శివపురాణము/ఉమా ఖండము/దుర్గా అవతారం, యక్ష రూపిణి

వికీసోర్స్ నుండి

దుర్గా అవతారం

మహిషుడు రంభుడనే రాక్షసుని పుత్రుడు. బ్రహ్మ కోసం తపస్సు చేసి పురుషుని చేతిలో చావులేకుండా ఉండాలని కోరుకున్నాడు. వరగర్వానికి తోడు సొంతబలం జతపడి, సమస్త లోకవాసులకూ కంటకుడయ్యాడు.

అసలే ముష్కురుడు. వాణ్ణి జయించడానికి పురుషులు కాదు... స్త్రీలు కావాలి. అంతటి బలవంతురాలైన స్త్రీ ఎవరు?

అందరి దేవతల అంశలనూ సమకూర్చేలా ఓ స్త్రీమూర్తిని సృజించే సన్నాహం మంచిదని సెలవిచ్చాడు - శివుడు.

అనడమేకాదు...ముందుగా తన తేజస్సుతోనే ముఖం ఏర్పరచాడు. క్రమక్రమంగా సకలాంగ సమన్విత సమ్మిళిత తేజోరాశిగా దుర్గాదేవి ఆవిర్భావం జరిగింది.

పద్మాసనస్థయైన ఆ తేజోఃపుంజరూపిణి - దేవతార్తత్రాణ పరాయణికి సమస్తాయుధాలను కూడా సర్వదేవతలూ సమకూర్చారు.

దుర్గంబిగా సంస్తూయమాన అయిన ఆమె దేవతలకు మహిషుని పీడ వదల్చే నిమిత్తం లోకాలు అదిరేలా హూంకార ధ్వనిచేస్తూ కదిలింది. సురతో నిండివున్న అక్షయపాత్రను పైకెత్తి సురాపానం చేసి ఘంటారవం భీషణరీతిగా సాగుతుండగా, మహిషరూప రాక్షసుడ్ని ఒక్కసారి ఎగిసి తన్నింది. వాడి కంఠం మీద తన ఎడమకాలితో తొక్కిపట్టింది. చేతనున్న త్రిశూలంతో వాడి కంఠాన్ని గురిచూసి గుచ్చింది.

మహిష రక్కసుడి పీడ అంతటితో విరగడైంది. దేవతలంతా పుష్పవృష్టి కురిపించారు. దుర్గా అవతారంగా వర్ణితమైన మహిషాసురమర్దిని వీర విజయగాధ ఇది. విన్నా- చదివినా శౌర్య - దైర్య - స్థయిర్యాలతో పాటు సంపదలకు కూడా నెలవైనట్లు ఫలశ్రుతి.

యక్ష రూపిణి

దేవదానవుల మధ్య ఇంకో సందర్భంలో ఘోరయుద్ధం జరిగి, ఈసారి దేవతల పక్షాన నిలిచింది గెలుపు. అదంతా తమప్రతాపమే అనుకున్న దేవతలంతా అమ్మవారి ఆరాధనను విస్మరించారు.

సర్వవ్యాపినీ - సమస్త శక్తి స్వరూపిణి ఐన సర్వజ్ఞకు - దేవతల కొత్తపోకడ; అహం వల్ల ఏర్పడిన వింత పోకడయని అర్థమైంది.

ఎలాగైనా వీళ్ళ అహంకారం అణచాలని ఓ తేజోరాశిగా యక్ష రూపంలో వారికి సమీపంలోనే వర్తిల్లసాగింది.

అంతకుముం దెన్నడూ చూడని ఈ కొత్త వెలుగు ఎవరో ఏమిటో కనుక్కుని రమ్మని ఇంద్రుదు వాయువుని పంపాడు.

"నా సంగతి సరే! ముందు నీ సంగతి చెప్పు!" అందా రూపం.

"నేనెవరో తెలీదా! అవున్లే! అజ్ఞానం అలాంటిది మరి! అయినా అడిగావు గనుక చెప్తున్నాను. నన్ను వాయుదేవుడంటారు. నేను లేనిదే ఎవరికీ ఊపిరాడదు...నీ క్కూడా" అన్నాడు.

"చాల్లే గొప్పలు! నీ సంగతి మామూలు మనుష్యలోకంలో చెల్లుబాటు అయినట్లు అందరి దగ్గరా అవుతుందనుకోకు! అంతెందుకు! నీ శక్తితో ఈ చిన్న గడ్డిపరకను కదుల్చు చూద్దాం!" అంది ఆ రూపం.

వాయువు ఎంత ప్రయత్నించి ఘంఘా మారుతాన్ని వీచినా, ఆ గడ్డిపరక అంగుళం మేర అయినా కదల్లేదు. ముఖం చిన్నబోయిన వాయువు తన శక్తి ఏమీ లేదని వెళ్లిపోయాడు.

ఈసారి అటుగా వచ్చిన అగ్ని కూడా తన గొప్పలు తాను చాటుకున్నాక, అదే గడ్డిపోచ చూపించి దాన్ని కాల్చమందా రూపం. అది అతడికి సాధ్యం కాలేదు. సిగ్గుతో వెనుదిరిగాడతడు కూడా.

స్వయంగా ఇంద్రుడు వచ్చాడు. అతడ్ని ఆ రూపం పరీక్షించ వలసిందే! కానీ, అహంకారం కొద్దీ ఇంద్రుడైనా భంగపడితే అది దేవతలకే చేటు. ఇంత గొప్ప దేవతలూ ఓ గడ్డిపోచ ముందు ఓడిపోయారనే వార్త నలుదిశలా ప్రాకితే, ఎంతయినా అది దేవతలకు అవమానం! రాజుగా అతడి పరువు నిలపాలి కనుక, ఆ తేజోరూపం వెంటనే ఉపసంహరించుకొని అమ్మవారు "ఇంద్రా! ఇది మీ శక్తియుక్తులను నేను పరీక్షించడానికే ఎత్తిన అవతారం! నిజానికి మీవి అనుకుంటున్న శక్తులకు మూలశక్తినైన నన్నే తెలుసుకోలేక విర్రవీగుతున్నట్టి వారికిది ఓ కళ్లు తెరిపించే పరీక్ష సుమా" అని చెప్పి అంతర్ధానమైంది.

యక్షిణిగా - వచ్చినది అంబ అని తెలిసి అందరూ ఆమెని స్తుతించారు. సంతుష్టురాలైందామె.