Jump to content

శాసనోపాసన: డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి జీవన ప్రస్థానం

వికీసోర్స్ నుండి
​
​
​

శాసనోపాసన

డా. పుచ్చావాసుదేవ పరబ్రహ్మశాస్త్రి జీవన ప్రస్థానం

© భాషాసాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం

ఈమని శివనాగిరెడ్డి - స్థపతి

E Sivanagi reddy - Sthapathi

ఆచార్య పి. చెన్నారెడ్డి

Aacharya P. Chenna Reddy

సంపాదకుడు: డా. మామిడి హరికృష్ణ

Editor: Dr. Mamidi Harikrishna

ప్రథమ ముద్రణ: ఏప్రిల్, 2023

ప్రతులు: 1000

వెల:

ISBN:


ప్రచురణ & ప్రతులకు :

భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం

రవీంద్రభారతి కాంప్లెక్స్, హైదరాబాద్


Printed at:

Sri Packaging:

Uppal, Hyderabad

Mobile no: 63050 74932


All rights reserved. No part of this book may be reproduced or utilized in any form or by any means without prior permission in writing from Department of Language & Culture.

​
​
​

సంపాదకీయం

పురాచరిత్ర విశ్లేషణ - పరిశోధనల ‘శాస్త్రి'!

చరిత్ర ఒక నిత్య చెలిమె!

తవ్విన కొద్దీ ఊటలా నిరంతరాయంగా ప్రవహించే జీవ నది చరిత్ర!

అలాంటి చరిత్ర భారతదేశంలో ఎంత ప్రాచీనతను (Antiquity), విశిష్టతను (Uniqueness) కలిగి ఉందో తెలంగాణ ప్రాంతంలో కూడా అంతే ప్రాచీనతను, ఔన్నత్యాన్ని కలిగి ఉండడం విశేషం

తెలంగాణ నేల గోండ్వానా ల్యాండ్ లో భాగంగా ఆదిమానవుడి (Primitive Man) సంచార జ్ఞాపకాల నెలవుగా ఆ తర్వాత గొప్ప సామ్రాజ్యాలకు ఆలవాలంగా షోడశ మహాజనపదాల కాలంలో, శాతవాహన కాలంలో, కాకతీయ కాలంలో ఆ తర్వాత వివిధ ముస్లిం రాజుల పాలనా కాలాలలో తెలంగాణ నేల తనదైన ప్రత్యేకతతో భారతదేశ చరిత్రలోనే విశిష్ట స్థానాన్ని సాధించింది.

ఇలాంటి చరిత్రని ముఖ్యంగా ప్రాచీన, మధ్య యుగాలకు సంబంధించిన చరిత్రను అధ్యయనం చేయడంలో ఆనాటి కాలపు సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక అంశాలను విశ్లేషించడంలో ఆధారాలు గా నిలుస్తున్నవి శాసనాలే! మరుగునపడి భూమి పొరలలో నిక్షిప్తమైన చరిత్రని, చరిత్ర తాలూకు విశేషాలని ఆవిష్కరించడానికి మనకు ఉన్న ఆధారాలు - "శాసనాలు, నిర్మాణాలు, కట్టడాలు, తాళపత్ర గ్రంధాలు" లాంటి పురావస్తువులే! వాటిలో శాసనాలను అధ్యయనం చేయడం అనేది బహుళ నైపుణ్యాలతో కూడిన విషయం. శాసన పరిశోధనకు చారిత్రక జ్ఞానంతో పాటు, భాషా జ్ఞాతం, లిపి పరిణామం వంటి ఎన్నో అంశాలపై గట్టి పట్టు ఉండాలి. ​ ఈ శాసనాల ని ఆనాటి కాలంలో ప్రధానంగా లోహాల పైన, కర్రల పైన, రాతి స్తంభాల మీద వేసిన దాఖలాలున్నాయి వాటిలోని సాహిత్య విషయాలని, భాషాపరమైన అంశాలని వివరించడం, విశ్లేషించడం ద్వారా చరిత్రకు గొప్ప ఆధార భూమికను రూపొందించవచ్చు. ఇలా "శాసన శాస్త్రం" (Epigraphy) ద్వారా చరిత్రని విశ్లేషించే ఒక ప్రక్రియ కొనసాగుతూ వస్తున్నప్పటికీ శాసనాలలో ఉపయోగించిన భాష, ఆ కాలమునాటి లిపి, పదాలు, వాక్య నిర్మాణం ఇవన్నీ ప్రత్యేకతని సంతరించుకున్న అధ్యయన అంశాలు! ఇది ప్రస్తుత భాషకు భిన్నంగా వైవిధ్యతతో ఉండటమనేది సహజమే! ఇలా కష్టమైన, క్లిష్టమైన శాసన శాస్త్ర అంశాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా చరిత్రని నిర్మించే ప్రక్రియని సుసంపన్నం చేసిన పురాచరిత్ర పరిశోధకుడు, ప్రాతఃస్మరణీయుడు పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి గారు!

తెలుగువారి చరిత్రను, తెలంగాణ చరిత్రను వారు చేసిన పరిశోధనలు ఎంతో సుసంపన్నం చేశాయి. మనకు తెలియని మన చరిత్రలోని ఎన్నో మరుగున పడ్డ అంశాలని ప్రపంచానికి చాటి చెప్పాయి! అందుకే తెలుగు నేల మీద విరాజిల్లిన చరిత్రకారులలో ఆదిరాజు వీరభద్రరావు, చిలుకూరి వీరభద్రరావు, కొమర్రాజు లక్ష్మణరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, నేలటూరి వెంకటరమణయ్య లాంటి మహనీయుల కోవలో నిలిచే శాశ్వత కీర్తిని సాధించిన పరిశోధకులు పరబ్రహ్మ శాస్త్రి గారు! వారు చేసిన పరిశోధనలను లోతుగా పరిశీలించిన తర్వాత వారు, వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు పరంగా పరబ్రహ్మ శాస్త్రి... కానీ వారు చేసిన పనులు, సేవల దృష్ట్యా వారు "శాసనాల శాస్త్రి" గా, “నాణాల శాస్త్రి" గా, “సామాజిక చరిత్ర శాస్త్రి” గా, "లిపి శాస్త్రి" గా ఆయనలోని భిన్నకోణాలు నాకు అర్థమయ్యాయి.

పరబ్రహ్మ శాస్త్రి గారు గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, పెద్ద కొండూరు గ్రామంలో 1921 ప్రాంతంలో స్వాతంత్ర్యానికి పూర్వమే జన్మించినప్పటికీ 1948లోనే తెలంగాణ ప్రాంతానికి వచ్చేసి జనగామ లో ఉండే ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మూడేళ్ల కీ 1951 లో హైదరాబాద్ కి వచ్చి అక్కడ కేశవ మెమోరియల్ స్కూల్ లో గణితం, సైన్స్ ఉపాధ్యాయుడు గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 1959 లో పురావస్తు శాఖ లో చేరి తన పరిశోధనల్ని పదునుపెట్టి రిటైర్మెంట్ అయ్యేంతవరకూ, అయిన తర్వాత కూడా చరిత్ర పై మక్కువతో వేలాది పరిశోధనలు నిర్వహించారు

పరబ్రహ్మ శాస్త్రి గారు 1959 నుంచి మొదలెట్టి 1977 మధ్య కాలంలో తెలుగు ప్రాంతాల్లోని వేర్వేరు ప్రదేశాలను సందర్శించి దాదాపు రెండు వేలకు పైగా శాసనాలను సేకరించి, ఆ శాసనాలలోని విశేషాలన్నీ పరిష్కరించి ప్రపంచానికి వెల్లడి చేశారు. వారికి బహుభాషలలో పాండిత్యం ఉండటంవల్ల ప్రాకృత శాసనాలని, సంస్కృత, తెలుగు, కన్నడ భాషలలో ఉండే శాసనాలని కూడా చదివి వాటిని పరిష్కరించడమే కాకుండా, చరిత్రకు తెలియని ఎన్నో విషయాలను ఆ శాసనాల ఆధారంగా లోకానికి చాటి చెప్పారు. ఇలా చరిత్రపరంగా పరబ్రహ్మశాస్త్రి గారు విస్తృతమైన పరిశోధన చేసినప్పటికీ వారు చేసిన పరిశోధనలను ఐదు అంశాల నుంచి పరిశీలించవచ్చని నా భావన.

​1) కాకతీయుల వంశ వృక్ష పునర్నిర్మాణం :

11 వ శతాబ్దం నుంచి 1323 వరకు దక్షిణాపథాన్ని విస్తృత ప్రాతిపదికన పరిపాలించిన వంశంగా కాకతీయ చక్రవర్తులు మహోన్నత స్థానాన్ని సాధించారు. వీరికి సంబంధించిన చాలా విషయాలు పరబ్రహ్మ శాస్త్రి గారి కంటే పూర్వం అంతగా వెలుగులోకి రాలేదు. కాకతీయ గణపతి దేవుడు వేయించిన "బయ్యారం, ఇతర శాసనాల ఆధారంగా కాకతీయుల వంశ వృక్షాన్ని ఆధార సహితంగా ఆయన నిరూపించి చూపించడంతో కాకతీయ చక్రవర్తుల పాలనాకాలాల గురించిన వివరాలు తొలిసారిగా తెలిసాయి.

ఇలా కాకర్త్య గుండన నుంచి మొదలుకుని ప్రతాపరుద్రుడి వరకు కాకతీయ చక్రవర్తుల వంశ క్రమణిక ని సాధికారికంగా ప్రకటించడం గొప్ప విశేషం. దీనివల్ల కాకతీయ కాలపు ఎన్నో విశేషాలు వెలుగులోకి వచ్చాయి.

అలాగే “రాయగజకేసరి" అనే బిరుదు ఏ కాకతీయ చక్రవర్తి కి ఉండేది? అనే విషయంలో అప్పట్లో చరిత్రకారులలో సందిగ్ధత నెలకొని ఉండేది. పరబ్రహ్మ శాస్త్రి గారు తను చేసిన శాసనాల పరిశోధనల ఆధారంగా కాకతీయ మహారాణి రుద్రమదేవి కే “రాయగజకేసరి” అనే బిరుదు వుందనే విషయాన్ని నిరూపించారు. దాంతోపాటు చందుపట్ల శాసనాన్ని పరిష్కరించి రుద్రమదేవి మరణం తన 80వ ఏట 1289 లో సంభవించిందని నిర్ధారించ గలిగారు (గతంలో రుద్రమదేవి మరణానికి సంబంధించి చరిత్రకారులు అభిప్రాయపడింది 1296 సంవత్సరం అని)

ఇలా కాకతీయ చక్రవర్తులకు సంబంధించి మరెన్నో విషయాలు వాస్తు శిల్ప రీతులను, దేవాలయ నిర్మాణ శైలి రీతులను, చెరువుల నిర్మాణాన్ని, నగర నిర్మాణాన్ని, కోట నిర్మాణానికి సంబంధించిన వ్యూహాలను పరబ్రహ్మ శాస్త్రి గారు పరిష్కరించి కాకతీయ చరిత్రకు సంపూర్ణతను తెచ్చారు.

2) శాతవాహనులకు సంబంధించిన పరిశోధనలు:

'సిముక' రాజు ద్వారా శాతవాహన వంశం ప్రారంభించబడి దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు భారతదేశంలో గొప్ప సామ్రాజ్యంగా పరిగణించబడింది అనేది మనందరికీ తెలుసు. కానీ శాతవాహన చక్రవర్తుల వంశానుక్రమణికను మొదటిసారిగా పరిష్కరించి సాధికారికంగా వ్యక్తం చేసింది మాత్రం పరబ్రహ్మ శాస్త్రి గారే! కోటిలింగాలలో లభించిన శాతవాహన కాలపు నాణాలను, ఇతర శాసనాలను ఆధారంగా చేసుకొని వారు శాతవాహనుల వంశానుక్రమణిక ని రూపొందించారు.

3) జిల్లా శాసన సంపుటాలు:

పరబ్రహ్మ శాస్త్రి గారు ఆయనకు దొరికిన శాసనాలని, వాటిలోని విశేషాలని పరిష్కరించి వాటన్నిటినీ జిల్లాల వారీగా సంపుటాల లాగా ప్రచురించి శాసనాలలోని అంతర్గత విశేషాలను ఎన్నింటినో గ్రంధస్థం చేసి భావితరాలకు కరదీపికలుగా అందించారు.

​4) సామాజిక చరిత్ర రచన:

చరిత్ర అంటే సాధారణంగా రాజులు, రాజ్యాలు రాజకీయాలకు సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి, వాటిలో ప్రధానంగా పాలనా పరమైన అంశాలు, వంశ పరమైన ఆర్థిక వ్యాపార వాణిజ్య విశేషాలు ఉండటం సహజం. కానీ సామాజిక కోణం నుంచి చరిత్రని వ్యాఖ్యానించడం అనేది అరుదుగా జరుగుతుంది. ఆ అరుదైన ప్రయత్నాన్ని చేసి ఒక సామాజిక చరిత్ర రచనలో కొత్త ద్వారాలు తెరిచిన మేధావి - పరబ్రహ్మశాస్త్రి! ఆయన రాసిన “ప్రాచీనాంధ్ర గ్రామీణ జీవనం" అనే గ్రంథం ప్రాచీన కాలంలో తెలుగు నేల పై విలసిల్లిన వివిధ గ్రామీణ ప్రాంత ప్రజల జీవన శైలి, విధానాలు, సామాజికత ఎలా ఉందో వివరించింది.

5) తెలుగు లిపి పరిణామ క్రమం:

తెలుగు భాష మూలాలు పంపన కన్నా పూర్వమే శాసనాలలో మనకు కనిపిస్తున్నప్పటికీ అంతకంటే వందలాది సంవత్సరాల క్రితమే లిపి లేని కాలంలో మౌఖిక భాషగా ప్రజలందరిలో వాడుకలో ఉన్న భాషగా తెలుగు భాష ఉందనే విషయం కాదనలేనిది. అయితే తెలుగు భాషలో లిపి రూపొందిన తర్వాత ఆ లిపి, పదాలు, అక్షరాలు, వర్ణాలు ఉచ్చారణ కాల క్రమంలో ఎలాంటి పరిణామాలు, మార్పులు చెందినవో వాటన్నిటినీ వివరిస్తూ, (శాసన భాషలో, కావ్య భాషలో, తాళపత్ర గ్రంధాలలో ఉన్న భాషలోని పదాల ఆధారంగా చేసుకొని) “తెలుగు లిపి పరిణామ క్రమం” అనే పరిశోధనా గ్రంధంలో శాస్త్రి గారు చక్కగా విశదీకరించారు.

ఇలా పరబ్రహ్మ శాస్త్రి గారు తెలుగు చరిత్రకు, శాసనాల పరిష్కరణ కు, సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. వారి కృషి ఆధారంగానే తదనంతర కాలపు చరిత్రకారులు తమ పరిశోధనని కొనసాగించి తెలుగుజాతి చరిత్రకు సంబంధించి మరెన్నో విశేషాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. అందుకే తెలుగు జాతి చరిత్ర నిర్మాణానికి పరబ్రహ్మ శాస్త్రి గారి కృషి అనన్య సామాన్యమైనది. వారి సేవ తెలుగుజాతి చరిత్ర ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

అందుకని “పి వి పరబ్రహ్మ శాస్త్రి గారి శతజయంతి" సందర్భంగా ఈ "శాసనోపాసన" అనే పేరుతో వారి జీవన ప్రసానాన్ని తెలిపే గ్రంథాన్ని ప్రచురించడం, వారి చారిత్రక కృషిని, సాహితీ సేవలను "కొండ అద్దమందు కొంచమై ఉండదా” అన్న స్థితిలో చూపించడమే అని భావిస్తాను. ఈ 'మోనోగ్రాఫ్' ను రచించిన ప్రఖ్యాత చరిత్రకారుడు, స్థపతి శ్రీ ఈమని శివనాగిరెడ్డి గారిని, ఆచార్య పి. చెన్నారెడ్డి గారిని అభినందిస్తున్నాను శాస్త్రి గారి జీవన దశలు, ఆయన చేసిన కృషి ఈనాటితరం చిత్రకారులకు ఒక స్ఫూర్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం “నాదోపాసన” చేసిన త్యాగరాజస్వామి వంటి కృతికర్తలను చూశాం. "సాహిత్యోపాసన” చేసిన కాళిదాసు లాంటి సృజనశీలురను చదివాం. కానీ పరబ్రహ్మశాస్త్రిగారు "శాసనోపాసన" చేశారు. అందుకే ఆయన జీవన గమనాన్ని తెలిపే ఈ మోనోగ్రాఫ్‌కు ఈ పేరు ఔచిత్యంగా అమరిందని భావిస్తున్నాను. ​ఈ శత జయంతి ఉత్సవాలను నిర్వహించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న పరబ్రహ్మశాస్త్రి గారి కుమారులు రామ్ గారికి, శాస్త్రి గారి అభిమానులు, శిష్యులు, చరిత్ర ప్రేమికులకి, చరిత్ర పరిశోధకులందరికి అందరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటూ.... ఆ మహనీయునికి భాషాసాంస్కృతిక శాఖ అందిస్తున్న అక్షర నీరాజనంగా ఈ "శాసనోపాసన" పుస్తకాన్ని మీకందరికీ సన్వియంగా సమర్దిస్తున్నాము


డాక్టర్ మామిడి హరికృష్ణ

సంచాలకులు

తేది: 12- ఏప్రిల్ - 2023

భాషా సాంస్కృతిక శాఖ

రవీంద్రభారతి, హైదరాబాద్.

తెలంగాణ ప్రభుత్వం

​







ప్రముఖ శాసన పరిశోధకులు

డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి

​
​

ప్రముఖ శాసన పరిశోధకులు

డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి

అప్పటికింకా, కృష్ణానదిపై ఎగువన ఒక్క ఆనకట్ట కట్టలేదు. పైనుంచి వచ్చే నీళ్లన్నీ వరదలా నిరంతరం పారుతూ, విజయవాడైన ఇప్పటి బెజవాడ కొండల్ని దాటి, పొంగుతూ పొర్లుతూ ఉరకలూ, పరుగులతో చుట్టు పక్కల ప్రాంతాన్ని జలమయం చేస్తూ, పున్నమివెన్నెల్లో ఆరబెట్టిన తెల్లటి దుప్పటిని గుర్తు చేస్తుంది కృష్ణమ్మ. కాటన్ దొరకట్టిన ఒక ఆనకట్ట తప్ప, కృష్ణానదికి ఎలాంటి అడ్డుకట్టా లేనందువల్ల ప్రతిఏడూ ఒకటో రెండో వరదలు సరదాగా వచ్చిపోతుండేవి. ఇలా కృష్ణానదికి ఇరువైపులా వరదలతో పరదాలా పరుచుకొన్న నీటివల్ల ఈ ప్రాంతానికి 'వెలనాడు' అని పేరొచ్చిందంటారు. 'ఆఱు' అంటే తమిళంలో నది అని, 'వెల్లం' అంటే వరద అనీ, తరచూ నదికి వరదలొచ్చే ప్రాంతం గాబట్టి 'ఆఱువెల్లంనాడు' రానురాను 'ఆరువేలనాడు' అయిందనీ, తరువాత ఆరువేలగ్రామాలను కలిగిన షట్ సహస్రనాడు అయిందని కొందరు పరిశోధకుల అభిప్రాయం.

నిరంతరం జలజలా పారే నీటితో, పచ్చటి తివాచీ పరచిన ప్రకృతి కాంతఒడిలో, కృష్ణానదికి కుడిగట్టున గుంటూరు జిల్లా, దుగ్గిరాల తాలూకాలో, విజయవాడకు దిగువన పెదకొండూరు అనే గ్రామం అలరారుతూ ఉంది. శివుడు ఆనందేశ్వరుడుగా కొలువై, వైదిక కార్యక్రమాలకు నెలవై, ఒక అగ్రహారంగా పేరుగాంచింది పెదకొండూరు. ఆ గ్రామంలోని ఒక పండిత కుటుంబానికి చెందిన పుచ్చా వెంకటేశ్వర్లు గారికి పరబ్రహ్మశాస్త్రి జన్మించారు. ​పెదకొండూరులో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత, ఆయన ఉన్నత విద్యకోసం, బంధువులున్న కొల్లూరుకు వెళ్లి ఎస్ఎస్ఎల్‌సీ వరకు చదువుకొన్నారు. ఒకపక్క ఆధునిక విద్యను అభ్యసిస్తూనే, మరోపక్క పండిత గురువుల దగ్గర సంస్కృతం నేర్చుకొని పంచమహాకావ్యాల్ని చదువుకొన్నారు.

1938లో ఎస్ఎస్ఎల్‌సీ పూర్తి అయిన తరువాత, పరబ్రహ్మశాస్త్రి, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వెళ్లి, ప్రఖ్యాత వేదపండితులైన వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి శిష్యరికంలో 1939 నుంచి 1943 వరకు వ్యాకరణంతో పాటు వైదిక విద్యలనభ్యసించారు. కాశీలో చదవటం ఒక గొప్ప అదృష్టంగా భావించే ఆ రోజుల్లో, పరబ్రహ్మశాస్త్రి కాశీకి వెళ్లి బెనారసు హిందూ విశ్వవిద్యాలయంలో చేరి ఇంటర్మీడియేట్, ఆ తరువాత 1948లో బియస్సీ డిగ్రీని పొందారు. చదువు పూర్తికాగానే కాశీ విశ్వేశ్వరుని దీవెనలందుకొని, పెదకొండూరుకు తిరిగొచ్చారో లేదో హైదరాబాద్ రాష్ట్రంలోని ఒక స్నేహితుని ద్వారా మంచి ఉద్యోగానికి ఆహ్వానం అందుకొన్నారు. అప్పుడే హైదరాబాదులో పోలీసు యాక్షన్ ముగిసి, నిజాం ప్రభువు, భారత ప్రభుత్వానికి తన ప్రాంతాల్ని అప్పగించగా కొత్తగా హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. ఆ నేపథ్యంలో పరబ్రహ్మశాస్త్రి గారు మునుపటి వరంగల్ జిల్లా, నేటి జిల్లా కేంద్రమైన జనగామలో కొన్నేళ్ల క్రితం స్థాపించిన ఒక తెలుగు మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడ మూడేళ్లపాటు పనిచేసిన తరువాత, 1951లో హైదరాబాదులోని నారాయణగూడలోని కేశవమెమోరియల్ హైస్కూల్లో లెక్కలు, సైన్సు టీచర్‌గా చేరారు.

ఒకపక్క పిల్లలకు పాఠాలు చెబుతూనే, తానూ ఉన్నత విద్యను కొనసాగిస్తూ, 1955లో బెనారసు హిందూ విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత భాషలో ఎం.ఎ. డిగ్రీని పొందారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా పేరు సంపాదించిన పరబ్రహ్మశాస్త్రి గారి సంస్కృత పాండిత్యాన్ని గుర్తించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ పురావస్తు మరియూ ప్రదర్శన శాలలశాఖ, శాసన విభాగంలో చేరమని ఆహ్వానించింది. చదువుకు సార్థకత దక్కిందన్న ఆనందంతో ఆయన 1959లో ఆ శాఖలో శాసన సహాయకునిగా కొత్త ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

శాసన పరిశోధన

పురావస్తు శాఖ శాసన విభాగంలో సహాయకునిగా చేరిన మొదటి రోజు నుంచి, తాను బోధించిన లెక్కల్ని పక్కన బెట్టారు. పొడవాటి శాసనాల నకళ్లను దణ్ణెంపై ఉంచి అక్షరం, అక్షరాన్ని చదివి, పదాలను పొందించి, శాసనమంతా అనేకసార్లు చదివి, చదివి పాఠాన్ని ​రాసీ రాసీ చారిత్రక విషయాలను రాబట్టారు. శాసనాలతోపాటు, చరిత్రను కూడా నెమరువేసుకొంటూ, శాసనాల్లోని కొత్త విషయాలను వ్యాసాల ద్వారా ప్రచురించటం మొదలు పెట్టారు. బాల్యంలోనే పంచకావ్యాలు చదివి, సంస్కృతంలో ఎంఏ చేయటాన, సంస్కృత శాసనాలు చదవటం శాస్త్రి గారికి నల్లేరు మీద బండినడకైంది. తెలుగు సాహిత్యంపై పెంచుకొన్న మమకారంతో, తెలుగు శాసనాల్లోని సాహిత్యం శాస్త్రి గారిలో మరింత ఆసక్తిని రగిలించింది. సాహిత్యాభినివేశంతో, 'మేఘసందేశ సమీక్ష - పూర్వార్థము' అన్న వ్యాసాన్ని 1962లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ పత్రికలో రాశారు.

కాకతీయులపై విస్తృత పరిశోధన

శాసనాలను చదవటంలో పట్టు సాధించిన శాస్త్రిగారు, అప్పటి వరకూ కాకతీయులపై జరిగిన పరిశోధనలను బేరీజు వేసి, తరువాత బయల్పడిన శాసనాల ద్వారా, కాకతీయ చరిత్రలోని కొత్త విషయాలను కూడ జోడించి, వారి చరిత్రను మళ్లీ రాయటానికి పూనుకొన్నారు. ఆ సందర్భంగానే, శాస్త్రిగారు మునుపటి ఖమ్మం జిల్లా బయ్యారం చెరువువద్ద గల కాకతి మైలాంబ శాసనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, కాకతీయ వంశ చరిత్రను పునర్నిర్మించి, 1967లో భారతి మాసపత్రికలో 'కాకతి మైలాంబ-బయ్యారం చెరువు శాసనము' అన్న వ్యాసాన్ని రాశారు. తద్వారా కాకతీయులు, రాష్ట్రకూటుల సామంతులుగా, వేంగీపై రాష్ట్రకూటుల దాడిలో పాలుపంచుకొని, కొరవి మండలాధిపతులుగా ఎదిగారని, తరువాత, కళ్యాణ చాళుక్యుల కాలంలో వారి విధేయులై అనుమకొండపురానికి సామంతాధిపతులుగా కొనసాగారని, తరువాత కాలచురిబిజ్జలుడు, కాకతిరుద్రునిపై దాడి చేయగా, రుద్రుడు తిప్పికొట్టి, స్వతంత్రుడై కాకతీయ రాజ్యాన్ని స్థాపించాడని వేయిస్థంభాల గుడి శాసనంలో ప్రకటించుకొన్నాడని రాశారు. అంతవరకూ, కాకతీయరుద్రుడు, కళ్యాణ చాళుక్యులనెదరించి స్వతంత్రుడైనాడన్న అపోహకు తెరదీసి, వారికి విధేయుడుగా ఉంటూనే, కాలచూరి బిజ్జలునికి లొంగక, స్వతంత్రుడైనాడని శాస్త్రిగారు తేటతెల్లం చేశారు.

అంతేకాదు, కాకతిమైలాంబ బయ్యారం చెరువు శిలాశాసనం ద్వారా, వంశాను క్రమణికతోపాటు, కాకతీయ చరిత్రనే తిరగరాశారు. గణపతిదేవుని పాలనా కాలంలో (క్రీ.శ. 1199-1262) అతని చెల్లెలైన మైలాంబ తనపేరు మీదుగా తవ్వించిన ధర్మకీర్తి సముద్రమనే పెద్ద చెరువు స్థాపన సందర్భంగా వేయించిన ఈ శాసనాన్ని పరబ్రహ్మశాస్త్రి గారే 1966లో కనుగొన్నారు.

అలానే, శాస్త్రిగారు కాకతీయ నాణేలపై కూడ విస్తృత పరిశోధనగావించారు. తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి నుంచి తనకు చేరిన కాకతీయ ప్రతాపరుద్రుని రాగిరేకు శాసన కడియంపైన 'దాయగజకేసరి' అన్న ముద్ర ఉంది. దాని అర్థం శతృవులనే ​ఏనుగులకు తాను సింహంలాంటి వాడని శాస్త్రి గారు అంతటితో ఊరుకోకుండా, శాసనాల్లో ఇలాంటి బిరుదుందేమోనని వెదకటం ప్రారంభించారు. మాచర్ల దగ్గర గల తేరాల శాసనంలో ప్రతాప రుద్రుని 'దాయ గజకేసరి లాంఛన భ్రాజితుండు' అని కీర్తించటాన్ని గుర్తించి, ఇది ప్రతాపరుద్రుని అధికార రాజరిక బిరుదని నిర్ణయించారు. అంతేకాక, కాకతీయవంశంలోని రెండో ప్రోలరాజు, రుద్రదేవ మహారాజు, గణపతి దేవమహారాజులకు కూడ ఈ 'రాయగజకేసరి' బిరుదున్నట్లుగా, రుద్రమదేవి, యాదవులనుంచి బీదరుకోటను సాధించి, 'రాయగజకేసరి' బిరుదును ధరించినట్లుగా కూడా పరబ్రహ్మశాస్త్రి తెలియజేశారు.

స్టేట్‌మ్యూజియంలోని కొన్ని వెండి రూకలు, బంగారుద్రమ్మలనే నాణేలపై గల'రాయగజకేసరి', 'దాయగజకేసరి' బిరుదులను బట్టి అవి చాళుక్యుల నాణేలని పూర్వం కొందరు పరిశోధకులు పేర్కొనగా, శాస్త్రిగారు ఇవి కాకతీయుల నాణేలని కాకతీయ కాయిన్స్ అండ్ మెజర్స్ అన్న పుస్తకం ద్వారా 1975లో తప్పును సరిదిద్దారు.

క్రీ.శ. 1289లో కాకతీయ రుద్రమదేవి యుద్ధభూమిలో మరణించిందన్న విషయాన్ని 'డిడ్ కాకతిరుద్రమదేవి డై ఆన్ బాటిల్ ఫీల్డ్ ?' అన్న వ్యాసం ద్వారా 1974లో తెలియజేశారు. అప్పటి వరకూ జరిగిన పరిశోధనల నేపథ్యంలో తాను కనుగొన్న శాసనాధారాలతో కలిపి 'కాకతీయులు' అన్న అంశంపై 1976లో ధార్వాడ్ లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి పీహెడ్‌డీ పట్టాను పొంది, ఆంగ్లంలో కాకతీయాస్ ఆఫ్ వరంగల్ అన్న పుస్తకాన్ని 1977లో ప్రచురించి తెలుగు వారి చరిత్రను సుసంపన్నం చేశారు.

ఆమరణ పరిశోధన

పరబ్రహ్మశాస్త్రి గారు 1977లో పురావస్తుశాఖలో శాసన విభాగంలో డెప్యూటీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తరువాత అందరిలా ఆయన కూడ పరిశోధనను పక్కన బెడతారనుకొన్న అపోహకు తావివ్వలేదు శాస్త్రిగారు. శాసన పరిశోధన, రచనలను మునుపటికంటే ఇంకా ముమ్మరం చేశారు. కార్యభారం వల్ల ఆయన, పదవిలో ఉండగా 9 వ్యాసాలు, 6 పుస్తకాలు మాత్రమే రాయగా, పదవీ విరమణ తరువాత, 60 వ్యాసాలు, 15 పుస్తకాలను రాయటమే కాక, సలహాదారుగా అనేక పుస్తకాల ప్రచురణలో ప్రముఖ పాత్రను పోషించారు.

శాతవాహన చరిత్రను తిరగరాసిన శాస్త్రిగారు

కారణజన్ములనే మాట ఊరికే పుట్టలేదు. శాస్త్రిగారి విషయంలో అది నిజమేననిపించింది. ఉద్యోగరీత్యా 1975లో, ఆయన కన్నడ రచయిత పంపమహాకవిని గురించి లోతైన పరిశోధన చేయాలనుకొన్నారు. సమాచార సేకరణలో భాగంగా, ​కరీంనగర్‌లో కాలినడకన విస్తృతంగా పర్యటిస్తుండగా, ఉన్నట్టుండి ఒక చోట పెద్ద వర్షం పడుతుంది. తలదాచుకోవటానికి ఒక పశువుల కొట్టాన్ని ఆశ్రయించగా, అక్కడ కనిపించిన ఒక పెద్ద మనిషి, ఇచ్చిన సమాచారం, శాతావాహన చరిత్రను కొత్త మలుపు తిప్పుతుందని శాస్త్రిగారు కూడా అనుకోలేదు.

ఆ పెద్ద మనిషి, కప్పారావుపేట దగ్గర గల మునులగుట్ట అనే కొండ మీద కొన్ని గుహలున్నాయని చెప్పాడు. శాస్త్రిగారు వెంటనే అక్కడికెళ్లి, ఆ గుహలో చదును చేసుకొన్న నేల పరుపులను గుర్తించి, అవి జైనమునులు జీవితం చివరి దశలో ఆహారాన్ని తీసుకోకుండా, మరణాన్ని ఆహ్వానించే, సల్లేఖనవ్రత స్థావరాలని గుర్తించారు. అంతేకాదు, చుట్టు పక్కల జరిపిన పరిశోధనల్లో శాస్త్రిగారికి సాతకర్ణి నాణేలు దొరికాయి. గ్రామస్తులు, సమీపంలో గల కోటిలింగాల గ్రామంలో ఇలాంటి నాణేలు పెద్ద సంఖ్యలో దొరుకుతున్నాయని చెప్పగా, ఆ ప్రాంతాన్ని చూడాల్సిందే ననుకొని హైదరాబాదు తిరిగొచ్చారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు, ధర్మపురికి చెందిన సంగనభట్ల నరహరిగారు, కోటిలింగాల నుంచి తాను సేకరించిన నాణేలను శాస్త్రి గారికి ఇచ్చాడు. పరిశీలించిన శాస్త్రిగారు, ఆ నాణేలపై గల గోబద, కంవాయ, సమగోప, సాతవాహన, సాతకర్ణి, చిముక శాతవాహన, పులుమావి అనే రాజుల పేర్లను గుర్తించారు. మరింత క్షుణ్ణంగా పరిశోధించి, ఆ నాణేలు ఆంధ్రదేశచరిత్రకు కొత్త ఆధారాలని, శాతవాహన చరిత్రను పునర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయని శాస్త్రిగారు అభిప్రాయపడినారు. ఇంతలో రాష్ట్ర పురావస్తుశాఖ, వి. వి. కృష్ణశాస్త్రి గారి నేతృత్వంలో ఎన్నెస్ రామచంద్రమూర్తి గారు కోటిలింగాల వద్ద తవ్వకాలు చేపట్టి, పొరల్ని నిర్ణయించి, వెలువడిన పురాతన వస్తువులు, కట్టడాలు, నాణేల ఆధారంగా ఒక నివేదికను పొందుపరచారు. ఈ నివేదిక ఆధారంగా, తన పరిశోధనలను జోడించి అనేక కొత్త చారిత్రకాంశాలతో శాస్త్రిగారు సాతవాహన ఎపోక్- ఏ న్యూ లైట్ అన్న పుస్తకాన్ని 1994లో తెలుగు గోష్ఠి తరపున ప్రచురించారు. బహుళ ప్రజాదరణ చూరగొన్న ఈ పుస్తకం అందుబాటులో లేకపోవటంతో, శాస్త్రిగారే దీన్ని మళ్లీ 1996లో ముద్రించారు.

ఈ పుస్తకం ద్వారా శాస్త్రిగారు అనేక కొత్త విషయాలను అందించారు. సాతహహనుల కంటే ముందు తెలంగాణాను, గోబద, కంవాయ, నరన, సమగోప అనే స్థానిక రాజులు పాలించారని, వీరిలో చివరిరాజు సమగోపను జయించిన సాతవాహనుడు క్రీ.పూ. 80లో, శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడని, అతని కొడుకు శాతకర్ణి క్రీ.పూ. 50లో రాజై కలింగ ఖారవెలుని దాడిని తిప్పి కొట్టాడని, సాతకర్ణి కొడుకు సిముకునితో సాతవాహన రాజ్యం సుస్థిరమైందనీ, సాతవాహనులు ఆంధ్రజాతీయులనీ, వారు మగధ సామ్రాజ్యానికి సామంతులైనందువల్ల ఆంధ్రభృత్యులని పిలువబడినారని, పురావస్తు ఆధారాల సమన్వయంతో శాస్త్రిగారు చేసిన సంచలన ప్రకటనను చరిత్రకారులందరూ బలపరిచారు. అప్పటివరకూ శాతవాహన చరిత్రపై గల అస్పష్టతలకు ఆయన పరిష్కారం చూపించారు.

'ఏబ్రీఫ్ సర్వే ఆఫ్ ది శాతవాహన కాయినేజ్' వ్యాసాన్ని జర్నల్ ఆఫ్ ఆర్కియోలజీ​శాతవాహనా స్పెషల్‌, వా. 3, సం.2 (1975) లోనూ, భారతి మాసపత్రిక (1978)లో సిముక సాతవాహనుడి నాణేలు' అన్న వ్యాసాన్ని 1979లో అదే పత్రికలో 'ఆంధ్ర- కర్ణాటక' అన్న వ్యాసాన్ని, అదే సంవత్సరంలో, సంమోర్ కాయిన్స్ ఫ్రం కోటలింగాల' అన్న వ్యాసాన్ని న్యూమిస్ మెటిక్స్ డైజెస్ట్‌, వా. 3, పా. 2,లో ప్రచురించారు.

హైదరాబాదు నగరానికి 400 ఏళ్ల చరిత్రే అని అందరూ అనుకొంటున్నపుడు, పరబ్రహ్మశాస్త్రిగారు, హైదరాబాదు నగరంలో మూసీ ఒడ్డునున్న చైతన్యపురిలో 1984లో విష్ణుకుండిన గోవిందవర్మ ప్రాకృత శాసనాన్ని కనుగొని, నగర వయసు 1500 ఏళ్లకు తీసుకెళ్లి, కొత్త చరిత్రను సృష్టించారు. కొసగుండ్ల నరసింహస్వామి ఆలయం పక్కన గల

ఒక బండపైన విష్ణుకుండిన వంశానికి చెందిన మొదటి శాసనాన్ని కనుగొని, ఆ వంశపు మొదటిరాజు గోవిందవర్మ అక్కడొక బౌద్ధ విహారాన్ని నిర్మించినట్లు తెలియజేసి, విష్ణుకుండిన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. చైతన్యపురి ప్రాకృత శాసనంపై 'హైదరాబాదు ప్రాకృత్ ఇన్స్‌క్రిస్షన్ ఆఫ్ గోవిందరాజ విహార' అనే వ్యాసాన్ని 1984లో, జర్నల్ ఆఫ్ ది ఎపిగ్రఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వా. 2 లో ప్రచురించారు.

చరిత్ర రచనలో పొరపాట్లను సరిదిద్దిన శాస్త్రిగారు

శాస్త్రిగారు అప్పటివరకూ చలామణిలో ఉన్న కొన్ని చారిత్రక శాసనాల అధ్యయనంలోని పొరపాట్లను సరిదిద్ది, తెలుగువారి చరిత్రను కూడ సరిచేశారు.

ఉదాహరణకు ముదిగొండ చాళుక్యుల ఒక రాగిరేకు శాసనంలోని 'యత్కణ్ఠికాం' అనే పదాన్ని ఒక పాశ్చాత్య పండితుడు 'యత్కన్యకాం' అని చదివి, అదే అన్వయంతో ఇండియన్ యాంటిక్వేరి వాల్యూంలో వ్యాసాన్ని ప్రచురించాడు. తరువాత మన చరిత్ర కారులు కూడా ఆ శాసన పాఠాన్నే అనుసరిస్తూ వచ్చారు. శాస్త్రి గారికి అనుమానం వచ్చి, మళ్లీ ఆ శాసనాన్ని పరిశీలించి ఆ పదం 'యత్కణ్ఠికానాం' అనే రూఢి పరచుకొని, నేలటూరి వెంకటరమణయ్యగారికి చెప్పి, ఆయన ప్రశంసలందుకొన్నారు. 'కన్యకాం' అంటే ఆరాజు కూతురును వివాహం చేసుకొన్నట్లు అర్థం వస్తుందనీ, 'యత్కణ్ఠికాం' అంటే 'మెడలోని కంఠిక' అన్న అర్థాన్ని చెప్పి దాని చారిత్రక నేపథ్యాన్ని వివరించి, ముదిగొండ చాళుక్య చరిత్రకు న్యాయం చేకూర్చారు.

కర్నూలుజిల్లా మహానంది సమీపంలోని కడమరకాల్వ అనే గ్రామంలోని శివనందీశ్వరాలయం శిధిలావస్థలో ఉంది. అది అలంపూరు ఆలయాల మాదిరిగా బాదామీ చాళుక్యుల రేఖా నాగరశైలిలో నిర్మించబడింది. అక్కడే కొన్ని నమూనా ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకదానిపైన గల సత్యాశ్రయ భట్టారక' అన్న చిన్న శాసనం శాస్త్రిగారి ​దృష్టినాకర్షించింది. బాదామీచాళుక్య మొదటి, రెండో పులకేశి రాజులకు 'సత్యాశ్రయ' బిరుదందని, క్రీ.శ. 540, 610 లలో వారి పాలన ప్రారంభమైందని, వీరిద్దరిలో ఒకరి భటుడు, ఇక్కడ ఒక నమూనా ఆలయాన్ని చెక్కించాడని, ఆ రాజులిద్దరి కాలంలో శివనందీశ్వరాలయం నిర్మించబడిందని, చలికి విషయంగా పేరొందిన ఈ ప్రాంతం నుంచే చాళుక్యులు, బాదామీకి వెళ్లి అక్కణ్ణించి పాలించటం ప్రారంభిచారని బాదామీ చాళుక్య చరిత్రను తిరగ రాశారు.

శాతవాహన చరిత్రకు కొత్త ఆధారాలను అందించిన శాస్త్రిగారు

శాతవాహనుల చరిత్రకు సంబంధించిన అనేక సమస్యలను శాస్త్రిగారు తన నిశిత పరిశోధన, పరిశీలనల ద్వారా పరిష్కరించారు. పురాణాల్లో పేర్కొన్నట్లు శాతవాహనులు ఆంధ్రజాతీయులని, తొలిశాతవాహన రాజులు అశోకుని సమకాలికులు కారని, సిముకుని కంటే ముందు శాతవాహనుడున్నాడనీ, అతని కుమారుడు మొదటి శాతకర్ణి అనీ, వీరిద్దరి తర్వాతే ఈ వంశానికి శాతవాహన అనే పేరొచ్చిందనీ, క్రీ.పూ. 30లో మొదటి శాతకర్ణి కుమారుడైన సిముకుడు స్వతంత్ర పాలన ప్రారంభించాడనీ తేల్చి చెప్పారు.

ఇంకా, మొదటి శాతకర్ణి చివరి కుమారుడైన హకుసిరి, క్రీ.శ. 14-37 మధ్య పాలించిన రోమను చక్రవర్తి టిబీరియస్ సమకాలికుడనీ, వీరాపురం తవ్వకాల్లో బయల్పడిన వెండిపూతగల ఒక సీసపు నాణెం బొమ్మ భాగంలో టిబీరియస్ బొమ్మపై సీజర్ ఆగస్ట్ అన్న చిన్న రోమను శాసనం, వెనుకవైపు మరో రాజు బొమ్మ, ఇంకా 'రణోహకన సతకనస' అని బ్రాహ్మీలిపి శాసనం ఈ విషయాన్ని రుజువు చేస్తుందని శాస్త్రిగారు తొలిసారిగా నిరూపించి, ప్రకటించి, కొత్త చారిత్రక ఆధారాన్నందించారు. పిఎల్. గుప్త, టీవీజీ శాస్త్రిగారలు ఈ నాణెంపై సరైన అధ్యయనం చేయకుండా, వెలిబుచ్చిన అభిప్రాయాలు తప్పని, శాస్త్రిగారు చెబుతూ, ఈ నాణెం ఒక వ్యాపారికి ఇక్కడ వ్యాపారం చేయటానికి టిబీరియస్ ఇచ్చిన లైసెన్స్ టోకెను అనీ, అందుకు స్థానిక పాలకుడైన హకుసిరి తన ఆమోదాన్ని తెలిపినట్లు ఈ నాణెంపై గల హకుసిరి బొమ్మ, శాసనాలు తెలియజేస్తున్నాయని శాస్త్రిగారు చెప్పారు. పురాణాల్లో ప్రస్తావించబడని, నాసిక్ గుహలో నాగనిక చెక్కించిన హకుసిరి బొమ్మకు ఈ నాణెం మరింత చారిత్రకతను జోడిస్తుందని శాస్త్రిగారి అభిప్రాయాన్ని ప్రముఖ నాణేల పరిశోధకులు, చరిత్రకారులు ఆమోదించటమేకాక ఆయన్ను అభినందించారు కూడా.

తెలుగు లిపి ఆవిర్భావ, వికాసాలపై శాస్త్రిగారి అద్వితీయ పరిశోధన

పరబ్రహ్మశాస్త్రిగారు, ఎన్నెస్ రామచంద్రమూర్తి గారితో కలసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం, హైదరాబాదు సంచాలకులు ఆచార్య జయధీర్ తిరుమలరావుగారి కోరికమేరకు 2012లో తెలుగు స్క్రిప్టు -ఆరిజన్ అండ్ ఎవల్యూషన్‌ అన్న ఆంగ్ల పుస్తకాన్ని రాశారు. తెలుగు లిపి ఆవిర్భావ వికాసాలు అన్న తెలుగు అనువాద గ్రంథాన్ని కూడా ఆ సంస్థే ప్రచురించింది. ​

ఈ పుస్తకంలో...

తెలుగు దేశం, భాష ఆంధ్రలో లిపి, తెలుగు అక్షరాలు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచీన లిపి శాస్త్ర అధ్యయనాలు, అశోకుని ఎర్రగుడి, భట్టిప్రోలు పవిత్ర అస్థిపేటిక శాసనాలు, అమరావతి చిన్న శాసనం, కోటిలింగాల నాణేలు, సోమకుని వడ్డమాను, సిరిసదుని గుంటుపల్లి, కొత్తూరు ధాతుపేటిక శాసనాలు, విజయ శాతకర్ణి, నాగార్జునకొండ, వీరపురుషదత్తుని ఉప్పుగొండూరు, ఎహువల చాంతమూలుని, పాతగండిగూడెం పల్లవ సింహవర్మ కట్టుచెరువులు, విష్ణు కుండిన విక్రమేంద్రవర్మ తుమ్మలగూడెం రాగిరేకు, రేనాటిచోళ ధనంజయుని కలమల్ల, తిప్పలూరు, పుణ్యకుమారుని పెదముడియం, బమ్మవడ్డవి, చాళుక్య మొదటి విక్రమాదిత్యుని వెల్నల్లి, కుజ్జవిష్ణువర్ధనుని తిమ్మాపురం, పండరంగని అద్దంకి, జినవల్లభుని కుర్క్యాల, ముదిగొండ చాళుక్య నిరవద్యుని కొరవి, యుద్ధమల్లుని బెజవాడ, రాజరాజనరేంద్రుని నందంపూడి, కాకతీయ గణపతిదేవుని ఉప్పరపల్లి, ముసునూరి ప్రోలయ నాయకుని విలస, అనవేమారెడ్డి పెదపలకలూరు, శ్రీకృష్ణదేవరాయలి అన్నియూరు శాసనాల ఆధారంగా, తెలుగు లిపి ఆవిర్భావ వికాసాలను, అక్షరాల పొందికలో వచ్చిన మార్పులను సూచిస్తూ, శాసన ముద్రలు, పాఠాలతో వివరించిన తీరు అద్వితీయం.

బ్రాహ్మీలిపి పుట్టు పూర్వోత్తరాలు, తరువాతి కాలంలో బ్రాహ్మీలిపి స్థానికీకరణ, ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం, తెలుగు, తెలుగు-కన్నడ భాషలు రావటం, శతాబ్దాల వారీగా తెలుగు అక్షరమాలలో సంతరించుకొన్న మార్పులను ఒక్కో అక్షరం చొప్పున తెలిపిన విధానం శాస్త్రిగారి ప్రతిభా పాటవాలకు అద్దం పడుతుందనటంలో సందేహంలేదు. పుస్తకం చివరన ఇచ్చిన ఆధార గ్రంధాలు, వ్యాసాల చిట్టా శాస్త్రిగారి సునిశిత అధ్యయనానికి నిదర్శనాలు.

ప్రాచీనాంధ్ర గ్రామీణ జీవితంపై కొత్త వెలుగులు

క్రీ.శ.12-14 శతాబ్దాల మధ్యకాలంలో, తెలుగునేలను పాలించిన కాకతీయుల చరిత్ర, ఆర్థిక, సామాజికాంశాల గురించి వరంగల్లు కాకతీయులు అన్న గ్రంధంలో క్షుణ్ణంగా వివరించారు శాస్త్రిగారు. తెలుగువారి చరిత్ర, సంస్కృతి జీవన విధానాలపై ఎన్నో పుస్తకాలొచ్చినా, శాస్త్రిగారి ప్రాచీనాంధ్రదేశ చరిత్ర గ్రామీణ జీవనం పుస్తకం ఎన్నెన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చి, శాసన పరిశోధనలో కొత్త ఒరవడిని సృష్టించింది. తొలి కాలపు శాసనాలను నిశితంగా పరిశీలించి, క్రీ.శ.12వ శతాబ్ది వరకూ గల గ్రామీణ జీవన విధానాన్ని, సామాజిక నిర్మాణం, గ్రామ స్థాయిలో పాలనాంగం, పౌరపాలన సంస్థ, గ్రామణి, సంఘాలు, న్యాయవ్యవస్థ. భూమి సాగు విధానాలు, పన్నుల మదింపు విధింపు, వర్తక - వాణిజ్యాలు, ప్రదేశాలు, పట్టణాల పేర్లు, నాణేల వ్యవస్థల గురించి ఇంతకు మునుపు ఏ చరిత్రకారుడు, శాసన పరిశోధకుడు చేయని పరిశోధన చేసి తెలుగు వారి చారిత్రక జీవన ముఖచిత్రాన్ని అందించారు.

శాస్త్రిగారు, తన పరిశోధనలో, గ్రామాలు సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని అనుభవించాయనీ, గ్రామం, పట్టణీకరణ, నాగరిక జీవనానికి దారితీసిన విధానాన్ని వివరించారు. కొత్త రాతి యుగపు ​తొలిగ్రామీణ జీవన విధానాన్ని సమీక్షించటమే కాక, చారిత్రక తొలి, మధ్య కాలాల్లో రాజులు, గ్రామభోజకులను నియమించేవారని దాంతో తమ ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి సమర్పించాల్సి వచ్చిందనీ, రెండో దశలో, గ్రామాల్లో మత పరంగా జాతీయ భావన పెరిగిందనీ, సమాజం పౌరాణిక బ్రాహ్మణ మత ప్రభావానికి లోనైందని తేల్చి చెప్పారు. వివిధ రాజ వంశాల పాలనా కాలాలను కూడా ఈ పుస్తకంలో నిక్కచ్చిగా అందించారు.

ఇంకా, గ్రామాల్లో వర్ణవ్యవస్థ, గ్రామసేవకుల జాబితా, కాలు అనే గ్రామాధికారి ఉండేవాడనీ, తరువాత గాముండ, రట్టగుడి, రట్ట, రడ్డి, రెడ్డిగా పిలువబడినాడని కుల, మత సంఘాలు, న్యాయ నిర్వహణ కోసం గ్రామసభ, నేరము - శిక్ష, భూమి యాజమాన్యం, సర్వే, భూముల్లో రకాలు, దాన, భిక్షుహల, దేవహల, బ్రహ్మదేయ, అగ్రహారాలు, పరిహారాలు, పన్నస, భూదానాల రద్దు, పన్నుల్లో భాగం, భోగం, పోరు, ఉంచ మరుంచ, మరుమన్న, వెన్ను పన్ను, ఫలం, తలారి పన్ను, వృత్తి పన్ను, ఆస్థిపన్ను, వివాహ పన్ను, యువరాజ పన్ను, పడవాలపన్ను, పడియార పన్ను, సంధి విగ్రహిపన్ను, రకరకాల వాణిజ్య సుంకాలు, వర్తక - వాణిజ్య సరణి సంఘాలు - నిర్వహణ, రవాణా సాధనాలు, విదేశీ వర్తకం, ఎగుమతులు, దిగుమతులు, చివరగా నాణేలు. (లిపిలేనివి, లిపిగలవి) రాజుముఖచిత్రంగల వెండినాణేలు, రోమను నాణేలు, క్షాత్రపనాణేలు, శాతవాహన, సదవంశీయుల నాణేలు, వాటి తయారీ, కార్షాపణం, దీనారం, పణం, నిష్క, మాడ అన్ని నాణేల పేర్లు, ఆర్థిక వ్యవస్థలను, శాసనాధారాలతో స్వయం పరిశీలనలో నిగ్గుదేల్చిన నిజాల సమాహారంగా శాస్త్రిగారు ప్రాచీనాంధ్ర దేశ చరిత్రః గ్రామీణ జీవనం అన్న ఒక సమగ్ర గ్రంథాన్ని మనకు అందించారు. ప్రతి తెలుగు వాడూ, తన ఇంట, వెంట ఉంచుకోవాల్సిన పుస్తకం ఇది.

అరుదైన అర్థనారీశ్వర ప్రతిమను గుర్తించిన శాస్త్రిగారు...

ఉన్నఊరు, కన్నతల్లి సమానమన్న నానుడిని శాస్త్రిగారు నిరూపించారు. ఎక్కడెక్కడివో వెయ్యికి పైగా శాసనాలను పరిశీలించి, విడమరచి చెప్పి, తెలుగు వారి చరిత్రను మలుపు తిప్పిన శాస్త్రిగారు, తాను పుట్టి పెరిగిన పెదకొండూరు గ్రామంపై విస్తృత పరిశోధనలు గావించారు. గ్రామానికి ఆపేరెలా వచ్చిందో, ఆవూరిచారిత్రక ప్రాశస్త్యమేమిటో శిల్పాలు, శాసనాల ద్వారా పెదకొండూరు ఆలయాలు, శాసనాలు అన్న పుస్తకాన్ని రచించి, స్థానిక చరిత్ర ఎలా రాయాలో సూచించారు.

పెదకొండూరు గ్రామ చరిత్ర అధ్యయనంలో భాగంగా, ఆయన ఆనందేశ్వరాలయంలోని పల్నాటి సున్నపురాతి శివలింగాన్ని పరిశీలించి, అది క్రీ.శ. 4వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఆనందగోత్రినుల కాలానికి చెందినదనీ, దానిపై ముందుభాగాన, అర్థనారీశ్వర (శివ-పార్వతి) శిల్పం చెక్కబడిందనీ, రెండు తెలుగు రాష్ట్రాలల్లోనే కాక మన దేశపు శివలింగంపై గల తొలి అర్ధనారి శిల్పమని ప్రతిమా లక్షణాన్ని బట్టి తెలియజేశారు.

గ్రామంలోని రాజరాజేశ్వర, జనార్ధనస్వామి, పుట్టలమ్మ గుళ్లు, శిల్పాలు, క్రీ.శ. 1135, క్రీ.శ. 1170, క్రీ.శ. 1173, క్రీ.శ. 1317 సం॥ల నాటి శాసనాల వివరాలను కూడ ఆ ​పుస్తకంలో పొందుపరచారు. కొండూరును కొండ్రూరనేవారనీ, శైవబ్రాహ్మణుడైన కన్దనృపుడు గ్రామ నాయకుడని, కాకతీయ ప్రతాపరుద్రుని ఉద్యోగి మాయిదేవలెంక కొండూరు స్థలపాలకుడని చెప్పారు. గుడిసానులు, అమ్ముకడ సుంకం, బంటెలాయము, తలారిసుంకం లాంటి అలనాటి పన్నుల గురించి వివరించి, చరిత్ర విద్యార్థులు, అధ్యాపకులకు మార్గదర్శకులైనారు.

తెలంగాణా-ఆంధ్ర చరిత్రలో ప్రధాన ఘట్టాలను గుర్తించిన శాస్త్రిగారు...

రాష్ట్ర పురావస్తుశాఖలో చేరిన దగ్గరనుంచి, 2012వ సం॥ వరకూ శాసనాలు, నాణేల పరిశోధన ద్వారా, అనేక కొత్త చారిత్రక విషయాలను అందించిన పరబ్రహ్మశాస్త్రిగారు ఆంధ్ర-తెలంగాణా చరిత్రలోని ఖాళీలను పూరించారు. ఆ క్రమంలోనే, రెండు ప్రాంతాల చరిత్రలో మరుగునపడిన ప్రధాన ఘట్టాలను గ్లీనింగ్స్ ఇన్ తెలింగ– ఆంధ్ర హిస్టరీ త్రూ సెంచరీస్‌ అనే పుస్తకాన్ని తానే 2012లో ప్రచురించి, పంచి పెట్టారు. అలా ఆ అరుదైన ఆ పుస్తకాన్ని అందుకొన్న వాళ్లలో నేనొకణ్ణి.

అట్టమీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పటం, వెనుక క్రీ.పూ. 3వ శతాబ్ది భట్టిప్రోలు శాసనముద్ర, లోపలి అట్టల్లో భట్టిప్రోలు శాసనాక్షరమాల, తెలుగు లిపి పరిణామక్రమ (స్వంతదస్తూరితో) చిత్రాలున్నాయి. కవరేజీ మీద -


“కారే రాజులు? రాజ్యముల్ గల్గవే? గర్వోన్నతింబొందరే?
వారేరీ? సిరిమూటఁ గట్టికొని పోవంజాలిరే? భూమిపైఁ
బేరైనంగలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే! ఇక్కాలమున్ భార్గవా?”


అన్న బమ్మెరపోతన పద్యాన్నిచ్చి, చరిత్రను సృష్టించిన రాజులు కొందరైతే చరిత్రలో చోటుదక్కించుకోని రాజులెందరో అని, ఈ నాటి పాలకులకు చురకలంటించారు శాస్త్రిగారు.


ఇక లోపలిపేజీల్లో, గోదావరినదికి ఉత్తరాన కలింగ, దక్షిణాన తెలింగ ప్రాంతాలున్నాయని, క్రీ.పూ.5 నుంచి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వరకు గల ప్రధాన ఘట్టాలను పేర్కొన్నారు. ఈ పుస్తకం వెలువడిన 2012 నాటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా ఉంది. రాష్ట్రం ఇంకా విడిపోనందున ఆ అంశం ప్రస్తావనకు రాలేదు. ఆయన మాటల్లో ఆయా వివరాలు:


క్రీ.పూ. 5వ శతాబ్ది


ఉత్తరాదితో గల సంబంధాలవల్ల, అస్మక జనపదానికి బౌద్ధధమ్మ వ్యాప్తి వల్ల, ఉత్తరాది బ్రాహ్మణులు తెలుగు నేలపైకి వచ్చి, వైదిక గురుకులాల్ని స్థాపించారని అలాంటి వారిలో కాత్యాయనుడు, బౌద్ధాయనుడు, అపస్తంబుడు ముఖ్యులనీ, ఇదే కాలంలో వ్యవసాయ విస్తరణ, వ్యాపార సంబంధాలు కూడ కొత్త రాజకీయ నేపథ్యానికి దోహదం చేశాయనీ చెప్పారు.

క్రీ.పూ. 3వ శతాబ్ది


మౌర్యచంద్రగుప్తుని గ్రీకు రాయబారి మెగస్తనీసు ఆంధ్రుల ప్రస్తావన, ఆంధ్రలో అశోకుని ​శాసనాలు, ధాన్యకటకం, భట్టిప్రోలు స్థూపనిర్మాణంతో బౌద్ధం వేళ్లూనుకోవడం, మౌర్యుల పతనం తరువాత, క్రీ.శ.2వ శతాబ్దిలో, శుంగులు, కాణ్వుల చివరిరోజుల్లో తెలంగాణలో, స్థానిక రాజులైన గోబద, సిరికంవాయ, సిరినరన, సమగోప అనే రాజులు, ఆంధ్రలో రాజాసోమక, ఇంకా మహారధిరాజుల పాలనలో ఉంది. క్రీ.పూ.1వ శతాబ్దిలో కళింగకు చెందిన మహామేఘవాహన ఖారవెలుడు క్రీ.పూ. 50వ ప్రాంతంలో, ఆంధ్రను పాలిస్తున్న మొదటి శాతకర్ణిని ఓడించాడు. తరువాత సిముక శాతకర్ణి, క్రీ.పూ.30 ప్రాంతంలో కోటిలింగాల నుంచి పాలించి, రాజ్యాన్ని ఉత్తరంగా విస్తరించి, మగధ వరకూ వెళ్లాడు. పశ్చిమాన బారుకచ్ఛ, సోపార రేవులను జయించి, సువిశాల భూభాగంలో వర్తక, వాణిజ్యాల వ్యాప్తికి దోహదం చేశాడు. సిముకుణ్ణి శాతవాహన రాజ్య మూలపురుషునిగా పురాణాలు పేర్కొన్నాయి. నానేఘాట్‌లో ఆయన కుటుంబీకుల శిల్పాలున్నాయి.

వీరాపురం తవ్వకాల్లో బయల్పడిన హకుసిరి నాణేలపై గల ప్రాకృత, రోమన్ శాసనాల వల్ల క్రీ.శ. 1వ శతాబ్దిలో రోముతో వర్తకాన్ని చేసిన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈనాణెంపైన హకుసిరి పేరుతో పాటు రోమన్ చక్రవర్తి టిబీరియస్ (క్రీ.శ. 14-37) బొమ్మ ఉండటం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొంది. ఇదే కాలంలో తీరాంధ్ర సద వంశీయుల పాలనలో ఉన్నట్లు గుంటుపల్లి స్థంభ శాసనం చెబుతుంది. క్రీ.శ. 2వ శతాబ్దిలో గౌతమీపుత్రశాతకర్ణి తీరాంధ్రపై పట్టు సాధించాడు, ఆ తరువాత వాసిష్టీపుత్ర రెండో పులుమావి, గౌతమీపుత్ర యజ్ఞశాతకర్ణి విడుదల చేసిన ఓడగుర్తు గల నాణేలు, ఆ కాలంలో తీరాంధ్రలో మచిలీపట్నం, కృష్ణపట్నం మొదలైన రేవుపట్టణాలు విదేశీ వర్తకంతో విలసిల్లినవైనాన్ని తెలియజేస్తున్నాయి.

క్రీ.శ.3వ శతాబ్దిలో శాతవాహన పాలన అంతం, ఇక్ష్వాకులు నాగార్జునకొండ (శ్రీపర్వత విజయపురి) నుంచి పాలన, పతాక స్థాయిలో అమరావతి బౌద్ధ శిల్పకళ బౌద్ధానికి ప్రజాదరణతో మహాయాన విజృంభణ మొదలైన విషయాలు చోటు చేసుకొన్నాయి.

క్రీ.శ.4వ శతాబ్దంలో కృష్ణా తీరంలో పల్లవులు, బృహత్పలాయనులు, ఆనందగోత్రినులు తెరపైకి వచ్చారు. వేంగి నుంచి సాలంకాయనుల పాలన ప్రారంభమైంది. బౌద్ధం తెరమరుగైంది. బ్రాహ్మణ అగ్రహారాలు వెలిశాయి. ప్రాకృత శాసనాలు తగ్గి సంస్కృత శాసనాలొచ్చాయి. సముద్రగుప్తుని విజయయాత్ర తీరాంధ్రపైగా సాగింది. సముద్రగుప్తుని దండయాత్రతో ఏర్పడిన అఖండ భారత్‌లో ఆంధ్రదేశం ఒక భాగమైంది.

క్రీ.శ.5వ శతాబ్దిలో పల్లవులు, సాలంకాయనులు ఆంధ్రలో, వశిష్టులు, మాఠరులు, కలింగలో, విష్ణుకుండినులు తెలంగాణాలో పాలకులైనారు. సంస్కృత శాసనాల్లో తెలుగుపదాలు కనిపించటం ప్రారంభమైంది. క్రీ.శ.6వ శతాబ్దిలో, విష్ణుకుండినుల పతనం, రణదుర్జయ, మూలరాజ వంశాల పాలన, ఇక్కడి చాళుక్యులు బాదామీ వరకూ వెళ్లటం, కలింగలో తూర్పుగాంగుల పాలన, కడప ప్రాంతంలో రేనాటిచోళుల పాలన, రేనాటిచోళులు పూర్తి తెలుగు శాసనాలను విడుదల చేయటం, పౌరాణిక మత ఆదరణ ముఖ్య ఘట్టాలు. క్రీ.శ. 7వ శతాబ్దిలో రెండో పులకేశి తీరాంధ్రను జయించి, తన తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుని వేంగిలో పట్టాభిషేకం చేయటంతో తూర్పుచాళుక్య రాజ్య ప్రారంభం, హుయన్‌త్సాంగ్ ధాన్యకటక సందర్శన, చిత్తూరు ప్రాంతంలో బాణరాజుల పాలన ముఖ్యవిషయాలు. ​క్రీ.శ.8-10 శతాబ్దాల్లో తెలంగాణా, రాయలసీమల్లో రాష్ట్రకూటులపాలన, వేములవాడ చాళుక్యుల పాలనలో తెలంగాణ, రాయలసీమలో వైదుంబ, నొలంబ రాజుల పాలన, రాష్ట్రకూటుల పాలన అంతం, అలంపూరు, బోధన్, అమరావతి, వేములవాడ మొదలైన చోట్ల దేవాలయాల నిర్మాణం, వేంగీపాలకుడైన విమలాదిత్యుడు తమిళ దేశంలో రక్షణ పొందటం ముఖ్యవిషయాలు.

క్రీ.శ. 11వ శతాబ్దంలో వేంగీలో అరాచకం, శక్తివర్మతో శాంతి పునరుద్ధరణ, రాజరాజచోళుడు తన కూతురు కుందవను విమలాదిత్యునికిచ్చి వివాహం జరిపించటంతో వేంగీరాష్ట్రం బలపడింది. రాజరాజనరేంద్రుని కాలంలో నన్నయ మహాభారతాన్ని తెలుగించటం, రాజరాజనరేంద్రుని కుమారుడు తెలుగు తమిళ రాజ్యాల నేలి కులోత్తుంగ చోళునిగా బిరుదు ధరించటం, పంచారామాలు ప్రశస్తిలోకి రావటం, తెలంగాణలో కళ్యాణ చాళుక్యుల పాలనలో సామంతులుగా కందూరు చోడ, కాకతీయులు, పొలవాస రాజుల పాలన ప్రారంభం, కలింగలో తూర్పు గాంగుల ప్రాభవం చెప్పుకోదగ్గ అంశాలు.

క్రీ.శ. 12వ శతాబ్దిలో వెలనాటి చోళులు, పల్నాటి హైహయులు, కోటరాజులు, కొణిదెన, నెల్లూరు తెలుగుచోళులు, కొండపడమటి రాజులు, పిఠాపురం, నిడదవోలు, యలమంచిలి చాళుక్యుల పుట్టుక, కొలను, ఉండి, దివిసీమలో స్థానిక రాజుల పాలన, కాకతీయ రుద్రదేవునితో క్రీ.శ. 1163 నుంచి కాకతీయులు హనుమకొండ నుంచి స్వతంత్రపాలకులు గావటం, క్రీ.శ.13వ శతాబ్దంలో తెలుగునేలంతా కాకతీయుల పాలనలోకి రావటం, ఆలయ నిర్మాణం, కవిపోషణలో స్వర్ణయుగాన్ని అందించిన గణపతిదేవుని కాలంలో వెలసిన కీర్తి తోరణాలు, తిక్కన మహాభారత తెలుగు అనువాదం, వరంగల్‌లో నరసింహకవి కావ్యరచన, ఘియాసుద్దీన్ తుగ్లక్ దాడితో క్రీ.శ. 1323లో కాకతీయుల పతనం, ఆ తరువాత

ముసునూరి నాయకుల స్వతంత్రపోరాటం, ప్రోలయ, కాపయ నాయకుల పాలన, వెలమనాయకులు రాచకొండ నుంచి, రెడ్డిరాజులు కొండవీటి నుంచి పాలించటం విజయనగర సామ్రాజ్యానికి పునాదులు, మొదలైన విషయాలను కాలానుక్రమణిక పట్టీలతో అందించారు పరబ్రహ్మశాస్త్రిగారు.

క్రీ.శ.15వ శతాబ్దిలో విజయనగర సామ్రాజ్య విస్తరణ, కొండవీడు, రాజమహేంద్ర వర రెడ్డిరాజుల పాలన అంతం, తీరాంధ్రలో సూర్యవంశ గజపతుల చొరబాటు, వెలమరాజ్య పతనం లాంటి విషయాలను శాస్త్రిగారు పొందుపరచారు.

క్రీ.శ.16వ శతాబ్దిలో విజయనగర పాలకుడు సాళువ నరసింహరాయలు, గజపతులను కట్టడి చేయటం, బహమనీ రాజ్యం బలహీనపడటం, కుతుబ్‌షాహీల పాలన ప్రారంభం, శ్రీకృష్ణదేవరాయలు తూర్పు జైత్రయాత్రలో తీరాంధ్రతో పాటు కటకం వరకూ జయించి, ఆలయాలకు విశేషంగా దానాలు చేయటం, అష్టదిగ్గజాలు, తాళ్లపాక అన్నమయ్య లాంటి కవుల సాహితీకృషి తరువాత విజయనగర సామ్రాజ్యం, దక్కను సుల్తానుల చేతిలో పతనం, హైదరాబాదునగర నిర్మాణం ముఖ్యాంశాలు. క్రీ.శ. 17వ శతాబ్దిలో కుతుబ్‌షాహీల పతనం, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గొల్కొండ స్వాధీనం, క్రీ.శ. 18వ శతాబ్దిలో, హైదరాబాదు నుంచి ​అసఫ్‌జాహీల పాలన ప్రారంభం, తీరాంధ్రలో ఐరోపా వర్తక సంఘాల కార్యకలాపాలు, బ్రిటీష్ ఈస్టిండియా, ఫ్రెంచి, డచ్‌వారు ఆంధ్రలో పాతుకుపోయిన విషయాలను పేర్కొన్నారు.

ఆంధ్ర, తెలంగాణాల్లో బ్రిటీషు, నిజాంలపాలన, ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ఏర్పాటు, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకూ, ఇతర చరిత్ర పుస్తకాల్లో లేని ముఖ్యమైన ఘట్టాలను శాస్త్రిగారు ఈ చిన్న పుస్తకంలో ఇమిడ్చారు. ఇది తెలుగు వారి చరిత్రకు సంక్షిప్త కరదీపిక.

విజయనగర సామ్రాజ్య ప్రాశస్త్యాన్ని కళ్లెదుట నిలిపిన శాస్త్రిగారు

దారి తప్పిన ధర్మ, పునరుద్ధరణకై విద్యారణ్యస్వామి పూనుకొని, విజయనగర రాజ్యాన్ని స్థాపించి, ఆ తరువాత, సంగమ వంశం 9 మంది చక్రవర్తులు, సాళువ వంశం ఇద్దరు రాజులు, తుళువ వంశంలో 4 గురు రాజులు పాలించి, విజయనగర సామ్రాజ్యాన్ని వైభవోపేతంగావించారనీ, క్రీ.శ.1565లో రాక్షసి తంగడి యుద్ధంలో అళియ రామరాయలి మరణంతో, విజయనగర సామ్రాజ్యం పతనమైందనీ ఆ తరువాత, ఆరవీడు వంశం క్రీ.శ.1663 వరకూ పెనుగొండ, చంద్రగిరి నుంచి పాలించిందని, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు అన్న వ్యాసంలో పరబ్రహ్మశాస్త్రిగారు వివరించారు. అంతేకాక తుళువ వంశాంబుధిచంద్రుడైన శ్రీకృష్ణదేవరాయలు కవులను వాస్తు, శిల్పకళలను ప్రోత్సహించి, తానే స్వయంగా ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రాసి, దేశభాషలందు తెలుగులెస్స అని ప్రకటించి, తెలుగు భాషకు పట్టంకట్టాడనీ, విజయనగర సామ్రాజ్యమే లేకపోతే తెలుగు, కన్నడ, తమిళ భాషలు నేటి భాషలుగా మిగిలేవి కావని, భారతీయ సంస్కృతి నిలిచేది కాదని చెప్పారు.

తెలుగు భాషాప్రాచీనతను ప్రామాణికంగా నిరూపించిన శాస్త్రిగారు

ఒకే జాతి ప్రజలకు రెండు పేర్లుండటం విచిత్రమనీ, తెలుగు వారికి జాతి, భాషలను తెలిపే తెలింగ, ఆంధ్ర పేర్లుండటం మరీ విచిత్రమని శాస్త్రిగారు తెలుగు భాషా ప్రాచీనత అన్న వ్యాసంలో రాశారు.

ప్రజలు మాట్లాడే భాషగా, తెలుగు చాలా ప్రాచీనకాలం నుంచే ఉండేదని, ఊర్లు, కొండలు, పనిముట్లు, నదులు, గింజలు, పశువులు, చుట్టరికాలను సూచించే తెలుగు పదాలు రుజువు చేస్తున్నాయని శాస్త్రిగారు సోదాహరణంగా వివరించారు. నాగలి, కాడి, మేడి అనే పదాలు ప్రాకృతం నుంచి తెలుగులోకి వచ్చాయని, అశోకుని కంటే ముందే భిన్నమైన అక్షరమాల ఉండేదని, క్రీ.శ.1-2శతాబ్దాల్లో సాతవాహన రాజులు తమ నాణేలపై వారి పేర్లను ప్రాకృతంతో పాటు, తెలుగులో వేయించుకొన్నారని, హాలుని గాధా సప్తశతిలో అనేక తెలుగు పదాలు ప్రాకృతంలోకి మార్చబడినాయని, క్రీ.శ.4 శతాబ్ది నుంచి సంస్కృత పదాలు కూడా తెలుగు భాషలో చేరాయని, క్రీ.పూ. కనీసం రెండు వేల ఏండ్ల కిందటే తెలుగు వ్యవహారభాషగా ఉండేదనీ, క్రీ.పూ. 3వ శతాబ్దిలో ఆ భాషకు రాతపుట్టిందనీ, తెలుగుకు బౌద్ధ సంపర్కం వల్ల ఆంధ్ర, అంధక, ఆంధ్రమనే పేర్లు వచ్చాయనీ, సాహిత్య, సంగీతాలకు అనువైన భాష తెలుంగు అని శాస్త్రిగారు పేర్కొన్నారు. ​

తెలుగు నేలపై శాసన పరిశోధన గురించి శాస్త్రిగారి పరిశీలన

'ఎఫిగ్రఫీకల్ రిసర్చ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 1965-1978' అన్న ఆంగ్లవ్యాసంలో, రాష్ట్ర పురావస్తుశాఖలో 1964లో శాసన విభాగమేర్పడిన నాటి నుంచి, 4000లకు పైగా శాసనాల సేకరణ, వాటిలో 50 వరకూ గల రాగిరేకు శాసనాల పరిష్కరణ జరిగిందని, తద్వారా తెలుగువారి చరిత్రలో సంబంధించిన ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని శాస్త్రిగారు వివరించారు.

గుంటుపల్లి స్థంభ శాసనంలో కలింగ ఖారవెలుని ప్రస్తావన (తరువాత ఇతడు కాదు, అతడు సదవంశీకుడని తేల్చారు), అక్కడే దొరికిన సాలంకాయన రాజు విజయనందివర్మ శాసనం వల్ల, అక్కడి బౌద్ధారామానికి అతని దానము, కేసానపల్లిలో దొరికిన ఇక్ష్వాకురాజు మొదటి ఛాంతమూలుని శాసనం వల్ల ఆ రాజు ఉనికి, రెండో విక్రమేంద్రవర్మ తుమ్మలగూడెం రాగిరేకు శాసనం వల్ల తొలిసారిగా, శాసనాల్లో శక సం॥న్ని పేర్కొన్న విషయాన్ని, అక్కడ పరమ భట్టారికాదేవి బౌద్ధమహావిహారముందన్న సంగతిని తెలియజేస్తుందని చెప్పారు.

తెలంగాణాలోని కోటిలింగాల వద్ద దొరికిన నాణేలపై క్రీ.పూ. 2-1 శతాబ్దాల నాటి స్థానిక పాలకులైన గోబద, సమగోప నరనల పేర్లుండటం వల్ల, శాతవాహనుల కంటే ముందు తెలుగు నేలను పాలించిన రాజులున్నారనీ, ఇది తెలుగువారి చరిత్ర పునర్నిర్మాణానికి చక్కటి ఆధారమైందన్నారు. అలాగే, కడప జిల్లా, కమలాపురం తాలూకా, పెదచప్పలిలో దొరికిన రేనాటి శ్రీకంఠచోళుని రాగిరేకు శాసనం వల్ల రేనాటిచోళ చరిత్రలో కొత్త విషయం తెలిసిందన్నారు.

కరీంనగర్ జిల్లా కుర్క్యాలలోని వేములవాడ చాళుక్య రాజైన రెండో అరికేసరి కాలానికి చెందిన జినవల్లభుని త్రిభాషా శాసనంలో కన్నడకవి పంపని పూర్వీకులు ఆంధ్రలోని ప్రకాశం జిల్లాకు చెందినవారని తొలిసారిగ తెలిసిందన్నారు. ముదిగొండ చోళ కుసుమాదిత్యుని చరిత్రకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలిశాయన్నారు.

కరీంనగర్ జిల్లాలో దొరికిన కాకతీయ మొదటి బేత, మొదటి ప్రోల, రెండో బేత, రెండో ప్రోలరాజుల ఐదు శాసనాల వల్ల కాకతీయవంశ చరిత్రను పునర్నిర్మించటానికి వీలైందన్నారు.

కాకతీయ రుద్రదేవుని హనుమకొండ శాసనం వల్ల, కాకతీయులు కళ్యాణిచాళుక్యుల నెదిరించి, స్వతంత్రులైనారన్న దానిలో నిజం లేదని శాస్త్రిగారు పేర్కొన్నారు.

శాస్త్రిగారే కనుగొని పరిష్కరించిన మైలాంబ బయ్యారం శాసనం వల్ల కాకతీయ వంశావళిని పునర్నిర్మించిన ఘనతను కూడా ఆయన దక్కించుకున్నారు. ఈ శాసనం కాకతీయ చరిత్రలో ఒక మైలురాయి. కాకతీయ ప్రతాపరుద్రుని క్రీ.శ.1281 నాటి ఖండవల్లి శాసనం వల్ల రాజగజకేసరి అన్న బిరుదు అంతకు ముందు నాణేలపై ఉండేదని, ఆ బిరుదు గణపతిదేవ, రుద్రమదేవిలకు మాత్రమే ఉండేదన్న విషయానికి, సవరణగా, ప్రతాపరుద్రునికి కూడా ఈ బిరుదుండేదని శాస్త్రిగారే తొలిసారిగా చెప్పారు.

నల్లగొండ జిల్లా, ఇంక్రియాల్‌లోని క్రీ.శ.1295 నాటి శాసనంలో ప్రతాపరుద్రుడి అధికారులు, వ్యవసాయదారులపై పన్ను వేసే ముందు, రైతుల దగ్గర కెళ్లి, చేతులు జోడించి, ​అందుకు వారి అనుమతిని పొందేవారన్న సంగతి తెలిసిందన్నారు. ఇలా శాసనాల ద్వారా తెలుగువారికి సంబంధించిన అనేక కొత్త చారిత్రక విషయాలు వెలుగులోకి వచ్చాయనీ, వీటన్నింటినీ పురావస్తుశాఖ వివిధ గ్రంధాలుగా ప్రచురించిందని కూడా శాస్త్రిగారన్నారు.

'ధరణికోట సీల్ రీ ఎగ్జామిన్డ్' అన్న వ్యాసంలో, అంతకు ముందు రాఘవాచారి, ఐ.కె. శర్మలు వెల్లడించిన అభిప్రాయాలను శాస్త్రిగారు సవరించి, ఆ ముద్రికపైన గల శాసనం 'స్కంధశాల' అని, ఆ బొమ్మ, స్కంధుని సూచిస్తుందనీ, తద్వారా క్రీ.పూ. 1వ శతాబ్దికే, ధరణికోటలో కార్తికేయునికి ఒక ఆలయముండేదన్న కొత్త విషయాన్ని తెలియజేశారు.

'సీల్ ఆఫ్ నిజగలి' (1984) అన్న వ్యాసంలో నాసిక్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసర్చి ఇన్ న్యూమిస్‌మెటిక్స్ (అంజనేరి)లో ఉన్న క్రీ.శ. 9వ శతాబ్ది అక్షరాల్లో ఉన్న 'శ్రీనిజగలి' అన్న శాసనం, వరాహముద్రలను పరిశీలించిన పరబ్రహ్మశాస్త్రిగారు, 'నిజగలి' అనే వ్యక్తి చాళుక్య వంశానికి చెందిన ఒక స్థానిక పాలకుడనీ, అతడు, పశ్చిమ గాంగ రాజు రెండోమారసింహుని క్రీ.శ. 962 నాటి కడలూరి శాసనంలో పేర్కొన్న నిజగలి అనీ, అతని కుమార్తె జాకాంబ, గాంగరాజు రెండో ఎరెగంగని భార్య అనీ, అతడు రాష్ట్ర కూటులు పశ్చిమగాంగుల సామంతుడై ఉంటాడని చెప్పారు.

'సాంస్క్రిట్ ఇన్‌స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రదేశ వ్యాసంలో, తెలుగునేలపై సంస్కృత శాసనాలు ఇక్ష్వాకుల కాలంలో అభీరవసుసేనుని నాగార్జునకొండ శాసనం మొదటిదని ఎహువల శాంతమూలుని పాతగండిగూడెం శాసనం, ఇంకా విజయశాతకర్ణి చేబ్రోలు శాసనాలు బయల్పడలేదు. తొలిపల్లవ, సాలంకాయన, తొలి తూర్పు చాళుక్య, తూర్పుగంగ శాసనాల్లో ప్రశస్తులు లేవని, ఊళ్లు, వ్యక్తుల పేర్లు మాత్రం తెలుగులో ఉన్నాయనీ శాస్త్రిగారు పేర్కొన్నారు.

తూర్పు చాళుక్య రాజు గుణగవిజయాదిత్యుడు (క్రీ.శ. 848-892) విడుదల చేసిన సాతులూరు రాగిరేకు శాసనాన్ని ఒక చంపూకావ్యంగా మలిచాడనీ, అందులో అతని గుణగణాలు ఉపమ, శ్లేషాలంకారాల్లో వివరించబడినాయని సోదాహరణంగా వివరించారు. అలాగే, రాజరాజనరేంద్రుని కోరుమిల్లి, కలిదిండి, నందంపూడి, మండ రాగిరేకు శాసనాలు కూడా కావ్యాలను పోలిఉన్నాయనీ, కోరుమిల్లి శాసనంలో 24 పాదాలతో తెలుగు రగడ ఉందని వివరించారు. కాకతీయ రుద్రదేవుని అనుమకొండ శాసనాన్ని అచింతేంద్రయతి, కావ్యశైలిలో రాశాడనీ, జాయపసేనాని చేబ్రోలు శాసనం, గణపతిదేవుని పాకాల చెరువు, కలువకొలను, గణపేశ్వరం శాసనాలను ఆయన ఆస్థానకవి (పేరు తెలియదుగానీ) కవిచక్రవర్తి కావ్య శైలిలో రాశాడనీ తెలిపారు. ఈ వ్యాసంలో, సంస్కృత శాసనాల్లోని కవితాధోరణులను అలంకారాలతో సహా గుర్తించారు శాస్త్రిగారు.

'బొండాడ గ్రాంట్ ఆఫ్ చాళుక్య విష్ణువర్థన' వ్యాసంలో ఉస్మానియా యూనివర్సిటీ, పురావస్తుశాఖ అధిపతి, ఆచార్య ఎం. రాధాకృష్ణశర్మ, రాష్ట్ర పురావస్తుశాఖకు అప్పగించిన 3 రాగిరేకుల శాసనాన్ని పరబ్రహ్మశాస్త్రిగారు పరిశీలించి ఈ శాసనం క్రీ.శ. 7-8 శతాబ్దాల నాటి తెలుగు, కన్నడ లిపిలో ఉందని, తూర్పు చాళుక్య ప్రశస్తితో ప్రారంభమై, మంగియువరాజు ​కుమారుడైన మూడో విష్ణువర్ధనుడు క్రీ.శ. 718-52 పాంగునాల విషయంలోని బొండాడ గ్రామవాసుల సమక్షంలో, గోవిందశర్మకు కొంతభూమిని దానం చేసిన వివరాలున్నాయని తెలియజేశారు.

శాసన సాహిత్యంపై శాస్త్రిగారి పరిశోధన

శాసనాల్లో శ్లోకాలతోపాటు, వచనమే ఉంటుందనుకొంటున్న రోజుల్లో కుందూరు ఈశ్వరదత్తుగారు, శాసనాల్లోని పద్యాలను చంధో పరంగా గుర్తించి శాసన శబ్దమంజరి పేరిట రెండు పుస్తకాలను వెలువరించారు. 1981 వరకూ ప్రచురితమైన కాకతీయ శాసనాలనుక్షుణ్ణంగా పరిశీలించిన పరబ్రహ్మశాస్త్రిగారు, శాసన రచయితలైన కవులను, శాసనాల్లో కావ్యాలనూ గుర్తించి, కాకతీయ శాసన సాహిత్యము అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో, కాకతీయ రుద్రదేవుని వేయిస్థంభాల గుడి (క్రీ.శ. 1163) శాసనాన్ని విద్వాంసుడైన అచింతేంద్రయతి అనే కవి, మృదు మధుర పదభూయిష్టమైన కావ్యంగా రాశాడన్నారు. రుద్రుని కాలంనాటి అనుమకొండ, నగునూరు శాసనాలను వేయించిన గంగాధరమంత్రి శాసనాలను, బెక్కల్లు శాసనాన్ని నాగదేవకవి వసంత తిలకావృత్తంలో రచించాడని చెప్పారు. గణపతి దేవుని శాసనాలు ఖండకావ్యాలను పోలి ఉంటాయనీ, వాటి రచయితల్లో ఆయన ఆస్థాన కవి. కవిచక్రవర్తి నృత్యరత్నావళి రచయిత జాయపసేనానిని 'కవిశ్రేష్టుండనీ, సకలనాట్యవైదిక గ్రామణి, కవిసభాశిఖామణి' అని కొనియాడాడని శాస్త్రిగారి పరిశోధనలో వెల్లడైంది.

పాలంపేటలోని రామప్పదేవాలయ శాసన రచయిత ఎవరో తెలియదుగానీ, రేచర్ల రుద్రిరెడ్డి క్రీ.శ.1213లో వేయించిన ఆ శాసనమొక కావ్యమని, ఆ కవి వర్ణనా వైశిష్ట్యాన్ని వివరించారు పరబ్రహ్మశాస్త్రిగారు. కొండపర్తిలోని మల్యాలచౌండసేనాని, కాటచమూపతి, వారి భార్యలు మైలమ, నాచాంబికలు వేయించిన శాసనాలను పరిశీలించి, వారి గుణగణాలు, ఆలయ నిర్మాణ విశేషాలతో పాటు, శిల్పుల సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలిసారిగా శాస్త్రిగారే తెలియజేశారు.

గణపతిదేవుని సైన్యాధిపతి మల్యాలగుండయ, అతని భార్య కుప్పాంబిక వేయించిన వర్థమానపురం (నందివడ్డెమాను), బూదపురం (భూత్‌పూర్) శాసనాలను మయూరసూరి అలంకారయుక్తంగా రచించాడనీ, అతనికి పదవాక్యప్రమాణప్రమేయ, విచిత్రకవిత్వతత్వజ్ఞుడనే బిరుదులున్నాయని చెప్పారు.

గణపతిదేవుని సోదరి కుందమాంబ వేయించిన కుందారం, నిడిగొండ శాసనాలను బాలభారతి కవి పదలాలిత్యంతో ద్రాక్షపాకంలా రచించాడన్నారు. గణపతిదేవ, రుద్రమదేవి కాలపు త్రిపురాంతకం, కాళేశ్వరం, చంద్రవల్లి శాసనాలను కాకతీయ రాజగురువైన విశ్వేరశివాచార్యుడే రాసి ఉంటాడని, అతడు, సంస్కృత శ్లోకాలనేకాక, గద్యాన్ని కూడ హృద్యంగా రాయగలడని శాస్త్రిగారు పేర్కొన్నారు.

త్రిభువన విద్యాచక్రవర్తి బిరుదాంకితుడైన గణపతిదేవుని మరో ఆస్థానకవి మంచి ​భట్టోపాధ్యాయుడు మంథని శాసన రచయిత అనీ, ప్రతాపరుద్రుని ఖండవల్లి శాసనాన్ని ఇందులూరి అన్నయమంత్రి రాశాడనీ, రుద్రమదేవి కాలపు బూదపుర శాసనాన్ని (క్రీ.శ. 1272) చిత్రకవిత చెప్పటంలో దిట్ట అయిన రెండో ఈశ్వర భట్టోపాద్యాయుడు రచించాడని చెప్పారు.

విశ్వేశ్వరశివాచార్యుని కొడుకు నరసింహర్షి, వరంగల్‌లోని ఉర్సుగుట్టపై సిద్ధోద్వాహమనే అసంపూర్ణ కావ్యాన్ని రాశాడని, అందులో శార్దూల విక్రీడితము, స్రగ్ధర వృత్తాలున్నాయనీ, కావ్యం శృంగార ప్రబంధంలా సాగిందనీ, తొలిసారిగా తెలుగు పాఠకులకు అందించిన ఘనతను శాస్త్రిగారు దక్కించుకొన్నారు.

కేవలం సంస్కృత శాసనాల రచయితలు, వాటి కావ్య లక్షణాలనే కాక, కాకతీయుల కాలంనాటి తెలుగు శాసన సాహిత్యంపై కూడా విశేష పరిశోధనగావించారు పరబ్రహ్మశాస్త్రిగారు. క్రీ.శ.1135 నాటి బెక్కల్లు శాసనం, గంగాధరమంత్రి నగునూరు, గణపతిదేవుని ఉప్పరపల్లి శాసనాలు గద్య పద్యాలతో కావ్యశైలిలోనున్నట్లు పేర్కొన్నారు. అదే క్రమంలో మాటేడు (క్రీ.శ. 1120), గూడూరు (క్రీ.శ. 1124), నిడుబ్రోలు (క్రీ.శ. 1132 ఇందులోని సీసపద్యాలు), మొరిపిరాల (క్రీ.శ. 1181) శాసనాల్లోని తెలుగు, సంస్కృత సాహితీ వైభవాన్ని మనకందించి, శాసన పరిశోధనలో కొత్త వరవడిని సృష్టించారు.

రామకాశ్యప నాణేలు పృధ్వీమూలరాజువేనన్న శాస్త్రిగారు

తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురంలో దొరికిన 'రామకాశ్యప' నాణేలు ఎవరివో తెలియక సతమతమౌతున్న చరిత్రకారులకు ఊరట కలిగించారు పరబ్రహ్మశాస్త్రిగారు. ఈ నాణేలు పిఠాపురం నుంచి పాలించిన రణదుర్జయ వంశానికి చెందిన పృధ్వీమూల మహారాజు (క్రీ.శ.568-617) వేనని చెప్పారు.

విజయనగర తెలుగు శాసనాలను గ్రంథస్తం చేసిన శాస్త్రిగారు

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసర్చ్ (ఐసీహెచ్‌ఆర్) న్యూఢిల్లీ వారు మన దేశాన్నేలిన వివిధ రాజవంశాలు విడుదల చేసిన ప్రాంతీయ భాషా శాసనాలను ప్రత్యేక సంపుటాలుగా ప్రచురించే పథకాన్ని చేపట్టారు. అందులో భాగంగా, కాకతీయుల తెలుగు శాసనాలపై ఎస్.ఎస్.రామచంద్రమూర్తిగారికి, విజయనగర తెలుగు శాసనాలపై పీ.వీ. పరబ్రహ్మశాస్త్రిగారికి సంపుటాలను వెలువరించే బాధ్యతను అప్పజెప్పారు. విజయనగర రాజులు / చక్రవర్తులు, వారి ఉన్నతోద్యోగులు తెలుగు నేలపై విడుదల చేసిన అన్ని తెలుగు శాసనాలను సేకరించి, తెలుగు ఇన్స్‌క్రిప్షన్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్‌ అన్న పుస్తకాన్ని ఐసీహెచ్‌ఆర్ ద్వారా మనకందించారు పరబ్రహ్మశాస్త్రిగారు. ​

ప్రముఖ శాసన పరిశోధకుల సాంగత్యంలో శాస్త్రిగారు

రాష్ట్రపురావస్తుశాఖ, శాసన విభాగంలో పనిచేసినపుడు, ప్రసిద్ధ శాసన పరిశోధకులైన నేలటూరి వెంకటరమణయ్య, పీ.బీ.దేశాయి, జి.ఎస్. గాయ్, కె.వి.రమేష్, పీ.ఎల్. గుప్త, ఐ.కె. శర్మ, అజయమిత్రశాస్త్రి, వి.వి. కృష్ణశాస్త్రి లాంటి మహామహులతో కలసి వారి సాంగత్యంలో శాసనపరిశోధనలో పట్టుసాధించారు. అంతేకాదు, అదేశాఖలో, తన పర్యవేక్షణలో పనిచేసిన ఎం.వి.ఎన్.ఆదిత్యశర్మ, ఎన్. ముకుందరావు, మాలకొండారెడ్డి, జి. జవహర్‌లాల్, ఎస్. ఎస్. రామచంద్రమూర్తి, ఏ. మురళీమోహన్‌లను ప్రామాణిక శాసన పరిశోధకులుగా తీర్చిదిద్దారు పరబ్రహ్మశాస్త్రిగారు.

శాసన విభాగంలో శాసన ముద్రలను సేకరించే పి. నారాయణ, ఎం. కొమరయ్య, రహీం, నిర్మల్‌సాగర్లను తన కుటుంబ సభ్యులుగా ఆదరించారు. అందుకనే, వారంతా, ఎర్రబస్సులో ప్రయాణించి, గ్రామ పొలాలు, పొలిమేరల్లో కూరుకు పోయి ఉన్న అనేక శాసన నకళ్లను అలవోకగా తెచ్చి శాస్త్రిగారికి అందించేవారు. వందల, వేల శాసన ముద్రలు పేరుకు పోతున్న నేపథ్యంలో, వాటిని గ్రామం, తాలూకా, జిల్లా, రాజవంశం, రాజు, తేదీ, భాష, లిపి వారీగా విభజించి, ఒక చోట భద్రపరచాల్సిన అవసరాన్ని గుర్తించిన పరబ్రహ్మశాస్త్రిగారు, అలా ఒక పట్టికను తయారించటానికి, కొమరయ్యకు ఎస్టాంపేజ్ కీపర్‌గా పదోన్నతినిచ్చారు. ఆ క్రమంలోనే, శాసనాలపై వార్షిక నివేదికలు, జిల్లా సంపుటాలు ప్రచురించారు. ఈ క్రమంలో, 3 వార్షిక నివేదికలు, 8 జిల్లా సంపుటాలు, 6 ఎపిగ్రాఫియా ఆంధ్రికాలు ప్రచురించబడినాయి.

శ్రీశైలం నీటిముంపు, గ్రామాల శాసనాల తరలింపు

శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపుకు గురైన కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 102 గ్రామాల్లో ఉన్న శాసనాలను గుర్తించే పనిని చేపట్టి, తెలుగువారి చరిత్రను జలసమాధి నుంచి కాపాడారు. కాలి నడకన ఊరూరాతిరిగి, శాసననకళ్లను సేకరించి భద్రపరిచారు. పునరావాసంలో భాగంగా ఖాళీ అవుతున్న ఊళ్లలో ఏ మాత్రం సౌకర్యాలు లేకున్నా, అటుకులు, మరమరాలు మంచినీటితో ఆకలి, దప్పికలు తీర్చుకొని, శాసనాల సేకరించిన పరబ్రహ్మశాస్త్రి గారిలాంటి మరో తెలుగు శాసన పరిశోధకుడు లేడేమో!

సన్మానాలు, సత్కారాలు

నిత్యానుష్ఠాన నిష్టాగరిష్ఠుడైన పరబ్రహ్మశాస్త్రిగారు తన కిష్టమైన శాసన సేకరణ, పరిష్కరణ, ప్రచురణ రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గాను దేశంలోని అనేక ప్రామాణిక పరిశోధన సంస్థలు ఆయన్ను ఘనంగా సత్కరించి తమను తాము గౌరవించుకొన్నాయి. వాటిలో కొన్ని: ​1981లో సిముక శాతకర్ణి నాణేలను కనుగొని తెలుగువారి చరిత్రకు కొత్త ఆధారాలు అందించిన శాస్త్రి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగదు పురస్కారంతో గౌరవించింది. శాసన, నాణేల పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన శాస్త్రి గారిని ఎపిగ్రఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు 1986లో, ఒక తామ్ర పత్రంతో సత్కరించారు. 1992లో తిరువనంతపురంలో జరిగిన సౌత్ ఇండియన్ న్యూమిన్‌మెటిక్ సొసైటీ, రెండో వార్షిక సమావేశానికి జనరల్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకొని గౌరవించింది. 1996లో, తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్‌ 21వ వార్షిక సమావేశానికి శాస్త్రిగారిని జనరల్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకొని సంస్థ సముచితంగా సత్కరించింది.

విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాల, కృష్ణాజిల్లా రచయితల సంఘం, దివిసీమ ఇతిహాస పరిశోధక మండలి పురస్కారాలు, సద్గురు శివానందమూర్తిగారి ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారి చేతుల మీదుగా మాతృభాషా దినోత్సవం రోజున విశిష్టభాషాపురస్కారం, కడపలోని సీపీ బ్రౌన్ లైబ్రరీవారు సిపిబ్రౌన్ అవార్డును, ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రిసర్చ్ వారి గౌరవ ఫెలోషిప్, ఇంకా తెలంగాణా రాష్ట్ర అవతరణ సందర్భంగా, తెలంగాణా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విశిష్ట పురస్కారాలను అందుకొన్నారు శాస్త్రిగారు.

పివిపి శాస్త్రి సన్మాన సంచిక: బ్రహ్మశ్రీ

డా. పీవీపరబ్రహ్మశాస్త్రిగారు, శాసనాలు, లిపి, భాష, సాహిత్యం, చరిత్ర రంగాల్లో చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీశైల ప్రాంగణంలోని పురావస్తుశాస్త్రం, చరిత్ర, శాసన అధ్యయనశాఖ పీఠాధిపతి ఆచార్య పెదారపు చెన్నారెడ్డి, బ్రహ్మశ్రీ: రిసర్చెస్ ఇన్ ఆర్కియాలజీ, హిస్టరీ కల్చర్ ఇన్ ది న్యూమిలేనియం అనే రెండు సంపుటాల సన్మాన గ్రంధాన్ని 2004లో వెలువరించారు. మొదటి సంపుటంలో పురావస్తు శాస్త్రం, కళ, వాస్తు శాస్త్రాలనే మొదటి విభాగంలో రాబర్ట్ బెడ్‌సరిక్, ఎన్. చంద్రమౌళి, జె.మాన్యుఎల్, పి.ఆర్.కె.ప్రసాద్, శోభనాగోఖలే, బ్రజేష్‌కృష్ణ, పి. మార్గబంధు, జయప్రియ రాజరాజన్, ఎండీ సంపత్, ఈమని శివనాగిరెడ్డి, రాజూకాళిదాస్, ఆర్కెకెరాజరాజన్, ఐకెశర్మ, టి. దయానంద్‌పటేల్, సి. అనిల్‌కుమార్,కె. పద్మనాభ, కె. ఎం. సురేష్, పి. జోగినాయుడు వ్యాసాలున్నాయి. శాసనాలు, నాణేలు అన్న రెండో విభాగంలో రోమిలాధాపర్, శ్రీనివాస్ హెచ్. రిత్తి, పీవీ నరసింహమూర్తి, వి.వి. కృష్ణశాస్త్రి, ఎస్. స్వామినాధన్, కె.వి.రమేష్, సీ.ఏ. పద్మనాభశాస్త్రి, హెచ్.ఎం.నాగరాజారావు, పి. బ్రహ్మచారి, ఎస్.జె. మంగళం, డి. రాజారెడ్డి, పి. సూర్యనారాయణరెడ్డి, హెచ్. ఆర్. రఘునాథభట్, ఎస్. దాశరథి వ్యాసాలు ఉన్నాయి.

రెండో సంపుటంలో, మతము, తర్కము, సాహిత్యమన్న మూడో విభాగంలో బి. సుబ్రహ్మణ్యం, జి, జవహర్ లాల్, ప్రణబానందఝా, వి.కె.మోహన్, సాళ్వ కృష్ణమూర్తి, ఏ. పద్మ, ఎం. ఎల్. ఖద్దర్‌శాస్త్రి, హరిప్రియా రంగరాజన్, జి.ఎస్.దీక్షిత్, ఎం.ఎస్. రామచంద్రరావు, ​బాలగోని కృష్ణగౌడ్, జి.సి.శేఖర్‌రెడ్డి, కె. సరోజినీదేవి, సీ.ఎస్. వాసుదేవన్, వీ.సీ. శ్రీవాస్తవ, పి. శశిరేఖ, ఎన్. క్యూ. పంకజ్, ఆర్. నాగస్వామి, బి. విద్యాధరరావుల వ్యాసాలు; సాధారణ విషయాలు అన్న నాలుగో విభాగంలో, కె.కె.ఎన్. కురుప్, డి.పి. దూబే, శంకర్‌గోయల్, చల్లపల్లి స్వరూపరాణి, జానమద్ది హనుమశ్ఛాస్త్రి, ఆర్. నటరాజన్, బి. రామచంద్రారెడ్డి, వి.సుగణాశర్మ, శర్మిష్ట ఆద్య, కె. శ్రీనివాసులు వ్యాసాలున్నాయి.

మొదటి సంపుటం 212 పేజీలు, రెండో సంపుటం 219 పేజీలతో, ఏవీ నరసింహమూర్తి, పి. చెన్నారెడ్డి, ఎన్నెస్ రామచంద్రమూర్తి, పరబ్రహ్మశాస్త్రిగారిపైన రాసిన వ్యాసాలు, సద్గురు శివానందమూర్తిగారి ముందుమాటతో న్యూఢిల్లీలోని శారదా పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది.

శాస్త్రిగారికి ఇష్టమైన తెలుగుగోష్టి

ప్రముఖ విజ్ఞాన సర్వస్వసంకలన నిపుణులు చీమకుర్తి శేషగిరిరావుగారి అధ్యక్షతన ప్రతి రెండో శనివారం, ఆంధ్రయువతీ మండలి కేంద్రంలో జరిగే తెలుగు గోష్టి చర్చా కార్యక్రమాల్లో శాస్త్రిగారు చురుగ్గా పాల్గొనేవారు. ఏదైనా పాత విషయంపై పునరాలోచన, కొత్త విషయంపై చర్చోపచర్చలు అక్కడ ఆసక్తికరంగా సాగేవి. నేనూ హాజరౌతుండేవాణ్ణి. ఆ సంస్థ తెలుగు మఱుగులు, తెలుగులో ప్రాకృత పదాలు, శ్రీఉత్పత్తిపిడుగు లాంటి పరిశోధక పుస్తకాల్ని ప్రచురించింది. పరబ్రహ్మశాస్త్రిగారు శాతవాహనుల పుట్టుక గురించి కోటిలింగాల తవ్వకాల ఆధారంగా తెలుగు గోష్టిలో ప్రసంగించి, అందరి ఆమోదం తరువాతే, శాతవాహనా ఎపోఖ్ - ఏ న్యూలైట్ అన్న పుస్తకాన్ని ప్రచురించారు. ఆ సంస్థ ఉపాధ్యక్షులుగా, యువ పరిశోధకులను ప్రోత్సహించి, సంస్థను బలోపేతం గావించారు.

ఆయన లేరని ఎవరన్నారు?

సంప్రదాయ కుటుంబంలో పుట్టి, సంస్కారాన్ని ఔపోసన పట్టి, నిష్టతో, ఇష్టంగా శాసనాలనే శ్వాసనాళాలుగా, పరిశోధన, ప్రచురణలే పరమావధిగా జీవించిన పీవీపీ శాస్త్రిగారు శాసన పరిశోధన రంగంలో మహామహోపాధ్యాయుడు. తెలుగువారి చరిత్రను సుసంపన్నం చేసిన అభినవ వాగనుశాసనుడు. శాసనాలున్నంత కాలం, శాస్త్రిగారు జీవించే ఉంటారు. ఆయన ఎక్కడికీ వెళ్లలేదు. శాసనంలోని ప్రతి అక్షరంలోనూ నక్షత్రంగా భాసిల్లుతూ తెలుగు శాసన పరిశోధకులకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు.

-ఈమని శివనాగిరెడ్డి - స్థపతి

M: 9848598446

​

పి.వి. పరబ్రహ్మ శాస్త్రి గారి రచనలు

పరబ్రహ్మశాస్త్రి గారు వివిధ ప్రామాణిక పత్రికల్లో అనేక వ్యాసాలను, పుస్తకాలను రచించి తెలుగు వారి చరిత్రను సుసంపన్నం చేశారు.

పుస్తకాలు

I. 1974

1. ఇన్స్‌క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్: కరీంనగర్ డిస్ట్రిక్ట్, సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు

2. ఎపిగ్రాఫియా ఆంధ్రికా, వాల్యూం-2, సహ సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు

II. 1975

1. కాకతీయ కాయిన్స్ అండ్ మెజర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు

2. తెలుగు శాసనాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు

III. 1977

1. ఇన్స్‌క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్: కడప డిస్ట్రిక్, పార్ట్ -I, సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు

2. కాకతీయులు, ఇండియన్ బుక్‌హౌస్, బెంగళూరు

3. ఇన్స్‌క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్: కడప డిస్ట్రిక్, పార్ట్ -2, సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు

4. ది కాకతీయాస్ ఆఫ్ వరంగల్ (ఇంగ్లీషు), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు

IV. 1981

1. ఇన్స్‌క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్: కడప డిస్ట్రిక్, పార్ట్ -3, సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు

2. కాకతీయ శాసన సాహిత్యం, రచయిత, ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్, హైదరాబాద్

V. 1982

1. శ్రీశైలం ఇట్స్ హిస్టరీ అండ్ కల్చర్ (ఇంగ్లీషు), శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం.

VI. 1983

తెలుగు సంస్కృతి, దేశము - చరిత్ర, పునఃసంశోధితము, వాల్యూం -1, సహ సంపాదకులు, తెలుగు భాషా సమితి, హైదరాబాదు.

VII. 1988

విజ్ఞాన సర్వస్వము - తెలుగు సంస్కృతి, వాల్యూం -2, సహ సంపాదకులు, తెలుగు భాషా సమితి, హైదరాబాదు. ​VIII 1994

శాతవాహన ఎపోఖ్ - ఎ న్యూలైట్, (ఇంగ్లీషు), తెలుగు గోష్ఠి, హైదరాబాదు.

IX. 1999

ది తిరుమల మ్యూజిక్ ఇన్స్‌క్రిప్షన్స్ (ప్రధమోపలబ్ధ స్వరసహిత సంకీర్తన శిలాలేఖనము), సహ సంపాదకులు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.

X. 2001

పెదకొండూరు, ఆలయములు - శాసనాలు, 2001, హైదరాబాదు.

XI. 2003

ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ ఆంధ్రప్రదేశ్ అప్ టు 500 బిసి., సలహామండలి సభ్యులు, ఓరియంట్ లాంగ్‌మన్ - ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్.

XII. 2008

ఎర్లీ హిస్టారిక్ ఆంధ్రప్రదేశ్ 500 బిసీ- 624 ఏడీ, సలహామండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ అండ్ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.

XIII 2009

1. ఎర్లీ మెడైవల్ ఆంధ్రప్రదేశ్ ఏడీ 624-1000. సలహామండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ అండ్ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.

2. తెలుగు స్క్రిప్ట్ – ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ క్రీ.పూ. 3-క్రీ.శ.16 శతాబ్దాలు, (ఇంగ్లీషు), సహ రచయిత, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓరియంటల్ మానుస్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్, హైదరాబాదు.

XIV. 2001

మెడైవల్ ఆంధ్రప్రదేశ్ ఏడీ 1000–1324, సలహామండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ అండ్ పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాదు

XV. 2012

గ్లీనింగ్స్ ఇన్ తెలింగ - ఆంధ్ర హిస్టరీ త్రూ సెంచరీస్, రచయిత

XVI. 2014

లేట్ మెడైవల్ ఆంధ్రప్రదేశ్ ఏడీ 1324-1724, సలహామండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ అండ్ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు

XVII 2016

మోడ్రన్ ఆంధ్ర అండ్ హైదరాబాద్ ఏడీ 1858-1956 సలహామండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ అండ్ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు. ​XVIII. 2016

ఇన్స్‌క్రిప్షన్స్ ఆఫ్ ది విజయనగర రూలర్స్, వాల్యూం-4, తెలుగు ఇన్స్‌క్రిప్షన్స్ (1351 టు 1665 ఏడీ), సంపాదకులు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసర్స్, ఎస్ఆర్‌సీ, బెంగుళూరు.

పీపీ పరబ్రహ్మశాస్త్రి గారి అభినందన సంచిక. బ్రహ్మశ్రీ - రిసర్చెస్ ఇన్ ఆర్కియోలజీ, హిస్టరీ అండ్ కల్చర్ ఇన్ ది న్యూమిలేనియం (డా.పి.వి. పరబ్రహ్మశాస్త్రి ఫెలిసిటేషన్ వాల్యూం) రెండు సంపుటాలు (ఇంగ్లీషు), సంపాదకులు, ఆచార్య పి. చెన్నారెడ్డి.


వ్యాసాలు

1. 1962.

'మేఘసందేశ సమీక్ష - పూర్వార్థము', ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్పత్రిక వా. 52, పా. 3, 4 పే. 43-57, కాకినాడ.

2. 1967

'కాకతీయ మైలాంబ-బయ్యారం చెరువు శాసనం', భారతి, ఏప్రియల్, 1967, పే. 2 – 17, మద్రాసు.

3. 1974

1. 'అనుమకొండ ఇన్స్‌క్రిప్షన్ ఆఫ్ కాకతిరుద్రదేవ', జెఏహెచ్‌ఆర్ఎస్, వా. 36, పా. 1, పే.1-69

2.'డిడ్ కాకతి రుద్రమదేవి డై అన్ బాటిల్ ఫీల్డ్', జర్నల్ ఆఫ్ ఏఫిగ్రఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (జెఇఎస్ఐ), వా-1, పే. 40-49

4. 1975

1. 'ఏ బ్రీఫ్ సర్వే ఆఫ్ శాతవాహన కాయినేజ్', జర్నల్ ఆఫ్ ఆర్కియాలజీ, (శాతవాహనా స్పెషల్) వా. 3, నం. 2, పే. 125-134, హైదరాబాదు.

2. 'సబ్బిమండలము', జగిత్యాల సావనీరు, పే. 1

5. 1977

1. 'ఏపి గ్రఫికల్ ఎల్లూషన్ టు సర్జరీ ఇన్ ఆయుర్వేద', బులెటిన్ ఆఫ్ ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్ (బిఐఐహెచ్ఎమ్), వా. 7, నం 3 & 4, జూన్ & అక్టోబర్

2. 'క్రీస్తుశకము 973 నాటి రాజకీయ కల్లోలము', ఆంధ్రపత్రిక ఉగాది సంచిక, 1977-78, . 50-54 ​3. 'పిఠాపురము - ఏ హిస్టారికల్ టౌన్ ఇన్ ఆంధ్రదేశ, ఇతిహాస్, వా.5. నం. 1, 83 - 93, హైదరాబాదు.

6. 1978

'సిముక శాతవాహనుడి నాణేలు', భారతి, జూన్, 1978, పే. 51-55, మద్రాసు.

7. 1979

1. 'జుడిషియరీ ఇన్ మెడైవల్ ఇండియా విత్ పర్టికులర్ రిఫరెన్స్ టు ఆంధ్ర', భారతి, బిహెచెయూ, పే. 176-186, బెనారస్

2. 'సమ్ మోర్ కాయిన్స్ ఫ్రం కోటిలింగాల', న్యూమిస్‌మెటిక్ డైజస్ట్, వా. 3,పా. 2, డిసెంబర్, 1979, పే. 13-28, బొంబాయి.

3. 'ఆంధ్ర-కర్ణాటకము', భారతి, ఏప్రిల్, 1979, పే. 49-54.

8. 1984

1. 'హైద్రాబాద్ ప్రాకృత్ ఇన్స్‌క్రిప్షన్ ఆఫ్ గోవిందరాజ విహార', జెఇఎస్ఐ, వా-11, పే.95-101

2. 'సీల్ ఆఫ్ నిజగాలి', న్యూమిన్‌మెటిక్ డైజస్ట్, వా. 8, పా. 1 & 11, పే.

9. 1985

'ధరణికోట ఐవరీ సీల్ రీ ఎగ్జామిన్డ్', జెఇఎస్ఐ, వా. 12, పే. 59-62

10. 1986

'రీ అప్రైజల్ ఆఫ్ సముద్రగుప్తాస్ సదరన్ ఎక్స్‌పెడిషన్, పురాతన్, నం. 4, పే. 45 - 54, భోపాల్.

11. 1987

‘బెజవాడ ఇన్స్‌క్రిప్షన్స్’, ఆర్కియోలజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-సెంటెనరీ సావనీర్, హైదరాబాదు, పే. 85-88.

12. 1988

'పొజిషన్ అండ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా', కంట్రిబ్యూషన్ ఆఫ్ ఉమెన్ టు ఏన్షియంట్ ఇండియన్ కల్చర్, బిహెచ్‌యూ, వారణాసి, పే. 119-129

13. 1991

'అప్రోచ్ టూ హిందూ సోషల్ హిస్టరీ', జెఏఐహెచ్, వా. 18, పా. 1-2, 1989–90, పే. 38-48.

14. 1994

1. 'బొందాడ గ్రాంట్ ఆఫ్ చాళుక్య విష్ణువర్ధన', ఎపిగ్రాఫియా ఆంధ్రిక, వా. 6, పే. 13-18, హైదరాబాదు ​2. 'సాంస్క్రిట్ ఇన్ ది ఇన్స్‌క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రదేశ, ఎస్వీయూఓజె, వా. 37, పే. 35-47, తిరుపతి

3. 'ది కందుకూరు ఎపిగ్రాఫ్ ఆఫ్ కాకతీయ ప్రతాపరుద్రాస్ టైమ్', ఎపిగ్రాఫియా ఆంధ్రిక, వా.6, పే.61-70, హైదరాబాదు.

15. 1997

'కాకతీయ పాలిటీ (మామిడిపూడి వెంకట రంగయ్య మెమోరియల్ లెక్చర్ )

16.1999

1. 'కల్చరల్ ఇంటెగ్రేషన్ ఇన్ ఇండియా త్రూ పురాణాస్ (విత్ పర్టికులర్ రిఫరెన్స్ టు 300 ఏడీ - 560ఏడీ), ఎస్వీయూఓజె, వా. L.II, పే. 87-97, తిరుపతి

17. 2001

'కాకతీయులు' ఆంధ్ర సంగీత, సాంస్కృతిక - మహోత్సవ విశేష సంచిక, సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్, హైదరాబాదు, పే. 50-54

18. 2003

'ది ఎర్లీ హిస్టారిక్ ట్రాన్సిషన్', ప్రి అండ్ ఫ్రోటో హిస్టారిక్ ఆంధ్రప్రదేశ్ అప్ టూ 500 బిసి, ఓరియంట్ లాంగ్మన్ ప్రై.లి., హైదారాబాదు, పే. 139 - 147

19. 2006

1. 'పరిశోధన: 'తెలింగ- ఆంధ్రసమస్య, నడుస్తున్న చరిత్ర, జూన్, 2006, విజయవాడ, పే.35-38

2. 'ప్రాచీన తెలింగ దేశము - భాష', జనని, 13వ వార్షిక ప్రత్యేక సంచిక, పే. 16-21

3. 'తెలుగు భాష - ప్రాచీనత', తెలుగు పసిడి, విజయవాడ, పే.6-13

20. 2008

1. 'బృహత్పలాయన, సాలంకాయన అండ్ ఆనందగోత్రిన్స్; ఎర్లి హిస్టారిక్ ఆంధ్రప్రదేశ్ 500 బీసి-ఏడీ 624, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.

2. 'సొసైటీ & ఎకానమీ ఆఫ్ ది శాతవాహనా ఏజ్' పే. 18-32

ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ & పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పే. 41-49

3. 'ది పల్లవాస్', పే. 60 - 74 ​4. 'విజయనగర సామ్రాజ్య ప్రాశస్త్యము', ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు' వ్యాస సంపుటి, జనని, సాంఘిక సాంస్కృతిక సమితి, హైదరాబాదు, పే. 1-6.

21. 2009

'తెలుగు భాష, లిపి ప్రాచీనత', గరిమెళ్ల సీతారాం & మహాలక్ష్మి స్మారకోపన్యాసము, విశాఖపట్నం పౌరగ్రంధాలయం, విశాఖపట్నం.

22. 2010

1. 'కొన్ని తెలుగు శాసనాల పరిశీలన', తెలుగు భారతి రజోత్సవ ప్రత్యేక సంచిక, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పే.17-35

2. 'స్వస్తి-స్వస్తికము', ప్లాటినం ప్లాట్ ఫారమ్ (థాట్స్ ఇన్ హిస్టరీ, లిటరేచర్ అండ్ సోషల్ స్టడీస్), సనాతన, సుపధ పబ్లికేషన్స్, తగరపువలస, పే. 182–183

23. 2011

1. 'ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు స్క్రిప్టు', మెడైవల్ ఆంధ్రదేశ ఏడీ 1000-1324, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పే.410-424

2. 'లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ స్క్రిప్ట్ ఆఫ్ ఎర్లీ ఆంధ్ర' ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పే. 155 - 177

3. 'ది కాకతీయాస్' పే. 135-171

4. 'ది లా అండ్ లీగల్ ఇన్‌స్టిట్యూషన్స్' ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పే. 186 196

5. 'నేను నా పరిశోధన జీవితము', తెలుగుపున్నమి, కృష్ణా జిల్లా రచయితల సంఘం, విజయవాడ, పే. 659-663

24. 2012

'ది టర్మ్ బ్రాహ్మి’, ఆబ్‌స్ట్రాక్ట్ ఆఫ్ పేపర్స్ - అడ్వాన్స్ లెవల్ మానుస్క్రిప్టాలజీ & పేలియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ ఓ.మా. లై & రి.ఇ., హైదరాబాదు, పే.1

25. 2013

'వ్రాత ప్రతులు - పరిశోధన', విజ్ఞాన సరస్వతి, డిసెంబర్ 2013, వా. 1-, పే. 22-26

26. 2014

1. 'హిందూ ఇజమ్', లేట్ మెడైవల్ ఆంధ్రప్రదేశ్ ఏడీ 1324-1724, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ & పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పే. 377-382

☆ 'ఏనోట్ ఆన్ రాజన్ ఇన్ ది ఎర్లీ ఎపిగ్రాఫ్స్ ఆఫ్ ఆంధ్రా'-,-

☆ 'ఎకడెమిక్ యాక్టివిటీ ఇన్ ఎర్లీ ఆంధ్రా' ​☆ 'ఆటోక్రసీ ఆన్ ది డిక్లైన్ అండర్ ది కాకతీయాస్', డా.ఎన్. వెంకటరమణయ్య కమ్మేమొరేషన్ వాల్యూం, జెఏహెచ్‌ఆర్ఎస్, వా. ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు పే.105

☆ 'బబ్బేపల్లి ప్లేట్స్ ఆఫ్ పల్లవ కుమార విష్ణు', ఎపిగ్రాఫియా ఇండికా, వా. XLII, పే.44-54

☆ 'బ్రాహ్మీ, ఓం, స్వస్తిక'

☆ 'డెవలప్‌మెంట్ ఆఫ్ తెలుగుస్క్రిప్ట్'

☆ 'ఎపిగ్రఫికల్ రిసెర్చి ఇన్ ఆంధ్రప్రదేశ్, 1965-78', పే. 73-78

☆ 'హిస్టారియన్ ఆఫ్ యస్టర్ ఇయర్స్- ప్రొ. ఎం. రామారావు'

☆ 'కాకతీయ లిటరేచర్'

☆ 'నోట్స్ ఆన్ ది సిల్వర్ కాయిన్స్ ఎట్రిబ్యూటెడ్ టు ది చాళుక్యాస్ ఆఫ్ వాతాపి'

☆ 'ప్లేస్ నేమ్స్ అండ్ క్రానాలజీ ఇన్ ఆంధ్రప్రదేశ్' స్టడీస్ ఇన్ ఇండియన్ ప్లేస్ నేమ్స్, వా. VIII, పే. 38-49

☆ 'పొలిటికల్ ఛేంజెస్ ఇన్ తెలుగు / ఆంధ్రదేశ త్రూది సెంచురీస్'

☆ 'రిలవెన్స్ ఆఫ్ రామాయణ ఇన్ ది ప్రిహిస్టరీ ఆఫ్ ది డెక్కన్'

☆ 'రుద్రమదేవి రణభూమిలో వీరస్వర్గమలంకరించెనా?', భారతి, వా. పే.4-7

☆ 'సిముకాస్ ప్లేస్ ఇన్ శాతవాహన క్రానాలజీ', ఎస్వీయూఓజె, తిరుపతి, వా. 39, పే. 33-52

☆ 'సమ్ యాస్పెక్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ న్యూమిస్‌మెటిక్స్', స్టడీస్ ఇన్ సౌత్ ఇండియన్ కాయిన్స్, వా. 3, పే. 9-18.

☆ 'ది ఇటికాల ఎపిగ్రాఫ్ ఆఫ్ ది కాకతీయాస్' పురాలేఖపత్రిక, పే. 56-61.

☆ 'ది పాలమూరు గ్రాంట్స్ - ఆర్ దే ఫేక్ ?

☆ 'టు కాయిన్స్ ఆఫ్ శ్రీరామ', న్యూమిస్‌మెటిక్ డైజస్ట్, వా-, పే. 61-71

☆ 'సిద్దోద్వాహమ్- సాంస్క్రిట్ పొయెటికల్ ఇన్స్‌క్రిప్షన్'

☆ 'తెలుగు తొలి కవి మల్లియరేచన?

1988

విజ్ఞాన సర్వస్వము, రెండవ సంపుటము, తెలుగు సంస్కృతి - 2, తెలుగు సాంస్కృతిక వికాసము, అకారాద్యనుక్రమణిక, సంపాదక మండలి: బిరుదు రాజురామరాజు, పుచ్చా వాసుదేవ పరబ్రహ్మిశాస్త్రి సర్వస్వ కేంద్రం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు. ​

ఇందులో పీవీపీ శాస్త్రి గారి రచనలు:


అంబదేవుడు, పే. 2-3
అగ్గళయ్య, పే. 7
అనుమకొండ పే. 24-25
అరికేసరి, పే. 40-42
అలంపురం, పే. 42-43
ఆంధ్రదేశ విభాగములు, పే. 47
ఇందులూరి సామంతులు, పే. 68
కందూరి చోడులు, పే. 89
కళింగము, పే. 96
కాకతీయ సామంతవంశములు, పే. 101
కూచన్న వావిలాలి, పే. 123
కృష్ణమాచార్యులు సి.ఆర్, పే. 134
కొణిదెన చోళులు, పే. 154
కొలనుపాక, పే. 52
కోటిలింగాల, పే. 157
గుంటుపల్లి గుహలు, పే. 175
జగ్గయ్యపేట, పే. 36
జటాచోడభీముడు, పే.22
జైనకేంద్రాలు ప్రాచీన, పే. 228
ధరణికోట, పే. 35
ధూళికట్ట, పే. 299
నీలకంఠశాస్త్రి కె.ఏ., పే. 270
నేలకొండపల్లి, పే. 54
పిఠాపురము, పే. 53
ప్లీట్ జెఎఫ్., పే. 402
మట్లిరాజులు, 431
మల్యాలరెడ్లు, 102
మల్లియరేచన, 448
మాధవవర్మ, విష్ణుకుండి, పే. 452
మైలమదేవి, పే. 463

​


యాజ్దాని, గులాం, పే. 464
రాఘవాచార్యులు బుక్కపట్నం, పే. 483
రాజమహేంద్రవరము. సూజ489
కాకతి రామారావు మారేమండ, పే. 543
రమేశన్, ఎన్., పే. 546
విజయవాడ, పే. 595
వెంకటరమణయ్య నేలటూరి, పే. 652
వెంకటరామస్వామి, కావలి, పే. 666
వేములవాడ, పే. 710
వైదుంబులు, పే. 711
షితాబ్‌ఖాన్, పే. 710
సర్కార్ దినేశ్‌చంద్ర, పే. 769
సిముక శాతవాహన, పే.781
సుబ్రహ్మణ్యశాస్త్రి వారణాసి, పే. 816
సోమశేఖర శర్మ మల్లంపల్లి, 843

​

చిత్రమాలిక

డా. పి. వి. పరబ్రహ్మశాస్త్రి దంపతులు

​
డా. పి. వి. పరబ్రహ్మశాస్త్రి సన్మాన సంచిక బ్రహ్మశ్రీని ఆవిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై. ఎస్. రాజశేఖరరెడ్డి, సంపాదకులు డా. పి. చెన్నారెడ్డి
డా. పి. వి. పరబ్రహ్మశాస్త్రిగారిని సత్కరిస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎన్. గోపిగారు
​
డా. పి. వి. పరబ్రహ్మశాస్త్రి గారికి సన్మానం రామచంద్రాపురం, చిత్రంలో అమ్మనుడి పత్రిక సంపాదకులు డా. సామల రమేష్‌బాబు, ఆ ఊరి సర్పంచ్ రామచంద్రారెడ్డి


డా. పి. వి. పరబ్రహ్మశాస్త్రి గారికి తెలంగాణా ప్రభుత్వం తరపున కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారి సన్మానం
​
డా. పి. వి. పరబ్రహ్మశాస్త్రి గారికి బ్రౌన్ పురస్కారాన్ని అందిస్తున్న ఆచార్య వకుళాభరణం రామకృష్ణ


డా. పి. వి. పరబ్రహ్మశాస్త్రి గారిని సత్కరిస్తున్న ఐ సీ హెచ్ ఆర్ ఛైర్మన్ డా. వై. సుదర్శనరావు, డా. అడపా సత్యనారాయణ
​
డా. పి. వి. పరబ్రహ్మశాస్త్రిగారికి, ఐసీహెచ్‌ఆర్ ఛైర్మన్ ఆచార్య వై. సుదర్శనరావు సత్కారం, చిత్రంలో డా. ఎన్. ఎస్. రామచంద్రమూర్తి


డా. పి. వి. పరబ్రహ్మశాస్త్రి గారికి ఎపిగ్రఫికల్ సొసైటీ వారు సత్కరించిన సందర్భంగా ఇచ్చిన తామ్రపత్రాలు
​
​


This work is released under the Creative Commons Attribution-Share Alike 4.0 International license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed—and if you alter, transform, or build upon this work, you may distribute the resulting work only under the same license as this one.