సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చతురంగబలములు II
చతురంగబలములు 2 :
ప్రాచీనాయుధాధులు : శత్రు శిక్షణముకొరకు యుద్ధములు జరుగును. ఇట్టి యుద్ధములు ప్రాచీన కాలము నుండియు జరుగుచున్నవి. యుద్ధములయందు ప్రాచీన కాలములో భారతభూమిలో చతురంగ బలములను ఉపయోగించుచుండిరి. చతురంగ బలములనగా, రథ, గజ, తురగ, పదాతులు. రథములు, గజములు, తురగములు, కాలిబంట్లు గుంపుగా ఊరకమూగిన ఏమైన లాభముకలదా? లేదు. కావున, రథములపై కూర్చుండువారు, గజములపై కూర్చుండువారు, గుఱ్ఱములపై కూర్చుండువారు, నేలపై నిలుచుండువారు ఆయుధధారులై సమర సన్నద్దు లగుచుండిరి. అయితే, వారెట్టి ఆయుధములను ధరించి శత్రు సంహారము గావించు చుండిరి ? ఎట్టి పరికరములను గొంపోవుచుండిరి? ప్రాచీనార్యుల యుద్ధతంత్ర విధానమెట్టిది ?
యుద్ధములలో వాడెడు ఆయుధములను గూర్చి వేదములలో, బ్రాహ్మణములలో సూచనలు కలవు. రామాయణ, మహాభారతములు యుద్ధకథనములేకదా ! ఇవిగాక, ధనుర్వేదము, శుక్ర నీతిసారము, కౌటిల్యుని అర్థశాస్త్రము, సమరాంగణ సూత్రధార అను ప్రత్యేక శాస్త్రగ్రంథములు గలవు. ఈ వాఙ్మయము ననుసరించి మనకు ఆ విషయములను గూర్చి తెలిసికొనుటకు అవకాశము కలుగుచున్నది.
యుద్ధాయుధాలు 1, ముక్త, 2. అముక్త, 8. ముక్తా ముక్త, 4. యంత్రముక్త అని నాలుగు తరగతులుగా నున్నవి. ముక్త అనగా విడువబడినది; అముక్త అనగా విడువబడనిది; ముక్తాముక్త అనగా రెండు విధముల నుపయోగించునది; యంత్రముక్త అనగా యంత్రముల ద్వారా నుపయోగించునది.
ముక్తాయుధములు : ముక్తాయుధములలో ధనుర్బాణములు చాల ముఖ్యమయినవి. ఆదినుండి నేటివరకును ధనుర్బాణములు వాడుకలో నుండుచు నున్నవి. ధనుస్సును ఉక్కుతోనో, కొమ్ముతోనో, కఱ్ఱతోనో చేయు చుండిరి. దున్నపోతు, ఖడ్గమృగము, శరభము, రోహిషము (కొండగొఱ్ఱె)–ఈ జంతువుల కొమ్ములనే వాడు చుండిరి. చందనీ, సాల, బెత్తము, కుకుభ, ధబల- వీటికఱ్ఱలను వాడుచుండిరి. వీటన్నిటిలోనికి వెదురుబద్ద అత్యంత శ్రేష్ఠమైనదిగా పరిగణించి యుండిరి. ఈ ధనుస్సుల నిర్మాణములో ఎంత ఎత్తు ఉండవలెను? ఎచ్చట లావుగా నుండవలెను ? ఎచ్చట సన్నముగా నుండవలయును ? అనుటనుగూర్చి సూక్ష్మాతిసూక్ష్మము లయిన వివరములు కలవు. ఇక బాణములు ఉత్తమ, మధ్యమ, అధమ - అని మూడు విధములుగా నుండెను. బాణముల పొడవు మూడు మూర లుండెడిది. ఇనుము, వెదురులతో ములుకులు తయారు చేయుచుండిరి. చివర ఈక లుండును. రానురాను బాణముల నిర్మాణములో ఎన్నో మార్పులు వచ్చినవి. ధనుర్బాణములను ఉపయోగించుటలో ప్రత్యేక విధులు గలవు. ధనువులను పదునెనిమిది విధములుగా నిర్మించుచుండిరి. వీటి అల్లెత్రాడులు వాటికి తగినట్లుగా బరువుగానో, తేలికగనో ఉండును. ధనుర్బాణములను ఉపయోగించునప్పుడు సమపాద, వైశాఖ, మండల, ఆలీఢ, ప్రత్యాలీఢ అను భంగిమములు కలవు. సమపాద అనగా రెండు కాళ్ళను దగ్గరగా బెట్టి నిలుచుండుట, వైశాఖ అనగా రెండు పాదతలముల మధ్య కొంచెము జాగ విడిచి ముంగాళ్ళపై నిలుచుండుట. మండల రెండు కాళ్ళ మధ్య పైదానికంటె కొంచె మెక్కువ విడిచి కొంత వంగి నిలుచుండుట, ఆలీఢ అనగా కుడికాలిని నిలిపియుంచి ఎడమ కాలిని వెనుకకు నెట్టి నిలుచుండుట, ప్రత్యాలీఢ అనగా ఎడమ కాలిని నిలిపియుంచి కుడి కాలును వెనుకకు నెట్టి నిలుచుండుట. ముక్తాయుధములలో ఆగ్నేయాయుధములును కలవు. ఇవి ఒక విధమైన బాంబులు. ఇవి మూడు విధములుగా నుండును. అగ్నిధారణ, క్షేప్యో అగ్నియోగ, విశ్వాస ఘాటి అని వాటి పేర్లు. అగ్నిధారణను గాడిద, ఒంటె, మేక, గొఱ్ఱె అనువానిలో నేదేని ఒకదాని లద్దిలో సరళ, దేవదారు, పూతితృణములు చక్కలపొడి, గుగ్గులు, శ్రీవేస్తక (టర్పెంటైన్), లక్క కలిపి చిన్న ఉండలుగా తయారు చేసెడువారు. క్షేప్యో అగ్ని యోగను గుఱ్ఱము, గాడిద, ఒంటె మొదలగు పశువుల పెండలో ప్రియాళు చూర్ణము, అవలగుజము, దీపపు మసి, మైనము కలిపి చేసెడువారు. విశ్వాసఘాటిని అగ్నివలె ఎర్రగా నుండు లోహముల భస్మముతోగాని లేదా కుంభి, సీసము, తుత్తునాగము - వీటి భస్మమును పారిభద్ర, పలాశ, వెండ్రుకల భస్మమును బొగ్గుల చూర్ణముతో గలిపి, లక్క నూనె, టర్పంటైన్ చేర్చి తయారు చేసేవారు. అగ్నిధారణ, క్షేప్యో అగ్నియోగ, విశ్వాసఘాటి అనునవి అత్యధికముగా మండెడు స్వభావము కలవి. వీటి మంటను చల్లార్చుట మిగుల కష్టతరము. ఈ శ్రేణిలో చేరినదే అగ్ని బాణము. అగ్నిబాణ మనగా బాణముయొక్క చివరను నిప్పులో ఎఱ్ఱగా కాల్చినట్టిది. చాల అపాయకరము. కురుక్షేత్ర సంగ్రామరంగములో వెతకినప్పుడు దొరకిన వస్తువులలో బొగ్గులు కూడ ఉండెను. ఈ బొగ్గులతో బాణములు కాల్చుచుండిరనుట స్పష్టము. ధూప అను ఒక ఆయుధము కలదు. ధూపశబ్దమే “తోపు” అను తురకశబ్దముగా మారినదని పండితుల యభిప్రాయము. దీనికి నాళదీపిక అనియు మరియొక పేరుగలదు. ధూప అనే ఈ ఫిరంగిలో సీసపు, ఇనుపగుండ్లు పెట్టుచుండిరి. ఇనుపగుండును అయోగుడ మన్నారు. నాళిక లనునవి తుపాకులు, చిన్నవాటిని అనగా నాళికలను భుజములపై తీసికొనిపోవుచుండిరి. పెద్దవాటిని అనగా నాళదీపికలను బండ్లపై గొంపోవుచుండిరి. తుపాకిమందును అగ్ని చూర్ణ మనుచుండిరి. సురేకారము, గంధకము, జిల్లేడుబొగ్గులు, సృహి (sruhi) ఇతర కట్టెలతో కాల్చి పుటము పెట్టి అగ్ని చూర్ణము తయారుచేయు చుండిరి. భిందిపాల, శ క్తి, దృఘణ, తోమర, లగుడ, పాళ, చక్ర, దంతకంట, మునుండి అనునవి ముక్తాయుధములలో సామాన్య మయినవి: తుపాకిమందును తయారుచేయుట భారతీయులనుండియే అరబ్బులు నేర్చుకొన్నారని సర్. యం. విలియం పండితుడు వ్రాసి యున్నాడు.
అముక్తాయుధాలు : అముక్తాయుధము లనగా విడువ బడక అధీనములో నుండే ఆయుధములు. ఇవి యిరువది విధములుగా నున్నవి. వజ్రము, పరశువు, గోశీర్షము, అసిధేను, లవిత్రము, అస్త్రము, కుంతము, స్తూణము, ప్రాసము, పినాకము, గద, ముద్గర, సీర, ముసలము, పట్టిస, మౌష్టిక, పరిఘ, మయూఖి, శతఘ్ని. అసి అను పేర్లుగలవి అముక్తాయుధములు. వజ్రమునకు ఆరు అంచు లుండేవి. పరశువు గండ్రగొడ్డలి. గోశీర్షము అనునది ఎద్దు కొమ్మువలె నుండు ఒక విధమైన బల్లెము. అసిధేను చురకత్తి, దీనికి మూడంచులుండును. లవిత్రము కొడవలి. అస్త్రము అనగా వంకరగానుండు పలుచని కఱ్ఱతో చేయబడిన బాణము. విసరిలాగుట కుపయోగించును. కుంతము, ఈటె, స్తూణము మనుష్యునినిడివి యెత్తుండును. ఇది స్తంభాకృతిని అగ్రమున పెక్కు బొడుపులు కలిగి యుండును. ప్రాస వెదురుతో చేయబడిన యొక ఆయుధము. నాల్గుహస్తముల పొడవు. అగ్రమున పదునుగలిగి యుండును. పినాకము త్రిశూలము. ఇది మూడు మొనలు కలది. కొట్టుటకు, పొడుచుటకు, చీల్చుటకు, ముక్కలుగ కోయుటకు, విరుచుటకు పనికివచ్చుచుండును. గద పెద్ద గుదియ. ముద్గరము సుత్తెవలె నుండును. దీనికి గుండ్రని పిడియుండును. సీరము నాగలి, ముసలము రోకలి; పట్టిస ఒకవిధమైన బల్లెము, మౌష్టికము పిడికిటిలో నుండు కత్తి. పరిఘ కఱ్ఱదూలము. ద్వారములను గుద్దుటకు పనికి వచ్చును. బరువుగా నుండును. మయూఖి గంటలు కల బాణాకఱ్ఱ; దీనికొక కవచముకూడ ఉండును. శతఘ్ని ఒక గదవలెనుండును. దీనిచివర పెద్ద మేకులుండును. శతఘ్ని అనగా ఒక్కసారి నూరుగురిని చంపునది. శతఘ్ని పదము ఫిరంగికిని అన్వయించును. దీనిని కోటగోడలపై నుంచు చుండిరట ! అసి అనగా ఖడ్గము, కత్తి. అముక్తాయుధములలో ఖడ్గము శ్రేష్ఠమైనది. ఈ కత్తులలో ఎన్నో రకములయినవి కలవు. ఖట్టి, ఖట్టరదేశాల కత్తులు కాంతికిని, కైశికదేశపు కత్తులు కూల్చుటకును, శూర్పారక దేశపుకత్తులు దృఢత్వమునకును, అంగ, వంగ దేశముల యందు చేసిన కత్తులు వాడికిని ప్రసిద్ధిచెంది యుండెను. ముక్తాముక్తాయుధాలు : ఇవి మర్మశక్తిగల ఆయుధాలు అయి యున్నవి. ఇవి సోపసంహార, ఉపసంహార అని రెండు విధములుగా నుండును. "సోపసంహార" అనగా బయటకు వేయునవి. "ఉపసంహార" అనగా వెనుకకు లాగునవి
సోపసంహారములు 43 విధములుగా నున్నవి.
1. దండచక్ర
2. ధర్మచక్ర
3. కాలచక్ర
4. ఐంద్రచక్ర
5. శూలవట
6. బ్రహ్మశీర్ష
7. మోదకి
8. శిఖరి
9 ధర్మపాశ
10. వరుణపాశ
11. పినాకాస్త
12. వాయవ్య
13. శుష్క
14. ఆర్ద్ర
15. శిఖరాస్త్ర
16. క్రౌంచాస్త్ర
17. హయశీర్ష
18. విద్యాస్త్ర
19. అవిద్యాస్త్ర
20. గంధర్వాస్త్ర
21. నందనాస్త్ర
22. వర్షణం
23. శోషణం
24. ప్రస్వాపన
25. ప్రశమన
26. సంతాపన
27. విలాపన
28. మదన
29. మానవాస్త్ర
30. నామన
31. తామస
32. సంవర్త
33. మౌసల
34. సత్య
35. సౌర
36. మాయాస్త్ర
37. త్వష్ట్ర
38. సోమాస్త్ర
39. సంహార
40. మానస
41. నాగాస్త్ర
42. గరుడాస్త్ర
43. శైవేషిక
ఇట్లు సోపసంహారములు నలుబదిమూడు కలవు. ఇందలి శిఖరాస్త్రము నిప్పులు కురియుచుండును. నామన అనునది విమానబలమునం దుపయోగించునది. శుష్క - తడియారునట్లు చేయునది. ఆర్ద్ర - తడిచేయునట్టిది. వ్యాసవిస్తర భీతిచే ఈ పట్టికలలోని అన్ని ఆయుధాలకు వివరములు వ్రాయ సంక్షేపించినాము.
ఉపసంహారములు 53 విధములుగా నున్నవి.
1. సత్యవాన్
2. సత్యకీర్తి
3. రభస
4. ద్రష్ట
5. ప్రతిహారతర
6. అవాఙ్ముఖ
7. పరాఙ్ముఖ
8. ధృతనాభ
9. అలక్ష్య
10. లక్ష్య
11. ఆవిల
12. సునాభక
13. దశాక్ష
14. శతవక్త్ర
15. దశశీర్ష
16. శాతోదర
17. ధర్మనాభ
18. మహానాభ
19. దుంధునాభ
20. నాభక
21. జ్యోతిష
22. విమలకుల
23. నైరాస్య
24. కృశాన
25. యోగంధర
26. సనిద్ర
27. దైత్య
28. ప్రమథన
29. సరసీరమాలి
30. ధృతిర్మాలి
31. వృత్తిమాన్
32. రుచిర
33. పిత్ర్య
34. సౌమానస
35. విధూత
36. మకర
37. కరవీర
38. ధనరతి
39. ధాన్య
40. కామరూపక
41. జృంభక
42. ఆవరణ
43. మోహ
44. కామరుచి
45. వారుణ
46. సర్వదమన
47. సంధాన
48. సర్వనాభక
49. కంకాళాస్త్ర
50. మౌసలాస్త్ర
51. కాపాలాస్త్ర
52. కంకణ
53. పైశాచాస్త్ర
ఇట్లు ముక్తాముక్తశాఖకు చెందిన ఉపసంహార ఆయుధములు ఏబదిమూడు గలవు. ఇందలి ఆవిల అనునది ఆడు గొఱ్ఱెరూపములో నుండును. సరసీరమాలి పూలదండవలె నుండును. సౌమనసపువ్వులు చెక్కినట్టిది. కరవీరము ఒక మైన పట్టాకత్తి; జృంభకము మూతి వెడల్పుగల బాణము. సర్వనాభకము సర్పాకారమున నుండునది. వ్యాస విస్తర భీతిచే అన్నిటికి వివరములు తెలుపలేదు.
ఇవిగాక తేజప్రభ, శిశిర, కింకిణి, దారుణ, సుబర్బాహు, మహాబాహు, నిష్కులి, విరుచి అను ఆయుధములను విశ్వామిత్రుడు పేర్కొన్నాడు. హస్తిక, శూల, వరాహ కర్ణ, గోప్పణ పాషాణ, ముష్టి పాషాణ, రోచని అను వాటిని కౌటిల్యుడు పేర్కొన్నాడు. ఇంద్రుని వజ్రా యుధము, యముని కాలపాశము, బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, పాశుపతాస్త్రము అనునవి మనకు పరిచయమైన పేర్లే. వీటిని మంత్రించి వదలుచుండిరి.
యంత్ర ముక్తాయుధములు : ఆయుధములలో నాల్గవ తరగతికి చెందిన యంత్ర ముక్తాయుధములు పందొమ్మిది కలవు. కాని యిది పూర్తిసంఖ్యకాదు. సర్వతోభద్ర, జమదగ్న్య. బహుముఖ, విశ్వాసఘాటి, పర్జన్యక, బాహు, అర్ధబాహు, పాంచాలిక, దేవదండ, సుకారిక, యష్టి, హస్తివారక, తాళవృంత, స్పృక్తల, కుద్దాల, స్పాఠిమ, ఔదఘాటిమ, మహేంద్ర, బ్రహ్మదత్త - అని యంత్ర ముక్తాయుధములలో కొన్నింటిపేర్లు. సర్వతోభద్రము ఒక చిన్నబండి; అన్నివైపులకు రాళ్ళు విసరుచుండును. జమదగ్న్యము బాణములను విజేపింపజేసే గొప్ప యంత్రము. బాహుముఖము ధనుర్ధరులకడ నుండునది. విశ్వాసఘాటి శత్రువు ప్రవేశించునపుడు వానిమీద పడునట్లుగా అమర్చిన పెద్దదూలము, పర్జన్యక అగ్నిమాపక నీటి యంత్రము; ఔదఘాటిమ కోటబురుజులను కూలద్రోయు యంత్రము.
వ్యూహములు : యుద్ధరంగములో సేనలను నిలుపుట యందును విధానము లుండెను. సేనలను నిలుపు విధానమునకు వ్యూహములని పేరు. ఈ వ్యూహములు అయిదు విధములుగా నున్నట్లు కనబడుచున్నది. దండ, మండల, భోగ, అసంహత, విషమ అని వ్యూహముల పేర్లు. ఇవి గాక, సమ, విషమ, హస్తి, రధి, అశ్వ, పత్తి వ్యూహములను కౌటిల్యుడు చెప్పియున్నాడు. భూమి స్వభావమును బట్టి యీ వ్యూహ నిర్మాణము లుండును. ఈ వ్యూహముల ప్రకారము చతురంగ బలములను నిలుపుచుండిరి.
కవచములు : యోధులకు దెబ్బలు తగిలి గాయములు కాకుండ కవచము లుండెను. ఈ కవచములు నాలుగు విధములు : 1. చేతులతోసహా ఆపాద మస్తకము కప్పి యుంచునవి. 2. శిరస్సు, వక్షస్థలమును కప్పునవి. 3. హస్తముల నావరించునవి. 4. నడుమునకు కొల్లాయ గుడ్డవలె చుట్టుకొని యుండునవి. శిరస్త్రాణము, కంఠ స్త్రాణము, కింపన, కంచుకము, వారవాణ, పట్ట, నాగోదార్క, పేతి, చర్మ, తాళమూల, భమనిక, కవాట, కిటిక, అప్రతిహత, వలాహకాంట అనునవి కవచముల పేర్లు. గజములకును, గుఱ్ఱములకును కవచములుండెను. కవచములు ఉక్కుతోను, చర్మముతోను, కఱ్ఱతోను, గడ్డితోను నిర్మించుచుండిరి.
వాద్యములు : యుద్ధమునకు సంబంధించిన వాద్యము లుండెను. దుందుభి, బకుర, భేరి, పణవ, క్రకచ, ఆనక, మహానక, కాహళ, పటాహ, పుష్కర, గోవిష్ణక, శంఖము - అనునవి రణవాద్యములు. వీటిధ్వనులు వేర్వేరుగా నుండును. వేర్వేరు అర్థముల నిచ్చును. గోవిష్ణికలు కొమ్ములతో చేయబడినట్టివి. శంఖములు చిన్నవి. పెద్దవి పెక్కు పరిమాణములలో నుండును. ధ్వనుల భేదముకూడ ఉండును. ప్రతి సేనానాయకునకు ఒక శంఖ ముండుచుండెను. ఆ శంఖధ్వనినిబట్టి నాయకుని గుర్తించుచుండిరి. శంఖముల పేర్లును వేర్వేరుగా నుండెను. శ్రీకృష్ణునిది పాంచజన్యము, అర్జునునిది దేవదత్తము, యుధిష్ఠిరునిది అనంతవిజయము, భీమునిది పౌండ్రకము, నకులునిది సుఘోషము, సహదేవునిది మణిపుష్పకము.
పతాకలు : యుద్ధ తంత్రములో పతాకలుకూడ ఒక అంగముగా నేర్పడి యుండెను. ఋగ్వేద సంహితలో అక్ర, కృతధ్వజ, కేతు, బృహత్కేతు, సహస్రకేతు, అని ధ్వజములపేర్లు కనబడుచున్నవి. అధర్వవేదములో సూర్య ధ్వజ ప్రశంసకలదు. ధ్వజములలో చిన్నవి. పెద్దవి ఉండెను. ప్రతి సేనానాయకునకు ప్రత్యేకమయిన ధ్వజ ముండెను. ఈ ధ్వజములనుబట్టి దళములను గుర్తించు చుండెడివారు. ధ్వజములమీద ఎక్కువగా జంతువుల చిహ్నము లుండును. శ్రీకృష్ణునకు గరుడధ్వజము, అర్జునునకు కపిధ్వజము, దుర్యోధనునకు నాగధ్వజము, శల్యునకు సీతధ్వజము, భీష్మునకు తాలధ్వజము, ద్రోణునకు కమండల ధ్వజము, ఘటోత్కచునకు చక్రధ్వజము, భీమసేనునకు సింహధ్వజము, యుధిష్ఠిరునకు చంద్రధ్వజము, నకులునకు శరభధ్వజము, సహదేవునకు హంస ధ్వజము, అభిమన్యునకు సారంగపక్షి ధ్వజము, రామాయణీయభరతునకు కోవిదార వృక్షధ్వజము, శివునకు వృషభ ధ్వజము, కామునకు మత్స్య (మకర)ధ్వజము – ఉం డెను. పల్లవులు వృషభధ్వజులు; చాళుక్యులు, విజయనగర రాజులు, కాకతీయులు వరాహధ్వజులు; ధ్వజములు రథములమీదను, ఏనుగులమీదను ఎగురుచుండును.
శిల్పకారులు : ఈ విధములయిన ఆయుధములను, కవచములను, ధ్వజములను మొదలగువాటిని నిర్మించెడు శిల్పులు ఉండిరి. ఈ శిల్పులు శ్రేణులుగా ఏర్పడి వస్తూత్పత్తి చేయుచుండిరి. ఒక శ్రేణివారగు “ఇషుకారులు" బాణముల శిరోభాగములను తయారుచేయగా, ఇంకొక శ్రేణివారు మిగతభాగము చేయుచుండిరి. రథకారుల జాతి ఒకటుండెను. వీరికి రథములను నిర్మించుటయే వృత్తిగా నుండెను. రథములను నడపువారిని సూతులనుచుండిరి. రోడ్లు వేయుట, వంతెనలు కట్టుట, తటాకములు త్రవ్వుట మొదలగుపనులు నెరవేర్చు మిలిటరీ ఇంజనీర్లును, స్యాపర్సు అండు మైనర్సు (Sappers and Miners) అను కార్మికులును ఉండిరి. వీరందరు మంచి నేర్పరులు. గజశిక్షకులు, తురగశిక్షకులు ఉండిరి. బండ్లను లాగుటకు ఎద్దులు, ఒంటెలు ఉండెను.
రస్తుసామగ్రి : యుద్ధశాఖలో యుద్ధమునకు కావలసిన రస్తుసామగ్రిని సప్ల యిచేయుటకు ఒక సంఘ ముండెను. వీరు ఉడుపులు, ఆయుధములు, తినుబండారములు మొదలగువానిని సమకూర్చి నిలువ యుంచుచుండిరి.
శిబిరము : యుద్ధమునకు పోయినప్పుడు శిబిర నిర్మాణము ముఖ్యమైన పనిగా నుండెను. శిబిరమును స్కంధా వార మనుచుండిరి. శిబిరప్రదేశమును నిర్ణయించుటకు ఇంజనీర్లు, సర్వేయర్లు, క్షేత్రజ్ఞానమువారు, అటవీశాస్త్ర జ్ఞానము కల వేటకాండ్రు, వడ్రంగులు, త్రవ్వువారు, కార్మికులు ముందువెళ్ళి స్థలనిర్దేశము చేయుచుండెడివారు. శిబిరస్థలము సమప్రదేశముగాను, గట్టినేలగాను ఉండవలెను. పెద్దచెట్లు ఉండకూడదు. పొద లుండవలెను. నీటి వసతి కలిగియుండవలెను. శిబిరము చతుష్కోణముగా ఎనిమిది దర్వాజాలు కలిగియుండవలెను. శిబిర రక్షణకు, శిబిరములోని ఆయుధములు, పదార్థములుండెడు ఉగ్రాణమునకు రక్షణగా వేర్వేరు భటులు నియమింపబడేవారు. భోజన పదార్థములు పుష్కలముగా నిలువచేసియుంచెడు వారు. శిబిరము ఒక చిన్న నగరముగా ఉండుచుండెడిది.
అన్ని తరగతులకు చెందిన పురుషులు, స్త్రీలు నివసించుట కనువగు పటకుటీరము లుండుచుండెను. శిబిరవాసుల వినోదమున కేర్పాటుండెను. పైనవివరించిన వివిధ వాద్యములలో కొన్ని వినోద కాలక్షేపమునకు పనికివచ్చునవిగా నుండెను. స్కంధావారములో శకటములు, సామానుబండ్లు, అన్ని విధములయిన వాహనములు, కోశము, ఆయుధములు, యంత్రములు, చికిత్సకులు ఉండిరి. రథములను బాగుచేయుటకు, కరములు, ధనువులు, ఈటెలకు కావలసిన కత్తులు, కఱ్ఱలు, అంబులపొదులు, వివిధములయిన త్రాళ్ళు, నూనె, ఆసవములు, ఇసుక, విషసర్పములతో నిండిన కుండలు, పేలుడు పదార్థములు, పిచికార్లు, నీరు, చిరుతపులుల చర్మము, మైనము, గుడ్డలు, నేయి, యుద్ధాయుధములు కురుక్షేత్ర సంగ్రామ సందర్భమున దుర్యోధనుని స్కంధావారమునం దుండెనట !
శిల్పదృష్టాంతములు : ఇంతవరకు వర్ణించిన ఆయుధములు, పరికరములు, పదార్థములు ఉండియుండె నని గ్రంథములే గాక శిల్పములు కూడ రుజువుచేయుచున్నవి. బార్హూత్, సాంచి, భువనేశ్వరము, అవంతి దేవాలయములు మొదలగువానిలోని శిల్ప విన్యాసములు ఆయుధాల రూపురేఖలను మనకు చూపించుచున్నవి. భార్హూత్ గుహాశిల్పమునందు నౌకలు, రథములు, గుఱ్ఱములు, ఎద్దులులాగుచున్న రథములు, ధనుర్బాణములు మొదలగువాని చిత్రములు గలవు. సాంచీలోని పదునొకండు స్తూపములలో నగరముట్టడి, భటులవేషము, కత్తులు, కేడెములు, గండ్రగొడ్డండ్లు, శూలములు, చిన్నయీటెలు, వజ్రము, బాకు, అంకుశము, గంటము, పతాకములు, పొడుగుపాటి చీపుర్లు, డోళ్ళు, గొడుగులు మొదలగునవి మనకు చిత్రరూపమున గనుపించును. ఇవి రెండు వేల సంవత్సరముల క్రిందటి శిల్ప చిత్రములు.
భువనేశ్వరములోని శిల్పము సుమారు పదునైదువందల సంవత్సరముల క్రిందటిది. భువనేశ్వరములో ఆశ్విక సైన్యము, పదాతి సైన్యము, ఏనుగులు, యోధులు, మొదలగు రూపములు కనబడును. అజంతా గుహలు పదునెనిమిది వందల సంవత్సరముల క్రిందట తొలచబడినవి. అజంతా శిల్పములో చమత్కారమయిన కేడెము, వంకరబాకు, అంబులపొది, పొడుగాటి బల్లెములు, గదలు, రథములు, గండ్రగొడ్డండ్లు, అన్ని తరహాల ఆయుధములు, భటులవేషములు కాననగును. పాల్నీ దేవాలయములో యుద్ధభటులు తుపాకులను తీసికొని పోవుచున్నట్లును, వారి నడుము పట్టాలకు మువ్వ లున్నట్లును, అందరి కాళ్ళకు పాదరక్షలున్నట్లును, తలలపై విచిత్రమైన టోపీ లున్నట్లును, శిల్పవిగ్రహములు కానవచ్చును. ఇది అత్యంత పురాతనకాల శిల్పము.
మొహెంజాదారోలో ఖననము చేయగా ధనుర్బాణములు, గండ్రగొడ్డళ్లు, బల్లెములు, కటారులు, గదలు, వడిసెలలు, ఉండేళ్లు మొదలగు వస్తువులే దొరకినవి. మొహెంజాదారో అయిదువేల సంవత్సరముల క్రిందట పాడుపడి భూగర్భముపాలైన గొప్ప పట్టణము. అచ్చట దొరకిన వస్తువులు అయిదువేల సంవత్సరముల క్రిందట నిర్మింపబడిన వనుట స్పష్టమగుచున్నది. ఇంక సంశయమునకు తావు లేదుకదా !
ముగింపు : యుద్ధములు సర్వనాశంకరములు. యుద్ధములు మానుటమానవజాతికి శ్రేయస్కరము. అయితే, భూతకాలములో యుద్ధములున్నట్లు ప్రాచీన వాఙ్మయము జాటుచున్నది. వర్తమాన కాలములో యుద్ధములు జరుగుచున్నవనియు, తత్ఫలితములను మన మనుభవించుచున్నామనియు మనకందరకు సువిదితమైన విషయమే. భవిష్యత్కాలములోను యుద్ధములుండగలవు. కావున రాజ్యములు యుద్ధమునకు సర్వసన్నద్ధముగా నుండవలసినదే. యుద్ధములు లేకుండ చేయదలచుట అలవిగాని పని. అదియొక స్వప్నభ్రాంతియే. దుష్టశక్తుల నరికట్టుటకు, స్వధర్మ రక్షణార్థము. దేశస్వాతంత్ర్య పరిరక్షణార్థము యుద్ధము చేయుటయు ఒక ధర్మమే. ఈధర్మ సూత్రము నెరంగియే ప్రాచీనార్యులు బుద్ధిసూక్ష్మతతో పరిపూర్ణయుద్ధ తంత్రకలాపము నిర్మించియుండిది.
ఆ. వీ.