Jump to content

శారద లేఖలు (మొదటి సంపుటము)/6-వ లేఖ

వికీసోర్స్ నుండి

సౌభాగ్యవతియగు కల్పలతకు :-

నెచ్చెలీ!

అయిదేండ్లకు పూర్వ మొకనాడు శారదానికేతన సమాచారమును పత్రికలలో జూచి ఆహా! నేటికిగదా ఆంధ్ర కన్యల తపము ఫలించెనని యానందించి యెప్పుడు గుంటూరు వెళ్ళుదును యెప్పుడు శారదాలయము గాంతునని యుబలాట పడి పడి కొన్నాళ్ళకు గుంటూరు వెళ్లితిని. శారదానికేతన మెక్కడనని మా సోదరుల నడిగితిని. సనాతన ధర్మమండలి వారి పాఠశాలయే శారదానికేతముగా మారెనని వారనిరి. అచ్చటికిపోయి చూచితిని. పాఠశాల సాధారణ ఫక్కినే యుండెను. నికేతనము వారు పత్రికలలో దీర్ఘముగా ప్రచురించిన విద్యావిధాన మేదియు నక్కడ ఆచరణమందు గన్పడ లేదు. నాకు మిక్కిలి కోపమువచ్చెను. “పత్రికలలో గంభీర ప్రకటనలు, చూడబోయిన నేమియు లేక పోవుటలు, దేశ భక్తుల కిది పరిపాటిగా నున్నట్లున్నది. పత్రికలనుగాంచి ధనసహాయము సేయుట పొరబాటు" అని యేవగించుకొని యింటికివచ్చితిని, గాని యిది పుట్టి యెన్నాళ్లో గాలేదు. అప్పుడే యింతపెద్దది కమ్మన్న నెట్లగునను వెనుక చూపే నాకు తగులలేదు. ఒక సంవత్సరము గడచిన తరువాత మరల నొకమాఱు గుంటూరు వెళ్లితిని. శారదానికేతన మెట్లున్నదని మరల మాసోదరుల బ్రశ్నించితిని. “చక్కగానున్నది. ఒక విశాల సౌధములోనికి మార్చబడినది. చాలమంది బాలికలు గురుకుల వాసినులుగా జేరినారు. ఇపుడు చూచిన సంతృప్తిఁజెందుదువు” అనిరి. వెంటనే వెళ్ళి చూచితిని. నిజముగా పాఠశాల మాఱిపోయెను. ఆ గురుకుల వాసినులగు బాలికలను, జాతీయములగు నా విద్యాపద్ధతులను చూడగనే నా కెనలేని సంతస మొదవెను. తక్షణమే ఆ విద్యాలయము విూదను ఆ విద్యాలయ ప్రతిష్ఠాపకులమీదను నా కెనలేని భక్తిప్రేమలు కుదురుకొనెను. నాడాదిగ నేనెన్నిమాఱులు గుంటూరు వెళ్ళినను ఆ విద్యాలయమున కొకమాఱు వెళ్లి చూడకరాను. స్త్రీల పాలిటి కది కల్పతరువువంటి ప్రతిష్ఠాపనమనియు, ఎవరు స్త్రీ విద్యాభివృద్ధిని కాంక్షింతురో, ఎవరికి దేశభక్తియు జాతీయతాభిమానమును గలదో అట్టి వారెల్లరావిద్యా ప్రతిష్ఠాపనమును నాదరించి పోషింపవలయుననియు నాతలంపు కాన పలుమాఱులాపాఠశాలను దర్శించి వచ్చుచుందును.

మా సోదరులుండుటచే నాకు గుంటూరు ప్రయాణ మేడాదికొకటి రెండుమాఱులు తగులుచుండును. గత మాసాంతమున మరల గుంటూరు వెళ్లితిని. బ్రాడీపేటలో నాకు నీవంటి యాప్తురాలగు స్నేహితురాలుండెను. ఆమెను చూచుటకై వెళ్లితిని, కాని ఆమె యింటలేదు. అప్పటికి దాదాపైదుగంటలు దాటినది. కాని నా ప్రేమపాత్రమగు శారదానికేతన మచ్చటి కనతిదూరముననే యుండుటచే నాయడుగటుపడెనేగాని యింటివైపునకు తిరుగులేదు. చరమ సంధ్యాకాంతులతో పశ్చిమాశ రాగరంజితమై మనోజ్ఞముగ నుండెను. ఆరుబయలునుండి వీచెడు హోరుగాలి చలిచలిగా నుండెను. నేనారైలుకట్ట ప్రక్కనున్న రప్తాదారినిబట్టి వడివడిగా శారదానికేతమున కేగసాగితిని. నాకు వంటపని యున్నదమ్మా యనియు, నేను పాఠములు చదువుకొనవలసి యున్నది, నికేతనమునకేగి వచ్చునప్పటికి బాగుగా చీకటిపడునేమో ఎట్లాగత్తా? అనియు, నాతో వచ్చిన మావదినెయు, మా మేనగోడలును తొందరించిరి. వారిమాటలు నా చెవి దూరలేదు. నన్ను వీడిపోలేక వారును నావెంటనేవచ్చిరి. సింహ ద్వారమను నామము సార్థకంబగున ట్లిరువైపుల సింహపు మూర్తులుగల సింహద్వారమున నికేతనములోనికి బ్రవేశించితిమి. ద్వారముదాటి నాలుగడుగులు లోనికేగగనే నికేతన పాదపములకు నీళ్లువోయుచున్న గురుకుల వాసినులు మాకెదురైరి. వారిని చూడగనే కణ్వాశ్రమమున చెట్లకు నీళ్లుపోసిన శకుంతలాప్రియంవదలు జ్ఞాపమునకు వచ్చిరి. కాళిదాస మహాకవి యక్షరరూపమున జూపినదానిని నికేతన ప్రతిష్ఠాపకులు ప్రత్యక్షరూపమున జూపుచున్నారుగదాయని లోలోన హర్షించుచు లోనికేగ వార్షికోత్సవమునకు సిద్ధపడెడి యత్నములతో నిండి గై సేయనున్న కాంతవలె శారదానికేతనము గన్పట్టెను. చీఁకటిపడుచున్నను వార్షికోత్సవమునాటికి తయారుకావలె ననెడి తలంపుతో తదేకదృష్టితో చిత్తరువులను వ్రాయుచున్న ఉపాధ్యాయులతో విద్యార్థినులతోనున్న చిత్రకళా మందిరము నొకమాఱు కన్నారగాంచి పట్టువస్త్రములపై కద్దరువస్త్రములపై సరిగతోడను పట్టుతోడను విచిత్రలతా వితానములఁ జిత్రింపుచున్న కుట్టుతరగతి బాలల నొకమాఱు మోదమున తిలకించి, వార్షికోత్సవపు ఆటపాటలలో పాల్గొన నాయత్తపడుచున్న కన్యకామణుల గాన కౌశలము నొకమాఱు శ్రవణపేయముగా నాలకించి, తరువాత పాఠశాలను తదితర ప్రదేశములను చూచి యింటికి మరలితిమి.

ఆ తరువాత నాలుగైదుదినములకు వచ్చెవచ్చె ననుకొనుచున్న వార్షికోత్సవపు దినములువచ్చెను. తొలినాటి (1 - 12 - 28) యుదయము నికేతనములో నూతనముగా గట్టబడిన గృహప్రవేశోత్సవము శాస్త్రోక్తముగా జరుపఁబడెనట. దానిని నేను చూడలేదు. ఆ సాయంత్రమువెళ్లి విద్యాలయబాలికలచే తయారుచేయబడిన కుట్టు, పేము, చిత్రముల ప్రదర్శమునమునుచూచి యొకతాతగారు చెప్పిన హరికథ నొకకొంతవిని యింటికివచ్చితిమి. మఱునాడు వార్షికోత్సవము. ఆ యుత్సవసందర్శన కుతూహలురై యితర గ్రామములనుండి స్త్రీపురుషు లెందరోవచ్చిరి. ఇఁక నూరివారి యుత్సాహ యత్నములు చెప్పనే యక్కఱలేదు. గుంటూరునందలి ప్రతి స్త్రీయును ఆనాడు నిద్రలేచినదిమొదలు శారదానికేతమున కేగెడి యత్నములోనే యుండెనని చెప్పవచ్చును. సభారంభము మూడుగంటలకైనను నొంటిగంటనుండియే స్త్రీపురుషులెల్లరు జట్కాలమీదను, ఒంటెద్దుబండ్లమీదను, మోటార్కారుల విూదను, కాలినడకను, తండోపతండములుగ పోజొచ్చిరి. ప్రతివారిని చోటుదొరకదను భయమే పీడించుటచే యెవరికి సాధ్యమైనంత వేగముగా వారు శారదానికేతనమునకు చేరుకొనిరి. మేము వెళ్ళునప్పటికి దాదాపు మూడుగంటలు కావచ్చెను. అప్పటికే జనసమూహము విశాలమగు పందిరిని క్రిక్కిరిసియుండెను. మాకంటె ముందువచ్చియుండిన మాచిన్నవదినగారి సాయమువలన మాకు కొంచెమనుకూలమగు ప్రదేశమే కూర్చుండుటకు దొరికెను. మా తరువాత వచ్చిన వారికి నిలువుజీతమే. కార్యక్రమము సరిగా మూడుగంటల కారంభమయ్యెను. హైదరాబాదు వాస్తవ్యులగు ధర్మవీర్ వామన రామచంద్రనాయక్‌గారు నాటి సభాధ్యక్షులు. అధ్యక్షుల యుపన్యాసము స్త్రీల యభివృద్ధికిఁ దోడ్పడెడి పెక్కు హితములతో నుండెను. స్త్రీపురుషుల కార్యక్షేత్రములు భిన్నములుగాన స్త్రీపురుషుల విద్యావిధానముగూడ భిన్నమై యుండవలెనని తగు హేతువులతో వారు నిరూపించిరి. మఱియు ప్రేమ, దయ, శ్రద్ధ, ఉత్సాహము, సేవాపరాయణత, స్వార్థ త్యాగము మున్నగునవి స్త్రీగుణములనియు, ధైర్యము, శక్తి, పూనిక, వీరత్వము, కష్టపడిపనిచేయు నలవాటు మున్నగునవి పురుషుల గుణములనియు వారుతెల్పిరి. కార్య క్షేత్రములు భిన్నములు కావచ్చును కాని స్త్రీపురుషులెల్లరు జాతిసామ్యమున ఏకమానవజాతికే చెందియున్నారు. కాన పైయుత్తమగుణములన్నియు మానవజాతి కంతటికిని కావలసినవే. గుణశీలములకు లింగభేదములేదు. స్త్రీగుణమని పురుషుడు దయను విడనాడినచో స్త్రీ మాడిపోవలెను. పురుషగుణమని స్త్రీ పాటుబడుట మానినచో పురుషు డన్నమునకై యలమటింపవలెను. నాయక్ గారి నిర్ణయముప్రకారము ధైర్యము, కష్టసహిష్ణుత, పుంలింగమునకు చెందినవి. స్వార్థత్యాగము, సేవాపరాయణత స్త్రీలింగమునకు జెందినవి. కాని ధైర్యములేనిది స్వార్థత్యాగముగాని, కష్టసహిష్ణుత లేనిది సేవాపరాయణతగాని చేయచొప్పడదు. కాన నొకకార్య సాధనకు స్త్రీపురుషుల తోడ్పాటెట్లవసరమో అట్లే యుభయగుణ సమ్మేళనముగూడ నవసరము. ఇట్టి శంకలకు తావిచ్చెడి యంశము లొకటిరెండున్నను మొత్తముమీద అధ్యక్షుల యుపన్యాసము స్త్రీజనాభ్యుదయ కరములగు పెక్కు దివ్యోపదేశములతోగూడి గంభీరభావభరితమై గమనార్హముగ నుండెను. అనంతరము లక్ష్మీనారాయణ పంతులుగారు గతసంవత్సరకార్యనివేదికమును జదివిరి. తరువాత గురుకుల బాలికల యాటపాటలారంభమయ్యెను. తొలుతనొకబాలిక దైవప్రార్థనముచేసెను. తరువాత నిరువురుబాలికలు గానముచేసిరి. జాతీయగీతమునుబాడిరి. తరువాత కొందరుబాలికలు రామభజనచేసిరి. తెలుఁగు, సంస్కృతము, హిందీ, మూడుభాషలలో నాటకభాగములను ప్రదర్శించిరి. మూడుభాషల యందును వారివాచకము మనోజ్ఞముగనేయుండెను. సంస్కృతమున వారుభాషించునప్పుడు ప్రాచీనఋషికన్యల దలపించిరి. హిందీనాటక సంభాషణలో వారు ఉత్తరహిందూదేశపు బాలికలాయనిపించిరి. ఇక తెలుగువాచకమున వారు కల్తీలేని తెలుఁగువారే. మధురమైనగాత్రము, మృదులమైనపలుకులు, స్పుటమైన యుచ్చారణ, ఉచితమైన అభినయము, వారి యాటపాటలకు వన్నె దెచ్చినవి. అందులో మిన్నయనుపించినది భీమరెడ్డి అన్నపూర్ణయను కన్యాకామణి. పరశురామ గర్వభంగములో రాముఁడామె; భీష్మప్రతిజ్ఞలో శాంతనవుడామె; రాధపిలుపులో కృష్ణుఁడామె; సంగీతములో నామె; ఆంధ్రప్రశస్తి పద్యముల చదువుటకామె; వేయేల? ఆ బాలిక పెక్కింటిలో బాల్గొని తన విధిని చక్కగా నిర్వర్తించి యెల్లర మెప్పును గాంచెను. అన్నింటికంటె రాధపిలుపులో కృష్ణుని వేషముధరించి యా బాలచూపిన హావభావ ప్రకటన మేమని వర్ణింతును? అప్పటి యామె రూపు నాకిప్పటికిని కన్నుల గట్టినట్లున్నది. ఆ చిఱునవ్వుగూడ కృష్ణునివద్దనుండి యెట్లు పుణికి తెచ్చుకొనెనో! ఆమె అభినయ కౌశలమునకు మెచ్చి సభికులలో నొకరాఱు రూప్యము లామెకు ప్రత్యేకబహుమానమిచ్చిరి. తరువాత ప్రేక్షకులు శ్రద్ధతో వినినది పిసినారి భాషణము. సంస్కృతనాటకమున పరశురామపాత్రము ధరించినబాలయే పిసినారివేషముధరించినది. ఈ బాలగూడ మంచి నిపుణమతి. పరశురామపాత్రమునందు కఱకుచూపులు బఱపిన యాబాల పిసినారి వేషమున లుబ్ధత్వమును లోటు లేకుండ ప్రదర్శించి ప్రేక్షకుల కడుపుబ్బ నవ్వించినది. బాలికల యాటపాట లెంత మనోజ్ఞముగ నున్నను దానిని వినగల్గు, చూడగల్గు భాగ్యము కడు సమీపస్థులకేగాని యన్యులకు కలుగుట బహుదుస్తరమయ్యెను. విశాలమైన యాసభాశాలలోని స్తంభములకు “నిశ్శబ్దము” అని వ్రాసి కట్టబడిన యట్టలు మాత్రమే నిశ్శబ్దముగ నుండెనుగాని ప్రజలుమాత్రము నిశ్శబ్దముగలేరు. ఆఘోష సముద్రపుఘోషకన్న పదిరెట్లధికముగ నుండెను. మన ఆడవారి సంగతియడుగఁ బని లేదు గదా! కుశలప్రశ్నలక్కడ, నగలపరిశీలన ప్రసంగములక్కడ, వంటప్రస్తావనలక్కడ, పెండ్లిముచ్చటలక్కడ సరి, ఇఁక పిల్లలయేడుపు ఉండనేయున్నది. తల్లులు తమకుతూహలము కొఱకు శిశువులను జనసమ్మర్దములోవేసి నలిపివేయుచుండ వారు రోదింపకెట్లుందురు? కాని స్త్రీలుచేసిన సందడికంటె చదువులకుఁ జేరిన యే యడ్డులేని మగబిడ్డల యల్లరియే యత్యధికముగానుండి యనేకమాఱులు కార్యక్రమమునకు భంగము కలిగించెను. శారదాలయమువారు మొదట నిర్ణయించిన టిక్కెట్లపద్దతి యూరిలో నలజడికి గారణ మయ్యెనేగాని సభలోని యలజడి మాన్పుటకేమాత్రము తోడ్పడలేదు. ఈ ఘోషచూచిన తరువాత ననేకులు టిక్కట్లు పెట్టిననే బాగుగానుండునేమో యనుకొనిరి. బాలిక లెన్నిదినములనుండియో శ్రమపడి నేర్చినదంతయు జనుల కలకలముచే వ్యర్థమైపోయినప్పుడు నాకెంతయో విచారముగొల్పెను. శ్రమపడి నేర్చినవారికిని నేర్పినవారికిని నెంత మనస్సునొచ్చెనో! అనంతరము సాహితీ పరీక్షయందుత్తీర్ణలైన బాలికలకు పట్టములొసంగబడెను. తరువాత బహుమతులుగూడ నొసంగిరి. ఆబహుమతులన్నియు నెవరోవదాన్యు లొసంగినవే. ఆదాతలపేరు గూడ నక్కడచెప్పుచు బహుమానములిచ్చిరి. ఆటపాటలలో మిన్నయైన అన్నపూర్ణమ్మ బహుమతు లందుకొనుటలోగూడ మిన్నయయ్యెను. అధ్యక్షుల అంత్యోపన్యాసముతోడను బాలికల మంగళగీతములతోడను సభసమాప్తమయ్యెను. నామనం బానందపరిపూర్ణమయ్యెను.

కల్పలతా! అప్పుడు “తొలినాటి నాతలంపులెంత దుష్టమైనవి? ఏసంస్థయైన పుట్టిననాడే పెద్దదిగానుండుమన్న నెట్లుండును? ఇట్టి మహోత్కృష్ట ప్రతిష్ఠాపమున కై దేండ్ల జీవితమొక దీర్ఘకాలమా?" అని నాలో నేనే సిగ్గిలితిని.

మిత్రమా, ఈ విధముగ శారదా గురుకులము నిష్కళంక దేశసేవాపరాయణులుగ నున్నవారి నిరంతర కృషిచే క్రమాభివృద్ధినందుచు ఆంధ్రకన్యల నాహ్వానించుచున్నది. పుత్రికలు విద్యాపతులు కావలెనని యభిలషించెడు తలిదండ్రులకిది మంచి సమయము. తమ పుత్రికల శారదాలయమున కంపవచ్చును. స్త్రీ విద్యాభిమానులగు వదాన్యలోకమున కిదిమంచి యదను. తమ విత్తము నీయుత్కృష్ఠ ప్రతిష్ఠాపనమునకు దానముచేసి యశోవిశాలురు కావచ్చును. ఆంధ్రమహాజను లాలోచింతురు గాక. నీ కొమార్తెను శారదా గురుకులమున కంపరాదా?


1929 జనవరి

మిత్రురాలు

శారద.