సంకీర్తన లక్షణము
శ్రీరస్తు
శ్రీమతే రామానుజాయనమః
తాళ్ళపాక యన్నమాచార్యుల కుమారుండు పెదతిరుమలాచార్యులు
వారి కుమారుండు చినతిరుమలాచార్యులు ఆనతిచ్చిన
సంకీర్తన లక్షణము
క॥ శ్రీవేంకటేశ్వరప్రియ ।
పావనచారిత్ర పూర్వపదకవిమణి తే ।
జోవరహారంబునకుఁ బ్ర ।
భావహక వినాయకత్వమలవడుచుండును ॥ 1 ॥
క॥వరకవితాగుణ చతురత ।
లరుదారఁగ దాళ్ళపాకన్నయయ ధరలో ।
దిరువేంకటాద్రిపతిపై ।
దొరకొని చెప్పంగఁ బదము తుదిపదమయ్యఁన్ ॥ 2 ॥
మఱియు దత్సంకీర్తనంబు లెట్టివనినా
క॥పావనములు హరిభక్తి వి।
భావనములు సర్వమంత్రపరమరహస్యో।
ద్బావనములు గాయకనిక।
రావనములు తాళ్ళపాకన్నయపదములు ॥ 3 ॥
క॥రంజనములు దుర్గుణగణ।
భంజనములు విమల కమల భవజనక గుణా।
సంజనములు సుజ్ఞాన ధ।
నాంజనములు తాళ్ళపాకన్నయపదములు ॥ 4 ॥
క॥సారంబులు హరికరుణా
సారంబులు విబుధనికర సంపూర్ణసుధా
హారంబులు బహుదేశ వి
హారంబులు తాళ్ళపాక యన్నయపదములు ॥5॥
క॥వేదంబులు పౌరాణిక
వాదంబులు వరకవిత్వవాణీ వీణా
నాదంబులు కృతసుజనాం
హ్లాదంబులు తాళ్ళపాక యన్నయపదముల్ ॥6॥
క॥లక్షణములు పదకవితా
రక్షణములు వివిధ కుకవిరాజీ మదసం
మ్మోక్షణములు వేంకటపతి
వీక్షణములు తాళ్ళపాక విభుసత్కవితల్ ॥7॥
క॥విన్నంతఁ బాపసంఘము
లన్నియు నడపంగఁ బూఁటయగుఁదాళులపా
కన్నయ పదములు వాడిన
యన్నయకోవిదుల వేంకటాధిపుఁదేలున్ ॥8॥
క॥మదిఁదాళ్ళపాక యన్నయ
పదములపై భక్తిగలిగి పాడిన విభవా
స్పదములగు వివిధ సంప
త్పదములు శ్రీవేంకటేశుపదములు దెలియున్ ॥9॥
క॥సంకీర్ణ వివిధ పాప వి
శంకట చిత్తులకునైన సర్వేశ్వరుపై
సంకీర్తనములు పాడిన
శంకాతంకములు వదలు శమనుని వలనన్ ॥10॥
క॥నక్తంచరారి తనకును ।
భక్తుండైనట్టి తాళ్ళపాకన్నయ చా ।
టూక్తి పదబంధ కవితా।
రక్తుండై యితర వాగ్విరక్తుండయ్యెన్ ॥11॥
వృ॥శ్రుతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై।
యతిలోకాగమవీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై।
కృతులై వేంకటశైల వల్లభ రతిక్రీడారహస్యంబులై।
నుతులై తాళ్లపాకయన్నయ వచోనూత్నక్రియల్ చెన్నగున్. ॥12॥
క॥భరతాది గ్రంథంబుల।
విరచించిన లక్షణములు వేంకటభూమీ।
ధర వర కీర్తన లక్ష్యము।
లురు పదకవితా పితామహుండేర్పఱచెన్ ॥13॥
గీ॥అట్టి యన్నయార్యుఁడానతచ్చిన పద।
లక్ష్య లక్షణముల లాగుదెలిసి।
పలుక నేర్చెనేని బాలుండుఁబ్రోడయౌ।
దత్ప్రబంధ మమృతధారఁబోఱి ॥14॥
వృ॥ధరలో దాళులపాకన్నయ గూరూత్తంసుండు సంకీర్తనా।
పరిశుద్ధిన్ మునుశేయఁబూని తగనుత్పాదించెఁదల్లక్షణం।
బరుదై మించిన సంస్కృతంబున కవీంద్రానంద సంధాయియై।
పరిపూర్ణాఖిల శాస్త్రసమ్మతముగా భావజ్ఞులౌనౌననన్ ॥15॥
గీ॥అలరుఁదాళపాక యన్నయార్యసుతుండు।
తిరుమాలార్యుఁడఖిల దేశికుండు।
తత్సుతాగ్రజుండ ధరలోనఁజినతిమ్మ।
యాహ్వయండఁదండ్రి యనుమతమున ॥16॥
వృ॥పరమామ్నాయ సమానమై వెలయు మత్పైతామహ గ్రంథమున్।
వరచాటూక్తి మదీయ్య పుణ్యజనక వ్యాఖ్యాతమున్ వేడ్కఁదా ।
చ్చరణాంభోరుహముల్ మదిందలచి సచ్ఛాస్త్రజ్ఞులింపొందఁగా।
వరుసం జెప్పెదఁబద్యరూపమునఁ దద్వాక్యనుసారంబునన్ ॥17॥
వ॥మహనీయ్యంబగు సంకీర్తన నాయక పదసంప్రదాయం బెట్టిదనినా.
సీ॥రమణీయ సంగీత రత్నాకర ప్రబంధాధ్యాయమున మక్తమయ్యెఁబదము।
సముచిత సంగీత చంద్రికాదేశైల యందు మిక్కిలిఁ దేటయయ్యెఁబదము।
అతులతత్సంవాదమైనట్టి సంగీత చూడామణిఁబల్కుచోటు పదము।
ధన్యసంగీత సుధాకర గ్రంథంబునందు మిక్కిలిఁజెలువొందుఁబదము ।
తానె యిన్నిఁటికిని మూలమైన భరత।
మందుఁబంచ దశాధ్యాయ మందు విమల।
వృత్త చూర్ణ నింబంధక వివిధనామ।
భవ్య లక్షణములకు నా స్పదము పదము ॥18॥
క॥అందరిలోఁ బదమార్గ।
చ్చందో మూఢాత్ము కవిత ఛందంబుల గో।
వింద పదభక్తి విరహిత।
మందుని ధర్మక్రియా క్రమంబున నడఁగున్ ॥19॥
క॥కృతి చెప్పిన యాతఁడలఁ।
కృతియుఁజమత్కృతియుఁగల్గఁగీర్తించినచోఁ।
గృతియగు నటుగాక యహం।
కృతి కృతిసేయంగ మిగుల గేలింబడఁదే ॥20॥
గీ॥పెటలు నేరక చూఁడిన బెనురవంబు।
లొదవ లక్షంబునైనఁబ్రయోక్తనైన।
సాధనమునైనఁజెఱుచు నీసరవిగాదె।
సంప్రదాయంబు నెఱుఁగని జడునికవిత ॥21॥
క॥వరదానంబున నైనను।
గురుముఖమున నైనఁ దెలిసికొను కవిపలుకుల్।
పరమామృతమౌ లేదా।
దురహంకృత కవిత నోరఁదోఁడండ్రు బుధుల్ ॥22॥
గీ॥సంప్రదాయాగత జ్ఞానసహితుఁడైన।
మనుజు సత్కవితయు వేదమంత్రసమము।
లదియ చాలదె శ్రీవేంకటాచలేశు।
చరణములు గను మనువునశ్చరణ మేల ॥23॥
క॥పదమగును సుప్తిజింతము।
పదమవయవమవయవియును పదమనఁబరఁగుం।
తుదినీ తెఱంగులన్ని యుఁ।
పదకవితా మార్గ సార్వభౌముఁడు దెలిపెన్ ॥24॥
అందు నవయవ పదం బెట్టిదంటేని-----
క॥విదిత చరుష్పాదంబగు।
నది వృత్తం, బదియధాతు, వవయవ సంజ్ఞం।
బదియ యని యన్నయార్యుఁడు।
పదిలముగా భరతశాస్త్ర పద్ధతిఁబలికెన్ ॥25॥
ఈ వృత్తంబులకు ధాతుసంజ్ఞ లెట్లయ్యె నంటేని-----
వృ॥వాతముఁబిత్తముం గఫము వర్ణిత సర్వశరీర ధారణా।
హేతువులయ్యఁగావున మహింజెలువొందెను ధాతుసంజ్ఞ నీ।
రీతినె వృత్తముల్ పదశరీర సముద్భవ కారణంబులై।
ధాతు సమాఖ్యలందె భరత ప్రముఖాఖిల మౌనిసమ్మతిన్ ॥26॥
వ॥ఇందులకు భాషానియమం బెట్టిదనిన.
గీ॥పదము సంస్కృతమునఁబ్రాకృతమున దేశ।
భాషనైనఁబొసఁగ బలుక వలయుఁ।
బ్రాసములును యతులు పద్యభంగినె చెల్లు।
ననిరి భరత దత్తిళాది మునులు ॥27॥
వృ॥కర్ణాట ద్రవిళాంధ్ర లాటవిలసద్గౌడాది భాషాస్థితిం।
గర్ణాపూర్ణ సుధా సమాన రుచులంగల్గించు దేశైళ దా।
స్వర్ణం బాభరణత్వ మెుందు కరణిన్ సంగీత శాస్త్రంబులన్।
వర్ణింపన్ దగు నామజాతి యుతమై వర్తించుఁ బ్రత్యేకమై ॥28॥
వ॥అట్టి పదం బెన్ని విధంబులం జెలువొందు ననిన
క॥బంధుర వృత్త పదంబు ని।
బంధ పదము, చూర్ణపదము భరతాగమసం।
బంధంబునఁ బద విజ్ఞా।
నాంధులకును దాళ్ళపాక యన్నయ దెలిపెన్ ॥29॥
వ॥అందు వృత్తపదం బెట్టిదనిన
క॥అందములై షడ్వింశ।
చ్ఛందోగణయుక్త వృత్తజాతుల పదముల్।
కందనమునకుం బరిమళ।
మందిన క్రియ వృత్తపదములలరుచు నుండున్ ॥30॥
క॥వృత్తజాతి యెల్ల విషమంబు సమమును।
నర్ధసమమునాఁగనతిశయిల్లు।
నందులోన విషమ మనునది నాలుగు।
పాదములును వేరే భంగిఁ జెల్లు ॥31॥
క॥నాలుగు పాదంబులు నొక।
చాలున వర్తించునదియ సమవృత్తం బా।
లీలన్ సమపదమును దా।
ళాలంకృత సామ్యపాదమై చెన్నొందున్ ॥32॥
గీ॥విషమ పాదంబులొక రీతి వెలయుచుండ।
సమ చరణములు వేరొక్క చందఁమైన।
నర్థసమ వృత్తమనఁ జెల్లు నట్టి పదము।
అర్ధసమపద మని యన్నయార్యుఁడనియె ॥33॥
వ॥మఱి నిబంధనామపదం బెట్టిదనిన
వృ॥యతులుఁ బ్రాసములుఁ బదంబులును మాత్రానీకముల్ తాళసం।
గతులుఁ గల్గి నిబంధనామపదం మాఖ్యాతార్థ సంయుక్త స।
త్కృతియై తాళ్లపాక యన్నయగురూక్తిన్ లోకవిఖ్యాతమై।
జితమాధ్వీక సితాసుధారస రుచిస్ఫీతంబునై చెన్నగున్ ॥34॥
వ॥అట్టి నిబంధనామ పదంబునకు తదంగంబులైన యతిప్రాసాదుల విదంబెట్టిదనిన.
క॥పాదముల నాలుగింటికి।
నాదుల నడుముల సవర్ణమగునని యతు లా।
పాద ద్వితీయ వర్ణము
పాదుగ నొక్కటియ చెల్లుఁ బ్రాసంబనఁగన్ ॥35॥
క॥మాక్రయెుకటి లఘువనఁదగు।
మాత్రాద్యయమైన గురుసమాహ్వయమయ్యెన్।
మాత్రాత్రయముపుతంబగు।
మాత్రార్థము దృతము భరతమతమునఁజెలగున్ ॥36॥
గీ॥పూని తాళక్రియాలసన్మానమునకు।
దాళశబ్ధంబు వర్తించు ధరణినదియు।
దేశి యును మార్గమును నాఁగఁదేజరిల్లు।
ధన్య భరతాధి బహుసంప్రదాయ లీల ॥37॥
వ॥మున్నుగా జెప్పిన నిబంధనామపదంబునకు నవయవంబులైన యవాంతర పదంబులకు పల్లవి యెట్టిదనినా—
క॥మెుదలుద్గ్రాహము, రెండవ।
యది మేళాపము, తృతీయమగు ధ్రువ మటపైఁ।
గదిసిన యది యంతరమా।
తుది నాభోగంబు ముద్రతోఁ జెలువొందున్ ॥38॥
వ॥యీ యవయవ పదంబులకు ననుకూలంబైన పల్లవి యెట్టిదనిన
క॥పదములయర్ధము బల్లవి।
వదలక యన్నిఁటికి నేక వాక్యతఁజేయన్।
గుదిగ్రుచ్చినట్లు తగులై।
పదము తుదిన్ మఱియు మఱియుఁబల్లవియలరున్ ॥39॥
గీ॥పదసమానమాన పాదయుగ్మముతుది।
నలరి పల్లవాఖ్యనతిశయిల్లు।
నందులోన నర్థమైన శిఖాపద।
మనిరి లక్షణజ్ఞులైనఘనులు ॥40॥
వ॥యీ పల్లవశిఖాపదంబులకుం బ్రయోగసంప్రదాయం బెట్టిదనిన
గీ॥పల్లవంబున్నచో శిఖాపదమగల్గి।
దదియుగల్గిన పల్లవమందు నుండ।
ధనుచు చూడమణిగ్రంధమందుఁ జెప్పె।
ననుచు సంగీతచంద్రిక యతఁడువల్కె ॥41॥
వ॥అందుఁజతుర్థాతుక నిబంధపదం బెట్టుండె నంటేని
గీ॥కల్పితోద్రాహమేళాప కదృవంబు।
వర్జితాఁతరమైకడుకడువఁన్నెగలుగి।
యుచితపల్లవికాభోగయుక్తమైన।
యది చతుర్థాతుక పదమనియండ్రు బుధులు ॥42॥
వ॥మఱిత్రిధాతుక నిబంధనామ పదం బెట్టుండెనని యంటేని
గీ॥పొసఁగ నుద్గ్రాహక దృువాభోగములను।
పల్లవియుఁగల్గియంతరిఁబరిహరించి।
పరివివర్జితమేళాపభాసమాన।
మైనయది యత్రిధాతుకమనిరి బుధులు ॥34॥
వ॥మఱి ద్విధాతుక నిబందనామబందం బెట్టంటేని
క॥వుగమును ధ్రవమునుఁ బల్లవిఁ।
దగజెప్పిన పదమది ద్విధాతుకమయ్యన్।
తగనేత్రకీర్తిలతికలు।
చిగురించఁగ ముద్రధ్రువము జేర్పగనమరున్॥44॥
వ॥మఱి ఏకధాతుక నిబందనామబందం బెట్టంటేని
క॥తగనేక ధాతు పదమీ ।
జగముననేలేదు నాట్యశాలలదేశిన్।
మెుగవరియని పాడుదురది।
యుగముఁ బల్లవియుఁ గూడియుండు జవియై ॥45॥
వ॥మఱియునుంబదవిశేషంబులెట్టివనిన
గీ॥ఘనతమీరంగ జయదేవ కవివరేణ్యుఁ।
డందమైనట్టి గీత గోవిందమందు।
నంచితాష్టపదులువలెనట్లబదము।
పరగు నెనిమిదిపదములు పల్లవియును ॥46॥
క॥రహిగలపల్లవిఁ బెనగొని।
సహజోజ్వలలీల నర్ధచాతురిగూడన్।
బహువిధములఁ బదమాలిక।
మహిలో జెన్నొందు సీసమాలికరీతిన్ ॥47॥
క॥ధర నెనిమిదిపాదంబుల।
బరిగినపదమదియ శరభపాదపదంబా।
వరమీమాంసక సముచిత।
పరిభాషలయందు నట్లపరగుటవలనన్ ॥48॥
గీ॥ముక్తకంబుఁ గుళకమునునాఁగదగి పద్య।
జాతివరగునట్లజగతినొకటి।
దరువనంగఁజెల్లుఁతగు కుళకంబెల్ల।
పదమునాఁగనతుల భంగినలరు ॥49॥
వృ॥పరగున్ వృత్తముజాతియంతయుఁ జతుష్పాద ద్విపాదాకృతిన్।
వరసంకీర్తనముల్ తదాకృతులనే వర్తించుమానంబుతో।
దరువుల్ జక్కులరేకులేల లునునిద్దంబైన గొబ్బిళ్ళు భా।
సురవాక్యంబులుఁ జందమామపదముల్ శోభిల్లునందంబులై ॥50॥
గీ॥దరువువాక్యంబు నర్థచంద్రకపదంబు।
యేలపాటయుగొబ్బిళ్ళునింపులైన।
చందమామపదంబునుఁ జగతిఁబాద।
యుగళముగ బహుజన సంప్రయుక్తిఁబరగు ॥51॥
క॥పీనాల్పలోహకాంచన।
మాన సమానతలువర్ణ మహిమనగుగతిన్।
హీనాధికపదములకు స।
మానతలొదవించువర్ణ మహిమధరిత్రిన్ ॥52॥
వ॥అందుఅర్ధ చంద్రకపదం బెట్లంటేని
క॥వుగమును ధ్రువమునభోగము।
సగమెపలికి పల్లవంబు సంధించినఁ జె।
నగు నర్ధచంద్రపదమన।
నగణితతానప్రతాన కాంచితమగుచున్ ॥53॥
వ॥మఱియు చూర్ణాఖ్యపదం బెట్టిదంటేని
క॥ధరగృష్ణాచార్యాదిక।
పరికల్పితపదము తాళబంధచ్ఛందో।
విరహితమై చూర్ణాఖ్యం।
బరగున నిర్యుక్తనామ భాసితమగుచున్ ॥54॥
వ॥మఱియుందచ్యూర్ణ విధం బెట్టిదనిన
చందోగణముల నియతిం।
బొందకతాళ ప్రమాణమునఁగడుఁజెలువై।
కొందరిచెందచ్చూర్ణం।
బందముగా తాళగంధియన బొగడొందున్ ॥55॥
క॥పదములు శృంగార వధూ।
మృధుమధుర మనోజ్ఞ వాక్యమిశ్రములైనన్।
విదితార్థ గ్రామ్యోక్తులు।
పదిలముగా బొంకమెఱిఁగిపలుకఁగజెల్లున్ ॥56॥
వ॥అది యెట్లంటేని---
క॥పురుషోక్తి సంస్కృతంబును।
దరణీవాక్యమునఁ బ్రాకృతము నీచవధూ।
పరిభాష నితరభాషలు।
పరిగినక్రియ నుచితభాష పదములఁజెల్లున్ ॥57॥
క॥పల్లవనారీమ్లేచ్ఛా।
ద్యుల్లాస మనేజ్ఞ బందురోక్తులుచవియై।
చెల్లును గ్రామ్యములైనను।
హల్లీసక ముఖ్యనాచకాధిక పణితిన్ ॥58॥
క॥జగతిఁగల చెల్లుబళ్లై।
నగినగి భాషించునట్టి నానుడిపలుకుల్।
తగదనరహిచెడుఁబువ్వుల।
సొగసుడుగంబిసికికంపు చూచినభంగిన్ ॥59॥
క॥వైరాగ్యవృద్ధి కరగం।
భీర పదశ్రేణిపొసగఁ బెనువుచు నగ్రా।
మ్యా రమ్యవిష్ణుచరితో।
దారములై యున్నఁ జాలుధరణిన్వెలయున్ ॥60॥
క॥దేహాత్మేశవివేకో।
త్సాహంబును లోకవేద ధర్మాధర్మా।
ద్యూహోపోహంబులఁగల।
యా హరిసంకీర్తనంబు లద్యాత్మంబుల్ ॥61॥
గీ॥మహితతానాంచిత విలంబమానమును।
తాళవిరహిరమై పదార్థంబుచెంది।
కేవల ద్విచతుష్పదాకృతిఁ జెలంగు।
నదియధరవాక్యమని యన్నయార్యుఁడనియె ॥62॥
గీ॥మహిమమీఱంగ ధ్రుతమధ్యమానములును।
జిత్రవర్ణంబుఁదాళంబుఁజెన్నుమీఱి।
మునుపఁబాడిన పదవాక్యములఁబొసంగి।
ధరణిద్విచతుష్పదాకృతి దరువుచెలఁగు ॥63॥
వ॥మఱియు చందమామ పదం బెట్టిదనిన
వృ॥దుస్తరవిప్రలంభమున దూతికతోడమెుఱంగి చంద్రవి।
న్యస్తభరస్వభావమున నాయకుఁడేనియుఁ గాంతయేనియున్।
విస్తరపాదవాదముల వేడుకఁజందురుఁబేరుకొన్నచో।
బ్రస్తుతికెక్కెఁదత్పదముభానురమై ద్విచతుష్పదాకృతిన్ ॥64॥
వ॥మఱి యేల పదం విదంబెట్లనిన
గీ॥నాయకాహ్వాన పూర్వమై నయముగలిగి।
మ్లేచ్ఛ పరిబాషఁదగి రాగమిళితమైన।
యేలపాటపదంబు నానిలఁచెలంగు।
మహితనాయక సంబుధ్ధి మద్యమగుచు ॥65॥
గీ॥యక్షగానపదంబులు నవ్విధమున।
సముచితానేక విధ తాళసంగతులను।
నవరసాలంక్రియాసవర్ణంబులగుచు।
నలరునని హరుకీర్తనాచార్యుఁడనియె ॥66॥
వ॥మఱియు బదసంధు లెట్టివనిన
క॥భావితలౌకికవైదిక।
పావనగతి నంద్రభాషఁబల్కెడు సంధుల్।
త్రైవిక్రమాదిభాషా।
భావజ్ఞులువల్కునట్టి పద్ధతిఁజెల్లున్ ॥67॥
క॥నానావిధదేశంబుల।
నానాకవిబుద్ధి వర్ణనారచనలచే।
మానితతానకరాగము।
తోనలరున్ దేశిపదము దొరలకుమెచ్చై ॥68॥
క॥భావరసాలంకృతీశ।
య్యావిధములఁదప్పులేక యందములగుచున్।
దైవిక మానుష రచనా।
పావనబంధబులైన పదములు వెలయును ॥69॥
క॥బూఱుగుకాయంగొఱికిన।
నీరసతూలంబు దిశలనిండిన గతి ని।
స్సారపదబంధకవితా।
పారీణుల పదము హాస్యపదమైయుండున్ ॥70॥
వ॥మఱియు యన్య గీతాచౌర్యం బెట్టిదనిన
గీ॥కూటసాక్షి సాక్షిగోరినం బలుకుట।
యన్యవిత్తములకునాశపడుట।
సభల నితరగీత చౌర్యంబుసేయుట।
భరతమౌనియెుక్క పాటియనియె ॥71॥
సంకీర్తన లక్షణము సమాప్తము