శ్రీ సాయిసచ్చరిత్రము /అరవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
'శ్రీ సాయిసచ్చరిత్రము' (అరవ అధ్యాయము )శ్రీ సాయిసచ్చరిత్రము అరవ అధ్యాయము గురు కరస్పర్శ ప్రభావము - శ్రీరామనవమి యుత్సవము - దాని ప్రారంభము, పరిణామము మొదలగునవి - మసీదు మరమ్మతులు గురు కరస్పర్శ ప్రాభవము

సంసారమను సాగరములో జీవుడనెడి యోడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును. సద్గురువనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నాకండ్ల యెదుట సాయిబాబా నిలచియున్నట్లు, నా నుదుట ఊదీ పెట్టుచున్నట్లు, నాశిరస్సుపై చేయివేసి యాశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి, కండ్లనుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్తస్పర్శ మహిమ అద్బుతమైనది. ప్రళయాగ్నిచే కూడ కాలనట్టి వాసనామయమైన సూక్ష్మశరీరము గురుకరస్పర్శ తగులగనే భస్మమైపోవును అనేకజన్మార్జిత పాపసంచయము పటాపంచలైపోవును. అధ్యాత్మికసంబంధమైన విషయములు వినుటకే విసుగుపడువారి వాక్కు కూడ నెమ్మది పొందును. శ్రీసాయిసుందరరూపము కాంచుటతోడనే కంఠము అనందాతిరేకముతో గద్గదమగును; కన్నుల నుండి అనందాశ్రువులు పొంగిపొరలును; హృదయము భావోద్రేకముతో యుక్కిరిబిక్కిరి యగును. ’నేనే తాన"ను (పరబ్రహ్మస్వరూపమను) స్ఫురణ మేల్కొని, అత్మసాక్షాత్కారానందమును కలిగించును. ’నేను నీవు’ అను భేదభావము తొలిగించి బ్రహ్మైక్యానుభవమును సిద్దింపజేయును. నేను వేదాపురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే యడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును; నా సద్గురువైన శ్రీసాయిబాబాయే శ్రీరాముడుగా, శ్రీ కృష్ణుడుగా నా ముందు నిలచి, తన లీలలను తామే వినిపింపజేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీ సాయి యాపాదమస్తకము కృష్ణునివలె గాన్పించును. భాగవతమో, ఉద్దవగీతయో తామే పాడుచున్నట్లుగ అనిపించును. ఎవరితోనైన సంభాషించునప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను యేదైన వ్రాయ తలపెట్టినచో, యొక మాటగాని వాక్యముగాని వ్రాయటకు రాదు. వారి యశీర్వాదము లభించిన వెంటనే రచనా ధార యంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగనే బాబా దానిని యణచివేయును. తన శక్తిలో వాని కోరికలు నెరవేర్చి సంతుష్టుజేసి యాశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసినవానికి ధర్మార్దకామమోక్షములు కరతలామలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తిమార్గములనెడి నాలుగు త్రోవలు గలవు. అన్నింటిలో భక్తిమార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహయముతో ముండ్లును గోతులను తప్పించుకొని ముందుకుసాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీసాయిబాబా నొక్కివక్కాణించెడివారు.

స్వయంసత్తాకమైన బ్రహ్మము, జగత్తును సృష్టించు నా బ్రహ్మముయొక్క శక్తి (మాయ), సృష్టి -- యను యీ మూడింటి గూర్చిన తత్త్వవిచారము చేసి, వాస్తవమునకీ మూడును నొకటియేయని సిద్దాంతీకరించి, బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రదానవాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు:

"నా భక్తుని యింటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తిశ్రద్దలతో మనఃపూర్వకముగా నన్నే యారాధించువారి యోగక్షేమముల నేను జూచెదను. కావున వస్త్రాహరముల కొరకు ప్రయాసపడవద్దు! నీకేమైన కావసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములోని కీర్తిప్రతిష్ఠలకై ప్రాకులాడుట మాని, దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచగౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క యాకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతునికి యారాధనకోరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుము. మనసును ధనసంపార్జనము, దేహపోషణ, గృహాసంరక్షణము మొన విషయముల పట్ల సంచరించకుండ గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మదివహించి, శాంతముగను చింతారహితముగను యుండును. మనస్సు సరియైన సాంగత్యములో నున్నదనుటకు నిదియే గుర్తు. చంచలమనస్కునకు స్వాస్థ్యము చిక్కదు.

బాబా మాటలుదహరించిన పిమ్మట గ్రంథకర్త శిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. శిరిడీలో జరుగు నుత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల (1925-పుట 197) పత్రికలలో శిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవము గురించి విపులముగ వర్ణింపబడినది. దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది.

కోపర్‌గాంవ్ లో గోపాల్‌రావు గుండ్ అనునతడు పోలీసు సర్కిలు ఇన్‌స్పెక్టరుగా నుండెను. అతడు బాబాకు గొప్పభక్తుడు. అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికి సంతానము కలుగలేదు. శ్రీసాయి యాశీర్వచనముచే అతనికొక కొడుకు బుట్టెను. అ అనందసమయంలో అతనికి శిరిడీలో ’ఉరుసు’ ఉత్సవము నిర్వహించవలెనను అలోచన కలిగినది. తన అలోచనను తాత్యాకోతేపాటిలు, దాదాకోతేపాటీలు, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయిభక్తులు ముందుంచెను. వారంతా దీనికి అమోదించిరి. బాబా యాశీర్వదమును, అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టరు అనుమతికై దరఖస్తు పెట్టిరి. గ్రామకులకర్ణి (కరణము) దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున యనుమతి రాలేదు. కాని బాబా యాశీర్వదించి యుండుటచే, మరల ప్రయత్నించగా వెంటనే యనుమతి వచ్చెను. బాబా సలహ ననుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమినాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమినాడు జరుపుకొనమనుటలో హిందూ-మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశ్యము కాబోలు. భవిష్యత్సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు సృష్టమగును.

ఉత్సవము జరుపుటకు అనుమతయితే వచ్చెనుగాని, యితర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్నగ్రామమైన శిరిడీలో నీటి ఎద్దడి అధికముగా నుండెను. గ్రామమంతటికి రెండు నూతులుండెడివి. ఒకటి యెండాకాలములో నెండిపోవుచుండెను. రెండవదానిలోని నీళ్ళు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా, బాబా అ ఉప్పునీటిబావిలో పువ్వులు వేసెను. అశ్చర్యకరముగ అ ఉప్పునీరు మంచినీళ్ళుగా మారిపోయినవి. అ నీరు కూడా చాలకపోవుటచే తాత్యాపాటిలు దూరమునుంచి మోటల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వెలసినవి. కుస్తీపోటీల కోరకేర్పాట్లు చేయబడినవి.

గోపాలరావు గుండున కొక మిత్రుడు గలడు. వాని పేరు దాము అణ్ణాకాసార్. అతనిది అహమదనగరు. అతనికిని ఇద్దరు భార్యలున్నప్పటికి సంతానము లేకుండెను. అతనికి కూడ బాబా యాశీర్వదముచే పుత్ర సంతానము గలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయంచవలెనని గోపాలరావు అతనికి పూరమాయించెను. అటులనే నానాసాహెబు నిమోన్ కరును ఒక నిగిషీజండా తెమ్మని కోరెను. ఈ రెండు జండాలను ఉత్సవముతో తీసికొనిపోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి. ఈ పద్దతినిప్పటికిని అవలంభించుచున్నారు. బాబా తాము నివసించిన యా మసీదును ’ద్వారకామాయి’యని పిలిచెడివారు.

చందనోత్సవము

సుమారు అయిదేళ్ళ తరువాత ఈ యుత్సవముతోబాటు నింకొక ఉత్సవము కూడ ప్రారంభమయ్యెను. కొరాఃలా గ్రామమునకు చెందిన అమీరుశక్కర్ దలాల్ అను మహమ్మదీయభక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్దము చేయుదురు. వెడల్పు పళ్ళెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపముతో బాజాభజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవమూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి (నింబారు)లోను, గోడలపైనను అ చందనము చేతితో నందరును తట్టెదరు. మొదటి మూడు సంవత్సరములు ఈ యత్సవమును అమీరుశక్కరు నిర్వహించెను. పిమ్మట అతని భార్య అ సేవకు కొనసాగించెను. ఒకేదినమందు పగలు హీందువులచే జండాయుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము యే అఱమరికలు లేక జరుగుచున్నవి.

ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము

ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమినాడు వైభవముగా జరుగుచుండెను. రానురాను అది వృద్దియగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో యీ ఉత్సవమునకు సంబంధించి నొక మార్పు జరుగెను. శ్రీసాయినాథసగుణొపాసన గ్రంథకర్తయైన కృష్ణారావు జోగేశ్వర భీష్మ యనువాడు దాదాసాహెబు ఖాపర్డే(అమరావతి)తో కలసి నుత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడాలో బసచేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షీత్ వాడా వసారలో పండుకొనియుండెను. అ సమయములో లక్ష్మణరావు ఉరుఫ్ కాకామహజని పూజాపరికరముల పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను. అతనిని చూడగనే భీష్మకు యొక క్రొత్త యాలోచన తట్టెను. వెంటనే కాకామహజని దగ్గరకు పిలిచి అతనితో, "ఉరుసు యుత్సవమును శ్రీరామనవమి నాడు చేయుమనుటలో భగవదుద్దేశ మేదియోనుండ వచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాల ముఖ్యమైన పర్వదినము. కనుక యీ దినమందు రామజన్మోత్సవము యేల జరుపకూడ"దని యడిగెను. కాకామహజనికి అ యాలోచన బాగ నచ్చినది. తమ సంకల్పమునుకు బాబా యనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యిరి. కానీ, భగవస్సంకీర్తన చేయుటకు, అంతతక్కువ వ్యవధిలో హారిదానును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడ తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లన, అతని వద్ద రామాఖ్యానమను శ్రీరామని చరిత్ర సిద్దముగా నుండుటచే, అతడే దానిని సంకీర్తన చేయుటకు, కాకామహజని హర్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన శోంఠి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట కేర్పాటయ్యెను. బాబా యనుమతి బోందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞడైన బాబా " వాడలో నేమి జరుగుచున్నది?" ని మహజనిని ప్రశ్నించెను. బాబా యడిగిన ప్రశ్నలోని అంతరార్దమును మహజని గ్రహించలేక, యేమీ జవాబివ్వక మౌనముగ నుండెను. బాబా యదే ప్రశ్న భీష్మ నడిగెను. అతడు శ్రీరామనవమి యుత్సవము చేయవలయునను తమ యాలోచనను బాబాకు వివరించి, అందులకు బాబా యనుమతి నివ్వవలెనని కోరెను. బాబా వెంటనే యాశీర్వదించెను. అందరు సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్దులైరి. అ మరుసటి దినము మసీదు నలంకరించిరి. రాధాకృష్ణమాయి యొక ఊయలనిచ్చెను. దానిని బాబా అసనము ముందు వ్రేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవవేడుక ప్రారంభమయ్యెను. భీష్మడుకీర్తన చెప్పుటకు లేచెను. మహజని హర్మోనియం ముందు కూర్చొనెను. అప్పుడేలెండీ నుండీ మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి, మహజనిని పిలిపించెను. రామజన్మోత్సవము జరుపుటకు బాబా యొప్పుకొనునో లేదో, యేమగునో యని జంకుతు అతడు బాబా వద్దకు వెళ్ళెను. అదియంతయు యేమని, అక్కడ ఊయల యెందుకు కట్టిరని బాబా యతనిని యడిగెను. శ్రీరామనవమి మహొత్సవము ప్రారంభమైనదనియు ఆందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ్వరూపమును సూచించు ’నింబారు’ (గూడు) నుండి రెండు పూలమాలలను తీసి, యొకటి మహజని మెడలో వేసి, యింకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. రామకథాసంకీర్తనము ముగియగానే, బాజాభజంత్రీధ్వనుల మధ్య ’శ్రీ రామచంద్రమూర్తికీ జై’ యను జయజయద్వానములు చేయుచూ, పరమోత్సహముతో అందరూ యొకరిపైనొకరు ’గులాల్’ (ఎఱ్ఱరంగుపొడి) జల్లుకొనిరి. అంతలో నొక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎటులనో పోయు బాబా కంటిలో పడెను. బాబా కోపముతో భిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలమంది భయముతో పారిపోయిరి. కాని బాబా యొక్క సన్నిహితభక్తులు మాత్రము అవన్నియు తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన యాశీర్వాదములని గ్రహించి కదలక నక్కడనే యుండిరి. శ్రీరామజయంతినాడు రావణుడనే యహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయిరూపములో నున్న శ్రీరాముడు అగ్రహించుట సహజమేకదా యని భావించిరి. శిరిడీలో ఏదైన క్రొత్తది ప్రారంభించునపుడెల్ల బాబా కొపించుట యొక రివాజు. దీనిని తెలిసినవారు గమ్మున నూరుకుండిరి. తన ఊయలనుబాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహజని బిలిచి ఊయలను దీసికొని రమ్మనెను. మహజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతిచెను. అనాటి మహపూజ అరతి మొదలగునవి ముగిసెను. సాయింత్రము మహజని పోయి ఊయలను విప్పుచుండగా నింకను దానియవసరమున్నదని, కనుక దానిని విప్పవద్దని బాబా యతనిని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాలకలోత్సవముతోగాని యత్సవము పూర్తకాదును విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణజననము నాడు పాటించు ’కాలాహండి’ యను ఉత్సవము జరిపిరి. కాలాహండి యనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పుకారము కలిపి వ్రేలాడ గట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన యటుకులను భక్తులు ప్రసాదముగా పంచి పెట్టెదరు. శ్రీకృష్ణపరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులగు గొల్ల పిల్లవాండ్రకు పంచి పెట్టుచుండెను. అ మరసటి దినము ఇవన్నియు పూర్తియైన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలీవిధముగా జరిగిపోవుచుండగా, పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనొత్సవము కూడ యథావిధిగ జరిగినవి. ఈ విధముగా అనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను.

1913 నుండి శ్రీరామనవమి యుత్సవములోని యంశములు క్రమముగ హెచ్చినవి. చైత్రపాడ్యమినుంచి రాధాకృష్ణమాయి ’నామసప్తాహము’ ప్రారంభించుచుండెను. భక్తులందరు వంతులవారిగా అందు పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడ వేకువఝముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవము దేశమంతట జరుగుటచే హరికథకాలక్షేపము చేయు హరిదానులు దొరుకుట దుర్లభముగా నుండెను. శ్రీ రామనవమికి 5,6తోజులు ముందు ’అధునిక తుకారామ్’ యని పిలువబడు బాలాబువ మాలీ యను సంకీర్తనకారుని కాకామహజని యాధృచ్చికముగ కలియుట తటస్తించినది. శ్రీరామనమి నాడు సంకీర్తన చేయుటకు మహజని అతనిని శిరిడీ తోడ్కోని వచ్చెను. అ మరుసటి సంవత్సరము కూడ, అనగా 1914లో, తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్దకవటె గ్రామములో ప్లేగు వ్యాపించియుండుటచేత బాలబువ సతర్కర్ సంకీర్తనకార్యక్రమముల లేక ఖాళీగా నుండెను. కాకాసాహెబ్ దీక్షీత్ ద్వారా బాబా యనుమతి పొంది అతడు శిరిడీ వచ్చి, హరికథాసంకీర్తనము చేసెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. 1914 సంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు శిరిడీ సంకీర్తన చేయు భాధ్యతను శ్రీదానుగణు మహరాజునకు బాబా అప్పగించుట ద్వారా యేటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగ పరిష్కరింపబడెను.

1912 నుండి ఈ యత్సవము రానురాను వృద్ది పొందుచుండెను. చైత్రశుద్ద అష్టమి మొదలు ద్వాదశి వరకు శిరిడీ తేనెత్రుట్టెయవలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీపోటిలలో ననేకమంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి. పేదలకు అన్నసంతర్పణ విరివిగ జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే శిరిడీ యొక సంస్థానముగ రూపొందెను. వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రథము, పాత్రలు, వెండిసామానులు, బాల్టీలు, వంటపాత్రము, పటములు, నిలువుటద్దములు మొనవి బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడ వచ్చెను. ఇవన్నియు యెంత హెచ్చినప్పటికి సాయిబాబా వీనినేమాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వము నిరాడంబరులై యుండెడివారు. ఈ యుత్సవములో గమనింపవలసిన ముఖ్యవిషయమేమన హిందువులు, మహమ్మదీయులు యెట్టి అరమరికలు లేక కలసిమెలసి ఉత్సవములలో పాలుబంచుకొనెదివారు. ఈనాటి వరకు యెటువంటీ మతకలహములు శిరిడీలో తలెత్తలేదు. మొదట 5000 నుండి 7000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగ యాసంఖ్య 75000 కు పెరిగినది. అంతపెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికి ఎన్నడూ అంటువ్యాధులుకాని, అల్లరులుగాని సంభవించలేదు.

మసీదుకు మరమ్మతులు

గోపాలరావుగుండునకు ఇంకొక మంచి యాలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించినవిధముగనే, మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించెను. కాని ఈపని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబు చాందోర్కరకు అ సేవ లభించినది. రాళ్ళ తాపన కార్యము కాకాసాహేబు దీక్షీత్ నియెగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబా కిష్టము లేకుండెను. కాని భక్తుడగు మహల్సాపతి కల్పించుకొని, యెటులనో బాబా యనుమతిని సాధించెను. బాబా చావడిలోపండుకొన్న ఒక్క రాత్రి మసీదు నేలను చక్కని రాళ్ళతో తాపనచేయుట ముగించిరి. అప్పటినుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపుమీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరములో సభామండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాల చిన్నది. సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబు దీక్షిత్ దానిని విశాలపరిచి పై కప్పు వేయదలచెను. ఎంతొ డబ్బుపెట్టి ఇనుపస్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రియంతయు శ్రమపడి స్తంభములు నాటెడివారు. మరుసటిదినము ప్రాతఃకాలముననే బాబా చావడినుండి వచ్చి యదియంతయు జూచి కోపముతో వానిని పీకి పారవైచెడివారు.

ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై, నాటిన ఇనుపస్తంభము ను ఒక చేతితో బెకలించుచు, రెండవచేతితో తాత్యాపాటిల్ పీకను బట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా దీసి, యగ్గిపుల్లతో నిప్పంటించి, యొక గోతిలో పారవైచెను. బాబా నేత్రములు నిప్పకణములవలె వెలుగుచుండెను. ఎవరికిని బాబా వైపు చూచుటకుకూడా ధైర్యము చాలకుండెను. అందరు భయకంపితులైరి. బాబా తన జేబులోనుంచి ఒక రూపాయి తీసి యటువైపు విసరెను. అది శుభసమయమందు చేయు యాహుతివలె కనబడెను. తాత్యాకూడ చాల భయపడెను. తాత్యాకేమి జరుగనున్నదో ఎవరికీ ఏమియు తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టునుండి తాత్యాను విడిపించుటకెవ్వరికిని ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠురోగియు బాబా భక్తుడు నగు భాగొజి శిందే కొంచెము ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసివెసెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది అ జోలికి పోదలచిరో అందరికి యొకే గతి పట్టెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి, వాని వద్దనుంచి యొక నగిషీ జరిపాగాను కొని, తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటక యన్నట్లు, దానిని స్వయముగా తాత్య తలకు చుట్టెను. బాబా యొక్క యీ వింతచర్యను జూచినవారెల్లరు నాశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబా కెట్లు కోపము వచ్చెను? ఎందుచేత నీ విధముగ తాత్యాను శిక్షించెను? వారి కోపము తక్షణమే ఎట్ల చల్లబడెను? అని యందరు అలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తివలె గూర్చుండి యత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో నకారణముగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కాని యేది చెప్పవలెనను విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్ల ఒక్కొక్కటి చెప్పెదను. శ్రీ సాయినాథాయ నమః అరవ అధ్యాయము సంపూర్ణము సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు