శృంగార వృత్తపద్యాల శతకము
శ్రీరస్తు.
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీ తిరువెంగళనాధ దేవునికి దాళ్ళపాక యన్నమాచార్యుల కుమారుండు పెదతిరుమలాచార్యులు విన్నపము చేసిన
శృంగార వృత్తపద్యాల శతకము.
ఉ॥శ్రీరమణీమణిప్రమదజీవన జీవనవాస వాసవా |
ధారవిశేష శేషవసుధాధరనాధవిహార హారకే |
యూరవిరాజిరాజిత మహెూన్నత దేవభుజంగ జంగమ|
స్మేరవికల్పకల్పకమ మిమ్మునుతి చెద వేంకటేశ్వరా||1||
ఉ॥చేతుల మొక్క మొక్కళపుజేతలఁ దిట్టకుదిట్టకూళమా|
టాతలనాడ నాడమఱియందఱిలోనిను మెత్తు మెత్తుచే|
చేతను గంద మబ్బురపుఁజెక్కులఁ జెక్కులతాంతమాత వి|
ఖ్యాత కచాళిచెంగటఁ గటాక్షము చల్లుము వేంకటేశ్వరా||2||
శా॥ఆళీభూతమరాళి కేళిఁ గని భృంగాళీక నాళీకరిం|
ఛోళింగన్ గొని బాళిఁ జెంది మదిలో జోలిన్ విరాళిన్ మహాo|
దోళంబందెను నిన్ను బాసి సతి నీతో జెప్ప నేతెంచితిం|
గేళిందేలి సమేళిఁగూడుమిటు లంకెన్ వేంకటాద్రీశ్వరా||3||
వృ॥చీరకు చీరకై ప్రియము చెప్పుచు నిమ్మని వేఁడ మాకడం|
జేరకు చేరకెక్కుడగు చెన్నగుకన్నుల నేయదల్తువే|
సారకు సారకుట్మలపుఁజన్నుల నొత్తుడు మీఱివచ్చిన౯|
సారెకు సారెకు౯ వలపుచల్లుదు నీపయి వేంకటేశ్వరా||4||
వృ॥పాయమువాడ వెంతటి కుపాయమునేరవు వూరివారికై|
నాయము చెప్పవత్తు విది నాయముగాదిపుడియ్యకొంటి మీ|
తోయము నీదువాక్యములు దోయము రమ్మిఁక నీకు నేను నా|
దాయముగాఁగ దార సముదాయముగూర్చితి వేంకటేశ్వరా||5||
వృ॥కలరా నాకిల రామలెవ్వరయినం దారీడుగా జోడుగా |
గలరా నీ వలరారఁజూచుకొను మింకా మానవా కానవా|
వలరాజవ్వలరాయడిoచఁ గసటల్ వద్దేలరాయాలరా |
కొలరా కాఁకలరాఁపు జేసినము నీకున్ వేంకటాద్రీశ్వరా||6||
మ॥వలెనా నాపయినింత నీకునిపుడె వయ్యాళి గయ్యాళిచెం|
తలనాకంటఁగ నేల బీరమచటన్ దాపించ గోపించనేఁ |
గలనా నా కుచదుగర్ముముల్ కరుణతోగైకొమ్ము నాకిఁమ్ము కో|
మల నానామధురాధరంబు కడుఁ బ్రేమమ్ వేంకటాద్రీశ్వరా||7||
ఉ॥వాసులు రెంచ కెంచకుము వారలవీరలజూపి మోపి నే|
నీసులు నేర దూరపయి నేఁటికి వేసెదు కేలుచాలు చీ |
కాసులయాస బాసగొని కౌంగిటఁగూడిన దానగాను లో|
మోసులువారఁగేరకుము మొక్కెదఁ గూడుము వేంకటేశ్వరా||8||
మ॥చలమా నీకలమాటలాడ నిచటన్ సాధించవాదించ నే|
ఫలమా యంగలమాయలెల్ల నెరపం బాలించుచాలించు మీ|
తలమా వారలమానసంబు లెటుచింతంబొందునో కందునో|
తలమావింతల కృపంగలయుమింతన్ వేంకటాద్రీశ్వరా||9||
మ॥వినుమా నీకనుమాయలన్ మొదల నేవిందాసఁగందాన నీ|
కును మాతో ననుమానముల్ వలదు బొంకుల్ మానునేఁ బోనునా|
చనుమానంబును మానమున్ నిలిపి మెచ్చంబాడినన్ గూడి నీ|
వును మారాడవు మాయెడంబొడమునవ్వుల్ వేంకటాద్రీశ్వరా||10||
మ॥ నెపముల్ చెప్పుచురాక యాకెతగులై నెందొంటి నాయింటికిం|
గపురుల్ చూపుచువచ్చి కృచ్చెదవునన్ గాందారి మాందారి పొ|
ద్దపుడే కౌంగిటలోఁగిటన్ మృదులశయ్యం జెందునాయందు నే|
రుపులీ నిద్దురపొద్దువ ద్దెసఁగు దూరుల్ వేంకటాద్రీశ్వరా ||11||
ఉ॥అంగన చంగనఁదొలగి అంటననంగఁ బొనుంగనీవు నిన్|
గంగున ఖంగునంబలికి కాఁకఁబెనంగి యనంగ విద్యలో|
లింగ నితాంజెలంగినలలిందను పంగన నుఁగు నేఁతతో ||
రంగునఁ బంగెనల్ విడిచిరమ్మని యేలితి వేంకటేశ్వరా||12||
ఉ॥గరుపారందమి రెంచి నీసకియఁజక్కంజేరి ముంజేతి బం|
గరుపారావత మేమి చూపెదవు వేగన్ గూడగన్ బాన్పుడ|
గ్గరుపారాజసమెంతసేసెదవు వేడన్ నీనుభావం బెరుం |
గరుపారంబుగ నెవ్వరుంగలయ మింకన్ వేంకటాద్రీశ్వరా||13||
మ॥మొదలన్ పూఁబొదలన్ మరుండురోదలన్ ముుందాడి పెందాడిగా|
గదలన్ తుమ్మెదలంగెరల్చి మెదలంగా గాలిసంసీలియై |
యెదలన్ గ్రెక్కదలంగఁ జేసి దుదలన్ హేలాంక బాలాలికిన్|
పొదల౯ సంపదల౯ వరించు మనిశంబు౯ వేంకటాద్రీశ్వరా||14||
మ॥సతుల౯ సమ్మతుల౯ గెరల్చి రతులంజాలంగనోలాచి౯న౯ |
పతుల౯ సంగతులం గరంచి తతులంబై కొందురా కాంతలై|
గతుల౯ మామితుల౯ వరించి మతులంగంగించి కుంగింతురా|
నతుల౯ నీనుతుల౯ మెలంగగలదాన౯ వేంకటాద్రీశ్వరా||15||
ఉ॥పోరక పోర కాఁకలను పొద్దొక పంతవుమాఁట మాఁటల౯|
దేరక దేరక త్తియకు దీకొనిరాఁ బనియేమి పోదుని౯|
దూర దూరకల్పితమితుల్ దడవం జన దింతిఁజూచి నో|
రూరక యూర కచ్చటన యుండుము నీవిఁక వేంకటేశ్వరా||16||
తా||గోర౯గీరిన నెరగు౯ సతులతో గోరాది కేరాకురా |
మేరల్ మీరెదవూరకైన నిను నేమిదూరమారాడరా |
వీరు౯ వారును సారెనాకుసరియా వేమారునామారుగా|
నారుల్ గోరిన లేరు కూడుమిఁక నెన్న౯ వేంకటాద్రీశ్వరా||17||
చ॥నెమకుచుఁబొంచువింటి యటునేర్పున యూరక యుంటినీపయిం|
జెమటలు మించంగంటి కలసె౯ నినుఁ దామరకంటియొంటిగా|
సమకొని మోవిగంటి యిదె సాకిరియుండఁగ యిట్టినోరనే|
యమరని మాఁటలేమిటికి నాడెద విప్పుడు వేంకటేశ్వరా||18||
మ॥పగలేలా తగులాయె నిద్దరికి నీపంతంబు లింతేఁటికి౯|
మిగులా బందుగులై నచోట నమరు౯ మేలంబు లోలిం గడు౯|
నగులీల౯ వగలిన్ని వెట్టుకొని మానంజూతురా తోతురా|
మగలెందు౯ నొగిలించ రింతులను రమ్మా వేంకటాద్రీశ్వరా||19||
శా॥ చన్నుల్ ముట్టకు నీవు నవ్వుచును రచ్చ౯ బచ్చిగా మిక్కిలి౯|
జిన్నల్ వేడుకయైనఁ బట్టుము సదా చేనిమ్మపండ్లే మ్మెల౯|
సన్నల్ సేయకు నీకు మ్రొక్కెదను నిచ్చల్ మెత్తు నీబత్తి కీ|
కన్నెల్ సాకిరిఁ గాఁగఁ జెప్పెదను బొంక౯ వేంకటాద్రీశ్వరా||20||
మ॥పొలుపారం జలపాదులై తగిలి నీపొందుల్ వెలుదుల్ గడుం|
దలపోయ౯ వల పెక్కుడయ్యె నదియే దక్కించి చొక్కించి నీ|
వలపారందలఁపాన నాపలుకునేఁ డాలించి పాలించెదా |
వలపో రాముల పాఁతవారివలెఁ బ్రోవ౯ వేంకటాద్రీశ్వరా||21||
మ॥మనవిందాతఁడు మెచ్చునా తగిలి ప్రేమ౯ విన్నవింపించగా
మనవిం దాఁ దలపోసి యియ్యకొనెఁ బొమ్మాపిల్వ నా సుద్ది క్ర|
మ్మన విందాన నొకర్తెచేఁ దొలుతనే మన్నించి యీవేళ తె|
మ్మనవిందాసతి కానుకందరము నియ్య౯ వేంకటాద్రీశ్వరా||22||
మ॥కనుపట్టంగను పట్టమేల నతివం గాపాడరా పాడరా|
మనకేలా మనకేల నున్నదిచె నీమర్మంబు నేమంబులం|
గనలంజంగన నంపి యాకెఁబిలువంగా నొద్దన౯ వొద్దన౯|
గని నీ చక్కని మోముజూపుమిటు వేడ్క౯ వేంకటాద్రీశ్వరా||23||
ఉ॥కందువ గూడకుండినను కందువడి౯ మనసెల్ల నింతికి౯|
పొందుగ విన్నవించి యిటు పొందుగడింతము నీతలంపులుం|
గందము మేలువాత౯ పలుకందము మెత్తువటంచు వచ్చితా|
మిందు నినుం గనుంగొనిరి ఇందునిభాస్యలు వేంకటేశ్వరా||24||
మ॥వరసా యెవ్వరు సాటినాకనుచుఁ దా వాదించె నీ కాంతన॥
మ్మరు సాధ్వుల్ మరుసాక్షి వేఁడుచును నీమాఁటల్ వినంగూడునే|
పరుసాలం బరుసాధ్యుఁజేయఁ దగునా పంగించ నిన్నేటికి౯|
విరసాలే విరసారె నావలన నుర్వి౯ వేంకటాద్రీశ్వరా||25||
మ॥గేలికిఁజొచ్చి నిన్ను రతి కేళికిఁబిల్చిన రాకయుండఁగా|
నాలికిఁజెల్లు దూక ప్రమదాలికి లోలుడవైతివంచు నీ|
పాలికి వచ్చు నంగనలఁబాలికిఁ బట్టిననీకు నేమి న౯ |
జాలికిఁ బాపుమానుపఁజాలి కిరీటిప వేంకటేశ్వరా||26||
మ॥వ్రతమా నీయెడ నాకు నేఁడలుకతో వాదించ సోదించనే|
కతమాడంగనుఁగొంటి నీవు సతితోఁగాడందురాయిందురా|
క్రితమా సుద్దువిట్టిఁ బిల్వఁగల నా కెంజాటి ముమ్మాటికి ౯|
గతమా కేఁటికిఁ జెప్పఁ గారణములింక౯ వేంకటాద్రీశ్వరా||27||
ఉ॥మేరలుమీరి దూరకుము మిక్కిలిఁజెక్కులునొక్కి గ్రమ్మర౯|
కూరిమిఁగోరి జేరితిమి కొంకుచు బొంకఁగ నింక నేటికి౯|
నేరనుసారెఁ బోరనిఁక నీవిపుడా వలఁ గావరింతురా |
నేరుతువౌర నారతులు నెట్టనఁజూడుము వేంకటేశ్వరా||28||
ఉ॥దండము వెట్టెద౯ వలపుతండము తండముగాఁదొడంగె ను|
ద్దండపుమాఁటలాడ కిటుదండనె యుండఁగ నీవునన్నుఁ గై|
దండ యెనర్చి నేఁడు విరిదండ యొసంగితి విట్లునాకు వే|
దండము నెక్కి నంతటి ముదంబటు గల్గెను వేంకటేశ్వరా||29||
ఉ॥గీరము నీదుచెక్కపుడు గీరము ముద్దిడఁ జీరె ముక్కుర్న|
నేరము చేసినం బలుక నేరము రమ్మిదె పువ్వదోఁటలో|
నీరములోనఁగూడి చన వీరముదంబు నలంచ మిత్తు నే|
గోరముఁ జేయకీ సురటిగోర మురాంతక వేంకటేశ్వరా||30||
ఉ॥ఆడకు దూరిమాఁటలిఁక నాడకు వత్తువుగాని వూరకే
వాడకు మోము జవ్వనము వాడకు మెవ్వ తెపట్లనైన నే
వాడకుఁ బోక కైకొనుకు వాడకు సాకుళులేలజోడుగా |
నోడకు దూలమైనక్రియ నోడక కూడుము వేంకటేశ్వరా||31||
ఉ॥తడబాటేటికిఁబోటికి౯ మగని యొద్దంజేరి దైవారి తా |
నొడఁబాటై కరగించఁ జెల్లు నిదె నీయొద్ద౯ విజృంభించి ని|
ల్కడఁ బాటల్ తగఁ బాడి యోడెఁ జెలికి౯ గట్టాయి దెట్టయ్యె నీఁ|
కడఁబాటింపుచు బాడుదు౯ వినుము వేడ్కన్ వేంకటాద్రీశ్వరా||32||
ఉ॥కానుకలిచ్చి నీ కెదురుగాను కరంబులుమోడ్చి మ్రొక్కియం|
దానను మీరివచ్చి మరి తానను నేఁటికి నీకె నవ్వెడిన్ |
మాను పరాకు నీవిచట మానుపడంగతమేమి యెప్పుడు౯|
మానము నీదు పొందులను మానములేటికి వేంటేశ్వరా||33||
ఉ॥చందనమాకెచల్లెఁ బెలుచందన మేర్పడ నీ కెదిట్టెనీ|
కుందనగంబుక్రిందఁ దనకుం గడు వాదువుట్టెనే |
వందనమాచరించి పిలువం దనరారఁగ వచ్చిరిద్ద రా |
సందనయోక్తిఁ దేల్చి యదునందన చొక్కుము వేంకటేశ్వరా||34||
ఉ॥సంగడి కాంతపొందులు వెసం గడియించితినంచు నంటివా|
యంగడినున్న పువ్వు వెలయం గడువుచ్చితి వీ వెరుంగవా|
గొంగడి గెంజలంబు లిరె కొంగడియాలము దానిలజ్జ యె|
ల్లం గడిగించి వచ్చెద నిల౯ గడివోతది వేంకటేశ్వరా||35||
ఉ॥పెంచె మరాళయాన తన పెంచెపుఁగృమ్ముడి భారమోచు౯ నే|
కొంచెము మద్యమంచు మదిఁ గొంచెమరిం దన యీడువారిలో|
మించెను నీవుగూడఁ గర మించెను వేడ్కలనీదు బాసలే|
పంచమ వేదమంచునుఁ బ్రపంచముసేసెను వేంకటేశ్వరా ||36||
ఉ॥యౌవ్వని కోమలాంగి మరి యెవ్వనితామణి నిన్నుఁజూడరా|
ద వ్వని పోదు నీవలపు దవ్వనిపొట్టిఁక లేదు ముగ్దవా |
క్రువ్వని కాంత టీని మెడఁగ్రువ్వని పేరుగఁదాల్చు మెప్పుడుం|
ద్రెవ్వని బాంధవంబు లెడత్రెవ్వని దేఁటికి వేంకటేశ్వరా||37||
ఉ॥పొత్తుల పాపఁడా మరుఁడు పొత్తుల మిమ్ముఁ గరంచుబోదునే|
నెత్తులు వెట్ట నీవలవు లెత్తుల పోలిక నున్న వెంచు మీ|
దెత్తు ల కాంత గంధి మొగమెత్తు లలాట మృగీమదంబు దా|
జొత్తులుగా గరంగెవొళ్ళ జొత్తుల నాడుము వేంకటేశ్వరా||38||
ఉ॥మదమున నాకె పాదముల మట్టితి విట్టి తెరంగులేల స|
మ్మదముగఁ జేసి కూడినను మంచిది పొంచి యెరుంగనట్లు స|
య్యదము సుఁగంట నేమిటికి నర్మిలి పేర్మిని నాఁట దానికి౯|
ముదము దలిర్పకున్న రతి మోహనమంటునే వేంక టేశ్వరా||39||
ఉ॥కారులు వల్కి నిన్నుఁ దొలుకారు మెరుంగలవంటి కామినుల్|
కేరుచుమారి ముందు దమకే రుచులెప్పుడుఁ కోరువారిలోఁ|
జేరి కె సేసి కూరుచ కుచేరి కరంబులనంటి మమ్ము నీ|
వారము చిత్తగించి ప్రతివారము నేలుము వేంకటేశ్వరా||40||
ఉ॥ఆఱడిబెట్టి నాపదము లంగనఁ రాఁకెనటంచు నూర కే|
గోఱడి సేసి కౌఁగిటనుఁ గ్రుచ్చెదవాకెను వేడుకయ్యెనో
పేఱడియౌ నుపాయమిది ప్రేమనటింపగ సందు గల్గెనే|
వీఱిడిఁగాను నీసతికి వేగమె మ్రొక్కగ వేంకటేశ్వరా||41||
ఉ॥చాయల సన్నల౯ వలపుచల్లిననూరక యున్న వాఁడవీ|
చాయల నిన్ను నంటమని సారెకు దూరకు మన్మధుండు ప|
ల్చాయల యమ్ములేసినను సైపగవచ్చునె నీకు నిట్టు లి|
చ్చాయల లేమలంబరచఁ జాలునటుండుము వేంకటేశ్వరా||42||
ఉ॥కాంతయు నీవుఁగూడి శశికాంత శిలాతలమందు వేడ్కతో
గొంతపుచూపుల౯ వలపు గొంత నటింపుచు నల్గి యంతలో
సంతసమంది తోడని వసంతములాడఁగఁ గంటి యాపె నా|
యంతరమెంచి చూడుము నిరంతరముందగ వేంకటేశ్వరా||43||
ఉ॥వాడిక నీ మెరంగులకు వాడి కడుందగ నున్న దాన నీ|
తోడికఁదప్పదంచు నిదె తోడి కళావతిఁ బూఁటవెట్టియే|
యాడికఁ బొందనంచు నిజమాడి మరి న్ననుఁగూడి జూదమి|
ట్లోడి కలంగి సాక్షి సతి నోడికఁజేతురె వేంకటేశ్వరా||44||
ఉ॥పెంచిన యాసతోడ వలపించితివందుల కేను నిన్నుఁ గా|
మించినదాన నేర్పునను మించి నయంబునఁ గౌఁగిలించఁగా|
నెంచినరీతి రాక యెలయించి నగాకృతినొంచెఁ జన్నులే|
నించిన కూర్మితోడఁ గరుణించుమునన్నిఁక వేంకటేశ్వరా||45||
ఉ॥మోసములేనియట్టి మనముందర నే పిరిదూరి చేరి తా|
దోస మెఱుంగది య్యబల తూకొనిసాకిరి వల్కెఁ గూలికి౯|
బోసముదాగ నేల తనపొందులు విందులు నేనెఱుంగుదు౯|
నీ సముకంబునందు విని నీవునదల్చవు వేంకటేశ్వరా||46||
ఉ॥సొలసీ నా చెలి నిన్నుఁజూచి తలమంచుంబొంచి పిల్వంగ మా|
మర్లసీ నిప్పుడు మేలమాడుచును మర్మంబుట నేమంటివో|
పొలసింగారు మెరుంగుచందమున నీపోంతంగళం కెంచకే|
కలసీ నిప్పుడు నిన్ను మెచ్చి వెలయంగా మేంకటాద్రీశ్వరా||47||
ఉ॥అనయంబు౯ వినయంబుతోడ నిను డాయ౯వచ్చిన౯ మచ్చిక౯|
మనసారన్ ఘనసార మిచ్చితివి సన్మానం బనూనంబుగా|
బెనుపొందున్ మనపొందు లిట్లు సవతుల్ బెట్టాసలన్ బాసలన్|
దనియంగం గినియంగఁ జూచెదరు చెంతన్ వేంకటాద్రీశ్వరా||48||
ఉ॥అనరాదా తనుఁజూచి నాకు నొకమాఁట న్నింట నాతోడఁ దా|
నెనరాదంచును నీవొసంగితివి నాకియ్యంగుళీముద్ర చ|
య్యన రాదప్పటనుండి చూడ నట కయ్యబ్జాక్షి నారీతి నే|
మనరాదా నినుఁగూడి వేడుకలుగ్రమ్మ౯ వేంకటాద్రీశ్వరా||49||
ఉ॥శంకట బొంకట న్నిటను చక్కఁగ నీకును నేఁడుపాన్పుపై|
కంకట మంక టంకములఁ గల్గిన దేఁటికి మేనఁ బూన నీ|
వంకట మంకట య్యబల వాసుల కేఁటికి గోర గీరెడిన్|
సంకటమెల్లఁ బాసెను విశంకట వేంకట శైలనాయకా||50||
ఉ॥శ్రీగలవాడవేమనినఁ జెల్లును నేనిఁక నడ్డమాడినన్ |
బాగులుగావు మౌనమున బంతముదక్కును మీరీపల్కినం|
దీగెలు సాగి యీరొక టిదీయఁగఁ బేనటువచ్చునండ్రు నీ|
భోగమునాకు నిచ్చితివి పొందుగఁ దొల్తనె వేంకటేశ్వరా||51||
ఉ॥వెలదుల తోడ నవ్వు పదివేవురఁ బెండిలియాడు నిన్ను నే|
వలదనదిట్టి వెల్ల మగవానికి సాజములాఁట దానికిం |
గలిగినదొక్క సిగ్గుననుఁ గౌఁగిటఁగూడుచు నన్యకాంతలం |
దలఁతురె నీకు మ్రొక్కెద వెతంబొరలించకు వేంకటేశ్వరా||52||
ఉ॥నాతియదల్చిపట్టకుము నన్నని యానలునీకుఁబెట్ట ఖ|
ద్యోతముఁ దెచ్చి యాకెయొడినుంచితి వప్పుడు నిప్పుసల్పితా|
నాతలఁ జేలయూడ్చి వెరగందుచు నీమెయినున్న పచ్చడం|
బాతరిఁ జొచ్చి నవ్వెతనయల్కయుఁ దీరెను వేంకటేశ్వరా||53||
ఉ॥అడవుల వేఁటలాఁడుచుఁ బ్రియంబిగురొత్తఁగ నీదుకాంతకు౯|
నడుమిది సింహమంచు జఘనంబిభమస్తకమంచు నంచ లే|
నడుపుటంచు జక్కవలు నవ్యకుచంబులటంచు నేయకే|
విడుతువు వాని నీకె పయివేడుక లెట్టివొ వేంకటేశ్వరా||54||
ఉ॥యెఱుఁగుదు బెక్కు ముద్దియల నేలినవాడవు గాన దూరినా|
వెఱవవటంచు నీకుఁ దగు వేయిటిఁ మీఁద జవాదికొమ్మునే|
నఱమఱలేక యిచ్చకములాడినఁ జిత్తమువచ్చు భత౯తోఁ|
గొఱకొఱలేల సేయ ననుకూలపుభార్యకు వేంకటేశ్వరా||55||
ఉ॥కామినిగోర నొత్తినది కస్తురి నీమెయిఁబూయదయ్యఁ దా|
వేమరుమోవి యానినది వీడెము సేయఁగనియ్యదయ్య నీ|
మోము చెమర్పజేసినది ముందరనే యలపార్చదయ్య నీ|
బూమెలుగంటి నాయెదుటఁ బొంకఁగ రాదిఁక వేంకటేశ్వరా||56||
ఉ॥చేతికి లోనుగానిపతిఁ జేరుట గోరముకాదటంచు నే |
నీ తలనెంత వేఁడుకొని యెక్కుడు కూరిమిచల్లి చూపినన్|
ఱాతికిఁబుట్టునే కొఱ కొఱ౯గిలిగింతలు నీవునట్లనే |
రీతులఁగూడినం గనికరింపులొనర్తువు వేంకటేశ్వరా||57||
చ||ననుఁగని మాఁటలాడెదవు నవ్వేదవూరకె దీమసంబునన్|
మనసొక చోటఁ బెట్టుకొని మర్మముగానఁగవచ్చె నాకు లే|
దనకుము దాని కేమి యిదియందరికింగల చాలు| నీతలం|
గనుఁగొనఁగల్గెనేమరి నగంబనిలేదిఁక వేంకటేశ్వరా||58||
చ||కావుర మెల్ల నాసతికిఁగానె యొనర్చితి వింతనాయెడన్|
దాఁపర మేలనే సెదవు తక్కులఁబెట్టక పల్కు కాదనన్ |
వీపిదిఁగానరాఁగ వెడవీఁగుచు దాఁగకు నేఁడు మోహముల్|
రేఁపుచు వీఁగుచుఁగూడవ చ్చెదవు రేవునుమాపును వేంకటేశ్వరా||59||
చ||అలుగము సేయమిట్లు మమునాఱడిఁబెట్టకు పెట్టినం నే|
కలుగదు లాభమిందులకు కాంతలఁ జేసినపుణ్యమొక్కటే|
నిలుచును వేఁడుకోవలదు నీకిదిచందము నేను నాలనై|
పిలిచిన నోయటంచుఁ గడుఁబ్రేమఁజెలంగెద వేంకటేశ్వరా||60||
చ||ఎఱుఁగక నవ్వినందులకు నేమనినా నిఁక నీకుఁజెల్లు నీ|
మఱుఁగున నాకెడాఁగినది మానుగ నే నటుచూడనైతి యీ|
తెఱఁగులు తొల్లి లేవు పలుదిక్కులఁ క్రొత్తలు నేచు కొంటివా||
వెఱపున లొంగుటేఁదెలియ వేసటబెట్టితి వేంకటేశ్వరా||61||
ఉ॥కామిని చన్నులంచును నగంబులుద్రాకి కరంబులుచు నా|
రామములోనఁ దీగెలను రాగపు కౌంగిటఁజేర్చి నిశ్చయం |
బేమిటఁజేయరాక మదినెంచి కుచుబులఁ దద్భుజంబులం|
బ్రేమ నఖంబులం గుఱులువెట్టితివప్పుడు వేంక టేశ్వరా||62||
చ||చెలి నిఁక గాసినేయ కిదె చెక్కిట చేదగజేర్చి సెజ్జ చెం|
తల నతి చింతలం గెరలి తక్కక నిన్నె తలంచెఁగాఁ కలన్|
కలగక యింతటం దగిలి కాఁగిటఁ జేర్చిన గించితియ్యెడన్|
నిలిచిన నేక కీర్తికాయట నీకిట శేషగిరీంద్రనాయకా||63||
చ||అలుగుచు గాంత మారుమొగమై యటుచూచిన దర్పణంబున౯|
బెళకక నీ మొగంబు ప్రతిబింబము గానఁగవచ్చె నంతలోఁ |
గలకల నీవు నవ్వితివి కాంతయునవ్వేను మీకు నద్దమే|
యలుకలు దెర్చెదోడి చెలు లచ్చరువందగ వేంకటేశ్వరా||64||
చ||వలిపెముగట్టి లేదొడల వన్నె మెఱుంగులు నిన్నుఁగప్పఁగా|
జలజదళాక్షి యంటె నటుసంపఁగినూనియ నీకునా కెమై|
నలఁదిన గందమే యమరె నప్పటి కయ్యట కంటిచందమై|
జలకములయ్యె పెంజెమట సంతసముదుము వేంక టేశ్వరా||65||
చ||పతముతోడఁ గొల్వు నను భామల మెల్లఁ గనుంగొనంగ నా|
కాంతకునీవు కంట సరిగట్టెదు కౌఁగిటఁ జేర్చుకటయ్యెనే |
యంతటఁ దీరెనే తనివి యాపెకు సందరిఁగన్మొరంగి నీ|
వెంత నెపంబుపెట్టి తిపు డిందులకే తిరు వేంకటేశ్వరా||66||
చ||సవతియటంచు రేసునను జవ్వనిఁదిట్టితి నోర్వలేక నీ|
వవలికి నేఁగి తాను విననర్హములా నెనరైన వారల౯ |
భువినొక రాడఁగామనసు పొక్కక మానునె కానవచ్చె లే |
వివరమిదౌను రమ్ము వీటవేషము మెచ్చితి వేంకటేశ్వరా||67||
చ||సురతపువేళ నీ మెరుఁగుసొమ్ములలోఁ దననీడగాంచి యే|
తరుణీయెవచ్చెనంచుఁ చెలి తత్తరమందుచుఁ జీరగట్టె నీ|
తుఱుమాటువీడే వెండ్రుకలుతోడనే యందులమీఁదఁగప్పగా|
విరసముమాని కూడెనని వింటిని నేనిటు వేంకటేశ్వరా||68||
చ||చనవరియైన కాంత యిదె సంగడి నిన్నోడిగట్టిన౯ గడున్|
బెనఁగఁగ నేల మాయెదుటఁబెంచకు తచ్చన మీరలొక్కటే|
ననుపున నేనొడబడిన నమ్మదు లోకముమాఁటలేల నే |
వనితను నీవినోదములు వద్దననేర్తునె వేంకటేశ్వరా||69||
ఉ॥పుక్కిటినీదుతమ్ములము పొందుగ వేడనొసంగవైతి వం|
దెక్కడనుండి తెచ్చితివొ యేసతిమీఁదటిమోహమో వృధా|
కక్కస పెట్టిన౯ వలపుగల్గిన పాటియెకాక యీగినేఁ |
డెక్కుడువచ్చునే సుదతులేఁకరినంతనే వేంకటేశ్వరా||70||
ఉ॥వేడుకకాఁడవౌదువు భువిం గమలాక్షుల కేప్పుడు౯ ననుం|
గూడినవాడవే పదరి కొంగిఁకఁజట్టకు నిన్ను మీరి మాఁ |
టాడెడుకాంత గల్గిన భయంబటువుట్టును నీకు నిందులం|
గ్రీడకు నింపుగాదెరిఁగి ప్రేమనటింపుము వేంకటేశ్వరా||71||
చ||మఱవకయుండఁ జేసితివి మన్ననతో నుపకారమెప్పుడు౯|
గుఱుతులు చన్గవన్నిలిపి కోరికెచెల్లెను రాకయుండినం |
గొఱతలు లేవు పద్మమునకు౯ రవికి౯ మఱియాద కేడ నీ|
వఱిముఱి నందు నున్న హృదయంబున బాయవు వేంకటేశ్వరా||72||
చ||కొసరుచుమాఁటలాడుమని కూరిమిచూపెదవాకెయుడఁగా|
నెసగునెముచ్చటాడ మనయింటికి వచ్చిన నట్లచే సెద౯|
సుసరముగాదు జంట మొనసూదిని రెంటెముగృవ్వనొక్కటే|
పొసఁగినచోట నేమనినఁబొంకగవచ్చును వేంకటేశ్వరా||73||
ఉ॥ఆసలఁ బెండ్లియాడి మఱియల్గినఁ జెల్లునె యెంత చేసినా|
వేసర నన్ను నీవునిఁక వేరుగఁజూడక మాఁటలాడుమీ|
దోసముగాదు నీగుణము తొల్లి నెఱుంగుడు తోడివారిలో|
వాసికి నేఁబెనంగెదను వంతలఁబెట్టకు వేంకటేశ్వరా||74||
చ||తగుఁదగుకునిద్దరికి దంపతులైతిరి యీ గవాక్షుల౯ |
మొగములు చూచుకొండు మరిమ్రొక్కుఁడు నేనిటుగంటినంచు మీ |
తగులమి మానరాదు రతితారసమాయెను మాకదేల యీ|
జగడము లింత కోపుదుమె చౌకలు సేయకు వేంకటేశ్వరా||75||
ఉ॥మాయలవాఁడవన్నిటను మాఁటలు నేర్తువు చేఁతలిన్నియుం॥
జాయకుఁ దెచ్చి చెప్పెదవు జాణతనంబిది మేలు వింటినే|
నీయెడగాఁదటన్న మరియేడకు నెక్కెడునాఁడు మాటన౯|
రాయడిఁబెట్టకింకఁ గొసరంబులుమారును వేంకటేశ్వరా||76||
ఉ॥తడవకు నీవు మమ్ము నినుఁ దప్పులు సారెకుఁ బట్టనేల నీ|
నడవడి యెప్పుడు గలది నాకిఁకఁ జక్కటులేల దిద్ద నీ |
పడఁతులు వారె నావలని పంగెనయేఁటికి నిందు మోహమె|
య్యెడలను లేదు నీకు నదియేను నెఱుంగుదు వేంకటేశ్వరా||77||
ఉ॥ఈదెసనన్ను వేఁడుకొని యింతటివాఁడవు బుజ్జగింపఁగాఁ|
గాదన నేల నిన్నుఁగడుఁ గల్లయొనర్చినవాఁడు వచ్చి తా|
లేదనినంతఁ బోవు మరలించితిఁ గోపము వాదులేలనీ |
పాదముదెమ్ము మ్రొక్కెదను పాన్పిదెరమ్మిఁక వేంకటేశ్వరా ||78||
చ||వెలఁదులు గొల్వుసేయునెడ వేడుక యొక్కతిమీఁదనిల్పి ని|
ట్టలముగ రత్న సౌధమున డాఁగిలిమూతల నాచరింతమా|
యలవడనంచు నేగి చెలి నక్కడఁగూడితి వెంతనేర్తు వో|
తెలియదు నీ మొఱంగని సతీమణులెంచిరి వేంకటేశ్వరా||79||
చ||చలమరించును నన్ను మరీ సారెకునాడెద వేవిసేసితి౯|
వెలుపలనీవునా పెయును వేడుకసల్పఁగ లోసనుంటి నేఁ|
గెలయుచు నింతిఁదిట్టితిని కింకల మీ రతివేళ విఘ్నముల్|
సలిపితినో వెతంబడకు సంగతులాయివి వేంకటేశ్వరా||80||
చ||పూని రతిశ్రమంబు ననుబోఁటియు నీవును నిద్రవోవఁగా|
లోనికివచ్చి కంజదళలోచనయొక్కతె నీదుమోవిపై |
తానొకగంటి సేసి యెడదవ్వులనుండఁగ మేలు కాంచి నీ|
పానుపుమీఁద కాంతయని పల్కఁగవచ్చునే వేంకటేశ్వరా||81||
చ||పేర్చి నయల్కతో సతులు బీరమునం బతిఁదిట్టువేళఁ దా|
నోర్చి ప్రియఁబువల్కుటకు నొద్దికతోడఁగరంగి మాటనూ |
రార్చి పెసంగు నవ్విభుని నక్కున జేర్తుదారు గారవంబున౯ |
నేర్చినవారికి వలపునిండు నిధానము వేంకటేశ్వరా||82||
ఉ॥ సంగడి నాకెయున్నదని సన్నలఁజెప్పెదవేను వచ్చినన్|
సంగతిగాదు మానినులఁ జౌకలు నేతు రె నీవు కాంతకు౯|
పంగెనవాఁడవా యెఱుఁగ బత్తియొనర్పఁగ నిన్ను జేరితి౯|
కంగెను దానిచితమిది గారణమై కడు వేంకటేశ్వరా||83||
ఉ॥చందురుఁడేమి సేయు మఱి చల్లనిగాలి కోఱంతయేది మా|
యందు వసఁతుఁడేడ పగయంగజునేఁటికి సారెదూర నీ |
విందుల కేగుదేఱక లయించఁగ వీరలు నీకతంబునన్ |
నిందలఁ బొందిరింకఁ గృపనించగదే తిరువేంకటేశ్వరా||84||
ఉ॥పిలువకునన్ను లోపలికి పెంపున నే సతి యెందునుండునో|
తెలియదు యేమఱించి మరి దిగ్గనవాకిటఁ జేరి నిల్చితి౯|
మలయుచు వట్టి దీమసపుమాఁటలు మానవు పంతగానికి౯|
నలె నిది నిన్ను మెచ్చితిని వచ్చితిఁ గూడితి వేంకటేశ్వరా||85||
ఉ॥పడతికి నీవు నమ్ముమని బాసలు చేయుచు నున్న వేళ న|
క్కడ నొక లేమ మీనటన కాంక్షలఁజూడఁగ దిష్టదిబ్బముల్|
దొడికెదనంచు నా కె చనుదోయి కరంబునఁ బట్టి నంత నీ|
నడవడిచూచి తొంటిసతి నవ్వెఁగదా తిరువేంకటేశ్వరా||86||
ఉ॥చల్లనిమాటఁలాడఁగను సారెకుఁ గోపము చూపరాదు నీ|
తొల్లిటి సేఁత లెంచినను తోడనె యందులకోర్వరాదిల౯॥
కల్లలు గల్గిన౯ విభునిఁగాదనఁజెల్లునె కాంతకు౯ సదా |
యుల్లమునందు సంతసిలియుండుట మేలిఁక వేంకటేశ్వరా||87||
ఉ॥నిక్కుచుఁజూచి యొక్కరితె నీకును ముచ్చటఁ జెప్పుచుండఁగా|
గక్కన వేగువెట్టుకొని కామిని యాచెలిఁ దమ్మవేసిన౯ |
చెక్కిలిదాఁకి యారజము చేరువనుండిన నీపయింబడె౯ |
చక్కటి నేలమానుమరిసంగడి నేరమి వేంకటేశ్వరా||88||
ఉ॥చన్నులు పూర్ణకుంభముల సాటిగ యెవ్వ తెనీకుఁజూపెనో|
సన్నుత దృక్చకోరముల చక్కఁగ మిక్కిలి వాలఁజేసెనో |
నన్నునుఁ గూడితౌను శఖున స్థితిమంచిది నీవువచ్చుచో|
నిన్నటి కోపమంతయును నెమ్మదిఁ బాసెను వేంక టేశ్వరా||89||
ఉ॥ఏదిర నాదు కంటసరి యిప్పుడు నీచెలిమేనఁ బెట్టితి౯|
నీదెసఁ జుట్టమాయదియు నెట్టన నీవలెనుండఁగానె పో |
పాదుగదాని నంటితివొ పైకొని నీపనుపంచునుంటినే |
భేదము లేక నీవలపు పెంచెదు బాపురె వేంకటేశ్వరా||90||
చ||ఇల దొరలైన మానవతులెమ్మెలు చూపరు గుట్టుతోడనే|
మెలఁగుదురారజంబులను మేలములాడరు దంటయెవ్వతో|
కిలకిల నవ్వి ని౯ జెనకి క్రిందట మీఁదట లాడుచున్న దీ|
వలపులు నీకునుం బ్రియమొ వద్దనవైతివి వేంకటేశ్వరా||91||
ఉ॥ఇంటికి నిన్నుఁబిల్చి కడనెమ్మెలఁ బోవుచు నీయురంబున౯|
జంటగఁ జన్నులొత్తి నది చక్కఁగ రెంటెము గప్పు మందుపై|
నంటునఁ జూడరానివవి నాతుల సిగ్గులు దాఁచుటొప్పగు౯|
గొంటరివాకె నీవయిన గోప్యము సేయుము వేంకటేశ్వరా||92||
చ||మొదలనె నీవు నాదుపయి మోహము నించితి వింతలోననే|
వదలకు నీ వయోమదము వంచఁగ రాదిఁక వేయునేల నీ|
యుదుటులు గానవచ్చెఁ జెలులొద్దని డగ్గరి యున్న వారు నీ|
వదిమది నెంచుకొమ్ము వెడయాసలఁబెట్టకు వేంకటేశ్వరా||93||
చ||వలచినదాననేను మరివాసులు చూడఁగనేల యొద్దకుం|
బిలిచినఁ బిల్వకుండిననుఁ బెంపునఁ గొల్వులు సేయుచుండిన|
సెలవగు నాదు జవ్వనము చెప్పితి నీకిఁక నన్య కాంతలం|
గలయఁగ వేళ యౌనొ మఱికాదొ యెఱుంగను వేంకటేశ్వరా||94||
చ||పెనఁగకు నాయెడ౯ మనసుబెట్టితి నీకును వీడెమింద నీ|
చనువునఁ గొంగుపట్టితిని జారకు సంపదగల్గువారికి౯ |
వనితలు పెక్కులై తగులవచ్చినఁ జప్పనయౌనమైన నెం|
జెనకక మాన నిన్ను నిఁక సిగ్గులు చెల్లునె వేంకటేశ్వరా||95||
చ||ఒట్టులు మీరు వెట్టుకొని యోర్వక సంగడి బట్టెమంచముల్|
గుట్టుననెక్కి యాకె చనుగుబ్బల మారని కోళ్లు వేడ్కతో|
గట్టిగఁ గౌఁగిలించితివి శాంతయు గౌఁగిటలో దలాడ యే |
నెట్టన నీదు మారనుచు నించె ముదంబున వేంకటేశ్వరా||96||
ఉ॥అవ్వలనుండి యొక్క సతి యప్పుడువచ్చిన నేను నుండఁగా|
నవ్వెడురీతిఁ జొబ్బిలఁగ నాపయి గందము నీవు చల్లినం|
జివ్వననేను వేఱయొక చీర ధరింపఁగ నేఁగినంత నా |
జవ్వనిఁ గూడుకొంటి వది సందుగఁ గైకొని వేంకటేశ్వరా||97||
చ||కరమటువేసె నీదుపయిఁ గాంతల సందడిఁ బవ్వళింపఁగాఁ|
దరుణియొకతె౯ వేఱొకతె తానును బాదమువేసె నంత నీ|
చరణమయంచు నింతి చెయిచాఁచిన నా పె యెఱింగి తిట్టె ని|
ట్లరయఁగ నీవ రెంటికపుడాశ్రయమైతివి వేంకటేశ్వరా||98||
ఉ॥ చీటికిమాటికి బలుకు చెల్లఁగఁబెట్టెను నీదు చెక్కులం|
గాటుక లేలవచ్చె నవిగానక యాడితివేమొ చూచుకో|
గాటపుటద్దమందు మఱికల్ల నిజంబులు తానె యేర్పడు౯|
సాటికిఁ బేటికిం బగలు చాటఁగనేటికి వేంకటేశ్వరా||99||
చ||పులకలు మేననిండె నొకబోటినిఁ బేర్కొనినంత నీకు నేఁ|
బిలువఁగఁ బోదునో మగనిఁ బెండిలిసేసినఁ బుణ్యమౌను నా|
వలపటు వెట్టు నీ మనసు వచ్చినఁ బాలును నవ్వుగాదు నా|
తలఁపునఁ బాయ వెప్పుడును దప్పదు శ్రీ తిరువేంకటేశ్వరా||100||
చ||సరసుఁడవన్నిట౯ మిగులజాణవు నిన్ను నుతించు టొప్పగు౯|
దరుణికి వ్యంగ్యమాడవలె దప్పక కాంతునిఁ గన్న చోటుల౯|
విరసముగాదు చిత్తభవవిద్యకుమంత్రము దీనికై నినుం |
బరుసము లాడితిం బదరి పట్టకు మెగ్గులు వేంకటేశ్వరా||101||
చ||అలికులవేణి నొక్కరితె నంటితి వంచును వింటి దానికే|
యలిగితి నీవు లేదనుచు నానలువెట్టెదు సారెసారెకుం |
జలములుమానిన౯ మనసు సందియమేటికీ మానుఁ జాలు నీఁ|
నిలువునఁ గల్ల గల్గినను నిన్నె భజింతుము వేంకటేశ్వరా||102||
ఉ॥తాలిమితోడ నేఁ బిలిచి దండకు రమ్మని యానపెట్టి నం|
దేలఁగఁజూచి డగ్గఱవు దీనన సందియమయ్యె నాకు వే |
సాలకు నంటఁగాని సతి చయ్యన కూరిమి నిన్ను నంటెనో|
మేలముతోడఁ బిల్చి చెయి మీరెదనంచునొ వేంకటేశ్వరా||103||
ఉభయవృత్తపద్యాలు 103
శ్రీకృష్ణార్పణమస్తు
శృంగార వృత్తపద్యాలు సమాప్తము.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse