Jump to content

శారద లేఖలు (మొదటి సంపుటము)/15-వ లేఖ

వికీసోర్స్ నుండి

సౌభాగ్యవతియగు కల్పలతకు:-

నెచ్చెలీ !

ఏమిపెండ్లిండ్లు ! ఏమి ఊరేగింపులు ! ఏమి కోలాహలము ! అన్నివస్తువులకు ధరలు లేచిపోయినవి. గుడ్డల దుకాణములలో సరకు ఝాడాఅయినది. మార్కెటులో కూరలు శూన్యము. మాసినగుడ్డలతో మాగిపోతూన్నామని మొత్తుకొనుచున్నా చాకలివాండ్రు లగ్గసరి అని గుడ్డలుతుకుట మానుకొని పల్లకీమోతలతో పరువులెత్తుచున్నారు. ఇక భజంత్రీల గడబిడ సరేసరి. చంకనుండెడి పొదులు వంకెనువేసి తాళములతో మునిగితేలుచున్నారు. వంటలవారి, పురోహితబ్రాహ్మణులవారి ఆర్జన, అడావిడి చెప్పనక్కరలేదు. కానిమ్ము ఎన్నాళ్లీరొద. దీనితర్వాత వీరందఱికి సుఖసుప్తియే గదా! మేళతాళము లింకా కొంతకాలము జీవించియున్నను పల్లకీలకు మాత్రము పూర్తిగా సెలవే. ఇఁక పెండ్లిండ్లకు వెళ్లివచ్చెడి పేరంటాండ్రకు బొత్తిగా తీరుబడిలేదు. ఇల్లుమఱచిపోయినారంటే సందేహములేదు. పెండ్లి, జోడుపెండ్లిండ్లు, పెండ్లిపైపెండ్లి, పెండ్లిలోపెండ్లి, కార్తిక మార్గశిర మాసములలో రైలువారికి రాబడి ముక్కాలు మువ్వీసము ఈ పెండ్లివారి నుండియే! మదరాసు దక్షిణ మహరటారైల్వే కంపెనీవారు క్రిష్టమసుదినములలో కన్న యీ లగ్గసరిలో ఈపెండ్లి ప్రయాణికులకు తక్కువచార్జీలు యేర్పాటుచేసిన ప్రజలకు చాల ఉప కారముచేసిరని కీర్తింపబడెడి వారే; కాని వారాపుణ్యమునకు పాలుపడలేదు.

అయితే యీ పెండ్లిండ్లప్రళయములో నాకు తగిలిన పేరంట మొకపెండ్లిదేకాని యీ పెండ్లిండ్లసందడివలన నేను పొందినంత శ్రమ, నిద్రనష్టము మఱియొకరు పొందియుండరు. ఏమందురా? గొప్పరాజవీధిలో మాయిల్లు; మఱియు రాజుబాటనానుకొనియే మాయింటి గోడ. చలికి వెఱచి, చూచుటకు విసిగి ఇంటిలో దట్టమైన దుప్పటి ముసుగుపెట్టుకొని పడుకొనినను ఆ యెడతెగని యూరేగింపుల మంగళతూర్యరవములు చెవులలో దూరకుండ నేమి చేయగలను? కాన పెండ్లిండ్లు విరివిగా జరిగిన మార్గశీర్ష మాసమంతయు సుఖదమైన సుప్తి నెఱుగను. క్రిందటి వారములో ఒకనాటిరాత్రి ఓపిక పట్టుకొని వచ్చిన యూరేగింపు నెల్ల చూడవలెనని సంకల్పించుకొంటిని. నా పంతము చెల్లలేదు. అఱగంటలో అయిదూరేగింపులు వచ్చెను. ఒక ఊరేగింపుచూచి లోనికివచ్చి మంచముపై మేనువాల్చితినో లేదో మరల నింకొక పెండ్లివారి యూరేగింపులోని పెద్దబూరగల బూరటింపు చెవులు చిల్లులు పడజేసెడిది. మరల దానిని చూచివచ్చునప్పటికి కింకొకదాని బం, భం, బూ, బూ, అను ధ్వనులు వినవచ్చెడివి. ఎంతచూడగల వేడుకలైనను ఒకటి రెండయిన ముచ్చటగాని రే యెల్ల నదియే రొదయైద విసుగే కాకుండ అసహ్యముగూడ గలుగుట ఆశ్చర్యమా! ఇఁక చూడజాలనని పంతము నిడిచి పడుకొం టిని. కాని విరామ మెఱుగని మేళతాళములవలన నిద్రకుమాత్రమవకాశము లేకపోయినది. ఆ ఒక్కనాడేగాదు. మార్గశీర్ష మంతయు నిట్టి జాగారముల తోడనే గడచినది. అమావాస్య వచ్చినది. “నే డమావాస్య. రాబోవునది శూన్యమాసము. ఇక మేళతాళముల గొడవ యుండదు; ఈనాడైన సుఖముగా నిద్రింత”మని పడుకొంటిని; కాని ఆ రాత్రి కూడా నాగాలేదు. ఒక వూరేగింపురానే వచ్చినది. ఆ పిల్ల మూడేండ్లు నిండియు నిండని పసికూన. కట్టుకొనిన క్రొత్తపరికిణి యెత్తియెత్తి దులుపుకొనుచు, తొడుగుకొనిన పట్టుచొక్కాను పట్టిపట్టి చూచుకొనుచు బొమ్మల పెండ్లిండ్లలోని బొమ్మవలె కూర్చున్నది. పెండ్లికొడుకో పదేండ్లవాడు. నిద్రచే తూగుచున్నాడు. మతిమాలిన తలిదండ్రులు తమపై వైచిన సంసారభారము నా బాలదంపతులెఱుగరుగా! బహుశః యీ వైవాహికోత్సవము గూడ వారికి జ్ఞాపకముండదు. కాని యీ తంతులవలన కలుగబోయెడి కష్టనష్టములకు మాత్రము వారు బాధ్యులు. అకటా! ఎట్టి ఘోరతరాన్యాయము. తలచిన మసస్సు క్షోభజెందుచున్నది. దానితరువాత మఱినాలుగుదినముల కొకయూరేగింపు వచ్చుచున్నది. ఆ వధూవరు లిరువురు సరిగా యెనిమిదేండ్లవారు. పిల్లవాడు నల్లమొఖమల్‌లాగు, కోటు, వేసికొని యున్నాడు. పిల్లకొక పెద్దచీర చుట్టబెట్టి పొదలకమ్మవలె కూర్చుండ బెట్టినారు. ఆ బాలిక యా చీరలోబడి చిక్కములో పిట్టవలె కొట్టుకొనుచున్నది. రానున్న శాసనమువలని భయముచే సనాతనధర్మపరులలో కొంతసంస్కారము కలిగినది. ఏమన తిథిదోషములు, వారపు పట్టింపులు, శూన్యము, మౌఢ్యమాదిగాగల నిషేధములు ఈయేటి పెండ్లిండ్లలో కానరావు. ఆపద్ధర్మముగా ఈసంస్కారమునకు శాస్త్ర మొప్పినదట. పాపము మన శాస్త్రములు చాలమంచివి. ఎవరికేవీలుగావలెననినను దాని కనుగుణ్యమగు నుదాహరణశ్లోకమును జూపి పూర్వాచారపరాయణుల రక్షించును. ఆ కల్పవృక్షము ప్రాపున వారుచేయని సాహసములేదు. పసిబాలలకు పరిణయములు చేసిరి. కసుగందులను గూర్చుండబెట్టి గర్భాధానమంత్రములను వల్లెవేయించిరి. పానుపు వేయించిరి. మిథున విడియము లిప్పించిరి. బొమ్మ నప్పగింపజేసిరి. ఇట్టివివాహము లొకటియా? రెండా ? మాసములలో నుత్తమమైన యీ శుక్లసంవత్సర మార్గశిరమాస మంతయు నిట్టి శిశువివాహములతో కళంకితమై పోయినది. మన మంగళాద్రి నృసింహుడేమి, తిరుపతి వేంకటేశ్వరుడేమి, సింహాద్రియప్పన్న యేమి యీ మాసములో తమ సన్నిధానమున నెన్ని శిశుకల్యాణములు జరిపించిరో లెక్కలేదు. రాళ్లుదేవుళ్లయిన రాసులు మ్రింగవాయని వేమనయోగీంద్రుడు సందేహించినట్టుగనే యీ శిశువివాహములలో దేవుళ్లు రాళ్లయినారు. లేకున్న ఆయాస్వాములవారల సన్నిధానమున తల్లిదండ్రు లిట్టి యక్రమ వివాహ జరుప గలిగియుందురా?

కల్పలతా ! నాకీపెండ్లిండ్ల గడబిడచూచిన మనవారి మౌఢ్యమునకు మహాశ్చర్యమగుచున్నది. చేజిక్కిన పసిబిడ్డలకు వివాహములు చేసినంత మాత్రమున శారదాచట్టమునుండి వీరెట్లు రక్షింపబడిరి ? ఇక సృష్టి ఆగిపోవునా? ఆడుపిల్లలు పుట్టరా ? పెండ్లిండ్లుకావా? అయ్యో? ఎంత చేదస్తులు. 'మన మీపిల్లలకు వివాహము చేసినమాత్రమున నేమైనది? ఎట్లు కావలసిన దట్లగు' నని వీరేల స్థిమితహృదయులు కాగూడదు? పాపము ! తమ తమ ఆతురతకొలది పసిబిడ్డలగొంతులు కోయుచున్నారుగదా! కల్పలతా! ఏస్త్రీల యభ్యుదయము కొఱకై యీ శారదాచట్టము సృష్టింపబడినదో ఆస్త్రీల నీ రెండుమూడు మాసములలో జరిగిన యక్రమపు వివాహముల క్లేశ మర్ధశకాబ్దము పీడించును. ఇప్పు డవిమర్శకముగా పెండ్లి చేయబడిన యీ బాలదంపతులు పెద్దవారైన వెనుక అప్పుడు జరుగుచున్న ప్రౌఢవివాహముల గని కుతూహలమతులై తమ దాంపత్యములను చిందఱవందఱ చేసికొనినచో నప్పు డీ పరమశ్రోత్రియులగు తలిదండ్రులేమి చేయుదురో ? నేడు నవనాగరికులు సైతము 'కూడునా, కూడదా' యని శంకింపుచున్న 'డై వోర్సుచట్టము'ను ఆనా డీశ్రోత్రియసంఘమువారే ఆడుబిడ్డల ఘోషచూడలేక ఆహ్వానింపవలసి వచ్చునేమో గదా? దేశకాలపాత్రములను గుర్తింపక తొందరపడుట యెందును లాభకారిగాదు. నేడు శిశువివాహములకు సహాయభూతులై శారదా చట్టమునకు వ్యతిరేకప్రచారము గావించుచున్న శ్రోత్రియంమన్యు లీవిషయమును గమనింపకుండుట విచారకరమే గాదు ముందున కపాయకరముగూడ నగును సుమా. కాని విశ్వరక్షకుడైన పరమేశ్వరుని ఈ శిశువధూవరుల కెట్టి బాలారిష్టములు కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుట కంటె మనమిక నిప్పుడేమిచేయగలము ?


భావపురి

మిత్రురాలు

5 - 2 - 30

శారద.