Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చరిత్ర రచనారీతుల వికాసము

వికీసోర్స్ నుండి

చరిత్ర రచనారీతుల వికాసము :

చరిత్రరచన సక్రమముగను, శాస్త్రీయముగను జరుగుటకు ప్రారంభమై ఎన్నియో సంవత్సరములు కాలేదు. కాని మానవుడు వ్రాయ నేర్చినప్పటి నుండియు చరిత్ర కలదనియే చెప్పవలసి వచ్చును.

భారతీయులకు ప్రాచీనకాలమున చారిత్రక దృష్టి లేదనియు, అందువలననే మన దేశమునందు ప్రాచీన చరిత్రలు లేవనియు, ఉన్నను, ఏవో ఒకటి రెండు కల్హణ, జల్హణాది ప్రణీతములైన 'రాజతరంగిణి' వంటి గ్రంథములు తప్ప శేషించిన వన్నియు అతిశయోక్తి, ఉత్ప్రేక్ష లతో గూడిన పుక్కిటి పురాణములే గాని చరిత్ర గ్రంథములు గావనియు చెప్పుట పరిపాటి యైనది.

మహమ్మదీయులు చరిత్రకు ఎక్కువ ప్రాధాన్యము నిచ్చి, మధ్య యుగమునాటి చరిత్ర లెన్నియో వారు రచించిరని పెక్కుమందికి నమ్మకము కలదు. కాని ఇటీవల ఆంగ్లదేశీయ చరిత్ర విమర్శకులు మహమ్మదీయ చరిత్ర గ్రంథములను విమర్శించి, అవి చాలవరకు మత దృష్టితోను, పక్షపాతముతోను వ్రాయబడిన ప్రచార గ్రంథములేకాని, శాస్త్రీయములైన చరిత్ర గ్రంథములు కావనియు, వానిలో సత్యచరిత్ర చాలవరకు మృగ్యమనియు వక్కాణించి యున్నారు.

అసలు, చరిత్ర యననేమి? అని నిర్ధారణ చేయుట యందే పండితులమధ్య ఎన్నియో మతభేదములు కలవు. చరిత్ర శాస్త్రమని కొందరును, శాస్త్రమని ఒప్పుకొన్నను ఇతర శాస్త్రముల పద్ధతికిని, చరిత్ర పద్ధతికిని చాల భేదము కలదని మరికొందరును, వాదించుచున్నారు. ఇతర విజ్ఞాన విభాగములందు వలెనే ఈ విషయమునందు గూడ పాశ్చాత్యులు అధికముగ కృషి సల్పి ఎన్నియో గ్రంథములను రచించి యున్నందున, చరిత్ర రచన ప్రాచీన కాలము నుండియు, పాశ్చాత్య దేశములందు, ఏరీతిగ సాగుచు వచ్చినదో, కాలక్రమముగ పాశ్చాత్య చరిత్రకారుల దృక్పథము నందును, వారి రచనా పద్ధతుల యందును ఎట్టి మార్పులు కలుగుచు వచ్చినవో, పరిశీలించిన యెడల మనకు చరిత్రయొక్క సత్యస్వరూపము కొంతవరకు బోధపడును.

ఇప్పటికి సుమారు మూడువేల సంవత్సరములకు పూర్వము రచింపబడిన పెంటాట్యూక్ (Pentateuch), జోషువ (Joshuva), సామ్యుఅల్ (Samual), అను వారల గ్రంథములలోని జెహోవాభాగములు ప్రపంచ చరిత్రలో ప్రాచీనతమము లని పాశ్చాత్యుల అభిప్రాయము. తరువాత క్రీ. పూ. సుమారు 575 వ సంవత్సర ప్రాంతమున 'ప్రభువుల గ్రంథము' (Book of Kings), రచింపబడెను. అటు పిమ్మట ఇస్రాయిల్, జూడారాజుల కాలమానపట్టికలును(Chronicles), బాబిలోనియాదేశపు బెరోస్సాస్ చరిత్రయు (History of Berossos), ఈజిప్టు దేశపు మనెథో వంశావళియు (Annals of Manetho) - ఈమూడును సుమారు క్రీ. పూ. 3 వ శతాబ్దమున రచింపబడెను. ఈ గ్రంథము లన్నియు విగ్రహ నిర్మూలనమును సాధించుటకును, మానవునికి భగవంతుని లీలలను గూర్చి నచ్చ చెప్పుటకును, ధర్మమును ప్రతిపాదించుటకును, రచింపబడిన గ్రంథములే కాని చరిత్రలు కావు. వీరు చెప్పు విషయములు ఏ ఆధారములనుండి సంగ్రహింపబడినవి ? ఆ యాధారములు ఎంతవరకు నమ్మదగినవై యున్నవి ? ఇత్యాది ప్రశ్నలు చరిత్రరచనకు అత్యవసరమైన ప్రశ్నలు. ఇవి ఆనాడు వారికి స్ఫురించినట్లే తోచదు.

ఆరంభదశకు పిదప చరిత్ర రచన సాగించినవారు గ్రీకులు. వీరు మతదృష్టికి లొంగిపోక హేతువాదమును అధికముగ పెంపొందించిన జిజ్ఞాసువులు. వీరిలో చరిత్ర రచించిన ప్రథముడు, మైలెటస్ నందు క్రీ. పూ. 546 వ సం॥ నందు జన్మించిన హెక్‌టేయస్ (Hecatacus) అను నాతడు. కాని ఇతనితరువాత చరిత్ర రచించిన హాలీ కార్నస్సస్ హెరోడటస్ (Herodatus of Halicarnessus క్రీ. పూ. 484 - 425) అను వానిని తరచుగా చరిత్ర పితామహుడని పాశ్చాత్యలు పేర్కొనుచుందురు. గ్రీకులకును, పర్షియనులకును నడుమ జరిగిన యుద్ధమును గూర్చి హెరోడటస్ వ్రాసినందున, ఉత్తమమైన కథా వస్తువు అతనికి సంప్రాప్తమాయె ననవచ్చును ఇంతకంటె చరిత్రను జాగ్రత్తగా రచించినను థుసిడైడిస్ (Thucydides - క్రీ. పూ. 471 - 401) అను నాతడు కేవలము రెండు గ్రీకురాజ్యముల పరస్పర కలహములనుగూర్చియు యుద్ధములను గూర్చియు వ్రాసినందున అది రక్తి కట్ట లేదు.

రోమనులలో చరిత్రకారులే లేరని చెప్పవచ్చును. కాబట్టి వారి చరిత్రను రచించిన గ్రీకు చరిత్రకారుడు పోలిబియస్ (Polybius - క్రీ పూ. 204 - 122) రోము చరిత్ర రచయితలలో మేటియనవచ్చును. సీజరు చక్రవర్తి వ్రాసిన 'గాలిక్ యుద్ధ' మను గ్రంథమును (కీ. పూ. 51 సం॥ నాటిది) చరిత్రయనుటకంటె సీజరుయొక్క ఆత్మకథ యనుట సమంజసము. సీజరు సమకాలికుడు సాల్లస్టు (Sallust - క్రీ. పూ. 86 - 34) అను నాతడు వ్రాసిన చరిత్ర గ్రంథము కానవచ్చుట లేదు. కాని కాటలైను కుట్రను గూర్చియు, జుగర్తా యుద్ధమును గూర్చియు, అతడు వ్రాసిన గ్రంథములను బట్టి, అతడు సమర్థుడని తెలియుచున్నది. ఇతనికి జుగుప్సా, నిరుత్సాహములు మెండు. ఏదో ఒక గుణపాఠమును మనమున నిశ్చయించు కొని తదనుగుణముగ చరిత్ర రచనకు పూనుకొనుచుండుట వలన ఇతని రచన సత్యచరిత్ర కాజాలదు.

లివీఁ (క్రీ. పూ. 59 - 17) అను నాతడు సంధి కాలపు యుగ పురుషుడు. అటు రోము గణ ప్రభుత్వమునకును, సామ్రాజ్య ప్రభుత్వ యుగమునకును, ఇటు క్రైస్తవ యుగమునకును, క్రీస్తు పూర్వయుగమునకును సంధికలుపు కొలికిపూసవంటివాడు. ఇతని దేశ ప్రేమ అపారము. కాని ఇతని అంశములు చాలవరకు నమ్మదగినవి కావు. పుక్కిటి పురాణముల నెన్నిటినో ఇతడు తన గ్రంథమునందుఁ జొప్పించెను. ఇంతకంటెను టేసిటస్ (Tacitus-క్రీ. శ. 55-117) అను నాతడు శ్రేష్ఠుడు. కాని ఇతడు కూడ సత్యచరిత్ర రచించుట మాని, తన దేశీయులకు వారి లోపములను చాటి చెప్పుటకును, వారికి నీతి గరపుటకును చరిత్రను ఒక అమూల్యమైన ఉపకరణమని భావించి తన చారిత్రక గ్రంథమును పాక్షిక ప్రచార గ్రంథముగ రచించెను.

క్రైస్తవ మతము ప్రబలిన పిదప, చరిత్ర మతమునకు దాసియై ఊడిగముచేయ నారంభించెను. నాటికి గ్రీకుల కున్న హేతువాదము నశించిపోయినందున, సత్యాన్వేషణకుబదులు శతాబ్ధులతరబడి చరిత్ర క్రైస్తవమత నాయకులకు లోబడిపోయి, కేవలము మత విషయముల పట్టికగా తయారాయెను. ఎట్టి అతిమానుష చర్యలైనను సరే, ఎట్టి వింతలైనను, వినోదములైనను సరే మతమును పోషింప గలిగినచో, అవి యన్నియు చారిత్రక విషయములుగ పరిగణింపబడుచుండెను. మతమునకు లాభకారులు కాని విషయము లన్నియు పనికిరానివిగా వదలివేయబడుచుండెను.

ఇట్టి పరిస్థితిలో క్రైస్తవులకును అరబ్బులకును క్రీస్తు జన్మభూమియైన పాలస్తీనా యందు 'క్రూసేడ్స్' (Crusades) అను ఘోరసంగ్రామము జరిగెను. అరబ్బులు నాటికే నాగరికత యందు ఐరోపావారికంటె ఉత్తమ ఖ్యాతి గడించియుండిరి. వారి చరిత్ర రచన సహజముగ ఐరోపావారిని ఆకర్షించి వారి చరిత్ర రచనయందు కొంత ప్రభావము చూపగల్గెను.

ఇంతకంటెను చరిత్రరచనయందు అధికముగ మార్పు తెచ్చిన అంశము 'రినైసెన్స్'(Renaissance) అను నూతన సంస్కృతీ పునరుజ్జీవనము. గ్రీకు గ్రంథములను చదువుట చేత గ్రీకుల హేతువాదము అలవడి, మతోన్మాదము తగ్గి, సత్యజిజ్ఞాస ఐరోపాఖండమం దంతటను పెంపొందెనని అందరికి తెలిసిన యంశమే. అటు పిమ్మట రిఫర్ మేషన్ (reformation) అను మత సంస్కరణములు విప్లవము వలె చెలరేగి పాశ్చాత్య దృక్పథమునే కూల్చివేసినందున, చరిత్రలోకూడ ఎక్కువ మార్పుకలిగెను. లోరెంజోవల్లా (Lorenzo Valla - క్రీ. శ. 1406-1457), లియొనార్డో బ్రూనీ (Leonardo Bruni - 1369-1444), పొగ్గియో బ్రాక్కియోలినీ (Poggio Bracciolini - 1380-1459) ఫ్లేవియస్ బ్లాండస్ (Flavius Blondus - 1388-1463)- రెండవ పోప్ పయస్ (Pope Pius II - 1405–64), నిక్కోలో మాకియవెల్లీ (Niccolo Machiavelli -1469-1527), ఫ్రాన్ సెస్కొ గైక్కి యార్డినీ (Francesco Guicciardini - 1483-1540) మున్నగు వారి గ్రంథములందు మధ్య యుగములను గూర్చిన అసహిష్ణుత, పోపుల పరిపాలన యందు వైముఖ్యము, దేశాభి .మానము, కథాకథనమునందు నైపుణ్యము మున్నగు అంశములు స్పష్టముగా గాన్పించుచున్నవి. వీరు 'రినైసెన్సు' ప్రభావమునకు లోనైనవారు. కాని జార్జి బుకానన్ (George Buchanan - 1506-1582), స్కాలిగిర్ (Scaligir - 1540-1609), గ్రోషియస్ (Hugogrotius-1583-1645) మున్నగు వారు మత విప్లవ ప్రభావమునకు లోనైన క్రైస్తవులు. వీరి అనుయాయులు ఐరోపాదేశము లన్నిటియందును ప్రభవించినందున, ఎటు చూచినను చర్చలు, వాగ్వాదములు ప్రబలి, ప్రశాంతశాస్త్రీయ దృక్పథమునకు బదులు చరిత్ర రచన రణరంగముగ మారెను. పూర్వాచారపరాయణులును, పూర్వభావ పరంపరావాసనకలవారును వీరితో కలహము సల్పుటయే గాక, ఈ పోరుచాలకాలము సాగుటకు కారకులైరి. కాని వీరిలోనే వీరు పరస్పరము భావ వైవిధ్యమువలన కలహించుచున్నందున, ఈ పోరు ఆగిపోవుటకు బదులు రెచ్చగొట్టబడుచుండెను.

పదునెనిమిదవ శతాబ్దమున కొన్ని దశాబ్ధులు గడచిన పిదప గియోవాన్ని బట్టిస్టవైకో (Giovanni Battista Vico - 1688-1744), మాంటెన్క్యూ (Montesquieu -1689-1745), వాల్టేర్ (Francoise Marie Aronet commonly called Voltaire - 1694-1778) మున్నగు వారి రచనలు ప్రజాదరణమునువడసి వ్యాప్తిలోనికి వచ్చు వరకును చరిత్రరచన రణరంగమును వీడి పఠనమందిరమును ప్రవేశింపలేదు. తరువాత క్రమముగా డేవిడ్ హ్యూమ్ (David Hume - 1711-1776), విలియం రాబర్ట్ సన్ (William Robertson - 1721-1793), మైకేల్ ష్మిడ్ (Michael Schmidt-1736-1794), ఎడ్వర్డు గిబ్బన్ (Edward Gibbon - 1737-1794), ఆర్నాల్డ్ హీరెన్ (Arnold Heeren - 1760-1842), మున్నగువారు ప్రశస్తి గాంచిరి. కాని వీరి దృష్టిలో తత్త్వ జిజ్ఞాసకు చరిత్ర కేవలం మొక ఉపాంగము. తత్త్వబోధయందు చారిత్రక నిదర్శనములను చూపి సుస్పష్టము చేయుటయే వీరి ఆశయము. కాని తత్త్వమును గూర్చి మాత్రము వారికి సునిశ్చితమైన అభిప్రాయము కుదరలేదు.

ఈలోగా ఫ్రెంచి మహావిప్లవము బయలుదేరినందున చరిత్ర రచన ఆగిపోయెను. ఈ విప్లవముయొక్క హడావిడి సమసిపోయి మరల చరిత్రరచన సాగనారంభమగు నప్పటికి మానవదృక్పథమునందే మార్పు కలిగి, పూర్వ పద్ధతులయందు ఒక విపరీత విశ్వాసమును, ప్రేమాభిమానములును బయలు దేరెను. ఇవి కొంతకాలము వ్యాప్తియం దుండెను. ఇప్పటికి సుమారు వందసంవత్సరముల క్రిందటి వరకును శాస్త్రీయ చారిత్రక దృక్పథము అలవడలేదనియే చెప్పవచ్చును.

ఒక్క విషయమున మాత్రము అదివరకే చరిత్రరచనకు అవసరమైన కొంత అభివృద్ధి గాన్పించుచున్నదని చెప్పవచ్చును. ఈ అభివృద్ధి చారిత్రక ఆధారసామగ్రి ప్రచురణయందే గాన్పించుచున్నది. చరిత్ర స్వకపోల కల్పనా కల్పితము కాదు. చరిత్ర కాధారములు నిర్దుష్టముగ నుండిననేగాని సత్యచరిత్ర వ్యక్తము కాదు. ఈ ఆధార సామగ్రిని సేకరించి, జాగ్రత్తగ పరిశీలించి, పరిష్కరించి ప్రచురించుట చరిత్రరచనకు మూలాధారము. ఈ ప్రయత్నము జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లండు మున్నగు దేశములం దంతటను కొంతకాలముగా జరుగుచు వచ్చినందువలననే పందొమ్మిదవ శతాబ్దమున సక్రమచరిత్ర రచన ఏర్పరచుటకు వీలు కలిగెను.

అప్పటికిని కార్లైల్ వంటి మహాశయులు చరిత్రరచనకు బూసుకొని, చరిత్రయనగా అది కేవలము మహాపురుషుల జీవితచరిత్రల సంపుటీకరణమే అని సిద్ధాంతము చేయుటకు సమకట్టిరి. ఇట్టివారు జనసామాన్యమును ఎంత మాత్రమును పరిగణించకపోయిరి. ప్రజాజీవితమును ఉదాసీనభావముతో చూచుచుండిరి. రాజులు, రాణులు, మహామంత్రులు, వారి పన్నాగములు, వారి హావభావ విలాసములు, యుద్ధములు, సంధులు మాత్రమే చరిత్ర రచనకు ప్రధానము లనియు, చరిత్ర యనగా కేవలము రాజకీయ చరిత్రయే అనియు వీరు భావించిరి. ఈ పాక్షిక దృక్పధమును ప్రతిఘటించి, రాజకీయచర్యలే చరిత్రయనుట తప్పు అని వక్కాణించి, రాజకార్యములు ఎల్లప్పుడును మహత్తర భావసంజనితములే కాబట్టి, భావ ప్రవాహ చరిత్రయే రాజకీయ, సాంఘిక, ఆర్థికచరిత్రకు కారణభూతమని వాదించి, ఫ్రెంచి మహావిప్లవ చరిత్ర రచనకు ఒక నూతన అధ్యాయమును కల్పించి, అందు భావనిర్ణయము ఏరీతిగ ఫ్రెంచి మహావిప్లవమునకు దారి తీసెనో నిరూపించుటకు ఆక్టన్ ప్రభువు (Lord Acton), అతని అనుయాయులును పూనుకొనిరి.

ఆక్టన్ ప్రభువు భావప్రాధాన్యమును ఉద్ఘాటించుచు ప్రచారము చేయదొడగిన కొలది, మార్క్స్‌సిద్ధాంతమును అనుసరించు సామ్యవాదలు ప్రతిఘటించి, మానవచరిత్రయంతయు కూడు, గుడ్డ, మున్నగు భౌతిక వస్తుసంచయము కొరకై జరుగు పోరాటము పైననే ఆధారపడి యున్నదని వాదింపసాగిరి. మరియు కొందరు కార్ల్ లాంప్రెక్ట్ (Karl Lamprect) అను జర్మను మన శ్శాస్త్రజ్ఞుని అడుగుజాడలలో నడచుచు మానవుని నైజమును, మానవసంఘ ప్రవృత్తియు, బుద్ధివైశద్యము పైన ఆధారపడియుండుట లేదనియు, హేతువాదమునకు విరుద్ధమైన చిత్తవృత్తిపైనను, చిత్తక్షోభముపైనను ఇది ఆధారపడి ఉన్నదనియు వాదింప సమకట్టిరి.

వీరందరకును పరిణామవాదము మాత్రము తప్పనిసరి ఆయెను. పరిణామవాదము పందొమ్మిదవ శతాబ్దమున ప్రతిపాదింపబడిన నూతన భావము కాదు. క్రమ ముగ దినదినాభివృద్ధి దేనియందైనను గాంచనగును అను పరిణామవాదము యొక్క ప్రధానాంశమును యవన మహాశయుడు అరిస్టాటిల్ రెండువేల సంవత్సరముల క్రితమే చాటి చెప్పియుండెను. కాని భౌతికవిజ్ఞాన పరిశోధనయందు ఈ సిద్ధాంతము సక్రమముగ నిరూపింపబడ నందునను, క్రైస్తవమతవిజృంభణమువలన మధ్యయుగము నందు సర్వమును భౌతికేతరమయమని రూఢిగ నాటుకొని యున్నందునను సుమారు ఒక వేయి సంవత్సరముల కాలము ఈపరిణామవాదము నివురుగప్పుకొనిన నిప్పువలె నుండెను. అటుపిమ్మట కాంట్ (Kant), షెల్లింగ్ (Schelling), హెగెల్ (Hegel) మహామహుల పాండిత్య ప్రకర్ష యందు ఈ వాదము ప్రజ్వలింపసాగెను. హెగెల్ మహాశయునికి ఈ పరిణామవాదమే ప్రపంచ చరిత్ర యందలి అంతరార్థమును తెలియజేయు మూలసూత్ర మాయెను. మానవుని రాజకీయాభివృద్ధి యంతయు స్వాతంత్ర్యభావోన్మీలనముకొరకు జరిగినదే అని హెగెల్ భావించెను.

పరిణామవాదమున కార్యకారణ సంబంధము అవినాభావముగ నుండును. కాబట్టి భౌతికశాస్త్రములందు వలెనే చరిత్ర యందును (సాంఘికశాస్త్రము లన్నిటి యందునుగూడ) అప్రతిహతములగు ధర్మములు (Laws) ఉండునని నిశ్చయించి, జాన్ స్టువర్ట్ మిల్ (John Stuart Mill), ఆగస్టు కోంటె (August Counte), బకిల్ (T. H. Buckle) మున్నగువారు చరిత్ర రచనకు పూనుకొనిరి. ఈ దృక్పథమునందు మానవునికి స్వేచ్ఛా ప్రవృత్తి ఎంతమాత్రమును లేనట్లుగనే కాన్పించెను. సర్వమును అనుల్లంఘనీయమైన చట్టబద్ధము; కాబట్టి సర్వమును పూర్వనిశ్చితమే; ఇక మానవుడు స్వతంత్రించి, ఆలోచించుకొని, ఇదమిత్థమని నిశ్చయించుకొని కార్యాచరణకు పూనుకొనుటకు ఆస్పద మేది ?

ఈ చిక్కు ప్రశ్నకు సులభమైన సమాధానము దొరక జాలదు. మన కష్టసుఖము లెంతవరకు మనపై ఆధారపడి యున్నవి ? మన మంచిచెడ్డలు కేవలము గ్రహవీక్షణ ప్రభావముపైననే ఆధారపడి యున్నవా ? ఇదంతయు కేవలము భగవంతుని లీల కాబట్టి, మనకు ఇందు ఎట్టి స్వాతంత్ర్యమును లేదా ? ఈ జన్మమున జరగున దంతయును పురాకృతకర్మపరిపాకము కాబట్టి తప్పించుకొనుటకు వీలులేదుకదా ! ఇత్యాది ప్రశ్నలు, చర్చలు, అనాదిగ అన్ని దేశములందును సాగుచునే వచ్చినవి.

సర్వమును పూర్వనిశ్చితమే అనెడి పై సిద్దాంతమును ఇంగ్లండునందు చార్లెస్ కింగ్‌స్లే (Charles Kingsley) అను నాతడు ప్రతిఘటించెను. ప్రౌడ్ (J. H. Froude) అను నాతడు కింగ్‌స్లే వాదమును బలపరచెను. జర్మనీ పండితుడు డ్రాయ్‌సెన్ (J. G. Droysen) అనునతడు ఈ ఖండనకు ఒక సంపూర్ణతను కల్పించెను.

ఈ సిద్ధాంతరాద్ధాంతముల మూలముగ రెండు ముఖ్య విషయములు తేలినవి. చరిత్రకును, భౌతికశాస్త్రములకును చాల భేద మున్నది. ఈ భేదము రెండువిధములుగ గోచరించుచున్నది. (1) చరిత్రపద్ధతికిని, భౌతిక శాస్త్రపద్ధతికిని భేదము గలదు. భౌతిక శాస్త్రముల శాస్త్రీయత బాహ్య వస్తుపరిశీలనమునకును, యంత్రాగారములందలి పరిశోధనమునకును సంబంధించినది. చరిత్రయొక్క శాస్త్రీయత అట్లుకాక, విమర్శనమునకు సంబంధించినది. (2) ఇక భౌతిక శాస్త్రజ్ఞులు ప్రతిపాదించు సిద్ధాంతములు పాంచభౌతిక ప్రపంచమునకు సంబంధించినవి, కాబట్టి అవి నిశ్చితముగను, సర్వవ్యాప్యముగను ఉండును. చారిత్రక సిద్ధాంతములు మానసిక ప్రపంచమునకు సంబంధించినవి. ఈ ప్రపంచమున సంకల్పము, ఉద్దేశ్యము ప్రధానము కాబట్టి, భౌతిక సిద్ధాంతములకున్న సర్వవ్యాపకత్వము గాని, సునిశ్చితముగాని యుండజాలదు. మానసిక ప్రపంచమునకు భౌతికప్రపంచమునకు లేని స్వేచ్ఛ యున్నదికదా !

పు. శ్రీ.