సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చంద్రుడు
చంద్రుడు :
చంద్రుడు మన భూగోళము చుట్టును తిరుగు ఒకే ఒక ఉపగ్రహము. సూర్యకుటుంబములో చంద్రుడు ఒక గ్రహము. చంద్రగ్రహమును నవగ్రహములలో నొకటిగా మనము పరిగణించుచున్నాము. సూర్య కుటుంబములో నున్న ఉపగ్రహము లన్నిటిలో చంద్ర గ్రహము పెద్దది. అనాదినుండియు ఖగోళపదార్థములలో సూర్యుని తరువాత చంద్రగోళము మనకు చాల సుపరిచితమైనదేగాక, ఖగోళశాస్త్రజ్ఞుల దృష్టిని గూడ మిగుల నాకర్షించినది. చంద్రుడు చూపులకు ఎంత కాంతిమంతమైన గోళముగా కనబడుచున్నను, మానవచరిత్రలో ఆదినుండియు చంద్రుని గూర్చి పురాణగాథలు, మూఢ విశ్వాసములు అనేకములుగా నున్నను, నిజమునకు ఆకాశమందున్న విస్తార ఖగోళపదార్థములలో చంద్రగోళము ప్రాముఖ్యములేని ఒక చిన్న గోళము.
చంద్రుని ఉత్పత్తిని గురించి ఖగోళ శాస్త్రజ్ఞులలో రెండు విధములుగు సిద్ధాంతములున్నవి. మొదట సూర్య కుటుంబము ఏర్పడినప్పుడే 400 కోట్ల ఏండ్ల క్రిందట భూమి, చంద్రుడు వేరువేరుగా నేర్పడినవని కొందరి అభిప్రాయము. భూమినుండి ఎంతోకాలముక్రిందట చంద్రుడు ఉత్పత్తి యయ్యెనని మరికొందరి సిద్ధాంతము.
చంద్రగోళము సూర్యునికంటెను, భూమికంటెను చాల చిన్నది. దాని వ్యాసము 2160 మైళ్లు. అది భూమికి 2,38,857 మైళ్ళదూరమున నుండి తన నియమిత మార్గములలో భూమిచుట్టును తిరుగుచుండును. చంద్రుని ద్రవ్యరాశి భూమియొక్క ద్రవ్యరాశిలో సుమారు సగముండును. ఒకసారి భూమిచుట్టు ప్రదక్షిణము చేయుటకు చంద్రునకు సరిగా 27 దినముల 7 గంటల 43 నిమిషముల 14 సెకండ్లకాలము పట్టును. ఈ కాలమును బట్టి మాసములు లెక్కింపబడుచున్నవి. చంద్రునికి సహజప్రకాశము లేదు. సూర్యునికాంతి చంద్రగోళముపైబడి పరావర్తనమగుచుండుటచే మనకు వెన్నెల కలుగుచున్నది. కొన్ని సమయములలో సూర్యునికిని భూమికిని ఎంతదూర ముండునో, సూర్యునికిని చంద్రునికినిగూడ సగటున అంతే దూరము ఉండుటను బట్టి, సూర్యునినుండి భూమి ఎంత ఉష్ణమును గ్రహించునో చంద్రుడుకూడ అంతే ఉష్ణమును గ్రహించును. చంద్రుని పరావర్తనశక్తినిబట్టి, మధ్యాహ్న సమయమున చంద్రునిపై 261°F ఉష్ణోగ్రతయు, అర్ధరాత్రమున - 243°F, ఉష్ణోగ్రతయు ఉండునని శాస్త్రజ్ఞులు లెక్క వేసిరి. పరిశీలనము వలనను, లెక్కల మూలమునను చంద్రగోళముపై ఏ విధమగు వాతావరణముగూడ లేదని తెలియుచున్నది. పై రెండు ఉష్ణోగ్రతలలో నున్న దీర్ఘ వ్యత్యాసమును బట్టియు, అచట వాతావరణము శూన్య
చిత్రము - 163
చంద్రకళలు. భూమిపైనుండి చూచువారికి చంద్రకళలు మారుచున్నట్లు కనబడుట బయటి వలయములోని బొమ్మలు తెలియజేయును.
పటము - 1
చంద్రుడు
ముగా నుండుటనుబట్టియు, భూమిపై నున్నట్లు చంద్రగోళముపై ఏ ప్రాణియు ఉండుట కవకాశములేదని గూడ తెలియుచున్నది.
దూరదర్శని అవసరములేకుండ మన దృష్టి నాకర్షించి ఆహ్లాదమును గలిగించు చంద్రుని లక్షణములలో చంద్రకళకు గలుగు మార్పులు ముఖ్యమైనవి. పై బొమ్మలో చంద్రకళల మార్పు బోధపడును.
అమావాస్యనాడు చంద్రునియొక్క చీకటిభాగము భూమివైపునకు తిరిగియుండుటచే మనకు చంద్రుడు అగ పడడు. అందుచే సూర్యగ్రహణమునాడు తప్ప, అమావాస్యనాటి చంద్రుని చూచినవా రుండరనియే మనము అనుకొనవచ్చును. అంతేగాక, సూర్యకిరణము పడి ప్రకాశవంతముగా చేయబడిన చంద్రునిభాగ మెల్లప్పుడును సూర్యునివైపున కుండును. అందుచేత, చంద్రవంక యొక్క కొమ్ములు నల్లని ఆకాశముపై దిఙ్మండలమునకు దూరముగా సూచించుచుండును. ఆ రెండు కొమ్ములను కలుపు ఋజురేఖతో దిఙ్మండలముపై నేర్పడు కోణము భూమి, సూర్యచంద్రులయొక్క పరస్పర స్థానములపై నాధారపడి యుండును. చంద్రవంక కొమ్ములను బట్టి వాతావరణ పరిస్థితులను గూర్చిన వివిధ విశ్వాసములకు, సామెతలకు ఆధారములు అగపడవు.
భూమి భ్రమణము చేయు దిక్కున చంద్రుడు కూడ తన అక్షముపై భ్రమణము చేయు చుండును. ఆ వైపునకే భూమిచుట్టును పరిభ్రమణము కూడ చేయు చుండును. అందుచే, చంద్రునియొక్క ఒకే వైపు ఇంచుమించు ఎల్లప్పుడును భూమివైపునకు తిరిగియుండును. "దర్శనస్థితులు (librations)" అనువాని ఫలితములచే చంద్ర గోళములో సుమారు 41% భూమినుండి చూచువారికి ఎల్లప్పుడును కనబడుచుండును. సుమారు 41% భూమికి ఎప్పుడును కూడ కనబడదు. మిగిలిన 18% భూమిపై నుండి చూచుచున్నవాని స్థానమును బట్టియు, చూచు ప్రత్యేక కాలమునుబట్టియు కనబడవచ్చును; లేదా కనబడక పోవచ్చును. భూమికిని, సూర్యునకును సరిగా మధ్య చంద్రుడు వచ్చినపుడు సూర్యగ్రహణము కలుగును.
దూరదర్శని యంత్రము కల్పింపబడినప్పటి నుండియు దాని సహాయమున జరిగిన చంద్రోపరితల శాస్త్రపరీక్ష (Selenography) వలన భూమినుండి కనబడిన చంద్రగోళభాగము చాల జాగ్రత్తగా చిత్రింపబడినది. ఆ భాగము యొక్క కిరణ పరావర్తన శక్తినిబట్టియు, పరావర్తన చెందిన వెలుతురు ధర్మములనుబట్టియు చంద్రోపరితలము గోధుమ-పసుపురంగులు కలసిన శిలతో నేర్పడినట్లు మనకు తెలియుచున్నది. అచ్చట “సముద్రములు" లేక "ముస లమ్మ" "మనుష్యుడు" “వేడి” “మచ్చ" “పీతడెక్క” మొదలగునవి ఉన్నట్లు మనకు గలుగు వివిధ యూహా పోహలు సరియైనవి కావనియు, అట్టి యూహలకు కారణము అచ్చట విశాలములైన చదునైన మైదానము లుండుటయే యనియు కూడ తెలియుచున్నది.
చిత్రము - 164
పటము - 2
పూర్ణచంద్రుడు
ఈ మైదానములేగాక చంద్రతలముపై పర్వత పంక్తులు, పర్వతశిఖరములు, ఇంచుమించు అరమైలు వెడల్పు, ఎంతో లోతుగల కాలువలు లేక బీటలు; ప్రకాశవంతమగు కిరణములు, లేదా కొన్ని బిందువుల
చిత్రము - 165
పటము - 3
చంద్రుని ఉపరితలము
నుండి నలువైపుల ప్రసరించు ప్రకాశవంతమగు రేఖలు, “చంద్రబిలములు” (lunar craters) అని చెప్పబడు బిలములుకూడ మనకు కనబడును.
చంద్రోపరితలముపై నగపడు దృశ్యము లన్నిటిలో "చంద్రబిలములు" ఆశ్చర్యముగా నుండును. 17 వ శతాబ్దమున రిక్సియోలి (Riccioli) అను నాతడు ఈ బిలములకు ప్రఖ్యాత శాస్త్రజ్ఞుల యొక్కయు, శాస్త్రవేత్తల యొక్కయు నామములను పెట్టెను. సాధారణ
చిత్రము - 166
పటము - 4
కోపర్నికస్ అను చంద్రబిలము
ముగా చంద్రబిలములు వృత్తాకారముగనుండి చుట్టును నిట్టనిలువుగానున్న ఎత్తైన పర్వత పంక్తులను, మాధ్యమిక శిఖరములను కలిగియుండును, చంద్రగోళముపై ఇట్టి బిలములు 30,000 కు మించియుండును. అవి వివిధ పరిమాణములు గలవి. ఆ పర్వతములలో కొన్నిటి ఎత్తు సుమారు 27,000 అడుగులట. కొన్ని బిలముల వ్యాసము దగ్గరదగ్గర 150 మైళ్ళుండును. కొన్నిటి వ్యాసము 1000 మీటర్లుకాని అంతకు తక్కువకాని యుండును. కొన్ని బిలములు నేల భాగము లోపలికి క్రుంగిపోయియుండును. కొన్ని నేల భాగముపైకి ఉబ్బియుండును. చుట్టును గోడలుగల మైదానములవలె నుండు కొన్ని పెద్ద బిలములలో నున్న మైదానములు మిట్టపల్లములుగా నుండును. కొన్నిటిలో నున్న మైదానములు చదునుగా నుండును. చంద్రుని ఉపరితలమందు అగపడు అన్ని వైఖరులను వివరించగల సంపూర్ణమగు సిద్ధాంతమేదియు లేదు. అచట నున్న పర్వతపంక్తులకును, మైదానములకును భూమియొక్క భూతత్త్వరూపములను వివరించు సిద్ధాంతములే చెప్పుటకు వీలగును. కాని చంద్రబిలములను గూర్చి వివరించు సిద్ధాంత మేదియు ఇంతవరకు కనబడదు. చంద్రునిపైనున్న బిలములయొక్క ఉత్పత్తిని గూర్చి రెండు ముఖ్యమైన సిద్ధాంతములు గలవు. మొదటిది అగ్నిపర్వత సంబంధమగు సిద్ధాంతము. రెండవది ఉల్కా సంబంధమగు సిద్ధాంతము. అగ్నిపర్వత సంబంధమగు సిద్ధాంతము పురాతనమైనది. ఉల్కా సంబంధమగు సిద్ధాంతము 19 వ శతాబ్దము చివరి భాగమున బయలుచేరినది.
యుగయుగములనుండియు మానవునిపైనను, వాతావరణము పైనను చంద్రునకు గొప్ప ప్రభావమున్నట్లు చాల విషయములు మనలో వ్యాపించియున్నవి. అవి యన్నియు ఊహామాత్రములేకాని, యదార్థవిషయములు కావనియు, ఆ సంబంధమగు విశ్వాసము లన్నియు మూఢ విశ్వాసములే యనియు తెలియుచున్నది. సూర్యునినుండి చంద్రుడు గ్రహించిన శక్తిలో సుమారు 1/500,000 వంతు మాత్రమే చంద్రుని నుండి భూమిపై బడుచున్నదని శాస్త్రజ్ఞులు వేసిన లెక్కలవలన తెలియుచున్నది. అందుచే వాతావరణముపై చంద్రునికి గల ప్రభావ మత్యల్పమనియు, సముద్రపు పాటు పోటులకు, తరంగములకు, ముఖ్య కారణము చంద్రుడనియు, తద్వారా వాణిజ్యముపైనను, సముద్రప్రాంత ప్రదేశముల వాతావరణము పైనను కొంత ప్రభావ ముండవచ్చుననియు శాస్త్రజ్ఞుల అభిప్రాయము. భూమికిని, చంద్రునకును గల దూరములో గలుగు మార్పులకును, భూమియొక్క అయస్కాంత శక్తికిని స్వల్పమగు సంబంధము గూడ నున్నట్లు శాస్త్రజ్ఞులు తెలియజేయుచున్నారు. ఇటీవల రెండు సంవత్సరముల క్రిందట రష్యను శాస్త్రజ్ఞులు రాకెట్లలో చేసిన అంతరిక్షయానమున చంద్రగోళము దరిదాపులకు పోయి - కొన్ని క్రొత్త పర్వత పంక్తులను కనిపెట్టిరి.
బి. వి. ర.