శ్రీరమాపరిణయము/పాఠం

వికీసోర్స్ నుండి

శ్రీరమాపరిణయము

ద్విపద కావ్యము

ఇష్టదేవతా స్తుతి

శ్రీ వేంకటేశ్వరుఁ - జిత్తమందుంచి
భావించి తరిగొండ - పతినిఁ బూజించి
శ్రీ భారతిని, హయ-గ్రీవునిఁ దలంచి
ప్రాభవంబున గురుఁ - బ్రస్తుతి చేసి
కరమర్థితో రమా - కల్యాణ సరణి
తెఱఁగొప్ప రచియింతు - ద్విపద కావ్యముగ
ఘనమైన తత్కథా - క్రమ మెట్టిదనిన
వినరయ్య కవులార! - విద్వాంసులార!

నారాయణుని దేవతలు ప్రార్థించుట


నారాయణుఁడు జగ-న్నాథుఁ డచ్యుతుఁడు 10
క్షీరవారిధియందు - శేషతల్పమున
యోగనిద్రారతి - నురుతరానంద
సాగరమగ్నుఁడై - శయనించియుండ
అపు డచ్చటికి శంభుఁ, - డజుఁడు, దేవతలు,
తపసులు వచ్చి మో - దంబు దీపింప
ముకుళిత హస్తులై - ముందఱ నిలిచి
యకలంకభక్తి ని - ట్లనిరి వారెల్ల:

‘దేవదేవ! సమస్త - దేవతారాధ్య!
నీ వింక నీ యోగ - నిద్ర మేల్కొనవె!
పరమాత్మ! మమ్మెల్లఁ - బాలించుకొఱకు
నీరుపమంబగు యోగ - నిద్ర మేల్కొనవె!’
యనుచుఁ బ్రార్థింపఁగా - నాది విష్ణుండు
కనువిచ్చి యందఱఁ - గలయ నీక్షించి
మందస్మితాస్యుఁడై - ‘మహితాత్ములార!
యెందుకు వచ్చితి? - రిచ్చోటి’ కనిన
‘పరమాత్మ! మీ దివ్య - పాదపద్మములు
సురుచిరభక్తితోఁ - జూడ వచ్చితిమి
మమ్ము మన్నించి, మా - మనవి పాలించి
సమ్మతంబుగ విను - సత్య సంకల్ప!
నిరత మిట్టే యోగ - నిద్ర నుండినను
శరణాగతుల నేలు - సరణి యెట్లగును?
సర్వజ్ఞుఁడవు, సర్వ - శక్తియుక్తుఁడవు,
నిర్వాణమయుఁడవు, - నిర్వికారుఁడవు
కావున నీ పాద - కమలద్వయంబు
భావించి నిన్నాత్మ - పతిఁగాఁ దలంచి
సహజమౌ నీశుద్ధ - సాత్త్విక కళయె
మహనీయ తపము స - మ్మతముగాఁ జేసి

పనిఁబూని జలరాశి - పట్టియై పుట్టి
ఒనర నిన్నే కోరు - చున్న దిచ్చోట
నీ వా మృగాక్షిఁ బా - ణిగ్రహణంబుఁ
గావింపవే నిత్య - కల్యాణ!' యనిన, 40
నవ్వుచుఁ దరిగొండ - నరహరి వేడ్క
నివ్వటిల్లఁగ వారి -నిం జూచి పలికె:

నారాయణుని యనుగ్రహోక్తి


'గరళకంధర, పద్మ - గర్భాదు లెల్ల
సరవిని వినుఁ డొక్క - సరణిఁ జెప్పెదను
భూలోకమున శేష - భూధరమందు
నే లీల దీపింప - నిలిచి, యచ్చోట
వేంకటేశ్వరుఁడన - విఖ్యాతిఁ బొంది
పొంకంబుగా నుందు - భూపాలు కరణి
మచ్చిక నలమేలు - మంగాభిధాన
మిచ్చి, సంప్రీతి నా - యిందిరాసతిని 50
నే శీఘ్రముగను పా - ణిగ్రహణంబుఁ
జేసెద'నని పల్కి, - చిఱునవ్వు నవ్వి
గుఱుతుగా వారి వీ - డ్కొని ముదం బెసఁగ

శ్రీహరి వేంకటాద్రికి విచ్చేయుట


పరమాత్ముఁ డందుండి - పయనమై వచ్చి
శ్రీ వరాహస్వామి -చేకొనియున్న
శ్రీ వేంకటాద్రిపై - జేరి వేడుకను
అప్పుడు శ్రీవరా - హస్వామి నడిగి
తప్ప కా క్షేత్రంబు - తా నాక్రమించి
నలువొప్పఁ దరిగొండ - నరసింహుఁ డనఁగ
విలసిల్లుచుండె శ్రీ - వేంకటేశ్వరుఁడు. 60

శ్రీహరి బ్రహ్మాదులను క్షీరాబ్ధకడకుఁ గన్య నడుగఁ బంపుట


అంత నచ్చటికి బ్ర -హ్మాదులు వచ్చి
సంతోషచిత్తులై - చక్రి నీక్షించి
వేదాంత సూక్తుల - వినుతింప, నగుచు
నాదినారాయణుం -డట వారి కనియె:
'ఓ పంకజాసన! - యో ఫాలనయన!
యో పాకశాసన! -యో మౌనులార!
చెలఁగుచు మీరు వ - చ్చిన చంద మెల్లఁ
దెలిసెను, మీరింకఁ - దీవ్రంబుగాను
క్షీరవారిధిఁ జేరి - శ్రీరమాసతిని
నేరీతినైన నా - కిమ్మని యడిగి 70
నిరుపమ లగ్నంబు - నిర్ణయించుకొని
సరగున ర' మ్మన్న - సంతసంబంది

హరియాజ్ఞ వడసి వా - రరుగుచుండఁగను
పాల గరుడి దీర్చి - పచ్చని మ్రాని
పై లీలతో [1]మెట్టి - పట్టుగాఁ జూపె
అది మొదల్ శకునంబు - లతి దివ్యములుగ
మది కిష్టముగ నయ్యె - మార్గంబునందు,
అందుకు సంతోష - మధికంబు గాఁగ
నందఱా క్షీరాబ్ధి - కరిగిన, లేచి
వారికి నెదురుగా - వచ్చి సాగరుఁడు 80
కూరిమి మీఱఁ దో - డ్కొనివచ్చి నగుచు
మురియుచు మణిపీఠ - ముల మీఁద నుంచి
యిరవొందఁ బూజించి - యిట్లని పలికె:

సముద్రుని సంప్రశ్నము


'వరుసగాఁ బరమ పా - వనులార! నన్నుఁ
గరుణించి వచ్చిన - కార్యమే?’ మనిన
విని, వారలంద ఱా - విమల మానసునిఁ
గనుఁగొని పలికి రు- త్కంఠ నిట్లనుచు :

బ్రహ్మాదులు కన్య నడుగుట


'వనరాశి! యొక శుభ - వార్తఁ జెప్పెదము
వినవయ్య! నీ వది - విశదంబుగాను

రహిమీఱ నాది నా - రాయణుం డిపుడు 90
మహియందు నత్యంత - మహిమ దీపింప
అరుదైన వేంకటే - శాభి ధానమున
నెరసి శేషాద్రిపై - నిలిచియున్నాఁడు
అతనికి నీ పుత్రి - యగు రమాసతిని
హితమొప్ప నడుగ మే - మిటకు వచ్చితిమి'
అనిన, 'ధన్యుఁడనైతి' - నని సాగరుండు
మనమున నుప్పొంగి, - 'మధుసూదనునకు
నిచ్చెద మత్కన్య - నిపు' డన్న, వారు
మచ్చిక నతని స - న్మానంబుఁ జేసి,
లలితమైన వివాహ - లగ్న మేర్పఱచి, 100
జలరాశి యొసఁగిన - సకల వస్తువులు
చెలువొందఁ గైకొని - శేషాద్రిఁ జేరి
జలజాక్షునకు మ్రొక్కి - సరవి నిట్లనిరి:

బ్రహ్మాదులు స్వామికి వివాహనిశ్చయ మెఱిఁగించుట


'స్వామి! సాగరుఁడు శ్రీ - సతిని మీ కొసఁగఁ
గామింపుచున్నాడు - ఘన భక్తి మీఱ
నటుగాన మిమ్ము నె - య్యంబుతో నిపుడె
తటుకునఁ బెండ్లికిఁ - దరలి రమ్మనియె.'
అన విని తరిగొండ - హరి నవ్వి, వారిఁ
గనుఁగొని పల్కె ను - త్కంఠ దీపింప:

పెండ్లి పయనము


'పనిఁబూని శంకర బ్రహ్మాదులార! 110
పెనుపొందఁగాను నా - పెండ్లికి మీరు
పరఁగ మీ మీ కుటుం - బంబులతోడ
సరగున రమ్మన్నఁ - జని వార లపుడు
తమతమ సతులతో -దమ కుమారులతొఁ
దమ తమ పరివార - తతులతో మగిడి
వచ్చిన, వారితో - వరలగ్నమందు
హెచ్చుగా విహగేంద్రు - నెక్కి యచ్యుతుఁడు
సరవి ననంత, వి - ష్వక్సేన ముఖ్య
పరివారవితతి స - ద్భక్తితోఁ గొలువ
ముదమొప్ప విఖనస - ముఖ్య [2]సన్మునులు 120
విదితంబుగాఁ బరి - వేష్టించి పొగడ,
హర, విరించి, సురేశ్వ - రాదులు చెలఁగి
విరివిగాఁ బద్మాక్షు - వెనువెంటఁ జనఁగ
వరుసగా ఘనశుభ - వాద్యముల్ మొరయఁ
దఱుచైన మంగళ - - ద్రవ్యాళితోడఁ
జని చని యాక్షీర - జలరాశి చెంత
ఘనముగా నిలిచె; నా - క్రమము సాగరుఁడు

వరపూజ


విని, తన పరివార - వితతులతోడఁ
దనరార శోభన - ద్రవ్యముల్ గొనుచు
దొరకొని మంగళ - తూర్యముల్ మొరయ 130
నరుదుగా దార పు - త్రాదుల తోడ
నలువొప్పఁ దరిగొండ - నరసింహుఁడైన
సలలిత వేంకటా - చల నివాసునకు
హెచ్చిన భక్తితో - నెదురుగా వచ్చి,
యచ్చుగాఁ దగు పూజ - లచటఁ గావించి,
అందుండి బ్రహ్మరు - ద్రాదులతోడ
పొందుగా హరి నాత్మ - పురమున కపుడు
తోడుకొని పోయి బం - ధుజనంబుతోడ
విడుదులలో నుంచె - వేడ్కతో నంత.
సహజ లీలలఁ బరి - చారకుల్ చెలఁగి 140
రహిమీఱఁ బచ్చతో- రణములతోడ
[3]మురువంపు ముత్యాల - మ్రుగ్గులతోడ
దఱుచైన [4]వివిధ చి - త్తరువుల తోడఁ
గ్రమముగా నగరు శృం - గారంబు చేసి
విమలమౌ కల్యాణ - వేదిక నిండఁ

దలకొని మంగళ - ద్రవ్యంబు లుంచి,
పెలుచ బంగరు పెండ్లి - పీఁటలు పెట్టి,
కరమొప్ప ముత్యాల - గద్దె లందుంచి,
పరువడి రత్నకం - బళములు పఱచి,
హరి రాకఁ గోరఁగా - నప్పు డందుండి 150
వరరత్న భూషణా వళు, లంబరములు
ధరియించి, తోడ ము - త్తైదువుల్ రాఁగ
గుఱుతుగా ముత్యాల - గొడుగుల నడుమ
ఘనతరంబుగ గంగ, - గౌతమి, యమున,
అనుపమ తుంగభ - ద్రాదులైనట్టి
వననిధి భార్యలు - వరవైభవమున
ననురాగమున శోభ - నాక్షతల్ గొనుచు
సలలిత వాద్యఘో - షంబులతోడ
వెలయఁగా హరియున్న - విడిదికి వచ్చి,
కమనీయ భక్తి నా - కమలలోచనుని 160
సముచిత క్రమములఁ - జాలఁ బూజించి,
రహిమీఱఁ గుసుమ - హారము కంఠమందు
విహితంబుగా నుంచి, - వేడ్క రెట్టింపఁ
దక్కినవారినిఁ - దగఁ బూజ చేసి,
మక్కువ దీపింప - మఱి యిట్టు లనిరి:

పేరంటము పిలుపు


'రయమున మా మంది - రమున కో గిరిజ!
ప్రియమొప్ప రావమ్మ! - పేరంటమునకు,
రామాలలామ! భా రతి! నీవు వేగఁ
బ్రేమతో రావమ్మ! - పేరంటమునకు,
మునివధూమణులార! - ముచ్చటమీఱఁ 170
బెనుపొంద రారమ్మ? - పేరంటమునకు
సిరి నొప్పుచుండు శ - చీదేవి! నీవు
పెరిమెతో రావమ్మ! - పేరంటమునకుఁ,
దెఱఁగొప్పఁ దక్కిన - దిక్పాలసతులు!
మురిసి పేరంట మి -మ్ముగ మీరు రారె!
గరుడ, గంధర్వాది - కామినీ మణులు!
మెఱసి పేరంటంబు - మీరెల్ల రారె!'
అని వారు పేరంట -మందఱిఁ బిలువ

పెండ్లి యేర్పాట్లు


నొనర సాగర, సోము - లుచితక్రమముల
నచ్చట బ్రహ్మ, రు - ద్రాదులతోడ 180
మచ్చికతో నాత్మ - మందిరంబునకు
గొనకొని హరినిఁ దో - డ్కొనివచ్చి, యచట
మునుల సమ్మతమున - ముదము దీపింప,

భయభక్తు లెసఁగ నా - పంకజోదరునిఁ
బ్రియముమీఱ వివాహ - పీఠమందుంచి,
వలనొప్పఁ దక్కిన - వారి నందఱిని
నలువొప్ప విహితాస - నంబులం దుంచి,
విలసితమూర్తులై - వెలయు విశ్వేశ,
జలజాసనాదులు - సభికులుగాఁగ,
పరఁగ శ్రీ పార్వతీ - భారతీ ప్రముఖ 190
తరుణులు పెండ్లిము - త్తైదువుల్ గాఁగ,
వరుసగా నందు వి- వాహ కృత్యములు
పొరిఁబొరి నా కశ్య - పుఁడు నెఱవేర్ప,
మంగళస్నానాది - మహిత కృత్యములు
సాంగంబుగాఁ జేసి, - సకలోత్సవములు
నలువొప్పఁగాను పు - ణ్యాహవాచనము,
విలసిత స్నాతక, - వేద వ్రతములు
చేసి, కాశీయాత్ర - శ్రీహరి చనఁగ,
వాసిగాఁ దోయధి - వచ్చి ప్రార్థించి
కపటనాటక! నీవు - [5]కాశి పోనేల? 200
ఇపుడ నా సుతను నీ - కిచ్చెద' ననుచు
మగుడి తోడ్కొనిపోయి - మందిరమందు
జగదీశ్వరుని నిల్పె - సంప్రీతి నపుడు.

స్వామి కల్యాణము


అనుపమంబైన క - న్యావరణంబు
మునివరుల్ జరుపఁగా, - మురిసి సాగరుఁడు
పనిఁబూని భక్తితోఁ - బంకజాక్షునకు
మనము రంజిల్లఁగా - మధుపర్క మిచ్చి,
నవ్య భూషణములు, - నవ్య వస్త్రములు,
దివ్య గంధంబులు, - దివ్యమాల్యములు
కమలాక్షునకు, రమా - కన్యకామణికి 210
బ్రమదంబుతో సమ - ర్పణమొప్పఁ జేసి,
ఘనముగా నా రమా - కన్య నా హరికి
తన వధూయుక్తుఁడై - దానంబు చేసె.
కరమొప్ప నా రమా - కన్యకామణినిఁ
గరుణించి హరి కర - గ్రహణంబు చేసి,
నిరుపమంబగు దర - నిభకంఠమందు
సురుచిరమంగళ - సూత్రంబుఁ గట్టె;
సరసతమీఱ శ్రీ - సతిశిరంబందుఁ
దఱుచైన వేడ్కతోఁ - దలఁబ్రాలు వోసె;
జలజాక్షు శిరముపై - జలరాశి కన్య 220
పొలుపొందఁ దలఁబ్రాలు - పోసె; నీరీతి
నక్షతారోపణ - మ్మైన పిమ్మటను
లక్షణవతియైన - లక్ష్మితోఁగూడ

సలలిత వేంకటా - చల వాసుఁడనఁగ
నలువొప్పు తరిగొండ - నారసింహుండు
అలరుచు లాజహో - మాదికృత్యములు
వలనొప్ప వేర్వేఱ - వరుసగా నడపె.

బువ్వము బంతి


గురుతరంబుగ నాలు - గో నాటి రాత్రి
వరుసగా నిజబంధు - వర్గంబుతోడఁ
బొలుపొందఁ దరిగొండ - పురధాముఁ డనఁగ 230
విలసిల్లుచున్న శ్రీ - వేంకటేశ్వరుఁడు
అలమేలుమంగతో - ననురాగ మెసఁగ
సలలితమాణిక్య – సదనమధ్యమునఁ
బేరైన బంగారు - [6]పీఠము మీఁదఁ
గోరి బువ్వముబంతిఁ - గూర్చుండె, నపుడు
గణుతింపఁగా గంగ, - గౌతమి, యమున,
మణికర్ణికయును, న - ర్మద, తుంగభద్ర
మొదలైన జలరాశి - ముఖ్య కామినులు
సదమల చిత్తలై - సంతోష మెసఁగ
ఘలుఘల్లుమని కాళ్ల - గజ్జె, లందియలు240
వలనొప్ప మ్రోయఁగా - వచ్చి వేడుకను

పరఁగ నచ్చటఁ బైఁడి - పళ్లెరాలుంచి
గరిమతోఁ బాత్రాభి - ఘారంబుఁ జేసి,
బహువిధ భక్ష్యముల్, - పక్వ శాకములు,
విహిత దివ్యాన్నముల్, - వింత పచ్చళ్లు,
తఱుచైన ఘృతము, దు - గ్ధములు, తేనియలు,
పెరుఁ, గూరుగాయలు - ప్రియముగాఁ దెచ్చి,
వరుసగా వడ్డించి, - వాసించు జలము
కరమొప్ప [7]హాటక - కలశాల నిండ
నించి, యందుంచి; రా - నీరజోదరునిఁ 250
గాంచి నవ్వుచు నీల - కంఠుఁ డిట్లనియె:

శంకర, శ్రీహరుల వావి పల్కులు


'జలజాక్ష! నీవు మా - జలరాశి యింటఁ
గలుముల చెలి నిట్లు - గైకొన్న కతన
నసమాన సౌఖ్యంబు - లబ్బె నీ కిచటఁ
బొసఁగ నాఁకలి దీర - భుజియింపవోయి!
మీనరూపముఁ దాల్చి - మెండుగా జలము
పానంబుఁ జేసిన - ప్పటివలెఁ గాదు,
ఈ నిర్మలాన్నంబు - లిచ్చట నీవు
పూని యాఁకలి దీర - భుజియింపవోయి!
పరఁగఁ దాఁబేలివై - స్వల్పజంతువుల 260
నరుదుగా భక్షించి - నటువలెఁ గాదు,

అలర నీ కుడుముల, - నతిరసంబులను
పొలుపొందఁ దృప్తిగా - భుజియింపవోయి!
దొరకొని పందివై - తుంగగడ్డలను
గరగర నమలిన - కైవడి గాదు,
కరిజకాయలు, వడల్, గారె, లిడ్డెనలు
పొరిఁబొరి రుచులుగా - భుజియింపవోయి!
పూని నృసింహురూ - పున దైత్యు రక్త
పానంబుఁ జేసిన - ప్పటి రీతి గాదు,
తెలివితో నిప్పుడు - తేనె పానకము 270
నలువొప్ప నీవు పా - నము చేయవోయి!
సలలితంబుగ బ్రహ్మ - చారివ్రతముల
నలసి యీ వఱకు, గృ - హస్థుఁడైనావు,
విమలాత్మ! నియమముల్ - విడిచి యీ వేళ
భ్రమదీర నన్నియు - భక్షింపవోయి!
లలిని బ్రహ్మర్షిత్వ - రాజఋషిత్వ
ములఁ గాయ, పండ్లు ని -మ్ముగ మెక్కి దానఁ
దనియక వెన్న ము - ద్దలు మ్రుచ్చిలించి
తిని, దిగంబరుఁడవై - తిరిగిననాఁటి
బడలిక దీఱ నీ - పరమాన్నమెల్లఁ 280
దొడరి నీ వా చేర - తోఁ ద్రావవోయి!

కలికితనమున నాఁ - కలి దీరఁబోదు,
కులుకుతో నిపుడు సం - కోచింపవలదు,
భువి నెన్నఁదగు భక్ష్య - భోజ్యాదులైన
వివిధ పదార్థముల్ - వింతగా నిపుడు
ముజ్జగంబుల కాది - మూలమైనట్టి
బొజ్జనిండఁగ నీవు - భుజియింపవోయి'
అన విని తరిగొండ - హరి నవ్వి, శివునిఁ
గని యిట్టు లనియె: 'బల్ - గారడంబుగను

భుక్తశేష వినోదము - వితరణ


పన్నగాభరణ! యీ - పగిది నా తప్పు 290
లెన్నెద, వెపుడు ని - -న్నెఱుఁగనే? నేను
చక్కని పునుక కం - చంబు చేపట్టి
యెక్క డెక్కడ బిచ్చ - మెత్తినఁగాని
ఆఁకలి దీరక - యలనాఁడు విషము
గైకొని మెక్కిన - కైవడి గాదు
ఇప్పు డీ దివ్యాన్న - మిష్టంబుగాను
మెప్పుగా భుజియింపు - మేము చూడఁగను,
మును నీవు ఘన భూత -ముల సంహరించి
తనరార మెక్కి యెం - తటనైనఁగాని
పరితృప్తిఁ జెందక, - పావనుండైన 300
చిరుతొండ భక్తుని - శిశువు మాంసంబు

భక్షించినటు గాదు, బహురుచుల్ గాను
భక్షించు మిప్పుడీ - భక్ష్యంబులన్ని,
అనలునిఁ గంటిలో - నణఁచియున్నావు
గనుక, నీ కాఁకలి - ఘనముగా నుండుఁ;
గావున నిచ్చోటఁ - గల పదార్థములు
నీవ బోసేయుము - నేఁడు సిగ్గేల?
ఎల్లవా రెఱుఁగ నీ-వీడిగ దాని
కల్లుకుండలో మ్రుచ్చు - గతి డాఁగినావు
గాన, మాలిన్యంబు - గల, దది పాయుఁ 310
బూని మా యెంగి లి -ప్పుడు నీవు గుడువ'
అని భుక్తశేషాన్న - మతఁ డారగించు
కనక పాత్రంబులోఁ - గ్రక్కున వైచె.
శంకరుఁ డది చూచి - సంతసంబంది
పంకజోదరునితోఁ - బలికె నిట్లనుచు:
'తోయజనయన! క్షు - త్తుకుఁ దాళలేక
బోయదా నెంగిలి - బోసేసినావు
కావున దోషంబు - గల, దది పాయ
నీవు నాయెంగిలి - నేఁ డారగించు'
అని హరి పళ్ళెర - మందు శంకరుఁడు 320
తన భుక్తశేషంబుఁ - దప్పక వేసె;

అది చూచి శ్రీ విష్ణుఁ - డానందమొంది
మదనారి నీక్షించి - మగుడి యిట్లనియె:
“పరమేశ! నీ శీల - భావంబు పూర్వ
మరుదుగా బోయ క - న్నప్పకే దెలియు,
ఇపుడు నేఁ జెప్పిన, - నిందున్నవారు
నిపుణత దీపింప - నిన్ను నవ్వెదరు;
తనరార నా సహోదరినిఁ బార్వతినిఁ
గనుఁగొని కాతు నీ - గౌరవం బిచట'
అని పల్క విని శివుఁ - డంబుజోదరునిఁ 330
గనుఁగొని పల్కె ను - త్కంఠ నిట్లనుచు:
'జలజాక్ష! వినుము నీ - చపలత్వసరణి
కనుఁగొన గోపసుం - దరులకే దెలియు,
నే నిందుఁ జెప్పిన - నిన్ను నవ్వెదరు
గాన, చెప్పను రమా-కన్యను జూచి,
కాచెద నేఁడు నీ - గౌరవం' బనుచు
సూచింప, హరిహరుం
జూచి యిట్లనియె
“నిటలాక్ష! వినుము నీ - నిశ్చలత్వంబు
దిటమైన మోహినీ - దేవికే తెలియు,
చలపాది! నీ కామ - సంకల్ప సరణి 340
లలిమీఱ బ్రహ్మాదు - లకు నెల్లఁ దెలియుఁ,

జెలఁగి యిందామాటఁ - జెప్పిన నీకుఁ
దలవంపులని నేఁడు - తాళియున్నాఁడ'
అని యిట్లు హరి,హరు - లన్యోన్యముగను
మొనసి భాషింపుచు - మురియు నత్తఱిని
అల హరిభుక్త శే-షాన్న భక్ష్యములు
చెలువొప్పఁ గైకొని - శీతాద్రి తనుజ
వరుస నచ్చటి పంక్తి - వారి కందఱికిఁ
బరమోత్సవంబునఁ - బంచి వడ్డించి,

పార్వతీదేవి మాటకారితనము


సిరి కిట్టు లనియె 'నో - చిగురాకుఁబోణి! 350
శిర మరవాంచి బో - సేయకున్నావు,
చక్కెర పొంగలి, - సకల భక్ష్యములు
మెక్క సంకోచమే - మిటికి? నీ విపుడు
కులుకు ముద్దుల పెండ్లి - కూఁతుర, వీవె
పొలుపొంద నివి యెల్ల - భుజియింపవలయు'
అని నవ్వుచుండఁగా, - నది చూచి యమున
పనిఁబూని హిమశైల - బాల కిట్లనియె:
'ఏమమ్మ! పార్వతి! - యీ పసిబిడ్డ
నీ మాటలన్న నీ - న్నెవరు మెచ్చెదరు?
పిన్నది నీవు చె - ప్పిన పదార్థములు 360
పన్నుగా నొకటైన - భక్షింప లేదు,

మునుకొని బ్రహ్మాండ - ముల నీనినావు;
కనుక నీ కడు పతి - ఘనముగా నుండు.
అటుగాన భక్ష్య భో - జ్యాదు లెన్నైనఁ
పటు తీవ్రముగ నీవు - భక్షింపఁగలవు,
కొంకక నీ విందుఁ - గోరినవెల్ల
నింక వడ్డించెద - నిపు డారగించు.'
అనినఁ బార్వతి నవ్వి - యమున నీక్షించి
యెనలేని ముదముతో - నిట్లని పలికె:
'ఓ యత్తగారు! మీ - కొసరఁ గూఁతురని 370
పాయక మద్దత్తు - పట్టుగా - జేసి,
బాలిక చిట్లూని, - పాలచట్లూని
పాలు త్రాగదటంచుఁ - బలికితి రిపుడు,
బాలికయైన యీ - పరమపురుషుని
తొలిమితోఁ గూర్చి - తపమెట్లు చేసె?
పరఁగ మా యన్నయౌ - బ్రహ్మాండమయుని
గుఱుతుగా వలపించు - కొన నెట్లు నేర్చె?
విశదంబుగాను భా - వింప మీ తనయ
పసిబిడ్డ యెట్లగు? - బహు సూత్రధారి,
అది యెట్ల నంటె మ - హాసాత్త్వికులకె 380
పొదువైన గర్వంబు - పుట్టింప నేర్చుఁ,

గపటంబుతోఁ గాల - గతుల భావించి
యెపుడు పేదలనైన - హెచ్చింప నేర్చు,
మునుకొని హెచ్చించి - మోసంబు చేసి
ధనమదాంధులనైనం - దగ్గింప నేర్చు,
నీ పెండ్లి కూఁతురే - యెల్ల జాతులను
చాపల్యము నటించి చరియింపుచుండుఁ
గావునఁ బసిబిడ్డ - గాదు; మీ మాట
లీవేళఁ గాదన - నేల? నా కడుపు
గొప్ప యంటిరి, నేను - కోరినవెల్ల 390
నిప్పుడు [8]వడ్డింపుఁ - డేల దాఁచెదరు?'
అన విని తుంగ భ - ద్రాదులు నగుచు
ఘనపదార్థము లెల్లఁ - గ్రక్కునఁ దెచ్చి
రాసులు వోసి, పా - ర్వతిని వీక్షించి
'బోసేయు' మన, శైల - పుత్రి యిట్లనియె :
“ఒనర వడ్డించితి - రో యత్తగారు!
పనిఁబూని యాఁకలి -పాయునే దీన?
డీకొని మీరు వ - డ్డించిన వెల్లఁ
బ్రాకటంబుగ నొక్క - పంటికి రావు!
పొలుపొంద ననుఁ దృప్తి - పొందితు మనుచుఁ 400
బలికితి, రదియుద-బ్బఱ లాయెఁగాని,

చెలువొప్ప మాయన్న - శేషాద్రి మీఁదఁ
బులియోగిరము, మంచి - పొంగళ్లు, ఘృతము,
పొసఁగ దధ్యోదనం - బు, బకాళబాతు,
అసమాన రుచి మనో - హరము, లిడ్డెనలు,
అతిరసంబులు, దోసె, - లప్పముల్, వడలు,
ప్రతిలేని శర్కర - పరమాన్నములను
మెచ్చి తా భుజియించు; - మీ యట్టివారు
వచ్చిన, నన్న మ - వారిగా నొసఁగు.
అటువంటి ఘనుఁడు మీ - యల్లుఱికంబు 410
నెటువలె సైరించు? - నిది యేల? చాలుఁ!
బెనుపొంద మీ రింత - పేదవారైతె
ఘనమేమి? మీ రమా - కన్య నెత్తుకొని
వేంకటాద్రికి వచ్చి - వెలయ మా యన్న
కంకితంబుగ వివా - హముఁ జేసి, యచటఁ
గల పదార్థములు మీ - కడుపులు నిండఁ
జెలువంబు నిగుడ బో - సేసి రారాదె?
ఉప్పు కప్పలు, చేప - లుండు మీ యింటఁ,
దప్పక ఘనపదా - ర్థంబు లెక్కడివి?
అప్పుడు డంబార్ధ - మై మమ్ము నిటకు 420
రప్పించి కడుపులు - రట్టు చేసితిరి.

పొలుపొంద మీ భక్ష్య - భోజ్యాదు లిపుడు
లలిమీఱ మాకుఁ జా - లవు నిక్కముగను,
పూని మమ్మును దృప్తి - పొందింపలేక
దీనత్వమున నోడి - తిరి మీర' లనిన

పరమేశ్వరుని పరియాచకములు


విని నీలకంఠుండు - వికవిక నవ్వి,
తన సతి నీక్షించి - తగ నిట్టు లనియె:
'పార్వతి! మీ యన్న - బ్రహ్మాండకుక్షి,
సర్వభక్షకుఁ డిది - సత్యంబు గనుక
గడుపు నిండదు వంట - కం బెంతయైనఁ, 430
గడఁకతో జలధికిఁ - గల పదార్థములు
ఉప్పుతో సంతతం - బూరుచున్నట్టి
కప్పలు, చేఁపలు - గలవంటి విపుడు
కావున వారికిఁ - గల పదార్ధములె
ఈ వేళ వడ్డింతు - రెన్నేని, నవియు
మెండుగా మీ యన్న - మెక్కినఁ గడుపు
నిండఁ, దక్కినవెల్ల - నీ వారగించు;
తెలియ మీ యన్నకు - శేషాద్రిమీఁదఁ
గలిగియున్నవి వడ్డి - కాసులు గనుకఁ
బేరైన చేరుదు - బియ్య మన్నంబు, 440
సార మింపుగ లేని - చప్పిడన్నంబు,

కాటువోయిన పంటి - గంజి ప్రసాదంబు
మేటిగా బోసేసి - మెఱయుచునుండు;
అటువంటివారి కీ - యలఘు దివ్యాన్న
మెటువలె సైరించు? - నిది యేల చాలు?
నిప్పుడు మీ యన్న - కిది చాల దంటె
తెప్పింతునా మంచి - తిరుపణా చాఱు?'
అని కేరడముఁ జేసి - నటువంటి విభునిఁ
గనుఁగొని హిమశైల - కన్య యిట్లనియె:
'స్వామి! మా జలజాక్షు - సంపద దెలిసి 450
యీ మాడ్కి మీ రంటె - నేమి చెప్పుదును?
మాయన్న తిరుపణా - మధు సంతతంబుఁ
బాయక భుజియించు - భక్ష్యాళితోడఁ
దెరఁగొప్ప, నటుగానఁ - దిరుపణాచాఱు
హరికి సహింప ద - య్యది, యైనఁగాని
తెప్పింపుఁ డటువంటి - తిరుపణాచాఱు
మెప్పుగాఁ గ్రోలును - మీ చెల్లె' లనిన,
నగి యిట్లు పలికె నా - నాగకంకణుఁడు:
నగజ! మా లక్ష్మిని - ట్లనినందు కిపుడు
సుదతి! మీయన్న చూ - చుచునుండఁగానె460
యదె చూడు నీ చెంప - లదర వేసెదను;

సరవి నా చెల్లెలి - సత్కటాక్షమున
నరులలో మీ యన్న - నడిమికి వచ్చె.
అదిగాక, గుణహీనుఁ - డైనట్టివాఁడు
కుదురుగా నేఁటికి - గుణవంతుఁడయ్యెఁ;
జెలఁగి మా చెల్లెలిఁ - జేపట్టెఁ గనుక
వెలయు మీ యన్నకు విరివింత గలిగె.
అంతకుమున్ను ము - చ్చై డాఁగియుండ
నింతగా మీ యన్న - యెవరికిఁ దెలియు?'

స్వామి సరసోక్తులు


అన విని తరిగొండ - హరి మహేశ్వరునిఁ 470
గనుఁగొని పల్కె ను - త్కంఠ దీపింప
'నందివాహన! నీవు-నా సహోదరిని
మందుఁడవై యిన్ని - మాటలాడితివి,
మున్ను నా చెల్లె లి - మ్ముగ నిన్నుఁ గలిసి
మన్నించి నీ కింత - మహిమఁ గల్పించె;
అప్రమాణుఁడవు నీ - వై యుండఁగాను
సప్రమాణునిఁ జేసి - జగతిలో నిలిపె;
అరయ ననాకారి - వై యున్న నీకు
మఱి సుందరాకార - మహిమఁ గావించె.
వెలయు మా చెల్లెలు - వీక్షింపకున్నఁ 480
దెలియునే నీ పర - దేశిత్వ సరణి?

అనఘ! నీ చెల్లెలి - నధికురాలనుచుఁ
దనర నా చెల్లెలిఁ - దక్కువ యనుచుఁ
బలికితి విపు డెంతో - ప్రౌఢుఁడుగాను,
నెలవొప్ప వినుమైతె - నీ చెల్లి రీతి
నొనర నుండినచోట - నుండక తిరిగి
జనులను వంచించు - చపలాత్మురాలు
కావున మా శైల - కన్యకసాటి
యే విధమునఁ గల్గ, - దీ మాట లేల?
అప్పుడు నీవు నె - య్యంబుతో మాకుఁ 490
దెప్పింతునంటివి - తిరుపణా చాఱు
[9]తప్పవ ద్దా మాట, - తనివి దీరఁగను
తెప్పించు, మది యెంత - తెప్పింపఁగలవొ?
నా కడు పందునై - నను నిండకున్న
నీకుఁ [10]జంద్రున కదే - నిపుడు ద్రావింతుఁ,
జల్లని తిరుపణా - చాఱు ద్రావుటనె
తొల్లిటినుండి చం - దురునకు, నీకుఁ
దెల్లగా నుండెడి - దేహంబు గలిగె.
కల్లగా దీమాట - [11]గంజి మీ సొమ్మె:

ఇంక మాట్లాడకు - మింతియే చాలు! 500
శంకర! బోసేయు - సంతసంబుగను
అని పకపక నవ్వె: - నప్పుడా హరినిఁ

సాగరుని సమన్వయము


గనుఁగొని పలికె సా - గరుఁడు నవ్వుచును:
'జలజాక్ష! నీవును, - శర్వాణి విభుఁడు
బలవంతు, లానంద - భరితు, లన్నిటను
ఒక్క రొక్కరికన్న - నుత్తమోత్తములు.
తక్కక మీకు భే - దము లేదు గనుక
మొనసి నవ్వులకు బల్ - ముచ్చట మీఱ
ననుకొంటి రీమాట -లానందమగను.
జలజాక్ష! మితిలేని - జలజజాండములు 510
పొలుపొంద నెపుడు నీ - బొజ్జలో నుండుఁ
గావున, నీకు నాఁ - కలి దీరఁ దృప్తి
గావింప మేమెంత - గలవార మరయ?
మాకుఁ గల్గిన యంత - మాత్ర మీవేళఁ
జేకొని నీవు భు - జింపవే!' యనిన,
జలజాసనాదులా జలరాశి మాట
కలరుచు 'మేలు! మే!'లని మెచ్చి రపుడు.
హరిహరుల్ ముదమంది -యందటితోడఁ

బొరిఁబొరిఁ దృప్తిగా - భుజియించి లేవఁ,
పరిశుద్ధముగఁ గర - ప్రక్షాళనములు 520
వెరవొప్ప నయ్యె; నా వేళ నందఱికి,
విలసిత లీలల - విడెము లిప్పించి,
తలకొని యిష్టక - థా వినోదముల
సలలిత వేంకటా - చల వాసుఁ డనఁగ
నలువొప్పు తరిగొండ - నారసింహుండు
అమిత సంతోష మ - గ్నాత్ముఁడై చెలఁగి
కొమరొప్పఁగా నందుఁ - గొలువు గూర్చుండె.

కనక కలశ చౌర్యము - కన్యక అభ్యర్థనము


శ్రీ వేంకటేశుఁ డా - శ్రిత జనావనుఁడు
పావనాచారుఁడు - - బ్రహ్మాండమయుఁడు
పన్నగ శయనుండు - భవ విదూరుండు 530
నన్నేలు తరిగొండ నారసింహుండు
అంత నచ్చట నుండి - హాటకకలశ
మెంతయుఁ బ్రీతితో - నెలమి నెత్తుకొని
వేఱొక్క విడిదికి - వేడ్కతో నరిగె;
నా రీతిఁ దెలిసి గం - గాదు లైనట్టి
సాగరాంగన లెల్ల - సకలోత్సవముల
వేగ శ్రీలక్ష్మిని - వెంటఁ బిల్చుకొని,

వింతగా హరియున్న - విడిదికిఁ బోయి,
సంతోషమున రమా - సతిచేత నపుడు
విహితంబుగా నాది - విష్ణుదేవునకు 540
రహిని సర్వోపచా - రములు చేయించి,
'పిలువు? నీ పతి' నని - ప్రేరేపఁ, దాను
కిలికించి తాపాంగ - కించిదానమిత
యగుచు నాయకుని మో - మల్లనఁ జూచి
వగ గుల్కఁ బిలిచెన - వ్వనిత యిట్లనుచు;
'జలజాతనయన! నా - స్వామి! యిచ్చటికి
యలిగి వచ్చినదేమి? - యానతీవోయి!
నిపుణత్వ మెఱుఁగక - నే నిందుఁ జేయు
నపచారములకు నీ - వలిగి వచ్చితివొ?
వెలయ మజ్జనకు ని - వ్వేసాలచేత550
నళికింపఁదలంచి నేఁ - డలిగి వచ్చితివొ?
నెట్టన మా తల్లి - నీకు వడ్డించి
నట్టి యన్నము చాల - కలిగి వచ్చితివొ?
ప్రాకటంబుగ సర్వ - భక్ష్యాళి మెక్కి
యాఁకలి దీర కి - ట్లలిగి వచ్చితివొ?
పన్నుగాఁ జెల్లెలౌ - పార్వతి కచట
నన్నంబు చాల కి - ట్లలిగి వచ్చితివొ?

తిరుపణా చాఱైనఁ - దెప్పింతు ననిన
హరుని వాక్యముల కి - ట్లలిగి వచ్చితివొ?
పేదవారింటిలోఁ - బెండ్లియాడితిని 560
ఆదాయమేమని - యలిగి వచ్చితివొ?
అనఘ! 'పెండ్లికి దీసి - నప్పెట్లు దీర్తు?”
నని విచారమున ని - ట్లలిగి వచ్చితివొ?
సొరిదిగా వడ్డి కా - సులు గూడఁబెట్టి,
పరఁగ వరాల నే - ర్పఱుప వచ్చితివొ?
చాల నీ కుపదలు - సమకూర్పఁగలము,
లే! లక్ష్య మేమింక? - లేచి రావోయి!
బుస్సు బుస్సున నల్కఁ - బూని వచ్చితివి;
లెస్సాయె నిఁకఁ జాలు!- లేచి రావోయి!
బాలుని రీతి ని - భ్భంగి నల్గుదురె? 570
లీలావినోదుఁడై - లేచి రావోయి!
యెలమి మాలోఁ - దప్పు లెన్ని గల్గినను
తొలఁగి రాఁదగునె? ము - ద్దులస్వామి! యిపుడు
అపరాధములు గాచు - నటువంటి నీకుఁ
గపట మేమిటికిఁ? జ - క్కని ముద్దుసామి!
తటుకున వెన్న ము - ద్దలు మ్రుచ్చిలించి
నటువలెఁ గలశ మిం - దవలీలగాను

చెలఁగుచు నేఁడు మ్రు - చ్చిలి తెచ్చినావు;
వలనొప్ప శివుఁడున - వ్వఁడె? ముద్దు స్వామి!
మొనసి యీ కలశంబు మ్రుచ్చిలించుటకుఁ 580
బనిఁబూని బలు నగుఁ - బాట్లయ్యె ననుచు
సిగ్గుతోఁ బార్వతి - శివుఁజూచి వెఱచి
తగ్గుచున్నది, సహో - దరి దిక్కుఁ జూడు!
శివుఁడు, చంద్రుఁడు నీవు - చేసిన పనికి
నవిరళంబుగఁ జాల - హాస్యంబు చేయఁ
దలఁచుచున్నా, రింక - దయచేసి లేచి
నెళవొప్ప రావోయి! - నీకు మ్రొక్కెదను.
మహనీయ శేష హో - మముఁ జేయవలయు
విహితంబుగా లేచి - వేగ రావోయి!
ఎదురు చూచెదరు బ్ర - హ్మేంద్రాదు లచట 590
సదమల చరిత! నా - స్వామి! రావోయి!
నలువొప్ప నెట్లైన - నన్ను మన్నించి
సలలిత హృదయ! నా - స్వామి! రావోయి!'
అని యిట్లు ప్రార్థించు - నటువంటి సతినిఁ
గని హరి దరహాస - కలితాస్యుఁడగుచు
నిందిరా కరపద్మ - మింపొందఁ బట్టి,
యందుండి కదలిమ - హావైభవమున

వచ్చి, తత్పూర్వ వి - వాహపీఠమున
హెచ్చుగాఁ గూర్చుండి - యిందిరతోడ
మహనీయ శేష హో - మముఁ జేసి, యపుడు 600
సహజములై చెల్లు - సకల కృత్యములు
వరుసగా నెఱవేర్చి, - వరలగ్నమందు

శ్రీహరి యాహ్వానము - శేషాద్రికిఁ బ్రయాణము


హరి తోయధినిఁ జూచి - యమర నిట్లనియె:
'మామ! సోముఁడు, మీరు, - మా యత్తగారు
శ్రీమహాలక్ష్మినిఁ - జెలఁగి తోడ్కొనుచు
అజ, రుద్ర, నిర్జరేం - ద్రాదులతోడ
భుజగ శైలమున కి - ప్పుడు వచ్చి, యచటఁ
గల విశేషములు మీ - కన్నులఁ జూచి,
యలర మీ సుతను, మ - మ్మాశీర్వదించి,
మగుడి వత్తురు రండి! - మా వెంట' ననిన, 610
నగజాధిపతిముఖ్యు - లందఱా రీతిఁ
బ్రియముతో 'రండ'నీ - పిలువఁగా, జలధి
భయ, భక్తు లెసఁగఁ ద -ప్పక సమ్మతించి,
వివిధ భూషణములు, - వివిధాంబరములు
వివిధంబులగు వస్తు - వితతులు దెచ్చి,
హరికి, రమాకన్య - కపుడు నొప్పించి,

మఱిమఱి సంతోష - మగ్నుఁడై చెలఁగి,
హర, పద్మభవ, నిర్జ - రాదుల, వారి
వరవధూమణులను వరుసఁ బూజించి,
బహురత్న, భూషణాం - బరము లర్పించి 620
సహజంబుగాను శ్రీ - సతికి వేడుకను
పరఁగ ముత్యపు టొడిఁ - బ్రాలు గట్టించి,
మురిపెంబు మీఱ నా - ముద్దుపట్టికిని
అరణంబుగాను ది - వ్యాశ్వబృందములఁ,
గరి, రథావళులను, - గల పదార్థముల,
దాస, దాసీ జన - తతులతో నిచ్చి
వాసుదేవుని వెంట - వచ్చె నత్తఱిని,
అలరార బ్రహ్మ రు - ద్రాదు లందుండి
నలువొప్ప నిజవాహ -నము లెక్కి రపుడు,
సంతోషచిత్తుఁడై - జలజలోచనుఁడు 630
వింతగా నందఱ - వేడ్కఁ దోడ్కొనుచు
అతివతో గరుడవా - హనముపై నెక్కి
హిత, బంధుజన, పురో - హితులు సేవింపఁ,
దొలఁగక మంగళ - తూర్యముల్ మొరయఁ,
జైలువంబు రెట్టింప - శేషాద్రిఁ జేరి,
సులలితమైనట్టి - శుభలగ్నమందు

వెలయఁగా నగరు ప్ర - వేశించి, యచటఁ
బోఁడిమితో నంతఁ - బురహరాదులకు
వేడుక దీపింప - విందు చేయించి,
పరఁగ శ్రీ పార్వతీ - పరమేశ్వరాది 640
వరదంపతుల కెల్ల - వరుసగా నపుడు
తనరారఁ జందన - తాంబూలములను,
కనకాంబరములను - గరుణ నిప్పించి,
హరి వీడుకొల్ప, బ్ర - హ్మాదు లందుండి
మురియుచు నిజపురం - బులఁ జేరి; రంత
జలరాశి పైనమై - 'జలజాక్ష! మాకు
సెలవిమ్ము కలుముల - చెలితోడ' ననిన
'నో మామ! మీ కన్య - నొక క్షణంబైన
నీమీఁద విడిచి నే - నిందుండ లేను;
అటుగాన సిరిని నే - నంపఁగాఁ జాల, 650
నెటులైన నోర్చి నీ - విఁకఁ బోయిరమ్ము'
అని హరి పల్కఁ, జిం - తాక్రాంతుఁడగుచు
వనధి యిట్లనియెను - వనజాక్షుఁ జూచి:

సాగరుని సంప్రార్థనము


శ్రీ పన్నగాధీశ! - చిదచిద్ద్వయేశ!
పాపాహి విహగేంద్ర! - పటుకృపాసాంద్ర!

సర్వేశ్వరుఁడ వీవు, - సర్వాత్మ వీవు,
సర్వసాక్షివి నీవు; - సద్బ్రహ్మ నీవు
కావున, నీ వెఱుం - గని నీతి గలదె?
భావింప శ్రీసతి - ప్రౌఢగా - దిపుడు,
ఈ పసిబిడ్డ నిం - దిరవుగా నుంచి, 660
యీ పట్లఁ బోను కా - ళ్ళెట్లాడు మాకు?
నిపుడె మమ్మెడఁబాసి - యీ చిన్నబాల
నిపుణత్వమున నిందు - నిలువ నెట్లోపు?
మా యింట నాటలే - మరగిన యబల
మీ యింటఁ బనులలో - మెలఁగ నెట్లోపు?
పొసఁగ [12]బ్రహ్మాండ రూ - పున నొప్పు మిమ్ము
విసువక సేవించు-విధము లేమెఱుఁగు?
చాలఁ దల్లులచెంత - జనవుగా నుండు
నీ లేమ భయ భక్తు - లెఱుఁగునే యిపుడు?
కావున దయచేసి - కమల నీ మాటు 670
మా వెంట నంపవే! - మహితాత్మ!' యనిన,
వనజోదరుఁడు నవ్వి - వకుళ మాలికకుఁ
గనుసన్న చేసి సా - గరు దిక్కుఁ జూపె.

వకుళమాలిక పలుకులు


వకుళమాలిక హరి - వాంఛితం బెఱిఁగి
యకలంకముగఁ బల్కె - నబ్ది నీక్షించి:
'జలధి! నీ జహుజన్మ - సంస్కారమహిమ
వలన నియ్యాది దే -వత కూఁతురయ్యె,
వేదాంత వేద్యుఁడై, - విశ్వాత్ముఁడైన
ఆదిమహావిష్ణు - వల్లుఁడై వెలసెఁ;
గావున నీ భాగ్య - గౌరవమహిమ 680
భావింపఁ దరమె యా - బ్రహ్మకునైన?
నెమ్మది, నటుగాన - నీవు నీ సుతను
సమ్మతి సుంచుమీ! - స్వామి చెంగటను,
అలర మీ కన్న నే - నధికంబుగాను
కలుముల చెలి నిందు - గారవించెదను;
హరికటాక్షము గల్గి - నపుడు మీ సుతకు
గురుసౌఖ్యములకుఁ ద-క్కువ లేదు గనుక,
సంతోషమున రమా - సతిని మా స్వామి
చెంతనే నిల్పుఁడీ! - చింత యేమిటికి?
అనఘ! యీ స్వామి చి - త్తానుగుణ్యముగ 690
మనకు వర్తించుట - మర్యాద' యనిన,
సాగరుఁ డా మాట - సమ్మతించుకొని
వేగ భార్యలకు న - వ్విధము బోధించి,

సముద్రుని హితవచనములు


'అమ్మ! ర'మ్మని సిరి - నంకపీఠమున
నెమ్మదితో నుంచి - నెమ్మోము నిమిరి,
'ఓ యమ్మ! యిచట ని- న్నుంచి పొమ్మనుచు
మా యల్లుఁడైన యీ -మధుసూదనుండు
పలుకుచున్నాఁడు, నీ - పతి యాజ్ఞలోనె
నిలువు నీ విచ్చట - నే సమ్మతమునఁ,
గలకంఠి! నీ పతి - కనుసన్నలోనె 700
మెలఁగుచు, మాకు నె - మ్మినిఁ గీర్తి దెమ్ము!
వనజాక్షి! యిచ్చట - వకుళ మాలికను
మనము రంజిల్లఁగా - మన్నింపుచుండు!
[13]పతి సేవయందుఁ గో - పము చేసినపుడు
హితవులు చెప్పి, న - వ్వెలమి లాలించు!
పన్నుగా వచ్చిన - భక్త కోటులకు
నన్న పానము లిచ్చి - యపు డాదరించు
అలరి మున్పటిరీతి - నాట్లాడవలదు!
పొలుపొందఁ బెత్తనం - బు వహించియుండు!
పరఁగ నింతైన లో - భగుణంబు లేక 710
వరము లందఱికి న-వ్వారిగా నిమ్ము!

వెలయ నీ పతి యొక - వేళ నవ్వులకు
జెలఁగి తగ్గించి, హె - చ్చించినఁ గాని
కలఁగ కత్తఱినిఁ ద - గ్గక హెచ్చ కెపుడు
పొలుపుగా నొక విధం - బుగ సేవ సేయు!
మకుటిలానందాత్ముఁ - డైనందువలన
నొకవేళ సంతోష - ముప్పొంగఁగాను
నీ పతి పర భామి - నీ సక్తుఁడైనఁ
గోపంబు లేక మ - క్కువను మన్నించు!
మొనర నహంకార - మొకవేళ నయిన 720
జనియింపనియకు! నీ - స్వాంతంబునందుఁ,
బరఁగఁ గాంతల కెల్లఁ - బతిభక్తి దక్క
నిరతంబు మఱి యొక్క - నియమంబు గలదె?
వరపతివ్రతయైన - వనితకు జగము
కరతలామలకంబు - గాఁ గానవచ్చు,
గావున్న, బతిభక్తి - ఘనముగా నాత్మ
భావించి, నీవు నీ - పతిఁ గొల్చియుండు.
ఈ పరమాత్మున - కిల్లాలవైన
నీ పుణ్యమహిమ వ - ర్ణింప నా వశమె?
తల్లి! నే నినుఁ గాంచి - ధన్యుండనైతిఁ 730
జల్లఁగా వర్ధిల్లు! - సర్వకాలంబుఁ

బొలుపొంద, మే మింకఁ - బోయి వచ్చెదము
నిలువు! నీ పతి చెంత - నీవు వేడుకను'
అని బుజ్జగించి, నె - య్యంబు రెట్టింపఁ
దన వధూమణుల నం - దఱఁ జేరఁబిలిచి,
వారిచే శ్రీరమా - వనిత కావేళఁ
గూరిమి బహురత్న - కోటు లిప్పించి,
మురువొప్పఁ గౌస్తుభ - ముఖ్య సన్మణులు
హరికి సమర్పించి, - యతిభక్తిఁ బెంచి
చెలువొప్పఁ జక్రికి - సిరి నొప్పగించి, 740
బలు జాలిమాలితోఁ - బలికె నిట్లనుచు:

సాగరుని మనవి


శ్రీశేషగిరివాస! - చిరదరహాస!
వాసిగా నా మీద - వాత్సల్య ముంచి,
పసిబిడ్డలైన నా - పట్టిని నీవు
కుశలంబుగా నేలు - కొనుము! సత్కృపను,
తప్పొప్పులను మీరు - దయతొ మన్నించి,
యుప్పతింపక ప్రోచు - టుచిత మీ సతిని,
నీలనిభాకార! - నీళ్లలో ముంచు,
పాలలో ముంచు నీ - భార మీమీఁద'
అని యొప్పఁ జెప్పి, చిం - తాక్రాంతుఁడైన 750
వనధి కిట్లని పల్కె - వాసుదేవుండు :

“ఓ మామ! మీ పట్టి - నుచితంబుగాను
ప్రేమతో వారు చె - ప్పిన చందముననె
పరిపాలనముఁ జేతుఁ - బ్రఖ్యాతిమీఱు
నురమునం దిడుకొని - యుందు సంతతము,
స్వాంతంబులో నీవు - సంతసంబందు!
చింతింపవల'దని - చెప్పి, శ్రీసతిని
మన్నించి, కౌస్తుభ - మణితోడ నపుడు
పన్నుగా వక్షంబు - పైన నుంచుకొనె.
అంత సాగరునకు, - నతని భార్యలకు, 760
సంతోషమెసఁగ నా - [14]జలజాంతకునకు
బహు దివ్య భూషణాం - బరము లిప్పించి,
విహిత సత్కరుణతో - వీడ్కొల్పె, వారు
నిజనివాసముఁ జేరి - నిరతంబు హరిని
భజియింపుచుండి; రా - పద్మాక్షుఁ డిచట

శ్రీనివాసుని వైభవము


నెళవుగా నానంద - నిలయంబునందు
వలనొప్పఁగా శ్రీని - వాసాఖ్య నమరి,
అరుదుగా బ్రహ్మోత్స - వాదుల, మఱియు
నిరుపమానములైన - నిత్యోత్సవములఁ
[15]బరమ సంతోషసం - భరితుఁడై, చాలఁ 770
బరుస నాకర్షించి, - బహుభాగ్యములను

వరుసగాఁ గైకొని, - వారికి వివిధ
వరములిచ్చుచు, మహా - వాత్సల్యమునను
నా పాలి తరిగొండ - నరసింహుఁడగుచు
శ్రీ పన్నగాద్రిపై - స్థిరముగా వెలసి,
నా పెన్నిధానమై - నైజమోక్షంబుఁ
జూపుచు, ననుఁ దన - సొమ్ము చేసికొని,
కుదురుగా నన్నేలు - గురుఁడు తా నగుచు,
ముదమొప్పఁ దత్త్వార్థ - ములను దెల్పుచును,
అలమేలుమంగతో - నానందముగను 780
సులలితలీలల - సుఖియింపుచుండె.

కృతి సమర్పణము


అని యిట్లు శేషాచ - లాధీశుఁడైన
కనకాంబరుని పేరఁ - గమలేశు పేర
వలనొప్పుఁగా నంద - వరకులోద్భవుఁడు
చెలువొంద నమల వా - సిష్ఠ గోత్రుండు
వసుధలోఁ గానాల - వంశవర్ధనుఁడు
రసికుఁడౌ కృష్ణార్యు - రమణి మంగాంబ
సుత వెంగమాంబ భా - సురభక్తితోడ
ప్రతిలేని శ్రీరమా - పరిణయం బనెడి

వరకృతి ద్విపద కా - వ్యముగా రచించి, 790
నరులెన్నఁ దరిగొండ - నరసింహుఁడైన
సదమల వేంకటా - చలపతి దివ్య
పదయుగళికి సమ - ర్పణముఁ గావించె.
కోరి సుబ్రహ్మణ్య - గురు కటాక్షమున
సారమై యీ కృతి - సార్వకాలంబు
భూచక్రమున మహా - పుణ్యులు చదువ
నా చంద్రతారార్క - మై యుండుఁగాత! 797

  1. వెంట పట్టఁగాఁ జూపె -- పూర్వముద్రిత పాఠము.
  2. సంయములు - పూర్వముద్రిత పాఠము.
  3. మురువొప్ప - పూర్వముద్రిత పాఠము
  4. వింత చిత్తరువులతోడ - పూర్వముద్రిత పాఠము
  5. కాశి కేఁగెదవె? - పూర్వముద్రిత పాఠము.
  6. పీఁటలమీఁద - పూర్వ ముద్రిత పాఠము.
  7. సౌవర్ణ కలశాళి నిండ - పూర్వ ముద్రిత పాఠము.
  8. వడ్డింప కేల దాచెదరు - పూర్వముద్రిత పాఠము.
  9. తప్పక మా కిట - పూర్వముద్రిత పాఠము.
  10. జంద్రుని కళ నిపుడు దాగింతు - పూర్వముద్రిత పాఠము.
  11. కన్య మీ సొమ్ము - పూర్వముద్రిత పాఠము.
  12. బ్రహ్మాండ రూపుని నొప్ప మిమ్ము - పూర్వ ముద్రితపాఠము
  13. పతి సేవ్యుఁ డెపుడు కోపము సేసినపుడు,
    హితవులు సెప్పి నవ్వెలమిఁ దోఁపించు
    పూర్వ ముద్రిత పాఠము
  14. జలజాంబకుండు - పూర్వ ముద్రిత పాఠము.
  15. పరముఁడు సంతోషభరితుఁడై చాలఁ - పూర్వముద్రిత పాఠము.