శారద లేఖలు (మొదటి సంపుటము)/4-వ లేఖ
సౌభాగ్యవతియగు కల్పలతకు:-
నెచ్చెలీ,
మాసము దినములనుండి నా కొకటే రైలుప్రయాణము. అందువలననే నీకు జాబు వ్రాయుటకుగూడ వీలైనది కాదు. నీవు రెండుత్తరములు వ్రాసినను ప్రత్యుత్తరము వ్రాయకపోతిని. ఏమనుకొనుచుంటివోయని పలుమా ఱనుకొంటిని. కాని భుజించినచోట నిద్రింపక, నిద్రించినచోట భుజింపక నిరంతరప్రయాణము చేయుచున్న నేను నీకు జా బెట్లు వ్రాయుదును? కాన ఉత్తరము వ్రాయునప్పుడు నా యలసత్వమునకు క్షమింప వేడుకొనవచ్చునని మిన్నకుంటిని . జాబునకు జవాబువ్రాయక స్వస్తివాచకములు చదువుచున్నదని మిత్రమా, నాపై కినియకు. నీకు జాబు వ్రాయకపోయినను ఈ నెలదినముల రైలుప్రయాణములో నీకు పదిజాబులు వ్రాయజాలు పదార్థమును సేకరించుకొని వచ్చితిని సుమా! దాదాపు పగలు ఒంటిగంటవేళ మేము గూడూరులో తిరుపతిబండి దిగి చెన్నపురినుండి వచ్చు ప్యాసింజెరు నెక్కితిమి. నేను కూర్చుండిన స్త్రీలపెట్టెలో దాదాపు పదునాఱుమంది స్త్రీ లుండిరి. వారంద ఱొక్క కులమునకుగాని మతమునకుగాని భాషకుగాని చెందినవారుకారు. ఒకవైపున వైష్ణవస్త్రీ లిద్దఱు కూర్చుండి అరవమున మాట్లాడుచుండిరి. మఱియొక దిక్కున దత్తమండలమునుండి వచ్చు మధ్వస్త్రీ లిరు వురు “హాకు బేకు” మనుచు కన్నడమున మాట్లాడుచుండిరి. మఱొక బల్లపై దేశస్థ బ్రాహ్మణస్త్రీలు మువ్వురు కూర్చుండి “హైస్ బైస్" యని మహారాష్ట్రమున మాట్లాడుచుండిరి. వేరొకదిక్కున మహమ్మదీయస్త్రీలు నల్వురు కుతకుత నుడికి పోవుచున్న యా మధ్యాహ్నపుటెండలో తెగమాసిన యా మేలిముసుగు దుప్పటులు కప్పుకొనజాలకయు తీసివేయజాలకయు కులస్థుడు కనపడగనే ముసుగును దిగదీసికొనుచు, వెళ్లగనే యెగదీసికొనుచు "కౌనుసీగామ్ గయే, కహసే ఆతీహా" అని ఒకరినొకరు ప్రశ్నించుకొనుచు మాట్లాడుచుండిరి. తక్కినవారు మన తెలుఁగువారు. భాషాపరిచయము కాని యా యపరిచితలతో నేటి ప్రసంగమని చేతిలోనున్న నాటి యాంధ్రపత్రికను తిరుగవేయుచు నేనుగూడ నొకవైపున గూర్చుంటిని. రైలు గూడూరు విడిచెను. బండిలోనివా రెక్కడివా రక్కడ సర్దుకొని కూర్చుండి పరస్పర సంభాషణల కుపక్రమించిరి. ఒక మహమ్మదీయస్త్రీ హిందూస్థానీభాషలో మీ దేయూరని దేశస్థ బ్రాహ్మణస్త్రీల నడిగెను. మాది యిందోరు రాజ్యమని వారనిరి. ఇందూరుమాట వినగానే యీమధ్య జరిగిన శర్మిష్ఠాకల్యాణము జ్ఞాపకమువచ్చి వారితో ప్రసంగింపవలెనని నాకు కుతూహలము కలిగెను. అంత చదువు చున్న పత్రికను ముడిచి, వచ్చియు రాని హిందీముక్కలతో “ఈమధ్య దొరసానిని పెండ్లాడినది మీదేశపు ప్రభువేగదా” యని నేను వారి నడిగితిని. “అవున"ని వారనిరి. "చాల ఆశ్చర్యకరమైన సంగతి” యని నేనంటిని. "పదిరూపాయ లాసచూపగనే పాశ్చాత్య క్రైస్తవస్త్రీ హిందూ మరాటాస్త్రీగా మారు టాశ్చర్యము గాదా” యని వారు నవ్విరి. “ఆయన కిదివఱ కిద్దఱు భార్యలున్నారట గాదా” యని నే నంటిని. “ఇద్దఱుగాదు ముగ్గుర"ని వారనిరి. ముగ్గురా అని నే నాశ్చర్యముతోడను సందేహముతోడను బ్రశ్నింప “ముంతజుబేగ మొకభార్య యుండలేదా? దానితో ముగ్గురని” నవ్విరి. “సరిసరి అట్టిభార్య ఆమె యొక్కతేయని చెప్పుటెట్లు? ఎందఱున్నారో, దాని కేమిగాని మీరాజు రాజ్యచ్యుతుఁడు గదా” యని నే నంటిని. “అవును. ఆయన కిరువదేండ్ల వయస్సుగల కొడుకున్నాడు, ఆయన యిప్పుడు రాజు” అని వా రనిరి. "తుకోజీ హోల్కారు కెంత వయస్సుండు"నని నే నంటిని. "సుమారు నలుబదైదేండ్లుండవచ్చు”నని వారనిరి. “అహో! కాంతా మోహ"మని, నే నాశ్చర్యముతో నవ్వితిని. తెల్లపిల్లిని నల్లపిల్లిగా మార్చినందుకు స్వాములకిచ్చిన సంభావన తొంబదివేలనిగూడ వారే చెప్పిరి. అందు అతిశయోక్తులుగూడ కొంత యుండెనేమో కాని కొంతయైన నిజమే యనుమాట మనము పత్రికలలో చదివిన విషయములనుబట్టి నిశ్చయింపవచ్చును గదా యని నే ననుకొంటిని. మే మిట్లు ప్రసంగింపుచుండ నా ప్రక్కను గూర్చుండిన యొక స్త్రీ యేమి మాట్లాడుచున్నారని నన్నడిగెను. శర్మిష్ఠాకల్యాణమునుగూర్చి నేను పత్రికలలోఁ జదివిన విషయముల నామెకు జెప్పితిని. అంత నొక వృద్దురాలు నా దిక్కుమొగమై “పద్నాలుగేండ్లు నిండితేనెకాని ఆడపిల్లలకు పెండ్లి చేయరా దని మన దేశంలోగూడ శాసనం వస్తున్నదట గాదా” అని నన్నడిగెను. అవునని నేనంటిని. “ఏమి కానికాలం వచ్చిందమ్మ! అన్నేండ్లు పెంచితే పిల్ల పెద్దమనిషికాదా?” అని యామె యడిగెను. “కావచ్చు”నని నేనంటిని. "అయితే బ్రాహ్మణీకం బండలైపోయినట్లేగా, శూద్రులతోపాటే మనమూను?" అని ఆమె కోపముగా బలికెను. నేనేమియు మాట్లాడలేదు. ఇంతలో ఒక లేబ్రాయపు వితంతువు అందుకొని "పోతేపోనీ పదునాలుగేండ్లయినా రాని పిల్లకు పెండ్లేమిటి? అయిదేండ్ల కుంకకు పెండ్లిచేశారు. ఇట్లా ముసుగేసుకొని యేడుస్తున్నాను. అయినదేమో అయినది. ఇక ముందు వాండ్లకైనా న్యాయం జరిగితే అంతేచాలు” అనెను. “పిచ్చిదానా, ఎవరికర్మము వారిది. ఎవరి నొసటివ్రాలు వారిది. పద్నాలుగేండ్లకు పెండ్లిచేస్తేమాత్రము విధవరికము తప్పుతుందా” అని వెనుక ప్రశ్నించి నామె పలికెను. “పదునాలుగేండ్లలోపు వైధవ్యమైన తప్పుతుంది గాదా? పెనిమిటిసంగతీ పెండ్లిసంగతీ కొంచెమైనా బోధపడుతుందిగాదా? ఇపుడు యే మట్టీలేదుగా, నామట్టుకు నాకు అయిదోయేట పెండ్లిచేశారుట. ఆ తరువాత మూడునెలలకే ఆ పిల్లవాడు పోయినాడట. నాకు ఆ పెనిమిటిపోలికైనా గుర్తులేదు. ఇది న్యాయమని విూరంటారా?” అని యా వితంతువు పలికెను. ముసలమ్మ నిరుత్తరయయ్యెను. ఇంతలో మఱొకస్త్రీ అందుకొని "దేవుని దయవల్ల ఆ శాసనము రావలసినదే; అపుడుగాని యీ తల్లిదండ్రుల ఆటలు కట్టువడవు. రామ! రామ! తల్లి దండ్రులు ఆడపిల్ల నెంత అన్యాయము చేస్తున్నారు? అమ్ముకోవడము, అప్రయోజకుడి కియ్యడము. బదులుకు బదులిచ్చి చేసుకోవడము. ఒకటా అకృత్యము? ఆడపిల్లంటే అమ్మా నాయనలచేతి చెలామణి నాణెము; కాకపోతే పుచ్చినవక్క, చిల్లిగవ్వ, ఎంత నిస్సారం” ఇట్లనుచుండగా నామెకన్నుల నీళ్లు గిఱ్ఱునదిరిగినవి. పలుకులు గద్దదికమైనవి. ఆ స్థితినిజూడ తల్లిదండ్రులచే నామెగూడ నేదియో సంసారపు కష్టమునకు లోనైనట్లుగా నాకు దోఁచెను. ఆమె వృత్తాంతమును పూర్తిగా నెఱుగవలెనని యూహించితిని. కాని యామె నెట్లడుగనగునో, ఏమడిగిన నేమనుకొనునో యని క్షణమాత్ర మాలోచించితిని. తుదకు యేమైన ననుకొననిమ్ము చెప్పిన విందును. చెప్పకున్న నూరకుందును. అడిగిన తప్పేమియని సాహసించి "అమ్మా మిమ్ములనుచూడ చాల కష్టపడినవారుగా గన్పట్టుచున్నారు. తల్లిదండ్రు లనాలోచితముగా గావించిన వివాహమే మీ కష్టములకు కారణమని యూహ గలుగుచున్నది” అని నేను పిఱికిపిఱికిగా వ్యత్యస్తముగా నడిగితిని.
“తల్లికి నేను నోచుకొనలేదు. తండ్రిచేసిన యువకారము వల్లనే యిట్లా అల్లాడుచున్నాను.” ఆమెకు మరల కన్నులనీళ్లు క్రమ్మెను. పైట చెఱగుతో నద్దుకొనెను. ఆమె యిచ్చిన జబాబువలన నాప్రశ్నకు సుముఖయైయున్నట్లు నాకుదోచెను. కాన"పాపము! మీకు తల్లి చిన్నతనముననే పోయినదా? ఆడఁది చేసికొనిన పాపములలో చిన్నతనముననే తల్లి కఱవగుటొక పెద్దపాప”మని నేనంటిని. “అవును, మాతల్లిపోవునప్పటికి నావయస్సైదేండ్లు, మా పెద్దక్కయ్యకు పద్దెనిమిదేండ్లు, మా చిన్నఅక్కయ్యకు పదైదేండ్లు, మాపెద్దన్నయ్య పదిరెండేండ్లవాడు, మాచిన్నన్నయ్య యెనిమిదేండ్లవాడు. అప్పటికే మాఅక్క లిద్దఱు కాపురమునకు వెళ్ళినారు. మాపెద్దన్నకు వడుగైనది. తక్కిన పసికూనలమైన మమ్ము కష్టపరంపరలకు గుఱిచేసి మాతల్లి చనిపోయినది. మా నాయనకప్పటి కేబదేండ్లున్నవి. తల పులగము పదునుగా నెఱసియున్నది. అప్పటికి మా పెద్దక్క కొక కొడుకుగూడ పుట్టియుండుటచే తాత గూడయైనాడు. న్యాయమున కాయన వివాహము మాట మనస్సునగూడ స్మరింపరాని సమయమది. అయిననేమి. పాపిష్ఠి లోకము పెండ్లము చావగనే మగవానిని పెండ్లికొడుకును జేయుచుండునుగదా. “నాయనా! వచ్చేది పెత్తనము. ఇంట్లో ఆడదిక్కులేకపోతె ఎట్లాజరుగుతుంది? కోడళ్లు కూతుళ్లు ముప్పుగడుపుతారా? చేసుకున్నదానికంటే తప్పదు. ఏదో పదిరూపాయలు కర్చైనా ఒకచిన్నదాన్ని ముడిపెట్టుకుంటే సరిపోతుంది.” అని బంధువులలోను పరిచయులలోను పెద్ద పెద్దలందఱు పదే పదే సలహా చెప్పుట సాగించినారు. భార్యచావగనే పెండ్లాడుద మనెడి కోరిక మనదేశములో ప్రతివానికి, అందులో యేండ్లుచెల్లినవాని కుండుట సర్వసాధారణమే కదా! మగడు చావగనే మగువ వాంఛ లేవిధముగా నడుగంటిపోవునో మగువ చావగనే మగవాని కోరికలావిధముగా నీరిక లెత్తుచుండును. భర్తృహీన పసిదేయగుగాక, యామెవాంఛ లడవి పువ్వులవలె నిరుపయోగముగ రాలిపోవలెను. కళత్రవిహీనుడు వృద్ధుడేయగుగాక, వాని వాంఛలు మ్రోడు మ్రాకున చిరువులెత్తినట్లు చిగిరించవలెను. ఇది యెట్టి న్యాయము? బాలవిధవ వైరాగ్యమునకు సిద్ధపడవలెనా? నష్టకళత్రుఁడగు వృద్ధుడు భోగలాలసతకు సిద్ధపడవలెనా? ఆ పసిదాని మోమున భస్మరేఖలును నీ ముసలివాని మోమున చాదుచుక్క_యునా? అయ్యో! ధర్మాధర్మ విచక్షణ లోకములో నడుగంటినదనుట కీతార్కాణము చాలదా? వివరింప సాధ్యముగాని యా దురన్యాయములనుగూర్చి మనలో మన మూహించుకొనిన చాలును. న్యాయము మనకే తెలియును. అదియట్లుండె. వెఱ్ఱిధోరణిలోబడి విషయము మఱచితిని. మా నాన్న పెండ్లికి సిద్ధమైనాడు. కన్యాన్వేషణ మారంభించినాడు. బహుయత్నముమీద, బహు ధనవ్యయమువిూద, బహు దారుణపు టేర్పాటులమీద నొక కన్య లభించినది. తలిదండ్రు లాకన్యను మా నాన్నకిచ్చుటకు కొన్ని షరతులను కోరిరి. అవి యేవియనగా తమ కన్యను మా నాన్న కిచ్చుటకు నన్ను తమ కొమారునకు బదులియ్యవలెను. మఱియు తమకు వేయిరూపాయలు కన్యాశుల్కముగూడ నీయవలేను. ఈ యుభయవివాహములను తన కర్చుతో తన యింటనే మా తండ్రి జరుపుకొనవలెను. అంతియేగాక మా యిరువురకును వేయిరూపాయలకు తక్కువగాని నగలను మా నాన్న పెట్టవలెను. మా తండ్రి యన్నిటికిని యొప్పుకొనెను. వివాహము జరిగెను. మా తండ్రి యప్పటికి కొంచెము స్థితి మంతుడేగాని యా వివాహములతో నతఃపాతాళమునకు క్రుంగిపోయెను. నిండు వార్థక్యమున వివాహఫలముగా మానాయనకు మిగిలినవి యూరినిండ నప్పులు, భార్యతోడి తిప్పలు—యివి రెండే! ఇకతరువాత నప్పులు మెండై భార్యతోడి పోరాటమధికమై విద్యాబుద్ధులు చెప్పింపలేమి మా యన్నలిరువురు దేశద్రిమ్మరులైరి. రమ్ము పొమ్మనువారు లేమి మా యక్క లిద్ద ఱింటికి దూరమైరి. ఇక దిక్కుమాలి చిక్కిన మా చెల్లియు నేనును మా సవతితల్లి చేతిక్రింది బానిసీలమై పడరాని బాధలుపడితిమి. ఇఁక నా దొక్కముక్కచెప్పి ముగించెదను. నా పెండ్లినాటికి నా పెనిమిటికి పదునాఱేండ్లున్నవి. ఆయన యప్పటికే జేనెడుచుట్ట నోటితో, మూరెడు కుచ్చు తలపాగతో, నూరియందలి కొంటె కోణంగులకు మొదలై విద్యాబుద్ధి సంపన్నులగు యోగ్యబాలకులకు వెలియై తిరుగుచుండెను. ఆయన కిక పెండ్లి గాదని యెంచియే తలిదండ్రు లావిధముగా తమ గాదిలి కుమార్తె సుఖమును పణముగానిడి నన్ను బదులుగాగొని పెండ్లిగావించిరి. కూతుండ్ర కాపురము కూలద్రోచియైన కొమరుని నొక యింటివానినిజేయు దురాచారము మనదేశమున ననాదినుండి యున్నదేగదా! కొమరుడే వారిబిడ్డ, వానిక్షేమము విచారింప వలయుటే వారి ముఖ్య కర్తవ్యము. అందుకు కుమార్తెను బలిగావించుట వారి కొక తప్పుగాదోచదు; కడుపున బుట్టిన బిడ్డయైనను నాడుదియైనంత మాత్రమున నెంతనిర్దయయో కనుడు! చెప్పెడిదేమనగా నేను యుక్తవయస్కురాలనగు నప్పటికే నా పెనిమిటి సప్తవ్యసన ములఁ జిక్కుకొని యున్నసొమ్మును పాడుజేసికొని చేత నెఱ్ఱని యేగానిలేక మోసములు, దొంగతనములు, దౌర్జన్యములు చేసి, శిక్షలపాలై పడరానిపాట్లు పడెను. నేను పెద్దదాననైన తరువాతగూడ నన్నొకమారైన తనవద్దకు తీసికొనిపోలేదు. పైగ రెండు మూడు మాఱులు మా యింటికేవచ్చి నన్ను తిట్టియు కొట్టియు, బెదరించియు, నా వంటిమీదనున్న నగలు నాల్గుగూడ నూడ్చుకొనిపోయెను. కష్టమో సుఖమో మీరున్న చోటనే నేనుగూడనుందును. తీసికొనిపొండని కాళ్ళు కడుపులు పట్టుకొని బ్రతిమలాడితిని. ఇదిగో నదిగోయని దినములు గడుపుటయేగాని తీసికొని పోవనేలేదు. ఇఁకనేమిచేయుదును? పుట్టినింటి బానిసత్వము స్థిరమైనది. దుఃఖము శాశ్వతమైనది. అట్లెపడియున్నాను. ఇప్పుడా బానిసత్వమునకు గూడ ప్రాప్తిదీరినది. ఏలనందురా మా తండ్రిగారు గతించి పదిమాసములైనది. ఋణదాతలు యిండ్లు భూములు కట్టుకొని పోయినారు. పోగా మిగిలిన దేకొంచెమో చేతబట్టుకొని “నా బిడ్డ లిద్దఱకు నాకు రోజులు గడిస్తే అంతేచాలు. నీ కెక్కడతెచ్చి పెట్టగలను? నీదారి నీవు చూచుకొమ్మ"ని నాసవతితల్లి నన్ను సాగనంపినది. ఆమె వృత్తిగూడ నుత్తమముగా నుండక పోవుటచే నాకుగూడ నక్కడ నుండుట దుస్సహముగానే యుండెను. ఆమె వెళ్ళిపొమ్మనుటయే యొకవిధముగా మేలనుకొంటిని. కాని యెక్కడకు వెళ్లను ? ఇప్పటికి ముప్పదేళ్ళు నిండినవి. తండ్రి యిల్లుదప్ప వేఱుయిల్లె ఎఱుగను. నా సమస్తము పోయినను పోక నిలచినదొక్క యభిమానము. ఆయభిమానముచేత నీచమునకు పాలు వడలేక నెవరియింటికిని బోలేక యీ విధముగా దుఃఖపడుచున్నాను. నా పెనిమిటి బొత్తిగా కనపడకుండపోయి రెండేండ్లయినది. మరల ఆయన జాడ తెలియలేదు. బైరాగులలో కలిసెనని కొందఱును, స్వాములవారితో తిరుగుచుండెనని కొందఱును, సర్కసుకంపెనిలో చేరెనని కొందఱును, చెప్పుచున్నారు. ఎంతవఱకు నిజమో తెలియదు. పదిరోజులనాడు తిరుపతిలో చూచితిమని మావూరిలో తిరుపతియాత్రకు వెళ్ళివచ్చిన వారొకరుచెప్ప నీవంటి తల్లివద్ద నాల్గురూపాయలు తీసికొని యిట్లుపరుగెత్తి వచ్చినాను. తిరుపతిలో కన్పడలేదు. కాళహస్తిలో గన్పడలేదు. మరల వెళ్ళిపోవుచున్నాను. కావలివద్ద పల్లెలో మా చెల్లెలున్నది. దాని పెనిమిటి కక్కడ పదైదురూపాయల మేష్టరీపని. వారికే పొట్ట గడవకున్నది. నా కేమి పెట్టగలరు? పెట్టెదరే యనుకొనుడు. యేమని వారింట నుందును? ఉండక నెక్కడకు వెళ్లను? ఆశ్రయములేని తీఁగవలె” అనునప్పటికి ఆమెకు కన్నులనిండ నీళ్ళు వచ్చినవి. దుఃఖభారముచే మాటాడజాలక తలవంచుకొనినది. ఆమెస్థితి జూచుటచే ఆ బండిలోనున్న మా కందఱకుగూడ కన్నులనీళ్ళు క్రమ్మినవి. కొంతసేపందఱము పరస్పరాలాపములులేక నివ్వెఱ జెందినట్లుండిపోతిమి. అప్పుడామె దుఃఖము నుపశమింపఁజేసికొని కన్నీటిని పైఁటచెఱగుచే తుడుచుకొని "అమ్మా నాపాడుచరిత్ర మీకు చెప్పదగినదికాదు. మీ సంతోష ప్రపూర్ణ చిత్తములు నాకష్టగాథ నాలించుటచే శోక భరితములగును. నా యేడుపు నాకు సర్వదానున్నదే. మిమ్ముగూఢ నేల చింతింపఁజేయవలయును? కాని యీ వివాహ శాసనవృత్తాంతము కొంచెముగా వినియుండుటచే ప్రతికూలుర వాదనను ఖండించుటకే నా చరిత్రను జెప్పితిని. పిల్లకు యుక్తవయస్సు వచ్చువరకు పెండ్లిచేయకున్నచో పిల్లయనుమతిని పెండ్లిచేయవలసి వచ్చుననియు, అవ్యక్తురాలగుబాలిక చక్కనివాఁడు కావలెననియు చదువుకొనినవాడు కావలెననియు, తంటాలుపెట్టుననియు, పిల్లకు తెలిసియు దెలియని ప్రాయమగుటచే బాధ్యత నెఱుగక, స్థితినెఱుగక, కోరరాని కోరికల గోరుననియు, ఆవిధముగా కన్యను మెప్పింపగల వరుని దెచ్చు టసాధ్యమనియు, కాబట్టి ఆడుపిల్లల వివాహ బాధ్యత తలిదండ్రుల చేతిలోనే యుండుట యుక్తముకాని పిల్లల కొప్పగించుట ప్రమాదకరమనియు, పెక్కురు వాదించుచున్నారు. నా తండ్రికాని నా పెనిమిటి తలిదండ్రులుగాని తా మేమాత్రము బాధ్యత నెఱిగి మా వివాహములు చేసిరో యోచింపుడు? నా యత్త మామలు అప్రయోజకుఁడగు కొమారునకు పెండ్లిసేయుటకు కడుపారగన్న కొమార్తెను ముసలివానికిచ్చిరి. కూతురుకాపురమటులయ్యె, కొమరుని కాపురమిటులయ్యె. ఇక మాతండ్రియో వార్థక్యమున పెండ్లి కాసపడి తనకాఁపురమును పాడుజేసికొనుటయేకాక నన్నుగూడ బలిబెట్టెను. మాకే యధికారమున్నచో నట్టి ముసలివానిని యామెగాని యిట్టియయోగ్యుని నేనుగాని వరించి యుందుమా? ఇది తలిదండ్రులు బాధ్యత నెఱుగకుండఁ జేసిన యక్రమకృత్యముగాదా? తల్లులారా! ఈదేశమున యిది నాయొక్కరిత చరిత్రమేగాదు. ఇట్టి వివాహము లసంఖ్యాకములుగా మనదేశమున నిత్యమును జరుగుచున్నవి. ఇట్టి యక్రమ వివాహ ప్రవాహమును నాపుటకే నేను హరవిలాసశారదాగారి బాల్యవివాహ నిషేధచట్టము నాహ్వానించుచున్నాను. నేనేగాదు. దయార్ద్రహృదయులగు స్త్రీ పురుషులెల్ల రీబిల్లు నాహ్వానించెదరుగాక యని కోరుచున్నాను. అంతియే గాక నలుబదేండ్లు మించిన పురుషుడు వివాహమాడ రాదనియు, అధవా చేసికొనినచో బాలికల జేసికొనరాదనియు గూడ నేమహనీయుఁడైన శాసనము దీసికొనివచ్చినచో స్త్రీలోక మామహనీయుని కలకాలము కృతజ్ఞయై స్మరింపగలదు. దీనిసంగతి యిట్లుండనిండు. ఇది భవిష్యద్విషయము. ఇప్పుడీ బాల్యవివాహ శాసనము విషయమై మనస్త్రీ లుపేక్షా భావముతోఁ జూడరాదు. స్వార్థచింతచే పురుషులు దీనికి ప్రతికూలురుగానుండ రజస్వలాభయముచే స్త్రీలు దీనికి వ్యతిరేకలగుట మనగోతిని మనము త్రవ్వుకొనుట సుమా. పిల్లలు పద్నాలుగేండ్ల వఱకుంచినచో ఈడేరరా? అని అవ్వగారు భయముతో అడిగినారు. తగిన వరులు లభింపక కన్నెలను పదునాలుగేండ్లవఱకుంచినచో నాపిల్ల లీడేరకుండిరా? చాటునకు సంఘపు తోడ్పాటును, బహిరంగమునకు బహిష్కారమునా? ఇంతకు మనకు మన శాస్త్రములు ప్రతికూలముగాలేవు. ప్రతికూలముగా నున్నది యాచార ఛాందస శ్రోత్రియ సం..... రైలు కూయని కూసినది. కావలి స్టేషను వచ్చినది. 'అమ్మా సెలవు' అని నమస్కరించి యామె దిగిపోయినది. చెప్పదలచిన విషయము పూర్తికాకపోయెనే యని నేను విచారించితిని. 'పాపము చాలా కష్టాలుపడిన మనిషి' అని యొకామె యనెను. 'ఎల్లకాలము దుఃఖపు బ్రతుకే కావడంవల్ల ఆమెబుద్ధి వైశద్యము వెల్లడి కాకున్నదిగాని చాలతెలివిగలది కూడాను' యని మఱియొక స్త్రీ యనెను. 'చదివిన దానివలెగూడ నున్నదని' వేఱొకామె బలికెను. 'ఏమిచదువుకుంటేనేమి ఎంత తెలివుంటేనేమి అటువంటి మొగుడు! అటువంటి పుట్టిల్లు! ఆమె తెలివితేటలేమి జేయను? అడవిని గాచిన వెన్నెల' అని వేరొక నారీమణి పలికెను. 'ఏదో భగవంతుండు ఒక్కొక్కళ్లమొఖాన అటువంటి అగచాట్లవ్రాత వ్రాస్తూవుంటాడు.' అనిమఱియొకస్త్రీ విచారముదోఁ బలికెను. 'ఇంతకును మొగుడు చదువుకొన్నవాడు కాకపోవడ మొక గొప్ప కొఱత. ఏదో కొంచము అక్షరజ్ఞాన మున్నవాడైతే యిట్లా చేయడని' యింకొకామె రూఢిగాయనెను. 'ఎబ్బె, యిదివట్టి భ్రమ, చదువుకున్న వాడైతే అట్లాచేయడనీ, చదువుకోని వాడైతే చేస్తాడనీ యనుకోడం పొరబాటు. మా పింతల్లి అల్లుడు బి.ఏ. ప్యాసయినాడు. మేనల్లుడేగాని పరాయివాడు కూడాగాదు. యేమిచేశా డనుకొన్నారు?' అని నెల్లూరు స్టేషనులో మాబండిలో కెక్కిన మరియొక యువతి పలికినది. 'ఏమిచేశాడు? ఏమిచేశాడు?' అని మాబండిలోని స్త్రీలెల్ల రొక్క పెట్టున నడిగిరి. ఆమె మఱొక కథ చెప్పుట కారంభించి నది. ఒక్క విషయమై ప్రస్తావన వచ్చినదానిపై నూరు వృత్తాంతములు వాకొనుట మనస్త్రీలకున్న నైజమేగదా; ఆమె చెప్పినదిగూడ నొక దీర్ఘకథ. ఇప్పటికే లేఖ కడు దీర్ఘమైనది. వ్రాయుటకునాకు విసువు లేకపోయినను చదువలేక నీవెక్కడ విసుగు కొందువోయని నాభయము. విరమించుచున్నాను. పైకథకు ముందులేఖను కనుము.
భావపురి
మిత్రురాలు.
1928 సెప్టెంబరు
శారద