను నాటక సంస్థ ఆశ్రయమిచ్చి పుణ్యము కట్టుకొనెను. అమెరికా దేశపర్యటనమునకు బయలుదేరిన ఈ నాటకసంస్థ చార్లీ జీవితచరిత్రలో ఒక నూతనాధ్యాయమునకు అంకురార్పణ గావించెను. అమెరికా నాటకరంగస్థలముపై చార్లీ చాప్లిన్ ప్రదర్శించిన ప్రతివేషము అసంఖ్యాకు లయిన ప్రేక్షకులను ఆకర్షించెను.
క్రీ. శ. 1913 సం. లో అమెరికాదేశమునందు నాటకరంగ ప్రాబల్యము సన్నగిలి చలన చిత్రరంగము వెలుగులోనికి వచ్చుచుండెను. కాలిఫోర్నియాలో 'మాక్ సెన్నెట్ కిస్టోన్' కంపెనీవారు కొన్ని హాస్యరస చిత్రములను తయారు చేయుటకు సంకల్పించిరి. సున్నితమైన హాస్యరసమును పోషించగల ఒక చక్కని నటునికొరకు వారు అన్వేషించనారంభించిరి. రంగస్థలముమీద పేరు ప్రతిష్ఠల నార్జించిన చార్లీ వారి దృష్టిలో పడెను. దానితో చార్లీ 'రొట్టెవిరిగి నేతిలో పడిన' చందమయ్యెను.
ఆ కంపెనీ పతాకముక్రింద నిర్మాణము చెందిన ముప్పది అయిదు చిత్రములలో చార్లీ నటించుట సంభవించెను. ఈ చిత్రము లన్నియు 1914 లో అనగా ఒకే ఒక సంవత్సరములో పూర్తి యయ్యెనని అర్థము. వీటిలో మొట్టమొదటిది ' మేకింగ్ ఏ లివింగ్'. హాస్యరసము కుంభవృష్టిగా కురిసిన ఈ చిత్రములో చార్లీ ఒక పొడుగైన టోపీని, కురుచైన మీసములను ధరించెను. ప్రజాబాహుళ్యములో ఇవి గొప్ప ప్రచారమును పొందెను. 'చార్లీ టోపీ', 'చార్లీ మీసము' అన్న పదములు విరివిగా వ్యాప్తిలోనికి వచ్చెను.
'కీస్టోన్ ' కంపెనీవారు నిర్మించిన చిత్రము లన్నియు పొట్టివి (short). ఒక్కొక్క చిత్రము 2000 అడుగుల కంటె ఎక్కువ ఉండెడిది కాదు. ఇంతటి చిన్నచిత్రములో తన నటనా ప్రతిభను వెల్లడించుటకు చార్లీకి ఎక్కువగా అవకాశము లేకపోయెను. ప్రజాభిప్రాయము ననుసరించి ఆ కంపెనీవారు - చార్లీకి అధికమైన అవకాశము కల్పించుటకు - ప్రత్యేకముగా 6000 అడుగుల చిత్రమును నిర్మించిరి. దీని పేరు 'టిల్లీస్ పంక్చర్డ్ రొమాన్స్'. చార్లీతో పాటుగా ఈచిత్రములో మేరీడ్రెస్ లర్, మే బెల్ నార్మండ్ అను నటులు కన్పించెదరు.
1915 లో 'ఎసెనీ' కంపెనీవారు వారమునకు 1250 పౌనుల వేతనముపై ఆతనిని తమసంస్థలోనికి తీసికొనిరి. ఈ సంస్థయొక్క పతాకచ్ఛాయలలో తీయబడిన 'ఏ నైట్ అవుట్' అనెడి చిత్రములో ఎడ్నా పర్వియెన్స్ అనెడి యువతి కథానాయకిగా నటించెను. చార్లీ చాప్లిన్ ఈ కథలో కథానాయకుడు. వీరిద్దరి సమ్మేళనము ఎసెనీ కంపెనీకి కనకాభిషేకము గావించెననియే చెప్పవలెను. 'ఎ వుమన్ ఆఫ్ పారిస్' అను చిత్రములో వీరిద్దరు చూపించిన హావభావములు అద్వితీయములని శ్లాఘింప బడినవి. కంపెనీయొక్క యజమానులు వేరయినను, చార్లీ చాప్లిన్ ఈ చిత్రమునకు నిర్మాతగాను, దర్శకుడు గను వ్యవహరించెను.
చార్లీ చాప్లిన్ మొదటినుండియు అనుకరణకు, అనుసరణకు గర్భశత్రువు. ఏ పాత్రనయినను మలచి, దానికి జీవము పోయుటలో అతడు స్వబుద్ధినే ఉపయోగించెడి వాడు. దర్శకత్వముకూడ తన చేతియందుండనిదే తన ఊహాపోహలకు విశిష్ట స్వరూపము చేకూరదని అనుభవ పూర్వకముగా తెలిసికొనుటచే, చాప్లిన్ ఆ హోదాను కూడ చేపట్టక తప్పినది కాదు.
ఎసెనీ చిత్రములపై చార్లీయొక్క ప్రభావముద్ర తీవ్రముగా పడుటచే, అవి ఖండాంతరములకు పోయి ఆతనికి గొప్పపేరు ప్రతిష్ఠ లార్జించి పెట్టెను. వ్యాపార రీత్యా అవి ఆ కంపెనీ యజమానులకు బండ్లమీద ధనపు రాసులను తెచ్చి పెట్టినవి.
1916 లో చాప్లిన్ మ్యూచుయల్ కంపెనీ కాంట్రాక్టు పత్రముపై సంతకము పెట్టెను. ఈ కాంట్రాక్టును అనుసరించి ఆతడు పన్నెండు చిత్రములను తయారుచేసి ఆరులక్షల డెబ్బదివేల పౌనులను పుచ్చుకొనెను. ఇంతగొప్ప మొత్తమును పుచ్చుకొన్న మహానటులు ఆ దినములలో ఎవ్వరును లేరు. ఆతడు నిర్మించిన పన్నెండు చిత్రములు విపరీతముగా ధనమును తెచ్చుటతో, ఆ కంపెనీవారు మరొక పన్నెండు చిత్రములకు కాంట్రాక్టు వ్రాయుమని ఆతనిని కోరిరి. నటనా ప్రపంచములో దాస్య శృంఖలములను త్రెంచుకొని స్వేచ్ఛా జీవితమును గడపవలె నని అభిలషించుచున్న చార్లీ చాప్లిన్ ఆ కాంట్రాక్టును నిరాకరించి తన స్వంతకంపెనీ పతాకమును గగనవీథిలో ఎగుర వేసెను.
అంతట నాతడు హాలీవుడ్‌లో ఒక స్టూడియోను నిర్మించి 'యునై టెడ్ ఆర్టిస్టు కార్పొరేషన్ ' అను సంస్థకు అంకురార్పణ కావించెను. ఈ సంస్థలో మేరీపిన్ ఫర్డ్, డగ్లస్ ఫెయిర్ బాంక్స్ అను వారలు భాగస్థులయిరి. ఈ సంస్థ యాజమాన్యమున తీయబడిన 'ఏ డాగ్స్ లైఫ్', 'షోల్డర్ ఆమ్స్', 'సన్నీ సైడ్', 'ఎ డిస్ ప్లెజర్', 'ది కిడ్', 'ది ఐడిల్ క్లాస్, ' పే డే', 'ది పిల్ గ్రిం', 'ది గోల్డ్ రష్', 'ది సర్కస్', 'సిటీ లైట్స్' మొదలయిన చిత్రములు దేశ దేశములలో పెక్కు పర్యాయములు ప్రదర్శింపబడినవి. ఇవి శబ్దరహిత చిత్రము లయినను, ప్రేక్షకులకు గొప్ప రసానుభూతిని చేకూర్చగల్గిన వని చెప్పకతప్పదు. ముఖ్యముగా 'ది గోల్డ్ రష్' అను చిత్రమును చూచిన వారు చాప్లిన్ మూర్తిని తమ స్మృతిపథముననుండి తుడిచి వేయలేరు.
1936 లో చలనచిత్ర రంగములో శబ్దము చొరబడినది. చాప్లిన్ ఈ శబ్దప్రవేశము నెడల హర్షము ప్రకటించుటకు నిరాకరించెను. ఆంగిక సంబంధమయిన నటనా చాతుర్యమును ప్రకటించుటకు మూగచిత్రమునందే అధికముగా ఆస్కారముండగలదని ఆతని వాదన. ఆ సంవత్సరములో ఆతడు నిర్మించిన 'మాడరన్ టైమ్స్' చిత్రములో శబ్దము నేపథ్యములో ఇయ్యబడు కొన్ని ధ్వనులలోనే మనకు వినపడును.
'శబ్ద' ఉద్యమమునకు చాప్లిన్ వ్యతిరేకి అయినను, కాలానుసారముగ ఆతడు వ్యవహరింపక తప్పలేదు. 1940 లో ఆతడు 'ది గ్రేట్ డిక్టేటర్', 1947 లో 'మన్ష్యూర్ వెర్ డా', 1952 లో 'లైమ్ లైట్', 1957 లో 'ఏ కింగ్ ఇన్ న్యూయార్క్' అను శబ్దచిత్రములను తీసెను. వీటిలో ఆతడు ధరించిన పాత్ర లన్నియు వ్యంగ్య ధోరణిలో ఈనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను విమర్శించెను. బాల్యమునుండియు కటిక దరిద్రబాధను అనుభవించిన వాడగుటచే, చాప్లిన్ తాను ధరించిన వివిధపాత్రలద్వారా శ్రామికజీవులకు అండగానిలిచి, కష్టజీవుల శ్రమశక్తిని కొల్లగొట్టెడి పెట్టుబడిదారీ వర్గములపై కత్తి జళిపించెను. ఆతడి ఆశయములను, అభిరుచులను అర్థముచేసికొనిన ఆమెరికా ప్రభుత్వము ఆతనికి అమెరికా పౌరసత్వ హక్కును ఇచ్చుటకు ఒక విధముగా నిరాకరించిన దన్న విషయము జగమెరిగిన సత్యము.
పెద్ద చదువులు చదువకపోయినను ప్రపంచానుభవమును విశేషముగా సంపాదించినవాడగుటచే, చాప్లిన్ తన పాత్రలద్వారా ఆధునిక నాగరికతలోని మంచి చెడుగులపైన వెలుతురును ప్రసరింపగల్గెను. ఆధునిక సాహి త్యమునందును కూలంకషపరిజ్ఞానముగడించుటచే, చాప్లిన్ తన చిత్రములలోని మాటలను, పాటలను తానే వ్రాసుకొన్నాడు. సంగీతములో ఆతనిప్రతిభఆపారము. వ్యక్తము 'లైమ్ లైట్' అను చిత్రములో ఆతని పాండితీపటిమ కాగలదు. 'ది గ్రేట్ డిక్టేటర్' అనెడి చిత్రములో అతని అభ్యుదయపు పోకడలు మనకు ఆవగాహనము కాగలవు.
మూగచిత్రములకాలమునుండి శబ్దచిత్రములకాలము వరకు ఏకధాటిగా నటులలో ఒక వెలుగు వెలిగినవాడు చార్లీ చాప్లిన్ తప్ప మ రెవ్వరును కానరారు. అర్ధశతాబ్దము పర్యంతము అవిచ్ఛిన్నముగా కీర్తిప్రతిష్ఠలు సంపాదించిన గౌరవము ఆ మహానటున కొక్కనికే దక్కినది. అంతర్జాతీయ ప్రసిద్ధిచెందిన చాప్లిన్‌యొక్క ఆంతరంగిక జీవితమును కూడ తెలిసికొనవలె ననెడి అభిలాష ఆతని అభిమానులకు ఉండుటలో ఆశ్చర్య ముండదు. 1918 లో ఆతడు మిల్ డ్రెడ్ హారిస్ అను వనితను వివాహ మాడెను. ఆరేళ్ళపాటు సాంసారిక జీవితముగడిపి చాప్లిన్ ఆమెకు విడాకు లిచ్చెను. 1924 లో చాప్లిన్ లొవిటామెక్ మాటీని అర్ధాంగిగా స్వీకరించెను. ఆమెవలన ఆతనికి ఇద్దరు కుమారులు కల్గిరి. అనంతర మాతడు ఆమెనుగూడ వదలెను. 1936 లో ఆతడు పాలెట్ గోడార్డ్‌ను పరిణయ మాడెను. మనస్తాపములు కారణముగా ఆమెను సయితము పరిత్యజించెను.
1943 లో ఆతడు ఊనా ఓనీల్ అను నామెను ధర్మపత్నిగా గ్రహించెను. ఆ నాటినుండి ఈ నాటివరకు ఆమె చాప్లిన్‌కు సహధర్మ చారిణియై ఆతని హృదయములో స్థావర మేర్పరచుకొనగల్గెను. ఈమెవలన ఆతనికి ముగ్గురు కొడుకులు, అయిదుగురు కూతుళ్లు కలిగిరి. ఊనాను వివాహమాడిన నాటినుండియే తనకు సిసలయిన సాంసారిక సౌఖ్యము లభించిన దని ఇటీవల చాప్లిన్ ఒక సందర్భమున ప్రకటించెను.
చార్లీ చాప్లిన్ కోట్లకొలది ధనము గడించెను. వివిధ దేశములలో నిరుపేదలకు, అనాధలకు ఏర్పడియున్న పెక్కు సంస్థలకు అతడు భూరి విరాళము లొసగెను. ప్రస్తుత దశలో విశ్రాంతి తీసికొనుచున్న చాప్లిన్, తన పెద్ద కుమారుడు ప్రపంచశాంతికి సంబంధించిన ఇతివృత్తము నాధారముగా చేసికొని తీయుచున్న ఒక చిత్రము యొక్క నిర్మాణ కార్యకలాపమును పర్యవేక్షించు చున్నట్లు తెలియుచున్నది.
ఇం. వేం.