శివపురాణము/పార్వతీ ఖండము/పార్వతికి నారదుని ఉపదేశం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తల్లిదండ్రుల మాటలకు, పార్వతి ఎదురుమాట ఒక్కటైనా మాట్లాడక పోయినప్పటికీ - ఆమె తన హృదయాన శివుని తలపులను వీడలేకపోతోంది.

తనకు నచ్చజెప్ప వచ్చిన తల్లిదండ్రులతో "మీరు నన్ను మార్చే ప్రయత్నం చేయడం తగదు. నేను పరమశివుని తప్ప, అన్యులను పరిణయమాడను. ఈసారి ఎలాగైనాసరే, నా ప్రయత్నంతో సఫలీ కృతురాలినవుతాను" అని నిశ్చయంగా చెప్పసాగింది.

ఆ శివుడ్ని చేపట్టలేని ఈ చక్కదనమేల?' అని అంతలోనే నిరాశకులోనయ్యేది. పరిపరి విధాల పలవరించిపోతూన్న పార్వతి అవస్థను, పైనుంచి చూస్తూనే ఉన్నారు దేవతలు.

ఇంద్రుడు, పార్వతికి ధైర్యం చెప్పి రమ్మని నారదుని పంపించాడు.

దేవతలందరి సంక్షేమార్ధం, ఇంద్రుడి ఆలోచన అనుసరణీయం అని, అవశ్యమే హిమరాజు సన్నిధికి బయల్దేరాడు నారదుడు. ముందుగా హిమవంతుడ్ని కలుసుకున్నాడు. అతడికి ధైర్యం చెప్పాడు.

ఆ తరువాత పార్వతి దగ్గర కొచ్చి "తల్లీ! నీవు అంబవు. ఆదిపరాశక్తి అపరావతారానివి. నీకు చెప్పదగినంత వాడిని కానుగాని, కాలచక్రరీత్యా చెప్పాల్సివస్తున్నది. సదాశివుడు తపస్సాధ్యుడు. భక్తవరదుడు. ఆయనను బాహ్యసౌందర్యంతో ఆకట్టుకోవాలనుకోవడం మన భ్రమ. దానికాయన లొంగడు. అంతః సౌందర్యంతోనే ఆయన సులభ సాధ్యుడు. కనుక నువ్వాయోగమూర్తి నిమిత్తం తపోదీక్ష పూనడం ఉత్తమం" అంటూ శివపంచాక్షరీ మంత్రం ఉపదేశించి, సెలవు పుచ్చుకున్నాడు నారదుడు. ఆ క్షణమే పార్వతి తపస్సమాధికి పూనుకొన్నది.