శారద లేఖలు (మొదటి సంపుటము)/19-వ లేఖ
సౌభాగ్యవతియగు కల్పలతకు :-
నెచ్చెలీ!
నీవు వ్రాసినట్లు శారదాచట్టమునకు సవరణనుపపాదించుట యనుచిత కార్యమనుటకు సందియములేదు. శారదాచట్టము త్వరపడి చేయబడినది కాదు. దాదాపు రెండువత్సరముల దీర్ఘకాలము దేశీయులచే చక్కగా యోచింపబడినది. ప్రజాభిప్రాయమును కనుగొనుటకై యేర్పడిన ఉపసంఘమువారు దేశమంతటను పర్యటనమొనర్చి నానావిధముల విచారణ యొనర్చిరి. పెక్కుమందికడ సాక్ష్యములను గైకొనిరి. డాక్టరుల యభిప్రాయములను తెలిసికొనిరి. పండితుల యభిప్రాయములను తెలిసికొనిరి. స్త్రీల యభిప్రాయములను తెలిసికొనిరి. న్యాయమూర్తుల యభిప్రాయములను తెలిసికొనిరి. ఈవిధముగా ప్రత్యేకవ్యక్తుల యభిప్రాయములనేగాక వేఱ్వేరు సంఘములపక్షమునను సంస్థలపక్షముననుగూడ విచారణయొనర్చి తెలిసికొననిరి. ఇన్నివిధముల విచారించినవెనుకనే యుపసంఘమువారు బాలికల వివాహవయస్సు పదునాలుగేండ్లుగా నుండుట యుక్తమని నిర్ణయించిరి. తదుపరి యుచితమైన ఈతీర్మానము సామ్రాజ్యశాసనసభవారిచే ఆమోదింపబడెను. దానికి ప్రభుత్వమువారును తోడ్పడిరి. రాజకీయకారణములచే ప్రసిద్ధ ప్రజాప్రతినిధులెల్లరు రాజీనామాలు పెట్టుటవలన ప్రస్తుత సామ్రాజ్యసభ యీకలుతీసిన కోడివలెనున్నది; కాని శారదా బిల్లు శాసనముచేయబడునా డిట్లు లేదు. పటేలు మహాశయు డధ్యక్షుడుగను, నెహ్రూ మాళవ్యా వంటి నాయకమణులు సభ్యులుగనునుండ ప్రభుత్వమువారును ప్రజాపతినిధులును మిల్కిలి సఖ్యతతోచేసిన శాసనము శారదాశాసనము. ఆశాసన మైన అప్పటికప్పుడే ప్రజల నెత్తిపై పెట్టలేదు. దాదాపైదు మాసములకు తరువాత నమలులోనికి వచ్చునట్లు నిశ్చయింపబడెను. ఆ అయిదుమాసముల గడువులో శాసనము రద్దుచేయ నెంచుచో సభ్యుల కవకాశము లేకపోలేదు. కాని ఆ అయిదు మాసములు శాసన ప్రతికూలు రెక్కడైన కునికిపాట్లు పడుచుండిరో లేక విపరీతముగాజరిగిన వివాహములలో విందులే గుడుచుచుఁడిరో తెలియదు. శారదాచట్ట మమలులోనికి వచ్చులోపల పూర్వాచారపరాయణులప్రేరణచే దేశీయులు గావించిన యనుచితవివాహములకు లెక్కలేదు. ఒక్క మచిలీపట్టణమునందే 900 వివాహములు జరిగినట్లు లెక్కింపబడెను. ఇక యావద్భారతదేశమునందును ఎన్నిలక్షల వివాహములు జరిగెనో వివరింపఁ దరముగాదు. దేశీయులెల్ల రా విధముగా కన్నులు తెఱువనివారును, పిడికిళ్లు విప్పనివారును, మాటలు రానివారును, నడకలు నేరనివారును అయిన కసుగందులకు గంగవెఱ్ఱులెత్తినట్లు పెండ్లిండ్లుచేయుచుండ నేడు సవరణ నామోదింప సాహసించిన శాసనసభ్యులలో నొక్కరైన 'దేశీయులారా ! భయములేదు. శారదాచట్టము రూపుమాపెద'మని చెప్పకపోయిరి. నాడుతోడ్పడి నేడు తాటస్థ్యమువహించిన ప్రభుత్వమువారైన సవరణ కవకాశముగలదని సూచింపరైరి. అతిబాల్యవివాహము లా విధముగా ననిరోధకముగా నసంఖ్యాకముగా జరిగిపోయిన పిమ్మట, అభము శుభము నెఱుగని పసిపాపల కంఠములకు పూర్తిగా నురులు వేయబడిన పిమ్మట, ప్రజానురాగము బడసిన ప్రజాప్రతినిధులెల్లరు శాసనసభలు వీడివచ్చిన పిమ్మట, గడువుకాలము గడచిపోయి శారదాచట్ట మములులోనికివచ్చి మూడుమాసములైన పిమ్మట యిప్పుడా సవరణ? ఆ సవరణయైన యెట్టిది? సివిలు కోర్టుద్వారా సర్టిఫికెట్టు పొందినవారికి చట్టములో పొందుపరుపబడిన వయస్సులకు లోపుగనే తమ బిడ్డలకు వివాహము చేయుటకు సురపత్ సింగుగారి సవరణ అవకాశ మొసంగుచున్నది. అయితే ఇక శారదాచట్ట మెందులకు? బాల్యవివాహములను చేయ నెంచువారెల్ల కోర్టులో దరఖాస్తుపెట్టి సర్టిఫికెట్టును పొంది తమ పిల్లల కెప్పటియట్లు వివాహముజేయుదురు. ఆక్షేపణలేనివా రొకరి సలహా లేకయే తమ కొమార్తెలకు ప్రౌఢవివాహములను చేయుచున్నారు. ఇకనేమున్నది? శారదాచట్టము బ్రతికియుండియు చచ్చిన చందమగును. సర్టిఫికెట్టును బడయుట కేదైన కొంచెము ఫీజుగూడ నున్నచో కోర్టువారి కదిగూడ నొక ఆదాయకారణము గావచ్చును. వానిలో నేదైన తకరరు వచ్చినచో లాయరులకుగూడ నొకింత సంపాదనాహేతువు కావచ్చును. కల్పలతా! శారదాచట్టము జీవచ్ఛవముగా నుండి చేయుపని యింతియేగాదు; మఱియొక ముఖ్యమైన నష్టమును గలదు. దేశములో శారదాచట్టమునకు ప్రతికూలురుగానున్నవారు రెండు విధములుగానుండిరి. వారిలో నొకరు పదునాలు గేండ్ల వివాహములు శాస్త్రవిరుద్ధములని వాదించు పూర్వాచారపరాయణులు ; వేఱొకరు యుక్తవయస్సు వచ్చిన బాలికలకు వివాహముచేయుటకు మనస్ఫూర్తిగా నిష్టముండియు మన వైవాహిక హక్కును ప్రభుత్వపరముచేయుట గూడదను లౌక్యులు. చట్టమున కనుకూలురగు సంస్కర్తల చిత్తములందు గూడ నీ వివాహాధికారమును గోల్పోవుటనునది గొప్ప సమస్యగానే యుండెను. కాని దేశములో బాల్యవివాహములవలని యనర్థకములు నానాటికి మెండుగుటయు, ఎన్నివిధముల ప్రబోధించినను ప్రజాసామాన్యము తమపూర్వాచారమును వీడజాలకుండుటయు గని స్త్రీల పురోభివృద్ధి నాశించు కొందఱు మహాశయులు ప్రభుత్వమువారి వలననైన నీ బాల్యవివాహములు నిరోధింపబడిన జాలునని తమ హక్కును కోల్పోవుట కొడబడిరి. అయితే యీ సవరణయే నెగ్గినేని దేశమును కింతకంటె అనర్థకమును దేశీయుల కింతకంటె యవమానమును వేఱొండు లేదు. ఏలననగా ఎప్పుడు మన బాలికల వివాహమును చేసికొనులకు కోర్టువారి సర్టిఫికెట్టును బడయు టగత్యమైనదో అప్పుడే మన వివాహముల హక్కును ప్రభుత్వమువారి పరము చేసినట్టులైనది. అయితే శారదాచట్టమును సృష్టించుటయొక్క యుద్దేశము బాల్యవివాహములను నిషేధించుటకే గదా. బాల్యవివాహములను చేసికొనువారికి ప్రభుత్వమువా రుత్తరువు నొసంగినచో శారదాచట్టముయొక్క ప్రయోజన మేమున్నది? కాన కలిగియున్న అధికారమును కోల్పోవుటయు, కలుగవల సిన ప్రయోజనము కలుగకపోవుటయు సురపత్‌సింగుగారి సవరణయొక్క ఫలితములుగా నేర్పడగలవు. కావున మిత్రమా! స్త్రీ జనాభ్యుదయచింతతోఁ జేయబడిన శారదాచట్టము యథారూపమున నమలులోనికైన రావలెను. లేదా అసలే రూపుమాసిపోవనైన పోవలెను; కాని సురపత్ సింగుగారి సవరణను మాత్రము దేశీయు లెంతమాత్ర మామోదింపగూడదు. అప్పటికప్పుడే శారదాచట్టమును రూపుచెడజేయ నెంచిన సింగుగారి సవరణకు ప్రజాభిప్రాయమును కనుగొనుటయను మఱియొక సవరణతో యమర్సనుదొరగా రించుక యడ్డుపడిరి. కాన ప్రజాభిప్రాయమునకై విడువఁబడిన ఈ సవరణను అనర్థక హేతువని పూర్తిగా నిరసించి దేశీయులు శారదాచట్టము యెడల తమకుగల సమ్మతిని తమ నిశ్చితాభిప్రాయము ద్వారా మరల నొకపరి దృఢపఱుపవలెను. ముఖ్యముగా నిది స్త్రీలకు సంబంధించినది గావున స్త్రీలెల్ల రీ సవరణవిషయమై తీవ్రప్రాతికూల్యమును జూపదగును. గృహలక్ష్మియు నిందులకు దోడ్పడవలెనని నా కోరిక.
మన చెన్ననగర మహిళాసంఘమువా రప్పుడే యీ సవరణవలని ప్రమాదమును గుర్తించి నిరసనసభ జరిపినట్లు పత్రికలలో జదివితిని. ఇది యెంతయు శుభావహము. ఇటులనే భారతదేశమంతట నీ సవరణకు తీవ్రప్రాతికూల్యమెదుర్కొను గాకయని యాశించెదను. కల్పలతా ! ఈసమయమున దేశీయు లుపేక్షించిన దేశమునకు మేలుగాక కీడునే చేసినవారగుదురనుట నిక్కము. భవిష్య మెట్లున్నదో ?
భావపురి
మిత్రురాలు,
సెప్టంబరు 1930
శారద.