Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చరకుడు

వికీసోర్స్ నుండి

చరకుడు :

అష్టాంగ విశిష్టమగు పాతంజల యోగ శాస్త్రమును అష్టాధ్యాయాత్మకమగు పాణినీయ వ్యాకరణ మహా భాష్యమును, అష్టాంగ సముజ్జ్వలమగు ఆయుర్వేద సిద్ధాంతసంగ్రహమును రూపొందించిన పతంజలి మహర్షియే చరకుడని ప్రసిద్ధిగలదు.

ఈతనిచే సంగృహీతము లగు యోగ, వ్యాకరణ, ఆయుర్వేద శాస్త్రములు మూడును అష్టాంగములు గలవిగనే యున్నవి. చరకుడుగా వాడుకగనిన ఈ పతంజలి మహర్షి మద్ర రాజ్యనివాసి. రాజర్షి యగు జనకుని మహాధ్వరమందు అధ్యాత్మ విద్యాప్రబోధ మొనర్చిన యాజ్ఞవల్క్య మహర్షికి ఈతడు సమకాలికుడు. యాజ్ఞ వల్క్యుని ప్రతి ద్వంద్వియగు భుజ్యుమహర్షి ఖిలములగు వేద వేదాంగ విజ్ఞానభాగములను సేకరించుటకు దేశములు సంచరించుచు పతంజలి మహర్షి ఇంటికి వెళ్లె ననుటకు శుక్లయజుర్వేదీయ బృహదారణ్యకము ప్రమాణముగా నున్నది.


“అథ హైనం భుజ్యుర్లాహ్యాయనిః యాజ్ఞవల్క్యేతి
 హోవాచ. మద్రేషు చరకాః పర్యవ్రజామ తే
 పతంజలస్య కావ్యస్య గృహానైమ.”
                          —శుక్లయజుర్వేదీయ. బృహ. ఆ. 3; బ్రా. 3.

పతంజలియే చరకు డనుటకు యోగవార్తికమున విజ్ఞానభిక్షువు,


యోగేన చిత్తస్య పదేన వాచాం
          మలం శరీరస్య చ వైద్యకేన
యో౽పాకరోత్తం ప్రవరం మునీనాం
          పతంజలిం ప్రాంజలి రానతోస్మి.

"యమ నియమాసనాద్యష్టాంగ యోగశాస్త్రమున మనోమాలిన్యమును, వ్యాకరణమహాభాష్యమున వాజ్మాలిన్యమును, పంచకర్మ రసాయన వాజీకరణాభ్యాసములచే ఆయుర్వేదమున శరీరమాలిన్యమును తొలగించిన మహర్షి ప్రవరుడగు పతంజలిని ప్రాంజలిపై నమస్కరించుచున్నాను” అని నుడివెను. నేటివర కిట్లే యోగవ్యాకరణ వైద్యాచార్యులు శాస్త్రారంభములందు పతంజలిని ధ్యానించుట ఆచారముగా నున్నది

కాలవశమున మరుగుబడి, ఆ నోట ఆ నోట కొరుకుడుబడి, అదృశ్యములై, అపభ్రంశములై, ఖిలములగు వేద వేదాంగ పురాణేతిహాస విద్యలను, కళలను జాతీయ విజ్ఞాన సముద్ధరణోద్యుక్తులను విజ్ఞులు ఆయా కాలముల యందు ఆయా దేశములలో సంచరించి, సంగ్రహించి, సంరక్షించి, తిరిగి ప్రకాశమునకు, ప్రచారమునకు, తెచ్చు చుండినట్లు, అట్టి కళారాధకు లానాడు చరకులుగా చెప్పబడినట్లు ఈ గాథవలన తెలియుచున్నది. ఇందు చరకుడుగా, గ్రంథకర్తగా, ప్రఖ్యాతిగనినవాడు పతంజలి మహర్షి. ఇది చరకుడుగా పతంజలి మహర్షికిని ఆయుర్వేదమునకును సంబంధము గల వైదికగాథ. ఇందుకు పౌరాణికముగ మరియొకగాథ గనుపడుచున్నది. ఆది ఇది:

మత్స్యావతారమున శ్రీ మహావిష్ణువు వేదముల నుద్ధరించెను. సహస్రఫణామణీ విరాజితుడగు ఆది శేషుడా సమయమున ఆవేదవేదాంగములను, అధర్వణాంతర్గత మగు ఆయుర్వేదమును గ్రహించెను. పిమ్మట ఆదిశేషు డొకసారి మారువేషముతో భూమండలమును చూడవలెనని తిరుగుచు, భూమండలమునందు మానవులు ఆధి వ్యాధులకును, ఆకలిదప్పులకును, జనన, జరా, మరణములకును లోనై, దుఃఖితు లగుచుండుటను జూచెను. కరుణార్ద్ర హృదయు డగుటచే శేషు డా దుఃఖితులను జూచి, తానును దుఃఖపడెను. (ఆకలి, దప్పికలు, జరా మరణములు స్వాభావిక వ్యాధులుగా ఆయుర్వేదము నిశ్చయించినది). ఇట్టి దుఃఖముల నుండి ఎటెనను మానవులను కాపాడవలయునను భావముగలిగి, శేషుడు తానొక ఋషికుమారుడుగా మారి, ఒక మహర్షి కుటుంబమునకు వచ్చిచేరెను. ఆ కుటుంబమువా రీతని ఓజస్తేజో ప్రభావములను, నయవినయ ప్రతిభా ప్రజ్ఞావిశేషములను జూచి ఆప్యాయతతో తమ కుటుంబము వానినిగా జూచుకొనుచుండిరి. కులగోత్రములు తెలియక. దేశద్రిమ్మరిగా వచ్చిన వాడగుట - ఆ కుమారుని ఆ కుటుంబమువారు 'చరకు'డని పిలుచుచుండిరి. ఈ చరకుడు, పునర్వసు ఆత్రేయ శిష్యులగు అగ్ని వేశాదులు, తమతమ పేర్లతో రచించిన ఆయుర్వేద తంత్రములను చరకుడు ప్రతిసంస్కరించి ఒకట సమకూర్చెను చరక సంస్కృతమై ప్రచారమునకు వచ్చిన దగుట ఈ తంత్రమునకు చరక సంహిత యని ప్రసిద్ధి ఏర్పడినది.

ఇందుకు భావప్రకాశమునందు ప్రమాణ మిట్లు గలదు:


యదా మత్స్యావతారేణ హరిణా వేద ఉద్ధృతః
తదాశేషశ్చ తత్త్రెవ వేదం సాంగమవాప్తవాన్ 57

అధర్వాంతర్గతం సమ్య-గాయుర్వేదం చ లబ్ధవాన్
ఏక దా సమహీవృత్తం ద్రష్టుంచర ఇవాగతః 58

తత్రలోకాంగదైర్గ్రస్తాన్ వ్యథయా పరిపీడితాన్
స్థలేషు బహుషువ్యగ్రాన్ మ్రియమాణాం శ్చ దృష్టవాన్ 59

తాన్ దృష్ట్వాతిదయాయుక్తః తేషాం దుఃఖేన దుఃఖితః
అనన్త శ్చిన్తయామాస రోగోపశమకారణం 60

సంచిన్త్య సస్స్వయం తత్రమునేః పుత్రో బభూవహ
ప్రసిద్ధస్య విశుద్ధస్య వేదవేదాంగ వేదినః 61

యత శ్చర ఇవాయాతో నజ్ఞాతః కేనచిద్యతః
తస్మా చ్చరకనామ్నాసౌ ఖ్యాతశ్చ క్షితిమండలే 62

సభాతి చరకాచార్యో వేదాచార్యో యథా దివి,
సహస్రవదనస్యాంశో యేన ధ్వంసోరుజాం కృతః 63

ఆత్రేయస్య మునే శ్శిష్యా అగ్నివేశాదయో౽భవన్
మునయో బహవస్తైశ్చ కృతం తంత్రం స్వకం స్వకం. 64

తేషాం తంత్రాణి సంస్కృత్య సమాహృత్య విపశ్చితా
చరకేణాత్మనో నామ్నా గ్రంథోయం చరకస్స్మృతః 65


ఈ గాథలు రెండును చరకుడు శేషాంశ సంభవుడనుటకును, ఆయుర్వేద సముద్దారకు డనుటకును ప్రమాణములుగానే యున్నవి. ఈ చరకుడే పతంజలియని ప్రసిద్ధి. దేశకాల వైపరీత్యములచే వేదవేదాంగ పఠనము, శాస్త్రాభ్యాసము, కళానైపుణ్యము, నైతిక వర్తనము, సత్యధర్మ ప్రవృత్తి ప్రజలయందు సన్నగిలినప్పుడు, దైవాంశమున మహాపురుషు లుద్భవించుటయు, ఆయా ధర్మములను యధాపూర్వముగ సముద్దరించుటయు జరుగు నని ఆర్షవాణి తెలియజేయుచున్నది. ప్రత్యక్షముగ జగమెరిగిన నగ్నసత్య మిది.

చరకాగ్నివేశుల కాలనిర్ణయము : వేద వాఙ్గ్మయ ప్రాప్తికి, ఆర్ష విజ్ఞాన వ్యాప్తికి కాలకర్తృత్వ పరిగణనము అనూహ్యము. భౌతికజ్ఞానమునకు అందని అతీంద్రియ గ్రాహ్యమగు విషయ మిది : ‘నమిథ్యా ఋషిభాషితం.' (వా. రా. యు. 60-12) ఆత్మశక్తి సంపన్నులును. త్రికాలజ్ఞులును అగు మహర్షుల వాక్యములు అసత్యములు గావను నిబ్బరముతో, నిస్సంశయాత్మతో ప్రర్తింపవలసినదే. చరకుడు గాని, అగ్ని వేశుడుగాని ఈ కాలమువారే యని నిశ్చయించుటకు ఆధారములు అందుబాటులో లేవు. కాని పతంజలిగా చరకుడు యాజ్ఞవల్క్యుని కాలమువాడే యని నిశ్చయమునకు వచ్చినచో, యాజ్ఞవల్క్యుడు రాజర్షి యగు జనకుని కాలమువాడు. ఆధ్యాత్మిక విద్యాజ్ఞాన ధనియగు ఈ జనకుడు శ్రీరామునకు కన్యాదాత. శ్రీరాముడు త్రేతాయుగ మధ్యభాగమున నున్న వాడు. ఈ త్రేతాయుగము మన వెనుక జనినదే యనుకొనిన, చరకు డి నాటికి ఒకటిన్నర యుగమునకు, అనగా 15 లక్షల 5 వేల 62 సంవత్సరములకు పూర్వ మున్నవాడుగా గ్రహింపవలసి యున్నది.

అగ్ని వేశుడు పునర్వసు - ఆత్రేయమహర్షి శిష్యుడు. ఈ ఆత్రేయుడు భరద్వాజ మహర్షి వలన ఆయుర్వేదమును గ్రహించెను. భరద్వాజుడు ఆయుర్వేదమును ఇంద్రుని నుండి భూలోకమునకు తెచ్చిన ఆదిమహర్షి; వంశకర్త. ఈయనయే శ్రీరాము డరణ్యమునకు బోవునపుడును, భరతుడు రామునికై అరణ్యమునకు బోవునపుడును, రాముడు తిరిగి రాజ్యమునకు వచ్చునపుడును, అరణ్య ద్వారమున మొద లాతిథ్య మిచ్చిన బ్రహ్మర్షి. తనను విడిచి రాము డరణ్యమునకు పోయినది మొదలు తిరిగి తనను చేరువరకు నడచిన మధ్యకాల మందలి చరిత్ర నంతయు రామునకు వినిపించిన దివ్యజ్ఞాన తపస్సంపన్నిధి. ఈ మహామహుని కాలనిర్ణయమునకు ఆదిమ సృష్టికర్తయగు బ్రహ్మవద్దకు వెళ్లవలసియున్నది. ఏలయన, అమృత మధనమువరకు ఆయుర్వేదము భూలోకమున వ్యాప్తికి రాలేదు. అమృతోదయానంతరము, అందరు-అజరామరు రైరి (ముదిమియు, చావును లేనివారు). ఇది బ్రహ్మ ఆదిమ సృష్టికాలము - నూరుకోట్ల యుగముల పురాతన గాథ (గ. పు. మ. ఖం.). తరువాతి కాలమున కశ్యపాది ప్రజాపతుల సృష్టి ఆరంభమై ఆ ప్రజలు ఆధి వ్యాధులకు లోనగుట కారణముగా, ఆనాటి బ్రహ్మర్షి మండలమున తపః ప్రభావ సంపత్తిచే మిన్నయైన భరద్వాజ మహర్షి స్వర్గమునకు వెళ్లి బ్రహ్మాదిగా అశ్వినులవలన ఆయుర్వేదము తెలిసికొని యున్న ఇంద్రునినుండి తా గ్రహించిన ఆయుర్వేదమును భూమండలమునకు తెచ్చి మహర్షి మండలము నందు ఉపదేశించెను. ఆ మహర్షి మండలమందు గల పునర్వసు - ఆత్రేయుడు నిస్సంశయముగా, సాంగముగా, సమగ్రముగా, భరద్వాజునివలన ఆయుర్వేదమును గ్రహించి అగ్ని వేశ, ఖేల, జతూకర్ణ, పరాశర, హారీత, క్షారపాణు లను ఆర్వురు శిష్యులకు బోధించెను. ఈ ఆరుగురును ప్రత్యేకముగ తమతమ పేర్లతో తంత్రములను రచించి తమ గురుకుల మందలి మహర్షి మండలమునందు వినిపించిరి; వారి మెప్పుల నందిరి ప్రచారము గావించిరి. ఇందగ్ని వేశుని మహర్షులు హెచ్చుగా మెచ్చుకొనిరి. ఇది చరకసంహిత యందలి గాథ. దీని ననుసరించి అగ్ని వేశుని కాలనిర్ణయమునకు కోట్ల తరబడిగా గడచిన యుగముల వెంట నడవవలసి యున్నది.

మహాభారతమునందు రెండు సందర్భములలో అగ్నివేశుడు కనబడుచున్నాడు. ఇతడు ఆదిపర్వమున ప్రమద్వర మృతినొందినపుడు భద్రాత్రేయునితో వైద్యుడుగా వచ్చినట్లును, అరణ్యపర్వమున ధర్మరాజు హిమవంతమునకు పోవునపుడు అగ్నిహోత్రములను గొని పౌరోహితుడుగా ముందు నడచినట్లును గలదు. ఈ రెండు పర్యాయములు ఇందు పేర్కొనబడిన అగ్నివేశు డొక్కడే యనినను, వేరువే రనినను అగ్నివేశునికాలము ధర్మజుని కాలమునకు సమముగా నిర్ణయించుట పొసగదు. వైద్యుడు పౌరోహితుడుగా నుండు ప్రాచీనాచార మొకటి కలదు. ఇది ఆయుర్వేద మతమై యున్నది. బ్రహ్మర్షి యగు వసిష్ఠుడు మనువాదిగా సూర్యవంశపు చక్రవర్తులకు గురువుగను, పౌరోహితుడుగను ఉండెను. బ్రహ్మర్షి కాగోరి, తప మాచరించుచున్న రాజర్షి యగు విశ్వామిత్రుడు సశరీర స్వర్గయానమును గోరుచున్న త్రిశంకునకు ఆచార్యత్వము వహించి యజ్ఞము చేయించెను. స్వచ్ఛందవర్తనులగు మహర్షులు వైద్యులుగను, పౌరోహితులుగను, దేశ క్షేమమునకై రాజుల కడనుండి యుండవచ్చును. మహర్షుల చరిత్ర బహువిచిత్ర మైనది. పాండవ పౌరోహిత్యమునకు ధౌమ్యు డంగీకరించి నట్లు పాండవ ప్రార్థితుడై అగ్నివేశుడు రాజ చికిత్సకుడుగా, పౌరోహితుడుగా ధర్మజుని కడ నుండిన నుండవచ్చును గాని, అది కారణముగా అగ్ని వేశుని కాలము ధర్మజుని కాలమునకు దించుటకు వీలుచాలదు.

ధర్మజుడు పట్టాభిషిక్తుడై 36 సంవత్సరములు రాజ్యపాలన మొనర్చెను. ధర్మజుని పూర్ణాయువు 128 సంవత్సరములు. ఈ కాలము ద్వాపరాంతమును, కలియుగారంభమునై యున్నది. కలి గతాబ్దము లిప్పటికి 5 వేల 62 సంవత్సరములు. ఎంత యుదారముగా వెనుకకు చూచినను, ధర్మజుని కాల మీనాటికి 5 వేల 200 సంవత్సరములకు పైన పోజాలదు. చరకుడు ధర్మజునకు పూర్వుడనుట నిర్వివాదము. సంస్కర్తకంటె గ్రంథకర్త పూర్వుడుగా నుండి యుండవలయును గదా ! అందుచే రసాయన తపోవ వాస బ్రహ్మచర్యవ్రతాభ్యాసముల వలన అనియ తాయుర్దాయువులగు మహర్షుల కోవలోనివాడగు అగ్ని వేశుడు ధర్మజుని కాలమునం దున్నను, చరకునికంటె పూర్వము వాడై యుండు నని నిస్సందేహముగా చెప్పవచ్చును. చరకాగ్ని వేశుల మధ్యగత మయిన కాలముఅనూహ్యము.


విస్తారయతి లేశోక్తం సంక్షిప త్యతివిస్తరం
సంస్కర్తా కురుతే తంత్రం పురాణం చ పునర్నవం.
                                           (చ. సి. 12-68)

సంస్కర్త యగు నతడు పూర్వతంత్రమునందు సూత్రప్రాయముగ చెప్పిన విషయములను ఇతరులకు చక్కగా తెలియునట్లు విస్తరింపజేసియు, అతిదీర్ఘములుగ జెప్పిన విషయములను సులభముగా గ్రహించునట్లు సంగ్రహింయు, జారిపోయిన విషయములను సంతరించియు, వ్యత్యస్తవిషయములను సవరించియు, ఆ ప్రాచీనతంత్రమునకు మెరుగుదిద్ది నూతనత్వము నాపాదింప జేయును. ఇదియే చరకు డగ్ని వేశుని తంత్రమునకు సమకూర్చిన నవ నవోన్మేషత.

ఆ కారణములు ప్రమాణములుగా బ్రహ్మమొదలు ఆయుర్వేదము వ్యాప్తియం దుండుటచేతను ఋగథర్వణములు ఆయుర్వేదమునకు మూలము లగుటచేతను (ఋగ్వేదమునకు ఆయుర్వేదము ఉపవేదమైనట్లు చరణవ్యూహమున వ్యాసుడు) ఆయుర్వేద మనంతకాలప్రాప్తము; వ్యాప్తిగలది. చరకాగ్ని వేశు లిరువురు యుగయుగాంతరముల పురాణపురుషులు. చరక రచన, పాతంజల యోగదర్శనము, పాణిని వ్యాకరణ మహాభాష్యము, అగ్ని వేశ తంత్ర ప్రతిసంస్కరణము - ఇవి చరకుని రచనలు. ఇందు స్వతంత్ర రచన యోగదర్శనము; పరతంత్ర పరామర్శనము వ్యాకరణ మహాభాష్యము ; సమగ్ర స్వతంత్ర సాధనము చరక సంహితగా ప్రసిద్ధిగాంచిన అగ్నివేశతంత్రము.

యోగదర్శనము నాలుగు పాదములు, ఎనిమిది అంగములు గలది. ప్రథమ పాదమునందు 'అథయోగాను శాసనం, యోగ శ్చిత్తవృత్తి నిరోధః" అని ప్రారంభించి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, రూప - అష్టాంగములు సలక్షణములుగ వివరింపబడినవి. ద్వితీయ పాదమునందు 'తపస్స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః' అని వివిధ విషయవాసనాప్రోత్థితమగు చిత్తనిరోధక క్రియా యోగములైన యమ, నియమ, ఆసన ప్రాణాయామ, ప్రత్యాహారములను ఐదంగములు బహిరంగ సాధనములుగా నిర్దేశింపబడి, అభ్యాసపూర్వకముగ వివరింపబడినవి. తృతీయపాదమునందు, 'దేశబంధః చితస్యధారణా' అని ధ్యాన, ధారణ, సమాధులను మూ డంగములను అంతరంగ సాధనములుగా, సక్రియాత్మకములుగా వివరింపబడినవి.

చతుర్థ పాదమునందు, 'జన్మ, ఔషధ, మంత్ర, తపస్సమాధిజాః సిద్ధయః' అని సిద్ధపంచకము, ప్రయోజనము, కైవల్యము, పంచవింశతి తత్వములు, క్లేశకర్మవిపాకాశయము అను వాటితో గూడుకొనిన పురుషుడు స్వేచ్ఛాను. యాయియై,నిర్మాణకాయము నధిష్ఠించిపారలౌకికత్వము నందుట వివరింపబడినది. మొత్తము మీద యోగదర్శనమంతయు జీవన్ముక్తత్వమును, పరమేశ్వర తత్వదర్శనత్వమును కలిగించి, జీవాత్మ పరమాత్మలకు అభేద ప్రతిశ్రయమగు శాశ్వత బ్రహ్మానంద మనుభవించుటను తెలియ జేయును.

వ్యాకరణమహాభాష్యము : ఇది గీర్వాణవాణీసామ్రాజ్య భద్రపీఠము; ఇది లేనిచో జాతి, సంస్కృతి సజీవముగా నుండజాలదు.

చరకసంహిత : ఇది ప్రతి సంస్కరింపబడిన అగ్నివేశ సంహిత. ఈ ప్రతి సంస్కరణమునందు చరకుని ప్రతిభా

విశేషము, కేవల శేషత్త్వ ప్రభావత్త్వము సహస్రముఖముల ప్రదర్శిత మగుచుండును. గ్రంథము ఎనిమిది స్థానములు ; నూట ఇరువది యెనిమిది అధ్యాయములు ; పండ్రెండువేల సూత్రములు గలది. త్రివర్గసాధనమునకు, తిస్రైషణప్రాప్తికి ఇందు చెప్పబడిన సాధన సమున్నయము సర్వతంత్రములయందును సమృద్ధముగా గలదు. ఇందు విడిచిపెట్టిన దెద్దియు ఇతర తంత్రములందు లభ్యముకాదు. అని గ్రంథాంతమున ప్రతిజ్ఞా పూర్తిగ చెప్పబడినది. ఇది అక్షరశః నిజము.


చికిత్సావహ్ని వేశస్య స్వస్థాతు రహితం ప్రతి
యది హా౽స్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్.
                                              చ. సి. 12-93.

చరక మానాటినుండి ఈనాటివరకు భారతీయ ఆరోగ్యశాస్త్రమగు ఆయుర్వేద సిద్ధాంత వ్యవస్థాపనయందు అగ్రగణ్యత వహించి విద్వద్వైద్య జీవనసంజీవనముగా, సకల పురాణేతిహాస సంగ్రహముగా ఆర్ష విజ్ఞాన విద్యోతితముగా, వేదమయముగా, మానవధర్మసర్వస్వముగా ప్రకాశించుచున్నది. ఇందలిధర్మములు, ఆయుర్వేద ధర్మములను శీర్షికయందు కోశముననిరూపింపబడియున్నవి. ఇచట నిర్దేశింపబడిన అనేక ధర్మములలో ముఖ్యము శరీర రక్షణము. ఆయుఃపాలనము . ఇందు కనువదితములగు కొన్ని వాక్యములు ఇచట చూడనగును.


ధర్మార్థకామమోక్షాణా మారోగ్యం మూలముత్తమం
రోగా స్తస్యాపహర్తారః శ్రేయసో జీవితస్యచ.
                                            చ. సూ. 1-15.

ధర్మార్థకామమోక్షములను ఉపార్జించుటకు ప్రధానమైనది, ఉత్తమమైనది ఆరోగ్యము. అట్టి పవిత్ర మైన జీవితముయొక్క ఆరోగ్యభాగ్యమును రోగములు హరించునవిగా నున్నవి.


సర్వమన్య త్పరిత్యజ్య శరీర మనుపాలయేత్
తదభావేహి భావానాం సర్వాభావ శ్శరీరిణాం. చ.

మనుజుడు ఇతర పనుల నన్నిటిని విడిచి శరీరమును జాగ్రతగా సంరక్షించుకొన వలయును. చతుర్వర్గసాధ నానుభూతమైన శరీరము లేనివాడు, సర్వముండియు లేనియట్లే.


సాహసం వర్జయే త్కర్మ రక్షన్ జీవితమాత్మనః
జీవన్‌హి పురుష స్త్విష్టం కర్మణః ఫలమశ్నుతే.
                                               చ. ని. 6-6.

తన జీవితమును కాపాడుకొన తలచిన మానవుడు సాహసించి తన శరీరబలమునకు మించిన పనులను చేయ బూనుకొనరాదు. మానవుడు సజీవుడై యుండినగాని ఇష్టా పూర్తములగు తాజేసిన కర్మఫలముల ననుభవింపజాలదు.


ఆత్మాన మేవ మన్యేత కర్తారం సుఖదుఃఖయోః
తస్కాత్ శ్రేయస్కరం మార్గం ప్రతిపద్యేతనోత్ర సేత్ .
                                                 చ. ని. 7-25.

మనుజుడు తన సుఖదుఃఖములకు తానే కర్తయని తలంపవలయును. కావున తనకు శ్రేయోదాయక మగు మార్గము ననుసరించి పోవలయును. భయపడరాదు.


నగరీనగరస్యేవ రథస్యేవ రథీ యథా
స్వశరీరస్య మేధావీ కృత్యేష్వవహితో భవేత్.
                                     చ. సూ. 5-100.

ఒక మహాపట్టణమును నగరరక్షకుడు కాపాడుచుండునట్లును, ఒక మహారథికుడు తన రథమును శత్రువుల కభేద్యముగా సంరక్షించుకొను చుండునట్లును, బుద్ధిమంతుడగు మనుజుడు తన శరీర సంరక్షణమున కవసరములగు పనులయందు హెచ్చరికగలవాడై (అప్రమత్తుడై) యుండవలయును.


పురుషో మతిమాన్ ఆత్మనః శరీరమనురక్షన్ శుక్రమను
రక్షేత్ పరాహ్యే షా ఫల నిర్వృత్తి రాహార స్యేతి.
                                            చ. ని. 6-15.

శరీరమును కాపాడుకొన దలచిన బుద్ధిమంతుడగు మానవుడు శుక్రమును సంరక్షించు కొనవలయును. ఈ శుక్రము ఆహార పరిణామ ఫలరూపమై యున్నది.


ఆహారస్య పరంధామ శుక్రం తద్రక్ష్య మాత్మనః
క్షయోహ్యస్య బహూన్‌రోగాన్ మరణంవానియచ్ఛతి.
                                                చ. ని. 6-16.

శుక్రము ఆహారముయొక్క ఉత్తమ పరిణామము గలది. ఆత్మ సంరక్షణమునకై మనుజుడు తన శుక్రమును సంరక్షించు కొనవలయును. శుక్రము క్షీణించుటవలన అనేక రోగములు కలుగవచ్చును. లేక మానవుడు మృత్యువు నొందవచ్చును.


నిత్య సన్నిహితామిత్రం సమీక్ష్యాత్మా నమాత్మవాన్
నిత్యం యుక్తః పరిచరేత్ ఇచ్చన్నాయు రనిత్వరం.
                                            చ. సూ. 17-117.

వివేకవంతుడగు మనుజుడు - వ్యాధిరూపమైన శత్రువు నిత్యము నీడవలె తన్ననుసరించి వర్తించుచున్న దని గ్రహించి, ఆయుస్సంరక్షణమునుగోరి నియమవర్తనుడై శరీరమును నిత్యమును ఉపచరించు చుండవలయును.

అనేక ఉదాహరణములతో శరీరరక్షణ మిట్లుపదేశింప బడినది. శరీర పోషణమునకు, ఆయుస్సంరక్షణమునకు, అనుకూలమగు ఆహారోపయోగధర్మములు కొన్ని ఇచట చూడనగును.


(1) ఇష్టవర్ణగన్ధరసస్పర్శం విధివిహిత మన్న
పానం- ప్రాణినాం - ప్రాణిసంజ్ఞి కానాం - ప్రాణమాచ
క్షతే కుశలాః ప్రత్యక్షఫలదర్శనాత్ - తదిన్ధనాహ్యన్త
రాగ్నేస్థితిః-తత్సత్వమూర్జయతి-తచ్ఛరీర ధాతువ్యూహ-
బల - వర్ణేన్ద్రియప్రసాదకరం - యథోక్త ముపసేవ్యమానః
విపరీతమహితాయ సంపద్యతే.
                                                 చ. సూ. 27-3.

మనస్సున కాహ్లాదము కలిగించు-రూపము-సువాసన, రుచి-మృదుత్వము గలిగి నియమానుసారము సిద్ధము చేయబడిన ఆహార పదార్థము - ప్రాణు లని వ్యవహరింపబడు మానవులకు-ప్రాణ మని ఆయుర్వేద తత్త్వవిదులు చెప్పుచున్నారు. ఇది ప్రత్యక్షఫలముగా గనబడుచున్నది. ఇట్టి గుణసంపదగల యాహారము -తగినట్లు భుజించినజఠరాగ్ని రక్షణమునకు ఇంధనమువంటి దగును. మనోబలమును పెంపొందించును. శరీరమునందుగల రసరక్తమాంసమేదోమజ్జాస్థి శుక్రములను ధాతు సముదాయమును బలమును రూపమును - నేత్రశ్రోత్రాది ఇంద్రియములకు ప్రసన్నత్వమును - కలిగించును. నియతినియమానుసారము సిద్ధముగాని ఆహారమును సేవించినచో, మనస్సునకును - శరీర బలవర్ణాదులకును హాని కల్గును.

(2) అన్నంవృత్తి కరాణాంశ్రేష్ఠం-శరీరమును మంచి స్థితియం దుంచు ఆహార ద్రవ్యములలో వరిఅన్నము యోగ్యమైనది.

(3) ఉదక మాశ్వాసకరాణాం-శరీరమునకు గలిగిన శ్రమను హరించి ఊరట కలిగించు పదార్థములలో ఉదకము శ్రేష్ఠమయినది.

(4) క్షీరం జీవనీయానాం- శరీరబలమును సంరక్షించుచు ఆయువును పోషించు పదార్థములలో పాలు యోగ్యమైనవి.

(5) గోక్షీరం క్షీరాణాం - నిత్యోపయోగ్యమగు పాలలో ఆవుపాలు శ్రేష్ఠ మయినవి.

(6) గవ్యం సర్పిస్సర్పిణాం-ఆహారోపయోగి ఘృతములలో గోఘృతము శ్రేష్ఠ మైనది.

(7) తిలతైలం స్థావరజాతానాం స్నేహానాం-స్థావర తైలములలో నువ్వులనూనె శ్రేష్ఠ మైనది.

(8) శృఙ్గబేరం కందానాం - దుంపలలో (గడ్డపదార్థములలో) అల్లము యోగ్యమైనది.

(9) మృద్వీకా ఫలానాం - ఫలములలో ద్రాక్షపండ్లు ఉత్తమమైనవి.

(10) శర్కరా ఇక్షువికారాణాం - చెరుకున బుట్టు బెల్లము మొదలగు పదార్థములలో చక్కెర శ్రేష్ఠమైనది.

ఇట్లే ఆహారోపయోగి ద్రవ్యములందు నిషేధింపబడిన మరికొన్నిటి నిట చూడనగును -

(1) యావకా శ్ళూకధాన్యానాం- అపథ్యతమత్వేన - ప్రకృష్టత మాభవన్తి - ముల్లుగల (తోకగల) ధాన్యము నందు యవలు (గోదుమలవలె నుండు ధాన్యము) అపథ్యకరమైన ద్రవ్యములు. ఇవి మిక్కిలి పనికిరానివి.

(2) వర్షానాదేయ ముదకానాం - సేవింపతగిన ఉదకములలో వర్షాకాలమునందు ప్రవహించు నదులలోని ఉదకము పనికిరానిది.

(3) ఊషరం లవణానాం - ఉపయోగించు ఉప్పులలో చవిటియుప్పు పనికిరానిది.

(4) అవిక్షీరం క్షీరాణాం - పాలలో గొఱ్ఱె పాలు పనికిరానివి.

(5) ఆవికం సర్పి: సర్పిషాం - ఉపయోగింప తగిన ఘృతములలో గొఱ్ఱెనెయ్యి పనికిరానిది.

(6) కుసుమ్భ స్నేహః - స్థావరస్నేహానాం - స్థావర తైలములలో – కుసుమనూనె ఉపయోగార్హత కాదు.

(7) నికుచం ఫలానాం – పండ్లలో చిన్న రేగుపండ్లు పనికిరానివి.

(8) ఆలుకం కందానాం - గడ్డలలో ఆలుగడ్డలు పనికిరానివి.

(9) ఫాణిత మిక్షువికారాణాం - చెరకుచే చేయబడిన వాటియందు సగముడికిన బెల్లపుపానకము పనికిరానిది.

(10) సర్షపశాకం శాకానాం - ఆకు కూరలలో ఆవకూర పనికిరానిది.

ఇట్లే మరికొన్ని నిత్యాభ్యాసమున శరీర సంరక్షణమును – ఆయుస్థాపనమును చేయు ద్రవ్యములు విధింప బడినవి. (ఇవి నిత్యాభ్యాస ధర్మములు).

(1) క్షీర ఘృతాభ్యాసో రసాయనానాం - రసాయన ద్రవ్యములందు పాలను నేతిని కలిపి నిత్యముపయోగిం చుట శ్రేష్ఠము, (రసాయనములనగా “యజ్జరా వ్యాధి విధ్వంసి – భేషజం తద్రసాయనం” వ్యాధిని హరింప జేయునట్టియు - శరీరమునందు ముడుతలు, తలనెరియుట, చత్వారము – చెముడు మొదలగు ముసలితనపు లక్షణములు రానీయకుండ కాపాడునట్టియు - ద్రవ్యములు రసాయనము లని ఆయుర్వేదనిర్వచనము.

(2) తైలగండూషాభ్యాసో దంతబల రుచికరాణాం— నిత్యాభ్యాసమున నువ్వులనూనెను పుక్కిలించుట — దంతములకు బలమును, నోటికి రుచిని కలిగించును. దీనికి తైలగండూషాభ్యాస మని వాడుక - ఇందుకు విధి ఇది. సుమారు రెండు మూడు తులముల నువ్వుల నూనెను గోరు వెచ్చగా కాచి— ఉదయము దంతధావనానంతరము పుక్కిట బట్టి బాగా పుక్కిలించి ఉమ్మివేయ వలయును - ఇట్లు చేయుటచే చిగుళ్లు గట్టిపడి ఎట్టి రోగములకును తావీయక దంతములను పదిలముగా కాపాడును. పుప్పిపండ్లురావు. నోటిపూత కలుగదు. కలిగియున్న వెంటనే శమించును. పెదవులు పగులవు.

(3) మధుకం - చక్షుష్య - వృష్య - కేశ్య - కంఠ్య - వర్ణ్య—విరజనీయ—రోపణియానాం-కండ్లకుహితమును — శుక్రమునకు బలమును - వెండ్రుకలకు పెంపుదలను — సుస్వరమును శరీరచ్ఛాయను వృద్ధి నందించుటను - మాలిన్యమును తొలగించుటను - వ్రణములనుమాన్పుటను- చేయు ద్రవ్యములలో యష్టిమధుకముశ్రేష్ఠమైనది.

ఇట్లే ఆహారమున పాటించవలసిన ధర్మములు అనేకములు గలవు. మచ్చునకు : (1) కాలభోజనం ఆరోగ్య కరాణాం — ఆరోగ్యకరములగు పనులలో సకాలమున భుజించుట - శ్రేష్ఠ మయినది.

(2) ఏకాశన భోజనం సుఖపరిణామ కరణాం - ఆహార పదార్థము సుఖముగ జీర్ణింప జేయుటలో - ఒక పూటనే భుజించుట - ఉత్తమమైనది.

(3) గురు భోజనం దుర్విపాకానాం - గురుకరపదార్థ భక్షణ మజీర్ణమును కలిగించును.

(4) అతి మాత్రాశనం - ఆమప్రదోష హేతూనాం - మితిమీరి భుజించుట, అజీర్ణదోషమును కలిగించును.

(5) అనశనం-ఆయుషో హ్రాస కరాణాం - ఆహారము తీసికొనకపోవుట ఆయుష్యమును క్షీణింపచేయును.

(6) ప్రమితాశనం - కర్మనీయానాం - మిక్కిలి తక్కువగా భుజించుట - శరీరమును శుష్కింపచేయును.

(7) విరుద్ధవీర్యా శయనం - నిన్దితవ్యాధి కరాణాం- పరస్పర విరుద్ధ వీర్యములగు ఆహార పదార్థములను భుజించుట - కుష్ఠువు మొదలగు అసహ్యకరమైన వ్యాధులను కలుగచేయును.

(8) మాత్రా శీస్యాత్ - మనుజుడు ప్రమాణము ననుసరించి భుజింపవలయును.

(9) అహారమాత్రా వునరగ్ని బలాపేక్షిణీ - భుజింప తగిన ఆహారద్రవ్య ప్రమాణము - జఠరాగ్ని బలము ననుసరించి యున్నది.

(10) యావద్ధ్యస్యాశన- మశితమనుపహత్య - ప్రకృతిం యధాకాలం - జరాంగచ్ఛతి తావ - దస్య - మాత్రా ప్రమాణం - వేదితవ్యం భవతి.

ఎవనికి ఎంత భుజించిన - ప్రకృతికి బాధకలుగక - సకాలమున జీర్ణముచెందునో - అంత యాహారము వానికి తగిన ప్రమాణముగా తెలిసికొనతగినది.

ఆహారోపయోగ ధర్మము లిట్లు నాలు గంతరములుగా ముప్పదిమూడు (33) మాత్ర ముదాహరణమున కిచట తెలియచేయబడినవి. సవివరముగ చరకసూత్రమున 27 వ అధ్యాయమునందును, నిదాన, విమాన శారీర చికిత్సా స్థానములందును చూడనగును. శరీర రక్షణమునకు ఆయుఃపాలన మవసరము. ఆయుఃపాలనమునకు హితమైనఆహార సేవనము ముఖ్యము. హితాహార సేవనఫలమిట్లుగలదు.


షట్త్రిం శతం సహస్రాణి, రాత్రీణాం హితభోజనః
జీవత్యనాతురో జంతుః, జితాత్మా సమ్మతః సతాం.
                                            (చ. సూ. 27-350)

ద్రవ్య, రస, గుణ, వీర్య, విపాక, ప్రభావ ధర్మములను తెలిసికొని, ఇంద్రియ నిగ్రహముకలిగి, తన శరీరేంద్రియ సత్వాత్మలకు మేలు చేయునట్టి ఆహారమును భుజించునట్టి మానవుడు రోగరహితుడై సజ్జన సమ్మతమగు పూర్ణాయువు గలిగి, ముప్పదియారు వేల (36,000) మ్రాత్రులు, అనగా - నూరు సంవత్సరములు సుఖముగా జీవించును.


తస్మాత్ హితోపచార మూలం జీవితం - అతో వివర్యాసాన్మృత్యుః.
                                                                 (చ. వి. 3-42).

పైన చెప్పబడిన అనేక కారణములచేతమ, ప్రత్యక్ష ప్రమాణములచేతను, హితాహార విహారోపచారములు జీవిత సంరక్షణమునకు (ఆయు రభివృద్ధికి) ప్రధాన కారణములు. ఇందుకు భిన్నములగు అహితాహారవిహారోచా పరములు మృత్యువునందించును.

ఆయుర్వేదము, ఆయుఃపరిమితిని నిర్ణయించలేదు. ఈ సందర్భములో పైని సతాంసమ్మతమగు ఆయువు నూరు సంవత్సరములుగా మాత్రము చెప్పి విడిచినది. మానవుని ఆయువు అపరిమితమైనది. అనంతకాలావధి గలది- అని ఆయుర్వేద సిద్ధాంతము. అందుకనియే


అథాతో దీర్ఘం జీవిత మధ్యాయం వ్యాఖ్యాస్యామః.
                                         (చ. సూ. అ. 1-1)

కర్మబ్రహ్మ ప్రతిపాదనానంతరము, మానవుడు బహుకాలము జీవించుటను గూర్చి వివరించెదము అని చరకమున, జీవితమును స్వేచ్ఛానుసారము పెంపొందింపచేయు చర్చ ముందుగా ప్రారంభింపబడినది. ఈ ఆయుఃపాలనమునకు దైవము, పురుషకారము అనునవి ప్రధానములు. ఇందు దైవము పూర్వజన్మార్జిత కర్మానుషంగము గలది. ఆయుర్వేదధర్మానుకరణమగు నిత్యాహార, విహార, వస, నాసన, శయనోపాయన, రత్నాభరణధారణ, బలి, హోమ, మంగళ క్రియాకలాపాది విహితనియతాచార విచారవర్తనముగలది పురుష కారము.

అందువలన "భూతానా మాయుర్యుక్తి మపేక్షతే" (చ. వి. 3.35) ప్రాణి సముదాయముయొక్క ఆయుఃకాలపరిమితి - యుక్తిననుసరించి యోచింపతగినది అని చరకము నిర్వచించినది. ఈ యుక్తియనునది - దైవ పురుష కారములయం దాధారపడియున్నది.

ఇచట - చరకముచే పలుమారులు చెప్పబడుచున్న దైవపురుషకారములు రెండును ధర్మానుబద్ధములైనవి. ధర్మము పురుషార్థ సాధనచతుష్టయమునందు మొదటిది. ధర్మశబ్దమునకు లౌకిక వైదికార్థములు రెండు కలవు. స్థూలముగ ఈ రెండర్థములు ఒకటిగనే కనుపడును. గాని విమర్శనమున మిక్కిలి వ్యత్యాసము కలదు.

లౌకికార్థము న్యాయము. ఇది సర్వదా లోక వ్యవహారమున రాజశాసనముగా వ్యవహరింపబడుచుండును. న్యాయవాదులు, న్యాయస్థానములు దీని కాధారములు.

వైదికార్థము - వేదోదిత విధినిషేధానువర్తనము. ఇది మతప్రతిపత్తికలది. మతములు - మతాచార్యులు - మఠములు - పీఠములు - దీని కాధారము. వైదికార్థము లౌకికార్థమునకన్న సూక్ష్మాతి సూక్ష్మమగు పరమార్థ నిష్పత్తిగలది. ఇందు లౌకికార్థము పునః పునరావర్తనమున కవకాశముగలది. కాని వైదికార్థమందుకు అతీత మయినది. అందువలన ఆయుర్వేదముచే నిర్దేశింపబడిన ధర్మార్థ కామమోక్షము లను పదములందలి యర్దము లౌకికాతీతమగు మహోన్నత భావప్రసారము గలది.

దహరము మీద ధర్మశబ్దార్థము - మానవుని నిత్య జీవన వ్యవహారమున నియమవర్తనునిగా నడిపించుటయై యున్నది. కాని ఈ నియమ జీవనానువర్తనము వైదికార్థమునందే పుంజీభూతమైయున్నది. సర్వార్థసాధనమైన యీ ధర్మము సాధింపబడిననాడు మిగిలిన పురుషార్థములు స్వయంభుక్తములగును. సత్యమైన యీ వేదార్థమును - ఆయుర్వేదము - ప్రత్యేక మొక మత నిష్పత్తి గలదియై విశ్వతోముఖముగ వికసింప జేసినది. ఈ మత సిద్ధాంత స్వరూపము చరకము.


చరకుడు మతప్రవక్త - మతగ్రంథము చరకము.

ఈ గంభీరార్థ ప్రతిపాదితమై, మానవధర్మ సముచ్చయమైన ఆయురామ్నాయ సంప్రదాయము రూపొందింప బడిన ఉత్తమోత్తమ మతగ్రంథము చరకము, అనన్య సామాన్యమగు అభినివేశతంత్ర సంస్కర్త యగు చరకుడు త్రివర్గసాధన ధర్మ ప్రబోధనమగు ఆయుర్వేద మతప్రవక్త.

వే. తి. వేం. రా.