Jump to content

శృంగార మంజరి

వికీసోర్స్ నుండి

శ్రీ

శృంగార మంజరి.

(అ.చా)

శ్రీమతే రామానుజాయ నమః

తాళ్లపాక యన్నమాచార్యులు తిరువేంగళనాథ దేవునికి

విన్నపము చేసిన శృంగార మంజరి.


శ్రీకామినీవక్షు జితహిరణ్యాక్షు[1] | భువనపాలనదక్షుఁ[2]బుండరీకాక్షు |
వివిధగీర్వాణాద్యు[3] వేదాంతవేద్యుఁ | బరమతత్త్వాపాద్యు[4] [5]భవరోగవైద్యు |
శోభితగుణధాము[6]సురసార్వభౌము | మౌనిమానసహంసు [7]మథితోగ్రకంసు |
శేషాహివరతల్పు సిద్ధసంకల్పు | [8]నీలోత్పలవ్యూహ నీలాంబువాహ |
నీలాద్రిసంకాశు[9] [10]నిబిడప్రకాశు | నిర్మలతరదేహు [11]నిగమాంతగేహు |
గోపాంగనాకుంభకుచశాతకుంభ[12] | కుంభకుంకుమ [13] చారుగురుతరాకారు |
వేణునాదామోదు[14]విహితప్రసాదు | నవ్యక్తు[15]నతవేద్యునాద్యునద్వంద్వు[16]
నధ్యాత్మునచ్యుతు[17]నాద్యంతరహితు | నిర్గుణు[18]నిఖిలాండనిర్మాణనిపుణు |
నిర్వాణు నిర్మలు నిత్యు నిశ్చింతు | సర్వజ్ఞు సాకారు సచ్చిదానందు | సర్వతోముఖరూపు[19] సత్యస్వరూపు |
నఖిలహిరణ్యగర్భాండనాయకుని | వివిధలోకాధీశు వేంకటాద్రీశు | నధిక తేజోమూర్తి [20]నలరెడువాని|
గంగానదీజన్మకారణం బనఁగ | బొగడొందు తనపదాంభోజముల్‌ [21]సూపి |
యింపొందవైకుంఠమిదియసుమ్మనుచు | సొంపొందవలకేలఁ[22]జూపెడువాని |
ఘనదైత్యగర్వాంధకారంబు[23] లెల్ల | మానుప దేదీప్యమానమై[24] వెలుఁగు |

చక్రగదాశంఖశార్గంబు[25] లెపుడు | [26]తలకొని యిరువంకఁ దాల్చినవాని |
నరకంట సిరితోడ నలిగి భూకాంతఁ | గలసి యిద్దఱలోనఁ [27]గైలాటమిడుచు |
[28]వలపునఁ గడకంట నలరెడువాని | నెండవెన్నెలతోడ నేకమై కూడి |
రెండుకన్నుల సంధి [29]రెట్టింపుచున్న | గగనంబు[30] దాఁకినకన్నులవాని |
ద్రవిళాంగనాఘనస్తనమండలాగ్ర | [31]పరిరంభ[32]జృంభిసంభ్రమవిలాసముల |
[33]బెరసినకుంకుమపీతాంబరంబు | కడఁగి[34]రింగులువాఱఁ[35]గాసించువాని |
బ్రహ్మాండమైయుండిబ్రహ్మమైయుండి | [36]పరమాణువైయుండిపరమమైయుండి |
సచరాత్ముఁడై[37]చరియించువానినమరాద్రితో[38]మాద్రి[39]యగు వేంకటాద్రి |
నున్నతోన్నతలీల నుండెడువాని | శృంగారవిఖ్యాతి [40]చెలువంబురీతి |
[41]నొయ్యారములబాగు[42]నొసపరిలాగు | [43]రాజసంబులసొంపు రసికతపెంపు |
సరసత్వములచెల్మి [44]చతురతకల్మి | సకలజనానందసంస్తుతిచేత |
వినివినియొకబాల[45]వికచాంబుజాక్షి | చెలువ[46]కోకిలవాణి చిగురాకుఁబోణి[47] |
తలఁపులవిశ్రాంతి[48] తలిరాకు బంతి | [49]వలరాజు చిగురెల్లి వలపులవెల్లి[50] |
[51]కడివోనిపూముల్కి[52] కన్నులకల్కి[53] | చిత్తంబు చిగురించి స్వేదంబు వెంచి |
సిగ్గులు వో సురిఁగి[54] చింత లోఁబెరిగి | కాంక్షలఁ గడుఁ బొదలి గర్వంబు వదలి |
కోరికి మదిఁ బేరి[55] కోపంబు మీఱి | వినుకలి[56] దలపోసి వెరవులఁ బాసి|

[57]వెట్టల కెదురేఁగి [58]వెతలనుగ్రాగి | యున్నంతఁ జెలిభావ మువిదలు[59]చూచి |
యీముద్దరాలికి[60] నీవిలాసినికి | నీపూవుఁబోడికి నేలొకో[61] నేఁడు |
వివరింపఁ దలఁపులు వింత లై తోఁచెఁ | బంచశరాసక్తి ప్రభవింపఁ బోలు |
నింతలో మరుఁడు దండెత్తకమున్న[62] | పచ్చనివిలు చేతఁ బట్టకమున్న |
[63]చిగురంపగమి [64]చికిలి సేయక మున్న | కోకిల మద మెత్తి [65]గొణఁగకమున్న |
[66]కీరంబు వాయెత్తి[67]కెలయకమున్న | రాయంచ లెదిరించి రాయకమున్న |
సుదతి కారామంబు[68] చూపి మరుపిచ్చి | మాటలమాటున మఱపింత మనుచు |
నారామఁ[69] దోడ్కొని యారామమునకుఁ | జనుచోట నెదిరె వసంతోత్సవంబు |
[70]పాంథులనునుసిగ్గు బయలైనరీతి | [71]కారాకు లెడలి వృక్షంబులు నిలిచె |
తగ విరహులకోర్కి తలిరించె ననఁగ | నవకమై[72] చిగుళులు ననిచె[73] భూజముల |
వలరాజురాకకు వనమహీజములు | కలయఁ గట్టినమేలుకట్లో[74]యనంగ |
నిండారఁ దరువులనీడలు నిండెఁ | [75]గోల[76]తమాల[77]తక్కోల కాకోల |
తాల[78]హింతాలకోత్తాలకుద్దాల[79] | [80]సాలబాలరసాల [81]జాలనేపాల[82] |
[83]తారజంబీరమందారఖర్జూర | [84]గంధఫలీకుండఘనపిచుమంద[85] |
తరువులు విరువులై తలిరించి మించెఁ | దీఁగలు సోగలై[86] తెగమాఱి పాఱె |
వనలక్ష్మి పూర్ణయౌవనవీథియందుఁ | గడఁగిమాధవుఁడు వేడ్కలఁ గ్రొత్తగాఁగ |
నొత్తిననఖపంక్తు[87] లున్నచందమునఁ | [88]గింశుకంబులు గోరగించి[89]మోదించె |
గురువింద లిగిరించె గుత్తులు నించె | [90]మాకందతరు లేచె మల్లెలు పూచెఁ |

బొన్నలు వికసించెఁ బొగడలు నించెఁ | బనసలు నెరిసె సంపంగలు విరిసె |
[91]మలయజంబు లెలర్చె మరువంబు పేర్చె | నేవంకఁ జూచిన నెల్ల భూజములు |
శాఖోపశాఖ లసంఖ్య మై నిగుఁడ[92] | బూవుగుత్తులచేతఁ బూపలచేతఁ[93] |
బరిపక్వరసపూర్ణఫలములచేత | గగనమండల మెల్లఁగలయ[94] నందంద |
కప్పిన నిబిడాంధకారంబుదోఁపఁ[95]దారనివిరు లెల్లఁ దారలు గాఁగఁ |
గురియుపూఁదేనెల[96] క్రొమ్మంచుమించ | [97]మలయఁబుప్పొళ్లదుమారంబు[98] రేఁగఁ |
గేలీగృహాంగణాంకితఘననూత్న | వజ్రప్రకాశదివ్యప్రభావలుల[99] |
వెలుఁగొంది దట్టంపు వెన్నెల గాయఁ | [100]గుముదాకరంబులఁ గూటంబు మాని |
కుముదాకరంబులఁగొమరు[101] దీపించి | [102]పద్మరాగప్రభాప్రౌఢిమ వంపఁ[103] |
బద్మరాగప్రౌఢిమ దోఁప | [104]జ్యోతిర్లతాక్రాంతశోభితశ్రీలు |
బాలార్కకిరణసౌభాగ్యంబు లొదవ | సకలవనాంత[105]విశ్రాంత పాంథులకుఁ |
బగలు రేలై తోఁచుఁ బరికింప రేలు | పగళులై తోఁచి విభ్రాంతి పుట్టించు |
నత్యంతవేగవిహారమారుతము | సొరిది[106] నవ్వనవీథి సొచ్చినంతటను |
[107]గడఁగి[108]గందపుఁగొండకందువ[109] మఱచి[110]క్రమ్మఱ నొకవంకఁ గదలిపోలేక |
ఫణిరాజముఖులకుఁ [111]బసలు పుట్టించు | [112]ఫణిరాజగోత్రసౌభాగ్యంబు మరఁగి |
[113]కదిసి యాకాశగంగాతరంగముల | నాడెడునవ్యదివ్యాంగనాశ్రేణి |
కుచకుంభలిప్త[114] కుంకుమములతోడఁ | [115]జల్లుఁ బోరాడు నిచ్చలు[116] నొక్కవేళ |
మాధవీనవలతామందిరామంద | సౌధవీథీఘనస్థలములు [117]మెట్టి |

తీఁగెయుయ్యల లూఁగు దిన మొక్కవేళ | శ్రీవేంకటేశు [118]నూర్జితకృపావేశు |
నినకోటిరుచిమంతు [119]నిందిరాకాంతుఁ | గనుఁగొనఁ గోరి వేడ్కలు దొంగలింప[120] |
సకలదిగంతర[121] స్థలములనుండి | చక్కని చిక్కని[122] జవరాండ్రు[123] నడవ |
నడపులయెడల[124] నెన్నడుములు బడలఁ | గస్తూరిపూఁతలు గరఁగి లోజాఱ |
శిరసులజవ్వాది చెక్కిళ్లఁ గాఱ | నలసతఁ గనుఁగ్రేవ[125] నలరు కామినుల |
[126]పయ్యద లెడలించి పాలిండ్లుదూరి[127] | కుటిలకుంతలములఁ[128] గునిసియల్లార్చి[129] |
చిగురాకుఁబోడుల సేదలు దీర్చి | [130]గొబ్బునఁ దావి దిక్కులఁ జోడుముట్ట[131] |
నుబ్బున విహరించు నొక్కొక్కవేళఁ | తలకొని వనవీథిఁ [132]దలవరివోలెఁ |
గార్తవీర్యుఁడువోలెఁ [133]గంతుఁడువోలె | నాగరికుఁడువోలె నానావిధముల |
[134]మలయుచు విహరించు మందానిలుండు | అంత నాకామినుల లందఱుఁ గూడి |
చల్లనినెత్తావి చల్లెడుచోటఁ | దూఁగుటుయ్యలలఁ [135]కందువల చెందొవల[136] |
కొలఁకులఁ గెలఁకులఁ [137]గురివిందపొదల | భామలో [138]రతిరాజు [139]పసనిసామ్రాజ్య |
సీమలో రసికుల చిత్తంబులోని | ప్రేమలో యనఁగ గంభీరంబు మెఱసి |
[140]కళుకులో చిగురాకు[141] కరవాలుఁగొనల | తళుకులో విటులడెందములఁగాపాడు |
ములుకులో యనఁగ[142] నిమ్ముల నుల్లసిల్లి | బాలలో పుష్పాస్త్రు బంగారు నాట్య |
శాలలో పూవింట [143]జడికొన్న [144]యంప | కోలలో తలఁపులో గుదికొన్న తాల్మి |
చీలలో యనఁగ నచ్చెలు లెల్లఁ గూడి | యవయవశ్రీల నొయ్యారంబుదొరయ[145] |
ఘనవయోగర్వాంధకారంబు మెఱయఁ | [146]దోరంపుటినరశ్మి దూఱక నిగుడి |

[147]మత్తిల్లునవలతామంటపవీథిఁ | [148]దఱచుచీకట్లు బిత్తరములు[149] చిమ్మఁ |
దమముఖచంద్రవిస్తారదీధితులు[150] | వెలుఁగొంద నలుగడ విహరించువారు |
దట్టంపు లేమావి తరువుల క్రింద | సొంపైన పూఁదేనె సోనలఁ[151] దడిసి |
పొదరిండ్లచాటునఁ బొదిగొని[152] నిలువ | తమముఖాంబుజములతావులఁ[153] దగిలి |
పైకొన్న[154] యలికదంబముల సందడికిఁ | దప్పించుకొని తొలఁగ దాఁటెడువారు |
చెలులతోఁ బడి దప్పి చెదరినసఖులు | రమణీయశుకపికారావంబు వినుచుఁ |
జెలికత్తెలో యని [155]చీరెడువారు | [156]మదవతీజనులకమ్మఁదనంపుఁబూవు |
బంతులసరసంబు పైకొనియాడఁ | జెదరినపుప్పొళ్ళచేఁ[157] దొప్పఁదోఁగి |
[158]సిబ్బెంపుమేనులఁ జెలఁగెడువారు | కొలికిఁదామరకొలంకులదండ[159] (మెండు) |
నిలిచి తమతమమేనినీడలపొలుఁపు[160] | గనుఁగొని యానాగకన్నెలో యనుచు |
వేడుకఁ బలుమాఱు వెఱఁగందువారు | నై సఖీరత్నంబు లంతంత నిలిచి |
[161]లేమా విలాసంబు లేమావి[162] మంచి | లేమావిఁజేచాఁపలేమా యటంచుఁ |
దిలకంబు దీర్పక తిలకించిచూడు | [163]తిలకంబు మానినీతిలకంబ[164] యనుచు |
[165]నడుగుకందువ గోరియడుగు నశోక | మడిగెడు బోఁటి నీ [166]యడుగు లాననుచు |
[167]గర్ణికారంబు లాకర్ణింపఁ బలుకు | [168]గర్ణికారమణీయకాంతిగా ననుచుఁ[169] |
[170]గురవకావలికిఁ జేకుఱ [171]వకావిరులు | కొమ్మకౌఁగిటఁ జేర్చుకొమ్మకాయనుచుఁ |
[172]గేసరంబుల బోఁటి కేసరంబులుగ | [173]వారుణిఁదోఁచు [174]దైవాఱగా ననుచుఁ |
జతురభావంబుల సరసభాషణము | లాడుచు విహరించు నంతలోపలను |

వనపాలకాంతలు వనవిలాసినులు|[175]పొదిగొన్న చక్కని పుష్పకోమలులు|
గర్వంపుఁజూపుల కమలలోచనులు|[176]కైసేసి శృంగారగరిమలు[177] వొదల|
నఖిలలోకేశుమోహనమూర్తిఁ గాంచి|[178]ప్రణయపూర్వకముగాఁ బ్రస్తుతి చేసి|
యోదేవతారాధ్య యోభక్తసాధ్య|యోలోకమందార యోభవదూర[179]|
యోవేంకటాద్రీశ యోకృపావేశ|శృంగారవనకేలిఁ జిత్తంబు గలిగి|
విచ్చేసి వేడ్కల విహరింపవలయుఁ|గోనేటిదరి నున్న [180]కొదమసంపెంగ|
తరువులు వికసించెఁ దముఁ గానరావు|గుఱిలేనిపువ్వులు గురిసి క్రిక్కిఱిసి|
[181]పరవనిచోట్లెల్లఁ బాన్పులై చూడఁ|బొగడల విశ్రాంతి పొగడ నచ్చెరువు[182]|
పొదిగొన్న సేవంతిపొదరిండ్లక్రిందఁ|బలుమాఱుఁ గురిసినపన్నీటిసోన|
పలవల నునుజాలువాఱి[183] దైవాఱి[184]|యేఱులై యేప్రొద్దు నీఁతలఁ[185] బాఱు|
గందంపుమ్రాఁకులకడ నున్నఫణులు[186]|చందనగంధులసౌరభంబునకుఁ[187]|
బైకొని మైగాలిఁ బసివట్టి[188] తిరుగు|మెలఁగు [189]మయూరగామినులౌట యెఱిఁగి|
తఱచైనఘనసార[190] తరువులక్రిందఁ|బొర లూడి రాలుకర్పూరంపుసిరము[191]|
తిన్నలై[192] విహరింపఁ దిన్ననై యుండు|నని యని [193]తరితీపు లతివలు వలుక|
నఖిలలోకారాధ్యుఁ డతికృపామూర్తి|మగువల వయసు [194]లామనికొల్లకాఁడు|
భామల తలఁపులోపలి గారడీఁడు|వెలలేని వలపుల వేడుకకాఁడు|
కోనేటిరాయండు [195]కుంభినీస్వామి|[196]శ్రీవత్సధారుఁ డాశ్రితవత్సలుండు|
వెలఁదులమాటలు వేడ్క దీపింపఁ|జిత్తాబ్జమునఁ జేర్చి చిఱునవ్వు నవ్వి|
యత్యంతరూపమహామూర్తి గాన|నఖిలశృంగారాబ్ధి[197] కధిపతి గాన|
సకలవైభవమహోజ్జ్వలతఁ[198] బెంపొంది|గమనోన్ముఖుం[199] డైనగదలు[200] దానెఱిఁగి|
పాదారవిందసంస్పర్శంబు సేయఁ|గోరిక దలకూడఁ[201] గుండలికర్త[202] (భర్త?)|

పసిఁడిపాదుకల స్వభావమై నిలువఁ|గైకొని మెట్ట నక్కడిచోటు లెల్లఁ|
బ్రతిపదంబును మోక్షపదములై నిలువ|నింద్రాది దిక్పతులిరువంకఁ గొలువఁ|
[203]గమలభవాదులు గదిసి తో నడవఁ|గిన్నర గంధర్వ ఖేచర యక్ష|
గరుడ విద్యాధర గాన మానములు[204]|వీనుల కిం పొంద విందులు సేయ|
[205]విరివైన యుద్యానవీథులు సొచ్చి|విశ్రాంత భూముల విహరించుచోట|
నేవేళ నేకాల మెక్కడఁ దలఁచె|నావేళ నాకాల మక్కడఁ గలిగి|
సకలపదార్థగోచరములై[206] యుండి|చతురవిద్యాగోష్ఠిఁ[207] జరియించునంత|
నఖిలాదినాథు మోహన మహామూర్తిఁ|బలుమాఱు మును విన్న భామాలలామ|
చెలులకు మన సీక చిత్తంబు రాక|పొలుపైనయలవోకఁ[208] బ్రొద్దులు వోక|
సఖులతోఁ బుష్పాపచయకేలిఁ[209] దగిలి|యున్నంతఁ జెలిభావ మువిదలు చూచి|
పువ్వులు [210]జడిగొన్న పొదరిండ్లు దూఱి|కాంతల నొండొంటిఁ గడవంగఁ బాఱి|
తఱచైనవిరు లెల్లఁ దమ వని కోరి|చెదరిన [211]లతలెల్లఁ జేరంగఁ దీసి|
యందనిక్రొవ్విరు[212] లందంది కోసి|తావి[213] వోవకయుండఁ [214]దలిరులు మూసి|
రాలినపుప్పొళ్లు రాసులు చేసి|[215]యనిలంబు కెదురు మహాఫణి వ్రాసి|
తుమ్మెదదాఁటులఁ దొలఁగఁ దూపొడిచి[216]|పై కాపుగాఁగ సంపంగలు ముడిచి|
చేతులపన్నీరు చెలులపైఁ దుడిచి|పయ్యదఁబూఁదేనె పలుమాఱుఁ బిడిచి[217]|
[218]యారామవీథుల నతివలు మెలఁగి|[219]యొఱపైన చోటుల నొయ్యనఁ[220] తొలఁగి|
దట్టంపువిరు[221] లెల్లఁ దమవని చెలఁగి|మరునమ్ములో[222] యని మదిలోనఁ గలఁగి|
బింబంబు లని యోష్ఠబింబంబులకును[223]|[224]బైకొన్న చిలుకలఁ బట్టంగఁ దలఁచి|
[225]వల నైనకరపల్లవంబులు చాఁపఁ|బల్లవంబులభ్రాంతిఁ [226]బదరి కోయిలలు|
చేరినఁ బయ్యెదచెఱఁగులఁ [227]జోఁపఁ|బయ్యదబయ లైన పాలిండ్లు చూచి|

జక్కవదోయిమచ్చరమున మొరయఁ[228]|గరమూలరుచుల బంగారుతో బెరయ|
నుబ్బునఁ జనుఁగవ లొండొంటినొరయ| నొసలికస్తూరులునూఁగురుల్‌[229] [230]బెరయ|
వలఁతులై[231] పొలఁతులు వనవిహారములఁ|[232]బొదలిక్రొవ్వులు మించఁబువ్వులుగోసి|
శంబరారాతిఁ[233] బచ్చనివిలుకానిఁ|[234]బచ్చపుల్గుల తేరిపైన [235]బిత్తరిని|
బొదిగొన్న కమ్మఁదూపుల[236] పోటువాని|దనరిన చంద్రకాంతపు వేదిమీఁదఁ[237]|
దలఁపులోపలివానిఁ దగవారఁ పూఁచి[238]|పొలుపొందఁ బువ్వులఁ బూజలు చేసి|
యొప్పైనపూఁదేనె [239]నుపహారమిచ్చి|మ్రొక్కుచుఁ దాంబూలములు సమర్పించి|
సరససంగీత ప్రసంగ వాక్యములఁ|బ్రొద్దులు వుచ్చుచుఁ బొలఁతు లున్నంత|
వైభవంబుల వనవాటికలందు[240]|విహరించుచున్న గోవిందు ముకుందు|
సత్యభామాకాంతు సకలవిశ్రాంతు|తిరువేంకటాద్రీశు దేవదేవేశు|
భానుకోటిస్ఫూర్తి[241] భాసిల్లువాని|పంచాస్త్ర కోటి సౌభాగ్యంబువాని[242]|
గోటానఁ గోటులై కొలఁదులు[243] మీఱి|గుఱు తిడఁగా రానిగుణములవాని|
రాకకు వెఱఁగంది రాకేందు వదన|[244]రాకవెన్నెలలఁ బరా కైనకాంత|
చెలులపై [245]నలులపైఁ జిత్తంబు వదలి|కురులపై విరులపైఁ గోర్కులు సడలి|
[246]పికముపై శుకముపైఁ బ్రేమంబుమఱచి| నతనురాకకునుగూర్చినతనురాకకును[247]|
దొలఁగక పులకలు[248] తోఁ [249]ద్రోపులాడఁ|దలకొన్నకనుఁగ్రేవ[250] తపములు వీడ|
[251]నుడివోనినునుసిగ్గు లూడనిఁబాడ[252]|నంతంత మరుబలం బచ్చన లాడ[253]|
నిరువురచిత్తంబులెదుళులుచూడఁ|బరువులో మురువును[254] భయములోవెరువుఁ|
జిత్తంబుతిమురును[255] జెక్కులచెమరు|భావంబుకదలును [256]బలుకులోఁ గొదలు|
మానంబు మఱపును మరుచేతివెఱపు|[257]నలకలజాఱును [258]నలసంబుతీరుఁ|

గ్రాఁగినమతి నొప్పి కనుఁగ్రేవ డప్పి[259]|చెలికత్తెమూఁపుపైఁ జేర్చినచేయి|
యల్లార్చి ఱెప్ప వేయనికన్నుదోయి|తనమేనిఁ జెలి దండ దాఁచినబాగు|
నంతలో మైమఱ పైయున్నలాగు|కనుఁగొని చెలులెల్లఁ గడు వెఱఁగంది|
యలరినవేడ్కల నబ్జాక్షిఁ జూచెఁ|జూచినయంతన సూనాస్త్రగురుఁడు[260]|
జూపులు తూఁపులై[261] సోఁకె నొండొరులఁ|దనరాజ్యలక్షణోత్తర[262] మైన తన్విఁ|
గప్పంబుగా నిచ్చెఁ [263]గందర్పుఁ డనఁగ|గంభీరనాయకుఁ గాంచెనో యనఁగఁ|
దీపులవిలునారితిండి [264]మోపెట్టి|పూవుఁదూపులయంపపొది[265] వెంటఁగట్టిన
చిన్నారివిరిదమ్మిచిలుకుఁ[266] జేఁబట్టి|యల్లన పొడచూపె నారతిరాజు|
ఈయింతితో విభుఁ డింపొందు ననుచుఁ|[267]నేపునఁ గీరంబు లేచి[268] పై రొప్పె[269]|
నీకొమ్మ మదికోర్కులీడేఱు[270] ననుచుఁ|జాలిచేరువఁదీర్చె[271] జక్కవదోయి[272]|
తరలాక్షి మదిలోన [273]దరికొన్న విరహ|మాఱెడువీపుగా పనెడుచందమున|
నుబ్బునఁ బైవీఁచె [274]నొయ్యనిగాలి|[275]కమలామనోనాథు కరుణాకటాక్ష[276]|
వీక్షణం బతివపై [277]వెల్లిగొన్నట్లు|పరిపూర్ణచంద్రికాప్రభలు పైఁ బర్వఁ|
గడిమి [278]నుద్దీపనకారణం బగుచు|లావుగా మరునిబలం బెల్ల నొదరఁ[279]|
గడు నింపులై యుండఁ [280]గారింపు లౌను|నెలమిఁ గారింపులేయింపులై యుండుఁ|
బ్రియములైనవియె యప్రియములైయుండు|నప్రియంబులె ప్రియంబై యుండుఁ జూడ|
నాలోనఁ జెలులెల్ల నాలోలనేత్రఁ|బరికించి విరహతాపస్ఫూర్తి[281] దెలిసి|
యీరామపోరాము[282] లేమిట మాను|నీకాంతవలవంత[283] లేవంకఁ దీరుఁ|
జూడదు తలయెత్తి శ్రుతి దండెఁ[284] గూర్చి|పాడదు చెలులెల్లఁ బైకొన్న సరస|
మాడదు చిలుకతో నందంపుమాట|లాడదు [285]వెడమాఁట లాడెడిఁగాని|

కొంచదు[286] ప్రాణంబు గుఱుతుగాఁజేసి|యెంచదు వీణె వాయించదు పరిణ|
మించదు మది సంభ్రమించదు చెలియ|కించుకేనియును సయించదు[287] కాని|
కప్పదు చనుదోయి కనుఁ గ్రేవఱెప్ప|విప్పదు తనప్రాణవిభుమీఁదిమనసు|
త్రిప్పదు మదిలోన [288]దీకొన్నప్రేమ|చెప్ప దెవ్వరితోడఁ జెప్పునోకాని|
పెట్టదు కస్తూరి పేర్కొని[289] చేతఁ|బట్టదు సేవంతిబంతి నెత్తమ్మిన|
ముట్టదు సిగ్గుల మొద లించుకైనఁ|బుట్టదు తలఁ పెందుఁ బుట్టునోకాని|
తాపంబు[290] మేనఁ బ్రతాపింపఁ దొడఁగె|నూర్పులు మిగుల నిట్టూర్పులై నిగుడెఁ|
బగలెమృగాక్షికి[291] వగలుగాఁ[292] జొచ్చె|రాత్రులింతికి శివరాత్రులై[293] తోఁచె|
శిశిరో[294]పచారవిశేషభావనలు|సేయంగవలె నని చెలులెల్లఁ గూడి|
పైకొని యేప్రొద్దుఁ బన్నీరువారిఁ[295]|బూచిన [296]గొజ్జంగపొదరింటిలోను|
బద్మాక్షిఁ జల్లనిపాన్పుననునిచి|[297]యొడఁగూర్పఁదొడఁగిన నుపచారవిధులు[298]|
పలుమాఱు [299]విపరీతభావంబులైన|[300]ముగ్ధలు తమలోన మోములు చూచి|
యంతంత నొకరొక రచనలు చేసి|యీవేళఁ దడ వేల [301]హేలావిశాల|
శశికాంతమణికాంత సౌధాంతరములఁ[302]|జలువలనెలవులఁ[303] జంద్రాస్య నునిచి|
గుప్పుఁడు పుప్పొళ్లు కుచములమీఁదఁ|గప్పుఁడు చెంగావి కప్రంపుబడిమి[304]|
త్రిప్పుఁడు చెలులెల్లఁ దిరిగిరానుండఁ|జెప్పుఁడు మనవులఁ జెప్పెడి దేమి|
చిలుకుఁడు పూఁదేనె చెలిమేన నిండ|నలుకుఁడు శ్రీగంధ[305] మప్పటప్పటికిఁ|
గులుకుఁడు[306] పన్నీరు కోమలితోడఁ|బలుకుఁడు పలుమాఱుఁ బలుకరింపుచును|
బాయుఁడు నునుగాలి పైకొననిండు|ద్రోయుఁడు [307]సొబగైనతొలువిరులెల్ల[308]|
వేయుఁడు కమ్మఁగ్రొవ్విరులు పైపైని|సేయుఁ డింతటిలోన [309]శీతలక్రియలు|
అనుచు శైత్యోపచారాదులు[310] సేయ|నల్లనల్లన తాప [311]మగ్గలం బైన|

ధవళాక్షి యున్న చందము చూచి చెలులు|కంటికిఁ [312]గలకంఠకంఠిభావంబు|
జ్ఞానమొక్కటియు నజ్ఞానంబు నూఱు|మాటాడు టొక్కటి [313]మౌనంబువేయి|
తాలిమి[314] లేశంబు[315] తమకంబు[316] లక్ష|కోరికమదిలోనఁ గోటానఁగోటి|
మణుఁగులైయున్నవి మగువకు నేఁడు|తనప్రాణవిభునిఁ గందర్పుని గురునిఁ[317]|
దేకయుండిన నింతిఁ దేర్పంగరాదు|పోక మీరిపు డలవోక[318] సేసినను|
రాకనేఁడతఁడు నిరాకరించినను[319]|అదయుండుమరుఁడు [320]తీవ్రాస్త్రకోవిదుఁడు[321]|
ఒడ లెఱుంగకయుండు నొక్కొక్కవేళ|నెంతకు నలుగునో[322] యీయింతిమీఁద|
నని యందులోఁ[323] బ్రోడయగుమేటిబోటి|[324]యుడివోనిభయమేలయోచెలులార|
కరుణాకటాక్షు[325] [326]లోకైకసంరక్షు|శరణాగతత్రాణు[327] సకలపారీణు[328]|
విశ్వలోకేశు శ్రీవేంకటాధీశుఁ|గనుఁగొని యీబాల గాసిల్లియున్న|
చందంబు విభుఁడు మెచ్చఁగ విన్నవించి|విచ్చేయునట్లు గావించి తేకున్న|
నెచ్చెలులార నానేర్పు లేమిటికి|నని చెలిఁ జెలులతో నప్పనచేసి[329]|
కదలి మోహనమూర్తి కడకేగి యంత| సకలసురాసురసంఘంబులెల్ల|
నంతరాంతరముల[330] నంతంత నుండి|యేకాంతసుఖగోష్ఠి[331] నింపొందువాని|
గనుఁగొని పూగుత్తి కానుక యిచ్చి|మ్రొక్కి హస్తాంబుజంబులు మోడ్చిపలికె|
దేవ జగన్నాథ దేవతారాధ్య[332]|యఖిలాండధౌరేయ[333] యార్తవిధేయ|
యారామసీమావిహారాంతరముల|మారామ[334] నీరూపు మహనీయమూర్తి|
గన్నులపండువుగాఁ గనుఁగొన్న|యంతనుండియును బుష్పాయుధుఁ డేయు|
తలిరంపగమి[335] నొంప ధరియింపలేదు|ఎటువంటి మోహంబొ యెట్టితాపంబొ|
యేలాగుతమకంబొ యేమిభావంబొ|యేచందములచూపొ యేతరితీపొ[336]|

తొలిచూపు నీరూపు తొలఁగుటలేదు|కన్నీరు మున్నీరు[337] కడగానరాదు|
చెలియున్నవిధమును జెప్పకపోదు|తరళాక్షి దురవస్థ తలఁపగాఁ గాదు|
ఇంతట విచ్చేసి యింతి మన్నించి|[338]కంతుసామ్రాజ్యసౌఖ్యముల నొందింపు|
మని విన్నవించిన యబ్జాక్షిఁ జూచి|తలఁపులు తలఁపులు తార్కొని[339] యుండఁ|
జిత్తంబు చిగురొత్తఁ జిఱునవ్వు నవ్వి|భామకు [340]మౌక్తికాభరణంబు లిచ్చి|
మది నుబ్బి పన్నీట [341]మజ్జనం బాడి|రసికతఁ బీతాంబరము దిండు[342] దీర్చి|
[343]మృగమదపంకంబు[344] మెయి నిండఁ బూసి|పారిజాతాదిపుష్పము లెల్ల ముడిచి|
[345]సౌపర్ణవాహనోజ్జ్వలతఁ బెంపొంది|విద్యాధరాహ్లాదవీణానినాద|
గానామృతాంభోధికల్లోలములను[346]|నుబ్బుచు నంతంత [347]నోలలాడుచును|
జంద్రాస్య యున్నపూఁజవికె[348] కేతెంచి|యల్లన దర్వీకరాంతకు[349] డిగ్గి|
కొలిచి వచ్చినదేవకోటుల ననిచి|కామినిభావంబుఁ గనుఁగొనునంతఁ|
గుసుమాస్త్ర తాపసంకులత[350] వహించి|యలరుఁ బానుపుమీఁద[351] నందందపొరలఁ|
జెలిమేన నంటినచెంగల్వఱేకు|లెలమిఁ గాంతునిరాక కెదుళులు చూచు|
గతి నొప్ప నిలువెల్లఁ గన్నులై యమరఁ|గ్రాఁగినగందంబు క్రమ్మఁ బన్నీటఁ|
[352]దోఁగినచెంగావి తొడరి శైత్యమునఁ|గ్రాఁగినహృదయంబు [353]రతిరాజుచేత|
మ్రాఁగినమతియుఁ బ్రమాదంబువలన|[354]నీఁగినవగలును నేత్రాంబుధార|
లాఁగినఱెప్పలు నైయున్నయింతిఁ |గనుఁగొని కరుణావికాసచంద్రికలు[355]|
నీలోత్పలాక్షిపైఁ నిండంగఁ జల్లి|భామిని యున్నపూఁబానుపు చేరి|
చిట్టంటుచేఁతల[356] సేదలు దీర్చి|చెదరినయలకలచిక్కెల్లఁ దీర్చి|
యెడలేనిపులకలయింపు పుట్టించి|కళలమర్మంబులకడ గానుపించి|
[357]యాలింగనాదిసౌఖ్యముల నొందించి|కరఁగించి మరగించి కలికిఁ[358] గావించి|
యుడివోనిసురతాబ్ధి నోల లాడించి| చిత్తజసామ్రాజ్యసింహాసనమున|

బాలికారత్నంబుఁ బట్టంబు గట్టి|[359]యరవిరిసిగ్గులు నాత్మనిగ్గులును[360]|
మితిలేనితావులు మెఱుఁగుమోవులును|గనుఁగ్రేవకెంపులుఁ[361] గలికిసొంపులును|
ముద్దులేఁ జెమరును మోములకొమరుఁ[362]| గలిగినశృంగారగరిమలతోడ|
వంది[363]మాగధుల[364] కైవారంబుతోడ[365]|సిద్ధవిద్యాధరశ్రేణులతోడఁ|
దనతోడఁ గూడినతన్వంగితోడ|వృషభాద్రినాథుఁ డుర్వీసతిప్రియుఁడు|
వేడ్కతో నగరప్రవేశంబు చేసె|నని భక్తిఁ దిరువేంకటాద్రీశుపేరఁ|
గారుణ్యలక్ష్మీప్రకాశునిపేర|[366]రాజితాఖిలలోకరక్షణుపేర|
లాలితబహుపుణ్యలక్షణుపేర| [367]పృథులదానవసైన్యభీషణుపేర|
భూరికౌస్తుభరత్నభూషణుపేర|గురుభరద్వాజైక[368]గోత్రపావనుఁడు|
నందాపురీవంశనాయకోత్తముఁడు|[369]అనఘుఁడు తాళ్లపాకాన్నయార్యుండు|
మధురంపుశృంగారమంజరి చెప్పె|ధరమీఁద నాచంద్రతారకం[370] బగుచుఁ|
గడిమిఁ బెంపొందు మంగళమహాశ్రీల||
శ్రీకృష్ణార్పణమస్తు| మంగళమహా శ్రీ శ్రీఁ జేయున్‌.

సాళంగ నాట

అప్పనివరప్రసాది యన్నమయ్య। [371]యప్పసము మాకే కలఁ డన్నమయ్య।
అంతటికి నేలికైన యాదినారాయణుఁ దన। యంతరంగాన నిలి పెనన్నమయ్య।
సంతసానఁ జెలువొందిసనక సనందనాదు।లంతటివాఁడుతాళ్ల పాకన్న మయ్య।।౧॥
బిరుదు టెక్కములుగాఁబెక్కు సంకీర్తనములు। హరిమీఁదనా నతిచ్చెనన్నమయ్య॥ ।।
[372]విరివిగలిగినట్టివేదములయర్థమెల్ల।నరసితెలిపినాఁడన్నమయ్య।
అందముగ రామానుజాచార్యమతమున। [373]కందుకొని నిలిచినాఁడన్నమయ్య।
విందువ లెమాకును శ్రీ వేంకటనాథునినిచ్చె।

  1. జితహిరణ్యాక్షున్= జయింపబఁడిన హిరణ్యాక్షునిఁ గలవానిని
  2. దక్షున్=సమర్థుని
  3. ఆద్యున్=మొదటివానిని
  4. తత్త్వాపాద్యున్=ఆత్యజ్ఞానముచే పొందఁదగిన వానిని
  5. భవ=సంసారము
  6. ధామున్=ఇల్లయినవానిని
  7. మథిత=త్రచ్చఁబడిన
  8. నీలోత్పలము=నల్లకలువ
  9. సంకాశు=సమానమైనవాని
  10. నిబిడ=దట్టమైన
  11. నిగమాంతము=వేదాంతము
  12. శాతకుంభ=బంగారముతోచేయఁబడిన
  13. చారు=రమ్యమైన
  14. ఆమోదము=సంతోషము
  15. అవ్యక్తున్=తెలియఁబడినవానిని
  16. అద్వంద్వున్=ఒకఁడేయైనవానిని
  17. అచ్యుతున్=నాశనములేనివానిని
  18. నిఖిలాండము=సర్వబ్రహ్మాండము
  19. సర్వతోముఖరూపున్=బ్రహ్మస్వరూపము గల వానిని
  20. అలరేడు= ఒప్పెడు
  21. పదాంభోజము=అడుగుఁదామర
  22. వలకేలన్=కుడిచేతిలో
  23. గర్వాంధకారము=పొగరనెడు చీకటి
  24. దేదీప్యమానము=మిక్కిలి ప్రకాశించునది
  25. శార్గౙము=విష్ణుధనుస్సు పేరు,
  26. తలకొని=యత్నించి
  27. కైలాటము = ఈర్ష్యా కలహము
  28. వలపు=కోరిక
  29. రెట్టింపు=రెండింత లగు,
  30. గగనము= ఆకాశము
  31. పరిరంభ=కౌఁగిలించుటచే
  32. విజృంభి=ఎక్కువగుచున్న
  33. బెరసిన=వ్యాపించిన
  34. రింగులు=వస్త్రపుఁగుచ్చెలు
  35. కాపించు=కాసెగాఁ గట్టు
  36. అణువు=మిక్కిలిచిన్నవస్తువు
  37. సచరాచరాత్ముఁడు,చర=సంచరించునవి,ఆచర=కదలనివి, ఇట్టివానితో స కూడిన ప్రపంచమును,ఆత్ముఁడు= రూపముగాఁ గలవాఁడు
  38. అమరాద్రి=మేరుపర్వతము
  39. మాద్రి=మాదిసమానము
  40. చెలువము=అందము
  41. ఒయ్యారము=విలాసము
  42. ఒసపరిలాగు=సౌందర్యముతెఱఁగు
  43. రాజసంబు= రాచఠీవి,
  44. చతురత= నేర్పరితనము
  45. వికచ=వికసించిన
  46. కోకిలవాణి=కోకిలవంటి గొంతుగలది
  47. పోణి= పోలినది,
  48. విశ్రాంతి=వినోదస్థానము,
  49. వలరాజు మన్మథునియొక్క చిగు రెల్లి =చిగురుటాకు గొడుగు
  50. నెల్లి=ప్రవాహము
  51. కడి=వాసన
  52. ములికి =బాణాగ్రము,
  53. కలికి=అందమైనది
  54. జెలిగి (మాతృక)
  55. పేరి=దట్టమై
  56. వినుకలి= వినుట చేఁగలుగు ప్రేమము
  57. వెట్టలు=విహారములు
  58. వెతలు=బాధలు
  59. ఉవిదలు= స్త్రీలు
  60. ముద్దరాలు=ఏమియు నెఱుఁగనిది
  61. ఏలొకో=ఎందుకో
  62. మున్న=ముందుగానే,
  63. అంపగమి= బాణసమూహము
  64. చికిలిసేయ=పదునుపెట్టు
  65. గొణఁగు=మాటవెడలనీక లోలోననేగొణగొణయను
  66. కీరంబు=చిలుక
  67. కెలయక=విజృంభింపక,
  68. ఆరోమంబు=తోఁట
  69. రామ=శ్రీ
  70. పాంథులు=విరాహులు
  71. కారకులు=పండుటాకులు
  72. నవక మై=మృదువై
  73. పనిచెన్= పూచెను
  74. మేల కట్లు=వితానములు
  75. కోల=పిప్పలి
  76. తమాల=చీకటిమ్రాను
  77. తక్కోల=తక్కోలపుఁజెట్టు
  78. హింతాల=గిఱక తాడుచెట్టు,
  79. కుద్దాల=కాంచనము,
  80. సాల=మద్ది
  81. రసాల= తియ్యమా
  82. నేపాల=నేపాల పుఁజెట్టు,
  83. తార=వృక్ష విశేషణము
  84. గండీఫలీ=ప్రేంకణము
  85. పిచుమంద=వేప
  86. సోగల = పొడవులు
  87. నఖపత్తులు=నఖక్షతముల వరుసలు
  88. కింశుకములు=మోదుగులు
  89. కోరగించి=మొలకలెత్తి
  90. మాకందము=మామిడి.
  91. మలయజంబులు=గంధపుమ్రాఁకులు,ఎలర్చెన్=వికసించెను
  92. నిగుడ=వ్యాపింపఁగా
  93. పూఁపలు=పూబిందెలు
  94. కలయ=అంతట
  95. తారని=కనఁబడకపోవని
  96. క్రొమ్మంచు=క్రొత్తమంచు
  97. మలయ=వ్యాపింప
  98. దుమారము= దుమ్ము
  99. ఆవలులు= సమూహములు
  100. కుముదాకరంబుల=తెల్లకలువలుగల సరస్సులలో
  101. కూటము=స్నేహము,కొమరు=మోజ్ఞత్వము
  102. పద్మరాగ=కెంపుల యొక్క,
  103. వంప=తగ్గింప
  104. జ్యోతిర్లిత=రాత్రుల వెలుఁగిచ్చునొకసిద్ధెషధి, ఆక్రాంత చుట్టఁబడిన
  105. విశ్రాంత=ఆలపుఁదీర్చికొన్న, పాంథులు=బాటసారులు
  106. సొరిది=వరుసగా
  107. కడఁగి=పూని
  108. గందపుఁగొండ=మలయపర్వతము
  109. కందువ= జూడ
  110. క్రమ్మఱన్=మరల
  111. పసలు=ఉద్రేకములు
  112. ఫణిరాజ,గోత్ర=నాగులకురాజగు శేషుని,పర్వతముయొక్క
  113. కదిసి=కూడి,తరంగములు=అలలు
  114. లిప్త=పూయఁబడిన
  115. చెల్లుఁబోరాడు= జలక్రీడలాడు
  116. నిచ్ఛలు=నిత్యము
  117. మెట్టి= తొక్కి
  118. ఊర్జిత=దృఢమైన
  119. రుచిమంకు =కాంతికలవానిని
  120. తొంగలింపన్= అతిశయింపగా
  121. అంతర=మధ్య
  122. చిక్కని=సన్ననైన
  123. జవరాండ్రు=యౌవనవతులు
  124. ఎడల=సమయములందు
  125. క్రేవన్= పార్శ్వమందు
  126. పయ్యెదలు=పైఁటలు,ఎడలించి=తొలఁగించి
  127. తూర=దుమ్మును చెమటను తుడిచి
  128. కుటిలకుంతలములు= వంకరలగు వెండ్రుకలు
  129. గునిసియల్లార్చి= చేర్చీపట్టి మృదువుగా ఆర్చి
  130. గొబ్బున =శీఘ్రముగా
  131. చోడుముట్ట= వ్యాపించునట్లు
  132. తలవరి=తలారివాఁడు,
  133. కంతుఁడు=మన్మథుఁడు
  134. మలయు=వ్యాపిఁచు
  135. కందువలు= జాడలు
  136. చెందొవలు=ఎఱ్ఱకలువలు
  137. కెలఁకులు=పార్శ్వములు
  138. రతిరాజు=మన్మథుఁడు
  139. పసని=బాగైన
  140. కళుకులు=కాంతులు,
  141. కరవాలు=కత్తి
  142. ఇమ్ముల=చక్కగా
  143. జడిగొను=దట్టమగు
  144. అంపకోలలు=బాణములు
  145. దొరయు=కలుగు,
  146. తోరంపు= దట్టమైన
  147. మత్తిల్లు=మత్తుకొన్న
  148. తఱచు=దట్టమైన
  149. బిత్తరము= భీతి,
  150. దీధితులు =కాంతులు
  151. సోనలు=ధారలు
  152. పొదిగొని=పెంపుకొని
  153. తావులు=వాసనలు
  154. ఆలీ=తుమ్మెదల
  155. చీరెడు=పిలుచునట్టి
  156. మదవతీ=యౌవనవతుల,కమ్మఁదనము=కమ్మనిపొసనగల
  157. పుప్పొళ్ళు= పూవులనుండి రాలెడు ధూళులు,
  158. సిబ్బెము= దేహమునందుఁ గలుగు ఒకదినుసు పొడ
  159. దండ= పార్శ్వమున
  160. 14
  161. నీడల= నీటిలోఁ గనఁబడు ప్రతి బింబముల, పొలుపు=
    అందము,
  162. లేమా=ఓస్త్రీ,లేమావి=లేతఁమామిడిచెట్టున (యౌవనవతుల కరస్పరృముచే మామిడిచెట్టు చిగురించునని దోహదశాస్త్రము, ఇట్లే తిలక మునకుఁ జూచుట, ఆశోకమునకుఁ దన్నుట, కర్ణికారమునకుఁ బాడుట, కురవక మునకుఁ గౌఁగలించుట శేసరముల కుమియుటయు దోహడమలు, వానినినను సంధించి యిటఁ గవివర్ణించె)
  163. తిలకము=బొట్టుగుఁజెట్టు
  164. తిలకము= శ్రేష్టము
  165. అడుగుకుందువ=పాదముజూడ
  166. ఆడుగులాన = పాదములపై ఆన (ఒట్టు)
  167. కర్ణి కారంబులు = కొండగోఁగులు,
  168. కర్ణిక=చెవికమ్మ,కర్ణికారమణీయ=కర్ణి కారపుఁబూవు
  169. ననుచున్=పుష్పించును,
  170. కురవక= ఎఱ్ఱగోరంట
  171. అకా= ఆక్కా
  172. కేసములు=పొగడచెట్టులు
  173. వారుణి=సారాయము
  174. దైవాఱు =అతిశయించు
  175. పొదిగొను=చట్టము
  176. కైసేసి=అలంకరించి
  177. గరిమలు=గొప్పఁదనములు
  178. ప్రణయము=స్నేహము
  179. భవదూర=సంసారబంధమునకుదూరమైనవాఁడా
  180. కొదమ=యాపనముకల
  181. పరవని=వ్యాపింపని
  182. అచ్చెరువు=ఆశ్చర్యము
  183. జాలువాఱు=ప్రవహించు
  184. దైవాఱి=ఆతిశయించి
  185. ఈఁతల=పూర్ణముగా
  186. ఫణులు=పాములు
  187. సౌరభము=వాసన
  188. పసివట్టి=వాసనపట్టి
  189. మయారము=నెమలి
  190. ఘనసార=పచ్చకప్పురపు
  191. సిరము=పొడి
  192. తిన్న=తిన్నె అరుగు
  193. తరితీపులు=కోర్కులు
  194. ఆమని=వసంతుఁడనెడు
  195. కుంభిని=భూమి
  196. శ్రీవత్సము=విష్ణువుఱొమ్మునందలి మచ్చ
  197. అబ్ధి=సముద్రము
  198. ఉజ్జ్వలత= ప్రకాశము
  199. ఉన్ముఖుఁడు=మీఁదుచూచువాఁడు =ప్రయత్నించువాఁడు
  200. కదలు = కదలుట,"కద లెఱుఁగంగనీక, ఉహరి
  201. తలకూడు= సిద్ధించు
  202. కుండలికర్త=పాములకు రాజు.
  203. కమలభవ= బ్రహ్మ
  204. మానము=తాళాదిలక్షణయుక్తత
  205. విరివి=విస్తారము
  206. గోచరములు=కనఁబడునవి
  207. గోష్ఠి = సలాపము
  208. అలవోక=లీల
  209. ఆపచయము =కోయుట
  210. జడిగొన్న = వర్షించినట్టి దట్టమైన
  211. లతలు =తీగలు
  212. క్రొవ్విరులు=క్రొత్తపూవులు
  213. తావి వాసన
  214. తలిరులు=చిగుళ్లు
  215. అనిలము=గాలి
  216. తూపొడిచి=బాణము నాటి
  217. పిడిచి=పిండి
  218. ఆరామము=తోట
  219. ఒఱపు=రాపిడి
  220. ఒయ్యన=మెల్లఁగా
  221. విరులు=పూలు
  222. అమ్ములు=బాణములు
  223. ఓష్ఠబింబములు=దొండపండువంటి పెదవులు
  224. పైకొను= కవియు
  225. వలను=ఒప్పిదము
  226. పదరు=త్వరపడు
  227. చోఁపన్=తఱుమఁగా
  228. మొరయ=కూయఁగా
  229. నూఁగురులు=నెత్తిముందటి వెండ్రుకలు
  230. బెరయ =కలియఁగా
  231. వలఁతులు= నేర్పుగలవారు
  232. పొదలి=సంతోషము పెరిగి
  233. శంబరారాతిన్=మన్మథుని
  234. పచ్చపులుగు=చిలుక
  235. బిత్తరి=తేజముతో
  236. తూపులు=బాణములు
  237. వేది=తిన్నె
  238. పూఁచి= స్థాపించి
  239. ఉపహారము= కానుక
  240. వాటికలు=వరుసలు
  241. స్ఫూర్తి=తోఁచుట
  242. సౌభాగ్యము= ఐశ్వర్యము
  243. కొలఁది=మితి
  244. రాక=పున్నమ
  245. అలులు=తుమ్మెదలు
  246. పికము=కోకిల
  247. అతనురాకకు= మన్నథుని వచ్చుటకు లేక మన్మథావేశమిచ్చు పున్నమకు
  248. పులకలు=గగుర్పొడుపులు
  249. తో= వెంబడిగా
  250. క్రేవ=పార్శ్వము
  251. ఉడివోని= వ్యర్థముకాని
  252. ఊడనిఁబాడు= పరుగెత్తిపోవు
  253. అచ్చనలాడు=ఒక విధమగునట్టి యాటయాడు= ఇటునటుపరువులిడు
  254. మారువు= సౌందర్యము
  255. తిమురు= స్తబ్ధమగుట
  256. కదలు = చలించుట
  257. అలకలు=ముంగురులు
  258. ఆలసంబు=మాంద్యము
  259. డప్పి=ఆన
  260. సూనాస్త్ర గురుఁడు = విష్ణువు
  261. తూఁపులు =బాణములు
  262. ఉత్తర =మీఁదిది
  263. కందర్పుఁడు=మన్మథుఁడు
  264. మోపెట్టి =కూర్చి
  265. అంపపొది= అమ్ములు పెట్టు సంచి=తూణీరము
  266. చిలుకు= బాణము
  267. ఏపు= గర్వము
  268. ఏచి=రేఁగి
  269. రొప్పె=కవిసె
  270. ఈడేఱు =సిద్ధించు
  271. తీర్చె=శకునమిచ్చె
  272. జక్కపదోయి= చక్రవాకములజంట
  273. దరి కొను=మండు
  274. ఒయ్యని= మృదువైన
  275. కమల= లక్ష్మి
  276. కటాక్ష= కడఁగంటి
  277. వెళ్లి=ప్రవాహము
  278. ఉద్దీపన= అధికము చేయు
  279. ఒదర= కూయఁగా
  280. కారింపులు=బాధలు
  281. స్ఫూర్తి=వ్యక్తముగా స్ఫురించుట
  282. పోరాములు=సంకటములు
  283. వలసంతలు=మన్మథవ్యథలు
  284. దండె= వీణెలో
  285. వెడ= వికారమైన
  286. కొంచదు=సంకోచింపదు
  287. సయించదు=ఓర్చుకొనదు
  288. దీకొన్న= ఎదిరించిన
  289. పేర్కొని = పేరు చెప్పి
  290. తాపము=బాధ
  291. మృగాక్షి=లేడికన్నులవంటి కన్నులుగలది
  292. వగ=దుఃఖము; పగలు= విరోధము
  293. శివరాత్రులు=జాగరణపు రాత్రులు
  294. శిశిర= చల్లని
  295. వారి=నీళ్లు
  296. గొజ్జంగ = ఒకానొకపూఁజెట్టు
  297. ఒడఁగూర్ప= సేయుటకు
  298. విధులు= రీతులు
  299. విపరీత= వ్యతిరేకమైన
  300. ముగ్ధలు=ఉదయించిన యౌవముగలవారు
  301. హేల= కనుబొమ్మలు మొదలగు వానిచేఁదెలియఁజేయఁదగినమనోవికారము
  302. ఆంతరములు=మధ్య భాగములు
  303. నెలవులు=చోట్లు
  304. బడిమి= భూతబలి
  305. శ్రీగంధము= చందనము
  306. కులుకుఁడు=చిలుకరిఁపుండు
  307. సొబగు=అందము
  308. తోలువిరులు=ప్రాతపూలు
  309. శీతల=చల్లనగు
  310. ఉపచారములం=సేవలు
  311. అగ్గలము= అధికము
  312. కలకఁఠము=కోకిల
  313. మానంబు=ఊరకుండుట
  314. తాలిమి=ఓర్పు
  315. లేశంబు=కొంచెము
  316. తమకము=తోందరడుట
  317. కందర్పు గురుఁడు =మన్మథునితండ్రి విష్ణువు
  318. అలవోక=జాగు
  319. నిరాకరించు=తిరస్కరించు
  320. తీవ్ర=వేగమైన
  321. కోవిదుఁడు =పండితుఁడు
  322. అలుగు= కోపపడు
  323. ప్రోడ=నిపుణురాలు
  324. ఉడివోని= తగ్గని
  325. కరుణాకటాక్ష = దయతోఁగూడిన కడఁగంటిచూపు గలవానిని
  326. లోక ఏక = లోకమునకెల్ల నొక్కఁడేయైన
  327. త్రాణున్=కాపాడువానిని
  328. పారీణుఁడు=మిక్కిలి సమర్థుఁడు,
  329. అప్పనచేసి=ఒప్పిదము చేసి
  330. అంతరాంతరములన్=నడుమ నడుముల
  331. గోష్ఠి=సల్లాపము
  332. ఆరాధ్య= పూజింపఁదగినవాఁడా
  333. ధారేయ= బరువు మోయువాఁడా సమర్థుఁడా,
  334. మారామ= మా స్త్రీ
  335. తరంపగమి=చిగురు బాణముల సమూహము,
  336. తరితీపు=ఆపేక్ష
  337. మున్నీరు=సముద్రము
  338. కంకు=మన్మథుని
  339. తార్కొని=కదిసి
  340. మౌక్తిక= ముత్యపు
  341. మజ్జనము=స్నానము
  342. దిండు=కుచ్చెలు
  343. మృగమదము= కస్తూరి
  344. పంకము=బురద
  345. సౌపర్ణ=గరుడ సంబంధమైన
  346. కల్లోలములు=అలలు
  347. ఓలలాడు= తెప్పల తేలి మునుఁగు
  348. చవికె=మండపము
  349. దర్వీకరాంతకుఁడు=గరుత్మంతుఁడు
  350. సంకులత=దట్టమగుట
  351. అలరుఁబానుపు=పూవుల సెజ్జ
  352. తోఁగి=మునిఁగిన
  353. రతిరాజు= మన్మథుఁడు
  354. ఈఁగిన=పోయిన
  355. చంద్రికలు= వెన్నెలలు
  356. చిట్టంటు చేఁతలు= నఖక్షతాది బాహ్య సుతక్రియలు, ("అంతకంతకుఁ జిట్టఁటులంటియంటి" సోమునిహరివంశము.ఆ-5)
  357. ఆలింగనము=కాఁగిలి
  358. కలికి= విలాసవతిగా
  359. అరవిరి=సగము వికసించిన,ఇంచుకబయలైన
  360. నిగ్గులు = గొప్ప కాంతులు
  361. కెంపులు=ఎఱుపులు
  362. కొమరు =అందము
  363. వంది=బట్టు,
  364. మాగధుఁడు=వంశవీర్యాదులను బొగడి యుపజీవించువాఁడు
  365. కైవారము=స్తోత్రము
  366. రాజిత=ప్రకాశించిన
  367. పృథుల= విరివియైన
  368. ఏక=ముఖ్యము
  369. అనఘుఁడు=పుణ్యాత్ముఁడు
  370. ఆచంద్ర తారకం బగుచుక్= చంద్రుఁడు నక్షత్రము లున్నంతవఱ కుండునదియై
  371. అప్పసము=ఎడపక
  372. విరివి=విస్తారము
  373. అందుకొని = చేరి


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse