శారద లేఖలు (మొదటి సంపుటము)/20-వ లేఖ
సౌభాగ్యవతియగు కల్పలతకు : -
నెచ్చెలీ !
నీవువ్రాసిన ఉత్తరములన్నియు చేరినవి. కాని రెండు మాసములనుండియు నీవు లెక్కలేనన్ని లేఖల లిఖించుచున్నను నీకొక్క జాబునైన వ్రాయజాలనందులకు నాకు చాలవిచారమగుచున్నది. ఏమిచేయుదును? ఇంటిలో ఒంటరిదాననైనాను. కలముపట్టుటకంటె గరిటెపట్టుట అవసరమైన పనిగానున్నది. దానికితోడిది శీతకాలపుప్రొద్దు. ప్రొద్దుకు ముద్దకుసరి. ఇక నేను నీకు ఉత్తరమెప్పుడు వ్రాయుదును? అందువలననే తెల్లవాఱుజాముననైన వ్రాయుదుమని వాకిలిలో సంక్రాంతి దాసరివచ్చి “హారో, రంగ హారి, కసూరిరంగ, కావేటిరంగ’ అని కేకలుపెట్టగా మెలకువవచ్చి లేచి అతనికి పిడుకెడుబియ్యము వేసివచ్చి కలముకాగితము చేతబట్టుకొని దీపము ముందరవచ్చి కూర్చున్నాను. అయిననేమి ? కలముసాగునా? అదిగో ! “అమ్మా! వాకిట్లో నీళ్ళుచల్లడమైంది; మ్రుగ్గులు పెట్టుకొం”డని పనిమనిషి, అఱచుచున్నది.
ఈ ధనుర్మాసములో మనకిది యొకపెద్దపని. పగలు పదిరెండుగంటలు ఫెళ్లునవెలిగే సూర్యభగవానుఁడు జీత మాలస్యమైన కూలివానివలె పదిగంటలకాలమైనను పగలుచూపక పరుగెత్తిపోవుచుండగా ఇందులో ఒకగంట తనక్రిందకు లాగుకొనును సంక్రాంతిముగ్గు. పోనిమ్ము ఆలస్యమగునని యీ మ్రుగ్గువేయుట మానుదుమనినను మనస్సొప్పదు. ఈ దినములలో ఒకరినిమించిన రంగవల్లి నొకర మిడినగాని మనకు సంతోషముండదు. మఱియు నిన్న వేసిన మ్రుగ్గు నేడు వేయుటయు లజ్జాకరమే. కావున దినమున కొక్కటి. మనకళావైదగ్ధ్యమును ప్రకటించుట కీ ధనుర్మాస మొకయుత్సాహకరమైన మాసము. దేవతలకు దక్షిణాయనము రాత్రికాలమనియు, ఉత్తరాయణము పగటికాలమనియు, అం దీధనుర్మాస ముషఃకాలమనియు, కావున దేవతాప్రీతికరమగు నీయుషఃకాలమున రమణీయరంగవల్లులచే మన ప్రాంగణముల నలంకరింపవలెననియు పెద్దలు చెప్పుదురు. మనకళానిపుణతను జూపుట కిదిమంచి యదనగుటచే దేవతలకేగాక మనస్త్రీలకును నిది ప్రీతికరమగు మాసమేయగుచున్నది.
మనకంటె ప్రీతికరము మనబాలికలకు. వారి గొబ్బిళులులేకున్న మనరంగవల్లులు చిన్నబోవా? కాని వారు మనకంటె కార్యనిమగ్నులై ఒకచో ఆవుపేడ, ఒకచో పెద్దగుమ్మడిపూవులు, బంతిపూవులుతెచ్చి గొబ్బిళ్లుచేసి వానిని పసుపు, కుంకుమలచేతను పుష్పాదులచేతను నలంకరించి ముంగిళ్ళనిడు వఱకు వారికి సంతుష్టిలేదు. నిన్నప్రొద్దున నేను మావాకిలిలో మ్రుగ్గులు పెట్టుచుంటిని. అప్పటి కింకను బాగుగా తెల్లవాఱ లేదు. దశదిశలను మంచు దట్టముగా కప్పియున్నది. చేతులు కొంగర్లుపోవుచు మ్రుగ్గు సాగుటలేదు. చలికి దవడలు దగ్గిఱకు పడుచున్నవి. ఆసమయములో ఇద్దఱుబాలికలు నామ్రుగ్గునకు దగ్గిఱగా నిల్చున్నారు. వారిలో ఒకబాలకు యేడేండ్లు వేఱొకదాని కై దేండ్లున్నట్టున్నవి. పెద్దదానిచేతిలో పేడపళ్లిక, చిన్నపిల్లచేతిలో పూలపుటిక ఉన్నవి. కాని పేడబుట్టలో పేడలేదు; పూలబుట్టలో పూలులేవు. వారి చిన్నిముఖములు మఱింత చిన్నబోయిఉన్నవి. "పేడా, పూలూ తెచ్చుకోక యిట్లా నిలబడ్డారే?”మని నేను వారిని అడిగితిని. “పోయివచ్చాము దొరకలేదు” అని ఆబాలికలు చిన్నబుచ్చుకొని పలికిరి. వారిని చూచుటకు నాకు జాలివేసెను. ఆపువేడయు పువ్వులును దొరకకపోవుటచే వారెంతో యుత్సాహభంగము పొందినట్టు గానుపించిరి. వారికన్నుల నీరొక్కటి తక్కువగాని వారిమోమంతగా ముడుచుకొనిపోయినది. మా కెదుటివీధిలో నున్న ఒకయిల్లుచూపి “వారింట చాలఆవులున్నవే, మీకు పేడెందుకు దొరకలేదు ?" అని వారిని మరల నేనడిగితిని. "ఆయింటి ముసలమ్మ చాలాచీకటి ఉండగానే లేచి లాంతరుపెట్టి పేడంతా వెదకి తట్టలోవేసి దాచిపెట్టిందట. మేముపోతే “అంతాయెవరో యెత్తుకొనిపోయినారు పొమ్మన్నది"అన్నారు ఆబాలికలు. “అయితే మీ అమ్మను పంపకపోయినారా? పెద్దవాళ్లువస్తే ఇచ్చేదేమో?" అన్నాను నేను. “మాఅమ్మ మ్రుగ్గులుపెట్టుతున్నది” అన్నా రాబాలికలు. అవును, అమ్మకు దగినపని అమ్మకు, బిడ్డలకుదగినపని బిడ్డలకు. ఆమె రంగవల్లులులేకున్న వీరి గొబ్బిళ్లకు శోభలేదు, వీరిగొబ్బిళ్లులేకున్న ఆమె రంగవల్లులకు రక్తిలేదు అనుకొంటిని. పేడదాచిన ముసలమ్మ పిసినారితనమునకు నాకు అసహ్యము గలిగినది. మాచిన్నతనములో గూడ మేమిటులనే గొబ్బిళుల కావుపేడ దొరకనినాడు ఆశాభంగమునొందిన దినములు నాకు జ్ఞాపకమువచ్చినవి. ఈ పసిబిడ్డ లీ చలిలో మంచులో గొబ్మిళ్లమీది ఆసక్తిచేత వచ్చినందులకైన పట్టెడుగోమయ మివ్వవచ్చునే! ఈ మాసము గడచిపోయిన వెనుక నీపసిబాలలు మనయిండ్లకు రమ్మనినను వత్తురా? ఈ నెలదినములు బాలికల కావుపేడ వదలివేయరాదా? అనుకొని మాపనిమనిషి శుద్ధికై తెచ్చిన ఆవుపేడ వారికిచ్చి మాదొడ్డిలోనున్న యేపిచ్చిపూలో నాలుగు పుణికి యిచ్చి వారిని పంపివేసితిని. అప్పుడా బాలికలు గొప్ప పెన్నిధి లభించినట్లుబ్బుచు తమయింటికి వెళ్లినారు.
ఈ బాలికలు గొబ్బిళులు పెట్టుగొనుటనిన నాకు మిక్కిలి సంతసముగానుండును. మఱియు వీరు సందెగొబ్బి పెట్టుకొని గొబ్బితట్టుచుండుట చూచుట, నాకు మిక్కిలి సంతోషకరము. ఒక్క గొబ్బిపండుగ మన బాలికలకు పెక్కు విషయములలో పరిజ్ఞానముగలిగించును. బద్ధకములేక తెల్లవాఱుజాముననే లేచుట, వాకిలి పరిశుభ్రపఱచుకొనుట అట్లుండ పుష్పపత్రాదులతో పరిచయము, మతసంబంధమగు పూజాపునస్కారములతో పరిచయము, మ్రుగ్గులతో పరిచయము, ఆటతో పరిచయము, పాటతో పరిచయము ఈ విధముగా లలితకళలలో ప్రథమపాఠములు బాలికలు గొబ్బి పండుగలలో నేర్చుకొందురు. ఆతరువాత పెద్దపండుగ మూడుదినములు బాలికలు పెట్టుకొనెడి రకరకముల బొమ్మలసా మానులు మున్నగునవిగూడ వారికి కళాప్రవీణతయందభినివేశ మొసగునవే.
మిత్రమా! ధనుర్మాసములో బాలికలకే యింత తీరని పనియైయుండ నిక మనస్త్రీలసంగతి చెప్పవలయునా? వేకటితో ఓకిరించుకొనుచు తొలకరిలో పుట్టినింటికేగినతొయ్యలి ప్రకృతి లక్ష్మి సుఖప్రసూతయైగంపెడు కొడుకులను గంపెడుకూతుండ్రను వెంటనిడుకొని చేమంతిపూవులజడతో, బంతిపూలహారములతో పూచినతంగెడువలె కలకలలాడుచు నింటికివచ్చును. కోడ లింత వైభవముతో నేటికేడాదికి సరిపోవు సారెచీరలుగట్టుకొని యింటికి వచ్చుచుండ ఏబ్రాసివలె మనము ముడిచిపెట్టుకొని కూర్చుండిన బాగుగానుండునా? ధనధాన్యసమృద్ధయైవచ్చెడి యాప్రకృతి, విడియుట కనురూపముగా మన గృహము లుండవలదా ? 'ప్రాతగోడకు పూతచక్కనా, కోతిరూపికి వ్రాతచక్కనా' అనిగదా సామ్యము. ఇంటికిపాదట్టు దులిపించి, గోడలకు సున్నము పూయించి మండిగములకు పసుపుకుంకుమలు, ద్వారములకు తోరణంబులు, ప్రాంగణములలో రంగవల్లులు, నిడి గృహలక్ష్మి నలంకరించుకొనవలదా? ఈ పనులన్నియు నెఱవేఱవలయుననిన రెండుకాళ్ళొకచోనిడి కూర్చుండుటకు వీలగునా? పనియెంత యెక్కువైననేమి? పనిముద్దు భాగ్యము ముద్దుగదా? అయినను సోమరులమై మనము బావుకొనునదేమున్నది? హీస్టీయాలువచ్చి అల్లాడటమే గదా? గాన సర్వావయములు పాటనముజెందునట్లు ప్రతిస్త్రీయు తన గృహకృత్యములను తాను నిర్వర్తించుకొనుటయే మంచిది. కాని పనులకు దగినట్టుగా మనకు ప్రొద్దుతక్కువగూడ నిప్పుడే. ఇంచుమించుగా రెండుగడియలప్రొద్దెక్కిన గాని సూర్యభగవానుడు మంచుతెఱలు చించుకొని బయటకు రానేరాడు. వచ్చినప్పుడైన నించుకసేపు నిలువబడనే నిలువబడడు. ఆనిలిచిన కాసేపైన చుఱుకైన యెండ నీయడు, “ఆరోగ్యం భాస్కరాదిచ్ఛే న్మోక్షమిచ్ఛే జ్జనార్దనాత్" అన్నట్టుగా మన కాయురారోగ్యములను బ్రసాదించు ఆదిత్యు డిట్లు జడుడై మందుడై తూర్పుమూలగాబుట్టి దక్షిణపుమూలగా నడ్డత్రోవనుబడి యతివేగముగా బశ్చిమాద్రికి బరువులెత్తుచుండ మనకు అహములెట్లు సన్నముగారుండును? ఱేపు శిశిరుడువచ్చి పండుటాకు లూడగొట్టినట్టులే సూర్యునిబద్ధకమునుగూడ నూడగొట్టినగాని ఆయనకు మనకునుగూడ చుఱుకురాదు. అంత వఱ కింతే. కల్పలతా! నా కీసూర్యుని శీఘ్రగమనంబు గనిన
"పొడుపుఁగొండమీదఁ బొడుచుట మొదలుగా
బరువువెట్టి యినుడు పశ్చిమాద్రి
మఱుఁగుఁజొచ్చెఁగాక మసలినఁ జలిచేతఁ
జిక్కెఁ జిక్కెననఁగఁ జిక్కకున్నె?”
అని సూర్యుడు తానుగూడ చలివాతబడుదునని పరువులెత్తుచున్నాడను శ్రీమద్భాగవతములోని పద్యము జ్ఞాపకమువచ్చి నవ్వుకొనుచుందును. శుభప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలమువచ్చినగాని మన కీపనులవడిదుడుకు లడగవు.
సంక్రాంతియనునది మనకొక సామాన్యమగు పండుగయేగాక గొప్ప ఆరోగ్యోత్సవమనికూడ చెప్పవచ్చును. కల్పలతా ! బుద్ధిశాలురగు మనపెద్దల భావనాశక్తి యద్భుతము. కావుననే మతవిధులను నారోగ్యవిధులను మేళవించి యనుల్లంఘనీయములుగా జేసియున్నారు. ఏలననగా మనవారికి ఆరోగ్యవిధులయందుకంటె మతవిధులయందు భక్తి యెక్కువ. కావున నీధనుర్మాసములో జరిపెడు శౌచవిధులెల్ల మనకు దేవపితృపూజలతో మిళితమై మనలను తప్పక నిర్వర్తించునట్లు నిబద్ధించుచున్నవి. కాని నిజమున కివియన్నియు మన ఆరోగ్యమునకే. చూడుము. ఈశీతకట్టుదినములు మనకు మిక్కిలి జబ్బుదినములు. దాదాపు కార్తీకమాసమువఱకు వానలుకురిసి నేలయంతయు తడిగానుండును. సూర్యకిరణ ప్రసార మల్పముగానుండుటచే నీకాలములో వాతావరణముగూడ అర్ద్రతగానుండును. నేలతడిగానుండుట, వాయువులు శీతలములైయుండుట, ఎండలు తీక్ష్ణముగా లేకుండుట మున్నగుకారణములచే పుడమిపై నుండెడి పెక్కు కశ్మలపదార్థములు తడిసి క్రుళ్లి సాంక్రామికవ్యాధుల కుత్పత్తిహేతువులగు సూక్ష్మజీవులు పెక్కు లుద్భవిల్లి ప్రజలను వ్యాధిపీడితులను గావించుచుండును. కావుననే యీదినములలో స్వర్గద్వారములు తెఱచి యుండునని మనవారనుచుందురు. ఎప్పుడు దేశమున వ్యాధులు చెలరేగియుండునో అప్పుడు స్వర్గద్వారము తెఱచియున్నట్లే గదా! కావున బద్ధకములేక ఒడలువంచి పనిచేయుటయు, మనగృహములును గృహావరణములును పరిశుభ్రపఱచుకొనుటయు, రోగకారణములగు సూక్ష్మజీవులు నశించునట్లు ఆవుపేడతో కలయంపిజల్లి ఘాటైనసున్నముతో రంగవల్లు లిడు కొనుటయు మనకు విధిగానేర్పడినది. అప్పుడువేసిన ఆవుపేడ కస్తూరికి తుల్యమని ఆయుర్వేదజ్ఞులమతము. కాన గోమయముతోడిపని మనకీదినముల నధికముగా కల్పించియున్నారు. ఈవిధముగా నీధనుర్మాసము మన ఆరోగ్యముకొఱకే పిన్న పెద్దలనెల్లర నిటు కార్యపరతంత్రులనుగా జేయుచున్నది.
అయినను ఈపనులబాధ ఇకనెన్నిదినములోలేదు లెమ్ము. పండుగ పదిదినములలోనికి వచ్చినది. ఈనెల పదునాల్గవతేదీ యందు సూర్యుడు మకరరాశియందు ప్రవేశించును. అదియే ఉత్తరాయణారంభము. అదియే పుణ్యకాలము. ఎప్పుడు సూర్యు డుత్తరాయణగతుడగునో అప్పుడే ఆమార్తాండుని కిరణజాలంబులు తీక్ష్ణతగాంచును. ఆలోకబాంధవుని తేజఃకిరణ ప్రసరణచే చరాచరాత్మకంబగు విశాలవిశ్వంబెల్ల నవశక్తిని బడసి తేజోవంతమై విరాజిల్లును. మిత్రమా! ఈపుణ్యకాలమునందు మనమేగాక అన్నిమతములవారును, అన్నితెగలవారును, అన్ని దేశములవారును నీపండుగలజేసికొనుట గమనింపదగిన విషయము. క్రైస్తవుల కీదినములలో సంవత్సరాది. బ్రాహ్ముల కీదినముల బ్రహ్మోత్సవము. మహమ్మదీయులకు గూడ నివి పండుగదినములే.
ఇక మన హిందువులపండుగవిశేషములు చెప్పనక్కఱయేలేదు. పసిబిడ్డలకు భోగి పండ్లు, ఆపైవారికి బొమ్మలు పెట్టుకొనుట. వారికంటె వయస్సున పెద్దయగు యువతులకు సావిత్రీగౌరీవ్రతము. నైష్ఠికులగువారికి స్నానదానతర్పణా దులు. గృహస్థులు క్రొత్తకోడండ్రను, కూతుండ్రను తెచ్చుకొనుట. కాపులకు కోడిపందెములు. వైష్ణవాలయములలో ఉదయపూజలు. వేయేల, ఐహికాముష్మిక లాభంబులను శారీరమానసికాత్మీయ సౌఖ్యంబులను నుత్తరాయణపుణ్యకాల మొనగూర్చుచున్నది. ఈశ్వరానుగ్రహంబున ప్రజలు శీతవాతాది క్లేశంబులనుండి విముక్తులైనారు. ధనధాన్యంబు లింటికిఁజేరినవి. చూడిపశువులెల్ల పాడిపశువులై పాలుపెరుగులు కొల్లలుగావించినవి. ఇళ్లువాకిండ్లు చక్కగానలంకరించుకొనినారు. నిన్న మొన్నటివఱకు కోతవేతలకుబోయి కూలిగింజలు పుష్కలముగా సేకరించుకొనియుండుటచే కూలినాలిజనములకుగూడ నీపండుగ కడుపునిండినపండుగ. కాన ఈపండుగదినములలో మృష్టాన్న మారగించనివారే యుండరు.
నెచ్చెలీ! నీవును పతిసంతానయుతవై రమణీయమును మహోత్సాహదాయకమును నగు నీజాతీయారోగ్యోత్సవానందమును పరిపూర్ణముగా ననుభవించెదవు గాకయని మనఃపూర్వకముగ వాంఛించుచున్నాను.
భావపురి
ఇట్లు
1 - 1 - 31
శారద.
శారద లేఖల మొదటి సంపుట మిది, సంపూర్ణము.