Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చతురంగబలములు I

వికీసోర్స్ నుండి

చతురంగబలములు - 1:

భారతదేశమునందలి రాజనీతి చతురుపాయవిశిష్టమైనది. సామదాన భేద దండము లనునవి చతురుపాయములు. ఇచటి 'దండ' శబ్దమునకు 'సేన' అని అర్ధము. యుద్ధఫలకములగు రాజకార్యములలో 'సేన' అనునది చివరి ఉపాయము . అట్టి సేన - భారతీయ దండనీతి దృష్టితో రథ - గజ - తురగ - పదాతులను నాలుగు అంగములతో కూడియుండును. వాటికే సేనాంగములు,

చతురంగములు అని పేళ్లు గలవు. ప్రాచీన భారత సేనావ్యవస్థను గూర్చి ఆలోచించినపుడు, చతురంగ బలమును గూర్చి ఆలోచింపదగియున్నది.

మన దేశమున 'చదరంగము' అను నొక క్రీడా విశేషము మిక్కిలి ప్రచారములోనున్నది. 'చదరంగ'మను శబ్దము 'చతురంగ'మను దానికి వికృతి. అనగా చదరంగ మనునది 'చతురంగ' సంబంధమగు ఆట యని ఏర్పడ గలదు. అనగా యుద్ధసంబంధమయిన బుద్ధి కౌశలము వృద్ధియగుటకుగా నేర్పడిన క్రీడయని చెప్పవచ్చును. కాని 'చతురంగబల'మను సేనావ్యవస్థ శ్రీమద్రామాయణ మహా భారతములలో కానవచ్చుచున్నదే కాని, అంతకు పూర్వపు వేదాదులలో కానరాదు. మరియు చతురంగ క్రీడనుగూర్చి వేదాదులలో తరచుగా ప్రశంసింపబడి యున్నది. ఇట్లు వేదసిద్ధమైన చతురంగక్రీడా ప్రశంసలచే దానిననుసరించియే తర్వాత రామాయణాది కాలముల నాటికి చతురంగ సేనావ్యవస్థ చక్కగా నిర్మింపబడి యుండు నని చరిత్రకారులు భావించుచున్నారు. కొందరు చతురంగబలమును నిర్వహించు విధానమును ಬట్టియే చదరంగమను ఆట రూపొందించబడి యుండుననియు నూహించుచున్నారు. కాని ఈ రెండు ఊహలలోను రెండవదియే ఎక్కువ సహజముగా, సమంజసముగా కనబడుచున్నది. చదరంగము నందలి రాజు, మంత్రి, రథ గజ తురగ పదాతులు ఆ ఆటకు అంగములుగా నుండవలెనన్నచో, అట్టి వ్యవస్థ తత్పూర్వము లేకున్నయెడల, ఆ చతురంగక్రీడకే - ద్యూతక్రీడకే - అవకాశ మేర్పడి యుండెడిది కాదు. ఈ ఆట చతురంగబల విధానమునకు అనుకరణ రూప మగుటవలన, దానిచే అనుకార్యమగు చతురంగ సేనావ్యవస్థ తత్పూర్వమే అవతరించియుండును. ఇట్టి ఊహకు కారణము వేదములలోని ద్యూతప్రశంసయై యుండును.

చతురంగముల విషయమున మరొక్క వాదముగూడ కలదు. సేనయందలివి చతురంగములా, షడంగములా, యను మీమాంసయు శాస్త్రమున కానవచ్చుచున్నది.


'ఏతన్మౌలాది షడ్భేదం, చతురంగబలం విదుః
షడంగం మంత్రకోశాభ్యాం పదాత్యశ్వరథద్విపై "
                                        (కామ. 19-24)

అని పయి చతురంగములతో మంత్ర - కోశములు కూడి షడంగములుగా లెక్కింపబడినవి. అట్లే—


"రథా నాగా హయాశ్చైవ
        పాదాతాశ్చైవ పాండవ !
విష్టి ర్నావశ్చరాశ్చైవ
        దేశికా ఇతి చాష్టమః
అంగాన్యేతాని కౌరవ్య !
        ప్రకాశాని బలస్యతు"
                      (భార. శాంతి.)

అని సేన అష్టాంగముగా పేర్కొనబడినది. కాని మొదటి చతురంగములు సాక్షాత్తుగా సేనారూపములై యొప్పుటచే వాటినే తచ్చతురంగములుగా భావించుట న్యాయము. తర్వాతి చతురంగములు - విష్టి, నావలు, చారులు, దేశికులు అనునవి గాని, మంత్రకోశములు అను రెండంగములు గాని, తత్సహాయరూపములే అగుటచే వాటిని గూర్చిన విచారణ అప్రస్తుత మగుచున్నది.

రథబలము : చతురంగబలములలో అతిప్రాచీనకాలము నుండియు, భారతదేశమున రథబలము ఒక ముఖ్య మయిన సేనాంగముగా భావింపబడుచున్నది. ఆ కాలమున సాధారణముగా ఉత్తర భారతదేశము అరణ్యా క్రాంతముగా నుండుటవలననే కాబోలు, ఆరూఢులగు సైనికులు గల సేనతో యుద్ధములు జరుగుచు వచ్చెనని చరిత్రకారులు భావించినారు. అందుచేతనే వారికి రథములు, ఏనుగులు, గుఱ్ఱములు, ఆరోహించుటకు ఆవశ్యక సాధనములుగా నుండినవి. వాటిలో రథములకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. అవి గొప్ప శిల్పులచే నిర్మితము లయి, దృఢచక్రములు గల్గి మంచి గుఱ్ఱములచే పూన్పబడి సుధ్వజ–సుపతాకలతో నలరారి, సమస్త యుద్ధపరికరములతో గూడి, రథి-సారథులతో యుక్తములై ఉండెడివి. రథములనుగూర్చి సంహితలలోను, బ్రాహ్మణములలోను, పెక్కుచోట్ల ప్రశంసలు కానవచ్చుచున్నవి. మరియు, అందే, 'రథ - సారథి - రథ కార' శబ్దములును ఉండుటచే రథములను నిర్మించు శిల్పిజాతియు ఒకటి యున్నట్లు తెలియగలదు. మొట్టమొదట రథియే రథమును నడపుకొనుచు యోధుడుగా వ్యవహరించెడివాడట. ఐతరేయ బ్రాహ్మణ కాలమునుండియు, రథి యోథుడుగను, సారథి వేరుగను ఏర్పడి రథయుద్ధములు జరుగుచుండెడివట. మెగస్తనీసు వ్రాతలనుబట్టి క్రీ. పూ. 4 వ శతాబ్దినాటికి రథములలో ప్రధానరథితోపాటు మరియు ఒకరిద్దరు యోధులుండి అతనికి సహాయముగా యుద్ధము చేయు చుండెడివారని తెలియుచున్నది.

భారతదేశపు యుద్ధములలో రథమునకు గల ప్రాముఖ్యము అర్థశాస్త్రమున విశేషముగా చెప్పబడినది. రథస్థు డగు ఒక్క యోధుడు చాల తేలికగా శత్రుసైన్య భాగముల నెదుర్కొని చెదరగొట్టగలడు. త్వరత్వరగా తన సైన్యమును పురికొల్పి తన వెంటతీసికొనిపోయి పర సేనపై పడగలడు ! ఒక్కొక్క రథమును 10 నుండి 50 వరకు ఏనుగులు వెంబడించి యుద్ధములో పాల్గొనుచుండెడివి ! సాధారణముగా అతి ప్రాచీనకాలమునుండియు యోగ్యములగు గుఱ్ఱములనే రథములకు ఉపయోగించుచుండిరి. రానురాను అట్టివి లభింపమిచేతనో యేమో, మెగస్తనీసు కాలమునాటికి ఒక్కొక్కప్పుడు అనగా యుద్ధభూమికి రథములను తీసికొనిపోవునప్పుడు ఎద్దులను, యుద్ధములలో గుఱ్ఱములను ఉపయోగించెడివారు. అంతేగాక కొన్ని రథములను ఎద్దులే లాగెడివి. కొన్ని యెడల ఖరములను గూడ ఉపయోగించెడివారు. 'సమారు రోహానితుల్య వేగం రథం ఖరశ్రేష్ఠ సమాధియుక్తం, (రా.యు. 73 స.) అని ఇంద్రజిత్తు ఖరయుక్తమగు రథమును ఉపయోగించినట్లు తెలియుచున్నది. ఈ పద్ధతి - అనగా వృషభములు, ఖరములు మొదలగువాటిని రథములకు పూన్చుట-బహుళముగా తగిన ఉత్తమాశ్వములు లేనప్పుడు అమలులోనికి వచ్చియుండు నని తలపవచ్చును.

ఇట్టి రథములలో పెక్కు విధములు కలవు. వేగముగా పోవు చక్రములు గల ఇనుపరథము 'శుక్రనీతిలో ' పేర్కొనబడినది. అట్టిదే ఒక పొడవైన రథము 'హరివంశము' లోను వర్ణింపబడినది. సాధారణముగా శ్వేత చ్ఛత్రముతో గూడిన రథములు ఉత్సవాదులలోను, తదితరములు యుద్ధములలోను ఉపయోగింప బడెడివి.

ప్రతి రథమునకును, వెనుక భాగమున ఒక ధ్వజము లేక కేతువు పొడవైన ఒక యష్టిక కమర్పబడి బంధింప బడెడిది. ఆ ధ్వజముపై మృగములు, వృక్షములు, పుష్పములు మొదలగు వాటిలో ఒక చిత్రము గోచరించును. అది ఆ రథికి ప్రత్యేక చిహ్నముగా నుండెడిది. రథబలమున కాధ్వజమే జీవము. కనుకనే దాని పేరిట సేనకు 'ధ్వజిని' అను పేరు వచ్చినది. మరియు శత్రువు రథయుద్ధములో, మొట్టమొదట ధ్వజమునే పడగొట్టుటకు ప్రయత్నించెడివాడు. దానితో అతడు పరాజితు డైనంత నిరుత్సాహము చెందును. అతని సైన్య మదిచూచి చెల్లా చెద రగును. ఆ శత్రువా సమయమును గమనించి అతనిపై విజృంభించును.

భారతీయ యుద్ధశాస్త్రమున రథ స్వరూప మిట్లు వర్ణింపబడినది. అది ఎత్తులో 10 పురుషుల ప్రమాణమును, వెడల్పులో 6 నుండి 12 పురుషుల ప్రమాణమును గల్గి యుండును. వాటిలో 6 రథభేదములు గలవు. వాటిలో 3 సాంగ్రామికములు (యుద్ధములో ఉపయోగించునట్టివి). అట్టివాటిలో రథారోహణ శిక్షణయందు ఒక్కటియు, శత్రువు నెదుర్కొనుట కొక్కటియు, యుద్ధమధ్యమున అవసరమైనప్పు డొక్కటిగా నుపయోగింతురు. కడమవి వివాహోత్సవాదులలో ఉపయోగింతురు. రథములలో రెండు చక్రములు, నాల్గు చక్రములు, ఎనిమిది చక్రములు గలిగి వివిధములుగా నున్నట్లు కానవచ్చుచున్నది. రథియొక్కయు, సారథియొక్కయు, రథాధ్యక్షుని యొక్క యు, రథ నిర్మాణ పద్ధతుల యొక్కయు వివరములు వర్ణింపబడి యున్నవి.

అతి ప్రాచీనకాలమునుండి అమలులో నున్న రథబల సంప్రదాయము క్రమక్రమముగా క్షీణించుచు వచ్చినది. బాణుని హర్షచరిత్ర నాటికి రథముల ప్రశంసయే కానరాదు. రథములతోడి యుద్ధము ఒక్కొక్కప్పుడు ప్రమాద భరిత మగుటయే అందుకు కారణము కానోపును. భూమి సమముగా లేక ఎగుడుదిగుడుగా నుండునప్పుడు, వర్షాదులవలన బురదగా నున్నప్పుడు, రథవేగము మందగించును. అది శత్రు విజయమునకు తావిచ్చును. మరియు ప్రాచీనకాలపు రథ నైపుణ్యము తగిన శిక్షకులు లేక సన్నగిల్లి యుండవచ్చును. అట్లే దక్షిణభారతమున చోళుల చరిత్రలోగూడ వారి సేనల విషయమున రథప్రశంస లేదు. అనగా ఆ కాలమునాటికే రథములు ఉపయోగించు వాడుక తొలగిపోయినదని చెప్పవచ్చును.

గజబలము : సేనలో తర్వాతి ప్రముఖ స్థానము వహించునది గజబలము. భారతదేశములో చాల ప్రాచీన కాలము నుండియు శాంతి సమయములలో వాహనముగను, యుద్ధ సమయములలో తదంగముగను ఏనుగు ఉపయోగపడు చుండినది. ఋగ్వేదమున రెండేనుగులు ఎదురుమళ్ళుగా నిల్చి తలలు వాంచి శత్రువు నెదుర్కొన పరుగిడినట్లు వర్ణింపబడినది. దానినిబట్టి అంత ప్రాచీనకాలముననే ఆర్యులు ఏనుగును యుద్దసాధనముగా ఉపయోగించెడి వారని ఏర్పడుచున్నది. యజుర్వేద కాలమునాటికి గజబలము బాగుగా వాడుకలోనికి వచ్చినది. ఇంక ఐతిహాసిక కాలముమాట చెప్పనే అక్కరలేదు. అర్థశాస్త్రమున గజబల ప్రక్రియను గూర్చి చక్కగా ఉపదేశింప బడినది. భారతదేశమున గజశిక్ష, హ స్తి శాస్త్రము - అను శాస్త్రములు అవతరించి, గజబల విధానమునకు దోహదము చేసినవి.

గజములలో -'భద్రో మంద్రో మృగో మిశ్ర, శ్చతస్రో జాతయో గజే' అని నాల్గుజాతులు పేర్కొనబడినవి. ఈ విషయమే


భద్రైర్మంద్రై ర్మృగైశ్చైవ.
        భద్రమంద్ర మృగై స్తథా
భద్రమంద్రై ర్భద్రమృగై
        ర్మృగమంద్రైశ్చ సా పురీ.
                           (రా. బా. 6 స.)

అని వివరింపబడినది. మరియు 'వింధ్యపర్వత జై ర్మత్తైః... మాతంగైః పర్వతోపమైః' అని అవి వింధ్యపర్వతమున బుట్టి కొండలవలె నున్నట్లు వర్ణింపబడినవి. అట్లే ‘కులీనాన్రూపసంపన్నాన్... నిష్ఠి తాన్గజశిక్షాయా, మైరావతసమాన్యుధి (రా. సుం. 7 స.)' అని వాటి కులీనత్వమును, రూపసంపన్నతయు, శిక్షార్హతయు తెలుపబడినవి. మరియు,


'బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః
         శూద్ర శ్చేతి చతుర్విధాః
వర్ణా గజేషు విజ్ఞేయా
         స్తేషాం లక్షణముచ్యతే'
                       (హరిహర చతురంగము)

అని గజములలో బ్రాహ్మణాది వర్ణభేదములును సలక్షణముగా ప్రతిపాదింప బడినవి. వీటి అన్నిటినిబట్టి గజశాస్త్రము భారతదేశమున ఎంతటి అభివృద్ధిని చెందెనో ఊహింపవచ్చును.

యుద్ధోపయోగకరములైన గజములు, ఉపస్థానము - కంచెలు, మిట్టలు దాటుట; సంవర్తనము - కూర్చుండుట, గుంటలు, పల్లములు దాటుట; సంయానము - సమవక్ర రీతులతో పోవుట; వధావధము - యుద్ధభూమిలో గుఱ్ఱములను, పదాతులను కాలితో త్రొక్కుట; హస్తియుద్ధము - ఏన్గులు పరస్పరము పోరాడుట; నాగరాయణము – నగరద్వారములను, భవనములను కూలద్రోయుట; సాంగ్రామికము - యుద్ధ ప్రక్రియలలో పాల్గొనుట వంటి శిక్షాప్రక్రియలు, నేర్పబడి సుశిక్షితము లగును. మావటివాడు అంకుశము ధరించి కుంభస్థలముపై కూర్చుండి, నడపుచుండగా, గజబలము యుద్ధములలో ప్రవర్తించును. అగ్నిపురాణమును బట్టి ఆరుగురు యోధులు - ఇద్దరు విలుకాండ్రు, ఇద్దరు ఖడ్గధారులు, ఇద్దరు గదాధారులు- ఒక్క ఏనుగుపై కూర్చుండి యుద్ధము చేయుచున్నట్లు విదితమగు చున్నది. తర్వాతి గజశాస్త్రములను చూచిన యెడల, అట్టి సంఖ్య నిర్బంధము లేనట్లే కానబడును.


“జలే స్థలేచ దుర్గేచ.
       శాఖిభిః సంకటే తథా
సమేచ విషమేచైవ
       జయో నాగవతాం ధ్రువం”
                           (హ. హ. చ.)

అన్నట్లు జలస్థల ప్రదేశములలో గాని, దుర్గారణ్య ప్రదేశములలో గాని, సమవిషమ ప్రదేశములలోగాని, గజబలమును ఉపయోగించి జయము సాధింపవచ్చును. శత్రుసైన్యములోనికి నిర్భయముగా చొచ్చుకొని పోవుచు దానిని చెదరగొట్టుటకును, తనసైన్యపు టిరుపార్శ్వములను పెట్టనికోటవలె నుండి రక్షించుటకును, శత్రుదుర్గములను ధ్వంసము చేయుటకును, జలవనాది దుర్గముల నవలీలగా అతిక్రమించుటకును, గజసేన సర్వదా ఉపయోగపడు చుండెడిది. గజబలాధిక్యమును బట్టియే మన ఆంధ్ర రాజులలో గూడ 'గజపతులు' అనువారు కానవచ్చు చున్నారు.

అశ్వబలము : సేనలో గజబలము తర్వాత ముఖ్యమైనది అశ్వబలము. యుద్ధములో గుఱ్ఱమును ఉపయో గించు వాడుక అథర్వ వేదకాలమునుండియు తెలియు చున్నది. శ్రీమద్రామాయణమున -


'కాంభోజవిషయే జాతై ర్బాహ్లికైశ్చ హయో త్తమైః
వనాయుజైర్నదీజైశ్చ, పూర్ణా హరిహయోత్తమైః'
                                              (రా. బా. 7 స.)

అని గుఱ్ఱములు కాంభోజ - బాహ్లిక -వనాయు-సింధు దేశములలో పుట్టినట్లును, అవి భారతదేశమున ఉపయుక్తము లైనట్లును తెలియగలదు. కాని భారతదేశమునందలి అశ్వజాతియంతయు విదేశీయ మనుట న్యాయముకాదని కొందరభిజ్ఞులు అభిప్రాయ పడుచున్నారు. సేనలో అశ్వ సేనయొక్క ఆవశ్యకతనుగూర్చి చెప్పుచు -'యస్యాశ్వాస్తస్య మేదినీ' - (అశ్వబలము గలవానిదే భూమి) అనియు-


'శక్య మశ్వసహస్రేణ కృత్స్నాం జేతుంవసుంధరాం
న యచ్ఛక్యం గజైర్జేతుం పత్తిభిర్వా ప్రహారిభిః'
                                           (హ. హ. చ. 3.)

అన్నట్లు గజపదాతి బలములచే జయింపరాని దెల్లను అశ్వబలముచే గెలువవచ్చుననియు, చెప్పబడుటచే దాని ప్రాశస్త్యమును సులభముగా గుర్తింపవచ్చును.

ప్రాచీన భారతమున అశ్వశిక్షనుగూర్చి తెల్పు శాస్త్రములు పెక్కులున్నట్లు తెలియనగుచున్నది. అశ్వాయుర్వేదము, అశ్వశాస్త్రము, అశ్వచికిత్సితము మొదలగునవి లక్షణ ప్రకాశములో పేర్కొనబడినవి. వాటినిబట్టి అశ్వబలమును గూర్చిన విశేషాంశము లెన్నియైనను తెలియవచ్చుచున్నవి.

అశ్వదళమునందు చేర్చుకొనునప్పుడు గుఱ్ఱముయొక్క వయస్సు, బలము, పరిమాణము, సలక్షణత మొదలగు నంశములు విచారించి స్వీకరించెడివారు. పరిపాలనాంగమున అశ్వరక్షణమున కొక శాఖయే యున్నట్లు అర్థశాస్త్రము చెప్పుచున్నది.


'తతః సంనోదయామాస,హయా నాశు త్రిహాయనాన్'
                                              (మ. భా. ద్రో. ప.)

అన్నట్లు అభిమన్యుని గుఱ్ఱములు మూడేండ్ల వయస్సు గల్గిన వని చెప్పబడినది. యుద్ధాశ్వమునకును రథాశ్వమునకును భేద మున్నట్లు కన్పట్టును. గుఱ్ఱములకు, ఏనుగులకు వలెనే ప్రత్యేకముగా పేర్లు పెట్టుకొని వ్యవహరించు వాడుక యున్నది. ఆశ్వికుడు (గుఱ్ఱపు రౌతు) దానిపై నెక్కి, తన చేతిమణికట్టున కొక కొరడాత్రాడు కట్టుకొని కూర్చుండి దానితో అవసరము కల్గినప్పుడు అదలించు చుండును. అందుకే అతని చేతులు వట్టివిగా నుండి, ఖడ్గ -బాణాది—ప్రయోగములను నిరాటంకముగా నిర్వహింప గలవు. 'రౌతులు అశ్వశిక్షలో యుద్ధప్రక్రియ లన్నియు నేర్చి, శత్రుసేనలను సూటిగా నెదుర్కొనుటకును, పారిపోవువానిని వెంటాడుటకును, తన సైన్యపు పార్శ్వములను రక్షించుకొనుటకును, యుద్ధవార్తలను దేశమందంతట రహస్యముగా చేరవేయుటకును, శత్రుసేనను చీల్చి త్రోసికొని చెండాడుటకును అశ్వసేన నుపయోగింతురు. దుర్గారణ్యమందలి సేనారక్షణమున కీ అశ్వదళ మెంతో ఉపయోగకారి. ఎందుకు? వేగ - సాహస మవసరమగుపట్ల అశ్వదళమే విజయసాధకమని భారతీయులఅభిప్రాయము.

పదాతిబలము : ఇక సేనకు నాల్గవ అంగము పదాతి బలము. దీనినే మనము 'కాల్బలము' అందుము.


“సేనా పదాతిబహులా, శత్రూన్ జయతి సర్వదా”
                                             (అగ్నిపురాణము)

అన్నట్లు పదాతిబలపు ప్రాశస్త్యము చెప్పబడినది. మరియు


“యుధ్యంతే పత్తయస్సర్వే ప్రజ్ఞయైవ స్వకీయయా"
                                                    (హ. హ. చ )

అనుటచే పదాతులు గజాది బలమువలె గాక తమ సొంత ప్రజ్ఞచే ప్రవర్తించి జయము సాధింపగలరు. రథాదిబల ముపయోగింపని -


“దుర్గయుద్ధే రాత్రియుద్ధే, ప్రశస్యంతే పదాతయః
యత్రగంతుం వనే, శైలే, పత్తయ స్తత్ర యోధినః"
                                               (హ. హ. చ.)

అన్నట్లు దుర్గ, వన, పర్వత యుద్ధములలోను, రాత్రి యుద్ధమునందును, పదాతిబలమే శ్రేష్ఠమని చెప్పదగును. అట్టి పదాతిసైనికులు, మౌలసైనికులు (ఆనువంశికముగా నుండువారు), భృతసైనికులు (వేతనమునకై చేరినవారు), శ్రేణీసైనికులు (ప్రజాసంఘముల నుండి వచ్చి చేరినవారు), మిత్రసైనికులు (సామంతాదులచే పంపబడిన వారు), అమిత్రసైనికులు (శత్రు సేనను విడిచివచ్చి చేరినవారు). ఆటవిక సైనికులు (అడవిజాతులవారు) అన్నట్లు వివిధరీతులుగా ఆ బలములో చేరి యుద్ధ మొనర్తురు. వారును తగిన శిక్షణమును పొంది తగిన పరిపాలనాశాఖ క్రిందనుండి సాహసోపేతులై యుద్ధము గావించుచుందురు. కూపతీర్థాదులను శోధించుట, శిబిర సన్నివేశములకును, శత్రుస్థావరములయొక్కయు మార్గముల నన్వేషించుట, గుడారముల నిర్మాణము, కోశాగారము, ఆయుధాగారము, ధాన్యాగారము మొదలగు వాటిని రక్షించుట, వ్యూహాదులను రచించుట, మొదలగునవి పదాతి కర్మలని చెప్పబడినది.

ఈ పదాతులే ముఖ్యముగా ఆ యా కాలములలో అమలులోనుండిన ఆయుధములను ధరించి అందు సుశిక్షితులయి యుందురు. శిరస్త్రాణము, కవచము, కత్తి, డాలు మున్నగు రక్షక పరికరములను ధరించి, యుద్ధాలంకార శోభితులయి, వీరాలంకరణములు కలవారై, తారసిల్లుదురు ! వారు -


'బలవంతస్సత్త్వవంతో, మర్మజ్ఞాః సూక్ష్మవేధినః,
యుద్ధ భూమి విభాగజ్ఞా, దుర్లభాస్తే పదాతయః
                                                (హ. హ. చ.)

అని బలసత్త్వవంతులును, మర్మజ్ఞులును, సూక్ష్మవేధులును, యుద్ధభూమి విభాగజ్ఞులునగు పదాతులు దుర్లభులని యుద్ధశాస్త్రము !

ఇట్టి రథ - గజ - తురగ - పదాతులు అను చతురంగబలములతో గూడిన సేన ప్రాచీన భారతదేశమునందలి యుద్ధభూముల నలంకరించినది.

బలవివరణము : భారతీయులు రథ - గజ - తురగ - పదాతి దళములను, పత్తి సేనాముఖము, గుల్మము, గణము, వాహిని, పృతన, చమువు, అనీకిని, అక్షౌహిణి అని తొమ్మిది విధములుగా విభజించిరి. పత్తియను విభాగము నందు ఒక రథము, ఒక గజము, మూడశ్వములు, అయిదుగురు కాలిబంట్లు ఉందురు. 3 పత్తులు, ఒక సేనా ముఖము; 3 సేనాముఖములొక గుల్మము; 3 గుల్మము లొక గణము; 3 గణములొక వాహిని; 3 వాహిను లొక పృతన; 3 పృతనలొక చమువు; 3 చమువులొక అనీకిని; 10 అనీకినులు ఒక అక్షౌహిణి అనబరగును. ఈ విభాగములు ఈ కాలమునందలి బెటాలియనులు, రెజిమెంట్లు, కంపెనీలు - ఇత్యాది సేనావిభాగములను పోలియున్నవి.

ఇక ఈ లెక్కప్రకారము ఏ యే సైనిక విభాగ బల మెట్లుండునో దిగువ చూపబడినది :

పటాలము పేరు రథములు గజములు అశ్వములు పదాతులు
1. పత్తి 1 1 3 5
2. సేనాముఖము 3 3 9 15
3. గుల్మము 9 9 27 45
4. గణము 27 27 81 135
5. వాహిని 81 81 243 405
6. పృతన 243 243 729 1215
7. చమువు 729 729 2187 3645
8. అనీకిని 2187 2187 6561 10935
9. అక్షౌహిణి 21870 21870 65610 109350

ఈ తొమ్మిదింటిలో అన్నిటికంటె చిన్నది "పత్తి" అను పటాలము. అన్నిటికంటె పెద్దది అక్షౌహిణి అనునది. ప్రతి పటాలమునకు ఒక అధిపతి యుండుచుండెను. ఆ అధిపతులను పత్తిపాలకుడు, సేనాముఖుడు, గౌల్మికుడు, గణపతి, వాహినీపతి, పృతనాపతి, చమూపుడు, అనీకినీపతి, అక్షౌహిణీపతి అనుచుండిరి. అనీకినీపతి మహాభారతములో సేనాప్రణేతరుడుగా పేర్కొనబడినాడు. వీరందరు సమర పండితులు. కౌరవుల పక్షమున 11 అక్షౌహిణుల సైన్యము, పాండవులకు 7 అక్షౌహిణుల సైన్యము ఉన్నట్లు మహాభారతము తెలుపుచున్నది. ప్రాచీన హిందువుల ఈ సేనావిభాగ పద్ధతి వారి కుశాగ్రబుద్ధికి, సేనావ్యవస్థా ప్రణాళికా విధానమునకు తార్కా ణముగా నుండగలదు.

చతురంగబలములను నడిపెడు ముఖ్యయోధుడు వైదిక వాఙ్మయములో 'సేనాని' అనబడెను. 'సేనాని' అను పదము తరువాత 'సేనాపతి' అను పదముగా మారెను. సేనాపతికి తరువాత పేర్కొనదగిన యుద్ధాధికారి సేనా ప్రణేతరుడుగా చెప్పబడెను. ఇతడు దండనాథు డనియు వ్యవహరింపబడెను. ఈ ఇద్దరిలో ఒక్కొకడు ఒక అక్షౌహిణీ సైన్యమునకు అధిపతిగా నుండు చుండెను. ఈ సేనాపతులలో నుండి ఒకడు నాయకాగ్రేసరుడుగా ఎన్నుకొనబడు చుండెను. ఇట్టివానిని 'మహా సేనాపతి' అను ప్రముఖనామముతో పేర్కొనుచుండిరి. ఇట్టి అధికారిని విజయనగర సమ్రాట్టులు 'సర్వసైన్యాధికారి' అనిరి. మహాసేనాపతులమీది అధికారి మంత్రియై యుండెను. ఈ మంత్రిని 'సచివు' డను ఉద్యోగనామముతో వ్యవహరించుచుండిరి. సచివుడు యుద్ధ శాంతికాలవిధులను నిర్వహించు మంత్రియైయుండెను. ఈ సచివుడు తరువాతి కాలములో సంధివిగ్రహికుడు అను పదవీనామమును పొందెను. ఈ సచివోద్యోగి విజయనగర సామ్రాజ్యయుగమున “దళవాయి" అను పేరున వ్యవహరింపబడెను.

యుద్ధవీరుల శౌర్యసాహస - చాకచక్యముల ననుసరించి అతిరథుడు, మహారథుడు, సమరథుడు, అర్ధరథుడు అని వారి నుగ్గడించు విభాగ మొకటి యున్నట్లు మహాభారతమువలన తెలియుచున్నది.

బి. వేం. శే.