Jump to content

శారద లేఖలు (మొదటి సంపుటము)/18-వ లేఖ

వికీసోర్స్ నుండి

సౌభాగ్యవతియగు కల్పలతకు :-

నెచ్చెలీ!

నీవువ్రాసిన దీర్ఘలేఖ చేరినది. నీకు జాబు వ్రాయని కారణము నీపై కోపమువచ్చియుగాదు; నీపై ప్రేమ తొలగియుగాదు; నాకు సోమరితనము బలిసియుగాదు; నీవు నాజాబున కెదురుజూచుచుందువనియు, వ్రాయకున్న నిష్ఠురవాక్యబాణహతిచే నన్ను నొప్పింతువనియు నేను మాటి మాటికి తలంచుచునేయున్నాను. నేర మొప్పికొని శిక్షకు సిద్ధపడియున్న అపరాధనే గనుక నీమందలింపులు నాకు వింతగా నుండలేదు. కాన నీవు వేసిన ప్రశ్నాపరంపరలకిక సమాధాన మిచ్చుటకు యత్నింతును.

"ప్రస్తుత ఉద్యమకారణమున సకలవ్యవహారములు కట్టుబడిపోయి మనుజులు సోమరులై పోవుచున్నారు. నీకు గూడ అదే వచ్చిన”దంటివి. నీ వీవిషయమున చాలపొరబడినావు. ఎందువల్లననగా నేను నీకు జాబువ్రాయుటకైన కాలమును వెచ్చింపక ఈమాసమంతయు తదేకదీక్షగా నూలువడికితిని ఈ గ్రీష్మఋతువంతయు నిదేవిధముగా సాగించినచో రెండు కడుచక్కని వడుకునూలుచీరలను నేయించుకొందును. వ్యర్థములైన లేఖారచనములను కట్టిపెట్టి యిట్టికార్యదీక్ష నవలంబించుట సోమరితనమా స్వధర్మానుష్ఠానమా? ఇది నా యొక్క దానిమాటయేగాదు. దేశమంతట నిట్టులే వ్యర్థముగా కాలము బుచ్చువారిచే నూలు తీయబడుచున్నది. విద్యాధికులు, సామాన్యజనులు, ఉన్నతోద్యోగులు, పాటకపుజనులు వేయేల స్త్రీలు, పురుషులు, బాలబాలిక లిదేవిధముగా నూలు వడుకుచున్నారు. వ్యర్థప్రసంగములచేతను నిరుపయోగ సంచారములచేతను వ్యర్థమైయుండెడి మానవశక్తి నిజముగా నీఋతువులోనే కొంచెములో కొంచెమైన సద్వినియోగపడినదని చెప్పవచ్చును. ఈవిధముగా భారతీయుల సహజమగు సోమరితనమించుక విచ్చిపోయియుండ దీనినే సోమరితన మనుట నా కాశ్చర్యమగుచున్నది. “మనదేశమున ప్రతివత్సర మీవేసవిలో ఎన్ని రాచకీయసభలు, ఎన్ని సారస్వతసభలు, ఎన్ని కళాపరిషత్తులు, ఎన్ని సాంఘిక సమావేశములు, ఎన్ని వినోదప్రదర్శనములు. అబ్బా! లెక్కయున్నదా? అసంఖ్యాకముగా జరుగు చుండెడివి! అవియన్నియు నడుగంటినవి సరిగదా సాధారణముగా జరిగెడి సినిమాలు, సర్కసులు, నాటకములుగూడ లేకుండపోయినవి. తుట్టతుదకు మన యుష్ణమండలములనుండి యేటేట ఆరోగ్యమునకో, ఆనందమునకో, అధికారప్రాపకమునకో నీలగిరి, బెంగుళూరు ప్రాంతముల కేగెడి విద్యాధికులుయాత్రలు గూడ మానుకున్నారు. ఇట్లు సర్వముకట్టువడిపోయి దేశము నిర్జనారణ్యమువలె చూపట్టుచున్నది. కాబట్టి ఈ మహోద్యమము దేశమునకు శుభస్థితిని చేకూర్చలేదు సరిగదా విశేషించి ఉపద్రవస్థితికి గొనిపోయిన”దని వ్రాసితివి. కల్పలతా! దేశమంతయు నొకేశిక్షాస్థానమై దేశీయులెల్ల రొకే నేరస్థులై చెఱసాలలే స్వీయగృహంబులై యెల్లరొక్కవిధముగా గాసిలుచుండ నిపుడు వేడుకలకు, వినోదములకు, కథలకు, కబురులకు, వేసవియాత్రలకు అవకాశమెక్కడ? నేడు భారతదేశమందంతట నెచ్చటనైనకనుము. కద్దరుకపడా, చరఖా అవాజ్. ఒక్కటే దృశ్యము. దేశమునకు కావలసిన దది. మహాత్ముడు కోరుచున్నదది. ప్రజలు చేయవలసినదది. ఇది ప్రజల కనీసధర్మము, ఉడుతభక్తి. దేశహితైకపరాయణులగు మహనీయులు సల్పుచున్న మహాత్యాగముతోగూడిన కార్యవారాశియందిది బిందుమాత్రము; అయితే బ్రహ్మాండముయొక్క నిర్మాణము పరమాణువులయొక్క సంయోగము చేతనేగదా?

"మనభారతదేశమునందు స్త్రీలలో త్రాగుడు లేదుగదా. కాన మద్యనిషేధప్రచారములందు స్త్రీ లేల జోక్యము గల్గించుకొనవలెను? ఇది మిక్కిలి యసమంజసముగా నున్నది.” యని నీవువేసినప్రశ్న నీవడిగిన పలువిధప్రశ్నలలోకెల్ల నద్భుతముగా నున్నది. మనదేశమునందు స్త్రీలలో త్రాగుడులేదను మాట వాస్తవమే. ఎక్కడైన నూటికి కోటికి ఒక్కస్త్రీ తాగుడు మఱగిన దున్నను అదినిషేధప్రచారము చేయతగినంత విశేష విషయముగాదు. కాని స్త్రీ పురుషుల చేరికచే కుటుంబమేర్పడుచున్నది. అందు సంపాదించుకొనివచ్చి కుటుంబమును పోషింపవలసిన పురుషుఁడు, తన సంపాదనయందు నిత్యము త్రాగుడుకొఱకు కొంతవ్యయపరచుచున్నచో ఆనష్టము స్త్రీది కాదా? అట్లుగాక పురుషుడు తనసొమ్ము నెట్టిదుర్వ్యయము చేయక జాగ్రత్తపెట్టుచుండినచో దానిలాభము స్త్రీదిగాదా! స్త్రీ పురుషుల చేరికచే నేర్పడిన కుటుంబమునందు స్త్రీ చేసిన వ్యయము పురుషుని, పురుషుఁడుచేసినవ్యయము స్త్రీని బాధింపకుండుటెట్లు? అదియట్లుండ మద్యమువంటి దుష్పదార్థ సేవనముచేగల్గు హాని కేవల మార్థికమునకే సంబంధించినది గాదు. త్రాగుడు సర్వవిధభ్రష్టతకు కారణము. ఏస్త్రీయైనను భర్తచే నధికముగా బాధింపబడుచున్నదనుచో నామె త్రాగుబోతువానిభార్యయే యనుట నిక్కము. కావున స్త్రీ స్వయముగా త్రాగకపోయినను మద్యనిషేధయత్న మామెకు గాని పనియనుటకు-వీలులేదు. మిత్రమా! దుర్భరమగు ఎట్టి పన్నులకైన నోర్వవచ్చును. విదేశవస్త్రములనైన హర్షింపవచ్చును. కాని శరీరపోషణ కేమాత్ర మవసరములేనిదియు, నైతికముగా విశేష హానిని గల్గించునదియు, దుర్భరదారిద్ర్య కారణమును నగు త్రాగుడుమాత్రము వాంఛింపదగినదికాదు. విదేశవస్తువులవల్లగాని, పన్నులవల్లగాని మనుష్యునకు గల్గెడిహాని ధనలోపము మాత్రమే; కాని మధుపానరతిచే మానవుల మనుష్యత్వమే నశించిపోవును. మధుసేవకుల కుటుంబములు నరకసమములు. ఇట్లు వ్రాయుటచే విదేశవస్తువులనుగాని, అధికమగు పన్నులనుగాని హర్షించుచున్నానని భ్రమపడుచుంటివేమో? అదిగాదు. జలగలు రక్తమును పీల్చినచందమున నిరంతరము భారతీయుల ద్రవ్యమును పీల్చివేయుచున్న విదేశపుసరుకులును, పేదభారతీయుడు భరింపజాలని యధికపు పన్నులును నెంతతగ్గిన భారతదేశమునకంతశ్రేయము; కాని త్రాగుడుకును వీనికిని పోల్చినచో వీనికంటె త్రాగుడువలని నష్టమే యధికతమమని రూపించుటకే యట్లుపల్కితిని.

త్రాగుబోతువానిభార్య కూలివాని పెండ్లామగుగాక, జమీందారునిఇల్లాలగుగాక ఆమెదుఃఖము వివరింపరానిది. ఇఁక నామె సంతానవతియేయగునేని నా దుస్థితి వర్ణించుటకే శక్యముగాదు. ఈసందర్భమున ఒకవృత్తాంతము జ్ఞాపకము వచ్చుచున్నది. అది యిప్పట్టున వివరించుట అప్రస్తుతప్రశంస కాదనుకొందును. ఇప్పటికి కొన్నియేండ్లయినది — ఒకనాడు నేనొక త్రాగుబోతుకథను నా ప్రియస్నేహితురాండ్రలో నొకామెకు చదివి వినిపించుట తటస్థించెను. ఆమె ఆకధను చదువుమని కోరుటచేతనే నేను చదువుటకు పూనుకొంటిని. నేను చదువుచుంటిని. ఆమె వినుచుండెను. ఆకథలో త్రాగుబోతు భర్తవలన నాతనిపత్ని పడెడిబాధలు, వినినకొలది నామిత్రురాలివదనము వివర్ణమై మ్లానమైపోవుచుండెను. ఆకథా సందర్భములు మిక్కిలి జాలికరముగానుండి నాకు చదువుటకుగూడ నోరాడకుండునంతటి దుఃఖమును గల్గించుచుండుటచే కథా నాయకియందలి కనికరముచేతనే నా మిత్రురాలట్లు విచారపడు చుండెననుకొంటిని. కథలో మితిమించిన పెనిమిటిత్రాగుడుచే నాకుటుంబిని నిర్ధనురాలగుటయు, అవ్యక్తులగు నామెబిడ్డ లదిగావలయు నిదిగావలయునని తల్లిని పీడించుటయు, ఆమె వారి వాంఛితము నీడేర్పజాలక దుఃఖించుటయు గలభాగమువచ్చెను. మిక్కిలి జాలిగొలుపు నాపట్టును దుఃఖావరోధముచే వడివడిగా జదువజాలక ఆపి, ఆపి చదువుచున్న నేనొకమా ఱకస్మాత్తుగా తలయెత్తి నామిత్రురాలివంక చూచితిని. ఏమి చెప్పుదు నప్పటి దృశ్యము? నామిత్రురాలి కన్గవనుండి సంతతధారగా బాష్పములు స్రవించుచుండెను. ఆకన్నీటిధారలు చూడగనే నాగుండె లవిసిపోయెను. అంతనేను నామిత్రురాలితో “రుక్మిణీ! ఇదేమి ఇట్లాఏడుస్తున్నావు ? కల్పితగాథలు సత్యములని భావించుచున్నావా ఏమి ? ఎబ్బే ఏడ్పుమానూ; కథచదవడం మానివేస్తా” నంటిని "నిత్యము అనుభవములోనున్న కష్టములు, దుఃఖములు నీవు చదువుట మానివేస్తేమాత్రము తొలుగుతాయా? కథ ఆపవద్దు. శారదా ! చదువుము. చదువుము.” అని నామిత్రురాలు దుఃఖగద్గదికంబగు స్వరముతో బల్కెను. నాచే మిక్కిలి యదృష్టశాలినియని భావింపఁబడుచున్న నామిత్రురాలి జీవితమింత దుఃఖభాజనమైనదని యాకస్మికముగా దెలియుటచే నేను నివ్వెఱ జెందితిని. నేనెప్పుడును ఊహింపని యొక రహస్యము నాపుస్తకమట్లువిచిత్రముగా బయటపెట్టెను. నా కిక కథ చదువుటకు బుద్ధిపుట్టలేదు. చేతిలోని పొత్తమును క్రిందవేసి నామిత్రురాలి నోదార్చుచు "రుక్మిణీ ! నీపెనిమిటి కిట్టి దురభ్యాసమున్నదా? ఒకనాడును చెప్పకపోతివి!” అంటిని. “ఏ మొగముపెట్టుకొనిచెప్పను? బి. యే. చదువుచుండగానే సారాదేవత మాయిల్లు నాక్రమించినది. ఆనాటినుండి యీనాటివఱకు ఆసారాదేవతవలన నేను పడుచున్న క్లేశములకు మితిలేదు. నేనొక్కదానినైతే ఎట్లాగో తినో, తినకో ఏడుస్తును. కడుపులో కాళ్లుముడిచిపెట్టుకొని పడుకోకుండా పిల్లలు నల్గురు; తెల్లవాఱిలేచినదిమొదలు యెన్నివిధముల తంటాలు! ఇంటికర్చునిమిత్తము నాచేతిలోకొక్కొక్క రూక రాలుటకెంతయో శ్రమ. కాని ఆసీమ సారాయములు సడీచప్పుడు లేకుండా వందలకొలది రూప్యములను కబళించి వేస్తుంటాయి. సొగసైన మాదిరులలో అందమైన బిరడాలతో మా బీరువల నలంకరించే ఆ నిర్జీవపు సీసాలలో తమ్ము కొన్న యజమానునేగాక కుటుంబాలు కుటుంబాలు కూల్చివేసే అద్భుతశక్తివున్నది. శారదా! నీవాకథ చదువుటచే నాకథయే నాకు జ్ఞాపకమువచ్చి యింత దుఃఖమువచ్చినది. ఏమిచేయను? ఆపుకోలేకపోయినాను” అని నామిత్రురాలు మరల నధికముగా విలపించెను. కల్పలతా ! నామిత్రురాలు పేదరాలుగాదు. గొప్పయింటిబిడ్డ; మంచివిద్యావతి. ఆమె యొడలిపై విలువగల నగలున్నవి. ఆమె కట్టుకున్నది బెంగళూరుపట్టుచీర. ఆమె పెనిమిటి విద్యాధికుఁడు. ఉన్నతోద్యోగి. పైకిచూచువారి కామె గొప్పయదృష్టశాలినివలెనే కాన్పించును. అయిననేమి ? భర్త యలవాటుపడియున్న సీమసారాయము లామె నెంతపరితప్తమానసనుగా జేయుచున్నవో కనుము.

త్రాగుబోతుదనముచే శ్రీమంతులైనవారి స్థితియే యిట్లుండ ఇక పేదకుటుంబినుల నిది యెంతదుఃఖపెట్టు చున్నదో చెప్పవలసినదేమి? పేదవారల పూరిగుడిసెల నొకపరిచూడుము. ఎప్పుడును ఆడుదానికంటె మగవానికి కూలియెక్కువ. అయితే ఆడుదానికూలి యింటికి జేరినట్టు మగవానికూలి చేరదు. అది ముక్కాలు మువ్వీసము కల్లంగడికే. ఒక్క ఆడుదాని కూలి కుటుంబపోషణకు చాలదు. మగవానికూలి కల్లుపాలవును. అట్టిచో ప్రొద్దున ప్రాచిమొగాన పాటుకువెళ్లి చేతిబిడ్డను చెట్టు కొమ్మకుగట్టిన గుడ్డఉయ్యాలలో పడవేసి యెడపిల్లలను కంచెల వెంబడి కఱ్ఱలవెంబడి తిరుగవిడిచి పగలెల్ల కష్టపడిన ఆపేదరాలి క్షోభ యెట్లుండునో చెప్పవలెనా? అది యటుండ ఆ చాలియు చాలని గంజియైన త్రాగుదుమని నమ్మకములేదు. తప్పతాగిన ఆధూర్తుడు అకస్మాత్తుగావచ్చి యింటిమీదపడి ఆగమునకు దొరకొనును. పెండ్లామును చావమోదును. బిడ్డలను జావమోదును. కూటికుండలు బోర్లదోయును. ఇఁక ఆనోటి కడ్డదిడ్డములు లేవు. వినరానిబూతులు. అట్లు ఇంటికిరాకపోయినా? కంచెలోనో కంపలోనో పడినాడనియో, రోడ్డుమీద దొర్లుచుండగా కానిస్టేబులు స్టేషనుకు యీడ్చుకొనిపోయినాడనియో కబురు. వానికొఱకు మరల పెండ్లాముపరుగు. ఏఱాయియైన నేమి పండ్లూడగొట్టుకొనుట కన్నట్టుగా సంసారములోని శాంతిని చెఱచుట కేయల్లరియైనను నొక్కటేగదా ?

మిత్రమా! సాయంత్రపువేళ పేదవారి గిడిసెల దెసకేగి చూచితిమా ఇప్పగిది మద్యదేవతకు బలియై క్షోభిల్లెడి సంసారములెన్నియో హృదయవిదారకముగా గననగును. అంతదూరముపోనేల? మాపనిమనిషిమగఁడును, దొడ్డినూడ్చుదాని మగడును ఇద్దఱు త్రాగుబోతులే. తమభర్తల దుర్వృత్తినిగూర్చి దినదినము వారు పెట్టెడిఘోష విన శక్యముగాదు. వాళ్లు చెప్పి చెప్పి, యేడ్చి యేడ్చి తుదకు తమనెలజీతము తమమగమనిషికి మాత్రమీయవద్దని చెప్పుచుందురు. అటులనేయని నేనెన్నడును వాళ్లభర్తల పరముగా జీతమీయను. కల్పలతా ! త్రాగుడు పేదస్త్రీలను, ధనికస్త్రీలనుగూడ నిన్నివిధములు హింసించుచుండ నిషేధప్రచారము స్త్రీల కావశ్యకములేదని యెట్టుచెప్పనగుసు? మిత్రమా! నిజముగా త్రాగుబోతులు త్రాగుచున్నది భార్య, బిడ్డల రక్తముగాని మద్యముగాదు. దొరతనమువారి మహౌదార్యమువలన గాని మహాత్ములైనవారి నిరంతరకృషివలనగాని మద్యమును నిషేధించుభాగ్యము మన భారతదేశమునకు గల్గెనేని మన స్త్రీల పుణ్యము ఫలించినదనియే చెప్పవలయును.

గతవత్సరము దొరతనమువారు మన చెన్నరాజధాని యందు కొన్నిలక్ష (నాల్గులక్షలని జ్ఞాపకము) లొసగి మద్య నిషేధక ప్రచారకసంఘములు నెలకొల్పినపుడు త్రాగుబోతు పతులచే వెతలబడుసతుల యాపదలు తీఱెడిభాగ్యము లభించెనని యెంతయోసంతసించితిని. అయితే ఆ టెంపరెన్సుకమిటీ లింకను జీవించియుండగనే అదేప్రచారమునకు పూనుకొనిన అసంఖ్యాక భారతీయ నరనారీమణులు చెఱసాలలలో ముఱుగుచున్నారు. పరస్పర విరుద్ధమైన యీకార్యమునకు హేతు వగమ్యముగానున్నది. దొరతనమువారికి మద్యపాన మిష్టమా? అయితే ఆ టెంపరెన్సుకమిటీల కర్థమేమి? మద్యనిషేధ మిష్టమా? అయితే ఇంతమంది దేశభక్తులు కారాగృహ నిబద్దులు కానేల? మద్యనిషేధమును బోధించినందులకై యింతమంది దేశభక్తులు నిబద్ధులగుటజూడ “మద్యనిషేధమున కేర్పఱచిన టెంపరెన్సుకమిటీలు మీ కండ్లనీరుదుడుచుటకై యేర్పడినవేగాని నిజమైనప్రచారమునకుగాదు. మీ నైతికవిచ్ఛిత్తితో మాకుపనిలేదు. మీ సంఘక్షీణతను మేము పరికింపము. మీ దారిద్య్రస్థితితో మాకు సంబంధములేదు. మీదేహారోగ్యముతో మాకు నిమిత్తములేదు. మీ పెండ్లాముబిడ్డల ఘోషతో మా కగత్యములేదు. మాకుకావలసినది డబ్బు. డబ్బు డబ్బు. మద్యనిషేధమున కంగీకరించి మా కోట్ల కొలదిధనమును కోల్పోవజాలము." అని ప్రభుత్వము ఖండితముగా చెప్పుచున్నట్లున్నది. ప్రజల నింతబలవంతపఱచి త్రాగించినను యీ మద్యపానమువలన మనుష్యున కే కొంచెమైన ప్రయోజనము గలదా ? ఆకలితీరునా? ఆరోగ్యవర్ధకమా ? తుదకు జిహ్వకైన ని పుగూర్చునా? ఏదియులేదు. త్రాగుబోతుకు మనస్సు నిలుకడలేదు. మాట నిలుకడలేదు. శరీరములో సత్వములేదు. నైతికముగా, సాంఘికముగా, ఆర్థికముగా, శారీరకముగా వాడు భ్రష్టుఁడై పోవును. వానితోబాటు వానిభార్యయు బిడ్డలునుగూడ వివిధకష్టములకుగుఱియై దురపిల్లుదురు. సారాదేవత ప్రవేశించినయింట ఆనందమునకు తావులేదు. సుఖమునకు తావులేదు. పెద్దమ్మయొక్క ప్రభా వము శల్యావశిష్టులగు నాయింటివారి ముఖములమీదను, సర్వశూన్యమైన యాయింటియందలి నలుమూలలను పొడకట్టుచుండును. కల్పలతా! ఈసందర్భమున 'ఆరోగ్యప్రకాశిక'లో సారాదేవత పలికినపలుకులు ఎంతయు వినదగినవిగానున్నవి. అంటున్నది:-

"ప్రపంచమున మనుష్యులను చంపుటలో అనగా హత్యనేరముచేయుటలో నన్నుమించినవారు మరెవ్వరును లేరు.

ప్రపంచమున నిదివరకుజరిగిన యుద్ధము లన్నిటిలోను చంపబడినవారిమొత్తము సంఖ్యకంటె నాచే చంపబడినవారి మొత్తము సంఖ్యయే మిక్కిలి హెచ్చుగానుండును.

నేను మనుష్యులను పశువులక్రింద మార్చితిని. నేను కోట్లకొలదికుటుంబముల సౌఖ్యమును రూపుమాపి కష్టములనే అనుభవించునటుల చేసితిని. కోట్లకొలదిమనుష్యుల అధోగతికి కొనిపోవునట్టి దారిని సరిచేయుచుందును.

నేను బలవంతులను బలహీనులనుగా చేయుదును. బలహీనులను అంతమొందించెదను. నేనిదివరకు ఎన్నికోట్ల మందినో పాడుచేసితిని. ఇంకను ఎన్నికోట్లమందినో పాడుచేయుటకు ప్రయత్నించెదను. నాపేరే సారాదేవత.”

మిత్రమా ! 'ఆరోగ్యప్రకాశిక'లో ప్రచురింపబడిన గిబ్బనుదొరగారి యీమహావాక్యములను చదివినప్పుడు "ప్రపంచములో నాచే దుఃఖింపబడినంతమంది పతివ్రతలు, మరి దేనిచేతను దుఃఖపడలేదు.” అనువాక్యమునుగూడ చేర్చిన బాగుండుననుకొంటిని. కల్పలతా! అది సత్యముగదా ? పరమేశ్వరానుగ్రహమువలన మద్యనిషేధప్రచారము మనదేశమున శీఘ్రకాలములో ఫలించుగాక! మనస్త్రీల దుఃఖములు నివారణమగుగాక! యని వాంఛించెదను. కల్పలతా! ఇప్పటికిని మద్యనిషేధప్రచారముతో స్త్రీలకు సంబంధము లేదనియే తెలంతువా ?


భావపురి

మిత్రురాలు,

ఆగస్టు 1930

శారద.



̺