షోడశకుమారచరిత్రము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

షోడశకుమారచరిత్రము

పంచమాశ్వాసము[1]

క.

శ్రీచరణాంబుజసేవా
వైచిత్రీనిరత శిష్యవర్గమహాశ్రీ
ప్రాచుర్యమూలకరుణా
సూచితమాహాత్మ్య యన్నసూరామాత్యా.

1


వ.

అమ్మహీపాలునితో బేతాళుం డొక్కకథ విను మని యి ట్లనియె.

2


(5) భోజనవనితాశయ్యాచంగులకథ

మ.

నుతిపాత్ర మ్మగునంగదేశమున విష్ణుస్వామి యన్భూవరుం
డతిధన్యుండు శ్రుతాన్వితుండు మఘదీక్షాయుక్తుఁ డై సౌఖ్యవి
శ్రుతులన్ యౌవనరమ్యులం దనదుపుత్రు ల్మువురం జూచి త
త్కృతుకృత్యంబున కొక్కకచ్ఛపము దేరం బంచె వారాశికిన్.

3


క.

పనిచినఁ జని వార్ధితలం
బున నారసి యొక్కకూర్మముం గని పొలకం
పును బిచ్ఛిలంబు నగుత
త్తను వంటఁగ రోసి తరుణతాగర్వమునన్.

4

మ.

వనితాచంగుఁడ దీనికంపునకు నోర్వంజాలఁ జేపట్ట నే
నని యం దొక్కఁడు వల్కె; నొక్కరుఁడు శయ్యాచంగుడన్ దీనిమై
ఘనదుర్గంధము దుస్సహం బనుచు సోఁకం బాసె; నొక్కండు భో
జనచంగుం డను దీని ముట్ట యిచ్చన్ రోసె భూమీశ్వరా.

5


మ.

ఘనగర్వాంధమనస్కులై యిటులు దీక్షాభంగదోషంబుల
న్జనకుం డుండునధోగతిం దలఁప కాచారంబు ధర్మక్రమం
బును నూహింపక కచ్ఛపంబుఁ బొరిచూపుల్ సూచి వే యంట కే
చినగర్వంబున నేగి రుధ్ధతులకు న్సిద్ధించునే ధర్మముల్.

6


వ.

చని యాయువ్వురుం దమలోన వాదు మానక తమ తారతమ్యంబులం దగువారి నడిగి తెలిసికొంద మని కడంక విటంకాధీశుం డైన సేనజిత్తుపాలికి నరిగి.

7


క.

సంగడిన నిలిచి భోజన
చంగుండను నేను యువతిచంగుఁడ శయ్యా
చంగుఁడ నే మువ్వురలో
నం గడుసుఖ యెవ్వఁ డనిన నవకుతుకమునన్.

8


క.

ఈరే యిచ్చట నిలువుం
డారసెదఁ బ్రభాత మగు డనంతర మనుచు
న్వారల నెంతయు నాదర
మారంగా నిలిపి నృపతి యాదివసమునన్.

9


క.

రాజమృగనాభిపరిమళ
రాజితకలితోపదంశరసయుతగంధ

భ్రాజితశాల్యోదనమును
భోజనచంగునకు మోదమునఁ బెట్టుటయున్.

10


క.

అన్నంబు కమరువలచుచు
నున్నది భోజనము సేయ నొల్ల ననుచుఁ దా
నున్ననఁ దొలంగి వచ్చిన
నన్నరపతి కారణంబు నరయించుటయున్.

11


వ.

పితృవనక్షేత్రంబునం బండిన ధాన్యంబున నైనయన్నం బిది యన్నెలవు ప్రేతధూమావృతం బగుటచేతం గమరువలచెడి ని ట్లెఱుంగునే యని కొనియాడి వాని భోజనచంగుంగా నిశ్చయించి.

12


గీ.

ఒప్పు గలుగుదాసి నొక్కతెఁ జందన
మాల్యపట్టవస్త్రమండనములఁ
జెలువు మీఱునట్లు చేసి నారీచంగు
పాల నుండు మనుచుఁ బంచుటయును.

13


వ.

అది డగ్గఱిన నాసుభగుండు దానియొడలు మేఁకగదురు వలచుటయును నాక్షణంబ.

14


గీ.

ముక్కు మూసికొనుచు మునుకొని రోయుచుఁ
జాల నేవ పడుచు శయ్య డిగ్గి
యిట్టికష్టకాంత నెందును గానము
వెదకి యనిన మనుజవిభుఁ డెఱింగి.

15


వ.

ఆదాసిం బిలిపించి యిట్టికంపు వచ్చుటకుం గారణం బేమి యని పరికించి.

16


గీ.

జనని కడచిన నత్యంతశైశవమునఁ
గోలె నది యొక్క మేఁకచ న్గుడిచి పెరుఁగు

టెఱిఁగి నాఁ (డది యెఱుఁ)గుట యిచ్చ మెచ్చి
యధిపుఁ డతని నారీచంగుఁ డని నుతించె.

17


క.

సంగతసప్తాస్తరణో
త్తుంగం బగుపాన్పు ప్రియముతో నిడి శయ్యా
చంగు శయనింపఁ బనిచిన
సంగం బాశయ్యఁ జేర్చి యాక్షణమాత్రన్.

18


క.

ఒడ లొత్తె ననుచు వాఁ డెలుఁ
గడరఁగ వాపోవుచును రయంబున నాయి
ల్వెడలి చనుదేర భూపతి
యడుగుచు నాశ్చర్య మంది యంగ మరయఁగాన్.

19


వ.

ఏడుపఱుపులక్రింద నున్నవెండ్రుక యొత్తిన.

20


క.

ఒడల వలయంబులాంఛన
మడరఁగ నొకరోమ మొత్తి యరుణచ్ఛవి నే
ర్పడి యునికి సూప నచ్చెరు
వడి శయ్యాచంగుఁ డనుచుఁ బ్రస్తుతి చేసెన్.

21


క.

ఈవిధమున నవ్విభుఁ డా
మూవురయంతరము నరసి మోదంబున సం
భావించి యిష్టధసములు
భావ మలర నిచ్చుటయును బరమప్రీతిన్.

22


వ.

భోగపరాయణు లై యానగరంబున నుండి రంత నక్కడ.

23


క.

తనయాగము మానినఁ ద
జ్జనకుఁడు భార్యయును దానుఁ జాల నియతిమై
ననశవదీక్షాపరతం
దనువు దొరఁగి సురనికేతనంబున కరిగెన్.

24

వ.

అని కథ చెప్పి యీముగురయందు జనకుమరణం బెవ్వరిం జెందు నని యడిగిన.

25


సీ.

ప్రకటంబుగా నేడుపఱుపుల క్రిందట
        నున్నట్టి వెండ్రుక యొత్తినట్టి
యత్యంతభోగి శయ్యాచంగుఁ బొందదు
        కమఠంబుఁ బట్టనికడిఁదియఘము
మేలుఁ గీడు నెఱుంగఁజాలెడునట్టి త
        ద్జ్ఞులుగాని యెంతయు సుఖులుగారు
గాన భోజనచంగకామినీచంగుల
        యాగవిఘ్నంబున నైనయఘముఁ
దల్లిదండ్రులు గడచిన తద్దురితము
పొందు ననిన నదృశ్యుఁ డై భూజమునకు
వీఁక వేతాళుఁ డరిగిన వెంట నరిగి
బలముమీఱఁగఁ బట్టి భూపాలసుతుఁడు.

26


వ.

మగిడి చనఁ దొడంగిన నింక నొక్కకథ విను మని వేతాళుం డిట్లనియె.

27


(6) జ్ఞానవిజ్ఞానశూరుల కథ

సీ.

సురపురిజయిని నాఁ బరఁగునుజ్జయిని ము
        న్బుణ్యసేనుం డను భూవిభునకుఁ
జాలనిష్టుఁడు హరిస్వామి యన్విపుండు
        వినుతచరిత్రుఁ డై పెనుపునొందు
నతనికి వేదవేదాంగపారగుఁడు దే
        వస్వామి యనియెదు వరసుతుండు

భువనసన్నుత యనఁబొల్చు సోమప్రభ
        యనుకన్యయును గల్గిరామృగాక్షి
జ్ఞాని కొండెను నన్న విజ్ఞాని కొండె
నధికశూరున కొండె నిమ్మన్యునొల్ల
నిదియ నిశ్చయ మనుటయు నిచ్చయలర
నతఁడు నట్టుల చేసెద ననియె నంత.

28


మ.

ఇనవంశుం డగురాజు తత్పురముపై నేతెంచినం దాను మా
ర్కొనఁగా నోపక పుణ్యసేనమనుజేంద్రుం డాహరిస్వామి న
జ్జననాథాగ్రణిపాలికిం బనుప నుత్సాహంబుతో నేగి పో
యిన కార్యంబు ఘటింపఁ జేసి పురివై యేతేరఁగా నయ్యెడన్.

29


క.

శ్రీనందనసమభావుఁడు
భూనందితుఁ డొక్క విప్రపుత్రుఁడు నాకు
న్నీనందన నిమ్మని సుజ
నానందచరితుని నతని నర్థి నడిగినన్.

30


క.

జానివొ శూరుండవొ వి
జానివొ నాతనయ యిట్టిచందమునానిం
గాని వరియింప దన వి
జ్ఞాని నని పరీక్ష నేర్పెసఁగఁ జెప్పుటయున్.

31


క.

ప్రమదంబు నొంది విప్రో
త్తమ నాసుత నీకు నిచ్చెద న్నేఁటికి స
ప్తమ మగుదివసమున వివా
హము చేసెద ననుచు నిశ్చయంబుగఁ బలికెన్.

32


గీ.

సదమలజ్ఞాని యొకరుండు సదనమునకు
వచ్చుటయుఁ గన్నతల్లి భావం బెలర్పఁ

దనయ నిచ్చితి నేఁడవదినమునందు
నీకుఁ బెండ్లి చేసెద నని నిశ్చయించె.

33


క.

అతనిసుతుఁ డొక్కయెడ కొక
క్రతువునకుం జనిన నతనిఁ గని రూపబలా
న్వితుఁ డొకవిప్రసుతుఁడు స
న్నుతచరితా నాకు నీయనుజ నిమ్మనినన్.

34


క.

జ్ఞానివో శూరుండవొ వి
జ్ఞానివొ నాయనుజ యిట్టిచందము వానిం
గాని వరియింప దన్నను
నే నతిశూరుండ ననుచు నెంతయుఁ గడఁకన్.

35


వ.

ధనర్విద్యాకౌశలంబును మల్లవిద్యపెంపునుం బ్రకటించిన.

36


క.

ప్రమదంబు నొంది విప్రో
తమ నాయనుజాత నిచ్చెద న్నేఁటికి స
ప్తమ మగుదివసమున వివా
హము చేసెద ననుచు నిశ్చయంబుగఁ బలికెన్.

37


వ.

ఇవ్విధంబునం బ్రత్యేకనిశ్చయంబులు చేసికొని హరిస్వామియు దేవస్వామియు సదనంబునకు వచ్చి యొండొరువుతోడం దమతమనిశ్చయంబులు చెప్పక కన్యతల్లి నొడివినదినంబునకు వలయుపదార్థంబు లలవరించి రంత.

38


క.

శూరుండును విజ్ఞానియు
జ్ఞానియు నాలగ్నతిథికి సంభ్రమ మెసఁగం
గా నరుగుదెంచి రత్తఱిఁ
గానఁబడకపోయె విప్రకన్య యరుదుగన్.

39

ఉ.

దానికిఁ దల్లడిల్లి వసుధామరవర్యుఁడు జ్ఞానిఁ జూచి యే
మైనది నాతనూజ యని యడ్గిన నింతకము న్నదృశ్యుఁడై
దానవుఁ డొక్కఁ డింతిఁ గొని తద్దయు వీఁకను వింధ్యభూమి భృ
త్కాననభూమి సొచ్చె ననఁగా విని యెంతయు సంభ్రమంబునన్.

40


మ.

వెఱవార న్వెసనేగుతే రొకటి యావిజ్ఞాని గావింప సు
స్థిరశౌర్యం బెసఁగంగ శూరవరుఁ డాతే రెక్కి వింధ్యావనీ
ధరకాంతారము సొచ్చి యుగ్రగతి నాదైత్యేంద్రునిం దాఁకి
భీకరబాణంబుల వానిఁ ద్రుంచి వడి నాకన్యామణిం దెచ్చినన్.

41


తే.

కరము ముదమంది పుత్రికఁ గౌఁగిలించి
తగిన పెండిలికొడుకుల ముగురఁ గాంచి
మువ్వురును నుపకారు లీముగురయందు
దగినవరుఁ డెవ్వఁడని చింతఁ దగిలియుండె.

42


క.

అని కథచెప్పి నరేంద్రా
ఘను లాముగురందు విప్రకన్యావరణం
బున కెవ్వఁడర్హుఁ డనుటయు
జననాయకుఁ డిట్టు లనియె సరసత మెఱయన్.

43


ఉ.

ఆరసి జ్ఞానదృష్టిఁ గమలానన యున్నెడఁ జెప్పినాతఁడుం
దేరు ఘటించి నాతఁడు మదిం బరికింపఁగఁ గన్యరాకకుం
గారణమాత్రముల్ దనుజఘస్మరుఁడై వరవర్ణిఁ దెచ్చె నే
పారఁగఁ గాన శూరుఁడ మహార్హుఁడు కన్య వరింప నావుఁడున్.

44


క.

ఘనరయమున వేతాళుఁడు
చని తరు వెక్కుటయ వెంటఁ జని పతి మగుడం

గొనితేరఁగ నింకొకకథ
విను మని యాతనికి వింతవేడుక దనరన్.

45


(7) మదమంజరికథ

క.

మనుజేశ్వర శుద్ధపటుం
డనురజకుం డొకఁడు మోహనాకార మహీ
జనవినుతను మదమంజరి
యనియెడివరపుత్రిఁ గనియె నంబవరమునన్.

46


వ.

అన్నారీమణిమోహనాకారంబు గనుంగొని ధవళుం డనురజకుండు మనోభవాధీనమానసుం డైన వానిజనకుం డెఱింగి దానిజననీజనకుల నొడంబడిచి యక్కన్యం దనతనూజునకు వివాహంబు గావించుకొని పురంబునకుం దోకొని పోయిన.

47


క.

ధవళుండును వేడుక నా
ధవళాంశుముఖి న్వినూత్నధవళాంబుజచా
రువిలోచనఁ బొంది మనో
భవసౌఖ్యము నొందుచుండెఁ బాయనివేడ్కన్.

48


ఉ.

అంతట నొక్కనాఁడు దనయల్లుని గూతును దోడితేర న
త్యంతముదం బెలర్పఁగ నిజాత్మజు శుద్ధపటుండు పంపఁగా
నెంతయుఁ బ్రీతి వాఁ డరిగి యిద్దఱఁ దోడ్కొని యేగు దెంచుచో
సంతతశోభితం బయిన చండికగేహముపొంత నక్కడన్.

49


క.

ధవళుఁడు దనమఱందిని
ధవళేక్షణ సచట డించి తానొకఁడుఁ బ్రభా
ధవళ మగు భద్రకాళీ
భవనంబున కరిఁగి యధికభక్తియుతుం డై.

50

క.

తను విధి కడుఁ బ్రేరేపఁగ
మును మ్రొక్కితి నని కఠారమునఁ దనగళముం
దునుముకొని తల యుమాపద
వనజంబులమీఁద నిలిపి వ్రాలె ధరిత్రిన్.

51


వ.

అత్తెఱం గెఱుంగక యెంతయుం దడ వెదురుచూచి వానిమంది దేవిమందిరంబున కరిగి యాచందం బైనయతనిం గనుంగొని డెందంబునం దల్లడిల్లి నాకు వీనితోడిద లోకంబు గాక యని శిరంబు దెంచుకొని తానునుం గూలిన.

52


క.

పడఁతుక యయ్యిద్దఱు నటఁ
దడయుటకును మది భయంబు దనుకఁగ వెస న
గ్గుడిలోని కరిగి యిరువురుఁ
బడినవిధముఁ జూచి శోకభయవిహ్వల యై.

53


క.

ఆవరుఁడు సహోదరుఁడును
జీవంబులఁ బాసి యుండ జీవముతో నే
నీవార్త తల్లిదండ్రుల
కేవిధమునఁ జెప్పఁ బోదు నిం కిట ననుచున్.

54


క.

జీవంబు విడుచుతలఁపున
దేవీభవనంబుపొంత దీర్ఘతరువునం
దీవ యురి వెట్టి తత్సతి
యూవిశ్వసవిత్రి నిట్టు లని నుతియించెన్.

55


శా.

శ్రీరామాధిపవాగ్వధూవరులు నీశ్రీపాదసేవారతుల్
శ్రీరమ్యంబులు నీమహత్త్వములు నీశృంగారసాహిత్యలే
ఖారూపంబు మహీశుదేహము జగత్కళ్యాణి నీసత్త్వ మె
వ్వారుం బ్రస్తుతి సేయనేర్తురె కృపావారాశి కాత్యాయనీ.

56

వ.

అని వినుతించినం బ్రసన్న యై యాజగన్మాత సోదరునిం బతిని బ్రతికించెద నయ్యిరువురశిరంబులు దేహంబులఁ గదియింపు మనిన సంతసిల్లి యంధకారంబున నెఱుంగక.

57


గీ.

మగనిబొంది నన్నమస్తకం బొనగూర్చి
యన్నశిరము మగని నంటఁగూర్పఁ
దలలు వీడువడినతనువులతో వారు
జీవకలితు లైరి దేవికరుణ.

58


వ.

అని కథఁ జెప్పి వేతాళుండు నరేంద్రా వీరిలోన నింతికిం బతి యెవ్వఁ డగు నని యడిగిన నవ్వుచు సకలేంద్రియంబులందును శిరంబు ప్రధానం బగుటఁ బతిశిరంబువాఁడు పతి యగు ననిన వేతాళుం డెప్పటియట్ల తరువున కరిగిన మగుడం బట్టి తెచ్చునప్పుడు వేతాళుం డతని యాతాయాతంబుల డస్సితివి యే నడుగుప్రశ్నంబుల కుత్తరంబులు సెప్ప నీవ కాని యెవ్వరు నేర రింక నొక్కకథ విను మని యిట్లనియె.

59


(8) దేవసేనచరిత్రము

క.

మును వీరబాహుఁ డనియెడు
మనుజేశ్వరువీట రూపమహిమోన్నతుఁ డై
పెనుపొందెను ధనవంతుం[2]
డను వైశ్యకుమారుఁ డుజ్జ్వలాకారమునన్.

60


గీ.

అతఁడు దేవసేన యనియెడుకన్యక
యౌవనాభిరామ నసమధామఁ
జూచి మన్మథాస్త్రశోషితహృదయుఁ డై
యాత్మలోనఁ దాప మగ్గలింప.

61

క.

పరమేశుఫాలశిఖి యు
ద్ధురతం దనుఁ గాల్ప మంటతోడను మదనుం
డురవడి డెందము సొచ్చిన
కరణిం గామాగ్ని లోనఁ గాల్పఁ దొడఁగినన్.

62


వ.

ఆవాలుఁగంటి యొంటి విహరించునెడకుం జని తలం పెఱింగించిన నది లజ్జావనతవదన యగుచు నిట్లనియె.

63


గీ.

నను సముద్రదత్తుఁ డనుగుణాధికునకు
నిచ్చినాఁడు తండ్రి యెల్లి పెండ్లి
యనఘ నేను బరునియంగన నైయుండఁ
దగునె యిట్టితలఁపుఁ దలఁప నీకు.

64


క.

అనుటయు నాధనదత్తుఁడు
మనసిజదందహ్యమానమానసుఁ డై ప్రా
ర్థన మొనరింపంగా ని
ట్లనియెం గమలాయతాక్షి యతిమధురముగన్.

65


గీ.

పెండ్లి యాడి యేను బ్రియుని బొందకమున్న
నిన్నుఁ జెందు దాన నిక్కువంబు
నమ్ము రాకయున్న నాసుకృతము నీద
యనినఁ బ్రియముతోడ నరిగె నతఁడు.

66


సీ.

అపరదినంబునయందు శోభనలగ్న'
        మాసన్న మగుటయు నసమమహిమఁ
దల్లియుఁ దండ్రియఁ దగుకులోచితమంగ
        ళోపచారములు పెంపొందఁ జేసి
చెలవారఁ గన్యకు శృంగార మొనరించి
        భద్రంబు మీఱ సముద్రదత్తు

నకుఁ బెండ్లి యొనరించి నాటి నిశావేళ
        నాతనిశయ్యకు ననుచుటయును
దనమనంబున నెంతయుఁ దమక మడరఁ
గవియ వేడుకపడిన నాకాంతుతోడ
భయము లజ్జయు మదిలోనఁ బాయఁబెట్టి
యెంతయును ధైర్యమున నింతి యిట్టు లనియె.

67


గీ.

అధిప యేను సత్యహానికి నోర్వక
యొకటి నీకుఁ జెప్ప నుత్సహించి
వెఱచి యున్నదాన విపులధైర్యముతోడ
నవధరింపవలయు నత్తెఱంగు.

68


వ.

నిన్న ధనదత్తుఁ డనువాఁడు నన్నుఁ గామించి యేకతంబునం బట్ట సమకట్టిన వాని కారించుటకు నోర్వక యేను వివాహానంతరంబున వచ్చెద నని వానికి సత్యంబు చేసితి నాసత్యంబుఁ బాలింపు మనిన నొడంబడి సముద్రదత్తుండు తన్నుం బంచిన.

69


క.

ఆరమణి రత్నభూషణ
హారావళి వెలుంగ నొంటి నరుగఁదొడంగెం
దారావళివృతమూర్తి
స్ఫారాకృతి యొప్పు రాత్రిసతియుం బోలెన్.

70


వ.

ఇట్లు విజనం బగు పౌరమార్గంబున నిరర్గళగతి నరుగు సమయంబున.

71


సీ.

మిడిగ్రుడ్డులును గోరమీసంబులు మహాభు
        జములు విస్తీర్ణవక్షఃస్థలంబు

నతికఠినంబుఁ గాలాంజనాభము సైన
        విగ్రహంబును గుర్కువెండ్రుకలును
నీలాంబరంబును నిర్దయభావంబు
        నత్యంతభయదంబు నగుచుఁ దనరు
ఘనతరనిబిడాంధకారభయంకర
        శబరసేనాపురస్సరుఁడు వోలె
నసమనక్షత్రరత్నచౌర్యమున కంబ
రంబుఁ బ్రాఁక నమర్చిన రజ్జు వనఁగ
మెఱసి యసిదీప్తిపుంజంబు మిన్నుముట్టఁ
జోరుఁడొక్కండు వచ్చి యాసుదతిఁ జేరి.

72


క.

ఎక్కడిదానవు నడురే
యెక్కడికిం బోయె దొంటి నిప్పుడు నాచే
జిక్కతి రమ్మని యక్కఱి
యక్కటికము దొలఁగి తమక మడరెడుమదితోన్.

73


గీ.

రాజవదన యేఁ జోరులరాజ నాకు
నీవుఁ దొడవులుఁ జిక్కితి నిలువుమనుచు
మగున కరపంకజమువట్టి తిగిచె రాజు
కదళిఁ గబళించు నున్మదగజ మనంగ.

74


వ.

ఇట్లు కరంబు వట్టి తిగిచినం గరంబు భయంబునొంది యథైన నీతొడవులు గైకొని నన్నరుగంగనిమ్ము క్రమ్మఱ మగిడి వచ్చెద ననిన నవ్వుచు నవ్వనితం గనుంగొని.

75


చ.

మనసిజరాజ్యలక్ష్మి యగుమానవతీమణి నేకతంబునం
గనుఁగొని యిచ్చ నీప్సితసుఖంబులం బొందక నీవు వోయిర
మ్మనియెడు కూళుఁడుం గలఁడె యంగన యిట్టులు వల్కె దేటికి

న్వనితలు నేఱులు న్మగిడి వచ్చుట గల్గునె పాసిపోయినన్.

76


క.

అనవుడు నావనజానన
తనవృత్తాంతంబు జెప్పి తడయక వత్తుం
జననిమ్ము బొంక నావుడు
విని చోరుం డాత్మలోన విస్మితుడగుచున్.

77


సీ.

వామాక్షి క్రమ్మఱ వచ్చుట నిజమేని
        మును నీవు ధర్మదత్తునకుఁ జేసి
నట్టి సత్యము సేయు మనుటయుఁ బ్రియమంది
        యాపద్మలోచన యట్ల చేసెఁ
దస్కరుకడఁ బాసి ధర్మదత్తునిపాలి
        కరుగుటయును జోద్యమంది యతఁడు
సత్యంబు దప్పక చనుదెంచినప్పుడ
        వరదేవతవు నీవు పద్మగంధి
కన్య వైననాఁడు కడువేడ్కఁ గోరితి
గాని యిప్పు డన్యకాంత వైతి
కాన నన్నుఁ జేరఁ గాంతునిపాలికిఁ
జనుము నెమ్మి ననుచుఁ బనుచుటయును.

78


క.

ఇంతి యసత్యభయంబున
నెంతయు వెసఁ జోరుకడకు నేగి తనదువృ
త్తాంతముఁ జెప్పిన మది న
త్యంతాశ్చర్యంబు నొంది యాతఁడు కరుణన్.

79


క.

నీసత్యమునకు మెచ్చితి
నీసత్యముఁ దగవుఁగలదె యింతులకెందున్

నీసొమ్ము నిన్నుఁ గైకొను
నాస యుడిగె నాథుకడకు నరుగు మనుటయున్.

80


క.

తన పతికడకుం దాఁ జని
వనితామణి తాను బోయి వచ్చిన విధ మె
ల్లను జెప్పిన విని పతి మె
చ్చొనరఁగఁ గైకొని సుఖాబ్ధి నోలలనార్చెన్.

81


వ.

అని కథ చెప్పి వేతాళుండు.

82


క.

ఆమువ్వురలో సాత్త్విక
తామహితుం డారయ ధనదత్తుఁడొ చోరుం
డో మగువమగఁడొ యనుటయు
నామనుజాధీశుఁ డిట్టులను నాతనితోన్.

83


సీ.

పరపురుషునికడ కరిగెద నన్నప్డ
        విడువంగఁదగు నింతి విడువఁడయ్యెఁ
దలపోయఁగ సముద్రదత్తు చిత్తంబున
        సత్త్వగుణంబు లేశంబు లేదు
పరశాంత నృవదండభయమునఁ గవియని
        ధనదత్తునందు సత్త్వంబు లేదు
ముచ్చు ప్రాణములపై వచ్చినం జేరిన
        యర్థంబు విడువని యట్టివాఁడుఁ
దలఁప నిట్లయ్యె లోభ మింతయును లేక
మణివిభూషలు మానినీమణియుఁ దనకు
నబ్బి యుండఁగఁ బొ మ్మని యట్లు పనిచె
జగములోపలఁ జోరుండె సాత్త్వికుండు.

84


వ.

అనిన వేతాళుండు జనపతికి నదృశ్యుం డగుచు వృక్షంబున

కరిగిన వెనువెంటం జని తన్ను మనుజవిభుండు పట్టి తెచ్చునప్పుడు మఱియు నిట్లనియె.

85


క.

అడిగిన నెవ్వారికి నే
ర్పడఁ జెప్పఁగరానియట్టిప్రశ్నంబులు చొ
ప్పడఁ జెప్పితి నీమదికిం
గడ గలదే యింక నొక్కకథ విను మనియెన్.

86


(9) వైశ్యకన్యకథ

గీ.

(పూర్వకాలంబునను) భానుపురమునందు
ఘనుఁడు సూర్యప్రభుం డను మనుజనాథుఁ
డలఘుకీర్తి చందనమలయాద్రి యనఁగ
నెమ్మి రాజ్యంబు సేయు కాలమ్మునందు.

87


క.

ధరలోనఁ దామ్రలిప్తా
పురి ధనదత్తుఁ డను వైశ్యపుంగవుఁడు మనో
హరకాంతిరూపగుణములఁ
గర మరుదుగఁ దనరునట్టి కన్నియఁ గనియెన్.

88


క.

కప్పారు తుఱుమునున్నతి
యెప్పారెడు చన్నుఁగవయు నురుతరగరిమ
న్విప్పారు నితంబంబును
నప్పొలఁతికి జవ్వనమున నందము చేసెన్.

89


క.

అంతట విధికృతి జనకుం
డంతము నొందుటయుఁ దాను నమ్మయు దుఃఖా
క్రాంతయయి రాజవరులకు
నెంతయు భయమంది యరమెలను గొనుచున్.

90

వ.

పుత్రియుం దానును నర్ధరాత్రసమయంబునఁ బురంబు నిర్గమించి.

91


క.

తమభీతిశోకతమములఁ
దమమధికంబైనఁ దెరువు దప్పి యరిగి శూ
లమున నిడినచోరుని న
గ్రమునం గని యులికిపడుచుఁ గపించుతఱిన్.

82


క.

వడిఁ గొఱ్ఱు కంఠమున వెలు
వడి యునికిం జెసి నొప్పెపఱవఁగ వాఁడుం
గడుపుబ్బ ములుగఁ దొడఁగిన[3]
నెడగలుగుచు వైశ్యకాంత యెవ్వఁడవనినన్.

93


మ.

తెఱవా చోరుఁడ శూలసంగతుఁడ నైతిం గ్రూరకర్మంబుచేఁ
గొఱఁతం బొందితిఁ జావురా దకట నాకుం దొల్లి పాపంబులే
గుఱి లేకుండఁగఁ జేయఁబోలుదుఁ గడున్ గుప్పించె జల్వేదన
ల్దఱచై యెందును బాపకర్ములకు నేలా మంచిచా వబ్బెడున్.

94


వ.

అని పలికి మీ రెవ్వ రెవ్వలకినిం బోయెద రనిన నవ్వని తనియె.

95


క.

పతి చచ్చినఁ దల్లడిలుచు,
సుతఁ జోకొని దిక్కుమాలి చుట్టలకడకున్
గతి చెడి పోయెద నని తా
నతిదుఃఖిత యగుచునుండె నాసమయమునన్.

96


క.

రేరాజు వొడిచి యెక్కిన
జోరుం డావైశ్యకాంతసుత నతిసుభగా

కారం గనుఁగొని కడుఁ బ్రియ
మారఁగ నిట్లనియె దానియంబికతోడన్.

97


సీ.

అమితధనంబు శుల్కముగ నిచ్చెద నీకుఁ
        దనయ నాకొసఁగి చేదారవోయఁ
బుత్రార్థముగ నన్యపురుషుని బొందంగ
        ననుమతి యిచ్చెద నవ్విధమునఁ
బుత్రునిఁ గనిన నాపుత్రుఁ డై వాఁడు దు
        ష్కర్ముని నను నూర్ధ్వగతికి బుచ్చు
నాత్మసంభోగసౌఖ్యానందకందళి
        తాభిలాషుండ నై యడుగ నిపుడు
వీఁడు గాఱు లాడెడు నని విడిచిపోక
యింతి నిచ్చెద ననుమన్న నియ్యకొనుఁడుఁ
దన సమీపంబునందున్న ధనము సూపఁ
బుచ్చుకొని తనసుత దారవోసె; నతఁడు.

98


వ.

ఇట్లు ధారవోయించుకొని ప్రముదితాంతరంగుం సంతానార్థంబుగా నక్కన్య యన్యపురుషుం బొంద ననుమతి యిచ్చి యాక్షణంబ ప్రాణంబులం బాసిన నచ్చోటు వాసి ఘనం బగుధనం బాబరించుకొని పుత్త్రికాసమన్విత యై సూర్యప్రభుని పురంబునకం జని ధనంబిచ్చి తగువారిచేత నచ్చోరునికి నగ్నిసంస్కారాదులు చేయించి తన పినతండ్రి యగు ధనపాలుని మందిరంబునకుం జని సుస్థితి నుండి యొకనాఁడు.

99


క.

సౌధమున నుండి వేడుక
నాధనవతి యొకమహీసురాత్మజు రూప

శ్రీరాముని వరకాంతిసు
ధాధామునిఁ జూచి రాగతరళిత యగుచున్.

100


క.

మానసభవబాణాహతి
మానము గోల్పోయి తనదుమాతకు మదిలో
నూనినవిప్రకుమారుని
పై నెయ్యముఁ దనదుతాపభరముం దెలిపెన్.

101


వ.

దెలిపినం జోరవాక్యంబు మనంబునం దలంచి యఘంబు లేమికి నిశ్చయించి యెవ్వరు నెఱుంగకుండ వానిం దోతేర నొక్కదూతికం బుచ్చిన నాసొబగుం డి ట్లనియె.

102


గీ.

పంచశతరూప్యకంబులు వాయ కేను
నిచ్చలు వ్యయంబు సేయుదు నేఁడుమాత్ర
మిప్పు డేనూఱురూకల నిచ్చితేని
నరుగుదెంతు లేకున్న రా ననుచుఁ బలికె.

103


ఉ.

అప్పుడ యేగి దూతి యతఁ డాడినమాటలు వైశ్యకాంతకుం
జెప్పిన దాని చేతికిని శీఘ్రమ యర్థము నిచ్చి యేరికిం
జెప్పక రాత్రి రమ్మనినఁ జేకొని తా నడురేయి వచ్చి య
య్యొప్పులకన్య నింపు మెయి నోలల నార్చె సుఖాంబురాశిలోన్.

104


వ.

ఇత్తెఱంగున నత్తెఱవతోడి యభీష్టలీలలం దగిలి యారాత్రి గడపి ప్రభాతంబున నిజనివాసంబున కరిగి హారలతానామవారవనితాలోలుం డై యుండె, దత్సమాగమంబున వైశ్యపుత్రి దౌహృదలక్షణంబున నుల్లసిల్లి.

105


క.

గొంతివిధంబున గర్భం
బెంతయు గూఢముగఁ దాల్చి యినసమతేజుం

గాంతినిధి రాజలక్షణ
వంతు శుభాకారు నొక్కవరసుతుఁ గాంచెన్.

106


వ.

ఆపుత్రుఁ గాంచిననాఁటిరాత్రి గౌరీరమణుండు రమణికి గలసన్నిధిసేసి యిట్లని యానతిచ్చె.

107


మ.

తరుణీ నీసుతుఁ బెట్టెలోనిడి నృపద్వారంబునం బెట్టు మే
వ్వరునుం గానకయుండ నిఫ్టు చని లేవం గాంచి సూర్యప్రభుం
డురుతేజంబున వానిఁ జూచి మదిలో నుప్పొంగుచుం బుత్రుఁగా
నిరవద్యోత్సవలీలమైఁ బెనుచు వీని న్నాదు దివ్యాజ్ఞ మై.

108


వ.

అనుటయు.

109


క.

పతి లేనిసుతుఁడు గలుగుట
యతినింద్యం బగుట మున్న యాత్మ వగచున
య్యతివ పరమేశునానతి
నతిసంతోషంబు నొందె నాక్షణమాత్రన్.

110


చ.

తనకపు డీశ్వరుండు విదితంబుగ నత్తెఱఁ గెల్లఁ జెప్పిన
న్విని ప్రియ మంది సజ్జ నిడి నిర్మలచేలము గప్పి తత్సుతుం
బెనుచు ఋణంబులేమికయి పెంపున మాడలు వేయి కొంగునం
దొనరఁగఁ గట్టికొంచుఁ జని యుంచెను రాజగృహంబు వాకిటన్.

111


వ.

అ ట్లెవ్వరు నెఱుంగకుండ నప్పట్టిం బెట్టి వచ్చి యక్కోమటిలేమ తనతల్లి గృహంబున నిశ్చింతంబున నుండె నంతకమున్న మేదినీకాంతుండు సంతానార్థియై పరమేశ్వరప్రార్థనంబు చేయుట నద్దేవుండు కరుణించి నాఁటిరాత్రి కలలోనం బొడసూపి యఖర్వసార్వభౌమపాత్రం బగు పుత్రుండు ప్ర

భాతంబున నగరివాకిట నుండెడుఁ గైకొని పెనుపు మని యానతిచ్చిన నానతుఁ డై యానందంబునుం బొంది వేకువ నగరి మొగసాలకుం జని యబ్బాలునిం గాంచి మహోత్సవంబు లొనరించి చంద్రప్రభుం డను పేరిడి పెనుప నక్కుమారుండు గ్రమవర్ధితుండును, సకలవిద్యావిశారదుండును నై సంపూర్ణయౌవనంబు నొందిన సమయంబున.

112


క.

ప్రభువరుఁ జంద్రప్రభు నిల
కభిషిక్తుం జేసి (యడవి) కరిగి నగసుతా
విభుఁ గొలుచుచు సూర్యప్రభుఁ
డభిషతయోగాభినిష్ఠ నసువులు దొఱగెన్.

113


క.

జనకుండు మేను దొఱఁగుట
విని చంద్రప్రభుఁడు నాత్మవివశుం డై యో
లిన పారలౌకికక్రియ
లనూనముగఁ జేసి గయకుఁ జని యచటన్.

114


వ.

వేదచోదితానుష్ఠానంబు నొనరించి పిండప్రదానంబు సేయం గరం బెత్తుటయు నక్కజంబుగా నాసమయంబున.

115


గీ.

అంచితపవిత్రభూషణం బైనకరము
కంకణసముజ్జ్యలం బైనకరము గాఁగ
సలఘుశంఖశస్త్రాంకిత మైనకరము
మూఁడుకరము లాభూపాలుమ్రోల నిలిచె.

116


క.

ఆకరములఁ గని (ఘన)చిం
తాకులమతి యగుచుఁ బిండ మాకరములలో
నేకరమున నిడనేరక
వే కరముం దిగిచికొనుచు విన్నఁదనముతోన్.

117

వ.

వేదశాస్త్రపారగు లగు నచ్చటిపెద్దలకు నాహస్తములు సూపి యిట్లగుటకుం గారణం బేమి యన వారు విచారించి యిట్లనిరి.

118


చ.

పరమపవిత్రహస్త మిది బ్రాహ్మణహస్తము శంఖశస్త్రప్రభా
సుర మయియున్నహస్త మిది చోరునిహస్తము రత్నకంకణ
స్ఫురణ దలిర్చుహస్త మిది భూపతిహస్తము వీనిలోన నే
కరమును బాత్రమో నిజముగాఁ గన రాదని పల్కి రందఱున్.

119


వ.

అని కథ చెప్పి వేతాళుండు భూపాలా యాకరంబుల మూఁటియందు నేగరంబు పిండప్రదానంబున కర్హం బని యడిగినం బుడమిఱేఁ డిట్లనియె.

120


ఉ.

కొంగున మాడ లూడ్చికొని కొడ్కని పెంచినరాజు తండ్రి గాఁ
డంగజకేళికార్థము తదంబిక వేఁడిన విప్రుఁడుం దలం
పంగ గురుండు గాఁడు కులభామిని గాఁగ వరించె వాని మా
తం గమియంగ నర్థ మిడి తండ్రగుఁ జోరుఁడు వాని కారయన్.

121


వ.

పిండప్రదానంబునకుం జోరుకరం బరయ నర్హం బనుటయు నదృశ్యుం డై యెప్పటిభూజాతంబున కరుగ వెనుకన చని తన్నుం బట్టి తెచ్చునెడ వేతాళుండు నమ్మహీపాలున కిట్లనియె.

122


క.

ఎన్నేనియుఁ బ్రశ్నములకు
నెన్నఁగఁ దగునుత్తరంబు లిచ్చితి నాకున్
నన్ని ట్లలజడి వెట్టుచు
నున్నాఁ డని తలప కింక నొకకథ వినుమా.

123

(10) ధర్మరాజుకథ

క.

మనుజేశ ధర్ముఁ డనియెడు
మనుజాధీశ్వరుఁడు, తొల్లి మార్తుర చేతన్
ధనమును రాజ్యముఁ గోల్పడి
తననగరము విడిచి తరళితస్వాంతుండై.

124


క.

ఆవిభుఁడు ఖడ్గదీప
వ్యావృతహస్తుఁ డయి చంద్రవతి యనుదేవిన్
లావణ్యవతి యనెడుసుత
నావనమునఁ గొనుచు నొకఁడు నరిగెడు వేళన్.

125


చ.

అలఘుమణిద్యుతం బొలుచు నావిభు భూషణరాగుఁ జూచి బో
యలు గడువీఁకఁ దాఁకుటయు నందట మున్మిడిశాతహేతి ని
ర్దళితులఁగా నొనర్చి భుజదర్పము మానక నిల్చి వారిచే
నలుగులవేదన న్వివశుఁ డై హరివీటికిఁ దాను నేగినన్.

126


ఉ.

అన్నరనాథుఁ డీల్గుటయు నాతని కామిని దానుఁ బుత్రియు
న్విన్నఁదనంబు దోఁప నటవీస్థలి నేగెడుచోటఁ జన్నులుం
బెన్నిఱివేణులున్ జఘనబింబములుం గడు వీఁగఁ జేయఁగా
సన్నపుఁగౌను లెంతయును సంచల మందఁగ నార్తి గూరుచున్.

127


క.

ఉలుకుచు నేగిరి వెస బె
బ్బులిరాకకుఁ దొలఁగులేళ్ళపోలికి భయసం
చలితవిలోచననీలో
త్సలరోచులు గప్పి విపినభాగము లొప్పన్.

128

వ.

అట్లరిగి యరిగి యత్యంతపథిశ్రాంతి నొంది.

129


క.

[4]లుంగలవంగ.....
.........................నన్ గిరిసరసీ
తుంగతలవనముఁ దూఱి ల
తాంగులు వేస నడఁగి యుండి రచ్చట నంతన్.

130


వ.

చండవిక్రముం డనుమండలనాథుండు సింహవిక్రముం డనుతనయుండునుం దాను నక్కాననంబునకు వేఁట వచ్చి యప్పొలంతులు చనినచొప్పు గాంచి పుత్రు నవలోకించి.


క.

అడుగులు నిడు పగుకాంతయు
నడుగులు కుఱుచ లగునంబుజాక్షియును భయం
బడరఁ జనినారు వీరలఁ
బొడగని (మన)పురికిఁ గొంచుఁ బోయేదమేనిన్.

132


క.

చరణములు నిడుపు లగునా
సరసీరుహనేత్ర నాకు సన్నపుఁ బాదాం
బురుహములయింతి నీకును
[5]గరనీత లటంచు నూత్నకౌతుక మెసఁగన్.

133


క.

చరణంబులచొప్పునఁ జని
సరసీతటికాననమున శ్రమపడిన మనో
హరవనదేవతలో యనఁ
గర మొప్పెడుసతులఁ గాంచి కడుముద మొదవన్.

134


ఉ.

వాడియు నొప్పు సేసె ముఖవారిరుహంబులు ఘంటికావళి
న్వీడియు వేడ్కఁ బెంచె నెఱివేణులు గ్రమ్మెదుఘర్మవారిలోఁ

గూడియు సమ్మదంబు నొడఁగూర్చెను మేనులు చూడ్కి భీతి న
ల్లాడియుఁ బొల్చె నీసతులయందము సుస్థితి నెట్టులుండునో.

135


వ.

అని యిట్లభినందించి సమయంబు చేసికొనినవిధంబునం బెద్దయడుగులముద్దియం దండ్రియుం గుఱుచయడుగులతెఱవఁ బుత్రుండును నత్యనురాగంబునం గైకొని పురంబునకుం గొని చని యల్లన నయ్యింతులవిధం బంతయు నెఱింగి.

136


క.

కుఱుచడుగులయది తల్లియుఁ
గుఱుచలు గానడుగులయది కూఁతురు నయినన్
వెఱఁగంది వారినియతిం
దొఱఁగక వరియించి రరయ దుర్నయ మైనన్.

137


వ.

అని కథ చెప్పి వేతాళుండు నరేంద్రా వారిరువురకును నవ్వారిజనేత్రలవలన ననేకపుత్రు లుదయించిరి తత్తనయులు దమలోన నేమి యగుదు రని యడిగిన.

138


క.

ఎప్పగిది విచారించినఁ
జెప్పంగానేర రాక చింతాకులుఁ డై
చెప్పఁగరా దీప్రశ్నముఁ
జెప్పు మనుచు నడిగె నేమి సేయుదు ననుచున్.

139


వ.

నిర్విణ్ణుం డై మౌనంబునం జనుచున్న యమ్మానవేంద్రువలన సంతుష్టుం డై వేతాళుం డిట్లనియె.

140


మ.

ధరణీనాయక నీదుశౌర్యమును సత్యంబుం బ్రతాపంబు ని
ద్ధర నెవ్వారికి లేదు నీ దగుచరిత్రం బెప్డు విన్వారలం
గర మర్థిం బులకింపఁ జేయుచు శిరఃకంపంబు చేయించు నీ
సరిగా సన్నగఁ బోలు రాజు గలఁడే సర్వజ్ఞచూడామణీ.

141

చ.

నరవర బ్రాహ్మణుండు నిను నా కుపహారము చేయఁ బూనె న
స్థిరుఁ డతిపాపచారి ననుఁ దెమ్మని పంచుట నిట్లు నీవు న
స్వరమతిఁ గొంచుఁబోవుటయు నాకుఁ బ్రణామము సేయఁ బంచి నీ
శిరము హరించుఁ దోనె యిటు చెప్పితి నీకు హితోపదేశమున్.

142


క.

నిను నాకు మ్రొక్కు మనఁగా
మును మ్రొక్కి యెఱుంగ నేను మ్రొక్కిడువిధ మి
ట్లని చూపు మనుచు మ్రొక్కఁగ
దునుము వెస న్వానిశిరము దోరసిచేతన్.

143


వ.

ఇవ్విధంబు నాచేత వినక మోసపోయి తేని నీశిరంబును హృదయపద్మంబును నాకు నివేదించి వాఁడు విద్యాధరచక్రవర్తిపదంబు నొందు నీవు పరమపుణ్యుఁడవు గావున నీ కట్టి యపాయంబు పుట్టదు నీవు వానిశిరంబు ద్రుంచి తదనంతరంబ తద్వక్షోదళనం బాచరించి హృదయపద్మంబు వుచ్చి నన్నుం బూజింపుము నీకు మనోరథసిద్ధి యయ్యెడు నని దీవించి యే నీశవంబురూపంబునం బాసి యవ్వటపి కరిగి భిక్షుం డాకర్షింప వచ్చి యందుఁ బ్రవేశించి నీకు వరదుండ నయ్యెద నీవు దీని నేదియు నెఱుంగనివాఁడవుగా నీకళేబరంబుఁ గొని చను మని పంచిన వినతుండై యమ్మేదినీకాంతుండు.

144


క.

ఆక్షణమ శవము గొనిచని
భిక్షున కొగి నిచ్చుటయును బ్రియమున నీన
ర్వక్షితియు నీవ యేలుచు
నక్షయ మగుపెనుపుఁ బొందు మని దీవించెన్.

145

వ.

ఇట్లు తపోధనుండునుం బోలె నాశీర్వాదంబు చేసి.

146


సీ.

వివిధసత్సాధనవిరచితం బగుచు వి
        చిత్రచిహ్నంబులచెలువు గలిగి
యుండెడు నయ్యగ్నికుండంబులనడుమ
        నృపు తెచ్చినశవంబు నిలువఁబెట్టి
యాభిక్షుకుఁడు దక్షిణాభిముఖుం డయి
        మహనీయ యనుమంత్రమహిమఁ జేసి
వేతాళు నర్థి రావించి శవంబునం
        దమర నిశ్చలమతి నావహించి
యరుణచందనకుసుమమాల్యముల నర్ఘ్య
ముఖ్యవిధులను బూజించి సౌఖ్య మెసఁగ
నధిప వేతాళపతికి సాష్టాంగవినతి
సేయు మిష్టార్థములు నిన్నుఁ జేరు నెందు.

147


వ.

అనవుడు.

148


క.

మ్రొక్కుగొనఁ గాని యొరులకు
మ్రొక్కి యెఱుఁగ నాకుఁ జూపు మ్రొక్కెడితెఱఁ గే
మ్రొక్కెద మఱి యనవుడు విధి
ద్రెక్కొన సాష్టాంగ మున్నతిం జేయుటయున్.

149


క.

భూరమణుఁడు సంభ్రమమున
దోరసిచే భిక్షుశిరము దునిమి సుభక్తిన్
బోరున వేతాళున కుప
హారము గావించి ప్రణతుఁడై లేచి వెసన్.

150


క.

ఆతపసి పేరురంబును
హేతిశితాగ్రమునఁ జీరి హృత్పద్మమునన్

వేతాళుని బూజించెను
నాతఁడు గడు వరదుఁడయ్యె నాసమయమునన్.

151


వ.

పితృవననివాసుఁ డైన పరమేశ్వరుండు సర్వదేవపరివృతుం డై పుణ్యశ్లోకుం డగు నమ్మహీకాంతునకు సన్నిధిచేసి యతనికి విద్యాధరచక్రవర్తి పదం బొసంగి యంతర్హితుం డయ్యె నంతం బ్రభాతం బగుటయు మహేశ్వరప్రసాదంబున విద్యాధరులు వచ్చి తోడఁ గొనిపోవ విద్యాధరచక్రవర్తి పదంబున కభిషిక్తుం డై నిజపురంబున కరుగుదెంచి యుభయరాజ్యసౌఖ్యంబుల ననుభవించుచుఁ బెంపొంద నక్కాలంబునందు.

152


మ.

అహిలోకంబునఁ బన్నగేశ్వరసముద్యత్కాంతిఁ బోషించుచున్
మహి దుగ్ధాబ్ధి హిమాగతారనగధామవ్రాతము ల్విస్ఫుర
న్మహిమం గూర్చుచు నింగి తారరుచులం బాలించుచు న్సర్వలో
కహితుం డానరనాథుకీర్తి పరఁగెన్ గంగాప్రవాహాకృతిన్.

153


క.

అనుచుఁ ద్రివిక్రమసేనుని
వినుతచరిత్రంబుఁ జెప్పి వేతాళుఁడు నా
కును వాహనముగఁ జేయుట
కనుకూలం బైన మంత్ర మది దయ నిచ్చెన్.

154


వ.

ఆమంత్రం బత్యంతనిష్ఠతో ననుష్టించి తత్ప్రభావంబున వేతాళవాహనుండ నై వచ్చి దేవరం గాంచి ధన్యుండ నైతి ననిన నక్కుమారకేసరి విక్రమకేసరి నభినుతించి రానిచెలుల కెదురుచూచుచుఁ బూజ్యసామ్రాజ్యభోగంబు లనుభవించుచు నొక్కనాఁడు.

155

శా.

ఆపస్తంబపవిత్రసూత్ర హరితఖ్యాతాన్వవాయామృతా
కూపారామరభూజ భక్తివినతక్షోణీశచూడామణీ
దీపారాధితపాదపీఠధరణీతేజఃప్రతిష్టాపన
వ్యాపారావతషట్సహస్రకులచూడాకల్చరత్నాంకురా.

156


క.

మరకతమౌక్తికవిద్రుమ
కురువిందమహేంద్రనీలగోమేధికవి
స్ఫురితమణిఖచితభూషణ
పరితోషణసుకవిలోక భవ్యవివేకా.

157


ఉత్సాహ.

బంధురప్రబంధబంధభవ్యనవ్యభాషణా
సింధుసమగభీరతానిశేషనిత్యభూషణా
సింధురాతప్రచురతురగసేవ్యవాజిశిక్షణా
బంధుమిత్రసుకవినికరపాలనావిచక్షణా.

158


గద్యము.

ఇది శ్రీమద్వెన్నెలకంటి సూరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనమైత్రీవిధేయ అన్నయనామధేయప్రణీతం బైన పోడశకుమారచరిత్రంబునందుఁ బంచమాశ్వాసము.

  1. తృతీయ చతుర్థాశ్వాసములు లభింపలేదు.
  2. ధనదత్తుఁడు, ధర్మదత్తుఁడు - అని యీకధలోనే కలదు.
  3. కడుపుర్గములంగ్గందొడంగిన- నెడగలయుచు
  4. లుంగలనంగచూతనుల గంద్దములం బెనంగినన్ -మూ.
  5. కరిణీతలలంచు - మూ.