శ్రీమదాంధ్రమహాభారతము - పీఠికలు/అవతారిక
అవతారిక
| సీ. | విప్రులు గడునర్థి వేఁడినఁ గడిమితో | |
—ఆరణ్య-7:295
| | కీర్తి విడువఁజాల, గీర్తితో మెలగంగఁ | |
—ఆరణ్య-7:293
ఇదీ! ప్రబంధపర మేశ్వరుడు - శంభుదాసుడు - ఎఱ్ఱాప్రెగ్గడ సృష్టించిన దానవీరుడు రాధేయుని సూక్ష్మాకారచిత్రము!
కాబట్టే, 'కార్తీకంతో వానలు సరి, కర్ణునితో భారతము సరి' అన్న చాటువు లోకంలో సామాన్యమై పోయినది. తెనుగుభారతము కర్ణుని 'విమలయశోఘనుఁడు' 'నిష్ఠురభుజవిక్రమోగ్రుఁడు' 'ఇనుమారొకశరము దొడగని శస్త్రసంపన్నుఁడు' 'దివ్యశరశిక్షావైభవ పరమనిష్ఠకలిమి' గలవాడుగా వర్ణించినది, కృష్ణునివంటి విరోధిపక్షమువారిచే అగ్గింప జేసింది. 'అంతకకోపవహ్ని విపులాకృతి గైకొని వచ్చినట్లు' రెండుదినములు మగసిరి బయట బెట్టి, ఘోరసంగ్రామము చేయించి వీరస్వర్గము నలంకరింపజేసినాడు — కవిబ్రహ్మ! కౌరవకార్యభారమంతయు వసుసేనునిభుజాస్కంధములపై మోపబడుటకు కారణము గూడ ఇదే! అని ఆ పూర్ణపురుషుడు-తిక్కయజ్వ కర్ణునితేజోమూర్తికి చెన్నులు దిద్దినాడు.
ఇక కర్ణుడు అడుగడుగున ఓడిపోవు పిరికికండగలవాడుగా చాటుచున్న దెల్ల పౌరాణికులు చేయు కాలక్షేపములే! తెనుగు భారతమును ఏ తట్టుకుగాని మొగ్గని మనసుతో చదివినచో సాక్షాత్కరించు కర్ణరూపము భువనమోహనమైనది! మున్ముందు పరికింతము.
ఇక సంస్కృత-ఆంధ్ర ఆదిభారతములను గూర్చి గరుడదృష్టిగా కొంత పరిశీలింతము :—
1. భారత ఇతిహాసము — గ్రద్దచూపు
భారతవిషయమై ఇంతవరకు పండితులు, పరిశోధకులు వెలువరించిన విషయసారాంశము ఇందు పేర్కొనబడుచున్నది. వేదం వేంకటాచల అయ్యర్; బి. ఏ; బి. ఎల్., (Notes of a Study of the Preliminary chapter of the Maha Bharata-1921) పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారి భారతచరిత్ర దీనికి ఎక్కువగా తోడ్పడినవి.
★భరతజాతి — భరతఖండము
భరతజాతి ప్రస్తావనము ఋగ్వేదములో నున్నది. ఆజాతివారిచరిత్రమే భారతము. ఈవేదమున ప్రశంసింపబడిన భరతునిపేరనే యీదేశమునకు భరతఖండమని పేరు గలిగినది. ఈయన మహావీరుడు ; అశ్వమేధము లనేకములు చేసిన సమ్రాట్టు! కాని, మార్కండేయపురాణము — స్వాయంభువు మనువు మనుమడు — ఋషభునికొడుకైన భరతునిపేరనే యీపుణ్యభూమికి ఆపేరు వచ్చినదని వెలిబుచ్చుచున్నది. ఇంకను దుష్యంతునికొడుకు, శ్రీరాముని తమ్ముడు, జడభరతుడు అనువారుగూడ కొంద రున్నారు; కాని వీరికి యీపేరుతో ఎట్టి సంబంధముగాని లేదని పలువురు.
ఇట్టితారుమారులు మనచరిత్రకు సహజగుణముగా నున్నది.
★భరతవంశము
'వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి' అని ద్రౌపది సగర్వముగా చెప్పుకొనుచున్నది; కాని ఆభరతవంశము వీరివరకు సాగినచ్చినచో లేదో అని ఒక సందేహము.
(భాగవతము 9 వ స్కంధము 612 పద్యము మొదలు)
"దుష్యంతుడు గర్భవతి అయిన శకుంతలను వదలిపెట్టి స్వరాజధాని చేరినతర్వాత, ఆకాశవాణి — శకుంతలకు పుట్టిన బాలుడు నీ కొమారుడు; నీవు భరింపుము — అనుటచే భరతనామమున బఱగెను. ఇతడు 27,000 ఏండ్లు ధరణిని ఏలినాడు. ఇతని భార్యలు మువ్వురు, మువ్వురపుత్రులను కని, వారు వల్లభునితో సరిగారని తెలిసికొని, తోడ్తోడన ఆత్మశిశువుల శిరముల దునుమాడిరి. అనగా ఈభరతునికి సంతతే లేకపోయినది.
ఇట్లుండ, బృహస్పతి తన వదినె — మమతపై బడి (ఛథ్యునిభార్య) సురతమునకు తార్కొనగా, అంతకుముందే ఆమె గర్భమునం దుండిన బాలుడు వలదని వారించును. దీనికి బృహస్పతి అలిగి, వానిని అంధుడవు అగుమని శపించెను; ఆగర్భస్థప్రాణి కోపముతో దేవగురువు ఇంద్రియమును బయటకు తన్నివేయగా, అది బయటబడి బిడ్డ డైనాడు. బృహస్పతి, ఆశిశువును మమతను భరింపమనగా ఆమె ఆయననే భరింపుమనినది. వెంటనే ఆ ఇద్దరును ఆబిడ్డను దిగనాడి, ఎవరిదారిన వారు పోయినారు. ఇద్దరు భరింపుమనినారు కాబట్టి ఆబిడ్డ భరద్వాజు డైనాడు. గర్భస్థశిశువు దీర్ఘతము డైనాడు. "ఈపరిత్యక్తశిశువును మరుత్తులు పోషించి, పెద్ద జేసినారు. ఆవల పుత్రార్థియై వాపోవుచుండిన భరతునికి యీకుమారుని ఇత్తురు. ఆయన చేకొనగా, ఇతడు వితథుడు అనుపేర భరతవంశమునకు వంశకర్త అయినాడు.”
ఈనాటిదృష్టికి యిది అసభ్యమే! అందువల్లనే "పురాణములను, వాటి కవిత్వసౌభాగ్యము ననుభవించుటకే చదువవలెను” అని విసుగెత్తి శ్రీ వివేకానంద స్వాములవారు చెప్పినారు.
ఇట్లా ఈభరతవంశబీజమునకు జడ్డిగములోనే మిడతపోటు తగిలినది. ఒకవేళ ఇదే ఆవంశమని అనుకొనినా, భీష్మునితోనే నిస్సంతానసికతాతలములో ఇఱ్ఱింకిపోయినది.
★భారతగ్రంథము
భారతమును మొదట ద్వైపాయనుడు కావ్యముగా వ్రాసినాడు. (కృతమయేదం భగవాన్ కావ్యం పరమపూజితం) ద్వీపమే అయనం - ఉనికిగా గలవాడు ద్వైపాయనుడు; నల్లటివా డగుటచే కృష్ణద్వైపాయను డైనాడు.
ఈయన భారతమును వ్రాసి వ్యాసు డైనాడు. పురాణములు వ్రాసినవారికి 'వ్యాస' అన్నది ఒక బిరుదము. ఇది బుద్ధుడు విక్రమాదిత్యుడు అను వాటివంటిది. మన పురాణములలో 28 మంది వ్యాసులు లెక్కకు వచ్చి ఉన్నారు. అన్ని యుగములు బ్రతికియుండి, పరస్పరవిరుద్ధములైన 18 పురాణములను వ్యాసుడు వ్రాసినాడనుట పొసగదు. వేదవిభజనము చేసినది, బ్రహ్మసూత్రములను వ్రాసినది వ్యాసుడే గాని సూక్ష్మముగా వీరిని వేరు చేసినారు. వేదవిభజన
వేదవ్యాసుడు చేయగా, బ్రహ్మసూత్రములు బాదరాయణవ్యాసకృతము లని చెప్పుచున్నారు. వ్యాసపదమునకు వ్యాపింపజేయుట అనిగదా అర్థము, వేదవిభజనము చేసినవారికి గూడ వ్యాసబిరుదమే! వ్యాసునికిముందే పురూరవమహారాజు, ఒక్కొక్కటిగా నుండిన వహ్నిని-వేల్పును-పురుషోత్తముని-దమును-ప్రణవమును తనబుద్ధిపెంపుతో మూడుగ నేర్పరచిరని భాగవతము చెప్పుచున్నది. ఇది సమంజనమే! ఆనాడు భూరివిద్య క్షత్రియులదిగదా. (సంస్కృతభాగవతము 9-స్క. 14-వ అధ్యాయం చివరన; తెనుగు 9-స్కం-420 పద్యము.)
| | “భ్రాజితవృత్తిమై బరఁగు భారతసంహిత, సంయమీంద్రులారా జయ నామకంబునను రాజితభంగి జగత్రయంబునం బూజితకీర్తియై నెగడు... | |
స్వర్గా-పర్వ-89
వ్యాసుడు మొట్టమొదట 'జయ' అనుపేర 8800 శ్లోకములలో భారతకావ్యమును వ్రాసినాడు. అది 24,000 లకు పెరిగి, ఆ కావ్యము ఇతిహాసమైనది; భారత మైనది; ఆవల మహాభారత మైనది; చివరకు పంచమవేదమైనది. ఇక లక్షగ్రంథమునకు పైన ఎట్లు కాకుండగలదు?
వ్యాసుని శిష్యులు — నారద, దేవల, శుక్ర, జైమిని, వైశంపాయనులు యీ భారతమును చెప్పినారు. దానిని విని వచ్చి, నైమిశారణ్యముస సాగుచుండిన సత్రయాగములో, శౌనకాది మహామునులకు ఉగ్రశ్రవసుడను సూతుడు (రోమహర్హుడను వాని కొడుకు) 1,20,000 శ్లోకములతో చెప్పగా అది మహాభారతమైనది. (శౌనకాది భూసురవరు లింపున గరఁగుచొప్పున చెప్పినవారు:- స్వర్గా-సర్వ-94)
★తెనుగునకు మూలము
ఆంధ్రీకరించుటలో నన్నియ సౌతి మహాభారతమును, తిక్కన వైశంపాయన భారతమును చేపట్టినారు. ఎఱ్ఱన రెంటిని పేర్కొనుచున్నాడు.
ఆంధ్రభారతము ప్రథమముద్రణము 1850 లో ఆలూరు ఏకాంబర జోస్యులవారిచే గావింపబడినది. లండర్ ఇండియా లైబ్రరీలో నున్నది. అచ్చు 1888 లో అని కొందరు, భండార్కారు సంస్థ వారు తమసంశోధనప్రతికి సహాయకారిగా అనువాదములలో ప్రాచీనమైన ఆంధ్రభారతమునే చేపట్టినారు. పంపని కన్నడభారతము క్రీ.శ. 901 ప్రాంతాన పుట్టినా, అందు వైదికదృష్టి మారి జైనప్రాబల్యము జొరబడుటచే మూలమునకు భిన్న మైనది. అందుచే కర్ణపర్వమును తిక్కన రచననే వారు గ్రహించినారు.
తిక్కన చేపట్టిన సంస్కృతమూలము శారదాలిపిలో నున్న మూలమునకు దగ్గరదగ్గరగా సరిపోవుచున్నది. ఇది (కుంభకోణ) దక్షిణాదిప్రతికిగూడ సన్నిహితమైనది. కానీ దక్షిణప్రతిలో ప్రక్షిప్తములు, మార్పులు, తత్కాలవ్యతిరిక్తపురాణాంశములు చాల చేర్చబడినవి. తల కొకతీరుగా వ్రాసినవి చాల ఇందు దూర్చబడినవి. శారదాలిపి ప్రతికి, దక్షిణప్రతికి మధ్యస్థంగా తెనుగు వ్రాతప్రతు లున్నవి. తెనుగు (సంస్కృత) ప్రతులు ఎక్కువగా ఉత్తరదేశప్రతితో సరిపోవుచున్నవి. ఈ కర్ణపర్వము ఎక్కువగా కుంభకోణపుప్రతిని అనుసరించియున్నది.
తెలుగులిపి ప్రతులు —
- లాహోరు డి. ఎ. వి. కళాశాలనుండి (ఇప్పుడు, తూర్పు పంజాబు) హోషియార్‌పూరులో సాధు ఆశ్రమమును చేరియున్నది.
- మేల్‌కోటెలో, యదుగిరి యతిరాజమఠ గ్రంథాలయమున గలదు.
- తంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయమున నున్నది.#
ఈ సంస్కృతకర్ణపర్వము — వైశంపాయనుడు చెప్పినది. అట్లే తిక్కన తెనుగుగ్రంథముగూడ.
అర్జునుడు సంసప్తకులతో రెండుదినములు పోరాడినట్లుండ, తిక్కనప్రతిలోను, కొన్ని దక్షిణప్రతులలోను, ఆపోరు ఒకనాటిదిగా రెండవనాటి యుద్ధమునకే కొనిపోబడినది. ★భారతయుద్ధము — గ్రంథము
నక్షత్రగతినిబట్టి (అశ్వన్యాది) భారతయుద్ధము క్రీ. పూ. 1500 లో జరిగినదని లోకమాన్య బాలగంగాధర తిలకు నిరూపించినారు. జాకొబి అను జర్మనుపండితుడు వేరువిధముగా పరిశోధించి, ఇదే నిర్ణయమునకు వచ్చినాడు. ఆనాడు కృత్తికతో గణన ప్రారంభ మయ్యేది (కాబట్టే కార్తెలు) ఇప్పుడు అశ్వనితో గదా ప్రారంభమగుట, మొదట మనకు మేషాది పన్నెండురాసులు లేవు; గ్రీసునుండి వరాహమిహిరుడు (యవనాచార్య) కొని తెచ్చినాడు. ఇట్లే వారములు గూడ విదేశీయములే!
గ్రంథరచనమునకు ముందు, ఎప్పటినుండియో రామాయణ భారతకథలు గేయరూపమున 'కుశీలవులు' అను గాయకజాతిచే గానము చేయబడుచుండినవి. క్రీ. పూ. 900 ఏండ్ల ముందువెనుకలతో లిపి పుట్టినతర్వాత ఈ గ్రంథములు వ్రాతకు వచ్చినవి. భారతము ఇప్పటిరూపమును క్రీ. పూ. 500-400 లలో పొందినదని లోకమాన్య తిలకు నిరూపణము. దీనిని జర్మనుపండితుడు వింటర్ నిడ్జ్ అంగీకరించుచున్నాడు. భాషతో మానవనాగరకము తప్పటడుగులు వేసి, లిపితో పరుగెత్తినదని గదా పెద్దలు చెప్పేమాట! ఈగ్రంథములను సూతులు ప్రచారములోనికి దెచ్చి వ్యాపింపజేసినారు. సూతులు బ్రాహ్మణస్త్రీకి క్షత్రియునికి బుట్టినవారు; రథకారకవృత్తితోబాటు పౌరాణికులుగాగూడ నుండిరి.
'యవన'శబ్దము భారతమున పేర్కొనబడుటచే, నేటిరూపము దానికి క్రీ. పూ. 400 ప్రాంతాన లభించినట్లు ఎన్నబడుచున్నది. భారతగ్రంథమును మొట్టమొదట పేర్కొనినది
ఆపస్తంబుడు (క్రీ. పూ. 4-శ-; ఈయన రామాయణమును గూర్చి ప్రస్తావించడు.) ఆ తర్వాత భారతమును ఉదాహరించినది, క్రీ.పూ. 180 ప్రాంతమున వెలసిన పతంజలి. దీనితర్వాత భారతమును పంచమవేదము చేయుటకు, వివిధపురాణములనుండి కథలు కల్పనలు చేర్చబడి, మహాగ్రంథమైనది; ఇదే వైదికమతపునఃప్రతిష్ఠాపనమునకు ఏడుగడ అయినది.
★మొదట నూరుపర్వములు
సంస్కృతభారతము ఆదిలో నూరుపర్వములుగా — ఇప్పటి ఆధ్యాయములవలె నుండినది. సన్నియభట్టారకునికిముందే, ఇప్పటి 18 పర్వముల విభాగమును పొందినది.
పర్వానుక్రమణిక అని, పర్వసంగ్రహమని, భారతమందలి విషయములన్నిటిని టూకీగా చెప్పిన భాగములు, భారతము మొదట నున్నవి. ఇవి పోతనామాత్యుని స్కంధాంతగద్యములవంటివి; ఇది విషయసూచిక. నన్నియ 18 పర్వములను తెనిగించుచునే, సంస్కృతమును బడి, నూరింటికి అనుక్రమణిక, సంగ్రహమును వివరించినాడు. ఈపని పరిశోధనకు ఎంతగానో ఉపకరించినది. మూలగ్రంథస్వరూపమును తెలిసికొనేదానికి ఇది మంచి అస్తిబారమైనది.
ఇందు లేనివి అన్నీ ప్రక్షిప్తములని ఎన్నబడుచున్నవి.
★కథను చెప్పినకాలము
భారతయుద్ధము ముగిసినతర్వాత, అర్జునుని మనుమడు-పరీక్షిత్తు 60 ఏండ్లు బ్రతికినాడు. ఆయనకొడుకు జనమేజయుడు, తన 50-వ ఏట సర్పయాగము చేసి, వైశంపాయునివలన భారతమును వినును. అనగా, యుద్ధానంతరము ఇంచుమించు 110-120 సంవత్సరములకు భారతకథ రూపొందియుండును.
క్రైస్తవుల బైబిల్ లోని నూతననిబంధనముఖ్యాంగములైన సువార్తలు (Gospels) క్రీస్తుమరణానంతరం 78-80 ఏండ్లతర్వాత వ్రాయబడినట్లే, భారతము వ్రాయబడియుండును. కథ జరిగేదానికిముందే రామాయణభారతాదులు, ఋషుల యోగదృష్టిశక్తితో వ్రాయబడినవనుట కల్పనాచాతురి. భారతము ఇతిహాసముకదా! ఈ భారతరచన "ద్వైపాయనుండు సంవత్సరత్రయంబు నిర్మించి” (ఆది-1:67) “సంవత్సరత్రయకృతంబు” (స్వర్గా-ఏకాశ్వాస: 81) అని చెప్పబడినది. ఇది సంస్కృతభారతరచన సంగతి కాదేమో! కానేకాదు.
తిక్కనకూడ 1243-46 మధ్య భారతమును మూడేండ్లలోనే వ్రాసినాడు, ఇది కాకతాళీయమా!
★పదునెనిమిది పర్వములు
భారతమును ఒక తియ్యటి చెరకుగడగా పోల్చి, పద్దెనిమిదిగణుపులు — పర్వములుగా వేరు చేసినారు — ఆవలి నిర్మాతలు. తురకవాసన తగులకముందు, మనవారికి యీ సంఖ్య పరమపవిత్రముగా నుండినది.
అప్పుడు, వైదికపరంగా 12 నెలలను 18 గా విభాగించినారు. దీనికిముందు, అనగా ద్వాదశాదిత్యులకుముందు 8-10 ఆదిత్యులు (సూర్యులు=మాసములు) ఉండినారు. అంతవరకుండిన (యాగ) బలివితర్ధులు పదకొండింటికి మారు 18 అయినవి. ఈ తిన్నెలు 10 మూరల పొడవు, 8 మూరల వెడల్పుగా చేయబడినవి. దీనిని అనుసరించియే భారతము 18 పర్వములుగా వేరులు చేయబడినది. దీనితర్వాత యీసంఖ్య పీల్చి పిప్పి చేయబడినది:— భారతయుద్ధం 18 దినాలు; సైన్యం 18 అక్షౌహిణులు: సేనాపతులు 18 మంది; 'జయ' అనుమాటకు సంఖ్య 18 అని, దానినిగూడ ఇప్పుడు ఈ కోటిలో చేర్చినారు. విదుర ధృతరాష్ట్ర గాంధారి కుంతి యుద్ధానంతరం 18 ఏండ్లు బ్రతికియుండి, కార్చిచ్చులో నీఱగుదురు. ఆవల పురాణములు 18; ఉపపురాణములు 18 అయినవి. భగవద్గీతను 18 ఆధ్యాయసంఘటితముగనే నిర్మించినారు.
★గణేశుని వ్రాత
కట్టుకతలు స్థిరమైపోయి, పురాణమగుట హిందూమతములోవలెనే అన్ని మతములకును సహజలక్షణమై పోయినది. భారతమును దేవగణము దీసికొనిపోగా, మిగిలినదే మర్త్యులకు దక్కినదట! వేదములను భారతమును అటు ఇటు ఒక తక్కెడలో బెట్టి తూయగా — ఎక్కడ, ఎప్పుడు, ఎవరో? — మొగ్గు అయిన భారతగ్రంథము మహాభారతమైనదట!
అంతకుముందు వ్యాసభగవానుడు, భారతనిర్మాణమును ఊహించుకొని, రూపము కుదుర్చుకొని, వ్రాయసగాడు లేడని చింత పడుచుండగా, పిలువని పేరంటముగా, ఇంకేమీ పని లేనట్లు బ్రహ్మ వచ్చి, వ్యాసుని ఎదుట నిలిచి 'గణేశునిచేత వ్రాయించుకోవయ్యా' అని చెప్పి, తిరోహితమైనాడు. అప్పుడు ఈ బొజ్జ గణపయ్య వ్రాయగా ఆయన చెప్పినాడు! ఇప్పుడు స్టెనోగ్రాఫర్ డిక్‌టేట్ చేసినట్లు పని జరిగిపోయినది. ఆ వ్రాత భూర్జపత్రాలమీదనో, తాటాకులమీదనో వివరము చెప్పబడలేదు. కాగితాలు, సిరా కవిసార్వభౌమ శ్రీనాథునినాటివరకు మనకు రాలేదుగదా!
ఈ కల్పనకు తీసిపోనేల? అని కాబోలు, కుమ్మర గురునాథుని వ్రాయసగారుగా కల్పించినారు. ఇది గదా కల్పనాచాతురీపాండితి అనిన!
ఇంతకు, ఆగణేశుని వ్రాతసంగతి సంస్కృతమూలమున లేదు; తెనుగులో నన్నియ అంతకుముందే దీనిని తవుడలేదు. అయినంతమాత్రాన కొదువ ఏమి? చట్టంగా ప్రాకిపోయి ఉన్నదిగదా? గురునాథుడు, తిక్కనమధ్య తనమధ్య ఉండినతెరను — యుద్ధఘట్టమున గడబిడ విని ఎత్తి చూడగా, ఒకవాలమ్ము వచ్చి, అతనికంటికి తగిలి కనుగుడ్డు జననుకార్చి గుడ్డివానినిగా చేసి వేసినదట! పాపం, పుణ్యానికిపోయి, పాపం దెచ్చుకొన్నాడు — ఆ కుమ్మరి!
★మార్పులు — చేర్పులు
భారతమునకు లిఖితరూపము ఏర్పడినతర్వాత, దాని స్వరూపపరిమాణాదులు గట్టిచట్టములో (Frame) బిగించవేయబడినట్లు ఈ పర్వానుక్రమణిక, పర్వసంగ్రహము నిక్కచ్చిగా తేల్చి చెప్పుచున్నవి. భారతఛందము. మంచినీళ్లప్రాయమైన అనుష్టుప్పు కావడంచేత, పిల్లకవులకు - క్షుద్రపండితులకు - పక్షపాతులకు తాము కోరిన అంశములను వ్రాసి భారతంలో ఇరికించివేసేదానికి సులభసూక్ష్మమైనది. ఒకడు తనకు నచ్చనిదానిని తీసి వేసినాడు, ఇంకొకడు చిట్ల దీసి మార్చినాడు, మరొకడు తన పైత్యమును (కాళిదాసు కవిత్వముతో కలిపినట్లు) చేర్చినాడు, వేరొకడు - క్రోడగ్రంథలేఖకుడు - తన నోటికివచ్చిన, అన్యసామ్యశ్లోకములను-ఆఖ్యానములను ప్రక్కప్రక్కననే కుదురుపరచినాడు. ఇట్లా ఈ ఇతిహాసమును పంచమవేదముగా చేయను, ఎక్కడెక్కడి ఉపాఖ్యానములను, వేదాంతవిషయములను కలిపి, పరస్పరవిరుద్ధవిషయాలతో ఒక విజ్ఞానమహాకోశముగా చేసివేసినారు. ఇది ఒక మహార్ణవము, ఒక విశాలదుర్గమారణ్యము అయిపోయినది.
దీనివల్ల పర్వసంగ్రహము-అనుక్రమణికలో లేని అంశాలన్నీ ఆవల చేర్చబడినవనే పెద్దల సిద్ధాంతము.
★మొదట స్త్రీపర్వమువరకే
జనమేజయుడు, తన పూర్వులు ఎట్లా యుద్ధము చేసినారో చెప్పమని అడుగగా, వైశంపాయనుడు అధికప్రసంగము చేయకుండా మృతవీరులకు నివాపాంజలి యిప్పించి స్త్రీపర్వముతో ముగించినాడని, మిగత ఏడుపర్వములు తర్వాత వ్రాయబడినవని, సహేతుకంగానే విమర్శకులు నిర్ణయించినారు. ఈ భాగమునందు నీతులు లోకవ్యవహారములు చక్కగా చెప్పబడినవి. యుద్ధములో మురిగిచచ్చినతర్వాత గూడ యుద్ధనీతి వదలబడలేదు.
★ప్రక్షిప్తములు
వీరిప్రకారము, పర్వసంగ్రహ-అనుక్రమణికలలో లేక, భారతమహావృక్షానికి శాఖోపశాఖలుగా పెరిగిపోయి, పొద అయిన భాగములలో కొన్ని — ఈ ప్రక్షిప్తములవల్ల, భారతము వివిధకాలములలో వివిధప్రాంతములలో, వివిధరూపములలో ఉండినట్లు తేలుచున్నది. అందువల్లనే ఒకప్రాంతపుప్రతికి, ఇంకొకదేశప్రతికి సంబంధము లేకుండా పోయి ఉన్నది. ద్రావిడప్రతిలో "వైష్ణవధర్మపర్వము” అనేది, 23 అధ్యాయములతో 1636 శ్లోకములు గలిగి, ఇతరప్రతులకంటె ఎక్కువగా నిండి నిబిడీకృతమై యున్నది.
ఆంధ్ర ద్విపద భారతములో కొన్ని వారలున్నవి. ఇక శ్రీపాదవారి కృష్ణభారతం సంగతి చెప్పనే పనిలేదు. మన కవిత్రయంవారు, దిగ వేసి అపచారం చేసినారని ఆయన చేర్చని కథయే లేదు.
కొన్ని అంశములు అనుక్రమణికలో ఉన్నా, సంగ్రహంలో లేవు, సంస్కృతమూలములో 1-వ అధ్యాయములో ఒక కథాసంగ్రహమున్నది. అందు కథలో చాల మార్పులున్నవి. వారణావతవాసము – లాక్షాగృహదహనము - హిడింబుని వధ ఇందు లేవు. రెండవజూదం సంగతే లేదు. మొదటితడవ ఓడిపోగానే అడవికి పోదురు. బకాసురవధ లేదు. కీచకవధ, ఒక గ్రీకు కట్టుకథనుండి తీసుకోబడినదని వీరివాదము.
ఉపాఖ్యానాలన్నీ తరువాత చేర్చబడినవి. ఆదిలో మాద్రిసహగమనం చెప్పబడలేదు. యయాతిచరిత్ర మత్స్యపురాణములోనిది; ఇట్లే ఇతర ఉపాఖ్యానములు గూడ.
★ద్రౌపదీవస్త్రాపహరణము
ఈ అనాగరక ఉదంతము మొదటిభారతంలో లేదని, ఆవల కౌరవులను అపకీర్తిపా ల్జేయను దూర్చబడినదని చాలమంది వాదము. కుమారిలభట్టు (ఆంధ్రుడు; క్రీ. శ. 7వ శ.) అప్పుడే ఈసంగతి వ్రాసినాడు.
వేదం వేంకటాచలయ్యరు, పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వస్త్రాపహరణం జరుగనేలేదని, జరిగినదంతా — దాసి అయి పోయిన ద్రౌపది సభకు రానందున జుట్టుబట్టి ఈడ్చుకొని రాబడుట మాత్రమేనని (కచగ్రహణము) భారతమునుండి అనేక ఉదాహరణలను ఎత్తిచూపి, నిరూపించినారు. తిక్కన కచగ్రహణమునే పలుమారు చెప్పి, 2-3 చోట్ల మాత్రం గుడ్డ లొలుచుటను ప్రస్తావించినారు. జుట్టు లాగుటనే ఎక్కువ మోపుజేసి, దౌత్యసమయంలో తన్ను ఏకవస్త్రయగు దానిని గొని వచ్చినట్లు చెప్పి —
| | ద్రోవది, బంధురంబయిన క్రొమ్ముడి గ్రమ్మున విడ్చి, వెండ్రుకల్ | |
గోవిందు ముందటంబెట్టి ఇట్లనియె:—
| | ఇవి దుస్ససేనువ్రేళ్లం | |
అని మాత్రమే చెప్పించుచున్నాడు — మహాభారతమహోదధిని మథించిన వైదికమతపరాయణులగు — తిక్కయజ్వ!
నన్నియ సభాపర్వములో, కృష్ణుడు గుడ్డ లిచ్చినట్లే వ్రాయక, దుస్ససేనుడు వలువలు లాగుచుండగా, ఆమె మనసులోపల ప్రార్థించుకొనుచు నిలువబడియుండినట్లే వ్రాసినాడు. తనకు యీ సంగతే తెలియనట్లు ఆ తర్వాత శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. (సభా-2:231)
రన్నడు వ్రాసిన (ఇతడు తెనుగువాడు) కన్నడ గదాయుద్ధకావ్యమున కచగ్రహణమే ఉన్నది.
నన్నియ ఆశ్వాసాంతగద్యములు, పోతనామాత్యుని స్కంధాంతగద్యములవలెనే, అందలివిషయమును శీర్షికప్రాయముగ వివరించును, సభాపర్వ ద్వితీయాశ్వాసాంతమున — "ద్యూతదుఃఖా ర్ణవమగ్నులైన పాండవుల బాంచాలి యుద్ధరించుటయు” అని సంస్కృతపర్వసంగ్రహములోవలెనే చెప్పినాడుగాని, వీరే తాము వర్ణించిన వస్త్రాపహరణమును పేరు బెట్టి చెప్పలేదు.
ఇవన్నీ కౌరవులను తెగడను పాండవులను పొగడను, కృష్ణుని మహిమపరచను చేసినవని విమర్శకులు అనేమాట. యాదవకృష్ణుడు మహాపురుషుడై, దేవకల్పుడై, ఆవల అవతారమైనతర్వాతనే ఎంతోకాలమునకు ఇవన్ని చేర్చబడినవని వీరివాదము.
★క్రొత్త — పాతలు
తమతమవాదానికి బలముగా, పట్టుగా, తమ ఇష్టానుసారముగా దూర్చిన చేర్చిన విషయములను, తద్భిన్నకథల ప్రక్కప్రక్కననే ఉంచుటవల్లనే భారతమున విరుద్ధములు విడ్డూరములు ఏర్పడి ఉన్నవి. ఇదీగాక ఈ గాథలు, గేయములు, తమతమ వంశకర్తలు అనాదిగా నోటిపాటగా తమకు సంక్రమింపజేయగా దిగి సాగివచ్చినవి. వ్రాసినవా రెవరో తెలియదు. ఇదే వాటి పరమపవిత్రతకు, పూజ్యతకు కారణమైనది. ఇక మార్చుటకు ధైర్య మెవరికి ఉండును? ఇంతేగాక, తమ వంశానుగతమైన యీ విజ్ఞాననిధులను ఎవరు దిగవేయగలరు? కాబట్టే పరస్పరవిరుద్ధభాగములు ప్రాచీనభారతీయగ్రంథములలో ప్రక్కప్రక్కనే నిలిచిపోయినవి — అని కారణజన్ముడు — ఆ జర్మను పండితుడు ఫ్రెడరిక్ మ్యాక్సుమూలరు వివరించుచున్నారు. (Sacred Books of the East- Introduction.)
ఇట్టిదోషములు బైబిలుకుగూడ తప్పలేదు. (The Bible in the Balance - Charles Smith.)
★ద్రౌపది పంచభర్తృత్వము
మొదట భారతకథ వ్రాసినవారు — ఇండో ఆర్యులలో బహుభర్తృత్వము సదాచార మైయుండిన కాలమునకు సమీపస్థులుగా నుండవలెను. పాండురాజు “ఒక ఆలుకు ఒక మగడు” అనేది తన కాలమునకు కొత్త అని, పాతదినాలలో స్త్రీలు విచ్చలవిడిగా నుండేవారని కుంతితో అంటాడు. (ఆది-128 అధ్యా ద్రావిడప్రతి; సంస్కృతము) కాబట్టి, ద్రౌపది ఐదుగురుని పెండ్లాడుట సామాన్యవిషయముగానే మొదటికవి వ్రాసేయుండును. వ్యాసుడు వచ్చి, ఇట్లు మగలగుంపుతో కాపురము చేసిన ఇల్లాండ్రను చాలమందిని ఎత్తిచూపి, ఇది ఆనాటికి విపరీతము కాదని చెప్పిపోవును.
పాండవులు పుట్టి పెరిగినది శతశృంగము. అంటే, ఇప్పటి తిబేతుప్రాంతము. అక్కడ ఇప్పటికిని అనేకభర్తల పొందుగలదు. మనదేశంలో మరికొన్నిజాతులలో ఈ కులకట్టుబాటు ఇప్పటికీ ఉన్నది. (చోటానాగపూరు ప్రాంతమున; నీలగిరిలో తోడాలలోను) రాను రాను దేశంలో యీ ఆచారం మారినది. ఆలోపలనే పాండవులకు దేవతలతో సంబంధము కలిగినది. అందువల్ల యీ విపరీత ఆచారమునకు కారణములు — సమన్వయములను కుదిర్చి, తల కొకవ్రాతగా వ్రాసి, అన్నిటిని ఇందే జోడించి తలబీకనకాయ జేసినారు.
దీనిపై పుట్టగొడుగులవలె లేచిన కథలు:
1. ఒక బ్రాహ్మణి కుష్ఠరోగిభార్య వరపడి, ప్రత్యక్షమైన దేవుని ఐదుమారులు భర్త అని వరము కోరినది. ఆ వేల్పు మరుజన్మలో 5 గురుని ప్రసాదించిపోవును. సరే! పాండవులకు యీమె తగులాటమేలనో? అది వరమో — శాపమో! కోరినది యీజన్మలో, కాని ఇచ్చినది రాబోవుజన్మలో. ఇది ఒక Post-dated Cheque గా ఉన్నది. ఆజన్మలో ఈమె అగ్నివేదికలో ఎట్లు పుట్టినది చెప్పబడలేదు.
2. నాలాయని కథ:— నాలాయని అనునది ఒక జాతిపేరు. ఆమెపేరు ఇంద్రసేన. మౌద్గల్యుడు ఈమె పెద్దరోగపు భర్త. వరము. కొన్ని ఏండ్ల తర్వాత ద్రౌపదిగా పుట్టును. ద్రావిడప్రతిలో దీనికి కొంత వ్యత్యాసమున్నది. 3. పంచేంద్రియోపాఖ్యానము. తెనుగులో యీ ఉపాఖ్యానము వింతవింతపువ్వులు కాయలతో నున్నది.
4. కాశీరాజుకూతురే ద్రౌపదిగా అగును.
5. మార్కండేయపురాణము.
6. బ్రహ్మవైవర్తము.
7. దేవీభాగవతములలో మరికొన్నివిశేషములు చేర్చబడియున్నవి. వేదవతియే ద్రౌపది. ఈ వేదవతియే సీతగూడ అగును.
ఇట్లా, ద్రౌపదికథ ఒక గచ్చపొదై పోయినది.
★భగవద్గీత
హిందువులకు పరమపవిత్రమై, సర్వ ఉపనిషత్తులు గోవుగా, కృష్ణుడు పాలుపితుకు గొల్లగా, పార్థుని వత్సముగా చేసి గ్రహించిన అమృతమయ దుగ్ధరూపమైన అపూర్వవేదాంతగ్రంథము — భగవద్గీత! భక్తియోగమునకు మూలగ్రంథమైన గీత, నేడు ప్రపంచవాఙ్మయముననేగాక, వేదాంతక్షేత్రమున పూజింపబడుచున్నది. ఈ పావనగ్రంథమునకు ఎట్లు — ఎప్పుడు ఈ పేరు వచ్చినదో నిర్ణయించుటకు ఎట్టి ఆధారములుగాని లేవు. భగవంతుడు చెప్పినదని, భగవంతుని విషయములను చెప్పినదని, పండితులు అర్థాలు చెప్పుచున్నారు (Song Celestial).
దారుణయుద్ధమునకు కత్తులు దూసి, ఎదురెదురుగా నిలబడియున్న ఆ ఉద్రిక్తనిశితసమయంలో 700 శ్లోకాలలో, క్లిష్టతమవేదాంతవిషయములను చెప్పుట — వినుట — ఎఱుగుట అనూహ్యములుగా నున్నవని, అందువల్ల గీత కురుక్షేత్రమున సేనాముఖమున పుట్టిఉండదని చాలమంది మతము. తిక్కన సోమయాజి 50 పద్యములలో తేటతెనుగులో, ఇందలి వేదాంతమునంతా ఒలిచి చేతిలో
బెట్టినాడు — అంతే! ఇంతటి ప్రశస్తిగనిన గీతను, యీపేరుతో పర్వసంగ్రహము గాని అనుక్రమణిక గాని పేర్కొనవు. నన్నయ తెనుగుసేతగూడ చెప్పదు. నన్నయకంటే ఎక్కువ వైదికమతాభిమానంగలవా రుండినారా? పేరుకే కొరగాని, ఎన్నియో స్వల్పవిషయములను ఏ కరువు బెట్టిన యీ విషయసూచికలు, ఇంతటి ఘనతరపవిత్రవిషయమును దిగవేసియుండగలవా? అని ప్రశ్నించుచున్నారు.
లోకమాన్య తిలకు, తమ గీతారహస్యవిపులపీఠికలో, గీతలోని ముఖ్యవిషయములు, వైదికమతబీజములు, యథాతథముగ భారతమునుండి – ఉపనిషత్తులనుండి సకాయంగా పెళ్లగించుకొని రాబడి, ఇందు పాతిపెట్టబడినవని, నూటికిపైన శ్లోకభాగములను, భావములను ఎత్తిచూపినారు, భారతశ్లోకములు అనుష్టుప్పులైతే, గీత త్రిష్టుప్పు ఛందములో నున్నది. ఇది ఒక పటుకుగానే ఉన్నది.
అంతటి కృష్ణావతారమునకు, ఇంతటి హీన కుకవి వృత్తియేల అని మరికొందరి ప్రశ్న. ఈ దేవకీకృష్ణునికి ముందు వ్యాప్తిలో నుండిన ఈ మతసంప్రదాయమును, యీయన తన గురువు — ఘోరుడను ఋషివలన జ్ఞానోపదేశమును బొంది (ఛాందోగ్యోపనిషత్తు) ప్రచారమునకు దెచ్చినారని, ఆ మతగ్రంథమే ఇది అని — ఈ వర్గంవారు అనేమాట.
శ్రీ వివేకానందస్వాములవారు — గీతను ఆదిశంకరభగవత్పాదులవారే వ్రాసి, తన మతవ్యాప్తికి ఘనతకు ఆధికారికముద్ర లభించుటకు కృష్ణునిపేర బెట్టి, భారతములోనికి చొప్పించి అతికివేసినారు, (Foisted into the Body of Maha Bharata) అనే వాదమును కాదనరైరి. (ఆలంబాజారు; మార్చి-1897.)
గీతాభాష్యములకు మూలమని చెప్పబడే బోదాయనవ్యాఖ్య, దేశంలో తన కెక్కడా కనిపించలేదని, రామానుజాచార్యులవారు చూచినది శిథిలప్రతి అని చెప్పికొనినను, ఎందుకు దానిప్రతి వ్రాయించలేకపోయినారని సందేహించి శ్రీ వివేకానందులవారు చెప్పుచున్నారు. ఈపని జరిగినతర్వాతనే — అనగా, శంకరుని తర్వాతనే (క్రీ. శ.788-820) గీతకు ప్రాశస్త్య మబ్బినదని అంటారు స్వామీజీ, 'భగవద్గీత' పేరు, యీ వేదాంతము తిక్కననాటికి వ్యాప్తిలో నున్నట్లు లేదు. “కృష్ణుడు చెప్పినట్టి గీతలందు" (శాంతి-6 : 494) అనియే నుడువుచున్నారు.
| | అనికిఁ దొడంగునప్పుడు మదాత్మ కలంగినఁ, గొన్ని తత్త్వబో | |
అశ్వమేధ-1 ఆ-153.
అని స్పష్టంగా కొన్నివచనములే అని పేరు బెట్టకుండా అర్జునునినోటే ఆ కృష్ణునితోనే తిక్కన పలికించుచున్నాడు. తిక్కన సోమయాజికంటె వైదికపరాయణత ఇతరులకు గలదా!
ఆవల ఏదో ఒక గీత — అనుగీత, ఉత్తరగీత, హంసగీత, హరీతగీత, వృత్తగీత, పరాశరగీత, బ్రాహ్మణగీత — లేని పుస్తకమునకే గురుత్వము లేకపోయినది అని సెలవిచ్చుచున్నారు. మన ప్రబంధాలు పదహారువర్ణనలతోనే గౌరవము పొందుటకు గూడ ఇట్టి ఊహామాత్ర వ్యామోహమేగదా కారణము! శాంతిపర్వమున చాల గీతలు గలవు.
ఏమైతేనేమి? గీత ప్రపంచమతగ్రంథములలో ఉత్తమోత్తమై అలరారుచు, ప్రపంచసత్యాన్వేషకులకు ఊరట విశ్వాసముల నొసంగి, శాంతిభిక్షను బెట్టుచున్నది. ఆటంబాంబు సృష్టించిన — ఓపర్‌హీం వంటి భౌతికశాస్త్రవాసనాబద్ధులైనవారికి మనుగడకు నీడపట్టుగా, ఆత్మశాంత్యాలయముగా శరణ్యమైయున్నది. ఇది హిందూమతభాగ్యము! లోకకల్యాణప్రదాయిని!
★భాసునికాలమునాటి భారతము
సంస్కృతమున ప్రథమనాటకకర్త — భాసమహాకవి, బుద్ధచరిత్రాదులను రచించిన అశ్వఘోషుడు (కనిష్కుని ఆస్థానము నలంకరించినవాడు) కవి కులగురువు కాళిదాసు మధ్య క్రీ. శ. 150-400 లో వెలసినవాడు. భారతకథావస్తువును నాటకములకుగా ఉపయోగించినవారిలో ప్రప్రథముడు, ఇంతేగాక భారతము వ్రాయబడినకాలమునకు ఇతరు లందరికంటె దగ్గరివాడు, ఆయన భారతకథను 5 నాటకముల వస్తువుగా గ్రహించినాడు. వాటిలోని విషయములకు, ఇప్పటి భారతపాఠములకు చాల వ్యత్యాసములున్నవి. ఇవి భాసుడు చేసిన మార్పులు అనుటకంటే, ఆయన కాలమునాటి పాఠములనిన బాగుగ పొసగగలదు. మనకవిత్రయమువారి వ్రాతలవిషయమున గూడ ఇట్లే గ్రహించవలెనుగాని, ఇది వాడు పాడుచేసినారు. అదిపాడుచేసినా రనుట అపచారము. ఇప్పటివి ఆవలి చేర్పులో మార్పులో కావలసియున్నది.
భాసుడు కౌరవులనుగాని, కర్ణునిగాని కించపరచకుండుటేగాక వారిని ఘనపరచి, ఇప్పటి భారతము పాండవులకు ప్రాధాన్య మిచ్చినట్లే, కౌరవులను ఉచితస్థానమున ప్రతిష్ఠించినాడు. ఒకనాటకమును 'కర్ణ భారము' అని, ఆయనను ఆయన దానగుణమును మహిమ పరచినాడు. కవచకుండలములను ఇచ్చి వేయుటను, వెనుక ఎప్పుడో అరణ్యపర్వములో బెట్టక, యుద్ధమునకు బయలుదేరునప్పుడే ఇమిడ్చినాడు. ఇంకొక నాటకము - 'ఊరుభంగము' ఈ పేరులోనే దుర్యోధనునిపట్ల సానుభూతి, భీముడు చేసినపని సముచితరణనీతికి భంగ మని తోపింపజేసినాడు.
భాసుడు అభిమన్యుని గోగ్రహణయుద్ధమునందే ప్రవేశపెట్టినాడు. ఆవల అభిమన్యుని పిల్లవాడుగా మార్చినతర్వాత, ఈ అంశమును భారతపాఠమునుండి తీసివేసియుందురు.
★పంపని కన్నడభారతము
దక్షిణాదిభాషలలోనికి సంస్కృతభారతము మొట్టమొదటతూరిగా కన్నడములోనికి అనువదించబడినట్లున్నది. ఇందు ఆంధ్రులకు కొంత సంతోషసంబంధ మున్నది. ఇది వ్రాసిన పంపన్న గోదా వరీతీరమందలి, వేంగిమండలమందు జన్మించిన బ్రాహ్మణుడు. వేంగీపుర అగ్రహారీకుడు — మాధవసోమయాజి పౌత్రుడు, అభిరామదేవరాయుని పుత్రుడు. దేవరాయుడు జైనమును స్వీకరించినాడు. పంపని జననము 901-క్రీ. శ. దుందుభి.
పంపనితో బాటు కుమారవ్యాసుడు నంక్షిప్తముగ భారతమును కన్నడమున వ్రాసినాడుగాని, పంపనిదే అతిప్రచారమునకు వచ్చి ప్రశస్తి గన్నది. కవితాగుణార్ణవ — కవికులగురువు — ఆదికవి — మొదలగునవి పంపని బిరుదములు.
పంపడు, వేములవాడ (కరీంనగరు జిల్లా) రాజధానిగా లెంబులపాటకదేశమును పాలించిన చాళుక్యనృపతి అరికేసరి మిత్రుడు హితుడు. అరికేసరి రాష్ట్రకూట చక్రవర్తుల సామంతుడు.
పంపడు తన రాజునే అర్జునుగా జేసి, భారతమును "విక్రమార్జునవిజయము' అనుపేర వ్రాసి, తనమిత్రుని ఘనపరచినాడు. వ్యాసుడు భారతమును మూడేండ్లు వ్రాయగా పంపన్న కొన్ని నెలలలోనే ముగించినాడు. వ్యాసభారతమునందలి ద్రౌపదిస్థానమును సుభద్ర కిచ్చి ఆమెనే ప్రధానపాత్రగా చేసినాడు. ద్రౌపదిని ఒక్క అర్జునుని భార్యగానే చేసినాడు. యుద్ధానంతరము అర్జునునే రాజ్యాభిషిక్తునిగా చేయుచున్నాడు. ఆ ప్రాంతపు వాడుకభాషలోనే (పులిగెరి) ఆయన కావ్యమును వ్రాసినాడు.
ఈమార్పులనుబట్టియే, అనువాదములలో తెనుగు కవిత్రయమువారి గ్రంథమునే పరిశోధకులు గుర్తించుచున్నారు.
పంపనికాలములో గోదావరిప్రాంతమున, తెలంగాణమున కన్నడభాషయే వ్యాప్తిలో నుండినది. తెలుగు కృష్ణకు దక్షిణమునే వెలసియుండినది. ఇది ఇందు తేలిన మరియొక చారిత్రకాంశము.
★భారతవీరుల వయస్సులు
నకులసహదేవులు యువకులుగా, అభిమన్యుడు మాణవకుడుగా (Teenager) ద్రౌపదేయులు పిన్నపాపలుగా వర్ణించి కరుణ రసమును గార్చుట మన పౌరాణికుల పాత పాచిపాట. కాని తెనుగుభారతప్రకారం 70 వ ఏట భీముడు కురుక్షేత్రయుద్ధమునకు దిగినట్లున్నది. (ఈ విషయమును, 1932లో, నేను నా సొంత ప్రభాత ప్రెస్సును నడిపేటప్పుడు, మిత్రుడు వేమూరు సుందరరామశర్మ వ్రాసిన ధనంజయవిజయము అను నాటకమునకు పీఠికగా రచించి యుండినా — అదే మరల ఇప్పుడు)
- శతశృంగమునుండి, పాండురాజు మరణానంతరం పాండవులు హస్తిపురము చేరునాటికి — షోడశ పంచదశ చతుర్దశ త్రయోదశ వర్షసంజాతులు — ఆదిపర్వము ఆ 6:142. ధర్మజునికి 16, భీమునికి 15, అర్జునునికి 14, నకుల సహదేవులకు 13 ఏండ్లు.
- హస్తిపురమున అస్త్రవిద్యలు నేర్చుకొనుచు వీరు 13 సంవత్సరము లుందురు. ఆది. 6:142. కవల వయస్సు 13+13=26.
- వారణావతమున ఒక్క ఏడాది ఉందురు-ఆది. 3:15. కవలయీడు 26+1=27; భీమునికి 29 ఏండ్లు.
- పాండవులు తిరిగి హస్తిపురము వచ్చి 5 వత్సరములు కౌరవులప్రాపున నుందురు. ఆది-8:64. యమజులప్రాయము 27+5=32. ఇప్పటికే అభిమన్యుడు పుట్టి అన్ని విద్యలు నేర్చియున్నాడు. ఇప్పటి ఆయన వయస్సు 12 ఏండ్లయినా ఉండదా? మాద్రేయులకు యీయనకు 20 ఏండ్ల అంతరము.
- ఇంద్రప్రస్థమున పాండవులు 23 ఏండ్లు రాజ్యపాలనమును నెరపి, ద్యూతమున పరాజితులగుదురు. సభా - 3: 311. అమడలకు 32+23=55, అభిమన్యునికి 35; ఉపపాండవులు పుట్టి బాగా ఎదిగిఉన్నారు. పెద్ద వానిమధ్య అభిమన్యునిమధ్య 15 ఏండ్లు ఎడము ఉన్నను 20 సంవత్సరములు కోడెప్రాయపువాడై యుండవలెను.
- అరణ్య అజ్ఞాతవాసములు 13 ఏండ్లు. 55+13=68 సంవత్సరములు మాద్రేయులకు, అర్జునుడు 69, భీముడు 70, యుధిష్ఠిరుడు 71 సంవత్సరములవారు. అభిమన్యునికి 48; ఉపపాండవులలో మొదటివానికి 33. వీరు మహారథులు.
ఉద్యో-4:261
భీముడు పుట్టిననాటికి నూరుమంది కౌరవులు పుట్టి ఉన్నారు. భీముడు దుర్యోధనుడు సమవయస్కులు.
కర్ణ అర్జున దుర్యోధనులకు తిక్కన నెరసినవెంట్రుకలనే వర్ణించియున్నాడు. కర్ణుడు ధర్మజునికంటె అధమము పదేండ్లు పెద్దగానైన ఉండవలె.
★భారతములో అపూర్వవిషయములు
భారతము సర్వవిషయకోశము — మానవప్రకృతి వివిధభిన్నత్వమును వర్ణించిన గ్రంథములో దీనికి మించినది ప్రపంచవాఙ్మయమున ఇంకొకటి లేదు. నేటికిగాని రేపటికిగాని సరిపోవునట్లు, ఇందు ఏదో ఒకరూపములో వర్ణింపబడని వ్యక్తి జగత్తున లేడు — ఉండబోడు. మానవప్రకృతి మారునది కాదు గాని, మర్యాదలు కట్టుబాట్లు అలవాట్లుమాత్రము కాలానుగుణముగ మారుచు, సంకరములై, కలిసి విడిబడి గంధర్వనగరములవలె (మేఘాకృతులు) రూపాంతరముల పొందుచు సాగిపోవుచుండును. దీనికి ఉజ్జ్వలోదాహరణము — భారతపాత్రలు, సాంఘికాచారములు! భార్యను తానికవానిని కుంది, చిదురు చేసే క్రూరచేష్టామోదితులు ఇప్పుడూ కలరు గాని, ఆనాటి భీమునివలె బండెడన్నము తినేవారు లేకపోవచ్చును. ప్రకృతులు భేదించలేదు గాని క్రియావిధానము శక్తి మాత్రం మారినది. భారతకర్త తర్వాత, అంతటివాడు ఆంగ్లమహాకవి — షేక్స్పియరు అంటారు. ఆనాటికి వినుటకు వింతగా దోచి, ఆవల జరిగినవి — ఇంకను జరుగవలసినవి, భారతములో ఎన్నియో గలవు. ఫ్రెంచిరచయిత — జూల్ వెర్ను (Jules Verne) నూరేండ్లక్రిందట చంద్రమండలములో మానవుడు దిగినట్లు, పయనించిన ఆ రాకెట్టువర్ణనములో ముగ్గురువ్యోమగాములే పయనించినట్లు ఊహించి, శాస్త్రవిషయికకల్పనాకథను {Scentific Fiction) వ్రాసినాడు. అమెరికా అపోలో 11-చరిత్ర దీనికి తు-చ-లు తప్పకుండా సరిపోయినది. హెచ్. జి. వెల్సు; క్లార్కు మొదలగు ప్రఖ్యాతరచయితలు ఇట్టి ఊహాపోషకకథలను వ్రాసినారు. ఇంకను కొందరు వ్రాస్తున్నారు. వీటిని ఫిలిములుగా (చలనచిత్రములు) తీయుచున్నారు!
ఇదంతా మానవమేధాసంపత్తి విలసనమే గాని నిజము కాదు.
ఇట్లనే, అపూర్వవిషయాలను ఊహించి, రూపకల్పనము గావించి, చైతన్యవంతములుగ జేయబడిన ఎన్నియోవింతలు భారతమున గలవు. మన నారదమహాముని ఆడుచు పాడుచు బ్రహ్మలోకాదులను మంచినీళ్లు త్రాగినట్లుగా చుట్టివచ్చుచుండును. ఇది నిజంగా జరిగినదని చంకలు తట్టుకొనిన ప్రయోజనం లేదు. పుష్పకవిమానం మొదట, మన పెద్ద పెట్టుబడిగాడు, కుబేరునిదేగదా. ఇప్పటి విమానాలు దానికి దిగదుడుపుకు పనికి రాకున్నవి.
వాలఖిల్యులనే అంగుష్ఠమాత్రపరిమాణదేహులకథ ఒకటి ఉన్నది. ఇది ఇంగ్లీషు నవలాకారుడు స్విఫ్టు (Swift) వ్రాసిన గలీవర్ యాత్రలవంటిదే! కృత్రిమగర్భాధానాలు; ఇప్పటి (Test Tube Babies) వలె, మగవానితొడనుండి వెన్నునుండి పిల్లలు పుట్టుట; క్షణములో దేశదేశాలు తిరిగి రావడం, నేటి అణుశక్తియుగంలో సాధ్యమైనవాటిని ఎన్నిటినో భారతము వర్ణించియున్నది.
శాపమువల్లనో, వరముచేతనో, శిఖండి బృహన్నలవలె మగవాడు ఆడుది అగుట, ఇప్పుడూ వింటున్నాము. శస్త్రచికిత్సలో ఉండినతనమును మార్పించుకొని సినిమాతారలైనవారినిగూర్చి గూడ ఇప్పుడు వింటున్నాముగదా! బంగారమును ఉమ్మివేసే ఒక వ్యక్తి శాంతిపర్వమున వర్ణితుడై యున్నాడు. ఇది బంగారుగుడ్లు బెట్టిన ఈసపు బాతువంటి కథయే! ద్రౌపదికి ప్రసాదింపబడిన అక్షయపాత్ర, అర్జునుని అక్షయబాణతూణీరములు అపూర్వకల్పనకు మచ్చుతునకలు. కర్ణపర్వములోని హంసకాకీయోపాఖ్యానము, ఈసపు వ్రాసిన కుందేటి తాబేటి పరుగుపందెపు కత వంటిదే గదా!
★కురుక్షేత్రపు యుద్ధబలి — అతిశయోక్తి
భారతఘోరసంగ్రామమున ఇరువాగులవారు 18 ఆక్షౌహిణుల చతురంగబలమును పోలికలను లోనికిదింపి, నెత్తురురొంపి ఎరచి తిప్పలు చేసి, పంచపాండవులను మాత్రమే మిగుల్చుకొనినారు. అక్షౌహిణి అంటే — 21870 రథములు, 21870 గజములు, 65610 అశ్వములు, 1,17,450 పదాతులు, అంతు — 2,26,800 సంఖ్య గలది అగుచున్నది. దీనికి రథరక్షకులు, చోదకులు, ఆశ్వకులు 1,31,220 మందిని చేర్చిన 3,58,620 జీవకోటి అగును. ఇక 18 అక్షౌహిణులకు 53,44,360 బలగమగును. ఇది నిజమనుకొన్నా, ఆనాటికి నమ్మరాని లెక్కే!
ఇక అంచనగాడి ఆశకు అంతు లేదన్నట్లు — ధర్మరాజు ధృతరాష్ట్రునితో మొనలంగల జనులకొలంది ఎఱింగించి, 'చచ్చినవారిలెక్కగా — ఎఱుకపడినవారు, ఉత్తమజనంబులు 76 కోట్లు 24 వేలు;మ్రుక్కడిమూకలు 24 వేలా మున్నూట యిరువండ్రు తెగిరి" అని సత్యవ్రతంగా ధర్మజుడు చెప్పుచున్నాడు. (స్త్రీపర్వము 2:167) లక్షను కోటి అనుకొనినా, యీ సంఖ్య మించియే యున్నది. ఇట్టివి, మన పురాణములలోని అతిశయోక్తులు!
భాగవతములో కాలయవనుడు కృష్ణునిపైకి 120 అక్షౌహిణులతో దండెత్తి వచ్చినాడు. ఇది ఈనాటి ప్రపంచజనసంఖ్య కావచ్చును.
మరికొన్ని విపరీతపులెక్కలు :— ఋగ్వేదములో ఊర్వశి పురూరవునిదగ్గర నాలుగేండ్లు ఉన్నట్లు చెప్పగా, ఇది విష్ణుపురాణములో 61,000 సంవత్సరము లైనది.
పురాణములలో 7 నరకములుండ, భాగవతములో వేలు, గరుడపురాణములో 84,00,000 నరకములు సృష్టింపబడినవి. ఒక్కొక్కతలకు ఒక్కొక్కటిగా నున్నదే! (వింటర్ నిడ్జ్ - సంస్కృతవాఙ్మయచరిత్ర)
2. కర్ణుని జ్యోతిర్మయజీవితము
భారత ఇతిహాసగ్రంథములకు, ఇటు కర్ణుడు — ఇటు భీముడే నాయకు లనవచ్చును. కర్ణుని ప్రాధాన్యమును భాసుడు మొదలు పెక్కుమంది గుర్తించుచునే వచ్చుచున్నారు.
★కర్ణోపనిషత్తు
భండార్కర్ పరిశోధకసంస్థవారు (పూణె) ప్రచురించిన సంస్కృత సంశోధితప్రతిలో, దేవబోధుని వ్యాఖ్యానము చేర్చబడియున్నది. అందు ఉద్యోగపర్వము 138, 139, 140, 141 అధ్యాయములలోని 125 శ్లోకములను, ఆ వ్యాఖ్యాత "కర్ణోపనిషత్తు" అను ప్రత్యేకశీర్షికక్రింద చేర్చి, రాధేయుని మహిమోపేతునిగా జేసినాడు. ఇది చాలును! ఆ వసుసేనుని ఘనతను చాటుటకు. ఈఘట్టము శ్రీకష్ణుడు కర్ణుని వ్యామోహసముద్రము ముంచదలచుకొనిన అంశమును వర్ణించుచున్నది.
ఇక ఈయనవలె అపఖ్యాతికి పాల్జేయబడినవ్యక్తి గాని, తెగ పొగడబడిన వీరుడుగాని హైందవ ఇతిహాసములలో ఇంకొకరు లేరు. ఇట్లనే కర్ణునివ్యక్తిత్వము విభిన్నప్రభలతో భాసించుచున్నది. ఆయనమానసము సంకీర్ణభావసంకులము; ఆయన ఎద చిట్లినదేగాని మైల పడలేదు. బీరము పొంపిరి పోలేదుగాని, పడగెత్తి కాటు వేయబోయిన కోడెత్రాసు తటాలున తలవాల్చినట్లు, తొడరి దిగజారును. ప్రభుభక్తిపరాయణమై ఆయనరక్తము పొంగి కడలి అలలను రేగగొట్టును గాని తల్లిమాట చెలియలికట్టయై ఆ వేలాజృంభణకును ఉడిపి, చేజెక్కిన పగతురను కోడెగములతో వదలించి వేయును. యుద్ధమున 'కనలధికమై లావెక్కును', వెంటనే 'వెనుదిరుగును. తనబాహువీర్యముపై ఆధారపడిన సుయోధనుని — ఆయన రణావసరములను మరచి, అడిగిన లేదనలేనివాడను పేరు మ్రోయించుకొనవలెనను మృషాభిమానముతో సహజకవచకుండలములను కోసి, తన విరోధితండ్రికి యిచ్చివేయును. ఇట్టిది ఆ వీరుని వితరణ లేని దానశీలము! కాబట్టే ఆయన గుణతేజోరేఖలు ఇంద్రచాపరుచులవలె భిన్నములై మురువు గొల్పును. ఇన్ని గజిబిజగుణములలో గూడ, ఆయన నడతకు ఆవంతయేని కొరత కలుగలేదు. కాబట్టే, "కర్ణుడు విక్రమంబున కులగీర్తి కిల నాస్పదం బగుటకు జనియించినవాడు' అని, (కర్ల-2:109) గతమదమత్సరుడైన తిక్కన సోమయాజి, గుండెపై చేయిడి చెప్పుచున్నాడు. "విమలయశోఘనుడు కర్ణుడు" అని చెరచిన శల్యుడే పొగడుచున్నాడు. (కర్ణ-1-253) ఈయన క్రోధకేతనమును ఎగగట్టి రణనీతిని భంగము చేసి ఎరుగడు.
★అలౌకికజన్మప్రకారములు
ఒకవ్యక్తి, తన జీవితకాలములో గొప్పవాడైనతర్వాత, ఆ మనుగడకు మహిమలు కల్పించుట, అజ్ఞాతజన్మములకు దైవత్వము లంటగట్టుట, అన్నిమతములకు అలవాటైపోయిన గోసాయిచిట్కామందు, ఆతర్వాత ఆపురుషుని ఎంతటి మానవాతీతునిగ జేసిన అంత గొప్ప. ఈపట్టున ఔచిత్యము-చరిత్ర-ప్రకృతి-వీటి నన్నిటిని మడతన ఇకేముద్దగా పౌరాణికులు భుజించి త్రేపనైన త్రేపరు.
నాజరెత్ జీజెసు, క్రీస్తు (అభిషిక్తుడు) అయినతర్వాత, ఆయన కానీనజన్మ పరిశుద్ధాత్మసంపర్కముతో అయినట్లు,మరియమ్మ లోకమాత అయినట్లు, స్వర్గమును భూతలమున ఒకతడపతో కలిపి కొట్టివేసినారు. ఇట్లే మన పురాణపురుషుల జన్మాదికములు గూడ! వారి జననీజనకుల అధర్మ అసహజసంపర్కములు, తత్ఫలితములైన జన్మలు సద్యోగర్భసంజాతములై, యీలోకపు తీరుతెన్నులకు, వాసనలకు అతీతములై పోవుచున్నవి. ఎంత మానవాతీతమైన అంత ఘనత అనుకొని, శరీరములో ఎక్కడబడితే అక్కడనుండి మహాపురుషులను పుట్టించుచున్నవి పురాణములు. రెల్లు, తొట్టి, కుండ గూడ పవిత్రమాతృమూర్తు లగుచున్నవి. ఇదంతా, ఆవ్యక్తులు మహాపురుషులైనతర్వాత జరిగిన కల్పనయే!
ఆవల ఇది గొఱ్ఱెదాటుసేతగా సాగింపబడినది. ఇట్లు చేసినవారు, అంతకుముందు జరిగియుండిన పనిని గుర్తించకనో, గుర్తించి గూడ భిన్నత్వమే ఏకత్వమునకు మూల మనిన వేదాంతసూత్రప్రక్రియ ననుసరించియో, ప్రక్కప్రక్కనే యీ విభిన్నకథలను, తల కొకతీరుగా వ్రాసి, పురాణములలో నింపియున్నారు. అంతటి మేధాసంపన్నులైన మహాకవులకు అనువదించునపుడు యీ చిన్నలోపము తోచలేదని అంటే మహాపచారమే గాని, అనక తప్పదు. ఏమి చెయ్యాల!
★కర్ణుని జన్మప్రకారములు
కర్ణుని జన్మప్రకారములు భారతములో పలుతావుల ఉన్నవిధానమును పరికించండి. వీటిలో వివరములు పరస్పరవిరుద్ధముగ నున్నవి.
1. ఆదిపర్వము-5 ఆ. 17 పద్యము మొదలు సద్యోగర్భము. ఇది నన్నయభట్టారకుని రచనము.
యాదవకులవిభుడు-శూరుడు, తనపెద్దకూతురు-పృథకు, అపుత్రకుడు-కుంతిభోజుడు పెంచుకొనుటకు యిచ్చును. పృథ అతిథిసత్కారములు సేయుచుండును. దుర్వాసముని ఒకనాడు విందవు అగును. కోరిన ఆహార మిడగా సంతుష్టుడై "యెయ్యేనివేల్పు నారాధించిన, ఆవేల్పు నీకోరినయట్టిపుత్రకు నిచ్చు”నని, యాపద్ధర్మంబుగా నొక్కదివ్యమంత్రంబు ప్రసాదించిన, నమ్మంత్రశక్తి నెఱుంగగోరి, కుంతి యొక్కనాడు ఏకతంబ గంగకు జని, తనహృదయంబున నాదిత్యుని నిలుపుకొని, ఆ మంత్రంబు స్మరించి "నీయట్టికొడుకు బ్రియంబున నిమ్మ"ని కోరును.
కమలమిత్రుడు తనతీవ్రకరత్వ ముడిగి, తరుణద్యుతితో గగనంబునుండి వచ్చెను. విస్మయసంభ్రమములనున్న ఆకన్యక నోడకు మని, సూర్యుండు ప్రసన్నుండై, "నీ కోరినవర మిచ్చితి” ననియె. కుంతి లజ్జావనతవదనయై, యజ్ఞానమున రావించినదానికి మన్నింపుమని వేడుకొనగా — “మదీయదర్శనంబు వృథ గాదు; నీయభిమతంబు సేయుదు” అని సూర్యుఁ డనియె. కుంతి "కన్యక కిది గుణము కాదు; నాకు గర్భమైన నాతలిదండ్రులు చుట్టములు నగరే” అన, విని సూర్యుడు దాని గరుణించి, "నీకు సద్యోగర్భంబున బుత్రు డుద్భవిల్లు. నీ కన్యాత్వంబు దూషితంబు గాదు” అని వరం బిచ్చిన, కన్యకకు దక్షణంబ నంశుమంతు నంశంబున కానీనుండై ఒకబిడ్డ జనించె.
ఆశిశువును ఇంటికిం గొనిపోలేక, అట విడనాడలేక ఆమె మనసులోన వందురి వగచుచుండ, నాదిత్యప్రేరితంబై, యనర్ఘరత్నవసుభరితంబై ఒక్కమంజస నదీప్రవాహమున గొట్టుకొని రాగా, దానిలో కుంతి తనకొడుకుం బెట్టి, నీట వదలి నిజగృహంబునకు వచ్చె.
2. వనపర్వము 7-307 పద్యము మొదలు, ఎఱ్ఱాప్రెగ్గడ.
తొల్లి కుంతిభోజునికడకు దుర్వాసుడు అతిథియై వచ్చి, వానిచే బూజితుండై “నాకు నీయింట గొంతకాలము వసింప నిష్టంబైనది. నా ఉన్నంతకాలము భక్తి సేయవలయు; నోపుదే!" అనుడు,
అతండు ఒడంబడు. తనకూతును - పృథను ఆ బ్రాహ్మణును భక్తి భజింపుమనియె. అమ్మునీంద్రునకు చంద్రికాధవళంబైన సౌధంబునందు శయనాసనప్రముఖోపకరణములును, నభిమతాహారద్రవ్యంబులును నాయతంబు సేయబడియె. ఇట్లు ఒకసంవత్సరంబు పరిపూర్ణంబు కావుడు ప్రీతుండై దూర్వాసుడు "నీయారాధంబునకు మెచ్చితి, అభిమతంబు లిచ్చెద నడుగుము" అనిన ఆమె వలదనును. కాని, అతడు “ఒకమంత్రంబు గైకొనుము. దీనం జేసి యెయ్యేని వేల్పు నాహ్వాసంబు సేసెదు, ఆవేల్పు చనుదెంచి నీవశంబున నుండు" ననియె. కుంతి వెఱచి 'ప్రసాదంబు' అనియె. ఋషి యథేచ్ఛం జనియె.
(ఆదిపర్వమున ఋషి ఉనికి ఒక్కదినము, ఇచట ఒక్క ఏడు)
అంత కొంతకాలమునకు, ఒకనా డిచ్చన్ ఋతుస్నాతయై (కృతస్నాత అని పాఠాంతరము) సుదతీరత్నము పూర్వశైలితటిపై శోభిల్లు తిగ్మాంశు జూచి, దళత్పద్మముమాడ్కి నుల్లసితయై చిత్తంబు రాగిల్ల 'దేవా, భవత్సమానసుందరు డగు నందను గరుణింపవే' అని మనంబున గోరుకొనుచు, మంత్రోచ్చారణంబు సేయ, ప్రభాకరుండు నిజయోగబలంబున మూర్త్యంతరంబు ధరించి, కుంతిపాలికిం జనుదెంచె.
ఆయన మధురవచనంబున “నీమంత్రబలంబున వచ్చినాడను; నీవాడ నైతిని. నీమనఃప్రియంబు సేయువాడ, చెప్పుము” అనగా, ఆమె “కార్య మొకటియు లేదు; కౌతుకమున జేసితిని; ఇంతమాత్రాన విచ్చేయవలయునా? మగుడ చనుడు" అనిన, సూర్యు డిట్లను — "మత్సమానపుత్రుని గోరితివి; కావున మదీయసమాగమంబునకున్ ఒడంబడుము."
"బాల్యచాపల్యమున సైచి, కన్యాధర్మంబు రక్షింపు"మని కుంతి సూర్యుని అర్థింప, సూర్యుడు ఆంగీకరించక పట్టుబట్టినందున "నీకు నింపగుతెఱం గాచరింపుము; అవల నయ్యెడు నిందకు నోర్చెద” ననియెను. దినమణి "మదిరాక్షీ, మత్సమాగమంబున నీదు కన్యావ్రతంబు చెడదు, (ఆదిపర్వమున కన్యాత్వంబు అని) నిన్ను లోకనిందయు పొందదు” అని పలికి, ఆమెను ఒడంబఱచి, సమాగుణంబున బ్రీతుండై, ఆమెకు గర్భాధానంబు చేసి గగనంబున కరిగె. అంత, బూర్వపక్షంబున జంద్రుండునుం బోలి, గర్భంబును క్రమంబున దినదినప్రవర్ధమాన మగుచు, అభివ్యక్తం బయ్యు ప్రభాకరుమహిమన్ లోకవిదితంబు గాకుండా తత్ప్రకారంబు దాదికూతు రొక్కతెకుం దెలియు... ఇట్లు వర్ధిల్లుచు పదియగుమాసంబున, సహజకుండలాభిరాము నొకకొడుకుం గనియె. ఈవిధంబున జనించిన యర్భకుం జూచి, లోకాపవాదభయంబునకు వెఱచి, ఆక్షణంబ యొక్కమంజూషమున నబ్బాలకు నిడి, సఖియు దానును, ఆపెట్టెను గొని చని, దాని నొకతెప్పయందు నతిదృఢంబుగా బంధించి, నొఱసి పారు, అశ్వినీనదీప్రవాహమున విడిచి, గూఢప్రకారంబున గన్యాంతఃపురము సొచ్చి యప్పటియట్ల ప్రవర్తిల్లుచుండిరి.
ఇచట ప్రబంధపరమేశ్వరుడు తల్లి ఎదసొదను రాళ్లు కరుగ వర్ణించినాడు.
3. ఉద్యోగపర్వము-4:29. కృష్ణుడు, కర్ణునితో "... ధర్మసంవేదివి, తెలియంగ వినుము:— సిద్ధమంత్రబలంబున, మార్తాండువరమున గన్నియతఱి గొంతి గన్నవాడవగుట" అని చెప్పుచున్నాడు. కన్నవాడ వనుటలో సద్యోగర్భముగా కనుపించుట లేదు.
4. ఉద్యోగపర్వము-4:59. కుంతియే స్వయముగా కర్ణునితో చెప్పుచున్నది:— "వినుము. సూతాన్వయంబున నీవు పుట్టుట బొం, కేను, మాకుంతిభోజునింట, గన్నియనాడు భాస్కరుని రావించితి; వరమంత్రబలమున వచ్చి యతడు సంప్రీతి నొసగంగ జన్మించినాడవు నాకు" ఇందు ఈజననమునకు అలౌకికవాసనలు అంటలేదు. రావించుట, జన్మించుట అన్నియూ సహజజన్మనే సూచించుచున్నవి.
5. భీష్మపర్వము-3:444. భీష్ముడు కర్ణునితో “నీ యుదయము దైవికగర్భాయత్తము. నీకు మర్త్యు లసదృక్షులు” అని నిగూఢముగ చెప్పుట ఔచిత్యమే.
6. స్త్రీపర్వము-2:176;177. కుంతి మరల స్వయముగా
| | '... మదీయాత్మజన్ము డాతం డరయన్ | |
| ఆ. | "మీకు నగ్రజుండు, నాకు భాస్కరు దయ | |
అని మానవసహజరీతిగనే బుట్టినట్లు చెప్పుచున్నది — కన్నతల్లి.
7. శాంతిపర్వము. 1:11-16. ధర్మరాజు, నారదునితో — మానసికశాస్త్రప్రకారము చెన్ను మీర ఇట్లు పలుకుచున్నాడు. ఇంతకుముందే, యీ ఉదంతము కుంతీదేవి చెప్పగా, అన్నగా కర్ణునికి ధర్మజుడు నివాపాంజలి ఇచ్చి ఉన్నాడు:
| క. | అతడు దుర్యోధనునకు | |
| ఆ. | అతనిమేను కుంతియట్టుల కైవడి | |
| క. | కౌరవులు సేయు నవనుతి | |
అనగా నారదుడు చెప్పుచున్నాడు:—
| సీ. | మునిదత్తమగు మంత్రమున గొంతి కన్నియ | |
కుంతి తానుగానే వేదవ్యాసునితో "లజ్ఞాసహితంబగు నంతరంగంబు" చెప్పుచున్నది:—
ఏను కన్యాత్వదశ నుండగా, కోపనుడు-దుర్వాసుడు మదీయజనకునికడకు వచ్చె. అతని సవినయార్చనాసమారాధితుండుగా జేసితి. బ్రీతుడై వరము కోరుమనియె. వలదన్నను, అమ్మాట తనమనంబునకు రానిచందంబు మొగంబునం దోప, వరము నొసగక పోవననుడు, పుత్రుఁ గోరితి. అమ్మునిపతి, ఒకమంత్రం బనుగ్రహించి అంతర్ధానంబు నొందె. అమ్మంత్రరూప ముల్లమున నెప్పుడును దలతు. ఒక్కనాడు మేడమీద బోడిమి నేనుండి బొడచుచున్న కమలమిత్రుని గని [ఆదిపర్వమున గంగకు బోయినట్లు. ఇందులోవలెనే వనపర్వమున సూర్యుడు పూర్వదిశయందే వెలుగుతున్నాడు] మునిమంత్రబలమున ఆ సూర్యుని నావహించితిని. అద్దేవుడు మూర్త్యంతరంబు దాల్చి నాకడ కేతెంచె. [వనపర్వమును గూడ మూర్త్యంతరము దాల్చును] వచ్చి, అడుగు మిచ్చెద వరం బనిన, వడంకుచు కేలు మొగిచి, పొండు అని అంటిని, దానికి ఆయన — వృథాహ్వాన మాచరించుట తప్పు; నిన్నును నీకు మంత్ర మిచ్చినవానిని శపింతు ననియె. అంతట — భవత్సముడగు పుత్రు నిమ్మని కోరితి. అయ్యపరిమేయతేజుడు ఆత్మతేజమున, నా దృఙ్ముఖేంద్రియములు మనసును సమ్మోహితములు జేసి, యపుడు తనయుడు పుట్టెడుమనియె. పిదప ఆయన కన్యాత్వవికలత [కన్యావ్రత మని వనపర్వము] గాకుండ వర మిచ్చి దివమున కరిగె, నేను జనకముఖబంధుచిత్తవంచనము నడిపి, గూఢమందిరాంతమున కొడుకును గంటిని [ఏటిగట్టున కాదు.]
అని సహజజననవిధముననే, స్వయముగా మూడవమారు చెప్పినది. సద్యోగర్భము కాదు.
ఇవి ఆంధ్రమహాభారతప్రకారము.
ఇక ఆంధ్రభాగవతము ప్రకారము 9-వ జననపాఠము: 9 స్క. 717-721, కుంతి, కుంతిభోజునియింట బెరుగుచుండ ఒక నాడు దూర్వాసుం డరుగుదెంచిన, అమ్మహాత్మునకు కొన్నిదినములు [ఒక్కనాడు గాదు, ఒక్క ఏడుగాదు] పరిచర్యలు జేసి, వేల్పులం జేరజీరు విద్య వడసి [వరము గాదు] ఆవిద్యలా వెఱుంగ నొక్కనా డేకాంతంబున వెలుఁగుఱేని నాకర్షించిన, ఆయన వచ్చిన, వెఱుగుపడి ఇట్లనియె: క.మంత్రపరీక్షార్థం బభి మంత్రించితి గాని దేవ, మదనక్రీడా తంత్రము గోరి చీరన్ మంత్రించిన తప్పు సైచి మరలు దినేశా. అనగా — దేవతలను పిలుచుట వమ్ము కారాదు, అని, నీకు నీతఱి గర్భంబగు, పుత్రుడుం గలుగు, నీతారుణ్యము పూజ్యమగును; వెఱవన్ కార్యము లేదని, తగనీయ కొల్పి, లలితాంగికి గర్భము చేసి దినేశ్వరుడు మింటికిన్ చనియె. అప్పుడు పుత్రుం గాంచి కృప దప్పి నీట బోవిడిచెను.
అప్పుడు అనుటలో వెంటనే అనియో, తర్వాత ననియో నిక్కచ్చిగా చెప్పలేదు. వీటినన్నిటిని పరికించిన, మానవసామాన్యజన్మముగనే — కర్ణునిపుట్టువు గాన్పించుచున్నది. ఇట్లు ఇన్నిమారులు, భారతపాత్రలలో ఎవరిజన్మమును గాని భారతము చెప్పియుండలేదు. ఇది ఒకలెక్కింపే గావలయునేమో!
★రాధేయుడు
కర్ణుడు, మెరసే పెద్దచుక్క మిన్ను వదలి మన్నుపై బడినట్లు ఉద్భవించినాడు. ఆక్షణమందే భారతకథాదీపము వెలిగించబడినది! అది తిరిగి ఆయనతోనే ఆరిపోయినది. ఈ భారత మహా ఇతిహాసమున కీలకపాత్ర యీయనే అయినాడు. ఈయన, తన అండ లేకున్న సుయోధనుని సార్వభౌమత్వమే నిలువదని గుర్తెరిగియే, అందరు అన్నిమారులు ఆయన మనసును ద్రిప్పను, వికలము చేయను తల క్రిందులుగ తపసు చేసినారు. ఇట్టిది భారతమున కర్ణుని ఆధిక్యము! ఏటినీట దొరకినబిడ్డను అంత గారాబముగా పెంచుతల్లు లెంత అరుదో, పెంపుడుతల్లిని తండ్రిని ఇంతటి మమకారముతో పూజించినబిడ్డగూడ ఆరుదు. దుర్భేద్యమైన యీప్రేమబంధమే కర్ణునిజీవితమును కీర్తిజ్వలితపథన నడిపించింది. రాధ-అధిరథులకంటె అన్యదైవ మెరుగక ఎదిగినాడు రాధేయుడు. బంగారునగలతో పెట్టెనుండి బయటకు వచ్చినాడు కాబట్టి పెట్టిన వసుసేను డనుపేరు గాని, కర్ణకుండలములతో జన్మించినందున ఏర్పడిన కర్ణు డనునామముగాని [చెవులనుండి పుట్టినాడనునది పౌరాణికుల అపూర్వకల్పనాచాతురీవిభవము!] ఆయనకు అంతగా నచ్చలేదు. తాను రాధేయుడ నని, సూతనందను డనియే అనుకొని ఆనందతన్మయుడై 'అమ్మా' అని ఆమెను నోరార బిలిచి ఊరట బొందినాడు. సూతు డని ఎగతాళి చేసినా, కులహీన మానహీను డనినా, కానీను డనినా లెక్క గొనని ధీరమానసుడు యీ రాధేయుడు! తన అంగరాజ్యమకుటమును తన తండ్రిపాదసన్నిధిని బెట్టి ఆనందాశ్రువులతో అభిషేకించిన పునీత ఆదర్శపుత్రుడు — యీ సూతకులసంపోషకుడు! ఇంతటివానిని పెంచి పెద్ద జేసిన ఆ మహారథి — అధిరథుడు శాశ్వతకీర్తితో ధ్రువతారవలె వెలుగొందుచున్నాడు.
★రాజరాజు నేస్తము
మానవులకు తల వంచని మన్నీడు - మానధనుడు - కౌరవపతి - సుయోధనుని కర్ణుడు చూచిన క్షణమందే, పూర్వకృతమైన నెయ్యముతో ఇద్దరూ ఒకటిగా పెనవేసికొనిపోయినారు. ఈసంయోగము బంధురక్తప్లావితశమంతపంచరణభూమిలో వారిశౌర్యోపేతభౌతికకాయములకు గలిగిన విచ్చితితో మాత్రమే ఛిన్న మైనది. అంతే గాని, మానవదౌర్బల్యము లేవిగాని దానిని త్రెంచలేకపోయినవి.
వీరిద్దరిస్నేహము అపూర్వము. ఒకరు రథకారకుడైన సూతుని సామాన్యగృహమున ఎదిగినను, ఇంకొకరు అఖండవిభూతికి ఆలవాలమైన రాజమందిరమున పెరిగినను, ఈవ్యత్యాసములు ఆ సరళ సస్నేహమానసములకు అంటకపోవుటేగాక, నేస్తమును పెంచుటకే సహాయకారి అయినవి. అమలినహృదయములకు భూతలవానుల మలినము లంటవుగదా!
కర్ణుని బాహుబలసంపద, సుగుణరత్నసముదయము, స్నేహస్నద్ధహృదయము సుయోధనునికి పట్టుకొమ్మలైనవి. దీనితో వారు భారతకథానాయకులైనారు.
అస్త్రవిద్యాప్రదర్శనమున, క్షుద్రగురువులు బయటబెట్టిన నీచతారతమ్యమములతో, ఆ సుమనస్కుడు-రాధేయుడు కీర్తిశిఖరమునుండి అవమానభూరిప్రపాతమునకు విసరిపాయవేయబడనున్న, ఆక్లిష్టదారుణసమయమున కౌరవేశ్వరుడు కర్ణుని ఉద్ధరించి, అంగరాజ్యాభిషేకాంబుసమదయమున సూతకులన్యూనత అను కళంకమును కడగివేసి, కర్ణుని సకలమహీపాలమండలమున తలమానికము చేసినాడు. ఇట్టి ఉద్ధరణమును మరువగలిగిన కీటకమే సృష్టిలో ఉండదనిన, 'నిష్ఠురభుజవిక్రమోగ్రుడు' (ధర్మరాజు, కర్ణ. 3:65) నిజస్వామికి అమ్ముడుబోయిన మానసము గలిగిన 'స్నేహశీలి-ధర్మశీలి (కర్ణ. 3:344) కర్ణునిసంగతి చెప్పవలయునా? నీటినివలె విడదీయరాని యీ ఇద్దరిచెలిమి ప్రతిపక్షుల కన్ను గుట్టినది.
★శుభాంగి స్వయంవరము
కళింగదేశాధీశుడు - చిత్రాంగదుడు, నిజపుత్రిక - శుభాంగి స్వయంవరమును చాటించెను. శిశుపాలజరాసంధనీలరుక్మ మొదలుగాగల రాజలోకవిఖ్యాతులు, ఆ రాజధానినగరము - రాజపురమును నింపివేసినారు. కౌరవరాజును నిజప్రాభవోచితబలముతో, రాధేయునితోగూడ వచ్చి చేరినాడు. వరవరణసభలో, కన్యకారత్నము రారాజును గడచిపోయినది; ఇది తృణీకారమేగాక, సార్వభౌమాధికారావమానముగా మనసు కెక్కినది - ఆ మానవేంద్రునికి. వెంటనే ఆయన ఆమెను ఒడిసి లాగిపట్టి, తనతేరుపై ఎక్కించుకొని బయలుదేరినాడు. ఇతరరాజన్యులకు యీచులకన పచ్చిపుండుపై కొరవి బెట్టినట్లయినది. ఒక్కుమ్మడి కోల్తలపరచుకొని, అందరూ ఆయనపై బడినారు. కర్ణుడు వారిని వారించి, ఎదిరించి అందరిని త్రిప్పికొట్టి తరిమివేసినాడు. ఇదే ఆయన తనరాజుకు అచ్చవలసిన నెనరు అప్పుకు కట్టిన వడ్డీ చెల్లింపు. ఇదే! ఆయన ప్రథమవిజయము. దీనితో యీ ఇద్దరి స్నేహబంధము అయోనిగళముగ ప్రబలిపోయినది.
ఓడిపోయిన జరాసంధుడు, కర్ణుని వీరవిహారమునకు మెచ్చి మాలినీనగరమును కానుక బెట్టినారు; గుణలుబ్ధుల తీరుతెన్నులు ఇట్టివే గదా! (శాంతి. 1:30–34)
స్వయంవరానంతరము, కర్ణునికి శుభాంగిపై పవిత్రభావము; సుయోధనునికి రాధేయునిపై విశ్వాసము ప్రబలిపోయినవి.[1] ఒకనాడు రారాజు వేటకు పోయినాడు; కర్ణుడు వెంట పోలేదు. అభిమానగౌరవములకు నిలయమైన ఆ కౌరవపతి అభ్యంతరమందిరములో, రారాణి-శుభాంగితో (భానుమతి అనిగూడ) కర్ణుడు చదరంగ మాడుచుండినాడు. రాణి ఆట కట్టుబడిపోవనున్నది. ఆసునిశితసమయములో సుయోధనుడు వేటనుండి తిరిగివచ్చి నగరు ప్రవేశించినాడు. దేవేరి నిజవల్లభుని చూచి లేవబోయినది; కర్ణుడు, ఆమె ఓటమిని తప్పించుకొనుటకే లేచిపోవుచున్నదని అటు నిటు తిరిగిచూడక, ఆటపావులందే చూపు లుంచి ఆమెను నిలువరించుటకు చేయి ఎత్తినాడు. ఆ చేయి ఆమె తారహారమును ద్రుంచి, పైటకొంగును చిక్కించుకొనినది. ముత్యములు చిల్లాపల్లా నేలమీద ప్రాకి, తెల్లటి మిడిగ్రుడ్లతో రెప్పవాల్చక జరిగిపోయిన ఉదంతమును చాటుచున్నవి. సరిగా అప్పుడే రాజు ఆ మందిరమును ప్రవేశించి, ఈ విడ్డూరపుచూపును జూచి, ఎలనవ్వు వికసింపజేసి లోపలికి పోయినాడు. ఎంతటి ధీరచిత్తము ఆ రాజు! నిజకుటింబినిపై ఎంతటి అకళంకవిశ్వాసము! తన కూర్మి నెచ్చెలిపై ఎంతటి గాఢప్రత్యయము! కౌరవ నాథుడుగూడ కర్ణుని 'నాకు యేడుగడ; నిన్ను నీవ సర్వసేనాధిపత్యంబునకు బట్టము గట్టికొమ్ము' (కర్ణ. 1:54) అని మనసులోతును వెల్లడించినాడు. కాబట్టే ఇట్టి విశ్వాసిని వదలరాదని, కృష్ణునితోను కుంతితోను భీష్మునితోను చెప్పి తన హృదయనైర్మల్యమును దీపింపజేసికొనినాడు – రాధేయుడు! ఇది మొదలు వీరిలో ఒప్పమి పుట్టనే లేదు,
★ఆలుబిడ్డలు
భారతవీరకీర్తిహారములో మణిపూస అనదగిన ఇంతటి కర్ణునిభార్యపేరు, గాలించి వెదకినా ఎక్కడా కలికమునకైన కనుపించదు. అర్జునాదిపురుషుల బహుముఖకామశాస్త్రపాండిత్యము, దక్షిణనాయకత్వము ప్రతిభాగమున పారబట్టబడియున్నవి గాని కర్ణుని ప్రణయగాథ సంగతే లేదు. కడకు ఆమె ప్రస్తావన గూడ, పొలికలనిలో నిజస్వామిశవముపై బడి ఏడ్చునంతవరకు, ఇంతపెద్దగ్రంథము ప్రస్తావించదు. రాజరాజు భార్య గూడ అంతఃపురము వదలి రాజకీయములలో పాల్గొనినట్లు లేదు, వీరు, హైందవవనితాస్థానము అభ్యంతరమందిరమే అని నడచుకొనినట్లున్నవి.
ఏ యువకవీరునికి గూడ తీసిపోవనియట్లు, కురుక్షేత్రమున యుద్ధము చేసి, స్వారాజ్య మనుభవించిన కర్ణుని వీరసంతానము పేర్లు, వారి గుండెలుదీసిన బంటుపోరు వర్ణితమైయున్నవి. వీరు సుషేణ - సత్యసేన - చిత్రసేన - వృషసేనులనువారు. ప్రసేనుడు గూడ కర్ణుని కొడుకని ఉన్నది. (కర్ణ. 3:186) వికర్ణుడు కర్ణుని కొడుకని పెద్దఅపోహ; ఇతడు ధార్తరాష్ట్రుడు. వీరిని గురించి ఇంతకంటే ఎక్కుడు వివరములు లేవు. వీరందరు తండ్రికి అంగరక్షకులుగా నుండి యుద్ధమున మడసినారు. ఈవిధముగా, తన కుటుంబమంతా కురురాజు అభిమానఋణమును, నెత్తురు దోసిళ్లతో చల్లి తీర్చుకొనినది. వాడిని వీడిని ముందుకు నెట్టి, తనవారిని వెనుకకు లాగువాడు కాదు కర్ణుడు.
భార్యను-వృషసేనునితల్లి దీనావస్థను తిక్కన ఇట్లు వర్ణించుచున్నాడు. (స్త్రీ. 2:88,92)
| తే. | ఇతనిచుట్టును గలకల మెసగ రోద | |
....పలుతెఱంగుల బలవించి, యుత్థితమై యాలోకించి —
| తే. | కాకులును గ్రద్దలును దిన్న గడుసు ద్రెస్సి, | |
గ్రద్దలు తినగా రేఖామాత్రముగనే ముఖము మిగిలియున్నదని చెప్పుచున్నాడు, రాళ్లుగూడ కన్నీళ్లు గార్చేటట్లున్నది.
★మహాదాత
కర్ణుడు మహాదాతయని, దానవీరుడని లోకములో దట్టముగ అలముకొని పోయిఉన్న వినుకలులు. కాని, ఆయన చేసిన దానము లేవి? అని చప్పరించేవారుగూడ కలరు. భారతములోనివిగాక ఒకటి రెండు కథలు వినండి: వీటికి మూల మేదోగాని రసవత్తరకల్పనాలతకు పాదులు.
అది వానాకాలము! మూడ్నాళ్ల ముసురుతో నాడు బీడు వఱ్ఱొడ్డిపోయినది. అప్పుడు ఒకబ్రాహ్మణుడు చేయుచుండినయాగము నడికొనియున్నది. వేలాదిబ్రాహ్మణ్యం మూగియున్నారు. వంటదినుసులతో కొట్లు నిండియున్నవిగాని, వంటపందిరిలో మాత్రం మూరెడు వంటచెఱకు తునక గూడ లేదు. దిక్కుతోచక ఆ యజమాని నేరుగా కర్ణుని మందిరమునకు పోయి, దీనంగా సంగతి అంతా చెప్పుకొనినాడు. రాధేయుడు యోచించినాడు. ఎక్కడి కట్టెగూడ తడిసి, నీరు గ్రక్కుచున్నది. వాటినైనా తెచ్చేదానికిగూడ, మనిషి వానపెట్లకు తల బయట బెట్టలేకున్నాడు. కర్ణుడు తల ఉంకించి, తనప్రాసాదప్రాంగణపు మొగసాలవాసములను విప్పించి, తనబండ్లతో తోలించి ఆయాగశాలకు చేర్పించినాడు. ఉన్న ప్రక్షిప్తములుగాక ఇవి కొసరా? అని అందురేమో; ఔచిత్యభంగము లేకుండా కథలో చమత్కృతి, రసము బాగున్నవి.
దానగుణము ఒంట బుట్టవలసినదేగాని, తెచ్చిపెట్టుకొనిన అతుకునది కాదని చెప్పుచున్నది ఈ కథ :—
అర్జునుడు, కృష్ణభగవానునితో ఎప్పుడూ — "కర్ణుని దానములో విశేష మేమున్నది? ఇతరులపొత్తు వెదజల్లుట ఒక అబ్బురమా ? తనకున్న దానిని ఇచ్చినగదా ఈవి అనిపించుకొనుట" అని అనుచుండేవాడు. కాని శ్రీకృష్ణుడు: "దాతృత్వము సహజగుణము. ఇచ్చేవాడికి ఎవరిదైనను సరే” అనుచుండినా, నరుడు పెదవి విరుచుచునే ఉండేవాడు.
అది ఒక అమావాస్యదినము! పూర్ణసూర్యగ్రహణము. చుట్టాలవరుస వారందరు కౌరవులు పాండవులు వచ్చి యాదవులతోపాటు ద్వారకకు పోయి సముద్రస్నానమునకు వాగర్త చేరినారు. శ్రీకృష్ణుడు తనబావకు ఆహంభావమును అణచదలచుకొని, విడుపు ఇక ఒకగడియ ఉన్నదనగా, కడలిరేవులలో నిండియున్న ఇసుకతిన్నెలను నవరత్నరాసులుగా, తనమాయతో మార్చి “అర్జునా, గ్రహణవిముక్తికి ఇక కొద్దికాలమే మిగిలియున్నదిగదా? ఈ అమూల్యోపలసంచయమును, ఒకరాయియైన మిగులకుండ ఇచట నున్నవారికి దానము చేయము; ఏదీ నీ హస్తవేగశక్తిని చూతము" అన్నాడు.
ఇంద్రసూనుడు అంతరీయమును ఎగగట్టి, ఉత్తరీయమును తలకు జుట్టి, ఒకచేట చేతబట్టి, ఒక్కొక్కరిని పిలిచి, ఒళ్లలో పోయుచున్నాడు. ఒక్కగుట్టలో ఆవగింజపాలైన తరుగ లేదు. విడుపు దరికొనిపోయినది. దాతకు ముచ్చెమట బట్టినదేగాని, ఈవి గడ్డగట్టలేదు. అప్పుడు ఆ జగన్నాటకసూత్రధారి-దేవకీనందనుడు, పిన్ననవ్వు వెలయించి, “ఏమి బావా? దానము ఒకవిశిష్టనైసర్గికకళ అనగా నమ్మకపోతివిగదా! ఎవరిదానినో పంచి పెట్టకున్నను, ఒక్కచిన్నతిప్పను గూడ కరగించలేకపోయితివిగదా. ఇక చూడు కర్ణుని పనితనము?" అని కోడెగమాడి, ప్రక్కనుండిన వసుసేనుని బిలిచి, 'రాధేయా, గ్రహణత్యక్తము పూర్తియగులోపల యీ కెంపులపోగులను దానము చేసివేయుము” అనగా, కర్ణుడు నిలుచుండినచోటునుండి కాలు కదపకయే, ఒక్కొక్కరికి ఒక్కొక్కరాశిని ఇచ్చి క్షణములో జల్ల కడిగివేసినట్లు పనిని పూర్తిచేసి, 'ఇక లేవా ?' అని అడిగినాడు. "కడు నర్థి వేడిన గడిమితో పొచ్చెంబు సేయక ఇచ్చుట” వ్రతముగా గలిగినవాని సేతలిట్టివి!
★వితరణలేని ఈవి
కర్ణుని యీ దానవిధానమే రాజరాజుకొంపకు ఎసరు బెట్టినది. ఇందు ఆయనకు వితరణ తెలియదు. ఇంతేగాడు, కర్ణుడు ఇచ్చుటే గాని తిరిగి తీసికొనుట ఎరుగడు. ఇదే నిజసహజధర్మకవచమును ఇంద్రునికి ఇప్పించివేసి, తన యుద్ధకౌశలమును క్షతము గావించినది. దుర్యోధనుని బలవంతముమీదనే ఇంద్రుడిచ్చినశక్తిని స్వీకరించినాడు. ఆయనకు దానము ఒక బేరము కాదు, ఇక అడిగినవాడు బ్రాహ్మణు డాయెనా - ఈ దొరకు ఒళ్లే తెలియదు. తల్లి-కుంతి అడగగానే, అర్జునునిదప్ప ఇతర పాండవులను చంపనని మాటయిచ్చి, అస్త్రసన్న్యాసము చేసి కౌరవవిజయలక్ష్మికి మున్ముందే అంగవైకల్యము కల్పించినాడు. కాని, స్థైర్యము విడనాడకుండుటే యీయన గుణసంపదకు రాణింపు.
★అచంచలస్థైర్యము
లగ్గుకు పెరుగని, ఎగ్గుకు తరుగని స్థిరచిత్తుడు కర్ణుడు; ఎంతటిముప్పు తలమీద వ్రాలినా తన జీవితధర్మలక్ష్యమును విడనాడని ధీరుడు. తనకర్తవ్యమును నియమమును పాలించుటకు ఆత్మార్పణముచేయగలిగిన సాహసి — యీ రాధేయుడు. కృష్ణుడు, తన పుట్టువుగుట్టు బయట పెట్టి, రాజ్యకాంక్షతో - ద్రౌపదీయనుభవలోభముతో అకృష్ణుని జేయ ప్రయత్నించినను, చిన్నపేడైన ఎత్తని దారుహృదయము యీ సూతనందనునిది! కన్నతల్లి తన సిగ్గు చిమడబెట్టుకొని “నిను గని నీట గలిపితిని, తిరిగి నా ఒడిలోనికి రమ్ము” అని దీనయై అర్థించినను, తమకని రాతిగుండె — యీ ప్రభుభక్తిపరాయణునిది. శల్యుడు తేరునొగలో కూర్చుండి, నయవంచనముతో కారుకూతులు బలికినను చలించని స్థిరసంకల్పము ఈ యోధునిది. భీష్ముడు తన్ను అర్ధరథుని జేసి మాట్లాడినప్పుడు, రెచ్చి పొంగినాడే గాని, ఆ నిందావాక్యముల లెక్కబెట్టలేదు; ఎద నిండుకుండ కాబట్టి తొణకలేదు. గురువు భూదేవులు శపించినారు — దేవతలు పెడమొగము బెట్టినారు — భూతలము వంచించి, ఆయన రథచక్రమును తనలోనికి గుంజుకొనినది — తనపక్షయోధాగ్రేసరులు చాలమంది యుద్ధభూతమునకు ఆహుతి అయిపోయినారు — సొంతకొడుకులందరు తన కండ్ల ఎదుట నెత్తుట దోగి దివ్యులలో గలసినారు — ఇన్నిటినిచూచిగూడ, పిరికికండ బడని యోధాతియోధుడు వసుసేనుడు. ఇక ఆయనను ముంచినది ఆయన వ్రతమే! అయినను "సంగ్రామకేళీవ్యసనరసికుడుగానే" (శాం. 2:484) కడపటి నెత్తురుబొట్టువరకు నిలిచినాడు.
★శౌర్యసంపద
కర్లు డొక వీరుడా? ఎప్పుడూ పిక్కబలము చూపి పరుగెత్తినవాడేగదా అని, ఒక సర్వసాధారణమైన ఎత్తిపొడుపు. ఆయన శస్త్రాస్త్రసంపద శప్తమని, జర్మనీ హిట్లరు మంత్రి - గోబెల్సువలె ప్రచారము చేయబడు పాత పాడుమాట.
గోగ్రహణమున, కర్ణు నొక్కనినేగాదు. అందరు కౌరవవీరులను, ఒక్కనరుడే చాపచుట్టగా మడచిపెట్టినాడు. ద్రౌపదీస్వయంవరమున ఓడినది ఇంకొకటి, గంధర్వరాజుచే పరాభూతు డగుట మరియొకటి. ఇవే నూటికి నూరు నిజమైనచో ఈమూకను నమ్ముకొని అంత పెద్దయుద్దమునకు దిగు వెఱ్ఱివెంగళప్ప ఉండునా? కాని, కురుక్షేత్రయుద్ధమున ద్రోణుని సేనాధిపత్యముక్రింద ఆ ఐదుదినములలో ఎనిమిది పెద్దయుద్ధములు చేసి, తనభీరమునకు ఆటుపోటులు లేవని చూపినాడు, మదమాతంగమును బిసకొండతంతువులచే కట్టినట్లు, తల్లికి యిచ్చినమాటలు మనసుకు వచ్చి ఆక పెట్టగా, చేజిక్కి దీనులైన నలుగురుపాండవులను పరాజయపరాభవములకు పాల్జేసి వదలి వేసినాడు, తానే సేనాపతిగా రెండునాళ్లు వీరవిహారము జేసినాడు. "ఆకలిమైవచ్చు కృతాంతవక్త్ర మనదగిన అస్త్రముల” ప్రయోగించి పరిపంథుల అలయింపజేసినాడు. మాయలమారి-ఘటోత్కచుని “మృత్యువు తోడబుట్టిన వనగా” పేర్గాంచినశక్తితో సమయించినాడు:
చరమఘట్టమున —
| ఉ. | గాండివి శౌరి కిట్లను: 'కర్ణుని జూచితే! యేకవిక్రమో | |
(కర్ణ. 3:16)
| క. | చచ్చిన మఱి గెల్పుగొనన్ | |
(క. 3:17)
| తే. | పట్టపగలింట సూర్యునిపగిది గర్ణు | |
(క. 3:18)
అని, అర్జునుడే కర్ణునికి తట్టుకోలేక (Discretion is better part of Valour గా) వైదొలగ నుండ అన్యులమాట లేల?
ఇక కర్ణునికి ప్రాప్తించినది దుర్మరణము; అది శత్రువిజయచిహ్నముగాదు. తేరుగాలు క్రుంగిపోగా, అంగరక్షకులు లేక, సారథి నొగలనుండి దిగకయుండ, నిరాయుధుని, రణనీతి సముదాచారమును త్యజించి నరుడు నారాయణుని ప్రేరేపణతో, సహాయంతో తల దునిమినాడు. ఇది కర్ణునికి ఖ్యాతియే! సక్రమమార్గములు అతని సమ యింపలేమని యీ కృష్ణులిద్దరికి తెలిసియే యున్నది. కాని, కర్ణుని శస్త్రాస్త్రసంపద కుంటువడకయే దీపించినది.
గురువు భార్గవుడు శపించి, ఆవల దానిని ఉపసంహరించుకొని, ఒక్క భార్గవాస్త్రమే పారదనినాడు. "జమదగ్నిసుత కృపాశ్రయమున బడిసిన విలువిద్య కలరూపు వెలయజేతు" ననుచున్నాడు. కాబట్టే అన్ని అస్త్రములు ప్రయోగించి అందరి వీరులచేత పొగడ్త లందినాడు.
(కర్ణ. 1:232)
కపికేతనమువలెనే కర్ణుని హస్తికక్ష్యయు తపోబలమున పొందబడినది.
(కర్ణ. 3:256)
ఇక శస్త్రములసంగతి, అదేల; తనపేరు చెక్కినబాణములు ఇండ్లతో తోలించి తెప్పించుకొనినాడు.
(కర్ణ. 1:236; 3:112; ద్రోణ. 5:118)
ఇదిగాక, కర్ణుని రథము, హస్తికక్షకేతనము, అశ్వములు, ధనుస్సు, శంఖము మొదలగు యుద్దోపకరణములన్నియు, ఆ పార్థునివాటివలెనే దైవదత్తములు! అట్టివీటిని క్రిందు చేయుట పాడిగాదు. ధనువు పరశురామదత్తము.
(కర్ణ. 1:238)
ఇక కర్ణుని చావుకు నారదమునీంద్రుని వ్యాఖ్యానమే అంగీకరింపదగియున్నది. ఆయన ధృతరాష్ట్రునితో చెప్పుచున్నాడు:—
| | “వినుము నరేంద్ర, విప్రు దలివెన్, జమదగ్నిసుతుండు శాప మి | |
(శాంతి. 1:35)
| | [నరుచేతను నాచేతను | |
అని, కవిత్వసంపద లేకపోయినా, కృష్ణునిమాటలుగా, సూటిగా చెప్పిన ఈ చాటువొకటి ప్రచారములో నున్నది. “నీచేతను, నాచేతను” అని లోకులనోట నానిన పాఠము. వీరికి ప్రాసకు గర్భస్రావమైనను, ‘యతికి కపాలమోక్షమైనను' సాటిన లేదుగదా!]
★ప్రభుభక్తిపరాయణత
కర్ణుని గుణభూషణప్రతతిలో ప్రభుభక్తిపరాయణత - ధార్మికతృష్ణ మకుటాయమానములు! తన సర్వస్వమును రాజరాజు యశశ్రీకి-రాజ్యశ్రీలకే వినిమయము చేసినాడు. ఆదరించి ఘనపరచిన ఆయన ప్రాభవమును పెంచను నిజవ్యక్తిత్వమునే అణచి వేసికొనిన త్యాగి; మనినది మరణించినదీ ఆయనకొరకే!
| | "అనుదినంబును నంతకంతకు బెరిగెడి | |
(కర్ణ. 2:21)
అని, ఎదపై తలపై పేరుకొని అణచివేయుచుండిన కృతజ్ఞతాఋణమును వడ్డితో చెల్లించను ఉవ్విళ్లూరి, ఒక్కొక్క మన్ననకు ఒక్కొక్క గాయముగా మరణించినాడు. తాత భీష్ముడు అంపశయ్యాగతుడై యుండి, చూడవచ్చిన (ఆయన ఆడినమాటలను మరచిపోయిన సరసహృదయుడు) కర్ణుని సాదరమతితో జూచి, కౌంతేయులను గలసియుండుమనగా, కర్ణుడు మారుబలికిన చేవమాట లివి:
| | “వారు మహాబలుల్, హరియు వారికి బ్రాపు గలండు; వారలం | |
(భీష్మ. 3:447)
ఇన్ని తెలిసిగూడ ధర్మవ్యతిరిక్తమునకు ఊలుకొనని ప్రారబ్ధవాది — ఈస్వామిభక్తిపరాయణుడు! అది తెలిసికొనియే, భూరి వివేకుడైన భీష్మునితో పలికిన క్రింది ఉక్కుమాటలు సువర్ణాక్షరములలో సాహిత్యప్రపంచమున నిలిచిపోగలవు.
| శా. | దైవాధీనము సర్వమున్, మనమతిం దప్పింపగావచ్చునే? | |
(భీష్మ. 3:450)
అవును, మతెంతో గతి అంతగదా! స్వామిభక్తులకండలు కదలించి, స్వామిఘాతకులహృదయములు చీల్చగలిగిన ములుకు లివి! ఏరీ ఆ దేవతావళి? పనిబాటలు లేక విమానములలో తిరుగాడుచు, పాండవవీరులపై పుష్పవర్షము కురిపించుచుండిరే — ఎక్కడకు పోయినారు? ఏ దానవవీరుడైనా వారిపై దండెత్తిపోయినాడా? లేక సత్యవీరము యీ స్వర్గవాసులకు రుచించలేదేమో!
మహానుభావుడు-భాసుడు "పంచరాత్రము”లో కర్ణుని కీర్తిమూర్తికి బంగారునీరు బోసి మెరుగెక్కించిన వహి చూడుడు:
ఐదుదినములలో పాండవులు అజ్ఞాతవాసమునుండి బయటికి వచ్చి కనుబడినచో, తిరిగి వారి రాజ్యభాగము వారికి ఇచ్చివేయుదుమని, భీష్మునిపోడుపై అంగీకరించిన పట్టున, దీనిపై అందరి అభిప్రాయ మడిగినప్పుడు, దుర్యోధనునితో కర్ణుడు —
| | “భాగ మియ్యగ లేదన, బ్రభుడ వీవు! | |
అని వాదములపొంత బోక చెప్పినాడు. భారతవీరులలో యీ గుణవిశేషమున రాధేయుని మించిన రాచపుట్టువే గాదు, మనుజశరీరుడే లేడు!
★ఇతరులు చేసిన కర్ణుని గుణకీర్తనము
తిక్కన తనమాటలలో పాత్రలను పొగడడు — తెగడడు. "మెత్తటిపులి ధర్మసూతి" అనినా, "అంతర్మదదుష్టుడు ధర్మ సూతి” అనినా ఇతరులచేత చెప్పించినవే! “పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా" అని మొరటుగా వేమనవలె తిక్కన చెప్పడు. ఇట్లే కర్ణుని గూర్చి ఇతరులచే చెప్పించిన పొగడ్తలు కొన్ని:
బ్రహ్మ రుద్రునితో (కర్ణ. 3:243) కర్ణార్జునులను గూర్చి —
| క. | ఇరువురు నతిరథులు, సమ | |
ఇట్లు దేవతలు చెప్పినను, భూదేవతలు కర్ణుడు అస్త్రప్రయోగమునకు మతిమరపు తగిలిందని విడువక చెప్పుదురు. కౌరవుల దేవిడీలోనే ఉండిన తాత - భీష్మాచార్యులవారుమాత్రం ఈయనను అర్ధరథుని జేసి, ద్రౌపదేయులను ఎత్తిపెట్టి మహారథులను జేసినారు.
(ఉద్యో. 4:260)
కాని, కృష్ణుడు ధర్మజునితో (కర్ణ. 3:387)
| క. | "భువనములన్నియు నొక్కట | |
ధర్మజుడు : (కర్ణ. 3:65)
| | "నిష్ఠురభుజవిక్రమోగ్రుడగు సూతతనూభవుడు” | |
ధర్మరాజు కృష్ణార్జునులతో (కర్ణ. 3:29)
| మ. | సురలైనం జల మెత్తి కర్ణుని రణక్షోణిన్ జయింపంగ నే | |
ఇది అన్ని అపదూరులకును ప్రత్యుత్తరము! ధర్మతనయుడు అర్జునునితో (ద్రోణ. 5:195) —
| క. | నడురేయి తీవ్రభానుడు | |
| | గడువగు తేజంబున వెలి | |
అర్జునుడే (విరా. 5:11) —
| శా. | యోధాగ్రేసరు డిద్దతేజుడు, రణోద్యోగానురక్తుండు, దు | |
నూర్గురను కన్న ఆకడుపు కుట్టుబుట్టగా, గాంధారి శ్రీకృష్ణునితో అంటున్నది (స్త్రీపర్వము) —
| | పాండుపుత్రుల భుజాబలమున కులుకక | |
అని ఉన్న గుణములను వర్ణించినది.
ఆయనసంగతి తెలిసిన ఎదిరిమాటలకంటె బిగువైన యోగ్యతాపత్రము లుండగలవా?
ఇక రాధేయుని సొంతమాటలు —
| | కాండ మహాతరంగంబుం వైరుల ముంచు | |
| | విశిఖోగ్రశిఖల విద్విషుల నేర్చు కిరీటి | |
హృదయమును ద్రవింపజేసే, ధర్మరాజు అనుతాపముతో యీ పొగడ్తలప్రోవును ముగింతము. (స్త్రీ. 2:174 మొదలు) —
ధృతరాష్ట్రాదులందరు, కుంతీదేవితో పీనుగుపెంటగా నున్న పొలికలనుకు పోయి, తమతమవారి శవములను ఏర్పరించి, ఏరి, నివాపాంజలి యిచ్చు సమయ మది. అప్పుడు — కుంతి యెల్లవారు వినగ నిట్టు లనియె —
| తరలము. | వినుము! కౌరవకోటికిం దన విల్లు పెట్టని కోటగా | |
'........మదీయాత్మజన్ము డారయన్' అని కడుపు గుట్టు బయటబెట్టి, అట్టి అగ్రజునికి తిలోదకదానము చేయమనినది. అప్పుడు “ధర్మనందనుడు దల్లడిల్లుచుం దల్లితో నిట్టులనియె" —
| | "అనిలార్జునుల మార్కొననేర్చె యెవ్వని | |
| | మిమ్మునందఱ నెవ్వని మహితశ క్తి | |
| ఆ. | ఆతడు మాకు నన్నయని మున్న యెఱుగంగ | |
[3]"తల్లీ భరతకులమను పెద్దదూదిబోరెములో నిప్పంటించితివే! ఆయన ఆర్యధర్మపరుడు, నేను అనార్యుడను. నాబోటివారు వేయిమంది అయినను ఆయనతో సాటిరారు. ఆయన సువ్రతుడు, మహావీరుడు, కర్ణునిమాటలకు కోపము త్రెళ్ళి పొంగునుగాని, ఆయన మీగాలు చూడగనే అదేలకో నోరాడదు; కోపము ఉడిగి చల్లారిపోవును, ఇప్పుడు తెలిసినది తల్లీ, ఆ పాదములు నీ పాదములవంటివే!” అని చుట్టుపట్ల ప్రకృతియే కంట తడిబెట్టునట్లు చేసినాడు.
ఇట్టివి, భారతమున, పసిడితునకలవంటివి ఎన్నియో గలవు.
★కర్ణునితేజము వారిజాప్తబింబము సొచ్చుట
తిక్కన, కర్ణుడను అపూర్వజ్యోతి ఎట్లు ఆరిపోయినదో చెప్పుచున్నాడు తిలకించండి (కర్ణ. 3:362, 363) —
| క. | చరమగిరినుండి పడియెడు | |
| తే. | అధిప, యంతన కనువిచ్చి యఖిలజనులు | |
ఆ మహావ్యక్తి వీర్యవంతమైన జీవితమునకు పరమోచితమైన పరిసమాప్తి! ఇక మిగిలి, మనిన దొరలు రక్తమలినమహీతలమునే పాలించినారు, కాబట్టే కర్ణుని శిరము "అతిగర్వసమన్వితము” అయినది. (కర్ణ. 3:37)
చివరకు — "వినుము నరేంద్ర, యీ క్రతువు విష్ణుమయం; బిది నిర్వహించి రర్జునుడును గర్ణుడున్ సమరరూపమునన్ దగ” అని ఫలశ్రుతితో ముగించుచున్నాడు కవి. (కర్ణ. 3:397)
ఇదీ తెనుగుభారతము ప్రదర్శించిన కర్ణుని కీర్తిమూర్తి!
★కర్ణదేవాలయము
నెల్లూరు మొదలు దక్షిణాదిన శ్రీకృష్ణ (ద్రౌవది) ధర్మరాజ దేవాలయములు గలవు. ద్రవిడదేశమునుండి వచ్చిన అగ్నికులక్షత్రియులు (నెల్లాలులు; నెల్లూరుప్రాంతమున కామాటులు అని అందురు) పూజారులుగా ఈగుడులందు వీరు పూజ చేయుదురు. మూడేండ్ల కొకసారి యీ వీరులకు తిరునాళ్లు జరుగును, పద్దెనిమిది దినములు భారతయుద్ధమునే సమగ్రముగ ఇచట ప్రదర్శింతురు. కడపటినాడు నిప్పులగుండము, ద్రౌపదిఒడిలో గుండపునిప్పులు బోయుదురు. చీర కాలకుండుటే ఇందలి మహిమ. ఇతర తిరునాళ్లలో కొడి గట్టుటవంటిదే (ధ్వజారోహణము) ఇందు కత్తి నిలుపుట.
ఇట్లే, నేటి మధ్యప్రదేశమున భాగల్‌పూరునందు కర్ణుని దేవాలయము గలదు. ఇందు అర్చనాదికములు, అతిపూజ్యభావముతో జరిపించబడుచున్నవి. ఈ ప్రాంతము పూర్వము కర్ణుని ఏలు బడిలోనుండిన అంగరాజ్యమని ప్రజలవిశ్వాసము, (చరిత్రకు సరిపోవునట్లు లేదు) ఇచటివారి పేర్లలో కర్ణుడు-కుంతి, తక్కుంగల పాండవులనామములు సర్వసాధారణములు.
3. తిక్కన కవితాశిల్పవైభవము
1. చరిత్రాంశము లేశము
★విక్రమసింహపురము
క్రీస్తుశకము నాల్గవశతాబ్దంలో ఈ ఊరికి గడ్డ ఎత్తబడినది. దండకారణ్యమును నరికి, జనపదములు కట్టించిన “కాడువెట్టు (= అడవిని నరకు) ముక్కంటి" అను నామాంతరము గలిగిన త్రిలోచన పల్లవుడు దీనిని ప్రోదిచేయగా, పల్లవుల బిరుదమైన "సింహ” నామాంకితమైనది. అది మొదలు కాంచీపుర సామ్రాజ్యధవళాతపత్రఛాయలక్రిందనే నెల్లూరు అయినది. (నెల్లి = వడ్లకు పేర్గాంచినది) మూలస్థానేశ్వరస్వామి నెల్లి (=ఉసిరిక)చెట్టుక్రింద ఉద్భవించినారు కాబట్టి నెల్లూరు అయినదనుట యీవలి చతురకల్పన. ఈ రాజ్యము నేలిన
మనుమసిద్ధి ( తెలుగు) చోళుడు. కావేరికి ఆనకట్టగట్టిన ఆ పురాతనఇంజనీరు - కరికాలచోళ మహారాజు సంతతివాడు. వేంగీ దేశాధీశుడు - రాజరాజనరేంద్రుని కొమారుడు - రాజేంద్రుడు, ఉభయకులోత్తుంగుడై, నెల్లూరు రంగనాథస్వాములవారికి కైంకర్యములు చేయించినాడు. ఈయన, గోదావరి కావేరినదులు, నిజరాజ్యలక్ష్మికి రెండుబాహువులుగా సంతరించినాడు. ఇట్లు కృష్ణకు దక్షిణ ప్రాంతము, పెన్న మాగాణములు తమిళసంప్రదాయములలో ఊరినవే. తెనుగుదనమునకు శ్రీకృష్ణదేవరాయల దినాలలో చేవ ఎక్కినదనవచ్చు. చోళులకు ముందు 12 బోయకొట్టములు (దుర్గములు) కందుకూరుకు దక్షిణాన రాచరికములు నెరపుచుండినవి. 8-వ శతాబ్దాంతమున, పండ్రంగడు అను బ్రాహ్మణసేనాని, కందుకూరు రాజధానిగా వీలినాడు. ఇతడు తెనుగుకవియై కవులను పోషించి, తెనుగుపద్యాలలో శాసనములు వేయించినాడు. ఇవే ఆంధ్రకవితావర్షమునకు తొలకరిముత్తెపుచినుకులు.
తెనుగు చోళులైన తిక్కన, మనుమసిద్ధి మొదలగువారు, ఓరుగంటి కాకతీయులకు సామంతులై, కవిబ్రహ్మ దిక్కనపుణ్యాన మాన్యపరుపబడినారు. ఆవల కొండవీటి పంటరెడ్లపాలనకు దత్తమైపోయినది - నెల్లూరుసీమ. పంటనాడు అనునది, ఇప్పటి గూడూరు తాలూకా ప్రాంతమని చరిత్రకారుల మతము.
ఈ మండల దక్షిణభాగము కొంత, కొన్నాళ్లు పాండ్యుల, కొన్నేండ్లు చోళుల చేతులు మారుచు వచ్చుచుండినది. గజపతులు గూడ దీనిని పాలించినారు. ఆవల విజయనగరభాగమై, గోల్కొండ సులతానుల వశమైనది.
★నెల్లూరు తెలుగు చోళులు
ఇమ్మడి (రెండవ) మనుమసిద్ధి తిక్కన సోమయాజిని 'మామా' అని పిలిచి, ఆయన కావ్యకన్యక - నిర్వచనోత్తరరామాయణమునకు కృతిభర్త యగుటచే, ఆంధ్రభారతి దీప్తిమంతముగ వెలసినంతవరకు చరిత్రలందు ఆయన, కొడిగట్టని తిళ్ళికగా విరాజిల్లగలడు. మనుమసిద్ధి రాజ్యమెంత? పిడికెడు! కాని, తిక్కన నేస్తమువల్ల ఇంతటి ఖ్యాతిగాంచిన ఈ అర్ధతమిళుడు ధన్యుడు.
నెల్లూరు రాజ్యస్థాపకుడు–నల్లసిద్ధి, చెంగల్పట్టు కడప నెల్లూరు మండలభాగమును, నెల్లూరు కంచి రెండు రాజధానులుగా, 1213 . సంవత్సరపు సరికట్లలో పాలించినాడు. ఇతని మనుమడు, మొదటి బేతరాజు కొడుకు-ఎఱ్ఱసిద్ధి, విశ్రుతుడు. ఈయనకు మొదటి మనుమసిద్ధి, రెండవ నల్లసిద్ధి (బేతరాజు నామాంతరము), తమ్మసిద్ధి అను మువ్వురు కొడుకులు, పెద్దవాడైన మనుమసిద్ధి రాజైనాడు. ముమ్మడి కులోత్తుంగుడు 1180 లో నెల్లూరుపై ఎత్తివచ్చి, మనుమసిద్ధిని రాజ్య భ్రష్టుని జేసి, ఈయన తమ్ముడు-నల్ల సిద్ధిని గద్దెపై కూర్చుండబెట్టినాడు. ఇతడు 1187-1207 వరకు రాజ్యము చేయుచుండగా, ఇతని తమ్ముడు-తమ్మసిద్ధి అన్నరాజ్యమును అపహరించి, ఉత్తర దక్షిణ పెన్నలకు మధ్యభూమికి-కంచి నెల్లూరు సీమలకు ఱేడైనాడు.
ఓరుగల్లులో, కాకతి గణపతిదేవుడు, ఆంధ్రసామ్రాజ్యసింహాసనారూఢుడై, తనరాజఛత్రఛాయలను యీ తెలుగు చోళులపై బరపినాడు (1199-1261).
మొదటి మనుమసిద్ధికొడుకు-తిక్కభూపతి, కాకతీయ ప్రభుపులపక్షమున, వెలనాటి పృథ్వీశ్వరుని ఓడించినాడు. వెంటనే కాకతీయ గణపతి నెల్లూరు వచ్చి, తిక్కరాజును సింహపురి సింహాసనాధిష్టుని జేసి, దక్షిణదేశయాత్రకు వెడలినాడు.
తిక్కభూపతి ఓరుగంటివారి సామంతుడుగా చుట్టుపట్ల రాజ్యములను ఆక్రమించుకొని "చోళస్థాపనాచార్య" బిరుదమును ధరించినాడు. ఈ విజయయాత్రలను, కవి తిక్కన 1234-46, మధ్య నిర్వచనోత్తరరామాయణమున కీర్తించినాడు.
★వీరగండ గోపాల — ఇమ్మడి మనుమసిద్ధి
తిక్కభూపతి కొడుకు-ఇమ్మడి (రెండవ) మనుమసిద్ధి నెల్లూరు రాజ్య ప్రభువైనాడు. కాకతి గణపతిదేవునికి, కళింగులతో జరిగినయుద్ధమున, మనుమసిద్ధి సహాయపడి గెలుపు గొనినాడు. దీనితో కాకతీయ-చోళమైత్రి దృఢమైనది. ఈ మనుమసిద్దికి వీరగండ గోపాల అని బిరుదము.
బయ్యన-విజయగండ గోపాలుడు, కంచిరాజ్యమును ఏలుచుండగా, జటావర్మ సుందరపాండ్యుడు 1260లో దండయాత్ర సలిపి, విజయుని ఓడించి, నెల్లూరు చోళుల అర్ధరాజ్యమును స్వాధీనము చేసికొనినాడు.
1251-57 నడుమ, ఈ సుందరుడే, నెల్లూరుపై రెండుమారులు ఎత్తి వచ్చి పారిపోయి ఉన్నాడు. ★తిక్కన బయ్యనల తిరుగుబాటు; ఖడ్గతిక్కన వీరమరణము
ఇమ్మడి మనుమసిద్ధి (తిక్కయజ్యమిత్రుడు) తండ్రి-తిక్కభూపాలుని పెద్దభార్య తమ్ముడు తిక్కరాజు. ఇతడు తిక్కభూపతి కూతురును పెండ్లాడి, నెల్లూరువారి ప్రతినిధిగా కాంచీపురములో అధికారము సాగించుచుండినాడు. దీనితో ఇతనికి సింహపురి రాజాస్థానమున మంచిపలుకుబడి లభించినది. దీనికిదోడు పరాక్రమశాలిగూడ, తిక్కభూపతి రెండవభార్య కొడుకే మన మనుమసిద్ధి. తిక్కరాజుకు సింహపురి రాజ్యలక్ష్మిపై కన్ను బడినది. దీనికి కలిసికట్లుగా విజయాదిత్యుడను దూరపుచుట్టముగూడ దాయాదిపోరు లేవదీసినాడు. వీరిద్దరు, కర్ణాటకులు మొదలగు ప్రక్కరాజులతో చేతులు గలిపి, ఉమ్మడిదండుతో నెల్లూరుపై బడినారు. నెల్లూరులో పాలించుచుండిన తిక్కభూపాలుడు పరాజితుడైనాడు; కడపలో మండలాధికారిగానుండిన మనుమసిద్ధి పలాయితుడైనాడు. ఈ కల్లోలములోనే ఖడ్గతిక్కన వీరమరణము.
ఈ తిక్కన, కవి తిక్కన పెద్దనాయన-సిద్ధనపుత్రుడు. ఇది "తిక్కన-పరిహారి బయ్యనల తిరుగుబాటు" అని, 1249 లో జరిగినదని ఓరుగల్లు గణపతిదేవుని శాసనము చెప్పుచున్నది. ఈ తిరుగుబాటు చేసిన తిక్కన మనకు దెలిసిన మనుమసిద్ధి పెద్దమ్మ తమ్ముడే! వ్రేలు విడిచిన మేనమామగూడ, పరిహారి అంటే-ద్వారపాలకుడు. తిక్కరాజు, తిక్కభూపతి అంతఃపురసేవకుడైన బయ్యనను లోగట్టుకొని, చంపించుటకు కుట్ర బన్ని యీ తిరుగుబాటును లేవదీసియుండును.
★కాటమరాజు కథ
కాటమరాజు కఱియావుల రాజు అనే ఆయనకు, మనుమసిద్ధికి, ఆవుల పులవరివిషయమై ఒప్పమి పుట్టి, చివరికి యీ వివాదము పెద్దయుద్ధముక్రిందికి దిగినది. ఆ యుద్ధమందు (పెనుబల్ల చెరువు) ఖడ్గతిక్కన మొదట ఓడి, ఇల్లు చేరుట, వీరపత్ని చానమ్మ చేసిన గేలిక మగసిరి పొంగి మరల యుద్ధభూమికి వెడలి వీరస్వర్గ మలంకరించుట — అనునది అతివ్యాప్తమై యున్నకథ.
ఇట్టి వీరగాథలు {Ballads) బయకారములు (Musical Compositions) ద్విపదలో రచింపబడి, మాలదాసరులు, జంగమదేవరలు, బైనాటివారు మొదలగువారికి బాగా నోటికి వచ్చి, పల్లెల చవికెలలో, చావళ్లలో పాడబడి, వినిన గ్రామీణులనెత్తురు వేడి ఎక్కించి, కండలు కదలించేవి, పల్నాటియుద్ధము, బొబ్బిలియుద్ధము, చిన్నమ్మ-లక్ష్మమ్మ-కామమ్మ కథలు, దేశింగరాజు కథ — (దీనిని వ్రాసినది నెల్లూరు వాస్తవ్యుడు-జంగము వీరయ్యదేవర) మొదలగు వీరగాథలు ఇందు ముఖ్యములు, భారతరామాయణాదులు గూడ మంజరీద్విపద — రగడ మొదలగు ఛందములలో ప్రచారములో నున్నవి. ఇవి విని, సీతమ్మకష్టాలకు కంట తడిబెట్టని తెనుగువారు లేదు. ఇదంతా సినిమాలకు ముందు జానపదుల మురిపించిన మంచిదినాల ముచ్చట.
ఇట్టి మంజీరద్విపద వీరగాథయే ఈ కాటమరాజు కథ. ఇది ఎంత ప్రచారమునకు వచ్చిందంటే — "రామాండకతలెల్ల మే మెరుంగని పనే? కాటమరాజుకు కర్ణుడోడె" అని వేణుగోపాలశతకము పండితబ్రువులను ఎగతాళి పట్టించుచున్నది.
ఇది ఇంతటి ప్రాణమున్న రచన అయినా చరిత్రకు సంబంధించినట్లు లేదు. మనుమసిద్ధికి మొదలే సంబంధము లేనిది. దీనిని రచించిన లోకకవి-గంగుల యెల్లయ్యకొడుకు, పినయెల్లయ్య. ఈ జంగమకత (బుఱ్ఱకథ) ఇంతటి ప్రచారమునకు వచ్చుటకు, ఈకవి వీర్యవంతమైన జీవకవిత్వమే కారణము.
ఈ కావ్యములో, నెల్లూరు రాజు పల్లవ నల్లసిద్ధి అని ఉన్నది. ఈనల్లసిద్ది చోళుడు గాని పల్లవుడు గాదు. ఆవులు మేసిన బీడులు కనిగిరికి ఆవల, నల్లమల అడవులు, అందుచేత అప్పటి నెల్లూరుసీమను నల్లమల తాకదు, నల్లమల కర్నూలు ప్రాంతము. ఇదే తూర్పుకనుమలకు కడప మండలమున ఎఱ్ఱమల అని (అహోబిలమున్న కొండలు) నెల్లూరు జిల్లాలో వెలిగొండలని (పెంచలుకోన) పేర్లు, ఇంతేగాక ఈ కథ 1630 తర్వాత వ్రాయబడినట్లు క్రింది చరణములు చెప్పుచున్నవి:
| | ప్రళయకావేరి మైలాపురంబు గల్పి | |
దీనివల్ల కథ ఎప్పటిదైనా వ్రాతమాత్రం ఆంగ్లేయుల భారతదేశప్రవేశానంతరమేనని తేలుచున్నది.
తిక్కన బయ్యనల తిరుగుబాటు జరిగినతర్వాత దీనిని ఏదో ఒక పేదరాజు పెద్దమ్మ చెప్పిన కథగా నిర్ణయింపవచ్చును. అయితే నేమి? ఈ రచన ఆంధ్రజానపదగేయవాఙ్మయములో కండ ఊపిరి గలిగినది.
తిక్కన బయ్యనల బెడదను తప్పించుకొనుటకుగా, తమ పూర్వపరిచయమే దారిబత్తెముగా మహాకవి తిక్కన, తన యువరాజు-చెలికాడు మనుమసిద్ధికొరకు ఏకశిలానగరము వెడలినాడు. ఆనాటిదారి ఏలేశ్వరముమీదుగా సాగినది. ఏలేశ్వరము, నాగార్జునకొండకు ఉత్తరాన, కృష్ణకు ఆవలి ఒడ్డున ఉన్న పురాతనమైన, శిథిలత గన్న పట్టణము. ఇచట చారిత్రక పరిశోధకఖననములు జరుగుచున్నవి. ఇక్కడ దొరికిన ఒక శిలాశాసనములో మనుమసిద్ధి ఆత్రోవన ఓరుగంటికి పోయినట్లున్నది. బహుశః ఇద్దరూ పోయి ఉందురేమో? మనుమసిద్ధి, నాగార్జునకొండలోయలో దక్షిణపుమొగదలలో నేడు ఉద్ధరింపబడియున్న రంగనాథాలయమును నిర్మించినాడు.
ఇంతలోపలనే, మనుమసిద్ధితండ్రి-తిక్కభూపతి మరణించినాడు. అచట గణపతిదేవుడు కవిబ్రహ్మకు గొప్పగా గౌరవములు జరిపి, స్వయముగా సేనల నడిపించుకొని వచ్చి, వెలనాటి చోళరాజులు మొదలగువారిని నిర్జించి, మనుమసిద్ధిని సింహపురీసింహాసనారూఢునిగా జేసి, గౌరవింపబడినాడు (1249). కవి నడిపిన ఇట్టి రాజకీయ దౌత్యము ప్రపంచచరిత్రలో అరుదేమో! ఈ విప్లవయుద్ధములో మనుమసిద్ధియే విజృంభించి, తనకు ద్రోహము చేసిన విజయాదిత్యుని స్వయముగా సంహరించి కసి దీర్చుకొనినాడు.
★మనుమసిద్ధి రణమరణము
జటావర్మ సుందరపాండ్యుడు రాజరాజచోళు డంతటివాడు. కృష్ణదేవరాయలదాక, ఆమధ్య అంతటివిజేత లేడు. “సమస్తజగధార – హేమాచ్ఛాదనరాజ (దేవాలయ విమానములకు బంగారునీరు తొడుపులు వేయించినవాడు) మహారాజాధిరాజశ్రీ పరమేశ్వర – మరకత పృథ్వీభృ త్కాంచీపురం కొండాన్ (జయించినవాడు) రాజతపన - కర్ణాటక లక్ష్మీబంధన కాటకకులతిలక - సర్వజ్ఞ ఖడ్గమల్ల - కవీశ్వరభౌమ – సాహిత్యరత్నాకర” మొదలగునవి ఈ పాండ్యుని బిరుదావళిలో కొన్ని.
ఇతనికి నెల్లూరుపై కన్ను 1251 నుండియే ఉన్నది. 1260 లో మరల పెద్దఎత్తున తన తమ్ములసహాయంతో ఎత్తివచ్చినాడు. మొదట కంచిని పట్టుకొని, మనుమసిద్ధి బంధువు - విజయగండగోపాలుని పారద్రోలినాడు. ఆవల తనసైన్యమును రెండుగా చీల్చి, ఒకదానిని కడపమీదుగా త్రిపురాంతకము చేర్చి, అచట కాకతీయసైన్యమును ఓడించినాడు. తాను స్వయంగా, సముద్రంమీద నెల్లూరుకు, ఆగ్నేయముననున్న కండ్లేటి ముఖద్వారం ప్రవేశించి, ముత్తుకూరుయుద్ధములో నెల్లూరుసైన్యముల ఓడించి, మనుమసిద్ధిని వీరస్వర్గ మలంకరింప జేసినాడు. (1263).
ఓరుగంటి గణపతి 1261 లోనే దివంగతుడైనాడు. తిక్కన సోమయాజి 1258 (సెప్టెంబరు)లో, కాళయుక్తి భాద్రపదమున బ్రహ్మమును చేరినాడు.[4] ఇక నెల్లూరు రాజ్యలక్ష్మికి దిక్కెవరు? జటావర్మ, విజయోత్సవముతో సింహపురము ప్రవేశించి, చిత్తరి మేళ్ విణ్ణగరు (=శ్రీొొవైకుంఠము; నేటి రంగనాయకులపేట)నందు, తిరుప్పాలకడలి (=క్షీరసాగరము; దేవళము) యందు, పళ్లికొండు పెరుమాళ్లు (=శయననారాయణ; ఇప్పటి తల్పగిరి రంగనాథస్వామి)కు కైంకర్యము చేసి, మాన్యము లిచ్చి, మండపములో వీరాభిషేకము చేసికొనినాడు. తిరిగిపోయి కంచిలో రెండవ వీరాభిషేకము చేసినాడు. అనగా, సింహపురిరాజ్యరాజధానులు రెంటియందును అభిషేకింపబడినాడు.
తిక్కన నవనవోన్మీలనముతో తెనుగుకవితను వెలయింపజేయుచుండిన, ఆకవితాకన్య పెండ్లిసమయములో, నెల్లూరు మండలమున రాజభాషగా తమిళము ప్రచారములో ఉండినట్లు శాసనములు తెలుపుచున్నవి. అవును! తమిళగం నడిబొడ్డున — తంజావూరు, ఒరయూరు, సింజి (జెంజి), మధుర, పుదుక్కోటలందు తెనుగుగడ్డలు రూపొంది, ఆంధ్రవాఙ్మయమును ప్రోదిచేసిన విధమేగదా ఇది? తిక్కనకు తమిళముగూడ వచ్చియుండవలెను, కాని దీనికి ఆధారములు దొరుకలేదు.
2. తిక్కన జన్మాదికములు — ఒక కొంత
★వంశము
కవి కేతన చెప్పినట్లు “అనితరగమ్యవాఙ్మయమహార్ణవకర్ణధారి, కళావిదుడు, పరహితార్థి" అయిన తిక్కన కొట్టరువు కొమ్మన - నెల్లూరు ఆడబడుచు, అన్నమ్మకు, కారణజన్ముడై, రాజకీయమతవాఙ్మయప్రపంచమున ధర్మసంస్థాపనార్థము పుట్టిన పూర్ణపురుషుడు — ఈ బ్రాహ్మణుడు. తిక్కన తాత-మావెన, 1137 ప్రాంతాన, గుంటూరు సత్తెనపల్లి పరిసరములందు వెలనాటిచోళుల శుల్కాధికారిగా పని చేసినాడు. మావెనకొడుకు కేతన. ఈ కేతన ముగ్గురికొడుకులలో నడిమివాడు భాస్కరుడు. ఈయనే "సాహిత్యవిద్యాపారీణుడు" — తెనుగులో రామాయణము వ్రాసిన మొదటివాడు. కవి తిక్కన పితామహుడైన యీయన గుంటూరువిభు డైనాడు.
అప్పుడు వెలనాటిచోళుల ప్రాభవము తరిగి, నెల్లూరుచోళుల అధికారము పెరుగుచుండినది. రాజ్యాధికారము చవిచూచిన భాస్కరుని నలుగురి కొడుకులలో ముగ్గురు రాజాశ్రయముకొరకు నెల్లూరు తిక్కభూపాలుని ఆస్థానమును చేరినారు. వీరు — కేతన, మల్లన, సిద్దన. "సారకవితాభిరాముడైన” భాస్కరునిపేరు, "కవిసార్వభౌముడు" అని పేర్గాంచిన తిక్కభూపాలుని నెల్లూరు కొలువుకూటములో మారుమ్రోగియే యుండినది. అందులో, కేతన “నవరసభావభావుకుడు" ఇక సహృదయుడైన ఆ రాజు చాచినబారలతో కేతనను ఆహ్వానము చేసియుండడా? మల్లనగూడ ఆ దివాణములో చేరుకొనినాడు. ఈయన తనకొడుకుకు, తిక్కభూపతి తండ్రి — మనుమసిద్ధి పేరునే పెట్టుకొని నెనరు చూపినాడు.
మూడవవాడైన సిద్దన “సామాద్యుపాయపారగుడు — ఉదారనృపనీతి బృహస్పతి” అగుటచే పాలనాశాఖలో ప్రవేశించి ఆప్తమంత్రి అయినాడు. ఈ సిద్ధనపుత్రుడే "గంధవారణ" బిరుదాంకితుడు — ఖడ్గతిక్కన. ఈశూరుని [5]"వీరకల్లులు" — ఒకటి సోమేశ్వరాలయమున (సోమశిలదగ్గర), ఇంకొకటి, నెల్లూరు — మూలప్పేటలో, మూలస్థానేశ్వరస్వామివారి గాలిగోపురమునకు వెలుపల, దక్షిణపుమొత్తలో నున్నది.
ఇక భాస్కరుని నాల్గవకొమారుడు — కవి తిక్కన తండ్రి — కొమ్మన గుంటూరు విభుడుగనే, అచట ఉండిపోయినాడు. క్రమేణా గుంటూరువారు కొట్టరువువారైనారు. కొట్టరువు అనగా, ధాన్యాగారము; బహుశః కొమ్మన రాచగాదెలపెత్తనంలో ఉండుటచే ఆ యింటిపేరు వచ్చియుండును. ఆతర్వాత యీ వంశమువారు నెల్లూరు వచ్చి పాటూరువారైనారు.
★జన్మస్థానము
తిక్కన పాతగుంటూరులోనే పుట్టినాడు అనినదానిని మాటవరుసకు ఒప్పుకొనినా, ఆయన పురిటిపొత్తిళ్లతో ఉయ్యెల ఉగ్గుగిన్నెతో ముక్కుపచ్చలారకముందే నెల్లూరు చేరి, పెన్న నీరు త్రాగి ప్రోది అయిన విజ్ఞాని అని మాత్రం అందరూ అంగీకరించవలసినదే!
కానీ, నెల్లూరులోనే పుట్టియుండుననుటకు ప్రబలకారణము లున్నవి —
అమ్మమ్మ ఇంట; అనగా మేనమామఇంట, ఆ ఇంటి ఆడుబిడ్డ మొదటికాన్పు చేయుట తెనుగువారికి వాలాయము. అట్లే అన్నమ్మ నిండు చూలాలుగా అమ్మవారింటికి నెల్లూరు వచ్చి యీ తేజోనిధిని కనియుండవచ్చును.
ఉద్యోగపాలనముకుగా, కొమ్మన గుంటూరులో ఒక బసమాత్రమే పెట్టియుండును. ఇక ఆయన బంధువులందరు నెల్లూరులో అన్నిరంగములందును పాతుకొని బలసిపోయి ఉన్నారు. కాబట్టి కొమ్మన ఉనికి ఎక్కువకాలము అత్తవారింటనే అయి ఉండవలెను.
★పేరు
'తిక్కన' అన్నపేరు తిరుక్కాళ (=శ్రీకాల) శబ్దభవము. ఇది తమిళము. తిక్కన భారతము తెనుగున వ్రాసే దినాలలో, ఇచట తమిళసంప్రదాయములు బాగా అలముకొనియుండినవి. అంతేగాకుండ, నెల్లూరు రాజులపేరులలో "తిక్క" ఎక్కువగనే కాన్పించుచున్నది. అందుచేత గుంటూరువారు నెల్లూరుకు స్థానికమైన యీపేరు పెట్టుకొనియుండరు. 1168-69 సంవత్సరమున వేయించబడిన, సన్నమూరు (పొదిలి, మారెళ్లసీమ) శాసనమున, ఆ దానమునకు సాక్షి చేవ్రాలు చేసినది మాఱువూరు తిక్కన. (Nellore District Inscriptions. Vol. III. Page 120, Butterworth & Venugopala Chetty) ఇది మా మరుపూరేమో! దీనివల్ల తిక్కన అనేపేరు నెల్లూరుమండలములో చాల ప్రాచీనకాలమునుండి వాడుకలో ఉన్నట్లు తెలియుచున్నది. నెల్లూరులో పుట్టిన కవి తిక్కనకు అట్టిపేరు పెట్టియుందురు. తల్లి అన్నమ్మ పేరు ఇప్పటికిని నెల్లూరులో వినబడుచునేయున్నది.
తిక్కన మేనమామయింటనే పెంచబడినాడు. అప్పుడే మనుమసిద్దికి యీయన సహనాసగాడైనాడు. తిక్కన రాజపుత్రునికంటె కొంచెము పెద్ద అగుటచే ఆటలాడుకొనుచు, రాజు ఆ బ్రాహ్మణుని "మామ" అని నోరార బిలిచి, ఒకేబడిలో గూడ చదువుకొనియుందురు. కవిసార్వభౌముడు శ్రీనాథుడు, విదేశవ్యాపారి కలికివాయి బిట్రగుంట అవచి తిప్పయ్యశెట్టి ఇట్టి స్నేహమునే కలిగియుండినారు. ఇట్టిదీ! ఆనాటి అకలుషితసాంఘికవాతావరణము. ఈ 'మామ' అన్న పిలుపు సార్థకముగానేమో, తిక్కన తనప్రథమకావ్యకన్యక — నిర్వచనోత్తరరామాయణమునకు బాల్యసఖుడు — మనుమసిద్ధి రాజును కృతిభర్తగా జేసినాడు.
★తిక్కన సంపద — సద్యశము
తిక్కన చుట్టపక్కములతో నెల్లూరు రాచదేవిడి నిండిపోయి ఉన్నది. మన కవి కుటుంబము పెన్నకు ఉత్తరాన, నెల్లూరుకు 5, 6 మైళ్ళలో పాటూరుగ్రామమున స్థిరవాస మేర్పరచుకొనినది. మొన్నమొన్నటివరకు వీరివంశమువారు ఇచటనే ఉండి, ఈమధ్య యిల్లువాకిలి పొలము అమ్ముకొని హైదరాబాదు చేరినారు. ఆ ఇల్లు-ఆ పాతబావి-వీరి కులదేవత అయిన సిద్దేశ్వరుని ఆలయము, తగిన మర్యాదలు లేక నేడు బావురుమనుచున్నవి. తేజోమయ అమృతాక్షరముల సృష్టించిన తిక్కయజ్వ గంటమును కాపాడుచుండిన, పవిత్రీభూతమైన ఒరమాత్రము, సిద్ధేశ్వరాలయములో పూజ లందుచున్నది. దీనిని మొన్నమొన్నటివరకు ఈవంశీకులే ఆరాధించుచుండినారు.
ఇప్పుడు పాటూరువారి వంశశాఖ ఒకటి ఇందుకూరుపేటలో శాఖోపశాఖలై సంపదాకరముగ నున్నది. కరణంగా ఉండిన పాటూరు ఆదినారాయణయ్య కవి పండితుడు. తిక్కన కొడుకు బొమ్మన; పౌత్రుడు హరిహరనాథుడు.
ఆనాడు తిక్కనసంసారము సంపత్పూర్ణముగ నుండినది. అది ఒక చిన్నరాచకొలువు! నిరతాన్నదానము, విద్యాదానములతో, ఒక కులపతి ఆశ్రమమువలె, ఆంధ్రదేశమందంతటా వైజ్ఞానికప్రభలను ప్రసరింపజేయుచుండినది. దానిని " దేవేంద్రసమానవిభవము” అని, చూచిన కేతనాదులు వర్ణించినారు. తిక్కన శిష్యకోటి పెద్దది, విద్యార్థులకు అన్నం బెట్టి చదువు జెప్పినాడు. తన చెలికాడు-మనుమసిద్ధికి తీసిపోని రాచపోకడలతో మని, భాసించినాడు. దీనికిగా ఆనందమేగాని అసూయ ఆ రాజు మనసులో పొడచూపలేదు.
★తిక్కనకవి జనాదరణము
"కవిజనరాజకీరసహకారము — కవిసరోజమార్తాండుడు — పోషితసత్కవీంద్రుడు — పండితపుండరీకవనపంకజబాంధవుడు — కవీంద్రలోకాధారుడు — సుకవీంద్రబృందరక్షకుడు —" ఇట్టివి, వేంగినుండి వచ్చి, పాటూరులో తిక్కన చల్లటినీడలో చేరిన, అభినవదండి - కేతన, తిక్కన మనీషి కీర్తిమూర్తిని పూజించిన పూజాసుమములు. కేతన తన దశకుమారచరిత్రను యీ కవిబ్రహ్మకు అంకిత మిచ్చినాడు. ఈ అంకిత మిచ్చే సంప్రదాయము తెనుగునాటనే, నెల్లూరుసీమలోనే పుట్టి పెరిగినట్లున్నది. ఇంతేగాదు, ఒక కవి ఇంకొక కవికి గ్రంథమును అంకిత మిచ్చుటకు గూడ ఇదే మొదలేమో! కవి తిక్కన రాజకీయదౌత్యము - కృతి భర్తృత్వములు అపూర్వములు. ఆనాటి పాండిత్యమునకు సోమయాజి అంగీకారముద్ర, ఒక పట్టభద్రతవలె ఎన్నబడుచుండేది. అనంతామాత్యుని తాత - బయ్యనకు, తిక్కన “భవ్యభారతి” అను బిరుద మిచ్చి, సాహిత్యముద్రాధికారమును నిలుపుకొనినాడు. కాబట్టే కవిబ్రహ్మ “మిత్రోదయజృంభితహృదయుడు” అని జేజేలు గొనినాడు. మార్కండేయపురాణకర్త - మారన తాను ఈమహాభాగుని శిష్యుడని చెప్పుకొని మురిసిపోయినాడు. నాచన సోమునికి తిక్కనపై గల గౌరవము ఇంతింత గాదు.
గంగాదేవి, మధురావిజయమనే తన సంస్కృతకావ్యమున, ఆంధ్రకవులలో ఒక్క తిక్కనకే అంజలి సమర్పించినది; ఇది అపూర్వము! ఈమె, నెల్లూరుమండలమున ఉదయగిరి దుర్గము నేలిన కంపరాయని భార్య.
★ఓరుగంటి సందర్శనము — చారిత్రకకావ్యములు
తిక్కయజ్వ ఏకశిలానగర దర్శనము, చారిత్రకమతసాహిత్యపరముగా అత్యంతప్రాముఖ్యమైనది. భారతీయులు చరిత్రపై కన్ను బెట్టి దానిని ఏర్పరించక, పురాణములతో కలిపివేయుటచే చరిత్రహీనులమని వగవవలసినదేగాని, హీనచరిత్రులము మాత్రము గాము. అంతకుముందే బాణుని హర్షచరిత్ర (గద్యము), కల్హణుని రాజతరంగిణి (పద్యము) అను కాశ్మీరదేశచరిత్ర మొదలగునవి సంస్కృతమున వెలసియుండినవి. ఇట్లే తెనుగుసాహిత్యమునకు భిత్తిమూలము లనదగినవి రెండు గ్రంథములు పద్యరూపమున, మరియొకటి గద్యమున నున్నవి. ఈ మూడునూ కాకతీయవంశచరిత్రలే అగుట ఇంకొక విశేషము.
మొదటిది:— ప్రతాపచరిత్ర, గద్యము, ఏకామ్రనాథవిరచితము. చరిత్రాంశములు సరిగా సూటిగా చెప్పబడి ఉన్నవి.
రెండవది:— కాసె సర్వన్న అను బ్రాహ్మణుడు వ్రాసిన శ్రీ సిద్ధేశ్వరచరిత్ర. ఇతడు 1550–60 కాలమువాడు. ఏకామ్రనాథుని వచనరచననే మంజరీద్విపదగా వ్రాసినాడు. చివరన; ప్రతాపరుద్రుని ఉదంతము మాత్రము గద్యమున నున్నది. సిద్ధేశ్వరుడు, అనుమకొండ దేవాలయములలో, ఒక కోవెలలో వెలసిన దేవుడు.
మూడవది:— కవిసార్వభౌమ కూచిమంచి తిమ్మకవి తమ్ముడు తిట్టుకవిత్వపుచక్రవర్తి — జగ్గకవి వ్రాసిన సోమదేవరాజీయము అను పద్యకావ్యము. ఇది రసవత్తరరచనము (1700–1720). ఈ దూర్వాసుడు చంద్రలేఖావిలాసమును విలాపము చేసినట్లు ఈ రాజీయమును రాజానలము చేయకుండుట ఆంధ్రులచరిత్ర అదృష్టము. సోమదేవుడు కాకతివంశకర్త. కూచిమంచి సూర్యాపేటకు ఉత్తరమున దగ్గరలోనే ఉన్నది. అందువల్ల ఈ రాజవంశచరిత్రను చేబట్టను యీయనకు ప్రాంతీయాభిమానమే కావచ్చును. ఈ చక్కటి కావ్యమును, తణుకు నరేంద్రనాథమండలివారు ప్రచురించినారు.
★తిక్కన — వైదికమతపునరుత్థానము
ఏకశిలానగరసామ్రాజ్యములో జైనబౌద్ధములు, వైదికమతముతో బాటు ప్రక్కప్రక్కన ప్రబలియే యుండినవి. కాని, కొన్నిచోట్ల మైలారవీరులను వీరశైవగణము విజృంభించి, బౌద్ధజైనులపై బడి గారీయపెట్టుచుండుటచే మతకలహములు రేగి దేవునిపేర రక్తవసంతోత్సవముల సాగించిరి. అప్పుడు ఒకమతసదస్సు జరిపి మతసామరస్యమును సాంఘికశాంతిని నెలకొల్పవలెనని గణపతి సార్వభౌముడు సంకల్పించినాడు. తదనుగుణ్యముగ ఒక పండితసభ జరుపబడినది.
ఆ సభకు ఓరుగంటికి బౌద్ధజైనపండితులు అనేకులు వచ్చినారు. కాని, వైదికమతపక్షమున వాదించుటకు, నెల్లూరునుండి ఒక్క కవి తిక్కననే పిలుచుకొనిపోయినారు. ఇది 1249 వత్సరప్రాంతము. ఇప్పటికే తిరుక్కాలుడు సోమయాజియై భారతమును ఆంధ్రీకరించియున్నాడు. (1245-49) సోమయాజి, కొన్నినూర్లమంది శిష్యులు గొలువ, ఒక రాజాధిరాజవైభవముతో, ఆధ్యాత్మికసాహిత్యప్రభలతో ఆంధ్రనగరు చేరినాడు. జగ్గకవి వర్ణించినతీరు చూడండి (సోమదేవరాజీయము).
| గీ. | "...................... | |
| సీ. | వచ్చిన, యయ్యార్యవర్యు నెదుర్కొని | |
దీనితోగూడ ఆ రెండుమతములవారు దేశమును వదలిపోయిరి. మిగిలినవారు వైదికాచారసంపన్ను లైనారు. బౌద్ధజైనాలయములు కూలద్రోయించబడినవి.
| | "దేవరాజు సోమయాజుల పటువాక్యశక్తికి మెచ్చి, యతని బహుప్రకారంబుల | |
తనప్రభువు మనుమసిద్ధికి గలిగిన అక్కన (తిక్కన) బయ్యనల పోరుసంగతి జెప్పి సహాయ మడిగెను.
| | “అట్ల కాక యనుచు...... | |
తర్వాత గణపతి ససైన్యముగ నెల్లూరుకు బయలుదేరి, మనుమసిద్ధిని పునరభిషిక్తుని జేసిరి.
ఇక, ఈ విషయమునే కాసె సర్వప్ప సిద్ధేశ్వరచరిత్ర ఇట్లు వర్ణించుచున్నది:—
"ఆరీతి గణపతి నటు జూచువేడ్క
దిక్కన సోముడు నక్క డేతెంచె.
నొక్కొక్కపండితుల్ వక్కలాకులును
జక్కనితాంబూల(సమితులతోడ)
నొక్కపెట్టున రాగ నక్కజంబుగను
దిక్కుదిక్కులనుండి వెడలి విద్యార్థు
లక్కడ నక్కడ కావ్యశ్లోకార్ధ
మొక్కొక్కవిధమున నొగి వినిపించి,
జక్కన వినుచును, మిక్కి లందలము
నెక్కి తిక్కన సోము డక్క డేతెంచె.
నారీతిగా సోమయాజులరాక
వారక తా ఫణీహారు లేర్పరుప
గణపతి మహరాజుగా రెదుర్కొనిరి.
............................
భారతశాస్త్రప్రవీణాగ్రగణ్యు
డారీతి వేదశాస్త్రాభ్యాసవిదుడు
చాల విద్యావిద్య(?)జాలంబు లెల్ల
పాలు నీ రేర్పరుప (గల) హంసుండు
నట్టి మహాత్ముని నా సోమయాజి
నెట్టన నెదురేగి నేర్పుగా రాజు
తెచ్చి యర్హాసనస్థితుని జేసి;
............................
పూజించి యందర పూర్వోక్తముగను
యోజించి శాస్త్రంబు లొకకొన్ని వినుచు,
గొన్నిదినంబులు మన్నన నుండె.
తిక్కన సోమయాజులు నక్కజముగ
పెక్కులుగా జెప్పె నొక్కొక్కయర్థ
ద్వైత మద్వైత ముత్త(మ) జీవ దైవ
మతి, చిద్వివేకము లగు ధర్మమర్మ
మగు రాజనీతీయు నట, బురాతనుల
కగు భారతాఖ్యాన మా వీరవరులు
తగజేయు యుద్ధప్రకార పర్వములు
వినియు సంతోషించె......
ఆట నన్మకొండలో నతి బౌద్ధమతము
ఘటనగా వాదంబు గావలె ననుచు,
బౌద్ధులు తమ మతప్రావీణ్యశాస్త్ర
వృద్ధులు పాపసమృద్దులు వేదవి
రుద్దులు వాదసమృద్దులు, జైన
బౌద్ధుల బిలిపించి, పట్టి వాదించి
యోడించి శాస్త్రార్థపోడిమి గాగ!
..............................
ఆరీతి నోడించి, యా వసదు లెల్ల
గూలద్రోయించియు, గూడ నా దైవ
ముల, నా మతమంతయు మునుముట్ట నడిచి
నామంబు లణచియు, సీమ వెళ్ళగను
దోమలుగా జేసి తోలె వెళ్ళగను,
ముప్పదాఱైనట్టి మునిజైనవసతు
లొప్పగా గూలద్రోయించి, నరికించె
యందర జైనుల...............
సోమయాజులవారు సురుచిరోదండ
భీమపరాక్రమ బిరుదు లొప్పార...."
అంతట మెచ్చి సమ్మానించుట, నెల్లూరుకు సైన్య మంపుట వర్ణితమై యున్నది. జైనులను దోమలవలె తోలుట సోమయాజి పనియే గాని, వారిని చంపించుట మైలారువీరుల పనియైయుండును. ఇట్టి మతస్థాపనగౌరవము ఆంధ్రకవులలో మరి ఎవ్వరికిని లేదు. ఇతరకవులు తమకు చేసిన సమ్మానముల సొంతము చేసికొనిరి. కాబట్టే తిక్కనను పూర్ణపురుషుడని కేతన వర్ణించినాడు.
తిక్కన మనీషి గావించిన ఆంధ్రనగరీసందర్శనమును, ఆ ఓరుగంటి కవులు, రాచకీయవాదులు, మతాభిమానులు ఒక మహాసంఘటనగా భావించి నేటికిని ముగ్ధులగుచున్నారు. శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు 1942 సందుకట్లలో ఇట్లు ఒక రమ్యగీతము నాలపించి. నారు (పచ్చతోరణము-ఓరుగల్లు.):—
| | "తిక్కనామాత్యుండు, తెనుగుదేశపురాజు | |
రామానుజరావుగారు న్యాయశాస్త్రపట్టభద్రులు. మంచివ్రాతగాడు. కార్యభారనిర్వహణధురీణుడు. హైదరాబాదునందలి సాహిత్యసంస్థ “ఆంధ్రసారస్వతపరిషత్తు" ఈయన చేయివాసితో పెరిగి పెద్ద అయినది. వీరే ఈ సాహిత్య అకాడమీ కార్యదర్శి.
వైదికధర్మసంస్థాపనమునకు యీ సోమయాజి పథగాములయ్యే, ఆవల విద్యారణ్యులవారు విజయనగరసామ్రాజ్యమునకు హరిహర బుక్క రాయలచే అంకురార్పణము గావింపజేసినారు. ఆతర్వాత సమ్మర్థ రామదాసస్వాములవారు ఛత్రపతి శివాజీ మహారాజుకు ధర్మమార్గమును చూపినారు.
ఇందు విధిక్రూరవిలాసముగూడ గలదు — ఈ తిక్కన ఎలప్రాయమున నున్న ఆ దినాలలోనే, 1192లో, ఉత్తరమున, ఆ పురాతనపుణ్యకురుక్షేత్రమునందే, తరెయిన్ గ్రామమున (తానేశ్వరముదగ్గర) గోరీ మహమ్మదుతో యుద్ధము చేసి పృథ్విరాజు చౌహణుడు ఓడిపోయి, మేచ్ఛవాహినులు భారతదేశముపై బడి ముంచివేయుటకు కలుజులు దీసినాడు. ఓరుగల్లులో మతేతరులైన స్వదేశీయులు అణగిపోయినారు; కాని, అచట — ఉత్తరాన విదేశీయులైన మతవిరోధులు విజృంభించినారు.
★తిక్కననాటి సంఘటనలు
తిక్కనకాలమునాటికి, అటునిటుగా ప్రపంచచరిత్రలో కొన్నిముఖ్యఘట్టములను పరికించిన తిక్కనయుగవైశిష్ట్యము గోచరించగలదు! కరకు మంగోలుడు — జన్‌గిస్ ఖాను 1214లో ఆసియాఖండపు తూర్పుచివరనుండి, హిమాలయములకు ఉత్తరముగా లక్షలాదిమూకల నడపి ఆఫ్‌ఘనుస్థానము చేరి మానవరక్తముతో నేలను అసటు చేసినాడు. ఆవల ఇతనిసంతతివాడైన కుబ్లాయ్‌ఖాను విజృంభించినాడు (1240–60). గ్రీకులు కాన్‌స్టాంటినోపుల్ (ఇప్పటి ఇస్టన్‌బుల్) పట్టణమును పట్టుకొనినారు (1261). ఇటలీ మహాకవి, 'డివైన్ కామిడీ’ అను మహత్తరగ్రంథకర్త-డ్యాంటె జననమందినాడు (1265). కుతుబ్‌షా ఢిల్లీలో ముస్లిం రాజ్యమును నెలకొల్పినాడు. గంగవంశీకుడు మొదటి నరసింహుడు కోణార్కులో సూర్యదేవాలయమును (1255), రేచర్ల ఆరుద్రదేవుడు రామప్ప దేవళమును (1234)లో కట్టించినారు. ప్రపంచమున ప్రజలస్వామ్యమును ప్రప్రథమముగ గుర్తించిన మాగ్నఛార్ట (మహాస్వామ్యపత్రము) ఇంగ్లండురాజు ప్రజలకు అనుగ్రహించినాడు. (1215) మహామతి తిక్కనకాలములోనే పశ్చిమతీరమున ఉడిపిలో మధ్వాచార్యులవారు, తమిళరామాయణకర్త మహాకవి కంబరు వెలసియుండినారు. (తాత భాస్కరుని కాలమున)
★హరిహరనాథోపాసనము
క్షుద్రమతవైషమ్యములతో తోడివారినెత్తురు చిందించుట — “సర్వము న్నతనిదివ్యకళామహి మంచు" చాటు వైదికమతమునకు గిట్టలేదు. అందుచేత శివకేశవులను ఒకటి చేసి పూజించు సామరస్యమతప్రకారము ఆంధ్రదేశమున 8-వ శతాబ్దమునాటికే పుట్టి ప్రబలి నది. పల్లవరాజు-నరసింహుడు, నెల్లూరు ఉదయగిరిసీమలో, సీతారామపురమునకు ఈశాన్యమున 7, 8 మైళ్ళలోనున్న భైరవునికోనయందు, బౌద్ధవాస్తుశిల్పము ననుసరించి, ఏడుశివలింగాలయములను, గట్టికాశిరాతి (Granite) కొండలో మలిపించినాడు. (ఈ రమ్యమైన కోన, ఈ అపూర్వచారిత్రకసంపద, ఇప్పుడు కొత్త ఒంగోలుజిల్లాలో చేర్చబడినవి).
ఈ గుహాలయములవరుసకు ఎదురుగా, ఒక సెలఏటి ఒడ్డున ఒక పెద్ద నిడుపు చట్రాతి గేడిపాటున (నిలువుప్రక్కన) హరిహరనాథుని అర్ధమూర్తి చెక్కబడియున్నది. ఈ స్వామికి ఎనిమిదిచేతు లున్నవి. ఇందు ఇద్దరుమూర్తులు ఆయుధములు ఇరుప్రక్కల అలరారుచున్నవి. ఈప్రతిమకు ఎడమతట్టు, వామపార్శ్వమునకు భంగిమమును త్రిప్పియున్న నటరాజస్వామివారి ప్రతిమగూడ గలదు. ఈ పవిత్రశాంతిమగ్నవాతావరణములో హరిహరనాథోపాసనము ననవేసి దిక్కులకు తీగ లల్లినది. "సోమభృత్భక్తిమత్తుడు — లసితహరిపదపద్మైకావాసచిత్తమధుకరము” (కేతన) అయిన తిక్కయజ్వ యీ అర్చావిధానమును గ్రహించి వ్యాపింపజేసి, “హరిహరనాథ సర్వభువనార్చిత నన్ దయజూడు మెప్పుడు" అని ప్రార్థించినాడు (స్వర్గా-94). నాచనసోముడు ఈ కలగలుపువేల్పునే పూజించి, కృతిభర్తగా చేసినాడు. (14–వ శ.)
ఈ దేవుని ఉపాసించిన మరికొందరు ఆంధ్రకవులు:—
(3) కొరవి గోపరాజు (15-వ శ.) సింహాసనద్వాత్రింశక (4) దూబగుంట నారాయణకవి (16-వ శ.) పంచతంత్రము, (5) బైచరాజు వెంకటనాథుడు (16-వ శ.) పంచతంత్రము (6) కంభంపాటి నారాయణామాత్యుడు (16-వ శ.) భగవద్గీత-15-వ అధ్యాయము. (7) తాళ్ళపాక పెద్దతిరుమలాచార్యుడు (8) హరిభట్టు (16-వ శ ) నారసింహపురాణము. ఆధునికులుగూడ కొందరు గలరు.
ఈ మతము కన్నడదేశమునకు ప్రాకి హరిహరనగరము కేంద్రమైనది. ఆగ్నేయ ఆసియా-జావాలో యీ మూర్తులు దొరికినవి. ఈ వ్యాప్తికి సోమయాజి, పల్లవరాజ్యవైభవములే కారణములు. ఇట్లు ఉభయకవిమిత్రుడు శివకేశవ సామరస్య మతప్రవక్తగూడ అయినాడు.
బాదామి గుహలలో గూడ హరిహరమూర్తులు చెక్కబడియున్నవి. ఈ బాదామియే వాతాపి, వాతాపిపురము అనబడినవి. ఇప్పటి బీజపూరుజిల్లాలో హుట్టి- గదగ్ రైల్వేస్టేషనులమధ్య నున్నది. ఈ గుహలలో ఎల్లోరా, అజంతా (అజంఠా) గుహాలయములలోవలెనే జైన బౌద్ధ శైవ వైష్ణవ ఆలయములు మలవబడియున్నవి.
పశ్చిమ చాళుక్యరాజు-పృథ్వీవల్లభ బిరుదాంకితుడు-మంగలేశ్వరుడు క్రీ. శ. 578లో చెక్కించి పూజించిన మూర్తులివి. ఇవి భైరవునికోన దేవాలయములకంటె ముందు పుట్టినవి. ఇచట హరిహరనాథవిగ్రహములు రెండు గలవు.
1. ఇరుప్రక్కల దేవులుగల హరిహరనాథుడు.
2. ఒంటరిగానున్న హరిహరనాథుడు.
రెంటికిని నాలుగేసి చేతులే.
★నెల్లూరులో హరిహరనాథాలయము ఉండలేదు
నెల్లూరు పట్టణములో, ఇప్పటి రంగనాథస్వామివారి గుడివెనుక, పరమట, పినాకిని ఉత్తరవాహిని అయిన కునిలో (మలపులో) హరిహరనాథుని దేవళము ఉండినదని, ఆ దేవులమ్రోల తిక్కన కూర్చుండి, (కుమ్మరి గురునాథుని సహాయముతో) భారతము తెనిగించినాడని, అందరినోటా నానే వినికిడి. ఇట్లే పోతనామాత్యుడు, బమ్మెరలోనో ఒంటిమిట్టలోనో శ్రీరామాలయమున కూర్చుండి భాగవతం వ్రాసినట్లు పుక్కిటిపురాణము. ఇవి రెండును నిజములు గావు. "ఈదృశంబులగు పుణ్యప్రబంధములు దేవసన్నిధిం బ్రశంసించుచుండుటయు” (విరా. 1:31) అనిన దానినిబట్టి తిక్కన హరిహరాలయమున కూర్చుండి భారతమును వ్రాసియుండునని కొందరు, ముఖ్యముగా యితరప్రాంతములవారు తలంచుచున్నారు. కాని, వీరనుకొనేచోట నెల్లూరులో హరిహరనాథదేవాలయము ఎప్పుడూ ఉండలేదు. 5, 6 నూర్ల ఏండ్ల వరకు, పెన్నానది, ఇప్పటి దేవళమునకు ఎగువ, రెండుగా చీలి, ఒక అంతర్వేదిని (DOAB - దొ ఆప్ = రెండుపాయల నీళ్లు) ఏర్పరచినట్లు గట్టిగా తెలియుచున్నది. కావేరి కోలరూనుగా చీలి, శ్రీరంగమును గడ్డగా ఏర్పరచినట్లే, ఉత్తరపినాకిని, వృద్ధపినాకిని, ఇప్పటి రంగనాథస్వామి ఆలయప్రదేశమును ఏర్పరచియుండినవి. ఈ రెండుక్షేత్రములును శయనరంగనాథులవారివే? (వళ్ళికొండు పెరుమాళ్లు), ఇక ఆ కూడలిలో హరిహరనాథాలయ ముండు టెట్లు? శాసనములు, దేవాలయమును తిరుప్పాలకడలి (శ్రీదుగ్దవారాశి) అనుటకు గూడ ఇదే కారణము కావచ్చును. మైసూరు దగ్గర శ్రీరంగపట్టణము, అచటి శయననారాయణుడు గూడ కావేరీనదీఅంతర్వేదియందే వెలసిఉన్నాడు.
జక్కనకవి వర్ణనము యీ నెల్లూరు జనశ్రుతిని గట్టిచేయుచున్నది. విక్రమార్కచరిత్ర రచించిన జక్కన 1410 ప్రాంతమువాడు. ఈయన తాత పెద్దయామాత్యుని కాలమునుండి (1279) యీ కవివంశమునకు నెల్లూరుసీమతో సంబంధమున్నది.
తిక్కన మనుమసిద్ధి కొడుకు, రెండవ తిక్కరాజు జక్కన తాతను ఆదరించి యుండినాడు. జక్కన కవిసార్వభౌముడు శ్రీనాథునికాలమునాటివాడు. మల్లినాథసూరి యీ అదనుననే వ్యాఖ్యానములు వ్రాయుచుండినాడు.
విక్రమార్కచరిత్రలో ఒకనెల్లూరు నెఱజాణకథనం వ్రాయుచు (ఆ-7 : 132, 133, 184) (స్త్రీలు పాపములకు మూల మనుటకు ఒకకీరము చెప్పిన కథాఘట్టము.
| | "... సముద్రసౌధాగ్రతలసమగ్ర | |
"... రాజేంద్రుని నందన యారూఢస్మరవికార యౌవనలక్ష్మీ గౌరవనిధి, సకలకళాపారీణ, విలాసవతి” అవును! నెఱజాణే.
ఈ తండ్రి, పాటలీపుత్ర రాజు సుధర్ముని పిలిపించి కూతురు నిచ్చి పెండ్లి చేసినాడు. ఆమె ఒకనాడు చెలులతో గూడి అంగజారాధన చేయుచు, ఆమె కేలు మొగిచి "జలపక్షిపక్షపటలీసంఛన్నకుం బెన్నకున్" జయకార మొనరించెను. ఆవల ఆమె ఒక విప్రునితో కలయును లెండి; అదెందుకు మనకు ? ఇచట —
| | "అమృతసాగరవిభుని యర్థాంగలక్ష్మి | |
అని వర్ణించినాడు. నదులు గతులు మార్చుట, అంతర్వాహిను లగుట ఎరిగినదే గదా. ఈ దక్షిణపు పెన్నపాయ ఆవల క్రమేణా పూడిపోయినది. ఈ పాతచీలిక, ఇప్పటి రంగనాయకులపేట చిత్రకూటముమీదుగా, జేమ్సు గార్డను, ఉదయగిరివారితోట (ఇప్పటి లక్ష్మీపురము) నవాబుపేట నవలాకుతోటలు (9 లక్షలచె ట్లుండినవట)మీదుగా, ఇందుకూరుపేట మడుగులు అడుగుగా పారి, ఉత్తరముఖమై ఊటుకూరుదగ్గర సముద్రంలో గలసినదని, ఈ ప్రాంతమును వృద్ధపినాకిని అని ప్రజలు సహేతుకముగనే ఇప్పటికిని అంటున్నారు.
ఇం తెందుకు? తిక్కనయే “ఏను విన్నపంబు సేయుతెఱంగుగా నంతఃసన్నిధిని గలిగించుకొని, యిమ్మహాకావ్యంబు నర్థంబు సంగతంబు చేసెద (విరా. 1:37) అని చెప్పుచుండ, గుడిసంగతి మన కేల? రాజభవనసదృశమైన సొంతయింటనే యీ మహోజ్జ్వలకృతి నిర్మింపబడినది. ఇట్లే బమ్మెర పోతన గూడ “రాముని సన్నిధానమును సంకల్పించుకొని” భాగవతమును వ్రాసినట్లు చెప్పుకొని యున్నాడు. తిక్కన సోమయాజి, ఓరుగంటి కొలువుకు పోవుటకుముందే 1246–1249 నడుమ, భారతాంధ్రీకరణమును పూర్తిజేసియున్నాడు. ఈయన నిర్యాణము 1258 లో (కాళయుక్తి).
★ఆంధ్రభారతప్రశస్తి
తెనుగువారికి శ్రీరాముడు కులదైవము, రామమందిరము లేని ఊరుగాని, రామునిపటము లేని ఇల్లు గాని తెనుగునాట లేవు. భద్రాద్రి సీతమ్మే వీరి అమ్మ. ఇట్లయ్య, ఆంధ్రదేశములో ఆంధ్రభారతమున కున్న కీర్తివ్యాప్తి, దానిపై గల గౌరవము ప్రీతి రామాయణమునకు లేవు. భారతదేశమందంతటా రామాయణమే పారాయణగ్రంథము. ఆంధ్రలో ఈ కీర్తికి కవిత్రయమువారి ప్రజ్ఞయే కారణము. వారికవితాశక్తియే దీనిని నడిపించుచున్నది.
★ద్విపదభారతము
ఈ గౌరవమును పాటించే, ఇంకొక కవిత్రయము, ఆదిత్రయభారతమును అనుసరించి, భారతమును ద్విపదలో వెలయించినది. ఈ ముగ్గురిని కని పెంచిన గౌరవము నెల్లూరుమండలమునకే దక్కినది. వీరు, ఆత్మకూరు తాలూకా బట్టెపాటిగ్రామపరిసరములవారు. క్రీ. శ. 1500 ప్రాంతమువారు.
తిమ్మయ మొదటి 6 పర్వములు,
బాలసరస్వతి సభాపర్వము ఒక్కదానిని,
సోమన చివరి 11 పర్వములు వ్రాసినారు.
తిమ్మయ, విరాటపర్వమును, పంటకులావతంసుడు — జంగాల ముమ్మయరెడ్డికి అంకిత మిచ్చినాడు. ఇట్టి దీ నెల్లూరువారికి భారతముపై గల మక్కువ. (ఇది ఆంధ్రవిశ్వకళాపరిషత్తువారి ప్రచురణము.)
★కావలి వెంకటరామస్వామి ఇంగ్లీషుచరిత్రలో తిక్కన
ఇంగ్లీషులో మొట్టమొదటిసారిగా ఆంధ్రకవులను గూర్చి వ్రాసినది ఆంధ్రుడు — కావలి వెంకటరామస్వామి (1765–1840). తాను వ్రాసిన దక్కనుకవులచరిత్రలో 47 మంది ఆంధ్రకవుల జీవితాంశముల పేర్కొనియున్నాడు. (1829) ఈ కావలిసోదరులు నలుగురు. వీరిలో బొఱ్ఱయ్య, లక్ష్మయ్య, రామస్వామి — కాలిన్ మెకంజీగారిక్రింద పనిచేసి, వారి మెప్పులంది కైఫీయత్తులను సేకరించిరి. రామస్వామి విశ్వగుణాదర్శమను సంస్కృతకావ్యమును దీనికిముందే ఆంగ్లములోనికి అనువదించినాడు. చాల పలుకుబడి కలిగిన ఇతడు కలకత్తాలో లిటరరీ ఆన్‌టిక్వేరియన్ డిపార్టుమెంటులో అనువాదపండితుడుగా పనిచేసినాడు. గవర్నర్ జనరల్ - విలియం బెన్టిక్ ప్రభువుకే ఈకవులచరిత్రను అంకితము చేసినాడు. రామస్వామి రామరాజభూషణుని వసుచరిత్రనుగూడ ఇంగ్లీషులోనికి అనువదించినాడు. మూడుభాషలలోనికి ఎక్కిన (ఇంగ్లీషు-సంస్కృతము-తమిళము) తెనుగుగ్రంథము ఇదొక్కటే!
కావలి రామస్వామి తిక్కనను గూర్చిన దానిని ఉన్నది ఉన్నట్లుగానే పొందుపరచుచున్నాడు. భారతీయుడు వ్రాసిన ఆనాటి ఇంగ్లీషు-స్పెలింగులు గమనించదగియున్నవి:—
TEKKANA SOMAYAGI
This was a famous historian and poet, and a native of a village called Pature, in the Nellore district, he flourished in the twelfth century of Salivahana. When he was very young, he studied Sanscrit and Telugu under Kavi Rakshasa, and in a short time made very rapid progress in those languages. At the desire of Mania Sidharajee, he undertook to translate the Mahabharat into Telugu, and completed fifteen volumes in a comparatively short space of time, he was possessed of a quick genius and a ready talent at versification, in addition to a critical knowledge of the Sanscrit language. For this performance he obtained the grant of an extensive tract of land from the king, the greater part of the produce of which he expended in sacrifices; these religious acts procured for him the appellation of Tekkana Somayagi. This poet died universally lamented.
Cavelly Venkata Ramaswamie.
★కవిత్రయభారతము — తమిళానువాదము
కవిత్రయభారతమును ద్విపద చేసినట్లే. సుబ్బరామదీక్షితులు దీనినే తమిళములోనికి వచనముగా అనువదించి ముద్రించినాడు. సుబ్బరామదీక్షితులు ఎట్టియాపురం సంస్థానపండితుడు. ఆంధ్రాంగ్లద్రావిడభాషలలో పండితుడైన ఆ సంస్థానాధీశుడు — ఎట్టియప్ప జగదీశ్వర రామకుమార్ ఆదరముచే యీ కార్యము నెరివేరినది. ఈ ఆస్థానమునందే తమిళజాతీయకవి సుబ్రహ్మణ్యభారతి, ఆయన గురుతుల్యుడు అన్నామలై రెడ్డి వెలసియుండినారు. ఈ రెడ్డిగారే తమిళములో లోకప్రియత గాంచిన ఆండి పండారం” అను కావడి చెందును వ్రాసిననాడు.
3. తిక్కన కవితాసౌరభము
★ఆంధ్రావళి మోదమును పొరయుట
సర్వశాస్త్రముల, సాహిత్యశాఖల పరుపు లోతు కనుగొనిన తిక్కన మఖి "ఆంధ్రావళి మోదమున్ బొరయ" భారతము తెలుగుచేసినట్లు ప్రతిన! అంటే — ఆనాటి తెనుగువారికి, సర్వసామాన్యంగా అర్థమయ్యేటట్లు, వాడుకలో నుండిన జాను తెనుగునే వాడినాడు అనుట! తెనుగులో ఇది రెండవకృతియో మూడవగ్రంథమో; అంతవరకు మతము సంఘము రాజకీయము అన్నీ సంస్కృతమునందే సాగుచుండినవి. పురాణాదులు సంస్కృతమున చదువబడి తెనుగున చెప్పబడుచుండినవి. "మంత్రముతో బాటు భాషయు బ్రాహ్మణాధీనమై యుండినది, ఇక తెనుగుసేత అనగా, డు-ము-వు లుగా మార్చుటే కాకూడదు గదా. అందుకనే తేటతేనె తెనుగున, వైదికమతపునరుద్ధరణముకొరకు, అందరికీ తెలిసేటట్లు — సంస్కృతపండితునితో అగత్యము లేకుండ, అందరూ చదువుకొనేటట్లు పంచమవేదమైన భారతమును, తిక్కన తెనుగు జేసి ఆంధ్రావళికి మోదము కలిగించినాడు. మన ప్రాచీనకవులు ముఖ్యముగా పోతన, కన్నడ పంపడు తమనాటి వాడుకభాషనే ఉపయోగించినారు. కానీ ఇప్పటివారు కొందరు పెంపును ప్రాదనమును వలదనుటచే భాషాభివృద్ధి గిటకబారిపోగలదు. ఈ తెనుగుసేత బుద్ధుడు పాళీలో ధర్మప్రచారము చేయుట వంటిదే!
ఇక, ఆనాటి తిక్కన తెలుగు ఈనాడు అందరికి తెలియకపోయినదానికి కారణం - ఆ వాడుకభాష మారిపోవుటే. దేశీయనానుడులు మాటలు నుడికారములు మొదట సంస్కృతమునకు, ఆవల ఉరుదూ పారశీకములకు, ఈవల ఇంగ్లీషుకు చోటిచ్చి, అవి పాతపుస్తకములలో నక్కొనిపోయినవి. ఇప్పటికిని యీ భాష నెల్లూరుపల్లెలలో చాలవరకు వాడుకలో గలదు. ఇప్పటి పెద్ద కారువారు పోయినచో, దాని అంతే బట్టదు. అప్పుడు నిఘంటువులే శరణ్యము కాగలవు. పూర్తిగా భాష మారినదంతా-పట్టణములలోను, పాశ్చాత్యవిద్యాధికులలోనుమాత్రమే. పల్లెలలోనికి వ్రేళ్లు పారని కేవల పుస్తకభాషాపండితులకు ఇది అర్థము కానిదిగనే ఉండిపోగలదు. అప్పుడు దిద్ది వ్రాతుమనుదొరలు బయలుదేరుదురేమో!
కొందరు, “తిక్కన నెల్లూరు తెనుగు బెట్టి భారతమును పాడుచేసినాడు" అని అనిరట. దానికి ప్రత్యుత్తరముగా కళాప్రపూర్ణ వేదం మేకటరాయశాస్త్రులవారు "కాదుకాదు; గుడికట్టి పాడి చేసినాడు" అని చమత్కరించిరి.
తిక్కన కవిత్వములో ఉన్న విశేషమంతా, ఆయన వాగ్వైఖరియందే! ఆయన దొకకవితావేశము! ఇంగిత మెరిగిన ఆయన విశాలహృదయసరోవరములో రేగిన భావతరంగములకు, అనువైన కమనీయజీవపదము దొర్లి వచ్చి, విషయమునకు కొత్త చెన్నువన్నెలతో ప్రాణముబోసి మనకండ్ల ఎదుట ప్రకటితముగ జేయును. సంఘటనకు దగినభాష ఉక్తి వైచిత్ర్యముతో పొరలివచ్చును. పదప్రయోగౌచిక్యము పదగౌరవము పాత్రపోషణకు అయన కవితా లక్ష్మికి ఎనలేనిసొమ్ములు. కాజట్టే శ్రీనాథకవి సార్వభౌముడు “రసాభ్యుచితబంధము” ఆయన తీరు అని మర్మమెరిగి చెప్పినాడు. భావము సామాన్యమైనది కావచ్చును; కాని ఆయన దానిని అలంకరించిన భాషలోనే జీవము సౌభాగ్యము సౌందర్యము నవ్యత వెల్లువబెట్టును. ఈ కళలో, ఆంగ్లమహాకవి షేక్సుపియరు ఆరితేరినవాడని, ఆ పెడకట్టె — బెర్‌నార్డుషాగూడ చెప్పుచున్నారు. ఇదేగదా కవికులగురువు కాళిదాసుని విభూతి.
సోమయాజి నవరసములను నవకముతో ఒప్పించగలడు. ప్రణయమెంతో ప్రళయము గూడ అంతే ఆయనకు; కాని రెంటినీ వెగటు బుట్టింపడు. కాబట్టే వీళ్లూట ఇరవై ఏండ్లు గడచినా, ఆంధ్రవాఙ్మయప్రపంచమున ప్రాగల్భ్యముతో జాతీయకవియై మన్ననలు బొందుచున్నాడు. కవిత్వమును శిల్పమనినది ఈ కళావేది, ఈ లోకకవియే! ఈయన ప్రపంచమహాకవులతో, భుజము లొరచుకొని, ఒకేబంతిన కూర్చుండగలిగిన సార్వలౌకికమహాకవి, ముఖ్యంగా తిక్కన కవితాక్షేత్రము శాంతిపర్వలో, తెనుగుదనపు తేనెతో జో డెక్కిపోయినది. కవిత్వము మదరమాగినది.
ఆయన కవిత్వపు అమృతవాహినిని, కొన్నిపాయలుగా చీల్చి, అందు త్రావి ఆనందింతుము:—
★భావము సర్వజనీనమైనది
జాతిమతస్థానికక్షుద్రభిత్తికలు భావమును అడ్డుపెట్టలేవు. అవి దేనిపాటికి అవిగా ఉద్భవించుచుండును. మహావీరుడు నెపోలియన్, సెంట్ హెలీనా దీవిలో బందీగా ఉన్నప్పుడు “I exist but I dont live” అని ఆవేదనపడినట్లు ధృతరాష్ట్రుడు - "చోచ్యుండనై దుర్దశ నునికి మనికి యగునె (కర్ణ. 1:30) అనుచున్నాడు. ఇట్లే బద్దెభూపాలుడు. After me the deluge అనేదానికి 'తన చావు జలప్రళయము' అని సుమతిశతకములో అన్నాడు. ఇవి కాపీ కొట్టినవిగావు. ఇట్లే — — సిగ్గు జలము డిగ్గ ద్రావి కర్ణ. 1:138 (Swallow the Humiliation)
— చలము దిగ ద్రావి కర్ణ. 2:248.
— నాలుక యడంచియుండు.కర్ణ. 2:109 (Hold your tongue)
★విరోధాభాసవాక్యము (Oxymoron)
Tremendous Trifes - బ్రహ్మాండస్వల్పములు, Splendid defeat - వైభవోపేతపరాజయము అనునట్టి వింత వాక్యములను తిక్కన రమణీయముగా ఉపయోగించును.
— యుద్ధశాంతవీరులు (ఉద్యో. 3:284)
— వినియున్ దా వినని చెవులు జేసి (కర్ణ. 2:12)
ఆయనకు విన చెవుడు అని స్థానికప్రయోగము.
— మోహరం బుత్సాహతీవ్రం బయి (కర్ణ. 3:155)
— అలఘులఘుత మెఱయ (కర్ణ. 3:160)
★బీభత్సములో చారుత
ఐదుపర్వముల పద్దెనిమిదిదినముల యుద్ధము, వీటి అన్నిటితో సరితూగినట్లున్న ఒక్క ఉత్తరగోగ్రహణమును వర్ణించి, స్త్రీపర్వములో — ఎముకలగుట్టలు, ఈరువుకొండలు, ప్రేగులతిప్పలు, నెత్తుటేరులను కల్పించి కన్నీటిమడుగులు నింపినను, అంగవైకల్యము నొందిన ప్రాణికోటిని వర్ణించి ఒళ్లు పులకరింపజేసినను — విసుగు పదురు ఏవగింపు గలుగదు. బీభత్సమునకు ఒకదర్శనీయత, వీరమున కొకరామణీయకత అంటగట్టి కవిత్వమును ప్రసన్నదనముతో ఆహ్లాదికారిగా జేసినాడు. ఇందలి బీరమునకు కనుగవ ఎరుపెక్కునేగాని, కండలు కదలునేగాని, ఎదలో నలి నంజలి పుట్టవు. యుద్ధఘట్టములు ఉత్సాహప్రతిపాదకములుగనే సాగిపోవును. ఇట్టి పనితనమునే నాచన సోముడు గూడ కొంత చూపినాడు.
— చారుభీషణంబుగా నొకళ్ళొకళ్ళ జుట్టుకొని (కర్ణ. 1:77)
— రథచిత్రచారులఘుభీషణసంచరణంబు లొప్పగన్ (క. 1:106)
— తనరథంబు రయంబున దర్శనీయంబుగా (క. 1:189)
— విద్విషద్భయదగదారుచి స్ఫురితబాహువిలాసభాసమానమై (క. 2:221)
— దునిసిపడి భీమాభిరామంబుగా (క. 2:227)
— శిరము ధర డొల్లె గుండలస్ఫురణ మెఱయ (క. 2:246)
— మత్తగజకేళీసుందరోల్లాస మాభీలత్వం బలరింప ద్రిప్పుచు (క. 3:210)
— ఉరము వ్రచ్చి నెత్తురుదేనియ యిదె ద్రావెదన్ (క. 3:212)
— తను వుగ్రసుందరముగా నన్నరు డేతెంచె (క. 3:219)
— నెత్తుట దోగి, మేను కమనీయరుచిం గొమరార (క. 3:339 )
— అభిరామభీషణంబగు రణాంగణంబు (క. 3:380)
ఆ పీనుగుపెంటలలో
| తే. | రెండు వీళ్ళజనంబులు రేలు వివిధ | |
(భీష్మ. 2:313)
అని, నెత్తురును మరపించి ఆనందింపజేయుచున్నాడు — సుకుమారభావబంధురుడైన కవి.
★కూర్పునేర్పులో సొంపు
వీనులవిందుగా, పదగౌరవ మెరిగి, క్రొంగొత్తతెన్నున వాక్యములను కూర్చి భావములను వెల్లడించి ఆనందమును కలిగించుపనిలో తిక్కన మొనగాడు. ఇట్టి మధురవాక్యసముదాయము యీయన కవిత్వములో కుప్పతిప్పలు.
— పవలింటిదివియచంద మయ్యె దినకరుండు (క. 1:62)
— కయ్యంపువేడుక మొగంబులం జిగురొత్త (క. 1:69)
— పాండునందనులు... నేడు నూడబోదురు జము (క. 1:70)
— నిప్పుల్ రాలు కన్దోయితోన్ (క. 1:91)
— పొలివోని కలికితనము (క. 1:101)
— నెత్తుటిపొం దేమియు లేక యుచ్చి చనినన్ (బాణము) (క. 1:121)
— అలంతినవ్వుచెలువంబు మొగంబునకు వింతచె న్నొసంగ (క. 1:176)
— తనూజు భుజగర్వవిహీనత నొంచె చిత్తమున్ (క. 1:187)
— చేతులతీట వోవ (క. 1:197)
— చేతు కసి వోవంగ (క. 2:301)
మనసుకుగాక చేతులకే కసి గల్పించినాడు.
— చే నెత్తురు గాకుండ, నక్కిరీటి గీటడగించువిధం బూహింపుము (క. 1:280)
— మధురాక్షరవిన్యాసంబుగా పలికి (క. 2:252)
— సర్వాగ్రహవిధేయుడు (క. 2:7)
— చూచియుం దిరమయి నీవు నాలుకకు దెచ్చిన మాటగదా వినందగున్ (క. 2:11)
— పొడుతు నొడుతు ... జెఱతుమనుట నోర చేటుగాదె (క. 2:24)
— అర్జును నమ్ములు దుప్పుపట్టెనే (క. 2:25)
— బెండు మానుసులకు భీషణంబులు, నాకు బరితోషణంబులు (క. 2:46)
— లక్ష్మికి జేవయు, గీర్తి కున్నతవిజృంభణము కలుగన్ (క. 2:105)
— నేడు మేలు చేయైతి నేనియు మృత్యువునకు నెన్నడు నగుపడ (క. 2:107)
— అంతరంగ మేర్చు నలుక కామిషం బిడగ జూచినచందము (క. 2:204)
— సస్మితవక్త్రసహస్రపత్త్రలక్ష్మి యతిశయిల్ల (క. 2:221)
— గద పండుపు (క. 2:222)
— మనములు మెచ్చున గరగె (క. 2:284)
— బ్రతుకరానంత పుట్టిన (క. 3:82)
— అప్పలుకు లలంచుచుండె, మది బాయవు గీఱినయమ్ములట్ల (క. 3:36)
— ధను వనలవలయము తెఱుగున (క. 3:49)
— ఏపారి మండునె యాఱంగలదీపము (క. 3:49)
— మొగంబు బిగు వుడిపికొని (క. 3:92)
— భవన్మహాస్త్రదివ్యమహిమలో నడంగిరి (క. 3:114)
— లో పగ రాజబెట్టను (క. 3:124)
— భవద్బాహుదండంబునకు మూలధనంబైన గద (క. 3:141)
— జముని నాలుకయు బోని యతులశక్తి (క. 3:162)
— మెడలు దెగంగ నేసి రణమేదినికిన్ బలిసేసె నత్తలన్ (క. 3:180)
— నిటలమున బటుదర్పోల్లసితు డగుచు (క. 3:198)
— అంత్యకాల యమరేఖ బేర్చి (క. 3:219)
— ఎవరు కడంగుదురోయని కన్నిడియుండి (క. 3:228)
— వెలి మెచ్చును నొల్ల డేమియున్ (క. 3:271)
— అత్తొలుతాకు వెఱగుపడజేసె (క. 3:278)
— కవ లధికమైన లావెక్కిన యయ్యంగపతి (క. 3:315)
— రోషానలంబు, రోమకూపంబుల బటుజ్వాలారూపంబున వెడలుట (క. 3:357)
★సహజోక్తి
లోకపరిజ్ఞానము మెండుగాగల యీ మహాకవి ప్రకృతిని చూచి గ్రహించి, దానిని కవిత్వసంపదతో కైసేసి ప్రదర్శించును, ఆ భాష అనుదినము వాడుకలోనుండు నానుడిగనో సామెతగనో చాటనగనో నుండి, జీవశక్తితో కలకలలాడుచుండును. ప్రజాభాషను తీర్చి దిద్ది ఉపయోగించేనేర్పున యీయన దిట్ట. చూడండి:—
— రథము రథముతో జేరగ దెచ్చి, యమ్మేదినీశ్వరునితో గర్ణు డిట్టు లనియె (క. 1:229)
— నీవు నా చెప్పినట్లు చేసితేనియు మేలు, సేయకుండినం గడుమేలు (క. 2:53)
— కాకులలో గలుప దగవు కాదే నీకున్ (క. 2:77)
(హంసకాకీయోపాఖ్యానము)
— మృతభటులు రయమునకు విఘాత మొనరింప (క. 2:154)
— సారథి సమయించిన దేరు తురంగంబులు దొలగంగ నీడ్చికొని పాఱిన (క. 2:222)
- ఈస్థితిని పలుమారు వర్ణించినాడు. ఇదిగాక తేరు దిగునప్పుడు పగ్గములను (Reins) నొగలకు గట్టియే ప్రతిసారథి క్రిందికి దిగునట్లు వర్ణించుట తిక్కన లోకపరిజ్ఞానమునకు పెద్దగురుతు. ఇట్లు చేయకుండిన పగ్గములు గుఱ్ఱముల కాళ్లక్రింద బడి, కాళ్లకు జుట్టుకొని అపాయస్థితిని కలిగించును. ఈ అత్యంత అవసరకార్యమును మరచినవాడు, తిక్కన సారథులలో ఒక్కడూ లేడు.
- ఒకరికి ఇంకొకయోధుడు సహాయముగా వచ్చి మొదటివానిని విశ్రాంతి దీసికొనమనుట.
- ముఖ్యమైనయీ విషయమును, సంకులసమరమధ్యమమునగూడ కవి మరువడు. అవి సేద దీర్చుకొని, మేసి, యథారీతి బలము చేకూర్చుకొనుట సహజము.
- మూకలు అర్జునురథమును చుట్టిముట్టి (ఇప్పటి రాజకీయభాషలో ఘెరావు చేసి) ఒక్కొక్కడు ఒక్కొక్కరథభాగమును పట్టుకొని నిలుపుట కండ్ల ఎదుట పొడకట్టుచున్నది. ఇదే వాక్యచతురత — వర్ణనానైపుణి (క. 2:229)
- గుంపులో దూరమునకు కనుబడునది రథకేతనమే! ఎవరిదో గుర్తించి, వెంటనే అచటికి తనరథమును తోలుమని యోధుడు చెప్పుట సహజము. సంకులసమరములో ఇదే కార్యసాధనకు అనువు. ఇందు ఒక సొగసుగూడ గలదు. ఇట్లు పెక్కుతావులలో చెప్పబడియున్నది.
- [6]విజయము కర్ణుని విల్లు; ఇది దైవదత్తము. ఇట్లు తనధనుస్సుతో — ప్రాణమున్నదానితోవలె పలికి, పొగడి ఉపయోగించుట — కలుజులు దీసి పారించిన ఆనందరసస్రవణము! ఇట్లే గుఱ్ఱమును మెడపై తట్టి మాట్లాడని సారథి ఉన్నాడా?
- బాగా పైకెత్తి పగులు వేసినాడు అన్న చాటువకు సరిపోవుచున్నది యీ పలుకుబడి.
— నిన్ను దృణము చేసి, న న్నాదురాత్ముండు బంధుహీనుబోలె బఱుప (క. 3:64)
— గదాఘాతంబుల కాలం గేలను (క. 3:86)
— ము న్నేమి సేసిన జేసి తింక నైన దుర్బుద్ధితనములు మాని (క. 3:89)
— పొగ వాసి మెఱయు నగ్నివోలె (క. 1:180)
— ధూమ మడగిన వెలుగొందు ననలు చందము (క. 2:298)
— పొగలేని మంటపగిది (క. 3:15)
- అగ్నితీవ్రతను చెప్పుటకు యింతకంటె శాస్త్రీయపద్ధతి లేదు. పొగ (కార్బన్) అంతా పోగా మంటకు వేడి ఎక్కును. ఇది తిక్కన సైన్సుపరిజ్ఞానము. ఇంకొకచోట చండ్రనిప్పులు చెరిగినట్లు అని చెప్పినాడు. చిక్కటి చండ్రకొయ్యకు వేడి ఎక్కువ. అందులో చేటలో బోసి చెరగిన, కణికలు రాజి, వేడి ఎలపాన వ్యాపించును. చింతనిప్పులకుగూడ వేండ్రము ఎక్కువ.
- ఇది ముఖ్యంగా ఆడువారి తిట్టువంటిది. “నీవు పురుగుబట్టి చావ" అన్నట్లు.
— ఆ సభలోన గొన్న ఋణమంతయు నీగగ గంటి వడ్డితో
(భీమసేనుడు దుస్ససేనునితో); (క. 3:195)
— వివిధవిశిఖజాలంబు లడరించిన, నంబురంబు
శలభపటలసంవృతంబునువోలె నుండె (క. 1:129)
- మిడుతలదండు చూచినవారికి ఇది మనసున అట్లే అచ్చు పడిపోవును. (Good Earth) అనే చలనచిత్రమందలి మిడుతలదండు దృశ్యము కట్టెదుట నిలిచిపోవుచున్నది.
— కాల్ నిలువక తెరలంగ (క. 3:230)
— కర్ణమద్రపతుల కాంతల విధవల జేయువాడ (క. 3:264)
- "నీ ఆలు ముండమోయిస్తాను చూడు" అనేది పలుమారు చెవిన బడే తిట్టు.
— (తేరుగాలు) కుండ మునుగంగ దిగబడిన (క.3:350)
— తెగనిండ దిగిచియేసిన (క. 3:360)
- తెగ తిను, తెగ మాసిన వాటివంటి ప్రయోగము.
- ఒక లెక్కా పక్కా అనుట.
★ఉపమానములు
ఈ ఉభయకవిమిత్రుని సారవంతమైన మానసికక్షేత్రమున మొలకెత్తి, మొగ్గ పూవు దొడిగి, రామణీయాకృతులతో ఉపమానములు రూపొంది, పాఠకుని పులకితుని జేయుచున్నవి. ఈ కవి ఊహలు మన్ను వదలి మిన్నుకు ప్రాకేవి గావు, పోలికలు పాటకజనముగూడ చూచినవే! ఇక మాటలు తెలుగువారి సొంతవి.
— మేఘపిహితుడైన మహిరునిచాడ్పున వాడిలేక యున్నవాడు (క. 2:121)
— పెనుదుంగ మడువులో గజపతి యున్మత్తవృత్తి గేలి సలుపుపగిది (క. 2:340)
- తుంగపోచలను, అడ్డము ఆపు లేకుండ త్రొక్కివేసినట్లు, అందులో అది గజపతి, సామాన్యమైన ఏనుగు గాదు.
(చూడు : భీష్మ. 2:222)
— నాళమునకు వికసితాంబోరుహము బాపు
వెరవు దోప దునిమె వెస...శిరంబు (క. 2:168)
ఉపమానములతో నిఁడిన ఈ సీసము చూడుడు (క. 2:187)
నవ్వుచుఁ జాపంబు నడిమికి ద్రుంచి, మై
మఱువు దొంబది శితమార్గణముల
భేదింప, రత్నప్రభాదీప్త మగునది
సౌదామనీచారుజలదమంబు
జాప్తుని తనువున కడ్డమైయుండి వా
తాహతంబై పాయునట్లు వోలె
బడుటయు, మణిమయాభరణసుందరమైన
యతనిగాత్రము సతారాంబరము
బోలి యప్పుడ యా సూతపుత్రుచేత
రక్తమయమైన పల్లవోద్రిక్తకల్ప
తరువు చందంబువొందె; నతండు రాజ
ధర్మ మూది చలింప కదల్చె నధిప.
- లేడి అంటే ఆడుజింక, అబలలు పరుగెత్తినట్లు అనుసూచన
ఉపమానమును పెంచి వర్ణించి, ఉపమేయము ఇట్టిదనుట తిక్కన ఉపమాలంకారములలో ఒక చారుతరఫక్కి. దీనిని గ్రీకుమహాకవి – హోమర్ చేబట్టి, పడమటికవితకు వన్నె దెచ్చినాడని దీనిని Homeric Simile అంటారు. ఇక ఇందు తిక్కన బాణి చూడండి:—
— (భీముడు) వాని నెల్ల ద్రుంచి, వలవ్రచ్చికొని లీల
నిగుడు చోఱవోలె వెగడువడక తఱిమి (క. 3:158)
- చోఱ—చొరచేప (Shark) అతిభయంకరమైనది.దానిముక్కు పొడవుగా, రెండుతట్టులా రంపపుపండ్లవంటి ముండ్లు కలిగియుండును. ఇది వలను తుక్కుతుక్కుగా నరికివేయుట తెలిసినసంగతి. ఈ ఉపమానముతో భీముని భీకరమూర్తి ఆకళింపునకు రాగలదు.
భీముని తిక్కన ఆబోతెద్దుకే పోల్చి సుందరదృశ్యము నిట్లు సృష్టించినాడు (ద్రోణ. 4:154) —
| చ. | అరదము డిగ్గి యప్పటుశరావళి కోర్చి మొగంబు వాంచి స | |
- కారెలు దిరిగి చెండు బెట్టిన కోడెసింహమునకంటె గంభీరమని తెలిసి, తిక్కన యా పోల్కెపై మమత జూపును. వానలో ఇది తలవంచి రాజఠీవితో నడచుటను పల్లెలలో చూచి ఆనందించనివారు లేరు.
— శా. సింగం బాకటితో గుహాంతరమందు చేడ్పాటు మైనుండి, మా
తంగస్ఫూర్జితయూధదర్శనసముద్యత్క్రోధమై వచ్చునోజ
(విరాటపర్వము)
— చ. కని యభిమన్యుముఖ్యుల వికంపితవృత్తి కడంగి యేసినం
దనువున నెల్ల రక్తజలధారలు గ్రమ్మగ, వారణేంద్రు డే
పున సెలయేరు లొక్కమొగి బోరన బెక్కడరంగ లీల గై
కొని ఘనకేళి సల్పు నడగొండగతిన్ సముదగ్రమూర్తియె. (భీష్మ. 2:240)
— ఉ. అంగదనాథు మ్రింగిన వృకావతి దన్ వెస ముట్టికొన్న స
ర్వాంగములుం జలింప నెగడందుచు దిక్కులు సూచుచున్న సా
రంగియపోలె నుండె, గురురాజ, భవత్సుతుసేన భీష్ము నా
జిం గబళించి పాండవులు జృంభితవిక్రమలీల బొల్చుటన్. (ద్రోణ. 1:17)
మొదలగు రసగుళికలు ఎన్నోకలవు.
- కాలుదన్ని (ఊని) నీట నిలుచుట సహజము.
— బెబ్బులి లేడి కొదమం బొదువుపోలికం బొదివి (క. 3:205)
— పెక్కుపాములు బొదివిన జెనగు గరుడు ననువు దోపగ (క. 2:273)
- ఎందరు చుట్టిముట్టినను లెక్క లేక పోయినదనుట.
— అంతక కోపవహ్ని విపులాకృతి గైకొని వచ్చినట్లు (క. 3:288)
— (మహాస్త్రము) ఆకలిమై వచ్చు కృతాంతవక్త్ర మన (క. 3:358)
★చిత్రీకరణము - ఉత్ప్రేక్ష
ఒక సన్నివేశమునుగాని, వ్యక్తి అవస్థనుగాని వర్ణించుటలో కవిబ్రహ్మ గంటమునకు నెఱజాణతన మబ్బినది. ఇవి చదివిన వినిన మన కన్నులలో, సినిమాదృశ్యములవలె మసలుచుండును. పాత్రలు సజీవములై మనకట్టెదుట తిరుగాడుచుండును. ఇదంతా ఒక గారడి, ఒక కనుకట్టుగా నుండును.
— క. అనిన విని కెంపు సొంపున
గనుగవ యుగ్రముగ బొమలు గదియగ, ఫాల
మ్మున జెమట వొడుమ, నీ సుతు
గనుగొని యిట్లనియె నతడు కటము లదరగన్. (క. 1:249)
ఇది శల్యుని దృశ్యము.
— ఆ. మెఱుగుతోడి లలితమేఘంబుమీదికి
బోయి వెలుగు భాను పొలుపు దోప
మద్రరాజసహితమహిత మై యొప్పు న
త్తేరు కర్ణు డెక్కి తేజరిల్లె. (క. 1:318)
— తే. ఈడబోక రాధాసుతు డేసె నిరువ
దేను నారాచములు పవమానతనయు
కత్తళము దూరి యంగంబు గాడిపాఱి
నిలువకట చని మేదినీతలము సొరగ. (క. 2:212)
- అంత బలముతో వదలబడి, అంత వేగముతో వచ్చుటచే, దేహంగుండా దూరి నేల జొచ్చునంతవరకు నిలువలేదని వర్ణించుచున్నాడు.
- సైన్యమంతా చలనము లేకుండా స్తంభించిపోయినది. మున్నీటివలెనే ఇదిగూడ హేరాళముగ పరచుకొనియున్నది. ఇదీ మనసుకు తట్టే దృశ్యము. రెండుసాళ్ల దున్నినపొలము గూడ అల లణగిన వారాసివలెనే ఉండును. (బుద్ధచరిత్రలో అశ్వఘోషుడు యీ దుక్కిపోలికను చెప్పినాడు.)
— క. తురగద్విపద రథతూర్యా
భరణధ్వజచామరాతపత్రశకలముల్
పొరిబొరి ధర గప్పగ, నె
త్తురుటేరులు వాని ద్రొలగ ద్రోచుచువచ్చెన్. (క. 2:301)
- తుమురు చెత్తతో అనగా (అడ్డుకట్టగా) ఏర్పడియుండగా, వచ్చిన నీరు ఉబ్బి, ఆ కట్టను నెట్టి త్రెంపి కొట్టుకొనిపోవుట సర్వ సామాన్యదృశ్యము. ఈవర్ణనము ఆదృశ్యమును చిత్రించి, మనచూపుమేరలో నిలిపివేయుచున్నది. ఇది చిత్రకారుని కళావైదుష్యము.
- పైనుండి బడి తునకలైన విమానములు ఇట్లేగదా కనుపించును.
— క. నిగుడు దివాగ్ని జ్వాలల
వెగడందిన మృగకులంబువిధమున నతిభీ
తి గదిరి నలుగడ విచ్చిన
జగతీశ్వర, యతడు మెఱసె జక్కని బయలన్. (క. 3:208)
- ఇది ఒకపాటి హోమరిక్ సిమిలి. కాలిపోయినతర్వాత బయలే (తెఱిపే) గదా అగును. ఇం దొకసారస్యము — చిత్రీకరణపుసొంపుగూడ గలదు.
★పదసారస్యము
ఈకళను ప్రదర్శించుటలో ఈకవికి ఒకసహజప్రతిభాదీపనము గలదు. తల్లిని పట్టుకొని 'బింబాధరోష్ఠి' అని అనడు. పాత్రలను తానుగా తిట్టడు. సందర్భోచితముగ పదప్రయోగము చేసి ఆపదగౌరవమును నిలువ బెట్టును.
- ఫల్గుణీనక్షత్రము జయతార; అందు పుట్టినవానికి — అర్జునునికి అపజయము లేదు. కాబట్టే గెలువలేరని సూచించినాడు.
— దూర్వారోద్యము బాహు... కీచకా — అనే విరాటపర్వపద్యములో ద్రౌపది
కీచకా = అంటే వెదురా, అని సంబోధించి, నిన్ను విరుగబొడుచుట
అంత సులభమని తోపింపజేయుచున్నది.
— భీముడు విస్ఫురద్గదను రభస మొలర్ప త్రిప్పును.
— సవ్యసాచి (రెండుచేతులా ఏసి) అంపవాన గురిపించును.
ఇదీ తిక్కన సమ్మోహనాస్త్రము. ఇట్టి ప్రయోగములు యీపర్వమునగూడ గలవు.
పాత్రచిత్రీకరణము
తిక్కన భారతపాత్రలు ప్రాణము లేని తోలుబొమ్మలు గావు; అవి చైతన్యపూర్ణములు; మానస్వభావమూర్తులు! ముఖ్యముగా కౌరవులలో కర్ణుడు, గాంధారి; పాండవులలో భీముడు, ద్రౌపదియే ఈయన తీర్చిదిద్దిన ప్రధానపాత్రలు - అని అనవచ్చును.
I ద్రౌపది
నెఱజాణ బిగువు, గార్గి వాదనాబలము, సత్యభామ ఆత్మోత్కర్షము, తెనుగు గడుసుదనము సమపాళ్లుగా కలిపి రూపురేకలు దిద్ది ప్రాణముబోసి ఈమెను నిలువబెట్టినాడు పల్నాటివీరులకథలోని నాయకురాలైన నాగమ్మ, ద్రౌపదికి అస్ఫుటఛాయాచిత్రము కావచ్చును. ద్రౌపది తెనుగుదనమునకు రూపాంతరము.
పంతము సాగించుకొనుటలో, కసి దీర్చుకొనుటలో అంతటివ్యక్తి భారతమున ఇంకొకరు లేరు. దుస్ససేనుడు లాగి త్రెంచిన వాలు వెంట్రుకలను, అతని పచ్చినెత్తుటనే కడిగి ఆరబెట్టిన తరువాతనే ముడిచి కొప్పుబెట్టినది. ఈమెకు భీమునిపై ఉన్నంత విశ్వాసము ఇంకొకరిమీద లేదు. స్వర్గారోహణపర్వములో, ధర్మరాజు — ఆమెకు అర్జునుపై వలపు మొగ్గు అన్నదానికి భారతములో ఎక్కడా పోబడియే లేదు, తన ఎదసొదను భీమునితోనే చెప్పుకొని, కీచకుని దుశ్శాసనుని మట్టు బెట్టించి పగ సాధించుకొనినది. అర్జునాదులు మీనమేషము లెక్కించుచు, వెనుకముందులు ఆలోచించేలోపలనే, ఉన్నపుణ్యకాలము రవ్వంత చెల్లిపోయెడిది. వారు యుద్ధములో దప్ప అన్యక్లిష్టకార్యసరణిలో తెంపు చూపలేక పోయినారు.
తన గాండీవమును తిట్టిన అన్నను, అర్జునుడు చంపుదునని పైకి దూకి, చివరకు ఆ ధర్మజుని చిట్లిన కొసవెంట్రుకలను నరికి వ్రతము చెల్లించుకొనినాడు. కాని ద్రౌపది పెట్టిన చివాట్లకు, కుక్కినపేనువలె నోరెత్తలేదు — ఈ ఇంద్రసూతి! ఆమె అన్నంతనే పాండవులందరికీ భయమే — అగ్నిలో పుట్టినదని కాబోలు. కుంతి, అత్తగా యీమె జోలికే పోయినట్లు లేదు. ద్రౌపదిని శక్తిస్వరూపిణి అని అనినది — నిర్యాతనశక్తి స్వరూపిణి యగుటచేతనే కాబోలు! తిక్కన, అడుగడున ద్రౌపది వైశిష్ట్యమును చిత్రించినాడు. ఆమె కార్యాచరణదక్ష; స్వాభిమానిని.
II భీముడు
ఒళ్లు దాచుకోనని తెంపు, మగటమి, చేవ, సత్తువ గలిగి, కల్లకపట మెరుగని మొండివాడు — యీ పాండవేయుడు. అవమానమును దిగమ్రింగి పడియుండలేడు.
"కుంభనిక్షిప్తభుజంగమువలె” బుసకొట్టుచు సమయమునకు వేచియుండి, శత్రువు చేజిక్కగానే వికృతముగా తునకలు చేసి తృప్తి పడేవాడు — భీముడు. ఈయన లేకున్న పాండవపక్షమే లేదు. స్వగౌరవప్రతిష్ఠాపనముగాని, రణవిజయముగాని, ప్రాణోపద్రవకాలమందు ఆత్మరక్షణముగాని వారికి దక్కియుండవు. భారతములో (కల్పిత)గోగ్రహణమునందుదప్ప, భీముడు చేయి జేసికొని తనవారిని ఉద్దరించని క్లిష్టసమయమే లేదు. లాక్షాగృహదహనముతో ఆయన బాధ్యత ప్రారంభమైనది. పేరుబడిన యోధులు — ఎక్కువమందిని యీయనే సమయించినాడు. ధార్తరాష్ట్రులందరూ ఈయన గదాఘాతములకే ఆహుతియై పోయినారు.
ఇది బాగా గుర్తించియే, భాసమహాకవి — తాను వ్రాసిన భారతనాటకములు ఐదింటిలో రెంటికి — మధ్యమవ్యాయోగము, ఊరుభంగము — భీమునే నాయకునిగా జేసి, రాణింపు గూర్చినాడు.
కన్నడకవిత్రయములోని రన్నడు — "సాహసభీమసేనవిజయము” (గదాయుద్ధము) అను నాటకమున దుర్యోధన భీమసేనులనే వీరులుగా వర్ణించినాడు (రన్నడు తెలుగువాడు; నన్నయకు ముందు యాబైయేండ్లనాటివాడు; అర్జునుని పెద్ద చేసి కన్నడభారతము వ్రాసిన పంపని తరువాతివాడు. ఇతడూ తెనుగువాడే!)
యుద్ధపంచకములో భీముని వీరవిహారమే ఎక్కువగా వర్ణితమైయున్నది. ఇక కర్ణపర్వమున కర్ణునికి ఎదురుగా భీమునే ప్రతినాయకు డనవలసియున్నది. దుస్ససేనసంహారఘట్టము తిక్కనచేతిలో మహాకావ్యసంపదతో, తీరి దీపించినది. కీచకుని చంపుటవలెనే ఇదీ అమానుషము! అట్టిదీ భీమునికి వారిపైగల కసి! కాని ఆ వికృతచిత్రీకరణము జుగుప్సను కలిగించదు. ఈ గుణము తిక్కన ప్రత్యేకకళ.
| | “మును సభ బలికిన దానం | |
అని ఎంత సహజంగా, ములుకులు గుచ్చుకొనేటట్లుగా ఎత్తి పొడుచుచున్నాడో చూడండి! కినుక వేడ్కపడుట బీభత్సమునకు ఒకనాణ్యము!
ఆపట్టున దుస్ససేనుని శరీరమునకు పట్టించిన పాట్లు పరికించండి: (క. 3:210)
| శా. | లీలం గేల నమర్చి, మత్తగజకేళీసుందరోల్లాస మా | |
సుందరోల్లాస మాభీలత్వం బలరింపచేయుచున్నాడు! తిక్కనకు సౌందర్యము తోపింపజేయను అనువుగాని సంఘటన మే ఉండదు. అదిగాక యిందు — ఒకేపద్యమున అనేకక్రియలను చొప్పించి ఆఖ్యాతకవిత్వమునకు ఉదాహరణము గూడ సమకూర్చినాడు — ఈ కవితాశిల్పి. ఈచేతలు కనులకు గట్టినట్లుగదా నున్నవి!
అంత బోనీక—-
| | “ఏ నురము వ్రచ్చి నెత్తురు | |
'మీ అబ్బతో చెప్పుకో పో' అన్నట్లు సహజంగా అనుచున్నాడు భీముడు. ఆయనకు ఆక్లిష్టపరిస్థితి లఘువై, నెత్తురు తేనెవలె రుచుల నూరించుచున్నది. భీముని అక్కసంతా యీ 'తేనె' అన్న పదమునందే నింపివేసినాడు. ఇంకను పగ తీరలేదు; నిర్యాతనోత్సాహము మందగించలేదు. ఇంకను అంటున్నాడు: "తల్లి చనుపాలు, పలుతెఱంగుల తేనియలు, ఖండశర్కరతోడి దుగ్గంబులు యింతయింపు గావు" అని వికృతహట్టహాసమును పొంగుతో చేయుచున్నాడు.
ఇంత చేసినను జుగుప్స బీభత్సము కలిగి, భావము వికటించకుండునట్లుగనే “ఉగ్రసుందరముగా నవ్వీరు డేతెంచినాడు!”
(క. 3:219)
దుస్ససేనుని “పసరమా” అని మెత్తటిమాటలో తిట్టుట, దారుణాఘాతముకంటె బెట్టిదముగ నున్నది. వెంటనే అతని ఱొమ్ము చీల్చి,
"క్రమ్ము రుధిర మ్ముల్లాసియై దోయట వ్వెరంవారం గొని త్రావు,
మెచ్చు చవికిన్" (క. 3:214)
ఈ వికటస్ఫూర్తిలో గూడ చిత్రణశిల్పము కవి లేఖినిని బాయలేదు. వెరవారగొని త్రావుచున్నాడు. చవికి మెచ్చుట — ఆత్రావుట గూర్చిన అత్యంతృప్తికి ఒకసజీవరూపము కల్పింపబడుచున్నది.
ఈ ఘట్టము చదువునప్పుడు, స్పెయిను, మరికొన్ని ల్యాటిన్ అమెరికా దేశములందలి వృషభయుద్ధమును (Bull Fight) చూచునప్పుడు కలుగు ఘోరరామణీయకతనే కవి మనచే అనుభవింపజేయుచున్నాడు. ఇట్టి దృశ్యదర్శనము ఉత్సాహమునేగాని వితాకును కలిగించదు.
ఇంతలు చేసి, “ఒకటి కడతేఱె! బాపాత్ము సుయోధను బొరిగొని తలదన్నుదు" నను రెండవపనియు దీర్పనరిగెద (క. 3:225) నని, భారతకథానిర్యాతనచరమాధ్యాయమునకు బీజావాపము చేయుచున్నాడు.
భీముడు పోలికలనలో పొంగునేగాని, క్రుంగడు, పిరికికండ పడనీయడు. ఎటులైన బ్రతికి బయటపడవలెనను ఆశ ఆయనకు వెలియైనది. లేకున్న అశ్వత్థామాస్త్రప్రయోగమునకు తేరు దిగకుండునా? చావన్న భయమెరుగని యీయనను కృష్ణుడే రథముపైనుండి క్రిందికి ద్రోయుచున్నాడు. ఇట్లే మూర్ఖముగా, ముందుకు ఆపడెద్దువలె సొర వేసికొనిపోయి శత్రువులతేరులను వాటుపడద్రోయును. మనోబలము యీయన దేహబలమును పెంపొందజేయుచుండును. భీముడు ఏది చేసినా అందు ఒక ప్రత్యేకత గలదు. బకాసురునికి దెచ్చిన బండెడన్నము దినుట ఇతరులకు అరసేపనికాదు. ఇదీ ఆయన రూపరేఖ! మొరటుదనముతోబాటు మొండితనముగూడ ఆయన కవచములు, వేగిరపాటులో ముందువెనుక లారయడు; కాబట్టే మూర్ఛితుడైన కర్ణుని నాలుకను కోయబోవును.
భారతకథ అంతటిలోను, పాండవుల పరువు గాపాడుచు వచ్చినదీ ఒక్క భీముడు మాత్రమే.
III హంసకాకీయోపాఖ్యానము
(కర్ణ. 2:54 మొదలు)
నడమంత్రపుసిరి, నరముమీది పుండు మననీయవు — అన్నచాటువకు తూచినట్లు సరిపోవునది పిట్టలకత. గ్రీసుదేశపు ఈసపు కథలలోని — జంబాలకారి కుందేలు, కాలు సాగని తాబేటితో పరుగుపందెములో ఓడిపోయిన కథవంటిదే ఇది.
కాని, తిక్కన రచనాప్రాగల్భ్యముచే, ఇది కళాపూర్ణమైన కుత్సన ఖండకావ్యమైనది.
(ఇట్టి దృష్టాంతకథలు (Parables) శాంతిపర్వమున గలవు.) దీని నిలువెల్లా సహజసౌభాగ్యము దీపించుచున్నది. పోరుతేరు నొగలో కూర్చుండి, మద్రదేశాధీశ్వరుడు — శల్యుడు, పంచమాంగదశ చేష్టగా కర్ణుని క్రిందుపరచి అర్జును ఎత్తిపెట్టినసంగతి ఇది. హీనమైన పోలికలు, క్షుద్రమైన మాటలు. ఇన్నిటికీ, ప్రచండనిర్ఝరజల పాతాఘాతములకు సంకుగొనని చట్రాతిబండవలె రాధేయుడు స్థిరుడై యుండినాడు, కథ ఇది:—
అంబుధిలో ఒక యలఘుతరద్వీపములో, ధర్మవర్తి అయిన ఒక రాజు పట్టణము. అందు అధ్వరాదిసత్కర్మఠుడు — ఒక వైశ్యవరుడు గలడు. ఆయనకు ఐహికసంపదలందు — ఏటియందును కొదువ లేదు. ఒకనాడు, ఒక కాకి దారితప్పి ఆయన పెద్దయిల్లు దూరినది. ఆయన కొడుకులు, దానిపై మోజుపడి చేరదీసి "ఎంగిళులు” వెట్టి కొనియాడ నెలమి బెరిగి, క్రొవ్వి కడుమీఱి, యెట్టి పక్షులును దన్ను బోలవనియెడు దుర్మానమున దృణీకరించి, యది పెక్కుభంగుల గ్రీడ సలుపు.
ఏ జీవివిగాని ఇంతకంటె చులకనపరచలేము. తిన్నది ఎంగిళ్లు; కాబట్టే దుర్మానము కలిగినది. ఇక కండ్లు కనబడునా?
ఇట్లుండ ఒక నాకు సుపర్ణునితో సరితూగు, కొన్నిహంసలు పైన కనుపించినవి. కోమటిబిడ్డలు ఆ కాకితో "వీనింగలసి పఱచి గెలువగలవా?" అని అనీ అనకముందే, ఉచ్చిష్టదర్పితంబగు నది అంసల దెసకు బోయి “మీలో మేటి యెయ్యదియో” అని అంటూ, తనచూపుకు తగిలిన ఒక హంసముతో పందెము పెట్టుకొని 'పఱతము, రమ్ము' అని పిలిచెను. అంసలన్ని నవ్వినవి.
కాకి — "గతులు నూటొక్కటి గలవు; అందు ఆరితేరినదానను” అని ఎచ్చలకాకిమాటలతో తన్ను తాను పొగడుకొని, పలికినది. దీనికి పెద్దపులుగు అంటున్నది: "నూఱుగతులు నీవు పాఱుదే! నన్నియు నెఱుగ; బులుగు లెల్ల నెట్ల పాఱు, నట్ల పాఱుదము రమ్ము" అని అణకువతో పెద్దమనిషివలె చెప్పినది; ఈ వినయములో ఆధిక్యము ఉట్టిపడుచున్నది. ఇందు వ్యంగ్యమైన సూక్ష్మప్రతిపక్షినింద గలదు.
ఆవల ఆ రెండును మున్నీటిపై మిన్ను దఱసి పాఱినవి. రాయంచ మందగతిని పోవుచున్నది. వాయసము అతితీవ్రభంగివలన మెఱసి, బహుగమనాయాసము నొంది పఱచుచుండినది. పోవుచు పోవుచు, కులము తక్కువ కాకి మిడిసిపడిన పాట్లు ఇవి:—
| ఆ. | ఎలమి గడచిపోవు, బిలుచు, గ్రమ్మఱివ చ్చి | |
చెడి బ్రతికిన ఆ కాకి చేష్టలు ఎంతటి స్వభావముగ నున్నవి! ఎంతటి ఎచ్చింపులు ! అల్పుల మురిపెము ఇట్టిదేగదా. కవి పొడిమాటలే దీనికి ప్రాణము.
ఇంతేగాదు, హంసంబుల గోలిగొని నవ్వుచు, "మరాళంబు పరాభవంబు పొందెడు” మని, పెద్దయెలుగునం బలుకుచుండినది. ఈ పట్టున హంసయు భరితోత్సాహమైనది; నిగిడి పెలుచబఱచి, ఉదంచితత్వరితగమనకళావైదగ్ధ్యమును చూపినది. కాకము ఆకులాంతరంగంబును, వికలాంగంబునై, “బుద్ధిమాలి పోటీ బెట్టుకొంటిని, ఇచట గిరులు పొద లేమియు గనుపించవు" — అనుచు, దీనమానసంబై భయంబున కలంగి, డస్సి, సొగసి, అవశత కాకి అంతకంతకు దిగిపోవుచుండినది. సందు చూచుకొని హంసము కోడెగమునకు దిగినది. "నీ వనేకగతులు నే ర్తిది యేగతి చెపుమ?” అని బాధకు అవమానము కలిపినది. ఇక కాకి దీనావస్థ చూడండి:—
| క. | తలకొని జలములు పక్షం | |
'వాయసుడు' అనుటలో ఒళ్ళు దెలియక, తారతమ్యములు గమనించని మానవజాతినే ఉద్దేశించుచున్నాడు కవి.
కాకి కొవ్వున పొంగినదానికి చెంపలు వేసికొని —
| క. | నాకొలది యిప్పు డెఱిగితి, | |
| | జ్యా, కావు! నన్ను మగుడం | |
అని ప్రాధేయపడినది. చచ్చుబడిన నీచులు పడనిపాటే లేదుగదా! ఇక శరణాగతి దైన్యము ఒక లెక్కా పక్కా వారికి ! అందిన సిగ, అందకుండిన కాళ్ళు బట్టుట, ఇట్టి వారి కార్యాచరణవిధానము!
మున్నీట మునిగిపోవనున్న ఆ కాకిని, కలహంస కాబట్టి, అన్నీ మరచి, కారుణ్యమున, దానిని తనరెక్కలలో ఇరికించుకొని, మోసికొని ఎగిరివచ్చి, మిట్టన ఎప్పటినెలవున దానిని దించి, బుద్ధి సెప్పి తనదారిని తాను మిన్నంటి చక్రవాళంలో గలసిపోయినది.
కథ కవిత్వము బాగున్నవి. పాత్రల స్వభావమునకు ఇది దర్పణప్రాయము. కాని, కర్ణుని దూరను శల్యుని నోరెట్లు రేగినదో గమనించండి. అల్పు డెపుడు పలుకు ఆడంబరముగాను - అనిగదా పెద్దల వచనము!
పరిపక్వఫలభారావతనభూరిభూరుహమువలె, ఎఱుక కలిమిచే వంగి, “బుధారాధనవిరాజి" అని నమ్రతతో చెప్పుకొనిన మహాశిల్పి — తిక్కన మహానుభావునికి ఇవే నమోవాకములు.
'హరిహరనాథ, సర్వభువనార్చితి, నన్ దయజూడు మెపుడున్'
అని తిక్కనవలెనే ప్రార్థించి ముగించుచున్నాను.
అపర్ణ
నెల్లూరు 14-9-1970.
మరుపూరు కోదండరామరెడ్డి
మలిమాట
'తిక్కన భారతము' — అన్న తలపేరును గూర్చి కొంత చెప్పుకోవలసి ఉన్నది, 'శ్రీమదాంధ్రమహాభారతము' అన్నది, మొదట అచ్చువేసిన పండిత ముద్రాపకులు పెట్టినపేరు. 'శ్రీమత్' అన్న గౌరవవాచకం తీసివేస్తే, 'ఆంధ్రమహాభారతము' అన్నప్పుడు అది వచనమో ద్విపదో ఎవరు వ్రాసినదో తేలుట లేదు. ఇట్టివి ఎన్నో భారతములు ఇప్పుడు ఉన్నవిగదా! ఇంతేగాక, ఈ ఆంధ్రగ్రంథములో మహాభారతమనుటకు ఆధారము లేవీ లేవు.
నన్నయ ఆదిపర్వం మొదట 1-31 పద్యాలలోపల 8 మార్లు భారతమనే వాడినాడు. 3 చోట్ల ఛందోనుకూలముగ మహాభారత మన్నాడు. [భారతశ్రవణాసక్తియ 1-12; భారతకథాశ్రవణాభిరతిన్; భారతకథాశ్రవణప్రవణంబు -15; మహాభారత -16; భారతబద్ధస్పృహులగువారికి –17; భారతభారతీసముద్రము -19; భారతభారతీశుభగభస్తి -22; మహాభారతసంహిత -24; భారతఘోరరణంబు -25; చేసె భారతంబు -31.]
తిక్కన విరాటపర్వారంభంలో, 1-38 పద్యాలవరకు 5 చోట్ల భారతమనే చెప్పినాడు. [భారతాఖ్యమగు లేఖ్యంబైన ఆమ్నాయము 3; భారత మనుపేర బరగు పంచమవేదము -17; భారతసంహిత చెప్పగంటి -27; జనాభ్యర్చితమైన భారత మపారకృష్ణా -28; భారతామృతము గర్ణపుటంబుల -38; దీనితర్వాత — ఇమ్మహాభారతము అని — 43 లో వచనారంభమున నున్నది. ఈ 'మహా'పదాన్ని గద్యంలో ఎవరైనా ఇరికించి ఉండవచ్చును.]
కాబట్టి ఈగ్రంథమునకు 'తిక్కన భారతము'—(కర్ణపర్వము) అని పేరు బెట్టినా. ఈ పుస్తకమును చూడగానే ఇది తిక్కన వ్రాసిన పద్యగ్రంథమని, కర్ణపర్వమని సులభంగా తెలుకోగలుగుచున్నారు. ఇది చెవికి ఇంపుగా గూడ నున్నది. (EUPHONIC). ఈ శీర్షిక రసజ్ఞులకు మెచ్చుకోలు కాగలదని ఆశపడుచున్నాను.
12-1-72.మ. కో. రెడ్డి
- ↑ ఈకథ కన్నడభారతముననో, మరి ఏ అన్యభాషాభారతముననో ఉన్నట్లు కొందరుమిత్రులు నొక్కి చెప్పుచున్నారు. లేకున్నను ఇది ఒక రసవత్తరకల్పనముగా నున్నది.
- ↑ శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి అనువాదము
- ↑ ఈ క్రింది వచనభాగమును, ఒక శిథిలమగుచుండిన తెలుగులిపి సంస్కృతభారతమును చూచి, నా 'కర్ణుడు' పుస్తకములో ఉదాహరించియుంటిని. ఇప్పుడు ఆ ప్రతి వివరములను — సంపాదకుడు, ముద్రణాలయాదులు — చూడదలచుకొనగా, ఆశాస్త్రి గారు అది తుట్టమారా చెడిపోగా పారవేసినామని చెప్పి వ్యాకులమును కలిగించినారు. ఇతర కొన్ని సంస్కృతప్రతులలో ఇది లేదు.
- ↑
క. అంబర రవి శశి శాకా
బ్దంబులు చన, గాళయుక్తి భాద్రపదపుమా
సంబున, నంబరమణిబిం
బం బనదగు తిక్కయజ్వ బ్రహ్మము చేరెన్.1913 కాళయుక్తి, మరల 1978లో తగులును. వెనుకకుపోయిన యీ కాళయుక్తి సరిగా 1258కి సరిపోవుచున్నది.
- ↑ గొప్పవీరుని ప్రతిమలు చెక్కినరాళ్లు. వీరమరణమునొందిన ప్రఖ్యాతయోధులు అనేకుల స్మృత్యంకముగా ఇవి చాలతావులందు నిలవేయబడి ఉన్నవి.
- ↑ కర్ణపర్వము 3 ఆ. 13 వచనము క్రింది ఫుట్‌నోటును చూడుడు.