సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చదరంగము II
చదరంగము - 2 :
చదరంగము చాల పూర్వకాలమునుండి యిండ్లయం దాడబడు ఆటలలో గొప్పదిగా పరిగణింపబడి జనబాహుళ్యమునందు వ్యాప్తిచెంది రాజులచేగూడ ప్రోత్సహింప బడినది.
ఈ ఆటకు భారతదేశమే పుట్టినిల్లు. మన పురాణ గ్రంథములగు రామాయణ, భారత, భాగవతములందును, తదితరములగు విక్రమార్క చరిత్ర, కల్హణుని రాజతరంగిణి, రుద్రటుని కావ్యాలంకారము, భట్టబాణుని హర్ష చరిత్రము. విష్ణుపురాణము, హరివంశము, పాత్స్యాయనుని కామసూత్రములు మొదలగు ప్రాచీన గ్రంథము లందును ; మహాయాన బౌద్ధగ్రంథమగు సధర్మ పుండరీకమునందును, హీనయాన బౌద్ధగ్రంథ మగు బ్రహ్మజాల సుత్తమునందును “అష్టాపద" మనుపేర చదరంగ ప్రసక్తి కలదు. పరదేశీయు లగు సర్ థామస్ హైడ్, హెరాల్డు ముర్రే మొదలగు చదరంగ చరిత్రకారులుకూడ చదరంగమునకు భారతదేశమే పుట్టినిల్లని తమ గ్రంథముల యందు రచించిరి.
చదరంగ మను పదము మన పురాణ గ్రంథముల యందు సైన్యమునకు బదులుగ వాడబడినది. చతురంగ మన నాలుగు భాగములు గల సైన్యమని భావము. ఈ ఆటకూడ రాజు, మంత్రి గాక ; ఏనుగు, గుఱ్ఱము, శకటము, బంటు అను నాలుగు విధములగు ఆటవస్తువులను సైన్యముతో అరువది నాలుగు గళ్ళుగల బల్ల యను యుద్ధరంగమున ఇద్దరు ఆటగాండ్రచే నాడబడును. ఒక ఆటగాడు తన బలము సహాయమున మరియొక ఆటగాని రాజును బంధించుటకు తన బుద్ధిబలమును ప్రయోగించి తన లక్ష్యమును సాధింప యత్నించును.
చదరంగము - విలువ : చదరంగము కాలము గడుపుకొనుటకును, వినోదము కొరకును నాడబడు ఆట యని పలువురు తలంచుచుందురు. ఇది క్రీడమాత్రమే కాదు. మేధాశక్తి సముపార్జనకు తోడ్పడు కృషి రూపమగు శాస్త్రము ; ముక్తిమార్గ సాధన కనుకూలించు క్రీడా రూపమగు కళ. శరీరావయవములకు బలము నిచ్చుటకు వ్యాయామక్రీడ లెంత యుపయోగమో, అట్లే మానసిక శక్తులకు చురుకుదనము కలిగించి మనోబలమును పెంపొందించుటకు చదరంగ మంత యుపయోగము. ఈ ఆట వలన బాలురకు పిరికితనము నశించి ఉత్సాహము కలుగును. మేధాశక్తి పెంపొందును. దూరదృష్టికూడ అలవడును. ఆట ముగింపు తరువాత చేయబడు సింహావలోకనము వలన తన తప్పు తాను తెలిసికొని అంగీకరించుట, తన ప్రత్యర్థియొక్క గొప్పతనమును గ్రహించి గౌరవించుట, మొదలగు ఉదార గుణములు అలవడును. మేధాశక్తిని పరీక్షించు క్రీడ గనుకనే, పండితమాన్యులచే జరుపబడు అవధానములయందు చదరంగమునకు ప్రాధాన్యము గలదు.
వాస్తవిక జీవితములో సఫలీకృతు డగుటకు మానవున కవసరమగు అర్హత లన్నియు, చదరంగ మాడుట వలన క్రమముగ పెంపొందును. చదరంగమున దూరదృష్టి కలిగి, రాగల శత్రుబలగపు దాడిని గమనించుచుతగు శ్రద్ధతో తన రాజును కాపాడుకొనవలెను. పరిస్థితులను పూర్తిగా పరిశీలించి అవగాహన మొనరించుకొనవలెను. పరిశీలనవలన కలుగు యూహలను బాగుగాయోజించి స్థిరత్వము కలిగి అనుసరింపబోవు విధానమును నిర్ణ యించుకొనవలెను. అట్టి నిర్ణయముల నెట్టిపొరబాటులను నాచరింపక ఏకాగ్రత కలిగి అమలుపరచుకొనవలెను. ఈ క్రమమునందేది లోపించినను, విజయము లభింపదు. అందుచేతనే వాస్తవిక జీవితమునకును చదరంగమునకును సన్నిహిత సంబంధము కలదని దృఢపడుచున్నది. జీవితమున మానవునకు తటస్థించబోవు ఆపదలను, కష్టములను దూరదృష్టి కలిగి తప్పించుకొనుటయు, విధివశమున కలిగినక్లిష్ట పరిస్థితుల నెదుర్కొనుచు వానిని పరిస్కరించుకొనుటకు చేయబడు తీవ్ర మానసిక ప్రయత్నములును, చదరంగపు ఆటయం దనుసరించు విధానములవంటివే కదా ! అందుచే చదరంగము జీవితపు పోరాటమున విజయసాధనకు మానవున కనుకూలించు శక్తులను సృష్టించి, అలవడునట్లుచేయు క్రమబద్ధమగు శాస్త్రమని చెప్పవచ్చును.
చదరంగమునందు ప్రావీణ్యమును సాధించినవాడు తన యాటయందే లగ్నమై పరిసర వాతావరణమునకు లోబడక ఏకాగ్రత కలిగిన స్థిరత్వమును కలిగి తన లక్ష్యమును సాధించుటకు తీవ్రకృషి చేయును. రెండు విరుద్ధ భావములు గల ప్రకృతులు తమ మేధాసంపత్తిని ప్రయోగించుచు నొకదానిపైనొకటి విజయమును సాధించుటకు చేయబడు విధివిరామము లేని పోరాటమే చదరంగము.
ఆనంద మనుభవించుటయే కదా జీవితపరమావధి! అట్టి ఆనంద మనుభవించుటకు కలుగు అవరోధ పరంపరను తన లక్ష్యసాధన సహాయసంసత్తులచే నశింపుచేయుట కొనరించు నిరంతర జీవితపు పోరాటమే నల్ల, తెల్ల బలగములు గల చదరంగ క్రీడ యందలి పోరాటము. అందుచే చదరంగము ముక్తిమార్గమును సాధించుటకనుకూలించు సాధనయనెడి క్రీడారూపమగు కళ యని గ్రహింప నగును.
ఆట - వివరము : ఈ ఆట 1 మస్తు, 2 నిర్మస్తు, 3 అంతర్జాతీయము అను మూడు విధములుగ ప్రచారమున గలదు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలయందు మస్తు విధానమును, విశాఖ, గంజాము జిల్లాల యందు నిర్మస్తు విధానమును, మిగిలిన ప్రపంచమందంతటను అంతర్జాతీయ విధానమును ప్రచారమున గలదు. ప్రస్తుతము మస్తు, నిర్మస్తు విధానముల నాడెడువారుకూడ, అంతర్జాతీయ మవలంబించుకొని, మిగుల కృషిచేయుచు, ఇతరరాష్ట్రము లందు జరుగు పోటీల యందును, అఖిలభారత పోటీల యందును పాల్గొనుచు, తమ ప్రతిభను వెల్లడించుకొను చున్నారు.
బల్ల - బలగము - నడకలు :
బల్ల : వరుసకు ఎనిమిది చదరములవంతున ఎనిమిది శ్రేణులుగ, మొత్తము అరువదినాలుగు చదరపు గళ్ళు కలిగియుండును. గడి విడిచి గడికి ఒక రంగు చొప్పున మొత్తము గళ్ళకు రెండు రంగులు వేయబడియుండును.
బలగము : రెండు రంగులుగ నుండును. ఒక ఆటగాడు ఒకరంగు బలగమును, రెండవ ఆటగాడు రెండవ రంగు బలగమును గ్రహించి ఆటను ప్రారంభింతురు. ఒక్కొక్క రంగునందు రాజు, మంత్రి గాక రెండు ఏనుగులు, రెండు గుఱ్ఱములు, రెండుశకటములు, ఎనిమిది బంట్లు నుండును. ఏనుగ, గుఱ్ఱము, శకటములను జంతువులనియు, మిగిలిన వాటిని వాటిపేర్లతోను, మొత్తము ఆటవస్తువులను బలగమనియు వ్యవహరింతురు.
నడకలు : రాజు - తానున్న గడినుండి తిన్నగా గాని మూలగా గాని వెనుకముందులకు ఒక గడి మాత్రమే నడచును. ఇది శత్రురాజు గడి ప్రక్కనున్న గడిని ఆక్రమింపదు. రక్షణ గల శత్రు బలగమును చంపజాలదు.
మంత్రి : తిన్నగా గాని ములగా గాని వెనుక ముందులకు అడ్డులేనపుడు ఎంతదూరమైనను నడచును. ఇది బలగమంతటిలో మిక్కిలి శక్తిగలది. ఏనుగువలెను, శకటమువలెను గూడ నడచును.
శకటము : మూలగా మాత్రమే, వెనుక ముందులకు అడ్డులేనిచో ఎంతదూరమైనను నడచును. నల్లగడి శకటము నల్లగళ్ళలోను, తెల్లగడిశకటము తెల్లగళ్ళలోనుమాత్రమే నడుచును.
ఏనుగ : తిన్నగానుండు గళ్ళలో నిలువుగా గాని, అడ్డముగా గాని నలుదిక్కులకు అడ్డులేనిచో ఎంత దూరమైనను నడచును. గుఱ్ఱము : తానున్న గడినుండి తిన్నగా నాలుగు దిక్కులకు నిలువుగా గాని, అడ్డముగా గాని మూడవగడికి పోయి ఆ గడికి రెండువైపులగల గళ్ళలో ఏగడియందైనను నిలుచును. ఇది తన దారియం దెట్టి బలగమున్నను, వానిని దాటి తన గడిని ఆక్రమించు శక్తిగలది కనుక,
చిత్రము - 178
పటము - 1
అట్టడుగు వరుసలో ఎడమనుండి కుడికి ఏనుగు, గుఱ్ఱము, శకటము, మంత్రి, రాజు, శకటము, గుఱ్ఱము, ఏనుగు.
పైవరుసలో : బంట్లు
గుఱ్ఱపునడకను 'గుఱ్ఱపుదాటు' అనికూడ వ్యవహరింతురు. తనదారియందు అడ్డమున్న బలమునుగాక తానాక్రమింప బోవు గడియందు శత్రుబలమున్నచో దానిని చంపును. తన బలమే యున్నచో ఆ గడిని ఆక్రమింపజాలదు కాని, రక్షణ నిచ్చును. రాజు మంత్రి, ఏనుగులు, శకటములు తమ నడకయందు తమ బలగమే అడ్డున్నచో ఆగిపోవును.
బంటు : పుట్టుక స్థానమందున్నపుడు తిన్నగా తనముందున్న ఒక గడిగాని రెండుగళ్ళుగాని నడుచును. తరువాత మాత్రము ముందునకు ఒక గడివంతున మాత్రమే నడచును. ముందుగడికి నడచిన బంటు వెనుకకు రాజాలదు. తన గడికి ఎదుటనుండు రెండు మూలగళ్ళలోని శత్రు బలగములో దేనినైనను చంపును. తన బలగమును రక్షించును. నడకయందు ఏనుగువలెను, చంపునపుడు శకటము వలెను చలనముగలది. బంటు క్రమముగా తన నడక యందు ఏ శ్రేణియందైనను శత్రుస్థావరమున ఎనిమిదవ గడికి చేరిన, మంత్రిగా నైనను, లేక అటగాని కిష్టమగు మరియొక యే జంతువుగనైనను మారును. బంటు నడకలో "ఎన్ఫా సెంటు" అను మరియొక విధానము గలదు. బంటు పుట్టుకగడినుండి రెండుగళ్ళు నడచునపుడు ఆ మొదటి గడియందు శత్రు బంటు వీక్షణము ఉన్నచో, ఆ బంటుచే, పుట్టుకగడి నుండి నడపబడు బంటు చంపబడును. అట్లు నడకను అడ్డగించి బంటు బంటును చంపుటయే “ఎన్ఫాసెంటు" అనబడును.
కోట కట్టుట : ఇది రెండు రకములు. 1. రాజువైపు కోట. 2. మంత్రివైపు కోట. కోట కట్టుటకు పూర్వము రాజు పుట్టుకగడిలోనే యుండవలెను. ఏనుగుగూడ పుట్టుక గడిలో నుండవలెను. ఆట ప్రారంభమునుండియు, రాజు,
చిత్రము - 179
పటము - 2.
రాజు - - కోట కట్టుట
రాజు, ఏనుగుల మధ్యగల గళ్ళు ఖాళీగా నుండవలెను. శత్రు వీక్షణ ముండరాదు. 1. ముందు రాజు కదలవలెను. 2. తరువాత ఏనుగు కదలవలెను.
చిత్రము - 180
పటము - 3
3 ఎత్తుల సమస్య
నలుపు : 9 జంతువులు తెలుపు : 10 జంతువులు
తెల్లబలగమువారు ఆటను ప్రారంభించి నల్లబలగమువారి ఆటను 3 ఎత్తులలో కట్టించవలెను.
చిత్రము - 181
పటము - 4
సమస్యలు
నలుపు : 5 జంతువులు తెలుపు : 5 జంతువులు
తెల్లబలగమువారు ఆటను ప్రారంభించి నల్లబలగమువారి ఆటను రెండు ఎత్తులలో కట్టించవలెను.
సమాధానము : 1 ఎత్తు - శ - రా 6.
నలుపు బలగమువారు ఏ ఎత్తు జరిపినను ఆటకట్టును.
చిత్రము - 182
పటము - 5
2 ఎత్తుల సమస్య
నలుపు : 8 జంతువులు తెలుపు : 7 జంతువులు
తెల్లబలగమువారు ఆటను ప్రారంభించి నల్లబలగమువారి ఆటను 2 ఎత్తులలో కట్టించవలెను.
చిత్రము - 183
పటము - 6
సమస్యలు
నలుపు : 7 జంతువులు తెలుపు : 6 జంతువులు
తెల్లబలగమువారు ఆటను ప్రారంభించి నల్లబలగమువారి ఆటను రెండు ఎత్తులలో కట్టించవలెను.
సమాధానము - 1 ఎత్తు - గు - రా - 6.
నలుపుబలగమువారు ఏజంతువును కదలించినను, ఆటకట్టును.
మంత్రివైపు కోట యనియు వ్యవహరింతురు.
బలగము ఆమర్చుట : ఆటగాండ్రిద్దరును చివర తెల్లగడి గల భాగము తమ కుడిచేతివైపుండునట్లు బల్లనుమధ్య నుంచుకొనవలెను. తమ ముందుగల మొదటి వరుసలో బల్లకు రెండు చివరలయందును రెండు ఏనుగులను, వాని ప్రక్క గుఱ్ఱములను, గుఱ్ఱముల ప్రక్క శకటములను, మధ్యగల రెండుగళ్ళయందును రాజును, మంత్రిని అమర్చవలెను. తెల్లబలగము మంత్రిని తెల్లరంగు గడియందును, నల్లబలగము మంత్రిని నల్లగడియందును అమర్చవలెను. అనగా నల్ల బలగము రాజును తెల్లగడియందును. తెల్లబలగము రాజును నల్లగడియందును ఉంచవలెను. ఎనిమిది బంట్లను రెండవ వరుసలో జంతువులముందుగల గళ్ళలో అమర్చవలెను.
“రాజు” లేక “షా” చెప్పుట : ఒక ఆటగాడు తన బంటు, లేక జంతువు, లేక మంత్రియొక్క వీక్షణమును శత్రురాజుపై ప్రసరించునట్లు నడుపుట రాజునకు ' రాజు’ లేక 'షా' చెప్పుట అనబడును. అనగా “రాజును నడుపుము; లేనియెడల నా బలగము నీ రాజును చంపును" అని తెలుపుట. అట్లు పగవేయునపుడు 'రాజు' లేక 'షా' అని పలుకవలెను. అట్లు శత్రుబలగముచే పగపట్టబడి 'షా' లేక 'రాజు' అని చెప్పబడిన రాజు ఆ పగపట్టిన బలగమును చంపుటగాని, ఆ పగకు అడ్డముగ తన బలగమును నడుపుట గాని లేక ఆ పగనుండి రాజు తప్పుకొనుటగాని జరుగవలెను. అట్లు ఏది జరుగకపోయినను 'ఆటకట్టు' అనబడును. అనగా రాజు శత్రుబలగమునకు చిక్కినట్లుగ పరిగణించి ఆట ఓడినట్లు నిర్ణయింపబడును.
తట్టు : రాజు, శత్రుబలగము పగయందుండక తానుగాని, తన బలగముగాని నడచుటకు వీలులేని పరిస్థితులు కలిగినచో, ఆ ఆట 'తట్టు' అనబడును. అనగా సమానముగ పరిగణింపబడును.
బలగమునందుగల ఆటవస్తువును తన స్థానమునుండి తా నాక్రమింపగల మరియొక స్థానమునకు నడపుట ఒక ఎత్తు అనబడును.
సమస్యలు : చదరంగమునందు ఆటల విధానమేగాక సమస్యల విధానముగూడ గలదు. సమస్యయనగా రెండు బలగములనుండి కొన్ని ఆటవస్తువులనే గ్రహించి ఒక వ్యూహమును నిర్మించి, ఒక బలగము రెండవ బలగమును కొన్నినియమిత ఎత్తులలో కట్టించవలె నని నిర్ణయించెదరు. ఈ విధానమున రెండవ ఆటగాని ప్రసక్తి లేదు. ఒక ఆటగాడే రెండుబలగముల ఎత్తులను ఆలోచించును. ఆటకట్టు విధానమును తెలిసికొనుటకు ప్రయత్నించి ఆనందించుచుండును.
ది. సూ.