శారద లేఖలు (మొదటి సంపుటము)/9-వ లేఖ
సౌభాగ్యవతి కల్పలతకు : —
నెచ్చెలీ!
నీవువ్రాసిన జాబుచేరినది. నేనుగూడ నీవలెనే స్త్రీ నాటకరంగప్రవేశమును గూర్చియే అహర్నిశలు యోచించు చున్నాను. అయినను ఈనాటకసమస్య మనకు గానిపని. ఆడువారమా, పాడువారమా, యంటివేల? స్త్రీయుద్యమ మనిన తరువాత అది స్త్రీజాతికంతయు సంబంధించినదే. ఏల యన నేడు ఈయుద్యమమువలన కలుగబోయెడి లాభ నష్టములు, మానావమానములు, కీర్త్యపకీర్తులు, స్త్రీజాతి కంతయు జెందును. ఏనాడో కైకచేసిన యకార్యమును, చిత్రాంగిచేసిన దుష్కృత్యమును కారణముగా "అబ్బా! ఆడవాళ్లెంత గట్టివాళ్ళు. ఎంతకైనా సాహసులే” అనువాదు స్త్రీజాతికంతయు చుట్టుకొనినది!
మ॥ నరకద్వారము సాహసాకరము పుణ్యస్వర్గవిఘ్నంబు దు
స్తరమాయాశతపేటి దంభనిధి దోషస్థాన మప్రత్యయో
త్కరసుక్షేత్రము కాలకూట మమృతాకారంబు స్త్రీయంత్రమున్
ధరనెవ్వాఁడు సృజించె బూరుషగళోద్బంధక్రియాపాశమున్.
అని భర్తృహరి స్త్రీని హృదయభేదకముగా దూషించినాఁడు. భక్తిజ్ఞానవైరాగ్యవిషయములలో కృషిచేయువారు
స్త్రీని ఎంతపేలవముగా నిరసింపవలెనో అంతనిరసింపు చుందురు. దేవవేశ్యలైననేమి మర్త్యవేశ్యలైననేమి; వేశ్యజాతి మూలకముగా స్త్రీసంఘమునకు చెందిన యపఖ్యాతి అపారము, కాని యీజాతిని సృష్టించినవారును పురుషులే, దూషింపుచున్న వారును పురుషులే. కాన వీని నన్నింటిని బాగుగా గుర్తించి నూతనోద్యమమునకు చేయూత నిచ్చుటో నిరసించుటో యనెడు బాధ్యత ప్రతిస్త్రీపైనున్నది. ఇది మనదిగాదని యూరకొనుట మనజాతి సౌభాగ్యమును నష్ట
పఱచుకొనుట. మఱియు దీనివలన గలిగెడు మంచిచెడ్డలు స్త్రీలవే కాబట్టి పురుషులకంటె స్త్రీలే ఈవిషయమును పూర్ణముగా విచారించి కర్తవ్యమును నిర్ణయించుకొనవలసినవారై యున్నారు.
రసపోషణకే, భావపుష్టికే, కళాభివృద్ధికే, స్త్రీనాటకరంగములో ప్రవేశించిన తరువాత మోటారుబస్సుల యందును, రైలుబండ్లయందును, ఒదిగి కూర్చున్నట్లును, విధిలేక తలవంచుకొని ఆపత్కాలమందు డాక్టరుగారికి చేయిచూపించినట్లును, చిన్ననాడు తప్పని సరిగా బడిలో పంతులుగారియొద్ద చదువుకొనినట్లును, సభామధ్యమున తనకిష్టమైన విషయమును గూర్చి ఒడలు వణుకుచునో మాటలు తడబడుచునో నాల్గు ముక్కలు చెప్పినట్లును, నాటకరంగములో చరించుటకు వీలులేదు. లజ్జావతియగు స్త్రీ, నాటకరంగమధ్యమున పరపురుషుడని యాంగికాభినయమున నాతనితో సమముగ జరించుట కే కొంచెము వెనుదీసినను నాటకకళ అధ్వాన్నమైపోవును. హంగు చెఱచినయెడల స్త్రీ రంగమునకెక్కిన ప్రయోజనమేమి? నవరసముల పోషించి హావభావప్రకటనమునందు లోటులేకుండ ప్రదర్శించి నాటకములలో స్త్రీ ప్రవేశింప కుండుటవలన గలిగెడి గొప్పలోటును తొలగించి నాటకకళను మహోన్నతస్థితికి దెచ్చుటకే గదా స్త్రీ, నటకురాలు కావలసివచ్చినది? కాన స్త్రీ, రంగమున కెక్కినతరువాత, మడిలేని పిన్న పెద్దలు సంచరించెడిచోట మడిగట్టుకొనిన ముసలమ్మ యొదిగియొదిగి నడచినట్లు, ఎడ యెడగానుండుటకు వలనుపడదు. కలిసి చరించుట స్త్రీలకర్హము గాదు. అయినను నాటకకళాభివృద్ధికొఱకు స్త్రీల నేల బలవంతముగా నాకర్షింపవలెనో నాకు తోచకున్నది. రాముడుగాని తా నచ్చముగ రాముడుగను, సీతగానితా నచ్చముగ సీతగను, నటించి వేషధారి ప్రేక్షకుల నానందింపజేయుటయే నాటకము. తాము సీతారాములముగామని నటకులకు దెలియును, ప్రేక్షకులకును దెలియును. అట్టిచో సీతవేషమును స్త్రీవేసినను నొకటే పురుషుడు వేసినను నొకటే. పురుషుఁడు స్త్రీగా నటించిన నందు కొంత సామర్థ్యప్రకటన ముండునేమోగాని నటించినచో నందద్భుత మేముండును? స్త్రీయైన మాత్రమున పలుభావములు ప్రకటించుటలో కౌశలము వలదా? యనిన నదియు నిజమేకాని పురుషుఁడే యిన్నిభావములు ప్రదర్శించిన మఱియు నధికకుశలతయనిపించు కొనునుగదా! శీలము మనుష్యునిబట్టి యుండును గాని వృత్తినిబట్టియుండదని కొందఱనుచున్నారు. కాని సీతవంటి శీలవతి నాటకరంగములో సీతవేషమును ధరించు ననుకొనుము. ఆదర్శపాత్రమగు సీతశీలమును ప్రతిస్త్రీయును తన జీవితమునందనుష్ఠేయముగా నుంచుకొనదగినదికదా. హనుమంతుడు సీతను తనమూపున నిడుకొని శ్రీరామచంద్రుని కడకు గొంపోవుదునని సీతతోఁజెప్పినప్పుడు పరపురుషునంటనని సీతచెప్పినది. ఉత్తమమైన యాసతీధర్మము ననుష్ఠించెడు యా సీత వేషధారిణి, నాటకరంగములో నెట్లు చరించును? నాకు దుర్జేయముగా నున్నది. అదిసరే. భాగవతములు నాటకములు మున్నగు నీకాలక్షేపము లెందులకుఁ బుట్టినవి? ఇంచుక యోచింతము. ప్రజలలో నీతిని పెంపొందించుటకును, దేశానురక్తిని గలిగించుటకును మతాసక్తిని బుట్టించుటకును దైవభక్తిని వ్యాపింపఁజేయుటకును, జనులను కూటమిగాఁజేర్చి కాలక్షేపములు జరుపుట మనదేశములో ననాదిగా నడచుచున్న యాచారము. ఇవి సామన్యముగా పామరజనుల ప్రబోధము కొఱకే యేర్పడినవి. వీనిలో మొదటిమెట్టు కథలు చెప్పుకొనుట. కథ నీతికరమైనదియు కథకులు వచోనైపుణిగలవారును నైనచో ఆటపాటలు, మద్దెల తాళములు, బహుపాత్రలు లేకపోయినను, వినువారి మనస్సు నట్టె యాకర్షించి చిత్రప్రతిమలుగాఁ జేయవచ్చును. వీనిలో శ్రోతలు కథలోని పాత్రలను మానసికముగా సృష్టించుకొందురు. వీనిలోనున్న యేకాగ్రత మేళతాళాడంబరములలో నుండెడి కాలక్షేపములలో నుండదు. తల్లివద్ద నేకాగ్రచిత్తముతో నిట్టి కథల నాలకించియే మహారాష్ట్రచక్రవర్తియైన శివాజీ, యంతటి శూరుడైనాఁడు. వీనికి కొంచెము పైమెట్టు గొల్లసుద్దులు, తందాన పదములు మున్నగునవి. వీనిని వినువారు ముఖ్యముగా జాన పదులు. ఈ పదములు వట్టి పొడిమాటలు కాకపోయినను తత్తుల్యములగు కొంచెము రాగముతోగూడిన పదములు. వీనికి కొంచెమూత ఏకతంత్రీసాధనమగు తంబూరయు కొమ్ము, తిత్తి, మున్నగునవియు. పూర్వము జనసామాన్యములో మతము, యుద్ధము, మున్నగు వానినిగూర్చి ప్రబోధము కలిగించ వలసినప్పుడు పరవశచిత్తులగు వారిచే నుద్రేకముగా చదువబడెడి యీ పదములు బహూపయోగకరముగ నుండెడివి. ఇప్పటికిని బొబ్బిలికధ, పల్నాటి వీరచరిత్రము, మున్నగు వీరచరితములు పాడబడునపుడు జానపదులలో గల్గెడి యుత్సాహ మద్భుతము. వీనికి పై మెట్టు తోలుబొమ్మలాటలు. జనులలో నాగరికత యభివృద్ధియైన కొలది యీకాలక్షేపముల యభివృద్ధియు పలు తెఱగులుగా నుండజొచ్చినది. ఉపనిషత్కాలమున మానసికముగానున్న యేకేశ్వరోపాసన, కాలక్రమమున ఆడంబరములతోగూడిన ప్రతిమార్చనగా మాఱి మనుజుని పతనమునకు కారణమైనట్లు ఈకాలక్షేపముల వృద్ధియు మన పతనమునకే దారిచూపినది. కథలను గేయములను వినునప్పు డాయాకధలలోని యుత్తమపాత్రలకు మానసికముగా రూపకల్పన గావించుకొని వాని సత్యశీలసామర్థ్యములను గుర్తించి వానిని తమ జీవితములం దనుష్ఠేయముగా నుంచుకొనుటకు శ్రోతల కవకాశ ముండెడిది. కాని తోలుబొమ్మలాటలలో ప్రసిద్ధవ్యక్తులకు కృత్రిమరూపములు కల్పించుటచే చిత్తైకాగ్రత నశించినది. తోలుబొమ్మలాటతోనే రంగస్థలమున తెఱయెత్తబడినది. వాయిద్యపరికరములుగూడ నధికమైనవి. గాత్రమాధుర్యమునకు ప్రాముఖ్యత ఈయబడినది. కాన కథలకు కళాసాంకర్యము గల్గినది, ఈతోలుబొమ్మలాటలయందేనని చెప్పవచ్చును. కాని మన భరతఖండమునందలి ప్రసిద్ధేతిహాసములగు రామాయణ భారతాది యుద్గ్రంథములయందలి శూరభక్తానీకముల చరిత్రములను బొమ్మలద్వారాసుబోధముగావించి పామరజనులలో నీతిప్రబోధము గావించుటయే యీతోలుబొమ్మలాటల లక్ష్యముగూడ నై యుండెను. కాని యచేతనములగు తోలుబొమ్మల నాడించి సచేతనపు తోలుబొమ్మలగు జనసామాన్యము నానందింపజేయుట యనునది కాలక్రమమున నాగరికులకు మోటుగా తోచినది. కాన తామే ఆయాపాత్రములు ధరించి నటించుట యుక్తముగా భావించినారు. అవియే భాగవతములు. తోలుబొమ్మలాటవఱకు మనుజుఁడు మొగమునకు రంగుపూసికొని రంగమున కెక్కలేదు. మఱియు తోలుబొమ్మలాటవఱకు నీకథల నడుపువారు సామాన్యముగా శూద్రులే యైయుండిరి. ప్రాయికముగా వీరి గురువులు బ్రాహ్మణులై యుండినను నలువురిలో నాడెడివారు మాత్రము బ్రాహ్మణేతరులే. బ్రాహ్మణేతరులలో నిట్టియాటపాటల కాలక్షేపములు జరుగుచుండ బ్రాహ్మణు లూరుకొనలేదు. పురాణపఠనము హరికథలు మున్నగునవి వారి కాలక్షేపములుగా నుండెడివి. అయితే వారి కాలక్షేపములకు వీరును వీరికాలక్షేపములకు వారును పోకుండిరని భావనకాదు. వాని ఆధిపత్యము లాయాజాతులవారు మాత్రమే చేయుచుండిరని యర్థము. అయితే భాగవతములలో అన్నిజాతులవారును పాల్గొనిరి. బ్రాహ్మణభాగవతులు-వీరే కూచిపూడిభాగవతులు. గొల్లభాగవతులు, ఏనాదిభాగవతులు, మాలభాగవతులను పేరులతో వేర్వేఱు కులములవారు భాగవతముల నాడుచుండుట యిప్పటికిని కందుము. నాట్యకళా బ్రహ్మయగు భరతాచార్యునకు పూజ్యత ఈ భాగవతముల యందే కల్గినది. మఱియు హావభావముల కాధిక్యతయు, శృంగారమునకు ప్రాముఖ్యతయు, కృష్ణచారిత్రమునకు ప్రాధాన్యతయు, నీతికి న్యూనతయు నీభాగవతముల కాలముననే గల్గెను. కాని యొకమేలు, వీధిభాగవతముల వఱకు వీని వ్యయము జనసామాన్యమునకు తగిలెడిదికాదు. గ్రామములో పెద్దలైనవా రేనలుగురైదుగురో దానివ్యయమును భరించి ప్రజాసామాన్యమున కాయాటను సందర్శించుభాగ్యమును ధారాగతము చేసిడివారు. వాని తరువాతివే నాటకములు. ఈనాటకములలో గూడ వీధినాటకములని యొక్కటే తెఱతో వీధులలోనాడునవి కలవు కానివాని ప్రచారము స్వల్పము. ఇప్పటి నాటకములనగా వానికొక ప్రత్యేకమందిరముండును. రంగాను కూలములైన పరికరము లధికము. నేపథ్యాడంబర మెక్కువ. నృత్యగీతాభినయములకు ప్రాముఖ్యత యధికము. మఱియు ప్రతిచూపరియు కొంతమూల్యమును తన స్థితినిబట్టి యిచ్చు కొనవలయుట వీనిలో ముఖ్యవిషయము. టిక్కెట్లపద్ధతితో గూడిన నాటకములు ధనికులను పేదలను విడదీసినవి. కాన భాగవతములు నాటకములు మున్నగు కాలక్షేపములు జరుపుట ప్రజాప్రబోధమునకనెడి యాదర్శమును నాటకములు చెఱచినవి. నాటకములు శ్రీమంతులగు నాగరికుల కానందమును గూర్పవచ్చును, కాని ప్రజాసామాన్యమునకు వీని ప్రయోజనములేదు. ఒకవేళ యేపాటకపు జనుఁడైనను పావలా, అర్థా, చెల్లించి నాటకమునకు వెళ్ళి యుండినచో త్రాగుబోతైనవాడు; యింటిలోనిభార్యాబిడ్డలగోడు జూడక కల్లంగడికి వెళ్లినట్లే నాటకముల చూడవచ్చిన కూలివాడు కూడ ఇంటిలో మఱుపూట గంజి కాధారములేకుండజేసి నాటకసందర్శనమనెడి దుర్వ్యసనపిసాస దీర్చుకొనుటకు వచ్చి యుండెననుట స్పష్టము. కాన ధనికులకే నాటకములు. వీరి యానందమునకు పురుషవేషధారులు చాలలేదు. కాన స్త్రీలనుగూడ రమ్మనుచున్నారు.
ఇటీవల కొంతకాలమునుండియు నాటకకళ విషయమై మనయాంధ్రదేశమునందు ప్రచారము జరుగుచున్నది. సమర్థులైన నటకులు కొందఱు బయలుదేరి బహుమానములు, బిరుదులు, పొందుచున్నారు. ఈకళాభివృద్ధికై గ్రంథములు కొన్ని ప్రకటింపఁబడినవి. పత్రికలుగూడ స్థాపింపఁబడినట్లు జ్ఞాపకము. కాని ఈప్రచారమంతయు పురుషులలోనే జరుగుచున్నది. స్త్రీలుగూడ నాటకరంగములో పాల్గొనకుండుట లోపమను సంగతిని కళావిదులు నిన్నమొన్నటివఱకు గుర్తింప లేదు. బహశఃయిది ఈవత్సరమే దేశములో ప్రవేశించిన నవ్య మారుతము. ఇది పశ్చిమవాయువని కొందరన కాదు, కాదిది ప్రాచ్యమారుతమే యని కొందఱనుచున్నారు. ఇది యేగాలియైననేమి మనహిందూస్త్రీ మనస్తత్వముల కిదిసరిపడునా లేదా? యనునదియే యోచింపవలసిన యంశము. వేశ్యాజాతి స్వర్గలోకములోనున్నది. మర్త్యలోకములో నున్నది. పాతాళలోకములోనున్నది. చతుర్యుగములకు సంబంధించిన శ్రుతి స్మృతిపురాణేతిహాసములలో వీరి ప్రస్తావనగలదు. కాన నిది అతిపురాతనమైన తూర్పు వాయువు అని చెప్పుటకు సందేహములేదు. అయిన నేమి? నీతిభ్రష్టమైన యీజాతిధర్మమును కూకటివేళ్ళతో గూడ పెల్లగించుటకు దేశహితైకాభిలాషులెల్లరు తీవ్రముగా యత్నింపుచున్నారుగదా. అట్లె ఈ నాటకరంగ ప్రవేశోద్యమముగూడ ప్రాచ్యమైననేమి, ప్రతీచ్యమైననేమి, ప్రాక్తనమైననేమి అధునాతనమైననేమి? సతీశ్రేయమునకు భంగకరమైనచో నది నిర్మూలింపఁజేయుట స్త్రీల కర్తవ్యము. మనయింటిదీపమని ముద్దుపెట్టుకొననగునా?
కల్పలతా,
"లోకోభిన్నరుచి” యన్నట్లు జనులతలపులు బహువిధములు. నీతిలక్ష్యము కొందరికి, కళాప్రియత్వము కొందఱికి, కనులపండువు కొందఱికి, ఎవరి యుద్దేశము కాదనినను వారి కావేశమే యెత్తుకొనివచ్చును, కాని ఆలోచింపవలసిన విషయముల కావేశముచెందిన లాభములేదు. కాన ఒకప్పుడు శీలమునకై యాత్మార్పణము గావించి యశోవిశాల మైన భారతమహిళ నేడు నాటకకళకు బలియై తన పూర్వౌన్నత్యమును చెఱుచుకొనుట యుత్కృష్టమో, నాటకకళకు లోపముకల్గిన గల్గుగాక తన శీలమునే ప్రాథాన్యముగా బెట్టుకొని నాటకరంగములకు వెలిగానుండుట యుత్కృష్టమో, స్త్రీలును స్త్రీసంఘాభ్యుదయపరులగు పురుషవరేణ్యులును యోచింతురు గాక.
దూకుదూకుమనువారేగాని తోడు దూకువారుండరు. స్త్రీ లిందు పాల్గొనుటవలన దేశ మభివృద్ధిజెందుననియు, నాట్యకళ పెంపొందుననియు, స్త్రీ పురుషులు యోగ్యులై యున్నచో వా రెంత కలిసి మెలసియున్నను ప్రమాదము లేదనియు, కళాభిమానులగువారు తమ యుద్యమవిస్తారమునకై పలుతెఱగుల సమాధానములు చెప్పి స్త్రీల నాకర్షింప వచ్చును. కాని నాటకములాడు స్త్రీలనుగాంచి లఘుభావమున పలుగాకిమూకలాడు ప్రల్లదముల నాప వీరితరమా?
మహాత్మునివంటి యుత్తమోత్తమ పురుషవరేణ్యునిచే నడుపబడుచున్న సబర్మతీ సత్యాగ్రహాశ్రమమును బోలు నిష్ఠురనియమవిధానములుగల సంస్థయందే స్త్రీ పురుషులలో లోపములు గననయ్యెనని మహాత్ముడు వలవల విలపించినాడు. శీలభంగభయముచేతనే స్త్రీ పురుషులు కలిసి పనిచేసెడు ఫ్యాక్టోరీ విధానమును మహాత్మునివంటి ప్రాజ్ఞులు నిరసింపుచున్నారు. అట్టిచో నిక నాటకరంగములా స్త్రీల మర్యాదను చెక్కు చెదరకుండ రక్షింపునవి ? పూర్వము మన దేశమున స్త్రీలు నాటకములలో పాల్గొనినట్లు కానము. ఉండిరని చూపఁబడుచున్న వారు దేవవేశ్యలైన అప్సరసలేగాని సంసారిణులుగారు. మన శాస్త్ర మహోదధియందు బాల్యవివాహవాదులకును ప్రౌఢవివాహవాదులకును నుదాహరణములుగా జూపదగిన శ్లోకరత్నములు లభించినట్లే ఒకవేళ వెదకినచో నీ విషయమునగూడ యుభయ వాదులకును నుదాహరణ శ్లోకరత్నములు కొదువలేక దొరకవచ్చును. వేషధారణము గృహస్థ నిషిద్ధకర్మమని శాస్త్ర దృష్టాంతములు పెక్కులుగలవు. వానినెల్ల నిక్కడ వాకొనుట అనవసరము. ముంజేతి కంకణమున కద్దమెందులకు? స్త్రీ నాటకరంగ ప్రవేశముయొక్క ఫలితములు సాధారణ విషయములను బట్టియే కరతలామలకమగుచుండ ప్రాచీనోదాహరణములకొఱకు ప్రాకులాడుటేల? కల్పలతా! నాటకకళనుగూర్చి సందర్భమునుబట్టి యింతగా విమర్శించుటచే నాటకకళ యనిన నాకు ద్వేషమని భావింపకుము. స్త్రీల ప్రవేశమునుగూర్చియే నా కభిప్రాయభేదముగాని కళాకోవిదులగు పురుషవరేణ్యు లీ నాట్యకళోద్ధరణకై విశేషముగా పాటుపడి మన యాంధ్రదేశమును నీ విషయమునగూడ తీసిపోనిదానినిగాఁ జేసిరేని నాకు పరమసంతోషము. కాని యే స్త్రీజనాభ్యుదయచింత స్త్రీ జనప్రయోజనకరములగు నుదారసంస్కరణములకు నన్ను సుముఖురాలనుగాఁ జేయుచున్నదో ఆ మహనీయచింతయే నన్నీ యుద్యమమునకు వ్యతిరేకాభిప్రాయముగా చేయు చున్నది. దీర్ఘముగా నాలోచించిన పిదపనే నే నీ నిశ్చయమునకు వచ్చితిని. అది నా కళానభిజ్ఞతయు ఛాందసమునునని యేరైన నధిక్షేపించినను నదియు నాకొక యలంకారమే యనుకొందును.
భావపురి
మిత్రురాలు.
1929 జూలై
శారద.