Jump to content

శారద లేఖలు (మొదటి సంపుటము)/3-వ లేఖ

వికీసోర్స్ నుండి

సౌభాగ్యవతియగు కల్పలతకు :—

నెచ్చెలీ, ఒక శుభసమాచారము. ఏ కవయిత్రీమణి వాగమృతముల సెవులార గ్రోల ఖండ ఖండాంతర వాసులెల్ల రభిలాషతో నెదురుజూచుచుందురో, ఏవిదుషీమణి విమల వాగ్ఝరి ప్రవహించిన తమకష్టములెల్ల గొట్టుకొనిపోవునని వలస రాష్ట్ర భారతీయు లాసతో నాహ్వానింపుచుందురో ఏసాధ్వీమణి గంభీరోపన్యాస మాలింపవలెనని భారతీయులెల్ల రనిశ ముత్కంఠపడుచుందురో అట్టి సుప్రసిద్ధకవయిత్రియు, విదుష మణియు నారీరత్నమునునగు శ్రీమతి సరోజినీదేవిగారి మహత్తరోపన్యాసమును ఈనెల 28 - 4 - 28 తేదీని మదనపల్లియందు వింటిని. నీవు వినలేదని యనుకొంటిని. లేఖామూలముగా దెలుపవచ్చును గదా యని మరల తృప్తిగంటిని.

ఈ పురము నందలి హిందూ స్త్రీసమాజమువారి యాజమాన్యమున పైసభ జరుపఁబడినది. నెమలి పట్టాభిరామరావు పంతులుగారి కొమార్తెయగు శ్రీమతి పద్మాసనీదేవి (బి.ఏ.,) గారు నాటిసభ కగ్రాసనాధిపురాలు. సమావేశమైన స్త్రీలు కొద్దిమందియైనను, వచ్చిన స్త్రీ లెల్లరు దాదాపుగా నాంగ్లభాషా పరిచయము లేని తెలుగు స్త్రీలేయైనను, శ్రీమతి సరోజినీ దేవిగారు మిక్కిలి శాంతముతో స్త్రీలకు సంబంధించిన పెక్కు విషయములను గుఱించి యుపన్యసించిరి. దేవి చెప్పిన ప్రతివాక్యమును నొక మహనీయుఁడు తెలుఁగుచేసి చెప్పెను. శ్రీ సరోజినీదేవిగారి యుపన్యాస సారాంశ మీవిధముగనుండెను.

"సోదరీమణులారా!

నేను నా కొమార్తె కనారోగ్యముగా నుండుటచే నిక్కడకువచ్చి యుంటిని. నేను వచ్చిన సందర్భము సంతాపకరమైనదేయైనను మిమ్ములనందఱను గలిసికొనుట సంభవించుటచే నాకు మిగుల సంతోషకరముగా నున్నది. నేను తెలుఁగుదేశపు స్త్రీని కాకపోయినను మీభాషా పరిచయము నాకు లేకపోయినను నేనుగూడ మీస్త్రీజాతికిఁ జెందిన దాననగుటచే మీకును నాకును సన్నిహిత సంబంధముగలదు. మీ సమాజ స్థాపకురాలగు కజిన్సుదొరసానిగారు ఐరిషుదేశపుస్త్రీ. సర్వ విషయములను నామెకును మీకును నెంతయో భేదముగలదు. అయినను ఆమెవచ్చి మనదేశమున స్త్రీ సమాజమును స్థాపించి స్త్రీల యభివృద్ధికై పాటుబడుటకు గారణము ఆమెకును మీకునుగల స్త్రీత్వమే గదా. ఈమధ్య ఢిల్లీయందు భారత మహిళాసభ జరిగినది. దానికి అధ్యక్షురాలు భోపాలు బేగముగారు. అమె మహమ్మదీయ స్త్రీ. ఆసభకు పూర్వము జరిగిన సభ కధ్యక్షురాలు బరోడామహారాణిగారు. ఆమె హిందూ యువతి. చూడుడు. ఒకామె హిందువు. ఒకామె ముసల్మాను. అయినను సభా విషయములలో నెట్టి యసందర్భము గలుగ లేదు. కాన ఆశయ మొక్కటైనపుడు జాతి మత భేదము లేవియు నడ్డుకొనవు. పైడిల్లీ మహిళాసభవారు స్త్రీలకు సంబంధించిన పెక్కువిషయములనుగూర్చి చర్చించి యున్నారు. బాలికలకు విధిగా విద్య నేర్పవలెననినారు. స్త్రీలకు నియోజక నియోజిత స్వాతంత్య్రము కావలెననినారు. అతిబాల్య వివాహము లనిర్ధకమనినారు. ఇంకను పెక్కు తీర్మానములు గావించియున్నారు. పై విషయములను గూర్చి మనదేశమునందు తీవ్రమైన యాందోళన జరుగుచునేయున్నది. కొన్నిట మనకనుకూలములుగూడ జరుగుచునేయున్నవి, ఇతర విషయములలో మన దేశపుస్థితి యెట్లున్నను నియోజిత నియోజక స్వాతంత్ర్యము మాత్రము మన స్త్రీలకు శీఘ్రముగానే లభించినది. పాశ్చాత్య స్త్రీలు విశేష పరిశ్రమచే గాని బడయజాలక పోయిన ఎన్నిక హక్కులు మనదేశపు స్త్రీలకు సులభముగా లభించినవి. తత్ఫలితముగా మీ మదరాసు రాష్ట్రశాసనసభకు ఒకస్త్రీ డిప్యూటీ ప్రెసిడెంటుగా నెన్నుకొనబడి యున్నది. తిరువాన్కూరులో నొకస్త్రీ మంత్రిణిగా నియమింపఁబడి సమర్థతతో నిర్వహింపుచున్నది. ఇంకను పెక్కు స్థానికసభలలోను విద్యా సంఘములలోను స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింపఁబడుచున్నారు. కాని యీ స్వాతంత్ర్యపు హక్కులు సమర్థతతో నిర్వహింప గోరుచో స్త్రీలు మంచి విద్యావతులుగా నుండవలెను. మనదేశపు స్త్రీల విద్యాభివృద్ధికి బాల్యవివాహములు ప్రతిబంధకముగా నున్నవి. వానిని రూపు మాపవలెను. మీరు లక్ష్మీపూజచేయుదురు, సరస్వతీ పూజచేయుదురు. గాని మీ బిడ్డలకు లక్ష్మీ ప్రసన్నతలేదు. సరస్వతీ ప్రసన్నత యసలేలేదు. లక్ష్మియన వేరేలేదు. సరస్వతి యన వేరేలేదు. స్త్రీ శక్తి స్వరూపము. కాన స్వశక్తిచే స్త్రీ, లక్ష్మియు సరస్వతియు కావచ్చును. కాని యట్టిశక్తి యిప్పుడు విూలో స్తంభించిపోయినది. ఎట్టి సాహసకార్యములనైన చేయవలసిన విూ రిప్పుడు బిడియమునకును పిఱికిఁదనమునకును గుఱియై యశక్తలై పోయినారు. సీత, సావిత్రి మున్నగు విదుషీమణు లిట్టిబిడియమును పిఱికిఁదనమును గలిగియున్నచో నట్టి ప్రసిద్ధములైన కార్యముల చేయగలిగెడి వారేనా? కృష్ణుని వంటి బిడ్డలను కనగలిగెడివారేనా? ఇప్పుడు చూడుడు! కృష్ణుని వంటి కుమారుఁ డెక్కడైన కన్పడునేమో?

విూరు కాశీరామేశ్వరాది పుణ్యయాత్రల చేయతలంచు చుందురు. కాని యది చిన్నతనమున చేయవలసినది కాదనియు వార్థక్యమే దానికర్హ సమయమనియు అప్పుడే దానధర్మాది పుణ్యకార్యముల చేయవలయుననియు విూతలంపు. కాని భూతదయాపశ్చాత్తాపములచేతను జాతిమత భేదములు లేని విశ్వమానవ భ్రాతృత్వముచేతను నకల్మష హృదయముచేతను మనతనువే పుణ్యక్షేత్రముగా జేసికొనవచ్చును. జీవితమే యాత్ర. అన్నిటికిని మనస్సే ప్రధానము. చిత్తసంస్కారములేని యాత్రలవలన ఫలములేదు. తోడి మానవుల నస్పృశ్యులనుగా భావించుట తప్పు. మానవులంద ఱొకటె. స్త్రీ ప్రేమకు స్థానము. ఒక జంతువును చూడుడు. దానిబిడ్డ నెవరైన నేమియైన చేయవచ్చిన నెట్లు పోరాడునో, అట్లే స్త్రీగూడ తన బిడ్డల కేమైన ప్రమాదము వచ్చినచో తన ప్రాణమునైన నర్పించుటకు సాహసించును. అట్టి ప్రేమను స్త్రీలొక్క తమ బిడ్డలవిూదనే గాక తమ యిరుగు పొరుగువారి విూదను తమదేశము విూదను అంతియేగాదు సర్వమతములవారి యెడలను సర్వ మానవుల యెడను సమస్తభూత జాలముల యెడలను గూడ గలిగి యుండవలెను. స్త్రీలకు సౌందర్యభ్రమ యధికము. సౌందర్యము వెలలేని నగలు ధరించుటలో లేదు. విలువైన చీరలను ధరించుటలోలేదు. మొగమును పలుమారు సబ్బులతో గడుగుటలో లేదు. నిర్మలమును కరుణాభరితమును ప్రేమపూర్ణమునునగు హృదయమును గలిగియుండుటయే స్త్రీకినిజమైన సౌందర్యము. అట్టి సౌందర్యమును మీరు బడయగోరెదను.”

శ్రీమతి సరోజినీదేవి యుపన్యాసమును ముగింపగ ఖద్దరునుగూర్చి కొంచెము చెప్పుడని యొక సభ్యురాలడిగెను. దానినిగూర్చి యామె యిట్లుచెప్పెను.

“ఖద్దరనగా గాంధిగారి సందేశము. గాంధిగారి సందేశమనగా ఖద్దరు, ఈమధ్య ఆఫ్‌గన్ స్థానపుప్రభువు బొంబాయికి వచ్చియుండెను. ఆయన సభలోనికిరాగనే యెక్కువ ముతుక చీరను గట్టియున్న మహాత్ముని భార్యనుచూచి “ఓ, యెక్కువ ముతుకచీరను గట్టియున్న దే యీమెయే గాంధిగారి సతి" యని యామెను గురుపట్టి ఆఫ్‌ఘన్ రాజు యెంతయో సత్కరించినాడు. ఆయన తన స్వతంత్రరాష్ట్రమునుండితెచ్చిన సందేశమేమనగా "మా రాజ్యమునందు విదేశవస్త్రమునువాడు నలవాటులేదు. నారాష్ట్రవాసులెల్లరు తమ చేతులతో స్వయముగా వడుకబడి నేయబడిన గుడ్డలనే ధరింతురు. ఎంత శ్రీమంతులైననుగూడ ఆఫ్గనులు స్వదేశవస్త్రములనేగాని విదేశవస్త్రముల ధరింపరు. ఈవిషయమై మీకు సందేశ మీయగలిగినందులకు నేను చాల సంతోషింపుచున్నా"నని చెప్పియున్నాడు. ఖద్దరు వస్త్రములను ధరించుటయనగా నిరుపేదలకన్నమిడుట యన్నమాట. విూశరీరములు స్వదేశీయములేగాని విూరు ధరించిన వస్త్రములు మాత్రము స్వదేశీయములుగా లేనట్లు కన్పట్టుచున్నది. కాన విూరందఱు నూలువడికి స్వదేశవస్త్రముల ధరింపవలెనని కోరుచున్నాను."

మిత్రమా, సరోజినీదేవి యుపన్యాసమునందలి ముఖ్యాంశము లివియని జ్ఞాపకము. వీనిలో నేదైన పొరపాటులున్న నదినావియేయని యెంచుము. మేము వేసవిని చల్లగఁ గడుపవలెనని యిచ్చట కేతెంచితిమి. ఇచ్చట యెండలు తక్కువ. వేడిగాడ్పులసలేలేవు. చెమట పోయుటయేకానము. ఈదినములలో మన ప్రాంతములనుండెడి మండుటెండలు, వేడిగాడ్పులు, చెమట స్నానములు, తనియని దాహములు తలఁచుకొని యీ యూరి యొండలను తలంచినప్పుడు యేపుష్యమాఖమాసపు యొండలుగనో గాన్పింపుచుండును కాని యీ యెండలకే అడలి పోవుచున్నా రిచ్చటివారు. చూచితివా చిత్రము!


భావపురి

నీప్రియమైన

1928 జూలై

శారద.