Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చంపూకావ్యములు

వికీసోర్స్ నుండి

చంపూకావ్యములు (సంస్కృతము) :

గద్య పద్య చంపూ భేదమున కావ్యము త్రివిధము. ఛందోబద్ధమయినది పద్యకావ్యము. తద్భిన్నమయినది. గద్యకావ్యము, గద్యపద్యముల కలయికచే నేర్పడినది చంపూ కావ్యము, 'చంపయతి' 'చంపతి ' అను వ్యుత్పత్తిచే నిది చంపువైనది. ద్రాక్షా మధువుల కలయికవలె, జంత్రగాత్రసంగీతముల మిశ్రణము కైవడి, చంపూకావ్యమున దాదాపు తుల్యప్రమాణము గల గద్యపద్యముల సమ్మేళనము మనోహర మగుచున్నది.

వైదికోపాఖ్యానములు, పాలీ భాషామయ బౌద్ధ జాతక కథలు, పంచతంత్ర హితోపదేశాది సంస్కృత కావ్యములు, చంపూ కావ్య నిర్మాణ ప్రణాళికి మూలములని తెలియుచున్నది. గుప్త యుగమునందలి శాసనములు క్రీ. శ. 4వ శతాబ్దినాటికే చంపూకావ్యములు రచింపబడి యుండె ననుటకు నిదర్శనములు. క్రీ. శ. 7వ శతాబ్దికి పూర్వముననే చంపూకావ్య మొక స్వతంత్ర సారస్వత ప్రక్రియగా అంగీకరింపబడియుండె ననుటకు దండికావ్యా దర్శము నందలి 'గద్యపద్యమయీ కాచి చంపూరిత్యభి ధీయతే' అను నిర్వచనమే ప్రమాణము. ఈ నిర్వచనమునకు నాట కాదులయందు అతివ్యా ప్తిని ఆశంకించిన హేమచంద్రాచార్యుడు (క్రీ. శ. 12) చంపూకావ్యలక్షణమును సంస్కరించి, 'గద్యపద్యమయీ సాంకోచ్ఛ్వాసా చంపూః' అని తన కావ్యానుశాసనమునందు నిష్కృష్టమైన చంపూ నిర్వచన మొనర్చెను.

చంపూ కావ్యమునకు సంస్కృత వాఙ్మయమున సముచితస్థానము లభించెను. చంపూకావ్యమును సంస్కృత కవులు భిన్నభిన్న ప్రయోజనములను సాధించుటకు వాడిరి. పరిణయకథాత్మక చంపువులు కొన్ని వెలసినవి.. క్రీ. శ. 950 ప్రాంతమువాడైన త్రివిక్రమభట్టు చంపూకావ్యమునకు ఆద్యప్రవర్తకుడుగా భావింపబడుచున్నాడు. ఇతడు శాండిల్య గోత్రోత్పన్నుడు. శ్రీధరుని పౌత్రుడు, నేమాదిత్యుని పుత్రుడు. దక్షిణమున ప్రసిద్ధిచెందిన మాల్యఖేటమున (Malkhed) కధీరుడును, రాష్ట్రకూట కుల చూడామణియు నగు తృతీయ - ఇంద్రరాజు నాస్థానమున, ఈ కవి ప్రముఖపండితుడై యుండెను. ఇంద్రరాజు కృష్ణా - తుంగభద్ర సంగమస్థలమున నున్న కురుండక మను గ్రామమున (919) వ సంవత్సరమున పట్టాభిషిక్తుడై బ్రాహ్మణులకు అనేక గ్రామముల నొసగెననియు, ఆ కురుండక దానపత్రమును ఈ త్రివిక్రమభట్టే వ్రాసియుండెననియు బడోదాంతర్గతమయిన నవసారీ గ్రామమున లభించిన తామ్ర శాసన లిపివలన తెలియుచున్నది. త్రివిక్రమభట్టు నలచంపువును రచించెను. దీనికి 'దమయంతీచంపూకథ' యనునది నామాంతరము. ఇది 7 ఉచ్ఛ్వాసముల కావ్యము. ఈ చంపువు మహాభారతీయ వనపర్వాంతర్గత నలోపాఖ్యాన మాధారముగా నిర్మితమైనది. ఉచ్ఛ్వాసాంతిమ పద్యములందు, ఇది, హరచరణ సరోజపదాంకితము. (హరచరణసరోజ ద్వంద్వ మారాధయంతీ శుచికుశశయనీయే సా౽ థనిద్రాం జగామ -ద్వి. ఉ. శ్లో. 39) స్వయంవర పర్యంతముగ నలదమయంతుల ప్రేమకథ ఇందు వర్ణితమైనది. అవతారికాశ్లోకములలో, వాల్మీకిని, వ్యాసుని, బాణుని, గుణాఢ్యుని ఈ కవి ప్రశంసించెను. ఈ చంపువునందు మంత్రి సాలంకాయనుడు నలునకొసగిన ఉపదేశము, కాదంబరియందు శుకనాసుడు చంద్రాపీడున కొసగిన ఉపదేశము వలె హృద్యమును అమూల్యమునై ఒప్పారుచున్నది. త్రివిక్రమభట్టు భంగశ్లేష రచనయందు కృతహస్తుడు.


'భవంతి ఫాల్గునే మాసి వృక్షశాఖా విపల్లవాః
జాయంతే నతులోకస్య కదా౽పిచ విపల్ల వాః
                            (నల. చం. ఉ. 1 శ్లో. 27)

అను శ్లోకమునందు మొదటిపాదము నందలి 'విపల్ల వాః' అను పదమునకు 'విగతపల్లవాః' అనియు, రెండవపాదము నందలి 'విపల్లవాః' అను పదమునకు 'విపత్' 'లవాః' అనియు సభంగశ్లేష మనోహరముగ నున్నది. ఇట్లే


'బిభర్తి యో౽హ్యర్జున వారి పౌరుషం
కరోతి నమ్రే చ, నవా, రిపౌ, రుషం
నతేన రాజ్ఞా సహసా౽ గరాజితా
భవేన్మహీ కిం సహసాగరా, జితా'
                         (నల. చం. ఉ. 4 శ్లో. 18)

అను పద్యమునందలి సభంగశ్లేష సరసమును రమణీయమునై తనరారు చున్నది. ఈ కావ్యమునందు 7 వ ఉచ్ఛ్వాసమున కవికృతమయిన చంద్రోదయవర్ణనము కడుంగడు మనోజ్ఞము.


కైలాసాయితమద్రిభిః విటపిభిః
        శ్వేతాతపత్రాయితం
మృత్పం కేన దధీయతం జలనిధౌ
        దుగ్దాయితం వారిభిః ।
ముక్తాహారలతాయితం వ్రతతిభిః
        శంఖాయితం శ్రీఫలై :
శ్వేతద్వీపజనాయితం జనపదై
        ర్జాతే శశాంకోదయే.
                        (నల. చ. శ్లో. 28)

నలచంపువునందు కనిపించు ఉదాహరణములు న్యాయ వై శేషి కాది శాస్త్రములందు త్రివిక్రమభట్టు నిష్ణాతుడని తెలుపుచున్నవి. 'మదాలస చంపువు' అను మరియొక చంపువు నీతడు నిర్మించెను. కువలయాశ్వచరిత మనునది దీనికి నామాంతరము. నాయకు డిందు కువలయాశ్వుడు. నాయిక మదాలస. హృదయంగమము లయిన ఇందలి గద్యపద్యములు పాఠకులకు అమందానందసంధాయకములుగా నున్నవి.

కాయస్థకులజుడగు సోడ్డలకవి 'ఉదయసుందరీకథ ' ను నిర్మించెను. ఇందు 8 ఉచ్ఛ్వాసము లున్నవి. ఉదయ సుందరీ మలయవాహనుల వివాహోదంత మిందు సరసముగ వర్ణింపబడినది. మలయవాహనుడు ప్రతిష్ఠానా ధీశుడు. ఉదయసుందరి నాగలోకరాజగు శిఖండితిలకుని తనయ. మొదటి ఉచ్ఛ్వాసమున ఆత్మకథాంశములను కొన్నింటిని కవి వ్రాసికొనెను. వాటినిబట్టి, కొంకణమునకు క్రమముగా అధీశులయిన ఛిత్తరాజు, నాగార్జునుడు, ముమ్మణిరాజు అను సోదరులచే సత్కరింపబడినవాడు. లాటాధీశు డగు చాళుక్య వత్సరాజు ఆస్థానమున గౌరవము నొందినవాడు, క్రీ. శ. 1000-1070 సంవత్సరముల మధ్యకాలమున నున్నవాడు ఈ కవి యని తెలియు చున్నది. అవతారికయందు బాణుని, ఆతని హర్షచరితమును కవి ప్రశంసించెను. హర్ష చరితమునందలి గద్యమువలె ఈ చంపువునందలి గద్యము ఉజ్జ్వలమై ఒప్పుచున్నది. కథ కల్పితమును, చిత్తావర్జకమునై యున్నది.

'వరదాంబికాపరిణయచంపువు'ను 1540 వ సంవత్సర ప్రాంతమున రచించి వాసికెక్కిన విదుషీమణీ తిరుమలాంబ. ఈమె విజయనగరాధీశు డయిన అచ్యుత దేవ రాయల (క్రీ. శ. 1540) పట్టమహిషి. తన భర్తయగు అచ్యుతదేవరాయలు మహావైభవముతో వరదాంబికను పెండిలియైన వృత్తాంతమును సరసముగ ఈ చంపువునందు వర్ణించిన ఉదారశీల ఈ తిరుమలాంబ. వేదాధినాథ కృత 'గోదాపరిణయము'ను, శ్రీనివాస దీక్షిత ప్రణీత 'భైష్మీపరిణయ చంపువు'ను, చక్రకవి (1650) గ్రథిత 'ద్రౌపదీ పరిణయము'ను, గంగాధర కవి రచిత 'మద్ర కన్యా పరిణయము'ను, కందుకూరి నాగనాథసూరి నిర్మిత 'మీనాక్షి కల్యాణము' ను, 'ఉషాపరిణయ - పాంచాలీ స్వయంవరము'లును సంస్కృత వాఙ్మయమున వెలసిన పరిణయకథాత్మక చంపూ కావ్యములకు చక్కని ఉదాహరణములు.

మతప్రచారోదిష్టచంపువులు : సంస్కృత చంపూవాఙ్మయ పాదపమును స్వీయ రచనాదోహదములచే సుపుష్టమును సుసంపన్నము నొనర్చిన కవితల్లజులలో జైనకవి హరిచంద్రు డొకడు. ఇతడు 'జీవంధర చంపువు'ను సంతరించెను. క్రీ. శ. 850 వ సంవత్సరమున గుణభద్రుడు పూర్తి యొనర్చిన ఉత్తర పురాణ మాధారముగ నిది రచింపబడినది, కావున ఈ కవి క్రీ. శ. 900 సంవత్సరములకు పిమ్మట నున్న వాడని నిశ్చయింపబడినది ఈ కావ్యమందలి పదునొకండు లంబకములలో, జీవంధరుడను నొక జైన సిద్ధపురుషుని చరితము వర్ణింపబడినది. నేమిదేవుని శిష్యుడగు సోమదేవుడు క్రీ. శ. 959 వ సంవత్సరమున నిర్మించిన 'యశస్తిలక చంపువు' లోక విఖ్యాతమైనది. ఇది ఎనిమిది ఆశ్వాసములు కావ్యము. ఈ కవికి పోషకుడు కృష్ణరాజదేవుడు. కృష్ణరాజదేవుడు రాష్ట్రకూట రాజగు మూడవ కృష్ణుడే. హరిదత్తు డను రాజు యజ్ఞదీక్షితు డయ్యెను. ఆ యజ్ఞమునందు ఒక బాలకుని ఒక బాలికను ఆ రాజు తన కులదేవతకు బలిగా నర్పింప దలచెను. ఆ సమయమున కవలలయిన ఆ పిల్లలు, ఆశ్చర్యకరముగ తమ పూర్వజన్మ వృత్తాంతమును, నృపుని పూర్వజన్మ వృత్తాంతమును వివరించిరి. అంతలో సుదత్తుడను ఋషి యజ్ఞ నిర్వహణము నిష్ఫల మని ఆ రాజునకు బోధించెను. రాజంతట జైనుడుగా మారెను. అని అవగతమగుచున్నది. అవతారికా శ్లోకములందు భారవిని, బాణుని, మయూరుని, నారాయణుని, మాఘుని, రాజ శేఖరుని, ఇతర కవులను కవి పేర్కొని యున్నాడు. ఈ చంపువునందు తుది మూడాశ్వాసములలో జైనమత సిద్ధాంతములు ప్రతిపాదింపబడినవి. 'జీవంధర యశస్తిలక చంపు' వులు యజ్ఞమతనిరసనము, జైనమతప్రచారము దృష్టియం దిడుకొని రచింపఁ బడిన కావ్యములు.

సంస్కృత చంపూరచయితల దృష్టి రామాయణ కథపై ప్రసరించెను. భోజుడు 'చంపూరామాయణము'ను రచించెను. దీనికి 'భోజచంపు' వనియు వ్యవహారము కలదు. ఇది చంపూకావ్యమణిహారమున నాయకమణిగా నెన్నబడినది. ముద్రితమయిన మూలగ్రంథమున ఈచంపువును రచించిన కవి విదర్భరాజని యున్నది. కాని గ్రంథకర్తపే రందు నిర్దిష్టము కాలేదు. జనశ్రుతినిబట్టి, ధారానగరము రాజధానిగా మాళవదేశము నేలిన భోజమహారాజు ఈ కావ్యమును రచించినట్లు విదితమగుచున్నది. విదర్భయు, మాల్వయు భిన్నదేశములు. వాటి నేలిన రాజులును భిన్నులై యుండవలెను. నేడు లభించు ప్రమాణములనుబట్టి భోజునకు విదర్భరాజను వ్యవహారము సమర్థనీయ మగుటలేదు అని యొకరు వ్రాసిరి. భోజుడు క్రీ. శ. 1005 – 1054 సంవత్సరముల మధ్యకాలమున రాజ్యము నేలినవాడు. అందుచే నితడు 11 వ శతాబ్ది యందు చంపూరామాయణమును రచించి యుండెనని చెప్పబడుచున్నది. ధారారాజ్యమునొకవంక, కవితారాజ్యమును మరియొకవంక, అనంత వైభవోపేతముగ పాలించిన మహారాజుగా, విద్వత్కవిగా, విద్వత్కవిపోషకుడుగా, భోజుడు విఖ్యాతుడయ్యెను. సరస్వతీ కంఠాభరణము, శృంగారప్రకాశము, పాతంజలసూత్రవృత్తి మున్నగు గ్రంథరాజములను సంతరించి అఖండయశో విరాజితుడయిన మహాపండితు డీతడు. ఇతని జిహ్వాగ్ర రంగమున వాగ్దేవి నాట్య మొనర్చు చుండెడి దనియు, ఇతని దర్శన మాత్రమున విద్యావిహీనులకు సయితము సత్కావ్యనిర్మాణచాతురి, సర్వకలాకౌశలము, వాక్పటుత్వము లభించుచుండెడిదనియు చెప్పబడినది.

రామాయణ చంపువు భోజుని సర్వంకష ప్రజ్ఞాధురీణతకు నికషోపలము. ఇతని కీర్తి ప్రతిష్ఠల కిది జయపతాక.

గుణోత్కర్షమును పురస్కరించుకొనియే పండితు లీ చంపువునకు పట్టము గట్టిరి.


ఉచ్చైర్గతిర్జగతి సిధ్యతి ధర్మత శ్చే
త్తస్య ప్రమా చ వచనైః కృతకేతరై శ్చేత్
తేషాంప్రకాశనదశా౽పి మహీసురై శ్చే
త్తానంతరేణ నిపతేత్క్వను మత్ప్రణామతిః

అను శ్లోకమునందలి మంగళా చరణము నమస్క్రియా రూపమై, ధర్మబోధకమై, భోజుని వినయసంపత్తికిని, బ్రాహ్మణ భక్తికిని, చిహ్నముగ వరలుచున్నది. ఇందారు కాండములు కలవు. వీటిలో భోజుడు రచించినవి మొదటి అయిదు కాండములే. యుద్ధకాండమును లక్ష్మణకవి, ఘనశ్యాముడు, రాజచూడామణి దీక్షితులు, అను పండిత వర్యులు పూరించిరి. ఈ చంపువునందు మహాకవి అసాధారణ ప్రతిభా వ్యుత్పత్తులు, సరసకల్పనా స్వాతంత్ర్యము, రసోచిత వర్ణనకౌశల్యము, భాషా విభుత్వము, భావపరిపాకము, పాత్రపోషణ చాతురి, భావబోధక మితపద ప్రయోగనైపుణ్యము ప్రస్ఫుటముగ భాసించినవి. శైలి రసోదాత్తము. భరద్వాజ, అగస్త్య మహర్షి ప్రభృతుల ఆశ్రమముల మహిమను, ఋతువుల సౌందర్యమును, గంగావతరణ భవ్యతను భోజుడు వర్ణించిన విధ మనితరతుల్యము. శ్రీరాముడు వర్ణించిన వర్షా సమయ ప్రభావవర్ణన మెంతయు మనోహరము. ఉదా.


అయం కాలః కాలప్రమథనగళాభైరభినవైః
అహంయూనాం యూనామపహరతిధైర్యంజలధరైః
స్మరాధారా ధారాపరిచయజడా వాంతి సహసా
నభస్వంతః స్వంతః కథమివ వియోగః పరిణమేత్ .

మహాసమరసూచకః ప్రతిదిశం మనోజన్మనో
మయూరగళ కాహళీక లకలః సముజ్జృంభతే
పయోదమలినే దినే పరుష విప్రయోగవ్యథాం
నరేషు, వనితాను వా, దధతి హంత ! కే, కా, ఇతి.

అంభోధరోదర వినిర్గతవారిధారా
సంమర్ద మాంసలసమీరసమీర్య మాణైః,
ఆమోదవీచినిచయైః కుటజప్రసూనై :
ఆకాశమేత దవకాశవిహీన మాసీత్,

ఘనశ్యామలపత్రస్య వ్యోమన్యగ్రోధ శాఖినః
ప్రరోహా ఇవ లక్ష్యంతే వారిధారా ధరా౦గతాః.

ఈ కావ్యమునకు వెలసిన పెక్కు వ్యాఖ్యలు దీని మహత్త్వమునకు నిదర్శనములుగ నున్నవి. భగవంతరాయడు, రాఘవుడు, వేంకటకృష్ణకవి అనువారు ఉత్తరరామాయణ కథను, ఉత్తర చంపువులుగా వ్రాసిరి. ఇవి ఆముద్రితములని తెలియుచున్నది. వెంకయ్యసూరి 'కుశలవచంపువు'ను, రామచంద్రుడు 'రామచంద్ర చంపువు' ను, గుండు రామస్వామిశాస్త్రి 'సీతా చంపువు' ను రచించినట్లు తెలియు చున్నది.

భాగవత చంపువులు : భాగవత కథ నాశ్రయించి రచింపబబడిన చంపువులు పేర్కొనదగినవి. అభినవ కాళిదాసు (క్రీ. శ. 1051) ఆరు ఆశ్వాసముల భాగవత చంపువును నిర్మించెను. ఈ కావ్యారంభమునందలి


"కల్యాణం నః ప్రభూతం కలయతు
         లలితాలాప శైలేశ బాలా
లీలా జాలానుకూలా శిశిరకర
         కలా భానుమాలా జటాలా
ఏషా శేషాహిభూషా పరిక లిత
         సుధాపూరధారానుకారా
భద్రా ముద్రా వినిద్రా పురహరణ
        విధౌ కా౽పికారుణ్యపూర్ణా"

అను శ్లోకమున కవికి పార్వతియందు గల భక్తి సూచితమైనది. అభినవ కాళిదాసు అను బిరుదమును ధరించిన వారు పెక్కురుకలరు. ఈ కవి పేరు తెలియదు. చిదంబర కవి (క్రీ.శ. 1600), రాజనాథకవి, రామభద్రకవి అను పండితులు రచించిన భాగవత చంపువులు మనోజ్ఞములు. వీటికి వ్యాప్తి తక్కువగ నున్నది. అవసరాల పద్మరాజు (క్రీ. శ. 1800) 'బాలభాగవత' మను భాగవత చంపువును నిర్మించెను. ఇత డాంధ్ర బ్రాహ్మణుడు. 'బాలభాగవతము' నకు 'పద్మరాజ చంపు' వను నామము సుప్రసిద్ధము. ఇందలి వచనము సానుప్రాసము, మధురము. కొల్లూరి రాజశేఖరుని భాగవత చంపువు కృష్ణకథాత్మకము. ఈ కవి పేరూరునందు నివసించెనని తెలియుచున్నది.

చరిత్రాత్మక చంపువులు కొన్ని వెలసినవి. క్రీ.శ. 1240 వ సంవత్సర ప్రాంతమువాడైన సోమేశ్వరదేవుడు 'కీర్తి కౌముది' అను కావ్యమును వ్రాసెను. ఇది చంపూ శైలిలో నున్నది. వీరధవళుని మంత్రి యగు వస్తుపాలుని జీవిత మిందు పొందుపరచబడినది. క్రీ.శ. 1420 వ సంవత్సర ప్రాంతమున వాసుదేవరథుడు 'గంగావంశాను చరిత 'మను చంపువును సంతరించెను. ఇందు కళింగను పాలించిన గంగా వంశ్యుల చరిత్రము కీర్తింపబడినది. అప్పయ్యదీక్షితుని శిష్యుడు కామాక్షీదాసుడను కాళహస్తి కవి 'వసుచరిత్ర' మను చంపూకావ్యమును రచించెను. రామరాజ భూషణుడు (క్రీ. శ. 1560-70 సంవత్సరముల మధ్యకాలమున రచించిన ఆంధ్ర వసుచరిత్ర మాధారముగ సంస్కృతమున ఈ చంపువు రచింపబడినది. అప్పయదీక్షితుడు 1550 - 1620 సంవత్సరముల మధ్యకాలమున నున్న వాడు. ఈ చంపువు 1600 సంవత్సర ప్రాంతమున వ్రాయబడి యుండును. బాణేశ్వరుని 'చిత్రచంపువు' నందు చరిత్రాత్మక విషయములు కలవు. ఇందు బుర్ద్వన్ వంశజుడయిన చిత్ర సేనుని జీవిత మభివర్ణిత మైనది. చిత్ర సేనుడు క్రీ. శ. 1744 వ సంవత్సరమున మృతినొందెను. ఈ కావ్యము క్రీ. శ. 18 వ శతాబ్ది - ఉత్తరభాగమునకు చెందినది. తంజావూరునందు నివసించిన గంగాధరామాత్యుని కొడుకు నారాయణరాయడు 'విక్రమసేన రాజచరిత' మును చంపువుగా వ్రాసెను. విక్రమసేనుడు ప్రతిష్ఠానపురమున కధీశుడు. శ్రీనివాస పండితుడు 'శ్రీనివాస చంపువు'ను రచించెను. ఇందు సుధర్ముని తనయు డగు ఆకాశవర్మ కథానాయకుడుగ నున్నాడు.

కొందరు చంపూరచయితలు భారతకథ నాశ్రయించి కావ్యములను వ్రాసిరి. క్రీ. శ. 1500 సంవత్సర ప్రాంతమునకు చెందిన అనంతభట్టు 12 స్తబకములు గల భారత చంపువును నిర్మించెను. 'చంపూభారత' మనునది దీనికి నామాంతరము. ఇది ప్రౌఢశైలీ విలసితము, శబ్దార్థాలంకారోపశోభితము, వృత్త వైవిధ్య ప్రయోగ భాసురము. కవికిగల శబ్దశాస్త్రాది పాండితీగరిమ కిది గీటురాయి.

'కల్యాణం వో విధత్తాం, వేతండరత్నం'... మీకు విఘ్ననాయకుడు శుభగు డగుగాక అను నాశీర్వచన పద్యముతో ఈ చంపు వారంభింపబడినది. ఈ కావ్యాంతమున కవి, స్వీయనానుమును, కావ్యనామమును, తద్గుణ గణమును ఇట్లు వివరించియున్నాడు:


“దిగంతరలుఠత్కీర్తి రనంత కవికుంజరః.
 ప్రాణైస్తుల్యం సరస్వత్యాః ప్రాణైషీ చంపుభారతం.
 ఉన్మీలదంబుజక దంబక సౌరభీణా
 మున్నృత్య దీశముకుటీతటినీ సఖీనాం
 ఆచాంత వైరియశసా మమృతోర్మిలానాం
 వాచామనంతసుక వేర్వసుధైవమూల్యం.

ఈ కావ్యమున ద్వితీయస్తబకమునందు గావింపబడిన ద్రౌపదీస్వయంవరాదిక వర్ణనము మనోహరము. చతుర్థ స్తబకమునందలి అర్జున తపోవర్ణనము సరసము. ఇందే. వరాహమునకై కలహించు విజయునకును శబరవేషమును ధరించిన శివునకును ప్రవర్తిల్లిన సంభాషణము నాటకీయము. పంచమస్తబకమున సరస్తీరమున విగత జీవులై పడియున్న సోదరులనుగాంచి ధర్మజుడు విలపించు పట్టు అత్యంత కరుణరసాత్మకము, షష్ఠస్తబకమున ద్రౌపదీసహితులై ధర్మజాదులు విరటుని సేవించువిధము సముచితముగ వర్ణితము. సప్తమస్తబకమున ఉత్తరుడు యుద్ధభీతిచే పలాయితుడగుట కుద్యమించు పట్టు హాస్య రసోదంచితముగ ప్రతిపాదింపబడినది. అష్టమస్తబకమున, ఆవిష్కృత ప్రభావుడగు శ్రీకృష్ణుని, మునిబృందము స్తుతించినవిధ మత్యుదాత్తము. నవమ - దశమ - ఏకాదశ - ద్వాదశస్తబకములందు భారతయుద్ధము వీరాదిరససంభరితముగ వర్ణింపబడినది.

ఉదా. విజయ శబర సంవాదఘట్టమున - అర్జునుడు శబరునితో :


అస్మి న్మమావసథ మాపతితే మమప్రా
గ్లక్షీకృతే శబర! యత్ప్రహృతం త్వయాతత్
శాపస్య వా౽థ ధనుషో౽సి వశేతథా౽పి
సోఢం మయాద్యతపసా చ భుజోష్మణా చ.
                                           చ. స్త. ప. 77

శబరుడు విజయునితో :


సందృశ్యతేఖలు తపస్తవ శుద్ధమేతత్
యజ్జంతు హింసనవిధౌ దృఢబద్ధకచ్ఛం
ఆస్తామిదం భుజబలంచ మృగాత్యయే౽స్మిన్
సాహాయ్యకం యదుపజీవతి మే శరస్య.
                                             చ. స్త. ప. 79

క్రోధావిష్టుడయిన అర్జునుడు మరల శబరునితో :


“యస్మాద్వనేచరకులాధమ ! జల్పసిత్వ
మేవం మనఃపులకయన్ స్వజనస్య దృప్తః


తస్మాదసంశయ ముపాంతజుషః కిరాత్యాః
తాటంక మేవ సహసే, న కపోలమిత్రం"

ఈ నాటకీయ సంభాషణ మెంతయు చిత్తావర్జకము.

ఈక్రింది ధర్మజ విలాపవర్ణనము సహజము, హృదయ విదారకము. కవికి గల కరుణరసపోషణ చాతురికి నిదర్శనము.


వీరా ! భవద్విపదిదేవపరంపరా౽పి
దూరేతరాం ప్రతిపరాన్నగిరాం ప్రవృత్తిః
హా ! హా ! దశేయ మిహవో౽ద్య కుతో౽వతీర్ణా
మా మంతరేణ భవతాం కిమిదం ప్రయాణం.

దైవం కఠోరచరితం దయయావిహీనం
మాద్రీసుతావహహ ! మాతృముఖానభిజ్ఞౌ
కందాంకురాణిచ ఫలానిచ భక్షయిత్వా
కాంతారసీమని మయా చరితుం నసేహే.

స్వయమవ్రణ ఏవ యో భవాన్
వ్రణమాధత్తహరస్య మస్తకే
వ్రణమాయుషి పార్థ ! తస్య తే
విదధాతిస్మ మృధం వినైవ కః.

వత్స! ద్వేషిని యుద్ధజీవనభుజ !
                ప్రఖ్యానిధే మారుతే !
కర్ణాకర్ణికయా నిశమ్య భవతా
                ప్రాప్తా మవస్థా మిమాం
శోకేనానిశ మేకచక్రనగరీ
                భాజాంచ బాష్పాయితం
స్వస్రీయై స్సహసౌ జలస్యచముదా
                కో౽ప్యేష కాలోహ్యభూత్ .

మయ్యవ్యసూనిహ విముంచతి యాజ్ఞ సేనీ
సా, శ్వాపదామిష మబుద్ధగతి ర్భవేన్నః
హా మాద్రి ! కుంతి ! యువయో ర్వనభూమి రేవ
పుత్రప్రసూతి విపదోః పదతాం ప్రపేదే.

రాజచూడామణి వ్రాసిన భారతచంపు వొకటి కలదని తెలియుచున్నది.

చంపూకావ్యమును స్వాభీష్ట దేవతామహత్త్వ ప్రశంసార్థమై ఉపయోగించిన కవులు పెక్కురు కలరు. అట్టి వారిలో జీవగోస్వామి యొకడు. ఇతని 'గోపాలచంపువు' మధురపదగుంఫసంశోభితము. ఇతడు క్రీ. శ. 1600 సం.ర ప్రాంతమునకు చెందినవాడు. కర్ణపూరకవి (1600) ఆనంద బృందావనమను చంపును రచించిన పండితుడు. ఇందలి శ్రీకృష్ణలీలా వర్ణనము లలిత లలితమును మనోహరమునై యున్నది. సుప్రసిద్ధ 'పారిజాతాపహరణ చంపువు' ను రచించినకవి శేషకృష్ణుడు (1600). మహాదేవుని అద్భుత పరాక్రమ కృత్యములను ప్రతిపాదించు 'నీలకంఠ విజయ' మను చంపువును నిర్మించిన మహాకవి నీలకంఠదీక్షితుడు (1637). ఇతడు కలా విమర్శకుడుగా, ఆలంకారికుడుగా, విఖ్యాతిగన్నవాడు. కవివిడంబనము. సభారంజనము, శాంతివిలాసము, వైరాగ్య శతకము, ఆనందసాగరస్తవము, శివోత్కర్షమంజరి, అన్యాపదేశ శతకము అను లలితఖండ కావ్యములను, శివలీలార్ణవము గంగావతరణము అను మహాకావ్యములను ఇతడు రచించెను. నీలకంఠదీక్షితుని 'నీలకంఠ చంపువు' అయిదాశ్వానముల మహాకావ్యము. ఇందు శివుని మహిమను ప్రశంసించుట తన నిశ్చయమై యున్నట్లు


దేవానా మపిదైవతం, గురుమపి
        ప్రాచాం గురూణామిహ
శ్రీమంతం మదనాంతకం కథమపి
        స్తోతుం కృతో నిశ్చయః.

అను శ్లోకపాదములచే తెలిపినాడు కవి. నవనీతము నాస్వాదించు శ్రీ విష్ణుదేవుని చరితమును కీర్తించుట సర్వకవిసాధ్యమనియు, విషభక్షకుడకు నీలకంఠుని కొనియాడుట తనబోటి కవులకు దుస్సాధమనియు కవి చెప్పెను. మరియు


దృష్ట్వా కౌన్తుభ మప్సరోగణమపి ప్రక్రాంతవాదామిథో
గీర్వాణాః కతివా నసంతి భువనే భారాదివః కేవలం
నిష్క్రాంతేగరలే, ద్రుతేసురగణే, నిశ్చేష్టితే విష్ట వే
మాభైష్టేతి గిరా౽౽విరాస ధురియో దేవస్తమేవస్తుమః.

అను శ్లోకమున శివుని పారమ్యమును కవి ప్రకటించెను. నీలకంఠ దీక్షితునిశైలి అత్యంతప్రౌఢము. ఉపమారచనా కౌశలమునకు అర్థ గాంభీర్యమునకు ఇతర ప్రశస్త కావ్యగుణములకు ఇతని కవిత్వము ఆలవాలమని ప్రసిద్ధి

కలదు. ఆ గుణములలో వక్రోక్తియను గుణము ప్రస్ఫుట మయినదని.


భూమ్నా భవంతి యత్రైతే గుణాస్సర్వే తథా౽పరే
నీలకంఠస్య వక్రోక్తిః సా ముగ్దేందుకలానిభా.

అను శ్లోక పాదములచే తేటపడుచున్నది. ఈ కావ్యారంభమునందలి


'వందే వాంఛితలాభాయ కర్మ కిం తన్న వేద్యతే'
కిం దంపతి మితి బ్రూయాముతాహో దంపతీ ఇతి'

అను శ్లోకము నీలకంఠదీక్షితుని వక్రోక్తి నైపుణ్యమునకు ప్రకృష్టమైన ఉదాహరణము. ఈ కావ్యమున, ద్వితీయా శ్వాసమునందలి విష్ణుస్తవము, తృతీయాశ్వాసమున, బృహస్పతి శక్ర శుక్రులతో గావించిన సంభాషణములు ప్రశస్తములు. విష్ణుస్తవోదాహరణము :


“అసాధారణ షాడ్గుణ్యం, అఖిలలోక శరణ్య మాలక్ష్య
సర్వప్రమాణ పరాయణం, భగవంతం నారాయణం,
అసకృత్ప్రణిపతన్, అసకృదుత్థాయ, బధ్నన్ శిరస్యం
జలిం, అసకృదావర్తయ న్ప్రణవం, అసకృదనుస్మరన్
పరతత్త్వం, అశ్రుపూర్ణైః లోచనైః అవిరలపుల
కాంకితైః, అంగకై రానందగద్గదైశ్చ వచోభిరిత్థ మస్తావీత్.

క్షంతారం సకలాగసాం, జడధియాం
            యంతార, మంతస్తమో
హంతారం, జగతా మనుత్తరపరా
            హంతాంకితోరస్థలం,
ఉద్యత్కౌస్తుభశోభ ముత్పలవనీ
            సచ్ఛాయ మచ్ఛా౽యత
స్నిగ్ధాపాంగతరంగ మైక్షిషి పరం
            బ్రహ్మా౽చ్యుతం శాశ్వతం
కింతర్కై రతి వక్రైః, కింఫలముపబృంహణైర్వివిధైః

అత్రైక్షిషి శ్రుతీనామాశయమహిరాజభోగశయనం'
అహో ! ధన్యోస్మి, ధన్యోస్మి (నీ. వి. చం. ద్వి. ఆ.) .

ఈ ప్రశస్త విష్ణుస్తవము కవికి గల శివకేశవా౽భేదభావమునకు తార్కాణము. ఎడ నెడ ఈ కావ్యమున, కవి, యాజ్ఞికుల కర్మపరతను, అనిత్యస్వర్గాది ఫలములందు వారికిగల వాంఛను అపహాసపూర్వకముగ ప్రదర్శించి యున్నాడు.

దైవజ్ఞ సూర్యపండితుడు 'నృసింహ చంపువు'ను రచించెను. ఇది ఉల్లాసచతుష్టయవిరాజితము, సరసము, ప్రహ్లాద చరిత మిందు సుందరముగ పొందుపరచబడినది. కవి వ్రాసికొనిన ఆత్మీయాంశము లాధారముగ, 'ఇతడు నాగనాథ ద్విజుని పౌత్రుడు, జ్ఞానరాజాభిధుని తనయుడు, భారద్వాజగోత్రజుడు, సంగీతాగమకావ్య నాటక పాండితీమండితుడు, గణితాగమప్రతరణకర్ణధారుడు, లక్ష్మీపతి ప్రీతికొర కీకావ్యమును రచించెను' అని తెలియుచున్నది. సంకర్షణపండితుడు వ్రాసిన 'నృసింహ చంపువు' మరియొకటి కలదు. గ్రంథావతారికను బట్టి ఈ కవి, మీమాంసాజన్మ భూమి, కవికులతిలకుడు, ప్రౌఢపండితుడు, నిఖిలన్యాయ సాంఖ్యాగమములకు ఖని, వేదాంతపారగుడు, శ్రీ నృసింహ ప్రసాదమున ఈ చంపువును రచించెను అని అవగతమగు చున్నది. అనంతుని పుత్రుడగు కేశవభట్టు వ్రాసిన నృసింహ చరిత్రము సుప్రసిద్ధమైనది. ఇతడు మాధ్యందినవేదపారగుడు, లౌగాక్షికులారవిందతరణి, మీమాంసాయుగతర్క తంత్ర చతురుడు, సాహిత్యరత్నాకరుడు అని తెలియు చున్నది. తిరుపతి వేంకటేశుడు నాయకుడుగా, పద్మినీ పరిణయాది కథలతో, వేంకటేశ చంపువును రచించిన కవి ధర్మరాజపండితుడు. ఇతడు 17 వ శతాబ్దివాడు. శివానుగ్రహము కారణముగా, మృత్యుముఖమున బడకుండ, మార్కండేయు డాత్మరక్షణ మొనర్చుకొనిన వృత్తాంతముచే నలరారు 'శివచంపువు'ను సంతరించిన పండితుడు కవి వాదిశేఖరుడు. శివమహత్త్వ ప్రతిపాదక మయిన 'శివలీలాచంపువు' ను వ్రాసిన విద్వాంసుడు విరూపాక్షకవి. శ్రీకృష్ణుని చరితమును మనోహరముగ ప్రతిపాదించు 'కృష్ణభూషణచంపువు' ను రచించిన పండితుడు నరసింహకవి. త్రిపురాసురసంహారకథ నాశ్రయించి, 'త్రిపుర విజయ చంపువు' ను గ్రథన మొనర్చిన బుధుడు నృసింహామాత్యుడు. 17 వ శతాబ్దాంతమున నున్న ఇతడు తంజావూరు ప్రభువగు ఏకోజీ మహారాజునకు మంత్రియై యుండెను. 'త్రిపుర దహనచంపువు' ను నిర్మించిన కోవిదుడు నిత్యామృతమతి అను కవి. సుబ్రహ్మణ్య జనన వృత్తాంతమును 'కుమారచంపువు' గా రచించిన కవి, రెండవ శరభోజిరాజు. ఇతడు తంజావూరు భోసల వంశ్యుడు. క్రీ. శ. 1800 సంవత్సర ప్రాంతమువాడు.

మహాపురుష జీవితములను ఇతివృత్తముగ గైకొని కొందరు సంస్కృత కవులు చంపూకావ్య రచన సల్పిరి. పూజ్యపాదులగు నాథముని, రామానుజాచార్యులు, వేదాంత దేశికులు మున్నగు మహాపురుషుల చరితములు చంపూకావ్యములై వెలసినవి. వల్లీ సహాయకవి 'ఆచార్య దిగ్విజయ' మను చంపువును రచించెను. ఇందు జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు, ఆనందగిరి ప్రభృతి శిష్యులను వెంటగొని, మధ్యార్జున క్షేత్రము మొదలుకొని కాంచీనగరము వరకు గల మహాక్షేత్రములను దర్శించి, ప్రతివాది మత నిరాకరణ పురస్సరముగ అద్వైతమత స్థాపన మొనర్చి దిగ్విజయమును గాంచినవిధ మత్యుదాత్తముగ వర్ణింపబడినది.

సంఘ విమర్శనవర చంపువులు : కొందరు కవులు సంస్కృత చంపువును సంఘ గుషదోష విమర్శనమునకు సాధనమునుగా గ్రహించిరి. తాదృశులలో శ్రీశైలం అన్యయార్యు డొకడు. ఇతడు కోనల వేంకటరాజు నాస్థానకవియై వరలెను. ఇతడు తత్త్వగుణాదర్శ చంపువును రచించెను. స్వీయ తమోగుణము కారణముగా శాంభవులు తత్త్వబోధమును పొందజాలరు. స్వీయ సత్త్వగుణము కారణముగా వైష్ణవులు తత్త్వావగతిని పొందుదురు అని ఈ చంపువునందు కవి తెలిపెను. కాంచీమండల వాసియగు వేంకటాధ్వరి (1650) బహుగ్రంథ నిర్మాతగా విఖ్యాతినొందెను. 'విశ్వగుణాదర్శ చంపువు' 'వరదాభ్యుదయ చంపువు', 'ఉత్తరచంపువు', 'శ్రీనివాసచంపువు' అను నాలుగు చంపువుల నీ కవి రచించెను. విశ్వగుణాదర్శ చంపు వీకవి కీర్తిసౌధమునకు మూలస్తంభము. ఇది యొక స్వతంత్రకావ్యము. ఇందు శ్లోకముల మధ్యనున్న గద్యము మిక్కిలి పరిమితమైనది. ఈ చంపువు 'శ్రీరాజీవాక్ష వక్షఃస్థలనిలయ రమాహస్త వాస్తవ్య లోలత్ ' అను నాశీర్వాద మంగళముతో నారంభింపబడినది. ఈ కవి రఘునాథదీక్షితుని కొడుకు, తర్క వ్యాకరణ మీమాంసా శాస్త్ర నిష్ణాతుడు, అని గ్రంథారంభమునందలి ...... 'శ్రీరఘునాథదీక్షితకవిః పూర్ణో గుణై రేధతే' 'తత్సుత స్తర్క వేదాంత తంత్రవ్యాకృతి చింతకః' అను శ్లోక పాదములచే అవగతమగుచున్నది. గ్రంథ కారణ మిట్లు నుడువబడినది. కృశాను విశ్వావసు నామకులగు నిరువురు గంధర్వులు ప్రపంచమును దిలకించుటకొరకు విమానా రూఢులై ఆకసమున సంచరించుచు, ఉత్తరమున బదరికాశ్రమము మొదలుకొని దక్షిణమున సేతుపర్యంతము గల ఘూర్జర - మహారాష్ట్ర - ఆంధ్ర కర్ణాట, పాండ్య చోళదేశములను, మహాక్షేత్రములను, పుణ్యనదులను, అయోధ్యా - కాశ్యాది నగరములను వీక్షించుచు నేగు చుందురు. కృశాను నామకుడు తావీక్షించిన ఆయాస్థానము లందలి దోషములనే ఆవిష్కరించును. విశ్వావసు నామకుడు ఆయా తావులందలి గుణములనే ప్రకటించును. ఇట్లీ గంధర్వు లిరువురును తమ సంచారమును ముగించుకొని స్వస్థానమున కేగుదురు. యాత్రాంతమున కృశాను నామకుడు-


దార్ఢ్యాయ గుణసమృద్ధేః
దూషణ భణితి స్సమస్తవస్తూనాం
అస్మాకముపనిబద్ధా
సిద్ధాంత స్యేవ పూర్వ పదోక్తిః.

అని నుడువును. కవియొనర్చిన ఆంధ్రకర్ణాటాది దేశ వర్ణనము మనోజ్ఞము.


“నిగమపాఠ నిరాకృత దుష్కృతాం
 నయవిదో బహవో౽త్ర ధరాసురాః
 ప్రతివసంతముపాత్త మఖాస్సుఖం
 ప్రతివసంతి ముకుందపరాయణాః"

అనుదానియందు కృష్ణాగోదావరీ నదీమధ్యగత దేశవాసులగు బ్రాహ్మణుల వేదాధ్యయనపరతను, నీతిసంపత్తిని, యజ్ఞనిర్వహణ ప్రీతిని శ్రీహరిచరణ సేవాసక్తిని కవి వర్ణించెను. అట్లే కర్ణాటదేశమునందలి సౌందర్యసౌభాగ్య సమృద్ధుల నిట్లు మన కన్నులయెదుట బెట్టినాడు కవి—


ప్రతినగర మహారామాః
ప్రత్యారామంపచేలిమాః క్రముకాః
ప్రసవాః ప్రతిక్రముకమ
ప్యుత్సరతి మధుతతిః ప్రతిప్రసవం.

ప్రతిమధుబిందు మిళిందాః
ప్రేంఖంతి ప్రతిమిళింద మారావాః
ప్రత్యారామం సుదృశాం
మదా ఉదారాః ప్రతిమదం మదనః.

మరియు ఆ కాలమునందలి కొందరు జ్యోతిశ్శాస్త్రవేత్తల అసమగ్ర పాండితిని, కపట స్వభావమును, వైద్యుల కృత్రిమవృత్తిని, రాజసేవాపరాయణుల నీచవృత్తిని, శిష్టాధ్యయనపరుల అసంతుష్టిని, ధనార్జనాసక్తిని కఠినముగ విమర్శించినాడు మహాకవి. అంబికావాసుదేవుల తనయుడును, 'విద్యాపతి' యను బిరుదముచే నలంకృతుడునునగుదత్తాత్రేయశాస్త్రి స్వీయ 'గంగాగుణాదర్శ చంపువు' నందు, ఇరువురు గంధర్వుల సంవాదరూపమున గంగానది యందలి గుణదోషములను ప్రదర్శించెను.

క్షేత్ర మాహాత్మ్య ప్రతిపాదకములయిన చంపువులు కొన్ని వెలసినవి. నీలకంఠుని 'కాశికాతిలకము' నందు, అవిముక్త పురమునకు వేంచేసియున్న శివు నన్వేషించు తలంపుతో, ఇరువురు గంధర్వులు కుబేరాజ్ఞప్తులై, మనుష్య రూపములను ధరించి, వివిధ క్షేత్రములను దర్శించి, తత్తన్మహిమాభివర్ణన మొనర్చిరి. 17 వ శతాబ్ది మధ్యభాగమున నున్న సమర్పుంగదీక్షితుని 'తీర్థయాత్రా ప్రబంధము'నందు వివిధక్షేత్రముల పావిత్య్రమహిమలు కీర్తింపబడినవి. ఈ కవి ఉత్తర ఆర్కాటు మండలము (జిల్లా) నందలి తిరువలంగడునందు నివసించెను. భారద్వాజ గోత్రుడగు సూర్యనారాయణుడు రచించిన 'శ్రుతకీర్తి విలాస చంపువు' నందు శ్రుతకీర్తి అను బ్రాహ్మణునిచే దర్శింపబడిన వివిధ పుణ్యక్షేత్రముల మహిమ ఉగ్గడింప బడినది. శంకరదీక్షితుని 'గంగావతార చంపూ కావ్యము'న గంగా వృత్తాంతము పొందుపరచబడినది.

దేశాభిమానమును బ్రకటించు చంపువులు కొన్నిరచింప బడినవి. 17 వ శతాబ్ది ఉత్తరభాగమున నున్న రామచంద్రదీక్షితు డాతని 'కేరళాభరణము' నందు, వసిష్ఠ విశ్వామిత్రుల చర్చారూపమున, భరతఖండమునందలి ప్రాంతములలో నెల్ల కేరళము శ్రేష్ఠమైనదని తేల్చినాడు. ఇది యొక స్వతంత్ర రచన. 17 వ శతాబ్దాంతమున నున్న వాడును, మాయావరప్రాంతమునందలి 'కిలయూరు' అను గ్రామమున వసించినవాడును నగు అప్పాధ్వరి తన 'గౌరీ మాయూర మాహాత్మ్య'మ ను చంపువునందు మాయావర గ్రామ ప్రాశస్త్యము నభివర్ణించెను.

కృష్ణకవి ప్రణీతమయిన 'మందారమరంద చంపువు' నందు ఛందో౽లంకారములకు ఉదాహరణములు కనిపించు చున్నవి.

ఆధునికములయిన చంపూకావ్యములు అల్పసంఖ్యాకములు కలవు. 'కుమారోదయము', 'దేవి విజయము' అను రెండు ఉత్తమ చంపూకావ్యములను రచించిన మహాపండితుడు కోరాడ రామచంద్రశాస్త్రి. ఈ కవి సుప్రసిద్ధ నామధేయుడు, సంస్కృతాంధ్ర సాహిత్య నిధి. విద్వత్కవి, ఆంధ్ర బ్రాహ్మణుడు. శృంగారసుధార్ణవము, ఘనవృత్తము, ధీసౌధము (వ్యాకరణ గ్రంథము), రామచంద్రీయము, బాలచంద్రోదయము, ఉపమావళి మున్నగు పెక్కు గ్రంథములను సంస్కృతమునను, అనేక గ్రంథములను ఆంధ్రమునను రచించి విఖ్యాతుడైనవా డీ కవీశ్వరుడు.

కుమారోదయమున 27 ఉల్లాసములు కలవు. వీటిలో 9 ఉల్లాసములే ముద్రితము లయినవి. ఉల్లాసాంతములగల


“శ్రీమత్కోరాడ వంశే
         సకల మునిజన శ్లాఘ్య కౌండిన్య గోత్రే,
సంజాతో లక్షణార్యః
         సుగుణ మణిఖనిః సుబ్బమాంబా చ సాధ్వీ
యం పూర్వం రామచంద్రం ......
          ...... సుతమజన యతాం.”

అను శ్లోకమునుబట్టి ఈ మహాకవి కౌండిన్యగోత్రు డనియు సుబ్బమాంబా లక్షణార్యుల జ్యేష్ఠపుత్రు డనియు విదిత మగుచున్నది.

కావ్యారంభమున :


అన్యోన్య ప్రణయాంభోధి సుధాకిరణ విభ్రమౌ
ప్రపంచ ప్రకృతీప్రత్నౌ ప్రణౌమ్యేకాం గదంవతీ.

అను నమస్కా రాత్మక శ్లోకము కలదు.

అనాహూతయై యజ్ఞమున కేగిన పార్వతి సమక్షమున శివుని దక్షుడు దూషించిన విధ మాతని గర్వాతి రేకమును సూచించుచున్నది.


ఉదా : వ్యాళాన్న కింహరతి జాంగలికో౽స్థిజాతం
         మాంసాశనో౽పి నవహ త్యథకిం నుతేన
         ప్రేతాలయే న విచరంతి ను జంబుకౌఘాః
         తేభ్యఃకిమంతర మభూత్ భువి భూతభర్తుః.

వరప్రదానాంతమున బ్రహ్మదేవుడు తారకాసురున కొసగిన ఉపదేశము కవికిగల రాజనీతిజ్ఞతకును, సరళవచన రచనా చాతురికిని తార్కాణము.


ఉదా : గోపయ హృదయ ఏవ విరోధవికారం, వికాసయ
         ప్రేమముకులం, మా విధేహిసతాం వృత్తిభంగం,


నా౽౽కర్ణయ సద్యస్సంభృత మాధుర్యాణి పరిణా
మా౽నర్థ ధుర్యాణి కుజన భాషణాని, సంపాదయ
సుజనానురాగం." (7 ఉ.)

ఇంద్రాదులు తారకాసురబాధితులై బ్రహ్మదర్శనార్థ మేగిరి. ఆ సమయమున వాడిన ముఖకాంతి గలవారి క్షేమాదికమును బ్రహ్మ పరామర్శించును. ఆ పట్టునందలి


బతవో వదనాని సాంప్రతం
సుతరాముజ్ఘిత నైజదీప్తితః
తపనాంశుపరీత దీధితేః
సితభానో రుపయాంతి దీనతాం.

అను పద్యము కాళిదాసీయ కుమారసంభవమునందు తాదృశ సందర్భమునందే కనిపించు


కిమిదం ద్యుతిమాత్మీయాం
న బిభ్రతి యథాపురా
హిమక్లిష్ట ప్రకాశాని
జ్యోతీంషీవ ముఖాని వః.

అను పద్యమునకు ప్రతిబింబమయి ఈకవి కవిత్వముపై ప్రసరించిన కాళిదాస కవితా ప్రభావమును వెల్లడి చేయు చున్నది. కవి రచన మిక్కిలి ప్రౌఢమును సరసమును సాలంకృతమునై వెలుగొందుచున్నది. సంస్కృత గద్య పద్యసంధానమున సవ్యసాచి ఈమహాకవి. ఆసూరి అనంతాచార్యులు 1868 వ సంవత్సరమున నిర్మించిన 'చంపూ రాఘవ' మొకటి కలదు. శొంఠి భద్రాద్రిరామశాస్త్రి (1856 - 1915) రచించిన 'శంబరాసుర విజయ' మను చంపువు పేర్కొనదగినది. ఈకవి ఉర్లాం, లక్కవరం జమీందారుల ఆస్థానపండితుడుగా నుండెను. ఇతడు గంగా రామయల తనూజుడు. పిఠావురనివాసి. వెలనాటివైదిక బ్రాహ్మణుడు. ఈ చంపువునందు కవి అనన్య సామాన్య మయిన సారస్వత కలా కౌశలమును ప్రదర్శించెను. క్రీ. శ. 1840 - 1900 వరకు గద్వాల సంస్థానమును పరిపాలించిన రాజా రామభూపాలుని విద్యాగురువులగు పురాణం దీక్షాచార్యులవారు 'రామాయణ చంపువు'ను నిర్మించినట్లు విదితమగుచున్నది. 20 వ శతాబ్ది పూర్వార్థమున నున్న మహాపండితులు కిళాంబి గోపాల కృష్ణమాచార్యులవారు వ్రాసిన 'శోభనాద్రీశవైభవ చంపువు' ప్రశస్తమైనది.

ఇట్లు సంస్కృత చంపూకావ్యరంగమున మహాకవుల హాటక లేఖినులు బహుముఖముల, బహువిధ చిత్రభూమికలతో, లీలానర్తన మొనర్చి, కావ్యజ్ఞుల చిత్తముల నాకర్షించినవి. సంస్కృతకవులు చంపూకావ్యమును ఉత్తమసాధనముగ గొని సాధించిన ప్రయోజనములు బహుళములు. సంస్కృత చంపూకావ్యములలో కొన్ని పరిణయకథాత్మకములై మతప్రచారోద్దిష్టములై పెంపు మీరినవి. చంపువులో అనేకములు, శ్రీమద్రామాయణ - భారత - భాగవతకథా ప్రతిపాదకములై, భక్తిబోధకములై, అశేషజనుల చిత్తములను చూరగొనినవి. శేషించిన చంపువులలో కొన్ని చరిత్రాత్మకములై, పెక్కులు అభీష్టదేవతామాహాత్మ్య ప్రతిపాదకములై, కొన్ని మహాపురుష జీవిత కీర్తనపరములై, కొన్ని సంఘసంకరణోద్దిష్టములై, కతిపయములు తీర్థ క్షేత్ర మహత్త్వ బోధకములై, అల్పసంఖ్యాకములు ఆయాకవుల దేశాభిమాన సూచకములై, ఆత్మీయకథాంశద్యోతకములై, ఛందో౽ లంకారోదాహరణాత్మకములై, శోభిల్లినవి. వాద్యకలామిశ్రితగీతివలె సరససాలంకార గద్యపద్య సమ్మిశ్రితమైన చంపూకావ్యము, భిన్నరుచి విశిష్టులగు పాఠకుల కెల్లరకును ఏక సమారాధక మైనది. (గద్యానుబంధరసమిశ్రిత పద్యసూక్తిః, హృద్యాహివాద్యకలయా కలితేవ గీతిః-భోజుడు) కావుననే సంస్కృత చంపూకావ్యము


'ఉదాత్త నాయకో పేతా
గుణవద్వృత్తముక్తకా
చంపూశ్చ హారయష్టిశ్చ
కేన నక్రియతే హృది. (నల. చం. ఉ. 1. శ్లో. 14)

అనురీతి విద్వత్ప్రశంసకు పాత్రమైనది.

గ. ల.


చతురంగబలములు - 1:

భారతదేశమునందలి రాజనీతి చతురుపాయవిశిష్టమైనది. సామదాన భేద దండము లనునవి చతురుపాయములు. ఇచటి 'దండ' శబ్దమునకు 'సేన' అని అర్ధము. యుద్ధఫలకములగు రాజకార్యములలో 'సేన' అనునది చివరి ఉపాయము . అట్టి సేన - భారతీయ దండనీతి దృష్టితో రథ - గజ - తురగ - పదాతులను నాలుగు అంగములతో కూడియుండును. వాటికే సేనాంగములు,

చతురంగములు అని పేళ్లు గలవు. ప్రాచీన భారత సేనావ్యవస్థను గూర్చి ఆలోచించినపుడు, చతురంగ బలమును గూర్చి ఆలోచింపదగియున్నది.

మన దేశమున 'చదరంగము' అను నొక క్రీడా విశేషము మిక్కిలి ప్రచారములోనున్నది. 'చదరంగ'మను శబ్దము 'చతురంగ'మను దానికి వికృతి. అనగా చదరంగ మనునది 'చతురంగ' సంబంధమగు ఆట యని ఏర్పడ గలదు. అనగా యుద్ధసంబంధమయిన బుద్ధి కౌశలము వృద్ధియగుటకుగా నేర్పడిన క్రీడయని చెప్పవచ్చును. కాని 'చతురంగబల'మను సేనావ్యవస్థ శ్రీమద్రామాయణ మహా భారతములలో కానవచ్చుచున్నదే కాని, అంతకు పూర్వపు వేదాదులలో కానరాదు. మరియు చతురంగ క్రీడనుగూర్చి వేదాదులలో తరచుగా ప్రశంసింపబడి యున్నది. ఇట్లు వేదసిద్ధమైన చతురంగక్రీడా ప్రశంసలచే దానిననుసరించియే తర్వాత రామాయణాది కాలముల నాటికి చతురంగ సేనావ్యవస్థ చక్కగా నిర్మింపబడి యుండు నని చరిత్రకారులు భావించుచున్నారు. కొందరు చతురంగబలమును నిర్వహించు విధానమును ಬట్టియే చదరంగమను ఆట రూపొందించబడి యుండుననియు నూహించుచున్నారు. కాని ఈ రెండు ఊహలలోను రెండవదియే ఎక్కువ సహజముగా, సమంజసముగా కనబడుచున్నది. చదరంగము నందలి రాజు, మంత్రి, రథ గజ తురగ పదాతులు ఆ ఆటకు అంగములుగా నుండవలెనన్నచో, అట్టి వ్యవస్థ తత్పూర్వము లేకున్నయెడల, ఆ చతురంగక్రీడకే - ద్యూతక్రీడకే - అవకాశ మేర్పడి యుండెడిది కాదు. ఈ ఆట చతురంగబల విధానమునకు అనుకరణ రూప మగుటవలన, దానిచే అనుకార్యమగు చతురంగ సేనావ్యవస్థ తత్పూర్వమే అవతరించియుండును. ఇట్టి ఊహకు కారణము వేదములలోని ద్యూతప్రశంసయై యుండును.

చతురంగముల విషయమున మరొక్క వాదముగూడ కలదు. సేనయందలివి చతురంగములా, షడంగములా, యను మీమాంసయు శాస్త్రమున కానవచ్చుచున్నది.


'ఏతన్మౌలాది షడ్భేదం, చతురంగబలం విదుః
షడంగం మంత్రకోశాభ్యాం పదాత్యశ్వరథద్విపై "
                                        (కామ. 19-24)

అని పయి చతురంగములతో మంత్ర - కోశములు కూడి షడంగములుగా లెక్కింపబడినవి. అట్లే—


"రథా నాగా హయాశ్చైవ
        పాదాతాశ్చైవ పాండవ !
విష్టి ర్నావశ్చరాశ్చైవ
        దేశికా ఇతి చాష్టమః
అంగాన్యేతాని కౌరవ్య !
        ప్రకాశాని బలస్యతు"
                      (భార. శాంతి.)

అని సేన అష్టాంగముగా పేర్కొనబడినది. కాని మొదటి చతురంగములు సాక్షాత్తుగా సేనారూపములై యొప్పుటచే వాటినే తచ్చతురంగములుగా భావించుట న్యాయము. తర్వాతి చతురంగములు - విష్టి, నావలు, చారులు, దేశికులు అనునవి గాని, మంత్రకోశములు అను రెండంగములు గాని, తత్సహాయరూపములే అగుటచే వాటిని గూర్చిన విచారణ అప్రస్తుత మగుచున్నది.

రథబలము : చతురంగబలములలో అతిప్రాచీనకాలము నుండియు, భారతదేశమున రథబలము ఒక ముఖ్య మయిన సేనాంగముగా భావింపబడుచున్నది. ఆ కాలమున సాధారణముగా ఉత్తర భారతదేశము అరణ్యా క్రాంతముగా నుండుటవలననే కాబోలు, ఆరూఢులగు సైనికులు గల సేనతో యుద్ధములు జరుగుచు వచ్చెనని చరిత్రకారులు భావించినారు. అందుచేతనే వారికి రథములు, ఏనుగులు, గుఱ్ఱములు, ఆరోహించుటకు ఆవశ్యక సాధనములుగా నుండినవి. వాటిలో రథములకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. అవి గొప్ప శిల్పులచే నిర్మితము లయి, దృఢచక్రములు గల్గి మంచి గుఱ్ఱములచే పూన్పబడి సుధ్వజ–సుపతాకలతో నలరారి, సమస్త యుద్ధపరికరములతో గూడి, రథి-సారథులతో యుక్తములై ఉండెడివి. రథములనుగూర్చి సంహితలలోను, బ్రాహ్మణములలోను, పెక్కుచోట్ల ప్రశంసలు కానవచ్చుచున్నవి. మరియు, అందే, 'రథ - సారథి - రథ కార' శబ్దములును ఉండుటచే రథములను నిర్మించు శిల్పిజాతియు ఒకటి యున్నట్లు తెలియగలదు. మొట్టమొదట రథియే రథమును నడపుకొనుచు యోధుడుగా వ్యవహరించెడివాడట. ఐతరేయ బ్రాహ్మణ కాలమునుండియు, రథి యోథుడుగను, సారథి వేరుగను ఏర్పడి రథయుద్ధములు జరుగుచుండెడివట. మెగస్తనీసు వ్రాతలనుబట్టి క్రీ. పూ. 4 వ శతాబ్దినాటికి రథములలో ప్రధానరథితోపాటు మరియు ఒకరిద్దరు యోధులుండి అతనికి సహాయముగా యుద్ధము చేయు చుండెడివారని తెలియుచున్నది.

భారతదేశపు యుద్ధములలో రథమునకు గల ప్రాముఖ్యము అర్థశాస్త్రమున విశేషముగా చెప్పబడినది. రథస్థు డగు ఒక్క యోధుడు చాల తేలికగా శత్రుసైన్య భాగముల నెదుర్కొని చెదరగొట్టగలడు. త్వరత్వరగా తన సైన్యమును పురికొల్పి తన వెంటతీసికొనిపోయి పర సేనపై పడగలడు ! ఒక్కొక్క రథమును 10 నుండి 50 వరకు ఏనుగులు వెంబడించి యుద్ధములో పాల్గొనుచుండెడివి ! సాధారణముగా అతి ప్రాచీనకాలమునుండియు యోగ్యములగు గుఱ్ఱములనే రథములకు ఉపయోగించుచుండిరి. రానురాను అట్టివి లభింపమిచేతనో యేమో, మెగస్తనీసు కాలమునాటికి ఒక్కొక్కప్పుడు అనగా యుద్ధభూమికి రథములను తీసికొనిపోవునప్పుడు ఎద్దులను, యుద్ధములలో గుఱ్ఱములను ఉపయోగించెడివారు. అంతేగాక కొన్ని రథములను ఎద్దులే లాగెడివి. కొన్ని యెడల ఖరములను గూడ ఉపయోగించెడివారు. 'సమారు రోహానితుల్య వేగం రథం ఖరశ్రేష్ఠ సమాధియుక్తం, (రా.యు. 73 స.) అని ఇంద్రజిత్తు ఖరయుక్తమగు రథమును ఉపయోగించినట్లు తెలియుచున్నది. ఈ పద్ధతి - అనగా వృషభములు, ఖరములు మొదలగువాటిని రథములకు పూన్చుట-బహుళముగా తగిన ఉత్తమాశ్వములు లేనప్పుడు అమలులోనికి వచ్చియుండు నని తలపవచ్చును.

ఇట్టి రథములలో పెక్కు విధములు కలవు. వేగముగా పోవు చక్రములు గల ఇనుపరథము 'శుక్రనీతిలో ' పేర్కొనబడినది. అట్టిదే ఒక పొడవైన రథము 'హరివంశము' లోను వర్ణింపబడినది. సాధారణముగా శ్వేత చ్ఛత్రముతో గూడిన రథములు ఉత్సవాదులలోను, తదితరములు యుద్ధములలోను ఉపయోగింప బడెడివి.

ప్రతి రథమునకును, వెనుక భాగమున ఒక ధ్వజము లేక కేతువు పొడవైన ఒక యష్టిక కమర్పబడి బంధింప బడెడిది. ఆ ధ్వజముపై మృగములు, వృక్షములు, పుష్పములు మొదలగు వాటిలో ఒక చిత్రము గోచరించును. అది ఆ రథికి ప్రత్యేక చిహ్నముగా నుండెడిది. రథబలమున కాధ్వజమే జీవము. కనుకనే దాని పేరిట సేనకు 'ధ్వజిని' అను పేరు వచ్చినది. మరియు శత్రువు రథయుద్ధములో, మొట్టమొదట ధ్వజమునే పడగొట్టుటకు ప్రయత్నించెడివాడు. దానితో అతడు పరాజితు డైనంత నిరుత్సాహము చెందును. అతని సైన్య మదిచూచి చెల్లా చెద రగును. ఆ శత్రువా సమయమును గమనించి అతనిపై విజృంభించును.

భారతీయ యుద్ధశాస్త్రమున రథ స్వరూప మిట్లు వర్ణింపబడినది. అది ఎత్తులో 10 పురుషుల ప్రమాణమును, వెడల్పులో 6 నుండి 12 పురుషుల ప్రమాణమును గల్గి యుండును. వాటిలో 6 రథభేదములు గలవు. వాటిలో 3 సాంగ్రామికములు (యుద్ధములో ఉపయోగించునట్టివి). అట్టివాటిలో రథారోహణ శిక్షణయందు ఒక్కటియు, శత్రువు నెదుర్కొనుట కొక్కటియు, యుద్ధమధ్యమున అవసరమైనప్పు డొక్కటిగా నుపయోగింతురు. కడమవి వివాహోత్సవాదులలో ఉపయోగింతురు. రథములలో రెండు చక్రములు, నాల్గు చక్రములు, ఎనిమిది చక్రములు గలిగి వివిధములుగా నున్నట్లు కానవచ్చుచున్నది. రథియొక్కయు, సారథియొక్కయు, రథాధ్యక్షుని యొక్క యు, రథ నిర్మాణ పద్ధతుల యొక్కయు వివరములు వర్ణింపబడి యున్నవి.

అతి ప్రాచీనకాలమునుండి అమలులో నున్న రథబల సంప్రదాయము క్రమక్రమముగా క్షీణించుచు వచ్చినది. బాణుని హర్షచరిత్ర నాటికి రథముల ప్రశంసయే కానరాదు. రథములతోడి యుద్ధము ఒక్కొక్కప్పుడు ప్రమాద భరిత మగుటయే అందుకు కారణము కానోపును. భూమి సమముగా లేక ఎగుడుదిగుడుగా నుండునప్పుడు, వర్షాదులవలన బురదగా నున్నప్పుడు, రథవేగము మందగించును. అది శత్రు విజయమునకు తావిచ్చును. మరియు ప్రాచీనకాలపు రథ నైపుణ్యము తగిన శిక్షకులు లేక సన్నగిల్లి యుండవచ్చును. అట్లే దక్షిణభారతమున చోళుల చరిత్రలోగూడ వారి సేనల విషయమున రథప్రశంస లేదు. అనగా ఆ కాలమునాటికే రథములు ఉపయోగించు వాడుక తొలగిపోయినదని చెప్పవచ్చును.

గజబలము : సేనలో తర్వాతి ప్రముఖ స్థానము వహించునది గజబలము. భారతదేశములో చాల ప్రాచీన కాలము నుండియు శాంతి సమయములలో వాహనముగను, యుద్ధ సమయములలో తదంగముగను ఏనుగు ఉపయోగపడు చుండినది. ఋగ్వేదమున రెండేనుగులు ఎదురుమళ్ళుగా నిల్చి తలలు వాంచి శత్రువు నెదుర్కొన పరుగిడినట్లు వర్ణింపబడినది. దానినిబట్టి అంత ప్రాచీనకాలముననే ఆర్యులు ఏనుగును యుద్దసాధనముగా ఉపయోగించెడి వారని ఏర్పడుచున్నది. యజుర్వేద కాలమునాటికి గజబలము బాగుగా వాడుకలోనికి వచ్చినది. ఇంక ఐతిహాసిక కాలముమాట చెప్పనే అక్కరలేదు. అర్థశాస్త్రమున గజబల ప్రక్రియను గూర్చి చక్కగా ఉపదేశింప బడినది. భారతదేశమున గజశిక్ష, హ స్తి శాస్త్రము - అను శాస్త్రములు అవతరించి, గజబల విధానమునకు దోహదము చేసినవి.

గజములలో -'భద్రో మంద్రో మృగో మిశ్ర, శ్చతస్రో జాతయో గజే' అని నాల్గుజాతులు పేర్కొనబడినవి. ఈ విషయమే


భద్రైర్మంద్రై ర్మృగైశ్చైవ.
        భద్రమంద్ర మృగై స్తథా
భద్రమంద్రై ర్భద్రమృగై
        ర్మృగమంద్రైశ్చ సా పురీ.
                           (రా. బా. 6 స.)

అని వివరింపబడినది. మరియు 'వింధ్యపర్వత జై ర్మత్తైః... మాతంగైః పర్వతోపమైః' అని అవి వింధ్యపర్వతమున బుట్టి కొండలవలె నున్నట్లు వర్ణింపబడినవి. అట్లే ‘కులీనాన్రూపసంపన్నాన్... నిష్ఠి తాన్గజశిక్షాయా, మైరావతసమాన్యుధి (రా. సుం. 7 స.)' అని వాటి కులీనత్వమును, రూపసంపన్నతయు, శిక్షార్హతయు తెలుపబడినవి. మరియు,


'బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః
         శూద్ర శ్చేతి చతుర్విధాః
వర్ణా గజేషు విజ్ఞేయా
         స్తేషాం లక్షణముచ్యతే'
                       (హరిహర చతురంగము)

అని గజములలో బ్రాహ్మణాది వర్ణభేదములును సలక్షణముగా ప్రతిపాదింప బడినవి. వీటి అన్నిటినిబట్టి గజశాస్త్రము భారతదేశమున ఎంతటి అభివృద్ధిని చెందెనో ఊహింపవచ్చును.

యుద్ధోపయోగకరములైన గజములు, ఉపస్థానము - కంచెలు, మిట్టలు దాటుట; సంవర్తనము - కూర్చుండుట, గుంటలు, పల్లములు దాటుట; సంయానము - సమవక్ర రీతులతో పోవుట; వధావధము - యుద్ధభూమిలో గుఱ్ఱములను, పదాతులను కాలితో త్రొక్కుట; హస్తియుద్ధము - ఏన్గులు పరస్పరము పోరాడుట; నాగరాయణము – నగరద్వారములను, భవనములను కూలద్రోయుట; సాంగ్రామికము - యుద్ధ ప్రక్రియలలో పాల్గొనుట వంటి శిక్షాప్రక్రియలు, నేర్పబడి సుశిక్షితము లగును. మావటివాడు అంకుశము ధరించి కుంభస్థలముపై కూర్చుండి, నడపుచుండగా, గజబలము యుద్ధములలో ప్రవర్తించును. అగ్నిపురాణమును బట్టి ఆరుగురు యోధులు - ఇద్దరు విలుకాండ్రు, ఇద్దరు ఖడ్గధారులు, ఇద్దరు గదాధారులు- ఒక్క ఏనుగుపై కూర్చుండి యుద్ధము చేయుచున్నట్లు విదితమగు చున్నది. తర్వాతి గజశాస్త్రములను చూచిన యెడల, అట్టి సంఖ్య నిర్బంధము లేనట్లే కానబడును.


“జలే స్థలేచ దుర్గేచ.
       శాఖిభిః సంకటే తథా
సమేచ విషమేచైవ
       జయో నాగవతాం ధ్రువం”
                           (హ. హ. చ.)

అన్నట్లు జలస్థల ప్రదేశములలో గాని, దుర్గారణ్య ప్రదేశములలో గాని, సమవిషమ ప్రదేశములలోగాని, గజబలమును ఉపయోగించి జయము సాధింపవచ్చును. శత్రుసైన్యములోనికి నిర్భయముగా చొచ్చుకొని పోవుచు దానిని చెదరగొట్టుటకును, తనసైన్యపు టిరుపార్శ్వములను పెట్టనికోటవలె నుండి రక్షించుటకును, శత్రుదుర్గములను ధ్వంసము చేయుటకును, జలవనాది దుర్గముల నవలీలగా అతిక్రమించుటకును, గజసేన సర్వదా ఉపయోగపడు చుండెడిది. గజబలాధిక్యమును బట్టియే మన ఆంధ్ర రాజులలో గూడ 'గజపతులు' అనువారు కానవచ్చు చున్నారు.

అశ్వబలము : సేనలో గజబలము తర్వాత ముఖ్యమైనది అశ్వబలము. యుద్ధములో గుఱ్ఱమును ఉపయో గించు వాడుక అథర్వ వేదకాలమునుండియు తెలియు చున్నది. శ్రీమద్రామాయణమున -


'కాంభోజవిషయే జాతై ర్బాహ్లికైశ్చ హయో త్తమైః
వనాయుజైర్నదీజైశ్చ, పూర్ణా హరిహయోత్తమైః'
                                              (రా. బా. 7 స.)

అని గుఱ్ఱములు కాంభోజ - బాహ్లిక -వనాయు-సింధు దేశములలో పుట్టినట్లును, అవి భారతదేశమున ఉపయుక్తము లైనట్లును తెలియగలదు. కాని భారతదేశమునందలి అశ్వజాతియంతయు విదేశీయ మనుట న్యాయముకాదని కొందరభిజ్ఞులు అభిప్రాయ పడుచున్నారు. సేనలో అశ్వ సేనయొక్క ఆవశ్యకతనుగూర్చి చెప్పుచు -'యస్యాశ్వాస్తస్య మేదినీ' - (అశ్వబలము గలవానిదే భూమి) అనియు-


'శక్య మశ్వసహస్రేణ కృత్స్నాం జేతుంవసుంధరాం
న యచ్ఛక్యం గజైర్జేతుం పత్తిభిర్వా ప్రహారిభిః'
                                           (హ. హ. చ. 3.)

అన్నట్లు గజపదాతి బలములచే జయింపరాని దెల్లను అశ్వబలముచే గెలువవచ్చుననియు, చెప్పబడుటచే దాని ప్రాశస్త్యమును సులభముగా గుర్తింపవచ్చును.

ప్రాచీన భారతమున అశ్వశిక్షనుగూర్చి తెల్పు శాస్త్రములు పెక్కులున్నట్లు తెలియనగుచున్నది. అశ్వాయుర్వేదము, అశ్వశాస్త్రము, అశ్వచికిత్సితము మొదలగునవి లక్షణ ప్రకాశములో పేర్కొనబడినవి. వాటినిబట్టి అశ్వబలమును గూర్చిన విశేషాంశము లెన్నియైనను తెలియవచ్చుచున్నవి.

అశ్వదళమునందు చేర్చుకొనునప్పుడు గుఱ్ఱముయొక్క వయస్సు, బలము, పరిమాణము, సలక్షణత మొదలగు నంశములు విచారించి స్వీకరించెడివారు. పరిపాలనాంగమున అశ్వరక్షణమున కొక శాఖయే యున్నట్లు అర్థశాస్త్రము చెప్పుచున్నది.


'తతః సంనోదయామాస,హయా నాశు త్రిహాయనాన్'
                                              (మ. భా. ద్రో. ప.)

అన్నట్లు అభిమన్యుని గుఱ్ఱములు మూడేండ్ల వయస్సు గల్గిన వని చెప్పబడినది. యుద్ధాశ్వమునకును రథాశ్వమునకును భేద మున్నట్లు కన్పట్టును. గుఱ్ఱములకు, ఏనుగులకు వలెనే ప్రత్యేకముగా పేర్లు పెట్టుకొని వ్యవహరించు వాడుక యున్నది. ఆశ్వికుడు (గుఱ్ఱపు రౌతు) దానిపై నెక్కి, తన చేతిమణికట్టున కొక కొరడాత్రాడు కట్టుకొని కూర్చుండి దానితో అవసరము కల్గినప్పుడు అదలించు చుండును. అందుకే అతని చేతులు వట్టివిగా నుండి, ఖడ్గ -బాణాది—ప్రయోగములను నిరాటంకముగా నిర్వహింప గలవు. 'రౌతులు అశ్వశిక్షలో యుద్ధప్రక్రియ లన్నియు నేర్చి, శత్రుసేనలను సూటిగా నెదుర్కొనుటకును, పారిపోవువానిని వెంటాడుటకును, తన సైన్యపు పార్శ్వములను రక్షించుకొనుటకును, యుద్ధవార్తలను దేశమందంతట రహస్యముగా చేరవేయుటకును, శత్రుసేనను చీల్చి త్రోసికొని చెండాడుటకును అశ్వసేన నుపయోగింతురు. దుర్గారణ్యమందలి సేనారక్షణమున కీ అశ్వదళ మెంతో ఉపయోగకారి. ఎందుకు? వేగ - సాహస మవసరమగుపట్ల అశ్వదళమే విజయసాధకమని భారతీయులఅభిప్రాయము.

పదాతిబలము : ఇక సేనకు నాల్గవ అంగము పదాతి బలము. దీనినే మనము 'కాల్బలము' అందుము.


“సేనా పదాతిబహులా, శత్రూన్ జయతి సర్వదా”
                                             (అగ్నిపురాణము)

అన్నట్లు పదాతిబలపు ప్రాశస్త్యము చెప్పబడినది. మరియు


“యుధ్యంతే పత్తయస్సర్వే ప్రజ్ఞయైవ స్వకీయయా"
                                                    (హ. హ. చ )

అనుటచే పదాతులు గజాది బలమువలె గాక తమ సొంత ప్రజ్ఞచే ప్రవర్తించి జయము సాధింపగలరు. రథాదిబల ముపయోగింపని -


“దుర్గయుద్ధే రాత్రియుద్ధే, ప్రశస్యంతే పదాతయః
యత్రగంతుం వనే, శైలే, పత్తయ స్తత్ర యోధినః"
                                               (హ. హ. చ.)

అన్నట్లు దుర్గ, వన, పర్వత యుద్ధములలోను, రాత్రి యుద్ధమునందును, పదాతిబలమే శ్రేష్ఠమని చెప్పదగును. అట్టి పదాతిసైనికులు, మౌలసైనికులు (ఆనువంశికముగా నుండువారు), భృతసైనికులు (వేతనమునకై చేరినవారు), శ్రేణీసైనికులు (ప్రజాసంఘముల నుండి వచ్చి చేరినవారు), మిత్రసైనికులు (సామంతాదులచే పంపబడిన వారు), అమిత్రసైనికులు (శత్రు సేనను విడిచివచ్చి చేరినవారు). ఆటవిక సైనికులు (అడవిజాతులవారు) అన్నట్లు వివిధరీతులుగా ఆ బలములో చేరి యుద్ధ మొనర్తురు. వారును తగిన శిక్షణమును పొంది తగిన పరిపాలనాశాఖ క్రిందనుండి సాహసోపేతులై యుద్ధము గావించుచుందురు. కూపతీర్థాదులను శోధించుట, శిబిర సన్నివేశములకును, శత్రుస్థావరములయొక్కయు మార్గముల నన్వేషించుట, గుడారముల నిర్మాణము, కోశాగారము, ఆయుధాగారము, ధాన్యాగారము మొదలగు వాటిని రక్షించుట, వ్యూహాదులను రచించుట, మొదలగునవి పదాతి కర్మలని చెప్పబడినది.

ఈ పదాతులే ముఖ్యముగా ఆ యా కాలములలో అమలులోనుండిన ఆయుధములను ధరించి అందు సుశిక్షితులయి యుందురు. శిరస్త్రాణము, కవచము, కత్తి, డాలు మున్నగు రక్షక పరికరములను ధరించి, యుద్ధాలంకార శోభితులయి, వీరాలంకరణములు కలవారై, తారసిల్లుదురు ! వారు -


'బలవంతస్సత్త్వవంతో, మర్మజ్ఞాః సూక్ష్మవేధినః,
యుద్ధ భూమి విభాగజ్ఞా, దుర్లభాస్తే పదాతయః
                                                (హ. హ. చ.)

అని బలసత్త్వవంతులును, మర్మజ్ఞులును, సూక్ష్మవేధులును, యుద్ధభూమి విభాగజ్ఞులునగు పదాతులు దుర్లభులని యుద్ధశాస్త్రము !

ఇట్టి రథ - గజ - తురగ - పదాతులు అను చతురంగబలములతో గూడిన సేన ప్రాచీన భారతదేశమునందలి యుద్ధభూముల నలంకరించినది.

బలవివరణము : భారతీయులు రథ - గజ - తురగ - పదాతి దళములను, పత్తి సేనాముఖము, గుల్మము, గణము, వాహిని, పృతన, చమువు, అనీకిని, అక్షౌహిణి అని తొమ్మిది విధములుగా విభజించిరి. పత్తియను విభాగము నందు ఒక రథము, ఒక గజము, మూడశ్వములు, అయిదుగురు కాలిబంట్లు ఉందురు. 3 పత్తులు, ఒక సేనా ముఖము; 3 సేనాముఖములొక గుల్మము; 3 గుల్మము లొక గణము; 3 గణములొక వాహిని; 3 వాహిను లొక పృతన; 3 పృతనలొక చమువు; 3 చమువులొక అనీకిని; 10 అనీకినులు ఒక అక్షౌహిణి అనబరగును. ఈ విభాగములు ఈ కాలమునందలి బెటాలియనులు, రెజిమెంట్లు, కంపెనీలు - ఇత్యాది సేనావిభాగములను పోలియున్నవి.

ఇక ఈ లెక్కప్రకారము ఏ యే సైనిక విభాగ బల మెట్లుండునో దిగువ చూపబడినది :

పటాలము పేరు రథములు గజములు అశ్వములు పదాతులు
1. పత్తి 1 1 3 5
2. సేనాముఖము 3 3 9 15
3. గుల్మము 9 9 27 45
4. గణము 27 27 81 135
5. వాహిని 81 81 243 405
6. పృతన 243 243 729 1215
7. చమువు 729 729 2187 3645
8. అనీకిని 2187 2187 6561 10935
9. అక్షౌహిణి 21870 21870 65610 109350

ఈ తొమ్మిదింటిలో అన్నిటికంటె చిన్నది "పత్తి" అను పటాలము. అన్నిటికంటె పెద్దది అక్షౌహిణి అనునది. ప్రతి పటాలమునకు ఒక అధిపతి యుండుచుండెను. ఆ అధిపతులను పత్తిపాలకుడు, సేనాముఖుడు, గౌల్మికుడు, గణపతి, వాహినీపతి, పృతనాపతి, చమూపుడు, అనీకినీపతి, అక్షౌహిణీపతి అనుచుండిరి. అనీకినీపతి మహాభారతములో సేనాప్రణేతరుడుగా పేర్కొనబడినాడు. వీరందరు సమర పండితులు. కౌరవుల పక్షమున 11 అక్షౌహిణుల సైన్యము, పాండవులకు 7 అక్షౌహిణుల సైన్యము ఉన్నట్లు మహాభారతము తెలుపుచున్నది. ప్రాచీన హిందువుల ఈ సేనావిభాగ పద్ధతి వారి కుశాగ్రబుద్ధికి, సేనావ్యవస్థా ప్రణాళికా విధానమునకు తార్కా ణముగా నుండగలదు.

చతురంగబలములను నడిపెడు ముఖ్యయోధుడు వైదిక వాఙ్మయములో 'సేనాని' అనబడెను. 'సేనాని' అను పదము తరువాత 'సేనాపతి' అను పదముగా మారెను. సేనాపతికి తరువాత పేర్కొనదగిన యుద్ధాధికారి సేనా ప్రణేతరుడుగా చెప్పబడెను. ఇతడు దండనాథు డనియు వ్యవహరింపబడెను. ఈ ఇద్దరిలో ఒక్కొకడు ఒక అక్షౌహిణీ సైన్యమునకు అధిపతిగా నుండు చుండెను. ఈ సేనాపతులలో నుండి ఒకడు నాయకాగ్రేసరుడుగా ఎన్నుకొనబడు చుండెను. ఇట్టివానిని 'మహా సేనాపతి' అను ప్రముఖనామముతో పేర్కొనుచుండిరి. ఇట్టి అధికారిని విజయనగర సమ్రాట్టులు 'సర్వసైన్యాధికారి' అనిరి.