శ్రీవేంకటాచలమాహాత్మ్యము/పీఠిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీఠిక

తఱికుండ యనుగ్రామంబునకుఁ గొందఱు తఱికుండ యనియు, మఱి కొందఱు తఱిగొండ యనియుఁ జెప్పుచున్నారు. ఈవిషయముగూర్చి నే నాగ్రామంబునకుఁ బోయియుండినప్పుడు, “వైద్యజ్యోతిషాంధ్రసంగీతవిద్యావిశారదు”లగు రాయదుర్గము నరహరిశాస్త్రులవారి నడుగుటంజేసి ఆయన నాకిట్లు వచించె.

పూర్వము రాయదుర్గమనుగ్రామనివాసులు క్షామచోరబాధలకు నాగ్రామంబున నుండనోపక నిజగృహంబులు వదలి పశువులం దోలుకొని తమకుటుంబములతో నెందేని జలసస్యసమృద్ధిగలప్రదేశంబున కేగుదమని వచ్చుచు మార్గమధ్యంబున నొక్కయెడ నందఱు మార్గాయాసంబునకుఁ గొన్నాళ్లుండి వోఁదలంచయుండిరనియు, వారునిల్చియుండినప్రదేశంబునకుఁ, “బ్రత్తిమిట్ట” అని పేరుండినదనియు, నొకదిన మందఱుం దమకష్టంబులకుఁ దమగ్రామమునం గల శ్రీనృసింహస్వామిని, “హా! ప్రహ్లాదరక్షకా! దీనబంధూ! మమ్మీ దుర్భిక్షకాలంబున డగ్గఱనుండి రక్షింపుమా!” అని యనేకవిధంబుల భజనచేయుచుండిరనియు, మఱునాఁ డుదయంబున నొకబ్రాహ్మణస్త్రీ తనవాడుకచొప్పున మజ్జిగ దఱుచుచునుండ నామజ్జిగకుండలో నొకరాయి యుండి కవ్వమునకుఁ బలుమాఱుఁ దాఁకుచుండ నది యేమని తలంచి యావిప్రాంగనయగు లక్ష్మీనరసమ్మ తనకరంబున నాకుండను దడవి చూడ నేమియు దొరకకుండెననియు, మఱల నానారీమణి తఱుచుచుండఁగా ముందువలె నొకఱాయి తగులుచుండెననియు, మఱలఁ బరిశోధింప నాకుండలో నొకఱాయిగాని లేకుండెననియు, నివ్విధము రెండు మూఁడుమాఱులు చూచి విస్మయపరీతచిత్తయై కొంతవడి యూరకుండి క్రమ్మఱఁ జిలుకుచుండఁ దొల్లింటివలె ఱాయితగులుటం జేసి వెఱగంది భర్తకడకుంబోయి మజ్జిగకుండలో నివ్వడుపున నున్నదని చెప్ప నతండు వచ్చి చూచునప్పటికి నాకుండ నుండుఱాయి నృసింహాకారంబుతో నుండినదనియు, నారూపము చూచి విస్మయభయపరీతచేతస్కుఁడై భార్యం జూచి, తరుణీ! నీవిపు డీవిషయ మెల్లవారికిం జెప్పి దోడ్కొని రావలయు ననఁగ, నామె పోయి యెల్లవారికిం జెప్పి పిలుచుకొని వచ్చినదనియు, నావల నందఱాస్వామిని యనేకవిధంబులం బ్రార్థించిరనియు, అత్తఱి నశరీరవాక్కుల నాస్వామి, భక్తాగ్రేసరులారా! మీదురంతకష్టంబులం బాపి మీయిష్టంబు లిచ్చుటకు నీతఱికుండ నుదయించితిననియు, నిఁక మీరెందేని పోఁజనదనియు, మీరు నాకియ్యెడ నాలయంబు నిర్మించి నన్నారాధించుచుండుఁడనియు, మీరు నన్నీదినమునుండి “తఱికుండ నృసింహుఁడు" అని నామంబిడి భజించుచుండుఁడనియుఁ జెప్పుటంజేసి, వారట్లు చేసిరనియు, నక్కారణంబున నీయూరికి నిపుడు తఱికుండ యని చెప్పుచున్నారనియు, (తఱికుండ=మజ్జిగచిలుకుకుండ) తఱికుండయని చెప్పవలయుంగాని, తరిగొండ యని చెప్పనొప్పదనియు, మాపెద్ద లాకాలంబున రాయదుర్గగ్రామంబుననుండి వచ్చి యిచ్చట నిల్చియుండుటం జేసి మమ్మిపుడు రాయదుర్గమువారని పిలుచుచున్నారనియుఁ జెప్పె.

కాఁబట్టి యీతఱికుండ యనుగ్రామము కడపమండలము రాయిల్పాడునకు నాల్గుమైళ్లదూరంబున నున్నది. ఈ గ్రథకర్త్రియగు వేంకమాం బాగ్రామంబుననుండిన దగుటంజేసి తఱికుండ వేంకమాంబ యని చెప్పుచున్నారు. ఈమె రచించినగ్రంధములలో, రాజయోగసారమును ద్విపదకావ్యమును, వేంకటాచలమాహాత్మ్యంబను నొకపద్యకావ్యంబును, ముక్తికాంతావిలాసంబను నొకయక్షగానగ్రంథమును ముద్రింపఁబడియున్నవి. ఈమె తాను భాగవతము ద్వాదశస్కంధంబులను ద్విపదకావ్యముగ రచించినట్లు వేంకటాచలమాహాత్మ్యమునఁ జెప్పుకొనియున్నదిగాని ఆపుస్తక మెచ్చటం గానరాదు. వేంకటాచలమాహాత్మ్యములోఁ బ్రథమాశ్వాసములో నేడవపద్యమునందు:

క. "అలకాశి నుండి వెలువడి
   వలనుగ మాకొఱకు నందవరపురమందే
   నెలకొని కులదైవతమై
   యలరుచు మమ్మేలు చౌడమాంబను కొలుతున్."

అని వ్రాసియుండుపద్యంబును బట్టి చూడఁగ నీమె నందవరీకబ్రాహ్మణస్త్రీ యని తెలియఁబడుచున్నది. ఈమె తనభర్తయొక్క నామగోత్రసూత్రంబులు చెప్పక “వసిష్ఠగోత్రపవిత్ర కృష్ణయామాత్యతనూభవ” అని తాను గృష్ణయామాత్యునికూఁతురైనట్టు చెప్పుకొనుటచేత నీమె బాలవితంతువయి తనకాలమంతయు దత్వగ్రంథపఠనాదులయందుఁ గడపినట్లున్నది. 1840 సంవత్సరమినందు జీవించియుండినట్లు తఱికుండగ్రామంబునఁ గొందఱు వృద్ధులు చెప్పుచున్నారు. ఈ వేంకమాంబగారు మదనపల్లెలోనుండిన, బ్రహ్మశ్రీ, రూపావతారం సుబ్రహ్మణ్యశాస్త్రులువారి నాశ్రయించి తత్వముపదేశింపఁబడి నాలుగైదువత్సరంబులు తఱికుండ శ్రీనృసింహస్వామిదేవాలయంబునంగల ఆంజనేయస్వామివిగ్రహంబునకు వెనుకప్రక్కగనుండు నొకరహస్యస్థలంబున యోగంబున నుండినట్లును, అర్చకుఁ డొకదినంబునఁ గని, అదివఱ కాయూర నీవేంకమాంబపై నేదియో యొకదోషము కల్పించియుండుటకును, నాలుగైదేండ్లు వేంకమాంబ కన్పట్టకుండుటకును కల్పించినదోషము సత్యంబని తలంచి యాఆయర్చకుఁ డామెను బిలిచి, “ఓసి రండా! దుష్కర్మంబులు చేయుటగాక యీదేవాలయంబునకు వచ్చి యీలాగు వేషము పూని స్వామివారి వస్త్రభూషణంబుల నపహరింప సమకట్టితివా” యని దూషించి ఆమె చేయుయోగంబును భంగపఱచి యీవల కీడ్చి కొట్టి పంపుటం జేసి ఆమె యందుండక శ్రీతిరుపతి వేంకటాచలంబునకు వచ్చి తుంబురుకోనయం దొక్కెడ నైదాఱువత్సరంబులు తపంబొనర్చి పిదప శ్రీస్వామిపుష్కరిణికి నుత్తరభాగంబున నొక చిన్న మంటపంబునఁ జేరియుండినదనియు, అట్టికాలంబున ముందెఱింగించినగ్రంథంబులు వ్రాసినదనియుఁ దెలియబడుచున్నది. మఱి యామె స్త్రీలకు ననేకములగు పాటలు వ్రాసియిచ్చియుండిన దగుటంజేసి యాపాట లెల్లఁ దత్వమునే బోధించుచున్నవి. ఈమె కవిత్వకల్పనాశక్తి వేంకటాచలమాహాత్మ్యమునందు వసంతఋతువర్ణనంబును, ఎఱుకచెప్పు పట్టునందును, మఱి యందందు మృదుమధురశైలితోఁ దత్వార్థంబులు సందర్భోచితముగ నెలకొల్పి కవన మతికఠినముగాక పదలాలిత్య మొప్పార వ్రాసినది. కవిత్వమునం దక్కడక్కడ నల్పదోషంబులు గానవచ్చుచున్నవిగాని, స్త్రీ యిట్లు రచించియుండుటకు నెంతయు సంతసింపవలయును గదా!

ఇదియునుంగాక నాచేత నొక గుజిలీయంగడిలోని వేంకటాచలమాహాత్మ్యపుస్తకమునిచ్చి పరిశోధించి వ్రాయుమని, శ్రీ వావిళ్ల వేంకటేశ్వరులుగారు చెప్పినందున నేనియ్యకొని నాశక్తికొలఁది, పద్యములలో నందందు విడిచినపదంబులను గూడినంతవఱకుఁ గూర్చి వ్రాసితిని. గుణగ్రాహ్యులగు పండితులు సంతసింతురుగాత.

ఇట్లు,

ఆలూరు వాసుదేవయ్య