Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చంద్రగుప్త చక్రవర్తి

వికీసోర్స్ నుండి

చంద్రగుప్త చక్రవర్తి (క్రీ. పూ. 324-300) :

జీవితము : చంద్రగుప్తుడు మౌర్యవంశములో ప్రథమ చక్రవర్తి . ఈ రాజపుంగవుడు ప్రాచీన భారతదేశమును ప్రకాశమానము గావించిన మహానేత. ఇతడు గ్రీకులబారి నుండి హిందూదేశమును రక్షించినవాడు. అంతేగాదు. హిందూదేశముయొక్క విపులభాగమును ఏకచ్ఛత్రాధి పత్యమునకుతెచ్చి రాజకీయముగ ఏకత్వమును కల్పించిన మొట్టమొదటి ప్రభువు. ఇది మిగుల ఘనకార్యమే యనదగును. ఏలయన, ఇతడు రాజ్యసింహాసనమును వార సత్వేన పొందిన వాడుకాడు; మరియు దైన్యపరిస్థితులలో జన్మించినవాడు. ఇట్టివాడు మహోన్నతపదవి పొంద గలిగినాడనుటచరిత్రలో అద్భుత కథావిధానమే గదా !

చరిత్రలో ప్రసిద్ధికెక్కిన పురుషాగ్రగణ్యుల జీవితములవలెనే చంద్రగుప్తుని జీవిత ప్రారంభచరిత్రయు నిగూఢమైనది. ఇతడు అల్పజాతి సంభవుడనియు, క్షత్రియ కులాంకురమనియు వేర్వేరు విధములుగా కథలుకలవు.

చిత్రము - 162

నంద రాజులను పదభ్రష్టులుగజేసి, కౌటిల్యుడను బ్రాహ్మణుడు చంద్రగుప్తునకు రాజుగా పట్టాభిషేకము కట్టెనని మాత్రము పురాణములు చెప్పుచున్నవి. నందరాజునకు భార్యగా నెంచబడు చుండిన ముర యనునామె చంద్రగుప్తుని తల్లి యనియు, ముర కొడుకుగావున మౌర్యుడనియు విష్ణు పురాణ వ్యాఖ్యాత వివరించు చున్నాడు. అయితే మురశబ్దమునకు అపత్యార్థక తద్ధితరూపము 'మౌ రేయ' అగునుగాని “మౌర్య” కానేరదు. మహద్వాచకమగు “ముర ” శబ్దము నుండి మౌర్యశబ్దము జనించును. "ముర" అనునది ఒక గోత్ర నామమని పాణిన్యాచార్యుల 'గణపాఠము' నుండి తెలియగలదు. పురాణ కారులందరు మురకు ఎట్టి కళంకమును ఆపాదింపక పోయినను, ముర యను నామె నందరాజు భార్యయో లేక ఉంపుడుకత్తెయోతెలుపలేదు.

చంద్రగుప్తుని నీచజన్మ కథా వృత్తాంతము ముద్రా రాక్షస నాటకమునందు తెలుపబడినది. అందు చంద్రగుప్తుడు వృషలుడుగను, కులహీనుడుగను వర్ణితుడై యున్నాడు. కులహీను డనగా, పేదకులమువా డన వచ్చును. ఇక వృషలశబ్దము వృషుడను అర్థములో వాడుట కలదు. వృషుడనగా రాజాధిరాజు (chief among kings). ఈ పద్ద్వయములోశూద్రుడనికాని, కులభ్రష్టుడని కాని అర్థములు లేవు. ముద్రారాక్షసముపై వ్యాఖ్యానము వ్రాసిన పండితుడు, చంద్రగుప్తుడు మౌర్యుని కుమారుడనియు, ఈ మౌర్యుని భార్యయే మురయనియు, ఈమె శూద్రజాతి సంభవయనియు వ్రాసినాడు. ఆ నాట కాంతమున చంద్రగుప్తుడు మౌర్యపుత్రుడుగను నంద రాజవంశపు రాజ పురుషుడుగను కీర్తింపబడి యున్నాడు. దీనిని బట్టి చంద్రగుప్తుడును,

నందుడును రక్తబంధువులని తేలుచున్నది.

అయితే, “దివ్యావదాన” మను బౌద్ధగ్రంథము చంద్రగుప్తుని కుమారుడగు బిందుసారుడు పట్టాభిషిక్తుడయిన క్షత్రియుడని తెలుపుచున్నది. మోరియా (Moriya) అను నొక క్షత్రియులతెగ యున్నట్లును, చంద్రగుప్తుడు ఆ తెగలో జనించిన క్షత్రియుడనియు 'మహావంశ' మను గ్రంథము తెలుపుచున్నది. గౌతమబుద్దుని కాలములో మోరియా అను ఈ క్షత్రియతెగ యున్నట్లు దృష్టాంతములు కలవు. ఈ విషయమును ప్రామాణిక గ్రంథమగు “మహాపరినిబ్బాన సుత్తము” ధ్రువీకరించుచున్నది. ఇట్లు బౌద్ధగ్రంథములను బట్టి చంద్రగుప్తుడు క్షత్రియు డనియే తేలుచున్నది. పురాతన తెగనామమగు మోరియా శబ్దము మౌర్యశబ్దమునకు తృప్తికరమగు అర్థము నిచ్చు చున్నది. ఇక మనము చంద్రగుప్తుడు క్షత్రియుడనుటకు సందియపడ నవసరములేదు.

బౌద్ధమత గ్రంథములలో లిఖితమయియున్న కథను బట్టి చంద్రగుప్తుని తండ్రి మోరియా తెగ నాయకుడు. ఇతడొక యుద్ధములో మరణించెను. ఇతనిభార్య దిక్కు లేనిదయినది. ఆమె చాల దూరముననున్న పుష్పపురము (కుసుమపురము - పాటలీపుత్రము) నకు చేరి, అచ్చట తల దాచుకొనెను. ఆమె అచ్చటనే యొక కుమారుని -చంద్రగుప్తుని - కనెను. ఈ బాలుని మొదలొక గొల్ల వాడును, తరువాత నొక కిరాతుడును (hunter) పెంచిరి. ఆతడు పెరిగి, పెద్దవాడయి పల్లెటూరి బాలురతో ఆడుచు మొనగాడై క్రీడలలో రాజుగా క్రీడించుచుండెను. ఈతని రూపరేఖా విలాసములు ఆ దారిన పోవుచున్న చాణక్యుని ఆకర్షించెను. ఆతడాబాలుని తక్షశిలకు గొంపోయెను. చాణక్యుడు చంద్రగుప్తున కచ్చట సమస్త విద్యలను, శాస్త్రములను నేర్పి నిజ కార్యనిర్వహణ దక్షత గల యోగ్యునిగా తీర్చి దిద్దెను.

దేశము నాక్రమించియున్న పరదేశీయుల యాధిపత్యమునుండి మాతృభూమికి విముక్తి గలిగించి, తన్నవ మానించిన నంద రాజు దుష్టపరిపాలనమును తుదముట్టించుటయే చాణక్యుని సంకల్పము. దేశములోని యుద్ధ సాధనములను సమీకరించి, నిస్పృహ చెందియున్న పౌరులలో కష్టముల నెదుర్కొను పటిమను సృష్టించి దాస్యవిముక్తి కార్యమునకు వారిని సిద్ధము చేయుటయే చాణక్యుని కర్తవ్యమై యుండెను. చాణక్యుడును, చంద్రగుప్తుడును బల (సైన్య) సంపాదనమునకయి ప్రయత్నించి ప్రచండసేనను (మహాబలకాయమును) తయారు చేసిరి.

చంద్రగుప్తునకును, పర్వతకుడను హిమాలయప్రాంత రాజునకును మైత్రి కుదిరినట్లు గ్రంథములు చాటుచున్నవి. ఈ హిమాలయరాజు మైత్రివలన చంద్రగుప్తునకు శకులు, యవనులు, కిరాటులు, కాంభోజులు, పారసీకులు, బాహ్లికులుగల సైన్య సందోహము సమకూరెను.

హిందూదేశముపై దాడివెడలిన గ్రీకుసేనలో అసంతృప్తి, తిరుగుబాట్లు మొదలయ్యెను. ఇంతలో అలెగ్జాండరు చక్రవర్తి మరణించెను. గ్రీకు స్కంధావారము అస్తవ్యస్తముగా నుండెను. ఇదియే పరరాజులను పారద్రోలుటకై పోరాడుటకు తగిన అదనని చంద్రగుప్తుడు భావించెను. వెంటనే ఆతడు అలెగ్జాండరు ప్రతినిధులగు గవర్నరులను మృత్యువుపాలు చేసెను. చంద్రగుప్తుడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, రాజుగా పట్టాభిషిక్తుడయి (క్రీ. పూ. 324) తరువాత గ్రీకులతో యుద్ధము చేసి వారిని పరాజితులను గావించెను (క్రీ. పూ. 317). ఇప్పుడు చంద్రగుప్తుడు పంజాబు, సింధు ప్రాంతములకు సర్వాధికారి యయ్యెను.

దేశాంతర్భాగమున చెలరేగియున్న నందరాజు దౌర్జన్య పరిపాలనమును తుడిచి వేయుట చంద్రగుప్తుడు తన రెండవ కార్యముగా నిర్ణయించుకొనెను. చంద్రగుప్తుడు మగధను ఎట్లు జయించెనో సరియగు వృత్తాంతము కానరాదు. ఒకానొక కథ చంద్రగుప్తుడు తన జైత్ర యాత్రలలో మొట్టమొదట చేసిన తప్పును సూచించుచున్నది. ఈ కథ “మహావంశఠికా” (Mahavamsathika) అను గ్రంథము నందిట్లున్నది : ఒక పిల్లవాడు రొట్టె లోని భాగమును తిని అంచులయందలి భాగమును పారవేయుచుండెనట ! తల్లి చూచి, అతనిచర్య చంద్రగుప్తుని దండయాత్రలను పోలి యున్నదని కుమారుని చీవాట్లు పెట్టెనట! తన యుద్ధ విధానమువలన చంద్రగుప్తుడు దేశాంతర్భాగములపై దాడి సల్పగలిగెనుగాని, తుద కేమైనది? ఆతని సైన్యమును శత్రువులు చుట్టుముట్టి తునుమాడుట సంభవించెను. చంద్రగుప్తుడు చేసిన మరియొక తప్పిదమును బౌద్ధ గ్రంథములు తెలుపుచున్నవి. చంద్రగుప్తుడు సరిహద్దుల మీద దాడులు సాగించి మార్గము వెంటనున్న పెక్కు రాష్ట్రములను, జనపదములను జయించెనట! కాని తన విజయములను సుస్థిరపరచుకొనుటకు భద్రతా సైన్యమును ఆయా స్థలములందు నిలుపలేదు. అందుచే వెంటవచ్చు సైన్యములకు వెన్నుపోటు తగిలెనట! అప్పుడు సరియైన పద్ధతి ఏదో ఆతనికి గోచరించినది. చంద్రగుప్తుడు పాటలీపుత్రమును ముట్టడించి ధననందుని వధించెను. మగధరాజ్యముపై చేసిన ఈ యుద్ధములో మాగధు లెందరో హతులైరి.

నందరాజవంశ నిర్మూలన మను మహా నాటకమున చంద్రగుప్తునికంటె చాణక్యు డను నామాంతరముగల కౌటిల్యుడే ప్రధానపాత్ర వహించినాడని ఒక అభిప్రాయము కలదు. ముద్రారాక్షస నాటకమునందు అత్యంత ప్రతిభాన్వితుడు, సమధికార శక్తిమంతుడును అయిన చాణక్యునిముందు చంద్రగుప్తుడు దివిటీముందరి దీపము వలె నుండును. ముద్రారాక్షస కథయంతయు నిజమయినను కాకపోయినను, చంద్రగుప్తుని శౌర్య, పరాక్రమ, యుద్ధచాతుర్యములకంటె చాణక్యుని నిపుణబుద్ధియు, రాజనీతి నేతృత్వమును కార్యసాధనమున ప్రబలసహాయ కారిగా నుండెనని చెప్పనొప్పును. నందరాజు అయోగ్యుడు. ప్రజ లాతనిని అసహ్యించుకొనుచుండిరి. ప్రజలను పీడించి, వారి సొమ్ము దోచుకొని, తన ధనాగారమును నింపుకొనుచు అత్యంత ధనవంతు డయ్యెను. నందరాజు తన నాశనమును తానే తెచ్చి పెట్టుకొనెను.

చంద్రగుప్తుడు తన సామ్రాజ్యమును కట్టుదిట్టములు చేయుచు బలపడుచుండగా, సెల్యూకస్ అను గ్రీకురాజు చంద్రగుప్తునితో యుద్ధమునకు తలపడెను. కాని యుద్ధ పర్యవసానము సెల్యూకసునకు ప్రతికూలముకాగా, ఆతడు హెరాట్, కందహార్, కాబూల్, బెలూచిస్థానములో కొంత భాగమును చంద్రగుప్తునికి కానుకగా నొసగి ఆతనితో సంధిచేసికొనెను. దీనికి బదులుగా చంద్రగుప్తుడు 500 ఏనుగులను సెల్యూకసునకు బహుమతిగా నొసగెను. సంధి షరతులనుబట్టి చూచినచో, చంద్రగుప్తుని చేతులలో గ్రీకువారు నిర్వీర్యులయిరని తోచగలదు. అంతేకాదు. ఈ సంధికి బలకరముగా ఈ ఉభయుల నడుమ వై వాహిక సంబంధ మేర్పడినట్లు తెలియుచున్నది. ఈ వివాహోదంతమునుబట్టి సెల్యూకసు కుమార్తెను చంద్రగుప్తుడు వివాహ మాడినట్లు తలంచుచున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. తరువాత సెల్యూకను చంద్రగుప్తుని యెడ మైత్రీభావము వహించుటయేగాక తన పక్షమున మెగస్తనీసు అను నాతనిని రాయబారిగా నియమించి పంపెను. ఈ రాయబారి పాటలీపుత్రములో నివసించుచు, భారతదేశమును గూర్చి ఒక గ్రంథముకూడ రచించి యున్నాడు.

చంద్రగుప్తుని అనంతర జీవిత విధానమునుగూర్చి అంతగా తెలియదు. ఆతని సామ్రాజ్యము అత్యంత విశాలమైన దగుటచే, ఆతడు తన జీవితమంతయు యుద్ధ ప్రస్థానములందే గడపియుండవచ్చును. ఈ విషయమున వివరములు తెలియవు. జైనుల కథనము ప్రకారము చంద్రగుప్తుడు చరమ జీవితకాలమందు ఐహిక విషయములను పరిత్యజించి, భద్రబాహువెంట బయలుదేరిన జైన సమూహముతో మైసూరు ప్రాంతములో శ్రవణ బెళగోళ అను ప్రదేశమునకు వెడలినట్లు తెలియుచున్నది. అచ్చట భద్రబాహు, చంద్రగుప్తుడు సాధుపుంగవులుగా కలిసి జీవితములు గడపినట్లు శ్రవణ బెళగోళా యందలి శాసనములు తెలియజేయు చున్నవి. చరిత్రయందు వారి నామములు చిరస్థాయిగా నిలిచిపోయినవి. చంద్రగుప్తుడు నివసించిన పర్వతమును 'చంద్రగిరి' గా ఇప్పటికిని పిలుచుచున్నారు. చంద్రగుప్త బస్తి యను పేరుతో అతడు నిర్మించిన ఒక దేవాలయము ఇంకను నిలిచి యున్నది.

సామ్రాజ్య విస్తీర్ణము : చంద్రగుప్తుడు నిస్సందేహముగా ఒక విశాల సామ్రాజ్యమున కధిపతి. ఇతడు ఆరు లక్షల సైన్య సమేతుడయి, భరతఖండము నంతను జయించి లోబరచుకొనినట్లు ప్లూటార్కు పండితుడు వ్రాసి యున్నాడు. ఈ విషయమును రుజువు పరచుటకు పెక్కు పరోక్ష సాక్ష్యాధారములు కూడ కలవు. అశోకుని శాసనములను బట్టి అత డొక కళింగదేశ విజేతగనే స్ఫురించు చున్నది. అయితే అతని శాసనములు దేశవ్యాప్తిని గాంచినచో, మరియు వాటి అంతస్సాక్ష్యములను పర్యాలోచించినచో, ఆతని సామ్రాజ్యము దక్షిణమున మైసూరు వరకును, భారత భూభాగమునకు అవతల వాయవ్య దిశ యందు పర్షియాదేశ సరిహద్దులవరకును వ్యాపించియున్నట్లు స్పష్టమగును. అశోకుని తండ్రియగు బిందుసారుడు యుద్ధ విజేతగా చరిత్రయందు కనుపించడు. కావున అశోకుడు పాలించిన విశాలసామ్రాజ్యము పితామహుడగు చంద్రగుప్తుని నిర్మాణకౌశల ఫలితమే యయి యున్న దనుట తర్కబద్దముగా నుండగలదు.

తమిళ గ్రంథములలో “వాంబమోరియరులు” అనగా “మౌర్యాధములు” గొప్ప సేనతో తిరునల్వేలి ప్రాంతముపై దాడి సల్పినట్లు పేర్చొనబడి యున్నది. అధము లను విశేషణవాచకమునుబట్టి తమిళ కవులు చంద్రగుప్త కాలవిషయములనే వర్ణించినట్లు రూఢి యగుచున్నది.

ప్రథమ రుద్రదమనుని జునాగడ్ శాసనాధారమున సౌరాష్ట్రము మౌర్య సామ్రాజ్యములోని పరగణాగా నున్నట్లు తెలియుచున్నది. చంద్రగుప్తుని ప్రతినిధిగా పుష్యమిత్రు డను నాతడు సౌరాష్ట్రము నేలుచుండెను. పశ్చిమ భారతదేశమునకూడ మౌర్యాధికారము క్రింద కొంత ప్రాంత ముండియుండెను. థానాజిల్లాలో 'శోపారా' యందు అశోకుని శాసనము కనబడుటచే తత్పరిసరములు చంద్రగు ప్తుని కాలములో గూడ ఆతని సామ్రాజ్యాంతర్భాగమగు రాష్ట్రముగా నుండెనని తెలియగలదు. పూర్వ గ్రంథములయందు 'శోపారా' అను నామము 'శూర్పారక' గా వ్రాయబడి యుండెను.

పరిపాలనా విధానము : పర్షియానుండి దక్షిణాపథము వరకు వ్యాపించి యుండిన సువిశాల సామ్రాజ్యమును సమర్థవంతముగ పరిపాలించుటకు యోగ్యమయిన విధాన మవలంబించుట ఎంతయు దుర్ఘటమైన కార్యము. ఒక మూల నుండి మరియొక మూలకు గల దూరము అతి దీర్ఘము. ఆ కాలములో చెదరియున్న వేర్వేరు ప్రాంతములకు రాకపోకలు సులువుగను, త్వరితముగను నెరవేరు విధము లేకుండెను. పాటలీపుత్రము వంటి రాజధాని నుండి సామ్రాజ్యమంతటిని అదుపులో నుంచుట ఎంతయో కష్టము, చంద్రగుప్తుడు, తన రాజకీయ వివేక సంజనితమగు పథకముతో ఈ సమస్యను పరిష్కరించెను. విసరి వేసినట్లు అందుబాటులో లేని ఈ విశాల భూభాగములను అనుకూలముగను, నిర్వహణ సమర్థముగను ఉండునట్లు పరగణాలుగ, లేక రాష్ట్రములుగ విభజించెను. ఒక్కొక్క రాష్ట్రముపై రాష్ట్రపాలకులను నియమించెను. రాష్ట్ర పాలనా విధానమంతయు నొకే విధముగ నుండునట్లు కట్టడి చేసెను. ఈ విధముగా దేశపరిపాలనమును వికేంద్రీకరణము గావించుటచే దూర ప్రయాణముల సమస్య సమసిపోయెను. ఒకేచోట పరిపాలన యంత్రమును కేంద్రీకరించుట ప్రయాణ సౌకర్యములులేని ప్రాచీన కాలములో సాధ్యమైన పనికాదు. పాలనాధికారమును పైనుండి క్రిందివరకు వేర్వేరు అంతస్తులలో వేర్వేరు అధికారుల పరిధిలో పంచవలసియుండెను. పరిమితమగు ఇట్టి స్థానిక ప్రదేశము లందును అధికార ధర్మమునం దెక్కువ భాగము వివిధములయిన స్వపరిపాలనా సంస్థలకు చెందియుండెను. గ్రామస్థులు స్వపరిపాలనా సంఘముగనో, ప్రజాప్రభుత్వము (republic) గనో ఏర్పడి తమగ్రామ విషయములను, గ్రామావసరములను, చక్క బెట్టుకొను చుండిరి. ఈ విధముగా గ్రామస్థులకు పరిపాలనా విధానము నందు మంచి యవకాశమును, అనుభవమును లభించెను. ఇట్లు ఆ కాలమునాటి రాజనీతివిధానము సిసలైన ప్రజాప్రభుత్వ సంప్రదాయము ననుసరించి యుండెను.

మెగస్తనీసు రచించిన గ్రంథమిప్పుడు దొరకుటలేదు. అయినను అందలి కొన్నికొన్ని విషయ భాగములు వేరు రచనలయందు సూచితమగు చుండుటచే, చంద్రగుప్తుని రాజ్యతంత్ర విధానము మనకు తెలియనగుచున్నది. మెగస్తనీసు వ్రాతలవల్ల ఆనాటి సాంఘిక, రాజకీయసభలు, పలుప్రదేశముల వర్ణన, పాడిపంటలు, పరిశ్రమలు మొదలగు వాటిని గూర్చిన పూర్ణచిత్రము వెల్లడియగుచున్నది. మెగస్తనీసు స్వయముగ దర్శించి, విషయములను ప్రత్యక్షముగ తెలిసికొని వ్రాసిన గ్రంథ మగుటచే అది ప్రత్యక్ష ప్రామాణిక గ్రంథమై, అత్యధికమయిన చారిత్రక విలువ గలిగి యున్నది.

చక్రవర్తి సామ్రాజ్యమునకు సర్వతంత్ర స్వతంత్రాధికారియై యుండెను. ఆతడు యుద్ధ, న్యాయ, నిర్వహణం (executive), శాసనాధికారములను తన స్వాధీనమునం దుంచుకొనెను. సామ్రాజ్య పరిపాలనా వ్యవహారములందు చక్రవర్తి స్వయముగనే ఎట్లు వ్యవహరించు చుండెనో మెగస్తనీసు తెలిపియున్నాడు. చక్రవర్తి పగలు నిద్రించడనియు, దినభాగమంతయు దర్బారు
నందే యుండి తగవులను విచారించుచు, ఇతర రాజ్య భాగముల వ్యవహారములను నెరవేర్చుచుండెడి వాడనియు మెగస్తనీసు వ్రాసియున్నాడు. ఒడలు పిసికించుకొను సమయము సమీపించినపుడు కూడ రాచకార్యములకు భంగము కలుగకుండె నట ! రాజు తన కురులు దువ్వించుకొని ముడులు సవరింపించుకొను సమయమున కూడ ఆతనికి విశ్రాంతి లేకుండెనట! అట్టి తరుణమున తన దర్బారులోని రాయబారులకు దర్శనమిచ్చు చుండెడివాడట !

పైన వివరించిన ప్రకారము సామ్రాజ్యము విభిన్న ప్రాంతములుగ విభజితమై ఆ ప్రాంతములను రాష్ట్రపాలకులు పాలించుచుండిరి. కేంద్రప్రాంతమును, తూర్పుప్రాంతమును చక్రవర్తియే పాలించుచుండెను. సామ్రాజ్య పాలనమందు చక్రవర్తికి సహకారిగా ఒక మంత్రిమండలి యుండెను. అతిసమర్థులయిన ఆ మంత్రులే రాష్ట్రపాలకులను, ఉపరాష్ట్రపాలకులను, రాజ్యకోశాధికారులను, సేనా నాయకులను, నావికా దళాధిపతులను, న్యాయమూర్తులను, దండ విధాయకులను, వ్యవసాయ శాఖాధ్యక్షుని వంటి ఇతర ఉన్నతాధికారులనందరను ఎన్నుచుండిరి.

చక్రవర్తి స్వయముగ అధికసంఖ్యలో గూఢచారులను నియమించి ఉపయోగించుకొనెడివాడు. వారు పట్టణమును గూర్చియు, సైన్యమును గూర్చియు వార్తలను రహస్యముగా చక్రవర్తికి నివేదించుచుండెడివారు. అత్యధిక విశ్వాస పాత్రులును, అతి సమర్థులును ఇట్టి ఉద్యోగములకు నియమితులగుచుండిరి. ఈ గూఢచారుల మీద అధికారు లుండెడివారు. వారు రాచకార్యములందు వేశ్యల సహకారమునుగూడ పొందుచుండెడివారు.

చంద్రగుప్తుని కాలములో పుర పరిపాలనా విధాన మిట్లుండెను : నగరపాలనా నిర్వహణమునం దుండువారు ఆరు సంఘములుగా విభజింపబడుచుండిరి. ఒక్కొక్క సంఘమునందు అయిదుగురు సభ్యు లుండుచుండిరి.

మొదటి సంఘమువారు పారిశ్రామిక క్షేత్ర వ్యవహారములను సవరించుచుండిరి.

రెండవ సంఘమువారు విదేశీయుల సత్కార సమాదరణములను జూచుచుండిరి. పరదేశీయులకు గృహాది వసతులను గల్పించుటయు, వారి జీవిత విధానములను కనిపెట్టు చుండుటయు, వారు వెడలిపోవునపుడు సాగనంపుటయు, ఒకవేళ వారెవరైన మరణించినచో, వారి ఆస్తి పాస్తులను బంధువులకు అందజేయుటయు వీరి కర్తవ్యములై యుండెను. వారు జబ్బు పడినచో వారికి సకలోపచారములు చేయుటయు, వారు మరణించిన యెడల ఖననము చేయుటయును రెండవసంఘము కర్తవ్యమయియుండెను.

మూడవ సంఘమువారు జనన, మరణములను గూర్చి విచారించుచుండిరి. ఈ విచారణ పన్నులు విధించు విధానమున కవసరమై యుండెను.

నాల్గవ సంఘమువారు వర్తక వాణిజ్య విషయముల విచారణ కర్తలుగ నుండిరి. ఈ సంఘమువారి యొద్దనే తూనికలు, కొలత పాత్ర లుండుచుండెను. అన్ని ధాన్యములును సకాలమునందు అమ్ముడుపోవలయును. దొంగ బేరములు చేయకూడదు. ప్రతియొక్కడు ఏదే నొక విధమయిన సరకు యమ్ముచుండవలయును. లేనిచో ద్విగుణముగా పన్ను నీయవలసియుండెను.

అయిదవ సంఘమువారు చేతిపనులపయి విచారణాధి కారులుగా నుండిరి. క్రొత్తవాటిని, పాతవాటిని విడి విడిగా అమ్మవలయును. రెండింటిని కలిపి బేరము సాగించినచో అపరాధము క్రింద ధనమును చెల్లింపవలసి యుండెను.

ఆరవ సంఘమువారు పదార్థముల ధరలలో పదవ భాగమును పన్నుగా వసూలుచేయువారు. ఈ పన్నును సమర్పించుటలో మోసముజరిగినచో మరణ శిక్ష విధింప బడుచుండెను.

ఇవి ఆయా సంఘముల యొక్క ప్రత్యేక విధులు. అయితే అన్ని సంఘములును తమ ప్రత్యేక విధులతో పాటు ప్రభుత్వ భవనములను సుస్థితిలో నుంచుట, ధర వరలను సముచిత స్థాయిలో నుంచుట, విపణి వీథులను, ఓడరేవులను, దేవాలయములను పరిరక్షణము గావించుట మొదలగు సార్వజనిక ప్రయోజనాత్మక కార్యములను సమష్టిగా నెరవేర్చుచుండవలయును.

నదుల పర్యవేక్షణము, భూముల కొలత, సస్యములకు నీటిపారుదల ఇత్యాది విషయములలో ఎట్టి అక్రమములు జరుగకుండ చూచుటకు జిల్లాలలో వేర్వేరు తరగతుల అధికారులుండిరి. వీరుగాక, వ్యవసాయాభివృద్ధి, అటవీ సంరక్షణము, కలపసామాను నిర్మాణము, లోహకర్మా గారములు, గనులు, రాచబాటలు-మున్నగువాటి విషయములో సరియైన కట్టుదిట్టములు చేయుటకు అధికారులు జిల్లాలలో నుండుచుండిరి.

క్రొత్తగా నిర్మాణమైన ఈ సామ్రాజ్య భద్రతకు యుద్ధ శాఖా పరిపాలన పటిష్ఠత ముఖ్యావసరము. ఈ విషయములో కూడ మౌర్యులు తీసికొన్న విధానవివరములను మెగస్తనీసు వర్ణించియున్నాడు. చంద్రగుప్తుడు 6 లక్షలకు మించిన సేనానివహమును సిద్ధముగా నుంచియుండెను. యుద్ధతంత్ర కార్యాలయ నిర్వహణము 30 మంది సభ్యులు గల ఒక సంఘము ఆధీనమున నుండెను. ఈ సంఘము అయిదు ఉపసంఘములుగా విభజింపబడి—1. కాల్బలము, 2. ఆశ్వికదళము, 3. యుద్ధార్థరథములు, 4. యుద్ధార్థ గజములు, 5. రవాణాశాఖ అను అయిదును ఈ అయిదు ఉపసంఘములపర మొనరింపబడెను.

అయిదవ ఉపసంఘ విధులలో సంభార సేకరులు, యుద్ధ పరిచారకులు, కమ్మరీడులు, గడ్డికోయువారు మొదలగు వారిపై యాజమాన్యము వహించుటయు నై యుండెను. ఈ అయిదవ ఉపసంఘము పై నాలుగు ఉపసంఘములతో సహకరించుచు, భేరీనగారాలు మ్రోగించియు, కొమ్ము లూదించియు, ఆయా గుర్తులప్రకారము అందరు తమ విధులను నిర్వర్తించునట్లుగా చేయుచుండెను. పారితోషికము లిచ్చుటకు, లేక శిక్షించుటకు ఏర్పాట్లుండుటచే కార్యభద్రతకు ఎట్టి అంతరాయములు లేకుండ నుండెను.

యుద్ధభటులకు యుద్ధసమయమున తప్ప ఇతర సమయములలో తమ యిష్టానుసారము వర్తించుటకు స్వేచ్ఛ యుండెను. వారి జీతబత్తెములు ఉదారముగా నుండుటచే, వారు సౌఖ్యావహముగ జీవించుటయేగాక ఇతరులను గూడ పోషింపగలిగి యుండిరి.

రాచనగరు విలాసము : చక్రవర్తి దర్బారు అత్యంత ఆడంబరముగను, వైభవోపేతముగను ఉండెడిది. చక్రవర్తి ప్రజలకు బహిరంగముగా దర్శనమిచ్చుట ఒక విశిష్టమైన సామాజిక విశేషముగా నుండెడిది. చక్రవర్తి ఉత్సవసమయములలో బంగారు పల్లకిలో పయనించు చుండెడివాడు. ఆపల్లకిని ముత్యాలతో అలంకరించెడి వారు. అందులో బంగారు నగిషీ పనితనముగల సున్నితమయిన పట్టుమెత్తలు పరచబడెడివి. పల్లకివెంట అంగ రక్షకులు, యుద్ధవీరులు ఉండెడివారు. వీరిలో కొందరు సజీవ పక్షిబృందము కూర్చుండియున్న వృక్ష శ్రేణిని పట్టుకొని వచ్చుచుండెడివారు.

చక్రవర్తి అంతఃపురమునందున్నప్పుడు ఆతని రక్షణభారము స్త్రీలు వహించుచుండెడివారు. వేటకత్తెలతో పరివృతుడై, చక్రవర్తి మృగయా వినోదము గావించెడి వాడు, వీరందరు రథములమీదగాని, అశ్వములమీదగాని, ఏనుగులమీదగాని, పోవుచుండెడివారు. వేటసమయములో చక్రవర్తివెంట ఇద్దరో, ముగ్గురో ఆయుధదారిణులగు వనిత లుండెడివారు. రాజు వేటకుక్కలతో సింహములను వేటాడుచుండెడి వాడు. వేటతరువాత ఆయనకు ప్రియమైన వినోదక్రీడ ఎద్దుల పరుగుపందెములు, ఎద్దులు, అశ్వములు పూనినరథముల పందెములు తరువాత జంతువులు పోరులు. పండుగసమయములలో చక్రవర్తి యూరేగింపు దృశ్యము కన్నులపండువుగా నుండును. ఊరేగింపునందు రజత, సువర్ణభూషణ మండితములయిన పెక్కు గజములును, నాలుగశ్వములు లాగు చుండెడి రధములును ఉండుచుండెను. పరిచారకులు రత్నఖచితములయిన భాండములను గొని వచ్చుచుండెడి వారు. అడవిదున్నలు, చిరుతపులులు, పెంపుడు సింహములు మొదలగు అడవిజంతువులు వెంటనుండెడివి. వార్షిక అభ్యంజనోత్సవ సందర్భమున (దీపావళి సందర్భమున) హరిణములు, దుప్పులు, ఖడ్గమృగములు, మచ్చికయయిన పెద్దపులులు, చిరుతపులులు, వేటకుక్కలు, మర్కటములు, కొంగలు, బాతులు, పావురములు మొదలగువానిని చక్రవర్తికి కానుకగా నొసంగుచుండిరి. ఏదేనొక కార్యార్థమయి రాజు పురవీధుల నేగుసమయమున 24 గజములు చక్రవర్తి రక్షణమునకై వెంట నడచెడివి. ఆతనిచుట్టును తిరుగుచు, రాజునకు సమీపమున పైగా నెగురుచు సుశిక్షితమైన పెంపుడు చిలుక లుండెడివి.

చంద్రగుప్తుని ప్రాసాదము అత్యంతవైభవ సంపన్నమై రాజమర్యాదానుసారియై విరాజమానముగా నుండు చుండెడిది. ఈ ప్రాసాదమున బంగారురేకుతో కప్పబడిన స్తంభములుండెను. ఈ స్తంభముల చుట్టును ఉబ్బెత్తుగ బంగారు ద్రాక్షతీగ అల్లుకొనియుండును. ఈ తీగలమీద వెండిపిట్టల బొమ్మలతో అలంకరించెడివారు. రాజప్రాసా దము విశాల రమ్యోద్యానమునందు నిర్మితమై యుండెను. ఉద్యానమునందు పచ్చని - పత్రశోభితములగు వృక్షములును, శీతలచ్ఛాయా సమన్వితములగు తరుబృందమును ఉండెను. తామరకొలకులు, అందు జలవిహారార్థము పడవలు ఉండుచుండెను.

గంగానదితో శోణానదికలియు సంగమస్థానమున రాజధానియగు పాటలీపుత్రము నెలకొనియుండెను. ఆ నగర రాజముయొక్క పొడవు 9 మైళ్ళ 352 గజములు; వెడల్పు 1 మైలు 1270 గజములు. దీనిచుట్టును 60 అడుగుల లోతును, 200 గజముల వెడల్పును గల అగడ్తయుండెను. ఈ అగడ్తను శోణానదీ జలముతో నింపుచుండిరి. పట్టణమునకు మరియు రక్షణముగా బలాఢ్యమైన 'కంచెకోట' (మానుకోట) అగడ్తవెంట చుట్టుతిరిగి వచ్చును. ఈకోటకు రంధ్రము లుండును. ఆ రంధ్రములగుండ విలుకాండ్రు బాణములను ప్రయోగించుచుండిరి. ఆ నగర ప్రాకార కుడ్యమునకు 64 దర్వాజాలును, 570 బురుజులును నగర సంరక్షక దృష్టితో నిర్మితమైయుండెను. ఈ నిర్మాణములు ప్రాకారకుడ్యమునకు, నగరమునకు శోభనుగూర్చునవిగా నుండెను.

వాయవ్య సరిహద్దునుండి పాటలీపుత్రము వరకును 1150 మైళ్ళ పొడవుగల రహదారి బాట యుండెను. ఈ బాట యందలి ప్రతి మైలునకు గుర్తుగా ఒక రాతిని పాతి, ఆ రాతిమీద ఇటునటుబోవు బాటలను గూర్చియు, వాటి దూరములను గూర్చియు వివరించి యుండిరి. బాటల కిరు ప్రక్కలను ప్రయాణికుల సౌకర్యార్థము వృక్షశ్రేణి పెంచబడుచుండెను. అచ్చటచ్చట నీటివసతు లేర్పరుపబడెను. పూటకూలి యిండ్లును, విశ్రాంతి గృహములును తగు విధముగా నుండెను. భూమార్గములే గాక జలమార్గములును దూరదూర ప్రదేశములకు పోవుటకు సామ్రాజ్యమునం దంతటను ఏర్పరుపబడెను. వీటికి కుల్యామార్గములు. కూలపథములు, సంయాన పథము లనియు పేర్లుండెను. నదీనదములకు సంబంధించినవి కుల్యామార్గములు. రేవులను గలుపు తీరమార్గములకు కూల వథములని పేరు. నిండు సముద్రమార్గములకు సంయాన పథము లని పేర్లు. ఇట్టి జలయానములకు ఉపయోగకరముగ వేర్వేరు విధములయిన నావ లుండెను.

ఈ రహదారి బాటల సుస్థితిని, మరమ్మతులను, సూచీ ఫలకములను చక్కజూచుటకు అధికారులు నియమితులై యుండిరి.

ప్రజాజీవితము : చంద్రగుప్తుని సామ్రాజ్యమునందంతటను శాంత్యభ్యుదయ సంతృప్తులు నిండుకొని యుండిన వని మెగస్తనీసు సందేహవిరహితముగ లిఖించియున్నాడు ఇట్టి ఫలితమునకు, భూమి ఫలవంతమైనదిగను, ఖనిజ సంపత్సంభరితముగను ఉండుటయే కారణము. ప్రజలు సంతృప్తికరమగు జీవనోపాధికలిగియుండుటచే, సామాన్య గృహజీవనమునకు మించిన పరిస్థితులు కలిగి ఠీవిగా నుండుచుండిరి. ప్రజలు కళాకౌశలులై యుండిరి. భూమి సారవంతమైనదగుటచే పంటలు బాగుగ పండుచుండెను. ఫలవృక్షములు చక్కగ ఫలించుచుండెను. ప్రజలు పరిశుద్ధ వాయువును పీల్చుచుండిరి; పరిశుద్ధ జలమును త్రాగుచుండిరి. ఇక వారికి కొరత ఎందుకుండును? భూమ్యంతర భాగములందు పలువిధములయిన పొరలలో బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరము మొదలగు ఖనిజసంపద అమితముగా నుండెను. గృహోపకరణములు, ఆభరణాద్యలంకార వస్తువులు, యుద్ధాయుధములు, వివిధములయిన కొఱముట్లు నిర్మాణముకొరకు ఈ లోహాదులు ఉపయోగింపబడుచుండెను.

నదులు, సెలయేళ్ళు దండిగ నుండుటచే, భూమి సారవంతముగా నుండెను. ఆహారధాన్యములు, చెట్లు చేమలు, చక్కగ వర్దిల్లుటకు అనుకూలముగ నుండెను. సంవత్సరములో రెండు వానలు కురియుచుండుటచే, రెండు పంటలు పండుచుండెను. భారతభూమి యందు క్షామదేవత ఆ కాలములో ప్రవేశించనేలేదట ! పుష్టికరమగు ఆహారమున కెట్టి కొరతయు లేకుండెను. భూమియొక్క సారమునుబట్టియేగాక, భారతీయులు అనుష్ఠించు కొన్ని ఆచారవ్యవహారములవల్ల కరవు ప్రత్యక్షమగుటకు అవకాశమే లేకపోయెనట! ఇతర దేశములలో యుద్ధసమయ ములందు ఇరువాగుల వారును భూతలమును సర్వనాశనముచేసి, పనికిరాని బీడుగా చేయుచుండిరి. కాని భారతదేశములో రైతును పరమపవిత్రుడుగను అహింసనీయుడుగను భావించి, మహాసంగ్రామములు ప్రజ్వలించుచున్న సమయములో కృషికుని కెట్టి భయ సంకటములు సంభ వించకుండ ఉభయ శాత్రవవర్గములు జాగ్రత తీసికొను చుండిరి. ప్రక్క ప్రక్కగా ఎంత దారుణ సంగ్రామము జరుగుచున్నను, కృషీవలుడు భయాందోళనములు లేకుండ పొలము దున్నుకొను చుండెడివాడు. భారతీయులు యుద్ధసమయములో శత్రుభూమిని అగ్నిదగ్ధము గావించుటగాని, అందలి వృక్షములను నరకివేయుటగాని చేసెడివారు కారు. “రాజులు తమ శత్రుసైనికులను దునుమాడినను, ఉభయసైన్యములకు సమానముగా స్వకీయకష్టముతో మేలుగూర్చువాడగుటచే, వ్యవసాయకుని జోలికి వారు పోకుండిరి" అని ఒక బౌద్ధగ్రంథములో నున్నది. ఈ పద్ధతి అంతర్జాతీయ న్యాయశాస్త్రమునకు సంబంధించిన అత్యుత్తమ సంప్రదాయము. ఈ సంప్రదాయాచారము ఏ కాలమునందైనను, ఏ దేశమునందైనను అనుసరణీయ మని మెగస్తనీసు భావించియున్నాడు.

వ్యవసాయవృత్తి లాభప్రదమయిన దగుటచే, కృషీవలులే అధికసంఖ్యలో సంఘమునందుండిరి. పట్టణ జీవితపు సౌకర్యములను గూడ పెక్కుమంది గ్రామీణులు అనుభవించుచుండిరి. పట్టణములసంఖ్యయు కచ్చితముగా చెప్పుటకు వీలులేనంత బహుళముగానుండెను. ఈ పట్టణములు నదులతీరముననో, సముద్రతీరముననో నిర్మితము లగుచుండెను. అధిక వర్షముల వల్లనో, వరదలవల్లనో నాశన మగునని తలచి, కొద్దికాలమువరకే నిలుచునట్లుగ పట్టణములలో మ్రాకు కట్టడములను నిర్మించుచుండిరి. వర్షపు దెబ్బ, వరదల దెబ్బ తగులని స్థావరములందును, ఉన్నత పర్వతములమీదను కట్టబడిన పట్టణములలో మట్టి కట్టడములు, ఇటుక కట్టడములు నిర్మితములై యుండెను. ఇట్టి పట్టణముల పరిపాలనా విధాన మిదివరకే వర్ణించియున్నాము.

ఏ దేశమైనను ఆర్థికముగా అభివృద్ధి చెందవలెనన్నచో ప్రాణమానముల యొక్కయు, ఆస్తిపాస్తుల యొక్కయు, భద్రత ఆవశ్యకము. ఇట్టి భద్రత విషయములో చంద్రగుప్తచక్రవర్తి అత్యంత సమర్థతాపూర్వకముగ కట్టుదిట్టములు చేసియుండెను. ఇండ్లు వాకిండ్లకు, సొత్తుకు ఎట్టి కాపలాపెట్టుట ప్రజ లెరుగకుండిరి. అయినను దొంగతన మనునది అరుదుగా సంభవించు కార్యమై యుండెను. హిందువులు మితవ్యయ పరులయినప్పటికిని, అలంకార వస్తువుల యందును, ఆభరణముల యందును ఎక్కువ ప్రీతి కలవారు. ఇట్టి గుణము వాణిజ్యము, పరిశ్రమలు అభివృద్ధి నొందుటకు కారణభూత మయ్యెను. ప్రభుత్వము కళలకు, పరిశ్రమలకు దోహద మిచ్చు చుండెను. వర్తకులందరు ఒక శ్రేణి (guild) గా ఏర్పడి యున్నట్లు మెగస్తనీసు తెలుపుచున్నాడు. ప్రభుత్వమునకు వలయు యుద్ధాయుధములను తయారు చేయుట యందును, నావలను నిర్మించుటయందును బహుళ సంఖ్యలో జనులు పనిచేయుచుండిరి. ఈ పనివాండ్రకు ప్రభుత్వము జీతబత్తెములను ఒసగుచుండెను. నౌకాదళాధిపతి ప్రయాణీకుల ఉపయోగమునకును, సరకుల చేరవేతకును కొన్ని నౌకలను కిరాయికి ఇచ్చుచుండెడివాడు. నదులపై నడుచు నావలయందలి నావికులకు ప్రభుత్వమే వేతనము లిచ్చుచుండెను. చేతివృత్తులవారును, చిల్లర వర్తకులును ఆ కాలములో నుండిరి. గొఱ్ఱెల కాపరులు పశువులకాపరులు ఒక ప్రత్యేక సంఘముగా నుండు చుండిరి. వీరు పట్టణములందును, పల్లెలందును నివసింపక, గుట్టలమీద నివసించుచుండెడివారు. వీరు అడవి పక్షులను, అడవి జంతువులను తరుముచు అడవులయందు గ్రుమ్మరు చుండువారు. వీరు జంతువుల రూపములో రాజునకు పన్నులు చెల్లించుచుండెడివారు.

చంద్రగుప్త సార్వభౌముడు క్రీ. పూ. 324 రాజ్యమునకు వచ్చి 24 సంవత్సరములు మహా దక్షతతో అవక్ర విక్రమముతో ప్రజారంజకముగ రాజ్యము చేసి క్రీ.పూ. 300 లో దివంగతుడై నట్లు చరిత్రకారులు చెప్పుచున్నారు.

ఆ. వీ.