Jump to content

శారద లేఖలు (మొదటి సంపుటము)/16-వ లేఖ

వికీసోర్స్ నుండి

సౌభాగ్యవతియగు కల్పలతకు: -

నెచ్చెలీ !

అవును నేనుగూడ నదియే విషయమై యోచింపుచున్నాను. విచారించిచూడ ఈ పెండ్లిండ్లరద్దుచట్టము నామోదించుటలో నామోదింపకుండుటలోగూడ ఇబ్బందులే కనుపడుచున్నవి. ఇది శారదాచట్టమువలె సులభముగా నామోదింప దగినదికాదు. దీని నామోదించితిమా భారతమహిళల నిరుపమానశీలముచే సముపార్జితమైన జగద్వందిత కీర్తికి కళంకమొదవెడు పరిస్థితు లేర్పడవచ్చును. మఱియు అవమానము, క్లేశము, చింత, మున్నగు కష్టములకు స్త్రీ గుఱికావలసి వచ్చును. కాదంటిమా? నిర్హేతుకముగా భర్తృపరిత్యాగినులైన స్త్రీల దుర్గతికి తరణోపాయము దోచుకున్నది. కాన ఈ విడాకులచట్ట మొకవంక స్త్రీలకు ఆత్మహత్యాకరముగను మరియొకవంక ప్రాణదానకరముగను కనుపించు చున్నది. దీని నింకను నిదానించి విచారించ నగును.

ఒక రొక మంచి పనిని చేయుచున్నచో వారితో సరిదూగుటకు మనము యత్నించుట తప్పుగాదు. కాని చెడుగునకు గూడ పోటీబడుట యుక్తమనిపించుకొనునా? పురుషులు భార్యను పరిత్యజించుట యనుచితకృత్యమని మనమిప్పుడు భావింపుచున్నాము. భావనమేగాదు. అందులకు వారిని కఠిన ముగా నిందింపుచున్నాము. వారినట్లు మనము దూషింపుచు మనముగూడ నదియేపని కవకాశమును గోరుట సమంజస మగునా?

కల్పలతా! దాంపత్యముయొక్క పరమార్థము మహోత్కృష్ఠమైనది. దానియొక్క లక్ష్యము కేవలము భోగలాలసతగాదు. కాన దాంపత్యధర్మమును కేవలము భౌతికదృష్టితోఁ జూచి విషయతృప్తియే పరమావధిగానెంచి పెండ్లిపై పెండ్లిగోరుట ప్రశస్తమగు యోచనకాదు.

ఒక పార్శ్వమునకు వ్యాధిసోకినచో దానిని నివారించుటకు రెండవపార్శ్వమునకు గూడ నా వ్యాధిని ప్రాకించుట వ్యాధి నివారణకు మార్గముగాదు. ఒకవంక పురుషు డొనరింపుచున్న దారాపరిత్యాగము అనుచితము నక్రమము సంఘ విచ్ఛిత్తికి కారణము పాపభూయిష్టమునై హిందూసంఘసౌష్టనమునకెనలేని యపకృతిగావింపుచున్నది. నేడు స్త్రీలకు గూడ నట్టి యవకాశ మొసగినచో నాలోపము నివారణమగునని భావింపరాదు. బహుశః యిబ్బందియగును.

మానవజస్మ మెప్పుడును లోపరహితముగాదు. ఎంత మంచివారియందును నేదియో యొక లోపముండితీరును. అట్టిచో నెంతయన్యోన్యానురాగముగల సతీపతులఁయందైనను నెప్పుడోయొకప్పు డేదియోయొకప్పు డభిప్రాయ భేదములు గలిగి తీరును. అంతమాత్రమునకే ఆడుది మగనిని, మగవాడు పెండ్లమును మార్చుకొనుచో నిక నాసంసారములో సారస్య మేమున్నది? ఒకవేళ వాదసౌకర్యార్థమై విడాకులు పుచ్చుకొందురేయనుకొందము. అటులైనను వీరి కష్టము నివారణ గాదు. ఏలనందువా మరల క్రొత్తగా కట్టుకొన్న ఆలుమగలలో మాత్రము పొరపొచ్చెములు పుట్టవని కంట్రాక్టేమున్నది? కాన కల్పలతా! ఇట్టి గంగాశంతనుల సమయములతో దాంపత్యజీవనము నిర్విఘ్నముగా చెల్లదు. తమదాంపత్య జీవితమును సుఖమయముగాను, ఒడిదుడుకులు లేకుండునట్లును జరుపుకొన దలంచుచో స్త్రీపురుషు లిరువురు పరస్పరవిశ్వాసప్రేమలు గలిగి సౌహార్దముతో నొకరిలోపముల నొకరు సైరణతో సవరించుకొని జీవితమును నడుపుకొనుటయే యుత్తమమార్గము. మఱియు విడాకులచట్టముచే మన సంఘము నెదుర్కొన బోవు మఱియొక కష్టముగూడ అపుడాలోచనీయము. మన దేశమున స్త్రీలకు సవతిబిడ్డల యెడగల ఈర్ష్య సామాన్యమైనదిగాదు. ఇందువలన బాలబాలికలు పడుచున్న యిడుమలును సామాన్యమైనవిగావు. సవతిబిడ్డలను చూచి సహింపలేక స్త్రీలు కొందఱు విషప్రయోగాది దుష్కృత్యములకుగూడ వెనుదీయకుండుట మన మనేక సమయములలో వినుచున్నాము. నేడు విడాకుల చట్టము నామోదించినచో బిడ్డలకు సవతితండ్రులుగూడ వచ్చెదరు. ఒక పురుషుని యదుపాజ్ఞలకు లోబడియున్న స్త్రీయొక్క మాత్సర్యమే సవతిబిడ్డలయెడ నధికతమమైయుండగా స్వతంత్రుఁడగు మగవాడు సవతిసంతానము నెడల నింతకంటె నిర్ష్యాళువగుటకు నవకాశము గలదు గదా. కావున విడాకులచట్టముచే బిడ్డల సుఖస్థితి కష్టభూయిష్ట మగును. మఱి ఆలుమగల సంసారమో నూతి ఒడ్డు బిడ్డ చందమున నెప్పటి ఒప్పుడు ప్రమాదకరమై యుండును. ఇక నట్టి సంసారములో స్థాయియెక్కడ? సుఖమేది? ప్రేమ కవకాశమెచ్చట? అన్నియు మృగ్యము. గట్టిగ మాట్లాడిన భార్య లేచిపోవునేమో ననెడిభయము మగవానికిని మగడులేచిపోవునేమో ననెడి భయమాడుదానికిని కలుగుచుండ నిట్టి పిఱికితనపు కాపురమెన్నాళ్లుసాగును. ఇట్టి దంపతులు ఏమాత్రపు సౌఖ్యమనుభవింతురు. కాన విడాకులచట్టముచే హైందవ సంసారములకు విపరీతపరిస్థితి యేర్పడుట ఒకవిధముగా యోచింప నిక్కువమనేతలంపు గలుగుచున్నది. కాని మిత్రమా! నేనిట్లు వ్రాయుటచేత తన కత్తి కెదురుకత్తిలేక భార్యయెడ నిరంకుశముగను నిర్దాక్షిణ్యముగను ప్రవర్తించెడి పురుషుల చెయిదములను నేను గుర్తింపలేదనిగాని, సమర్థింపుచున్నానని గాని భావింపకుము. తోటకూరలోని పురుగువలె స్త్రీ బహు నీచముగా పురుషులచే విసరివేయబడుచున్నదని నాకు తెలియకపోలేదు. ఇందువలన మన స్త్రీలలో పెక్కురు ఆజన్మదుఃఖముతో కుమిలిపోవుచున్నారనియు నేనెఱుగుదును. ఈ విషయము ప్రస్తావించునపుడు మన బంధుమిత్రులలోని స్త్రీలలో భర్తచే పరిత్యజింపఁబడినవారి నిర్వికారాకృతి నామనోవీధిని పొడకట్టుచున్నది. ఆ అభాగిను లెట్టి యపరాధముచేసినవారును కారు. వారి తలిదండ్రులు పుష్కలముగా ధన మీయజాలక పోవుటయో, వారు రూపవతులుకాకపోవుటయో, వారు విద్యాభిరతిగలవారగుటయో, వంధ్యలగుటయో, రోగగ్రస్త లగుటయో ఇవియే వారిని పరిత్యజించుటకు కారణములు. ఇందు వారు గావించిన నేరమేమియులేదు. అయినను వారు నిర్దాక్షిణ్యముగా భర్తలచే విడనాడబడి జీవచ్ఛవములవలె పుట్టినింట బడియున్నారు. నిజముగా నిట్టి క్రూరకర్మము తలంచినప్పుడు డైవోర్సుచట్టము నిప్పటి కిప్పుడు పుట్టిన బాగుండుననినంత మనస్సు భగ్గురుమనును. కాని మన ఆర్యసాంప్రదాయ ధర్మమునుబట్టియు, కుటుంబజీవితముయొక్క శాంతి నాశించియు, సంతానమునకు కలుగబోయెడి యుపద్రవము నాలోచించియు నించుక వెనుక ముందులరయుట యవసరమగుచున్నది. కాన ప్రత్యేక పరిస్థితులలో అనగా బాలిక గర్భాదానము కానట్టిదియు లేదా సంతానము లేనట్టిదియునై యుండి భర్త షండుడు, పిచ్చివాడు, కుష్ఠురోగి, దేశాంతరగతుడు నైనచో నట్టి బాలికకు పునర్వివాహ మొనర్పనగును. ఇదియే యాజ్ఞవల్క్యస్మృతియం దుదాహృతమైన ధర్మసూత్రము. ఇట్టి స్థితియందే స్త్రీకి పునర్వివాహార్హత నొసంగనగునని నాయభిప్రాయము. దీని కొప్పదేని జీవత్కళత్రునకు వివాహాధికారము శాసనరీత్యా నిషేధింపబడవలెను; కాని యెట్టి మినహాయింపులులేక విడాకులచట్టము నామోదించుట మాత్రము ఉచితమార్గము కాదు. నేనిట్లు వ్రాయుటచే విడాకులచట్టము వచ్చినంతమాత్రముననే దంపతులెల్లరు కుప్పలుతిప్పలుగా త్రెంపి ముడులు పెట్టుకొందురా, ఏమి నీ పిచ్చి యూహయని నీవు నవ్వెదవేమో: కాదు. కాదు! ಅಟ್ಟೆ విషమస్థితి భారతదేశమున కింతలోరాదు. కాని త్రికరణములయందు వాక్క్రియలకంటె మనస్సునకే ప్రాధాన్య మెక్కువగదా. ఆమోదము మానసికకార్యము. ఇందే మన సదసద్వివేకము వెల్లడికావలెను. నేడు భారతస్త్రీలు డైవోర్సుచట్టము నామోదించినారనినచో ఆచరింపకపోయినను నామోదించినట్లే గదా? అందువలననే, భూతకాలమును పరిశీలించుము. భవిష్యము నాలోచించుము. వర్తమానము గుర్తింపుమని నిన్ను హెచ్చరించుట.


భావపురి

మిత్రురాలు

15 - 4 - 30

శారద.