శారద లేఖలు (మొదటి సంపుటము)/2-వ లేఖ
సౌభాగ్యవతియగు కల్పలతకు :-
నెచ్చెలీ,
నీవు వ్రాసిన యుత్తరమందినది. మనము పూర్వము జాబులు వ్రాసికొనెడి కాలమునకును నేటికిని సమస్త విషయములయందు నెంతయో మార్పుగలిగినదని వ్రాసితివి. సత్యమే. కాని భాషావిషయమునగూడ మిక్కిలి మార్పుగలిగినదే, ఆవిషయము నీవేల గమనింపలేదు? గమనించియు ననర్హమని యుజ్జగించితివా? భారతి మున్నగు మాసపత్రికలలో వాడుక భాషయందు వ్రాయబడెడి కథలు, నాటకములు, ప్రహసనములు, చదివినకొలది నాకు వాడుక భాషయందు మక్కువెక్కువగుచున్నది. 'కథగాదు, కావ్యముగాదు, ఈ యుత్తరములలో మధురమైన వ్యవహారభాష మనమేల యుపయోగింపరాదు? సొగసైన వాడుకభాషలో లేఖలు వ్రాసికొనుటకు నీకుగల సందేహమేమియో తెలుపగోరెదను' అని వ్యవహార భాషయందు నీకుగల మక్కువకొలది కడు దీర్ఘముగ వ్రాసితివి. వ్యవహార భాషయందు వ్రాయుట నీకు ప్రీతికరమగుచో నీవటులనే వ్రాయుము. కాని యాంధ్రదేశమున నలువైపుల గ్రుమ్మరుచున్నకొలది వాడుకభాషయందు వ్రాయుట వలన గలిగెడి యిబ్బందు లధికముగ గన్పట్టుచున్నవి. ఆ విషయమై నాకుగల సందేహములను ననుభవములను రాగల లేఖలో విశదపఱచెదను. ఏలనందువా శ్రీకాళహస్తీ క్షేత్రమందు మహాశివరాత్రి సందర్భమున నేగాంచిన విశేషములు నీకు సాకల్యముగఁదెలుప మానసం బువ్విళులూరుచున్నది. కాన యొకటిగోర నొకటి వ్రాసితినని నాపైఁ గోపింపకుమా!
శ్రీకాళహస్తి పురాతన పుణ్యక్షేత్రములలో నొక్కటి. ఈ పుణ్యక్షేత్రమునకు దక్షిణ కైలాసమని గూడ మఱియొక నామధేయముగలదు. ఇచ్చట స్వామికి శ్రీకాళహస్తీశ్వరుఁడనియు, అమ్మవారికి జ్ఞానప్రసూనాంబిక యనియు పేర్లు. శ్రీ అనగా సాలెపురుగు. కాళ్ళమన సర్పము. హస్తి యన నేనుగు. ఈ మూటికిని ఈశ్వరుఁడు మోక్షమిచ్చెనుగాన భక్తవాత్సల్య చిహ్నముగా నీశ్వరుఁడా మూఁడు జీవముల పేరఁబిలువబడుచున్నాడు. కాని ఈస్వామి నిజనామధేయము నాగలింగేశ్వరుఁడు. శివరాత్రి సందర్భమున నిచ్చట పదిదినములు గొప్ప యుత్సవము జరుగును. దూరస్థలముల నుండి గూడ చాలమంది యాత్రికు లేతెంతురు. మొదటి దినమున స్వామికిఁ గడుగూర్చిన భక్తుడగు కన్నప్ప ధ్వజారోహణము. మఱునాడు స్వామి ధ్వజారోహణము. ఆదినమునుండియు స్వామి, పూటకొక వాహనముపై రెండు పూటల పదిదినము లూరేగును. వాహనములలో పెక్కులు వెండివి. ఒకటి రెండు మాత్రమే లక్క, కొయ్య మున్నగువానితోఁ జేసినవి. నిత్యము స్వామితోఁబాటు విఘ్నేశ్వరుఁడు, కుమారస్వామి యను నిద్దరు కుమారులును, కన్నప్ప, చండికేశ్వరులను నిరువురు భక్తులును, గంగ, జ్ఞానప్రసూనాంబిక యను నిరువురు దేవేరులును గూడ నూరేగుదురు. గంగ స్వామికి ప్రక్కనేయుండును. కాని జ్ఞానప్రసూనాంబికకు మాత్రము ప్రత్యేక వాహనము. స్వామికి, అమ్మణ్ణికిగూడ వెలలేని నగలున్నవి. విలువైన వాహనములున్నవి. దిన దినము స్వామియు నమ్మణ్ణియు నవనవాలంకారములతో నమూల్యాభరణములతో నవ్యంబులగు వాహనములపై వచ్చుట జూచుటకెంతయో నేత్రపర్వముగ నుండును. అన్నిటికంటె శివరాత్రికి పూర్వరాత్రి చొక్కంపు వెండితోఁ జేయబడిన శేష వాహనముపై నవరత్నములు తాపిన కంఠహారములు, కరకంకణములు, అంగుళీయకములు, కర్ణభూషలు, తురాయి కిరీటము మున్నగు, వెలలేని యాభరణములచే నలంకరింపఁబడి వేంచేసిన యా స్వామి సౌందర్యము ఆరంగు రంగు మతాబులు వెలుగున నెంత శోభస్కరముగనుండెనో, ఎంత దర్శనీయముగ నుండెనో వివరింపజాల. నాడు దేవి యలంకారముగూడ నతిమనోహరముగ నుండెను. నాఁటి స్వామియొక్కయు అమ్మణ్ణియొక్కయు, రమణీయాకారములు నాకిప్పటికిని కనుల గట్టినట్లున్నవి. మిత్రమా! విష్ణుక్షేత్రములనే గాని శివక్షేత్రముల నిట్టియలంకారములను నుత్సవములను నిచ్చటనేగాని మఱెచ్చటను గానము.
ఇచ్చటిజనులకు స్వామియందుకంటె నమ్మణ్ణియందు భక్తి యధికము, ప్రతిశుక్రవారమునను అమ్మణ్ణికి కుంకుమార్చన జరుగును. ఆనాడు పురుషులకంటె స్త్రీ లెక్కువగా వచ్చెదరు. దేవిని, వారు తల్లిని పిలిచినట్లెంతయో చనవుగ నెంతయో ప్రేమగ ‘తాయీ, 'అమ్మణీ, అమ్మా, జ్ఞానప్రసూ నాంబా' యని సంభోధింపుచు లెంపలు వాయించుకొని సాష్టాంగ పడుదురు. చిన్నలుమొదలు పెద్దలవఱకు 'మా అమ్మణ్ణి మా అమ్మణ్ణి' యని బహుప్రేమతో మన్ననమీర చెప్పుచుందురు. ఊరిలో మెఱవడికి వచ్చినప్పుడుగూడ స్వామికి కంటె నమ్మణ్ణికి నమస్కరించువారే యధికము. అమ్మణ్ణి త్రోవ నెదురపడినచో రక్షకభటులు తమ యెఱ్ఱటోపీని దీసియు, నధికారులు తమ తలపాగ దీసియు నమ్మణ్ణికి నమస్కరించి యామె కుంకుమను నొసట బెట్టుకొనక నావలపోరు. ఇఁక మన స్త్రీల విశ్వాసము వివరించుటకే సాధ్యముకాదు. ఆమె తమపాలిట కల్పతరువనియే మనవారిభావన. ఆమెను పూజించిన పత్ర పుష్పములేమి పసుపు కుంకుమలేమి ఎంతమాత్రము లభించినను మహద్భాగ్యముగ నెంతురు. ఆ పుష్పాదులను పసపు కుంకుమలను దాల్చినచో దమ మాంగల్యము చిరస్థాయిగ నుండగలదని మనవారి విశ్వాసము. మన స్త్రీల యభీష్టములలో నీ సువాసినీత్వవాంఛ ప్రముఖమైనదిగదా! అట్టి సువాసినీత్వము నమ్మణ్ణి పెంపొందించునను విశ్వాసముగల యప్పుడామెయందు మనస్త్రీలకుగల భక్తి నిరుపమాన మనుటలో నాశ్చర్యమేమి?
అచ్చటి ప్రభువుల కామె యిష్టదైవము. అచ్చటి ప్రజల కామె కన్నతల్లి. అచ్చటి జనులలో పెక్కుమంది యామె నామధేయము గలవారే. తండ్రియందుకంటె తల్లియందు ప్రేమ యగ్గలమై యుండుట మనుష్య సాధారణముగదా. శ్రీకాళ హస్తీశ్వరుని యాలయము చాల గొప్పది. మన తెలుగుసీమలో నంత గొప్ప దేవాలయము వేఱొండు లేదని చెప్పుదురు. కడు చిన్నదియయ్యు స్వర్ణముఖినది యాక్షేత్రమునకు శోభను గూర్చుచున్నది, ఆదేవాలయమునం దఱువదిమువ్వురు భక్తులు గలరు. వారిలో నగ్రేసరుఁడు కన్నప్ప. కన్నప్ప స్వామికి గడు గూర్చిన భక్తుడు. స్వామి విగ్రహ మెచ్చట ప్రతిష్ఠితమై యున్న నచ్చట కన్నప్పవిగ్రహము ప్రతిష్ఠితమై యుండితీరును. మెరవడిసమయమున స్వామి కభిముఖుడై కన్నప్ప వచ్చును. స్వామి యాలయమునకు సమీపముగనే కన్నప్పకొండ యున్నది. కన్నప్ప కొడియనగా ధ్వజారోహణమైన వెనుకనే స్వామి కొడి. ఈ కన్నప్ప యింతటి సత్కారమునకు భగవదనుగ్రహమునకు పాత్రుఁడెట్లయ్యెనన నాతని చరిత్ర మిట్లు చెప్పుదురు.
కన్నప్ప యొక యెఱుకరాజునకు లేక లేక బుట్టిన కొడుకు. ఆతడొకనాడు వేఁటకుబోవ నచ్చట నీ ఈశ్వరలింగము కనుపించెను. దానిని చూడగనే కన్నప్ప భక్తిభరితుడై యా నాగలింగేశ్వరునకు నమస్కరించి యదివఱ కర్చకు డర్చించి పోయిన పుష్పపత్రాదులు తొలగఁద్రోచి సమీపారణ్యమునకుఁబోయి యొక పందిపిల్లను వేటాడి చంపి తెచ్చి దానిని పక్వముచేసి రుచికరముగ నున్నదో లేదోయని నోట వేసికొని రుచిచూచి రుచ్యముగ నుండుటకు సంతసించి యా నంజుడొక చేత బట్టుకొని బిల్వపత్రము లొక కొన్ని కోసి నెత్తిపై నిడుకొని యొకచేత నంజు డొకచేత విల్లునంబు లుండుటంజేసి యభి షేకజలము తెచ్చుటకు సాధ్యముకామి సువర్ణముఖిలోని యుదకమొకింత పుక్కిట నింపుకొనివచ్చి స్వామిపై నాజల ముమిసి యభిషేకముచేసి తాఁదెచ్చిన పుష్పపత్రాదులఁ బూజించి తాఁదెచ్చిన నంజుడు నైవేద్యముపెట్టి భక్తిభరితుడై యా స్వామిని విడనాడజాలక యందే నిలిచియుండెను. ఆతని వెంటవచ్చిన వేటగాండ్రు ఇంటికి వెళ్లుదము రమ్మని కోరిరి. కాని కన్నప్ప బదులు చెప్పలేదు. వారును పలుమాఱులు పిలిచి పిలిచి వేసారి వీని కిచటనుండు దేవుడావేశించినట్లున్న దని తలంచి యా విషయమును బోయ రాజునకుఁ దెలుప వైడలి పోయిరి. కొమారుని వృత్తాంతమును వినుట తోడనే తలిదండ్రు లిరువురు మహాదుఃఖితులై కన్నప్ప వద్దకువచ్చి యాతని నింటికిఁ గొనిపోవ యత్నించిరి. కాని భగవద్ధ్యాన నిమగ్నుడై విశ్వము మఱచియున్న కన్నప్ప కాపలుకులు చెవిదూరలేదు. ఇంతలో ప్రొద్దు గ్రుంకెను. మేటి విలుకాడైన కన్నప్ప విల్లు నమ్ములు ధరించి స్వామిని కావలిగాయుచు నారాత్రిపుచ్చెను. ఉదయము కాగానే స్వామికి రుచ్యములైన నంజుడులు తెచ్చుటకు కన్నప్ప వెడలిపోయెను. తరువాత స్వామికి నిత్యము కైంకర్యము జేసెడు శివగోచరియను పూజారి సువర్ణముఖిలో స్నానముచేసి మడుఁగులుకట్టి విభూతి రుద్రాక్షలు ధరించి శిరమున నభిషేకజలమును హస్తముల పూజా ద్రవ్యములను బట్టుకొని యటకేతెంచి చూడగనే యాతని ఒడలు జల్లు మనెను. అయ్యో ఇదియేమి? స్వామి సన్నిధి మాంసపు ముక్కలున్న వేమి? ఏక్రూరకిరాతకుడీ యమంగళము చేసిపోయె? పూజ్యుడగు స్వామికిట్టి యపచారము గావించినవాడు తప్పక వధ్యుడుగదా యని చింతించి యా మాంసపుముక్కలనెల్ల నెత్తి పాఱవైచి మరల స్నానముచేసి స్వామినర్చించి వెడలిపోయెను.
అట స్వామికి నంజుడు తే నేగిన కన్నప్ప పెక్కుమేలి మెకంబుల జంపి వానిని చక్కగా తేనెతో పక్వముగావించి తాను తినిచూచి మిక్కిలి రుచ్యముగా నున్నదని సంతసింపుచు నెప్పటివలె పుక్కిట నభిషేకజలమును శిరమున బిల్వపత్రములను చేత నంజుడును పట్టుకొనివచ్చి శివగోచరి యర్చించిన పుష్పపత్రాదులను దనచెప్పుకాలితో దొలఁగద్రోచి యెప్పటి వలెనే స్వామినర్చించి యా రాత్రి మరల నాస్వామి సన్నిధినే గడపి తెల్లవారగనే మరల నైవేద్యపు నంజుడుల కొఱకు నడవి కేగెను. ఇంతలో శివగోచరివచ్చి మరల స్వామి సాన్యిధ్య మమంగళమై యుండుటకుఁ దద్దయు దుఃఖించి మరల నన్నియు చక్కఁజేసి స్వామి నర్చించి వెడలిపోయెను. ఈ విధముగా నైదు దినములు గడచెను. శివగోచరి దుఃఖ మగ్గలమగుచుండెను. కాన స్వామి యాతనిదుఃఖ ముడుపగోరి యా రాత్రి యాతని కలయందుగన్పడి భక్తశిరోమణీ! నిత్యము మాసాన్నిధ్యమశుద్ధమై యున్నదని నీవేల వాపోయెదవు. ఆ మాంసపు ముక్కల మాకు నివేదించుచున్నవాడు పాపాత్ముడుగాడు. పాషండుడు గాడు. మాకుఁ గడుగూర్చిన భక్తుడు. అవి యామిష ఖండములుగావు, యమృతపు ముక్కలు సుమా! నాయందు భక్తిభరితుఁడగువాడు నాకెట్టి హేయపదార్థ మిడినను నాకది రుచిరాన్నమే సుమా! కావుననే యాతని నంజుడులు నేనంత ప్రీతికరముగ స్వీకరింపుచున్నాను. అతఁడు మహాభక్తుడు కాన యతని హృదయమే నాకాలయము. వాని పలుకులే నాకు స్తుతివాక్యములు. అతని భక్తితత్పరత నెఱుంగ గోరుదువేని రేపుదయమునవచ్చి మఱువుననుండి పరీక్షింపుమని చెప్పి యంతర్హితుడయ్యెను. వెంటనే శివగోచరి అదరిపడి లేచి యప్పటికి తెలతెల వాఱుచుండుటం దెలిసి కాలకృత్యంబుల దీర్చికొని సువర్ణముఖిలో మజ్జన మాడివచ్చి దేవాలయమునకేగి స్వామి చెప్పిన తెఱుఁగున నొకమఱుఁగున నక్కియుండి కన్నప్పరాక ప్రతీక్షించు చుండెను. వాడుకమేరకు కన్నప్ప పూజాద్రవ్యాదులను నభిషేకజలమును నైవేద్యపు నంజుడులను గైకొని స్వామి సన్నిధి కేతెంచెను. కాని యేమి చిత్రము! నాడు స్వామి నిత్యమువలె సుఖముగలేఁడు. అతని కొక కంటినుండి ఘోరముగ రక్తము ప్రవహించుచున్నది. అది చూడగనే కన్నప్ప దుఃఖముజెంది హోరుహోరుననేడ్చుచు తెచ్చిన పదార్థము లక్కడనే పాఱవైచి "స్వామీ! నీ కిట్టియాపద యెట్లుతటస్థించె? నా పగవారగు వేఁటకాండ్రు చేసిరా? లేక మృగములు చేసెనా? విశాల విశ్వమునంతను పరికించెడు నీ నేత్రమున రక్తము స్రవించిన నే ది మందు? అయ్యో! యేమిచేయుదు. నీకపకారము గావించిన యా దుష్టులెవ్వరో కనుపించిన కత్తికి రెండు తుండ్లుగా నఱికి వేయనా? అయ్యో! ఏమిదారి! ఎట్లీరక్తస్రావము కట్టును? ఏదియైన మందాకుల రసము పిండిచూతునా యని చెంతనున్న యడవి కేగి రకరకముల మందాకులు తెచ్చి రసము పిండిచూచెను. కాని లాభములేదు. రక్తము కారుచునేయున్నది. కన్నప్ప చేయునదిలేక దిగులొంది కన్నీరు కాల్వలై పాఱుచుండ మ్రాన్పడినట్లు నిలిచెను. కొంతతడ విట్లునిలువ కండకు కండయను సామ్యము తోఁచెను. ఆహా! మంచిమందు తోఁచెను. స్వామి కంటికి నాకంటి నంటింతు ననుకొనెను. తోడనే కత్తితో తాటికాయనుండి ముంజె నెత్తినట్లు తనకన్ను నూడదీసి స్వామికంటి కంటించినాడు. అద్భుతముగాస్వామికన్ను చక్కఁబడిపోయినది. కన్నప్పకు పరమానంద మైనది. స్వామిని కౌఁగలించు కొనినాడు. ముద్దు పెట్టుకొనినాఁడు. సాష్టాంగ పడినాఁడు. ఆడినాడు. పాడినాడు. భగవంతుడు భక్తునిచేతి ముద్దుబిడ్డ. భక్తు డెన్నెన్ని విధముల నుపలాలించిన యన్నన్ని విధముల ప్రియము గూర్చుట యా మహామహునకు సంతోష ప్రదము. ఈ విధముగా గొంతసే పానందనమగ్నుడై కన్నప్ప నృత్యముచేసి స్వామివంక చూచినాడు. ఆహా! ఏమి చెప్పుదు నాభీభత్సము! స్వామి రెండవకంటినుండి నెత్తురు కారుచున్నది. స్వామి నేత్రము చక్కఁబడుటకు దగిన యౌషధము తనవద్దనే యుండ కన్నప్ప కిక దిగులేమి ? కాని తన రెండవకన్ను గూడ నూడబెఱికినచో దాని నంటించుటకు స్వామి కన్నెక్కడగలదో తన కెట్లు తెలియును? కాన గుర్తుకొరకు కన్నప్ప నిశ్శంకముగా తన చెప్పుకాలినెత్తి స్వామికంటిపైనిడి చేతనున్న కత్తితో రెండవ కన్నును బెఱుక సాహసించినాడు. ఆహా! కన్నప్పకు స్వామియందెంత ప్రేమ! ఎంత విశ్వాసము! ఎంత భక్తి! అద్భుతము! అసదృశము! కృపా సాగరుఁడగు పరమేశ్వరుఁడది చూచి సహించునా! మేలు కన్నప్పా! నీ యపూర్వ భక్తికి మెచ్చు వచ్చెనని చేయి పట్టుకొనినాడు. శివగోచరి యాశ్చర్య నిమగ్నుడై పోయినాడు. కన్నప్పా ! నీకేమి కావలెననినాఁడు స్వామి. నీసాన్నిద్ధ్యము నీయనుగ్రహము నీకైంకర్యము అనినాఁడు కన్నప్ప. మూటి కొక్కటే మాటగ నటులనే యనినాడు స్వామి. కన్నప్ప మొదటి పేరు తిన్నప్ప. కన్ను నొసఁగుఁటఁజేసి తిన్నప్ప కన్నప్పగా ప్రసిద్ధుఁడైనాఁడు. నెచ్చెలీ, కన్నప్ప కథ సత్యమా? అసత్యమా? అను విచారణ మనకువలదు. భగవంతుని యందు మనకుండవలసిన భక్తి విశ్వాసము లట్టివని గ్రహించుటకు కన్నప్ప చరిత్ర ముత్తమోత్తమోదాహరణ మనుటకు సందియము లేదుగదా!
ఇచ్చట చక్కని నాణెమైన కొయ్య దువ్వెనలు నల్లగాజులు తయారగును. రంగురంగు విదేశపు గాజులు దేశమంతట వ్యాప్తమై యుండుటవలన గాజుల పరిశ్రమ చాల క్షీణించెను. కాని దువ్వెనల పరిశ్రమ మాత్ర మింకను కొంత వ్యాప్తిలోనే యున్నది. సాధారణముగా నొక దువ్వెన వెల యొక కానీ యుండును. కాని యా దువ్వెనకే యొక రూపాయ వెలచేయు పనితనము చేయగల నిపుణులున్నారని వింటిని. కాని యా పనితన మరయు వారెవ్వరు? విదేశములనుండి దిగుమతియైన యా దువ్వెనల నిగనిగలరసి మోహపడువారేగాని మానుతో జేయఁబడిన యీమేలి దువ్వెనల జూచి మెచ్చువారెవ్వరు? చెక్క దువ్వెనయా! ఛీ ఛీ. ఎంత యవమానము. తలలో బెట్టగనే పుటుకు పుటుకున పండ్లు రాలుచున్ననుసరే, తల దూరక పోయిననుసరే, పేలు రాక పోయిననుసరే, మెఱుఁగున్న చాలును. మెఱుగే మన కన్నులలో కంపుకొట్టుచున్నది. దువ్వెనలకు మెఱుగు, గాజులకు మెఱుగు, గుడ్డలకు మెఱుగు, మొగములకు మెఱుగు! అన్నిటను మెఱుగే నవనాగరికులకు కావలసినది. ఈ విదేశపు మెఱుఁగులు మన మెఱుగును రూపుమాపుచున్నవను మెఱమెఱయొక్కరికిని లేదు. అది యట్లుండె; మిత్రమా! నే నొక్క మేలు బడసితిని. స్వదేశపు వస్త్రములతోఁబాటు స్వదేశపు గాజులనుగూడ ధరింతునని వ్రతముపూనితినని నీకుఁదెలియునుగదా! ఆగాజు లొక మాఱు దొరకియు నొకమారు దొరకకయు నేపడినశ్రమ వర్ణనాతీతము. ఈగాజులు లభ్యపడక వట్టి చేతులతోనుండ, గాజులు మానివైచితినని పెద్దవారలపోరు. అయ్యో! స్వదేశీగాజులు లభింపకపోయె. చూచి చూచి విదేశపు గాజులెట్లుధరింతునని నాకుచింత. ఈ స్థితియం దొకానొకప్పుడుగాజుల గూర్చిన దీక్ష మిక్కిలి యవిచార్యముగ బూనితినిగదా యని భావించితిని. కాని విదేశపు గాజులుతొడిగి కొనుటకు మాత్రము పాల్పడలేదు. ఒకానొక మహానీయు డొకానొక స్త్రీలసభలో "తల్లులారా, మీరు విదేశపు గాజులు ధరించుట వలన సంవత్సరమునకు కోటి రూప్యములు విదేశముల పాలై పోవుచున్నవి. కోటి రూప్యములన నెన్నియనుకొంటిరి? ఆ రూప్యములన్నియు సంచులు కట్టివేసిన ఈహాలంతయు నిండి పోవును. అన్ని రూపాయలు విదేశపు వన్నెగాజులకు ధారపోయుచున్నారు.” అనిచెప్పిన వాక్యము లహర్నిశలు నాహృదయమున ప్రతిధ్వనించుచుండును. అందువలననే నేను విదేశపు గాజులనుండి రక్షింపఁబడితిని. ఇప్పుడు శ్రీజ్ఞానప్రసూనాంబిక కృపవలన రెండువందల యేబదిగాజులు కాళ్ళహస్తిలో చేయించి తెచ్చుకొంటిని. నాకఱవు తీరినది. గొల్ల పేరమ్మలాగున్నావని నీవు నవ్విన నవ్వుదువు గాక. చేతినిండ తొడిగికొనిన నల్లగాజులనుచూచుకొని నేను మహానందమున నుప్పొంగిపోవుచున్నాను. నా నల్లగాజులెంత చక్కగ నున్నవనుకొంటివి? బహు చక్కగ నున్నవి. సన్నమునకు నాబంగారుగాజులతో గలసిపోయినవి. మెఱుఁగునకు విదేశపుగాజులకు మించిపోయినవి. ఆ గాజులు వేసికొనగనే యానందముతో నా హృదయము నిండిపోయినది. కాని యా గాజులను చూడగనే నాకొక విధమైన విచారము గూడ గల్గినది. ఏలనందువా? ఇట్టి చక్కని గాజులు చేయగల సామర్థ్యముగల పనివారుండియు నేటేట కోటిరూపాయలు విదేశములకు ధారపోయు చుంటిమిగదా యని. - కాని మనస్త్రీలకు వన్నెచిన్నెలపై వ్యామోహము నశింపనివఱకు మనదేశపు పరిశ్రమ లభివృద్ధిజెందవు. దేశీయపరిశ్రమ లభివృద్ధిజెందినగాని మనదేశ మభివృద్ధిజెందదు. ప్రియమిత్రమా! అట్టి కళ్యాణదినములు మన భారతభూమి కెప్పుడు వచ్చునోగదా!
భావపురి
ప్రేమంపుచెలి,
1928 మే
శారద