Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చంద్రగుప్తుడు

వికీసోర్స్ నుండి

చంద్రగుప్తుడు :

(కాలమీమాంస)

పాశ్చాత్య పండితులును, తదనుయాయులును చేసిన చంద్రగుప్త కాలనిర్ణయమునకును మన పురాణములలోని కాలగణనమునకును మిక్కిలి భేదము కలదు. మన పురాణముల ప్రకారము మహాభారత యుద్ధము కలియుగ ప్రారంభమునకు 36 సంవత్సరముల పూర్వము (క్రీ. పూ. 3138) శోభకృత్ సంవత్సర కార్తిక బ. ౩౦ నాడు ప్రారంభమై యుండెను. పరీక్షిత్తు జననమును, యుధిష్ఠిర శకము ప్రారంభమును ఆ సంవత్సరముననే జరిగెను. శ్రీకృష్ణ నిర్యాణముతో కలియుగ ప్రారంభమయ్యెను (క్రీ. పూ. 3102). అప్పుడే ధర్మరాజు పరీక్షిత్తునకు పట్టాభిషేకముచేసి భార్యతోను, సోదరులతోను మహాప్రస్థానము చేసెను.

పరీక్షిత్తునుండి 28 మంది రాజులు హస్తినాపురమును పరిపాలించిరి. క్రమముగా హస్తినాపుర రాజ్య మంతరించెను. పరీక్షిత్తు సమకాలమున మగధరాజ్యమును జరాసంధ వంశీయుడైన సోమాధి పరిపాలించెను. అప్పుడు మగధరాజ్యమునకు గిరివ్రజము రాజధాని. ఈ రాజవంశమునకు బార్హద్రథ వంశమని పేరు. ఈ వంశములో 22 మంది రాజులు 1006 సంవత్సరములు పరిపాలించిరి - "ఇత్యేతే బార్హద్రథాః భూపతయః వర్షసహస్రమేకం భవిష్యన్తి" (విష్ణుపురాణము - 4 అంశము - 23 అధ్యా). “వర్ష సహస్రమ్” అనునది స్థూలసంఖ్య. ఆయా రాజుల పరిపాలనా కాలగణనమున 1006 సంవత్సరములు వచ్చును (క్రీ. పూ. 2132 వఱకు). హస్తినాపుర రాజ్యము క్రమముగా బలహీనమై మగధరాజ్యము ప్రబల మయ్యెను. బార్హద్రథులలో చివరివాడైన రిపుంజయుని అతని మంత్రియైన మునికుడు సంహరించి తనకుమారుడైన ప్రద్యోతనుని సింహాసన మెక్కించెను (క్రీ. పూ.2132) - “యో౽యం రిపుంజయో నామ బార్హద్రథో౽న్త్యః తస్యామాత్యః మునికోనామ భవిష్యతి. సచైనం స్వామినం హత్వా స్వపుత్రం ప్రద్యోత నామాన మభిషేక్ష్యతి." (వి.పు. 4అం. 24 అధ్యా.)

ప్రద్యోతనుని వంశీయులు ఐదుగురు 138 సంవత్సరములు మగధరాజ్యము నేలిరి. (క్రీ. పూ. 1994 వరకు) - "ఇత్యేతే అష్టత్రింశ దుత్తరమేకశతం పంచ ప్రద్యోతనాః పృథివీం భోక్ష్య న్తి" (వి. పు. 4 అం. 24 అధ్యా.) వారిలో చివరివాడైన నందివర్ధనుని సంహరించి శిశునాగుడు రాజయ్యెను. ఇతని వంశమువారు పదిమంది 360 సంవత్సరములు పరిపాలించిరి (క్రీ. పూ. 1634 వరకు) - "ఇత్యేతే శైశునాగా భూపాలాః త్రీణివర్షశతాని షష్ట్యధికాని భవిష్యన్తి" (వి. పు. 4 అం. 24 అధ్యా). వీరిలో కడపటి వాడైన మహానందికి శూద్ర భార్యయందు జనించిన మహాపద్మనందుడు క్రీ. పూ. 1634 లో రాజయ్యెను- “మహానందిన స్తతః శూద్రా గర్భోద్భవః ... మహాపద్మ నందనామా..... భవిష్యతి (వి. పు. 4 అం. 24 అధ్యా.) ఇతడును, ఇతని యెనిమిదిమంది కుమారులును 100 సంవత్సరములు రాజ్యముచేసిరి (క్రీ.పూ. 1534 వరకు)-“మహాపద్మః, పుత్త్రాశ్చ ఏకం వర్షశత మవనీపతయః భవిష్యన్తి (వి. పు. 4 అం. 24 అధ్యా).


మహాపద్మాభిషేకాత్తు యావ జ్జన్మ పరీక్షితః
ఏక మేవ సహస్రంతు జ్ఞేయం పంచ శతోత్తరమ్.

అను మత్స్యపురాణ వచనమునకు ఈ లెక్క సరిపోవుచున్నది. “ఏక మేవ సహస్రం పంచశతోత్తరం" అనునది స్థూలసంఖ్య-1006+138+360 = 1504 అగును. క్రీ. పూ. 3138 – 1504 = 1634. పై లెక్కప్రకారము మహాపద్మనంద రాజ్యాభిషేకకాలము క్రీ. పూ. 1634 సరిపోవు చున్నది.

చాణక్యుడు (కౌటిల్యుడు) చివరి నందరాజును సంహరించి క్రీ. పూ. 1534 లో చంద్రగుప్త మౌర్యుని సింహాసన మెక్కించెను. “నవ చైతాన్ నందాన్ కౌటిల్యో బ్రాహ్మణః సముద్ధరిష్యతి .... కౌటిల్య ఏవ చన్ద్రగుప్త ముత్పన్నం రాజ్యే౽భిషేక్ష్యతి" (వి. పు. 4 అం. 24 అధ్యా). ఈ మౌర్యవంశమున పండ్రెండుమంది రాజులు 316 సంవత్సరములు రాజ్యము చేసిరి. (క్రీ. పూ. 1218 వరకు.) "ద్వాదశైతే నృపా మౌర్యాః, చంద్రగుప్తాదయో మహీమ్। శతానిత్రీణి భోగ్యన్తి, దశషట్చసమాః కలౌ" (కలియుగ రాజ వృత్తాంతము భా. 2 అధ్యా.)

పై వివరణమును గమనించినచో చంద్రగుప్తమౌర్యుని పట్టాభిషేకము కలిశకము 1568 వ సంవత్సరమునకు సరియగు క్రీ. పూ. 1534 లో జరిగినట్లు స్పష్టము. కాని పాశ్చాత్య పండితులు చంద్రగుప్తమౌర్యుని అలెగ్జాండరు సమకాలికునిగా గ్రహించి అతనిని క్రీ. పూ. 327 కు తీసికొని వచ్చిరి. నిజమునకు మౌర్యుల తరువాత


“దశై తే శుంగరాజానో భోక్ష్యన్తీమాం వసుంధరామ్
శతం పూర్ణం శతే ద్వే చ తేభ్యః కణ్వాన్ గమిష్యతి."
“చత్వార ఏతే భూపాలాః కణ్వగోత్ర సముద్భవాః
ధర్మేణ భోష్యన్తి మహీం పంచాశీతిస్తు వత్సరాన్”
“ఏతే ద్వాత్రింశదాంధ్రాస్తు భోక్ష్యన్తి వసుధామిమామ్
శతాని పంచ పూర్ణాని తేషాం రాజ్యం భవిష్యతి."
             (కలియుగ రాజవృత్తాంతము . 3 భా. 2 అ.)

శుంగవంశపు రాజులు 300 సంవత్సరములును, కణ్వవంశపు రాజులు 85 సంవత్సరములును, ఆంధ్ర రాజులు 506

సంవత్సరములును పరిపాలించిన తరువాత గుప్తవంశీయుడైన చంద్రగుప్తుడు క్రీ. పూ. 327 నాటికి మగధ సింహాసన మెక్కెను (క్రీ. పూ. 1218 (300 +85+506) = 327).

చంద్రగుప్తుని సభలో మెగస్తనీస్ అను గ్రీకు రాయబారి యుండెననియు, అతడు భారతదేశము తిరిగి తాను చూచిన విషయములు వ్రాసెననియు, అతని గ్రంథము ఉత్సన్నమైపోగా దానినుండి చరిత్రకారులు ఉదాహరించి యుండిన అంశములను కూర్చి 'ఇండికా' 'అను గ్రంథము తయారు చేయబడినదనియు చరిత్రజ్ఞు లెఱిగిన విషయమే గదా ! ఆ మెగస్తనీస్ మౌర్య చంద్రగుప్తుని సభలో ఉండియుండినచో మహామంత్రియైన చాణక్యుని (కౌటిల్యుని) గురించి ఒక్కమాటయైనను వ్రాసియుండడా ? పురాణము లన్నియు ఏకకంఠముగా చాణక్యుడు చంద్రగుప్తుని సింహాసన మెక్కించినట్లు చాటుచున్నవి. చీమలను గుఱించి కూడ మెగస్తనీసు వ్రాసిన మాటలు భద్రపరచినవారు అతడు చాణక్యుని గురించి వ్రాసియుండినచో దానిని ఏల ఉద్దరించియుండరు ? రాజులను గుఱించి వ్రాసిన వాక్యములు లభించుచున్నవి గదా ! ఆ ప్రసంగములో చాణక్యుని ఊసే లేదు. మెగస్తనీసు చాణక్యుని గురించి వ్రాయలేదు గనుక చాణక్యుడను నొక వ్యక్తి లేడనియు, అత డొక కల్పితపురుషుడై యుండు ననియు కొందఱు సిద్ధాంతీకరించిరి. నిజమునకు చాణక్యుడు సింహాసన మెక్కించిన చంద్రగుప్తుని కాలములో లేని మెగస్తనీసు, వేరొక (గుప్త) చంద్రగుప్తుని కాలములో ఉండిన మెగస్తనీసు చాణక్యుని ఉల్లేఖించకపోవుట సహజమే. అతడు చాణక్యుని పేర్కొనక చంద్రగుప్తుని పేర్కొనుటనుబట్టి అతడు పేర్కొనిన చంద్రగుప్తుడు చాణక్యుడు సింహాసన మెక్కించిన మౌర్య చంద్రగుప్తుడు కాడనుట సిద్ధాంత మగుచున్నది.

గ్రీకు చరిత్రకారులు వరుసగా భారతదేశము నేలిన ముగ్గురు రాజులను పేర్కొనిరి. 1. జాండ్రేమ్సు 2. సాండ్రో కొట్టోస్ 3. సాండ్రో సిప్టస్. వీరిలో సాండ్రో కొట్టోస్ మౌర్య చంద్రగుప్తుడని చరిత్రకారు లనుచున్నారు. ఈ పేర్లు కలిసినవి. కాని చంద్రగుప్తునకు ముందున్న రాజు నందరాజు. తరువాత వచ్చిన రాజు బిందుసారుడు. ఈ పేర్లతో వరుసగా జాండ్రేమ్సు, సాండ్రో సిప్టస్ అను పేర్లు కలియుటలేదు. ఇట్లుకాక గుప్త చంద్రగుప్తుడు సాండ్రోకొట్టోస్ అనుకొనినచో, అతనికి ముందున్న ఆంధ్ర రాజులలో చివరివాడైన చంద్రమస్ (చంద్ర బీజుడు, లేక చంద్రశ్రీ), తరువాత వచ్చినరాజు సముద్ర గుప్తుడు. ఈ పేర్లు జాండ్రేమ్సు, సాండ్రోసిప్టస్ అను పేర్లతో కలియుచున్నవిగదా ! దీనిని బట్టికూడ క్రీ. పూ. 327 లో ఉన్న వాడు మౌర్య చంద్రగుప్తుడు కాడనియు, గుప్త చంద్రగుప్తుడే యనియు తేలుచున్నది.

పురాణముల కాలగణనమును త్రోసివేయుటకు చరిత్రకారు లింకొక కారణమును చూపుదురు. "అశోకుని శాసనములలో ఆనాడున్న యవనాది రాజుల నామము లున్నవి. గ్రీకుచరిత్ర ప్రకారము వారి కాలము తెలియు చున్నది. కనుక వారికి సమకాలికుడైన అశోకుడు క్రీ. పూ. 272-232 సంవత్సరముల నడుమ ఉండినట్లు చెప్పవచ్చును. దీనిని బట్టి అతని తాతయైన చంద్రగుప్తునికి నిర్ణయించిన కాలము యుక్తి యుక్తముగ నున్నది" అని సిద్ధాంతము చేయుదురు. ఈ సందర్భమున ఈ క్రింది పట్టిక పరిశీలింపదగును :

అశోకుని శాసనములో ఉన్న రాజుల పేర్లు. (13వ శాసనము కాల్సీశిలమీద దక్షిణ భాగమున చరిత్రకారులు చదివిన పేర్ల పాఠము చరిత్రకారులు గుర్తించిన రాజుల పేర్లు
అతియోగ అంటియోక ఆంటియోఛస్ థియోస్ (సిరియా)
తులమయ తురమాయ (రెండవ) టాలమీ ఫిలడెల్ఫాస్ (ఈజిప్టు)
గొంగకేన అంటికిన అంటిగోనస్ గొనాటస్ (మాసిడోనియా)
మక మగ నుగాస్ (సిరినీ)
అలిక్యషుదలె అలికసుందర అలెగ్జాండర్ (ఎపిరస్, లేక, కోరింథు)
శాసనపాఠ మిది : "ష వేషుచ అతేషు అషషుపి యోజన షతేషు అత అతియోగే నామ యోనలాజా పలం చాతేనా అతియోగేనా చతాలి లజానే తులమయే నామ, గొంగ కేన నామ, మకా నామ, అలిక్యషుదలె నామ..." చరిత్ర కారులు తమకు తెలిసిన యవనరాజుల పేర్లకు సరిపోవుటకు తగిన విధమున శాసనములోని పేర్లను పఠించినట్లు స్పష్టమగుచున్నది. శాసనములోని పేర్లకును చరిత్రకారులు గుర్తించిన రాజుల పేర్లకును పోలికలేదు. చరిత్ర కారులు గుర్తించిన రాజులపేర్లు శాసనములు వ్రాసిన పాలీభాష ఉచ్చారణముతో వ్రాసినయెడల ఈ క్రిందివిధముగా నుండును :


ఆంటియోఛస్ థియోస్ - అంతియోఛషా థియషా
టాలెమీ ఫిలడెల్ఫస్ - తాలమి ఫిలడెలఫాషా
ఆంటిగోనస్ గొనాటస్ - అంతిగోనషా గొనాతషా
మగాస్ - మగాష్
అలెగ్జాండర్ - అలెగజాదలె

అంతేగాని శాసనములలో ఉన్నమాదిరి మార్పుచెందుట కవకాశముగాని, ఆవశ్యకతగాని లేదు. కనుక శాసనముల లోని రాజుల పేర్లకును చరిత్రకారులు గుర్తించిన రాజుల పేర్లకును ఏమియు సంబంధము లేదనుటకు సందేహము లేదుకదా !

శాసనములలోని రాజులు అశోకుని కాలమున భారతదేశపు పశ్చిమోత్తరభాగమున పాలించిన భారతీయ యవన రాజులు. ధర్మపరిత్యాగము చేసి మ్లేచ్ఛులైన రాజులు యవనాది నామములతో భారతదేశపు పశ్చిమోత్తర ప్రాంతముల నేలుచుండినట్లు మనుస్మృతి, రామాయణ, మహాభారత, పురాణ వాఙ్మయము తెలుపుచున్నది :


"శనకైస్తు క్రియా లోపా
        దిమాః క్షత్రియ జాతయః
వృషలత్వం గతా లోకే
        బ్రాహ్మణాదర్శనేన చ.
ప్రౌండ్రకా శ్చౌఢ్ర ద్రవిడాః
         కాంభోజా యవనాః శకాః
పారదాః పహ్లవా శ్చీనాః
        కిరాతా దరదాః ఖశాః"
               (మనుస్మృతి. 10 అ. 43, 44 శ్లో.)

"కాంభోజాన్ యవనాం శ్చైవ
        శకా నారట్టకా నపి
బాహ్లీ కా నృషికాం శ్చైవ
        పౌరవా నథ టంకణాన్.”
                 (రామా. కిష్కిం. 43 స-12 శ్లో.)

“శక కాంభోజ బాహ్లిక
        యవనాః పారదాస్తథా "
           (మహాభారతం. ద్రోణ. 121 అ. 13 శ్లో.)

“పూర్వే కిరాతా యస్యాం తే
        పశ్చిమే యవనాః స్మృతాః"
            (విష్ణుపురాణం. 2 అం. 3 అ. 8 శ్లో.)

“సౌవీరాః సైంధవా హూణాః
         సాల్వాః కోసలవాసినః
మద్రా రామా స్తథాంబష్ఠాః
          పారసీకాదయ స్తథా"
                (వి. పు. 2 అం. 3 అ. 17-18 శ్లో.)

ఈ యవనాదులే క్రమముగా పశ్చిమమునకు వ్యాపించి గ్రీకులు మొదలగువారికి కూటస్థులై యుండిరని చెప్పదగి యున్నది.

ఈ సందర్భమున ఈ క్రింది వాక్యములు పరిశీలింపదగి యున్నవి. “The Ramayana, Mahabharatha, Puranas and Brihatsamhita describe the territories on the western boundary of India in detail. Besides the five republics. it also notes the Yavana kingdom on its western side. The republics are: Sindhu in the Eastern Gandhara (Kandahar), Kekaya, Alekhya-sundara. In the Western Gandhara the republics are : Kambhoja (Turangamaya), Darada, Rashtrica, Maga (Saka), Alika Sindhura. In South Madra there are Anta-Kinnara, Madraka; and in Northern Madra there are Turamaya, Taramava, Yaksha etc. ” (Indian Chronology by Dr. D. S. Triveda, M.A.,Ph. D.,P.87) శాసనములలో ఉన్న పేర్లు ఇందు పేర్కొనబడిన కొన్ని రాజ్యముల పేర్లతో కలియుచున్నవి. గ్రీకు చరిత్రలలో ఎక్కడను అశోకునియొక్క గాని, ఇంకే ఇతర భారతీయునియొక్క గాని మతప్రచారము వారి రాజ్యములలో జరిగినట్లు వ్రాయబడియుండలేదు. "There is no evidence in any foreign literature that the King Asoka or any Indian ruler proclaimed his message abroad as is alleged in the inscription of the King Priyadarsi, by some modern scholars. It naturally arouses suspicion in our mind whether the name of any foreign ruler is recorded in the inscriptions." (Asoka's Eternal Religion, Hindustan Review, Patna-1952, p.p. 115-22. Cited by Dr. D. S. Triveda in his Indian Chronology p. 88). కనుక చరిత్రకారులు గుర్తించిన ఆయా యవన రాజులకాలమున అశోకుడు లేడనియు, అశోకుడు ఉదాహరించిన రాజులు భారతదేశపు సరిహద్దులోని యవనరాజులే గాని కొన్ని వేలమైళ్ల దూరముననున్న యవనరాజులు కారనియు నిర్ణయించుట ఉచితమగుట స్పష్టము. సిరియా 1750 మైళ్ళు, ఈజిప్టు 2400 మైళ్ళు, వీనికిని భారతసీమకును నడుమ అనేక దేశములు గలవు. కనుక ఇవి భారతసీమలోని వనుట పొసగదు. అంతేగాక గ్రీసు, ఈజిప్టు, సిరినీ మొదలగుచోట్ల ఆకాలమున బౌద్ధమత వాసన కూడ లేకుండుట పై నిర్ణయమును బలపరచుచున్నది.

ఇంకొక ముఖ్యమైనవిషయము గమనింపదగి యున్నది. మౌర్య చంద్రగుప్తుని సింహాసన మెక్కించిన కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రములో 65 వ ప్రకరణము "దాస కర్మకర కల్పః" అని కలదు. ఇందు మనుష్యులను బానిసలుగా విక్రయించు పద్ధతి, అందు జరుగు నేరములు, వానికి దండములు వివరింపబడినవి. మెగస్తనీస్ భారత దేశములో బానిపతనము అసలే లేదని చెప్పినాడు. "The same writer (Megasthenes) tells us further this remarkable fact about India, that all Indians are free, and not one of them is a slave. The Lakadaemonians and the Indians are here so far in agreement. The Lakadaemonians, however, hold the Helots as slaves, and these Helots do servile labour; but the Indians do not even use aliens as slaves, and much less a countryman of their own." (Mc Crindle; Ancient India as described by Magasthenes and Arrian Page 69, Fragment No. XXVI). దీనినిబట్టి మౌర్యచంద్రగుప్తుని కాలములో మెగస్తనీస్ లేడని కచ్చితముగా చెప్పవచ్చును. అంతేగాక మౌర్యచంద్రగుప్తుడు మెగస్తనీస్‌కు కొన్నిశతాబ్దములకు పూర్వము బానిసవర్తకము మనదేశములో జరుగుచుండిన కాలములో ఉండెనని చెప్పుటకు సందేహములేదు.

పై విషయములను బట్టి చారిత్రక పరిశోధకులు చేసిన అశోకుని కాలనిర్ణయము సరికాదనుట తేటతెల్లమగు చున్నది. కనుక వారి చంద్రగుప్త కాలనిర్ణయము గూడ సరికాజాలదు. చంద్రగుప్త మౌర్యుడు క్రీ.పూ. 1534 లో చాణక్యుని సాహాయ్యమున రాజ్యమునకు వచ్చెనే గాని చరిత్రకారులు చెప్పినట్లు అలెగ్జాండరు కాలమున (క్రీ. పూ. 327 ప్రాంతమున) కాదని నొక్కి వక్కాణించవచ్చును.

చంద్రగుప్తమౌర్యుని కాలము క్రీ. పూ. 1534 నుండి 1500 వఱకు, తరువాత బిందుసారుని రాజ్యకాలము క్రీ. పూ. 1472 వఱకు, అశోకుని కాలము క్రీ. పూ. 1472 నుండి 1436 వఱకు అని సిద్ధాంతముచేయుటకు పురాణములు తోడ్పడుచున్నవి. వాటిని కాదనుటకు చరిత్రకారులు చూపు ప్రమాణములు సరియైనవి కానేరవు.

భారతదేశ చరిత్రమంతయు చంద్రగుప్తుని కాలనిర్ణయము పైనే ఆధారపడియున్నది. ఇంకను ఈ విషయమున వివరములకు Kalhana's Rajatarangini edited by M. Troyer, Ancient History of India by Kuppaiah, Age of Sankara by T. S. Narayana Sastry, Dates in Ancient Indian History by A. Somayajulu, శ్రీ నడింపల్లి జగన్నాథరావుగారి ఆంధ్ర మహాసామ్రాజ్యము, శ్రీ కోట వెంకటాచలముగారి కలిశక విజ్ఞానము మూడు భాగములు, కలియుగ రాజవంశములు, అశోకుని కాలము నాటి యవనరాజులు ; Indian Chronology by Dr. D. S. Triveda, M. A., Ph. D., పురాణములలోని భవిష్య ద్రాజ వృత్తాంతములు, కలియుగరాజ వృత్తాంతము చదువవలెను.

శ్రీ. సో.