Jump to content

శారద లేఖలు (మొదటి సంపుటము)/5-వ లేఖ

వికీసోర్స్ నుండి

సౌభాగ్యవతియగు కల్పలతకు —

నెచ్చెలీ!

గతలేఖ నొకమాఱు స్మరించుకొంటివేని నెల్లూరులో మా పెట్టెలో కెక్కినయొకస్త్రీ తన పినతల్లి కొమార్తెవృత్తాంతమును చెప్పుటయు నాసమాచారమును లేఖావిస్తరభీతిచే నే నప్పటి కాపుటయు నీకు జ్ఞాపకమువచ్చును. ఆమె చెప్పిన వృత్తాంతమిది: -

“మా పినతల్లి కసలు యిష్టములేనేలేదు. మా పినతండ్రియే చెల్లెలితో యోచించి పిల్లనిచ్చి పెండ్లిచేసినాడు. పిల్లవాడప్పుడు స్కూలుఫైనలు తరగతిలో చదువుచున్నాడు. పదునాఱేండ్లున్నవి. “తండ్రి రివిన్యూయిలాకా గొప్పహోదా గల నౌకరీలో నున్నాడు. భూస్థితిగూడా నున్నది. పిల్లవాడు చదువుచున్నాడు; చిన్నవాడు; చెల్లెలికుమారుడు, న్యాయమైన యుక్తమైన మేనరికము. కాబట్టి తండ్రివలె నేదియో గొప్పయుద్యోగము చేయునని గంపెడాశతో, మాబాబాయి వారియింటిచుట్టు తిరిగి తిరిగి పిల్లనిచ్చి పెండ్లిజేసినాడు బాహ్య మునకా సంబంధము ఉత్తమోత్తమ మైనదిగానే కన్పడుచున్నది. కానియిటు పిల్లతల్లియైన మాపిన్ని కాసంబంధమెంత సమ్మతముగా నున్నదో, అటుపిల్లవాని తండ్రియైన యాయున్నతోద్యోగికిగూడ అంతసమ్మతముగానే యున్నది. అయితే మా పిన్ని కిష్టములేకపోవుటకు కారణ మా సంబంధము మంచిది కాదనికాదు, "తండ్రికొడుకుల యిష్టమంతంత మాత్రముగా నుండ పిల్లనంత బలవంతముగా కట్టిపెట్టుటెందులకు? మనకు తగిన సంబంధమేదైన చూడరాదా? మనపిల్ల నిష్టపడిచేసికొనెడి వారికే యీయరాదా” యని యామె యభిప్రాయము. కాని మాబాబాయి ఆమెమాటను లక్ష్యపెట్టలేదు. 'ఆయన ఒప్పుదల ఎప్పుడట్లాగే ఉంటుంది. పెంకెవాడు. సరసముగా సమాధాన మీయడు. ఆయన స్వభావమది. అంతమాత్రముచేత మనపిల్ల కాపురమున కేమిప్రమాదమని' వియ్యంకుని విషయములోను "పసివాడు, వాడికేమి తెలుస్తుంది; ఇప్పుడు వద్దువద్దంటే మాత్రము మూడుముళ్లు పడ్డతరువాత పిల్లను యేలుకోక వెళ్లగొడ్తాడా యేమిటని” పిల్లవాడి విషయములోను సమాధానముచెప్పి వివాహము కావించినాడు. పెండ్లినాడే ఆపిల్లవాని వైఖరి యెడమొగము పెడమొగముగా నున్నది. అది చిన్నతనపు చేష్టయని మనస్సమాధానము చేసికొనినాము. ఏదోవిధముగా పెండ్లియైనది. తరువాత పిల్లను తీసికొని వెళ్ళుట, గృహప్రవేశము చేసికొనుట, మొదలైన తంతులు జరుగనేలేదు :

వివాహమైన ఒకసంవత్సరమునకు మా చెల్లెలు సమర్తాడినది. శాంతినక్షత్రము. శాంతి చేసికొనవలసినదని యెన్ని విధముల తెలియబఱచినను ప్రత్యుత్తరమే లేదు. తుదకు మా పినతండ్రియే స్వయముగావెళ్లి "శాంతిమాటేమని చెల్లెలి నడుగ, “అన్నయ్యా! నేనేమిచేసేది? వాడు నాఅదుపుశిక్షలలో లేడు. వాడికా తండ్రిగారు సహాయము. శాంతేమిటి సింగినాదము చేసుకోకపోతే యేమని యిద్దరు ఒక్కమాటగా పల్కుతున్నారు. ఏమిచేస్తాము? అయిననాటికే అవుతుంది. ఊరుకో” మన్నదట అంతటితో పులిమి పుచ్చుకొని మాబాబాయి యింటికి వచ్చినాడు.

మఱిరెండేండ్లు గడచినవి. పిల్లను తీసికొని వెళ్లెడియత్నమేలేదు. పిల్లవాడప్పుడు ఎఫ్.ఏ. ప్యాసయి బి. ఏ. చదువుచున్నాడు. పిల్లకు పదునై దేండ్లునిండి పదునాఱవయేడు అగపడినది. ఈడేరినబిడ్డ నెంతకాలమని యింట నుంచుకొందురు? ఒక వేళ తలిదండ్రులకు భారము లేకపోయినను లోకమునకు భారముగదా. "మీ అమ్మాయిని అత్తవారింటి కంపకుండా వూరుకున్నా రేమండీ" అని నిత్యమడుగు నమ్మలక్కలకు సమాధాన విూయలేక సగము వేసారిపోయినాము. ఏదో ముదుక సామ్యమున్నది వింటిరో, లేదో, కూతురింటికి మఱుగుదొడ్డికి అసహ్యపడుచునైనను పోకతప్పదట. ఆ విధముగానే పిల్లను పోషింపలేని పేదవారివలె మాబాబాయి పిన్ని యిద్దరు కలిసి పిల్లను తీసికొనిపొండి యనిచెప్పుటకు, వియ్యాలవారి యింటి కేగినారు, "మీ కోడలిని మీరు తెచ్చుకొను”డని బతిమలాడి చెప్పినారు. “నాపెత్తనములేదు, ఆతండ్రియిష్టము, ఆకొడుకు యిష్టము.” అని వియ్యపురా లనివేసినది. “పిల్లవాని నడుగుడు, వానికిష్టమైనచో నాకు యిష్టమే"నని వియ్యంకు డనినాడు. శీతకాలపు సెలవుదినములగుటచే అప్పుడు అల్లుడు గూడ నక్కడనే యున్నాడట. అతనినిచూచి “ఏమిరానాయనా ఎప్పుడు భార్యను తెచ్చుకుంటావు?" అని మేనమామ ముద్దుగానడుగ "నావద్ద ఆప్రస్తావన చేయవద్దని” గొడ్డలిపెట్టుగా ఒక్కమాట అనివేసినాడట. "అయితే ఆబిడ్డగతేమిరా అన "దైవాన్ని అడగండి నన్నడిగేదెందుకు? నన్నడిగే పెండ్లిచేశారా?” అన్నాడట. అంతటితో వారు నెత్తినోరు మొత్తుకొనుచు, వియ్యంకుని వద్దకుబోయి. “అయ్యో! ఈ అన్యాయ మేమిటి? మీరైనా చెప్పండి వింటాడేమో?” అనియడుగ “వాడు చిన్నవాడుకాడు, వాడిమంచిచెడ్డలు వాడెఱుగును; కాబట్టి వాడికాఁపురపు విషయములో నాకుజోక్యములేదు. వాడియిష్టము. మీ యిష్టము” అన్నాడట. అంతటితో హతాశులై "అలో” యని యేడ్చుచు వారు యింటికివచ్చినారు. నాటినుండి యాతనికి పరిచయులగు వారిచే నయమునను, భయమునను, చనవునను, స్నేహభావమునను దయా పురస్సరముగను, 'ఆపిల్లను దెచ్చుకొమ్మని చెప్పింప ‘నాకు వద్దు' అని యొక్కటేమాట.

"కారణమేమి, ఆపిల్లయందేదైన తప్పు కనిపెట్టితివా?

“లేదు”

"చక్కనిది కాదా?”

“నేను చెప్పలేను” "లేకపోయిన పునస్సంధాన కట్నమేమైన కావలెనా?"

"వద్దు”

“అయినచో నిరపరాధయగు నాబాలిక నకారణముగా నీవు విడనాడుటకు కారణమేమి?"

"ఏమో నేను చెప్పజాలను. ఆపిల్లయందునాకు భార్యావిషయ కానురాగము కలుగలేదు. కాన వద్దు”.

“ఏపాపమెఱుగని యాబిడ్డయందు నీవిట్లు నిర్దయుడవగుట తప్పుగాదా? నీవైనచో బుద్ధిపుట్టినప్పుడు మఱొక భార్యను పెండ్లాడుదువు. కాని నిరపరాధియగు నాబాలికకిక తరణోపాయమే లేదుగదా?"

“లేకపోవచ్చును. అది ఆమె తలిదండ్రుల లోపముకాని నాదికాదు. నా అయిష్టతను నేను నా వివాహకాలమందే సూచించితిని. ఆసంగతిని గమనింపకయే నాకు వారామెను గట్టిపెట్టిరి. కాన యామె సుఖము చెరచిన వారామె తలిదండ్రులేకాని నేనుగాదు. అట్టిజననీజనకుల కడుపున బుట్టినందులకామె యాదుఃఖ మనుభవింప వలసినదేకాని నేనేమి చేయుదును?"

“తల్లిదండ్రులు స్వతంత్రించి వివాహముచేయుట మనదేశములో ననాదిగ జరుగుచున్న యాచారము. ఆయాచారము మంచిదికానిచో నీబిడ్డలకు నీవట్లుచేయుట మానుము. కాని యొకతల్లిబిడ్డను నీ వీ విధముగా ఆ దురాచారమునకు బలిపెట్టవచ్చునా?” "వేయిమాటలతో నన్ను విసిగింపవలదు. నాకామె యక్కరలేదు. ముమ్మాటి కక్కరలేదు.” ఎందరెన్ని విధముల నడిగినను ఆతడిచ్చు సమాధానమిది, తండ్రి యాతనికి సహాయము.

ఈ విధముగా నెనిమిది వత్సరములు గడచినవి. అతడు బి. ఏ. బి. యల్. పరీక్షనిచ్చి చెన్నపురిలో నొకవత్సరము అప్రెంటిసు చేసి హైకోర్టువకీలు పట్టమునుబడసి స్వపురమునకు వచ్చి వకీలుపని చేయుచున్నాడు. వెనుకటి భార్యవిషయమై జాలి వారికెందుకు? ఎవరో కక్కుర్తి మనుష్యులువచ్చి నాలుగు సంచులు కుమ్మరించి పిల్లనిచ్చి పెండ్లిచేసినారు. ఆపిల్ల యేడాదిలోనే కాపురమునకు వచ్చినది. పసి నిమ్మపండువంటి కొమారుడుగూడ కలిగినాడు. అతని సుఖమేమో అతడు చూచికొనినాడు. కాని యీ భార్యవిషయమై మాత్ర మాతనికి యోచనయేలేదు. అతను సుఖముగా నున్నందుకు నేను విచారించుట లేదు. కాని యీ పతిపరిత్యక్త గతియేమి? కానీపెట్టి కొనిన కాయగూరనైన ఉపయోగ యోగ్యముగా నున్నంతవరకు విసిరి పాఱవేయముగదా! అట్టిచో అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్య నావిద్యాధికు డెంతసులువుగా పరిత్యజించెనో చూడుడు. ఆ కాయగూరలపాటి గౌరవమున కర్షగాదా? అగ్నిసాక్షిగా వివాహమాడిన కళత్రము! ఇట్టివాడు పెద్దమనిషి చదువరీ, పైన న్యాయవాది, స్త్రీలకు ధర్మశాసనముల సాయములేదు, లోక సానుభూతిలేదు, వైవాహిక స్వాతం త్ర్యము లేదు. బంధువర్గపు తోడ్పాటులేదు. సంఘసహకారము లేదు. ఇక నేమి చేయును? పురుషుని స్వార్థమునకు బలియై పోవును. మా చెల్లెలని నే నభిమానముతోఁ జెప్పుటలేదు. ఆ బాలిక యెంత యుత్తము రాలనుకొంటిరి? ఆ అమాయకమునకు ఆ సౌమ్య భాషణములకు, ఆ వినయసంపత్తికి, ఆవిద్యాసంపత్తి కామె శ్రీరామచంద్రుని యిల్లాలైన యా సీతమ్మకేసాటి. ఇల్లువదలి యీవలికిరాదు; ఎవరితోడను మాట్లాడదు; ఏ లోకాభిరామాయణములకు బోదు; ప్రపంచపుగొడవే యామె కక్కరలేదు. ఉన్నప్పుడు పని లేనియప్పుడు గ్రంథము. ఈ రెండే యామె కాలక్షేప సాధనములు. ఆమె యెప్పుడును పెద్దగా యేడ్చినట్లు చూడలేదు. కాని యావిశాల లోలలోచనముల యందు లజ్జాదుఃఖములు స్థిరనివాస మేర్పరచుకొనినట్లామె మ్లానవదనమును తిలకించినవారికి స్ఫుటముగా గన్పట్టుచుండును. ఆమె సాధారణముగా నవ్వనే నవ్వదు. ఒక వేళ నవ్వినను చిఱునవ్వే! ఆ నవ్వులోగూడ జీవములేదు, చూడు ఒక స్త్రీ జీవితమొక పురుషునిపై నెట్లు నిర్భరపడియున్నదో! ఒక స్త్రీ ప్రాణముదీసిన నేరముకంటె నొకస్త్రీ సుఖమును, సంతోషమును, ఉత్సాహోల్లాసములను నాశముజేసి జీవన్మృతురాలనుగాఁ జేసిననేరము బలవత్తరమైనది. కాని ప్రథమనేరమున కురిశిక్షవేయుదురు. కాని ద్వితీయనేరమునకు పరిశీలనయేలేదు. ఈ జీవన్మృత్యావస్థకన్న బలవన్మరణమే మేలనిగదా పెక్కుమందిస్త్రీ లే నూతిలోనో గోతిలోనోపడి చచ్చుచుందురు. ఇట్టి మరణములకు పంచాయతీసంఘము లే కడుపునొప్పియో మూర్ఛయో పిచ్చియో హేతువని నిరూపించినను పతి నిరాదరణమే యదార్థహేతు వనునది బహిరంగ రహస్యమేగదా! కాబట్టి నేనుచెప్పునదేమనగా పెనిమిటి చదువరి కాకపోవుటొక లోపముకాదు. కుంటిగాదు; గ్రుడ్డికాదు; నిరక్షరకుక్షిగాదు; పట్టభద్రుడే. అతడిట్లుచేయుటకు కారణమేమి? బాల్యవివాహ మనుటకంటె వేరేమి యనగలము! అంతియేగాదు, అబలయు ప్రతిక్రియా సామర్థ్యరహితయునగు స్త్రీయందు పురుషునకుగల యుదాసీనతగూడ యిందులకొక ముఖ్యకారణము.

ఈ మధ్య నీబాల్యవివాహ నిషేధచట్టమునుగూర్చి మాగ్రామముననొక సభజరుగ యీ బిల్లునకు ప్రతికూలముగ మాట్లాడిరట. అంతలో వృద్ధుఁడగు మాపినతండ్రి సభలో నిలిచి తనకొమార్తె దుఃఖగాధను సంతత కన్నీటిధారలతో నేకరువుపెట్టి “నాయనా, నేనుగూడ పూర్వాచార పరాయణుడనే, ఈ యనుభవమే కాకపోయినచో నేనుగూడ మీకంటె నెక్కువగ నెగిరిపడువాడనే; కాని స్వానుభవము నానోరు నొక్కినది. కాన యేబిల్లుకైన వ్యతిరేకింపుడు గాని వధూవరులకు వైవాహిక బాధ్యతనొసంగెడి యీ బాల్యవివాహ నిషేధ చట్టమునకు మాత్రము ప్రతికూలముగా తీర్మానములు గావించి యాడపిల్లలనోట మట్టిగొట్టకుడు. నూరేండ్లపంట. అంతయు మనదేనని నావలెనే బాధ్యతయంతయు నెత్తిపై వేసుకొని యనుకూలములేని వివాహములు గావించి యల్లాడుటకంటె చిఱకాలము కష్టసుఖద్వందమగు సంసారయాత్ర సాగింపవలసిన వధూవరులకు కొంచము యుక్తవయస్సు వచ్చినమీదట వారి సమ్మతినిగూడ కనుగొని వివాహములు గావించుట క్షేమకరము. శాస్త్రము లనుకూలముగా నున్నవి. ప్రభుత్వమనుకూలముగానున్నది. యువతీయువకు లనుకూలముగానున్నారు. కాన ఆచారముకొరకు చావబోవుచున్న ముసలితొక్కులము మనము ప్రతికూలముగానుండి చేజేత నాడుపిల్లలనేల నన్యాయము చేయవలెను?" అని నమస్కరించెనట. అంతటితో నా తీర్మానమునకు ప్రతికూలముగానున్న పెద్దలనేకు అనుకూలముగా తలయూచిరట. కాన మనస్త్రీ సంఘక్షేమమును కోరువారమైనచో శారదాబిల్లు నామోదింపక తప్పదు” అనియామె చెప్పెను.

ఆ వృత్తాంతమును వినగనే యంతవఱకు శారదాబిల్లుకు ప్రతికూలముగా వాదింపుచున్న తూర్పుగోదావరి ముసలమ్మ "అవును మగవాడు స్వతంత్రుడు. ఆడది అథవస్థపడి కుంటికిచ్చినా గ్రుడ్డికిచ్చినా ముసలికిచ్చినా రోగికిచ్చినా సహించి కాపురంచేయాలి, కాస్తంత నెపంపెట్టి పెళ్ళాన్ని వదిలపెట్టి మళ్లీ పెండ్లాడితే యేడుస్తూ వూరుకోవాలి మఱి? దీనికి తరణోపాయములేదు. ఉభయులు యిష్టపడి చేసుకుంటే యిలా జరగదనుకుంటాను” అనినది. ఇంతలో మాబండి ఒంగోలు దాటినది. మా బండిలోకి మరికొందరు క్రొత్తస్త్రీ లెక్కిరి. వారిలో నొకామె "అవునండి, ఎటువంటి అవిటివాడికిచ్చినా హర్షముతో ఆమోదింపవలసిందే, కాదంటే లోకంలో తలయెత్తరాని అప్ర తిష్ఠ. మీరుచెప్పినట్లు వంకలేని బిడ్డనిచ్చి పెండ్లిచేసినప్పుడే విడనాడుటింత సులువైనప్పుడు కుంటిదనీ గ్రుడ్డిదనీ రోగిష్టియనీ అనాకారియనీ వంధ్యయనీ భార్యను వదలినవారెందరో విచారించండి. ఆడదిమాత్రము పుట్టుగ్రుడ్డికిచ్చినా కిమ్మనరాదు. వింటిరోలేదో నాపెనిమిటి పుట్టంధుడు" అనెను. “అట్లాగా పాపము! అటువంటి పుట్టుగ్రుడ్డి కెట్లాయిచ్చారండీ!” అని అందఱమొక్కమారుగా నంటిమి. ఆమె చెప్పసాగినది. ఆ చరిత్ర ముందు వ్రాసెదనులెమ్ము.


భావపురి

ఇట్లు

1928 నవంబరు

శారద.