Jump to content

శారద లేఖలు (మొదటి సంపుటము)/14-వ లేఖ

వికీసోర్స్ నుండి

సౌభాగ్యవతియగు కల్పలతకు: -

నెచ్చెలీ!

ధర్మవరము లక్ష్మీదేవమ్మగారికి జబాబీయవైతివేమని నీవు వ్రాసిన ఉత్తరమును చూచితిని. నే నామె కీదినమే జాబు వ్రాసితిని. ఆజబా బిందుతో పంపుచున్నాను. కనుము.

సోదరీ! స్త్రీల నాటకరంగనిషేధమునుగూర్చి నేను వ్రాసిన లేఖకు నీవు వ్రాసిన ప్రత్యుత్తరము రెండు మూడు మారులు జాగ్రత్తగా జదివితిని. అందలి తత్వమును గ్రహించుటకు వివేకసాధనమూ, అలిప్తబుద్ధియు, నవసరమని నీవు వ్రాసితివిగాని యీ రెండిటికంటె ముఖ్యావసరముగా గన్పడినది విసుగెరుగని యోపిక. పై శీర్షిక చూచి నాకేగదా యీ ప్రత్యుత్తరమని చదివితినిగాని దాదాపు నాల్గుపుటలు చదివిన గాని నాటకరంగప్రస్తావన రాకపోవుటచే యిది నాకుగాదేమో నని పలుమారులు తలంచిన సమయములుగూడ కలవు. కాని కడవఱకు జదువ నాకేనని నిశ్చయమైనది. దయచేసి నీ వా శీర్షికయందు నాపేరు తగిలించకపోయినచో విషయముకంటె యుపోద్ఘాతమే పెద్దదిగానున్న యావ్యాసమును చదువకనే విడిచియుందును. చదివినతరువాతగూడ జబాబీయదగిన విశేషాంశములేమియు నందు గానరాకపోయినను, యావద్భారతీయులచేతను, నాదర్శకుడగు మానవోత్తముఁడుగను, పూజ్యునీయుడగు ప్రభువుగను, సతతస్మరణీయుడగు దైవముగను సంభావింపబడుచున్న శ్రీరామచంద్రుని గుణశీలములు నిందింపబడుటచేతను, భారతగాథ దూష్యమనుటచేతను, మనదేశమునం దిప్పు డమలునందున్న వైవాహికపద్ధతిచే మన స్త్రీలందఱు పరపురుషసంపర్కము చేయుచున్నవారే అనుట చేతను, నేను నీకు జబాబిచ్చు నవసరముగల్గినది. సోదరీ! నేను నీవంటి తత్వజ్ఞానము గలదానను గాకపోయినను నా సామాన్యబుద్ధికిఁదోచిన చందమున జబాబొసంగిన నా సాహసమునకు క్షమించి చదువగోరెదను.

ప్రపంచమునందలి ప్రతి మనుజుఁడును నేదియో మతమునకు జెందియుండుటయు, నా మతమునుగూర్చి తనకు తెలిసినను తెలియకపోయినను దానియం దభిమానగౌరవములు గలిగియుండుటయు లోకసాధారణము. అయితే మా మతగ్రంథమైన భగవద్గీతయందు మా కధికగౌరవమనిన యన్యమత గ్రంథములైన కొరాను, బైబిలులను నిరసించుటగాదు. ప్రతిమతమును సత్యధర్మాశ్రయమైయేయున్నది. నిజమైన హిందువులకు పరమతసహనము ఉత్తమలక్షణము. అట్టి వారికి ప్రతిమతమును పూజ్యమేయగును. మతమననేమి? స్వేచ్ఛాసహజమైన మానవుల వర్తనమును ఒకనీతికి ఒకధర్మమునకు ఒకసత్యమునకు ఒకసాంప్రదాయమునకు బద్దపఱచునదే మతము. విధినియమములులేని మత మెందును లేదు. ఏమతము నవలంబించినను నామతనియమములు మాన వుని స్వేచ్ఛ నరికట్టకమానవు. ప్రతిమనుష్యుడును నేదేని మతమునకు జెందియుండుట విధినిషేధములులేని తన వృత్తిని యొక కట్టుబాటునకు బద్ధపఱచుకొనుటకే. “యోగ్యమూ, సాధ్యమూ, ఆవశ్యకమూ, హితకరమూ అయినటువంటి నూతనరీతిని నడచుట కేమతముగాని మార్గమునివ్వదు.” తాత్కాలికానందమునుగూర్చెడి ప్రతివిషయమును మనుష్యులకు హితకరముగనే యుండవచ్చును. కాని జీవితముయొక్క యంగాంగమందునూ హితకరమునకు ద్రోవయొసంగుట కే మతముగాని యంగీకరింపదు.

జ్ఞానము జగన్మాన్యమగుట వాస్తవమే. అయినను నదియు నీతిసత్యములకు నిబద్ధమైనప్పుడే జగన్మాన్యతబడయును. మనుజుని జీవితవికాసమునకు దోడ్పడి యుచ్ఛస్థితికి గొనిపోవునది మాత్రమే నిష్కళంకజ్ఞానము. కాని మనుష్యుని విపరీత స్వేచ్ఛజ్ఞానముయొక్క నిదర్శనము కాజాలదు.

జ్ఞానులు తత్వజ్ఞులునైనవారు శ్రీరాముని జీవితమును దోషకలితమనుట కిదియే మొదలు. మన హైందవపురాణేతిహాసములలో నుత్తమము, నాదర్శమునునుగు నితిహాసమేదైనగలదనినచో నది శ్రీరాముని చరిత్రమే యని చెప్పక తప్పదు.

'రాముఁడు దుష్టుడు. ఆయన జీవితములో మోసము, కౌర్యము కానబడునేకాని విశేషసద్గుణము కనుపించుటలే'దని, నీవు వ్రాసితివి. రాముడు ధర్మజీవి. సత్యము, ధర్మము, నీతి త్యాగము ఈ నాల్గుసూత్రములయొక్క సారమే రాముడు. రాముఁడు సీతను పరిత్యజించుట స్థూలదృష్టితో గనిన నింద్యముగనే గోచరించును. కాని రాముని జీవితవిశేషముల నామూలాగ్రముగా గమనించినవారి కందు క్రౌర్యమేమియులేదు. ఆతఁడు తన జీవితమంతటను నిట్టిత్యాగము లెన్నియో గావించెను. పట్టాభిషేకము వనవాసముగా మారినపుడును, భరతుఁడేవచ్చి పాదాక్రాంతుఁడై రాజ్యమును స్వీకరింపుమని కోరినప్పుడును, రాముడు చూపిన త్యాగము నిరుపమానమైనది. తండ్రిని సత్యవాక్యనిరతునిగా జేయుటయు, తాను పితృవాక్యపరిపాలనాధర్మము సకలంకముగా నెఱపుకొనుటయు ఆనాటి యాతని త్యాగమునకు కారణములు. రాముఁడే క్రౌర్యచిత్తుఁడు, మోసగాఁడునైనచో నట్టిత్యాగము గావించి యుండునా? అప్పటికి రాముని పలుకుబడి యెట్లున్నది? రాజు, ప్రజలు, మంత్రులు, బంధులు, మిత్రులు, అందఱు ఆయన పట్టు. రాముడే క్రూరుడైనచో ఆనా డెట్టి బీభత్సము జరిగి యుండవలెను. ఔరంగజేబువలె తండ్రిని చెఱలోనిడి తమ్ముల వధించి గద్దెయెక్కెడివాఁడు కాఁడా? కాని సాధులోకగణ్యుఁడగు శ్రీరామచంద్రు డెట్టి నిగ్రహము చూపెను! పరమాశ్చర్యముగదా! ఇఁక సీతాపరిత్యాగవిషయమున విచారింతము. రాముఁడు


యద్యదాచరితిశ్రేష్ఠః తత్తదేవేతరోజునః
సయత్ప్రమాణంకురుతే లోకస్తచనువర్తతే.

అనగా శ్రేష్ఠుడు దేనినాచరించునో దానినే ప్రమాణముగా గొని లోకము వారి ననుకరించునని దాని తాత్పర్యము. కాన శ్రేష్ఠుఁడైనవాడు, లోకమున కాదర్శపురుషుఁడైనవాడు లోపరహితుడుగా నుండవలెను. కాన స్వార్థమును చంపుకొని లోకహితము గమనింపవలెనని రాముని ఆదర్శము. ప్రజల కోర్కెలదీర్చుట, ప్రజల యభిప్రాయము ప్రకారము నడుచుకొనుట, ప్రజలను కన్నబిడ్డలవలె బ్రోచుట యివి తన

పరిపాలనాధర్మములుగా బెట్టుకొనినాఁడు రాముఁడు. ఆ ధర్మమును నిలుపుకొనుటకే ప్రజల యిచ్చాను సారముగా సీతను పరిత్యజించెను. ఈవిషయమున నాతడు పరతంత్రుఁడు, ప్రజాభీష్టానువర్తి. కాన నీసందర్భమున మనము గుర్తింపవలసినది సూక్ష్మతరమైన యాతని ధర్మలక్ష్యముగాని బాహ్యక్రియ గాదు. అంతమాత్రముచే రాముఁడు క్రౌర్యవృత్తిగలవాడనుట పాడిగాదు. రామునకు సీతయం దపారమైన ప్రేమ గలదు. గౌరవముగలదు. విశ్వాసముగలదు. ఇందులకు నిదర్శన మాత డేకపత్నీవ్రతుఁడై యుండి యశ్వమేధాదియాగ సమయంబులలోగూడ స్వర్ణసీతతో యజ్ఞతంతును నడుపుకొనుటవలననే. తెల్లమగుచున్నది. రాముఁడు గావించిన యిట్టి కృత్యమునకు సీత కాతనిపై యభియోగము నడుపగల హక్కుగలదనియంటివి. నిజమే కావచ్చును. ఇక్కాలపు సీత యనగా మీ నాటకపు సీతయైనచో నట్టిపనిని తప్పక చేసెడిదే! కాని కృతయుగపు సీత యట్టిదికాదు. పెనిమిటి ధర్మ తత్పరత యామెకును దెలియును. సత్యముకొఱకు, ధర్మముకొఱకు, ప్రజాహితముకొఱకు నా సర్వస్వము నర్పించెదనని యాతఁ డెన్నిమారులో పలికియుండెను కాన ఆతని ధర్మాచరణము నెఱిగియుండిన ధార్మికురాలగు సీత పెనిమిటిపై ఏమని వ్యాజ్యము నడపును? కావుననే యామె పెనిమిటిని పల్లెత్తి యొక్కమా టనలేదు. నిరపరాధయయ్యు, పామరజనుల సంతుష్టికొఱకును, పెనిమిటి ధర్మమును నిలుపుటకొఱకును దుర్భరమైన యాకష్టములను సహనముతో భరించెను.

రాముడు సీతనే గాదు, ఆబాల్యమునుండియు దన్ననవరతము సేవించిన లక్ష్మణునిగూడ నట్టులే త్యజించెను. ఆ నాడుగాదు, ఈనాడు మహాత్మాగాంధి తన జీవితచరిత్రలో నేమివ్రాసెనో కనుము.

"ఈ శోధనమున నేను నా ప్రియతమవస్తువులగూడ విడనాడగలను. మఱియు నే నీ శోధనయజ్ఞమున నా శరీరమునుగూడ హోమముచేయ సంసిద్ధుఁడను.”

సోదరీ! మహాత్ముల ధర్మలక్ష్యమట్టిది. అందుకు వారిని దుర్మార్గులని నిందించుట తగదు. ఇఁక మహాభారతమునుగూర్చి, ప్రద్వేషిణి పెనిమిటియగు దీర్ఘతముఁడు పుట్టంధుఁడు, వృద్ధు. అట్టివానిని నేను భరింపజాలననియు, నెక్కడకైన పొమ్మనియు ప్రద్వేషిణి చెప్పినది. ప్రద్వేషిణి చిన్నదిగాదు. గౌతమాదులైన పుత్రులను బడసిన యిల్లాలు. అట్టిది అంధత్వముచేతను, వార్ధక్యముచేతను ససమర్థుడై యున్న భర్తను లేచిపొమ్మనెను. నిస్సహాయుడగు నా చీ కేమి చేయును? పాపము! కోపముపట్టలేక శపించెను. అందులకు కోపించి ప్రద్వేషిణి యాతనిని కట్టెలతో కట్టగట్టించి కొమారులచే గంగలో త్రోయించినది. ఇం దధికాపరాధ మెవరిది? దీర్ఘతమునిదా? ప్రద్వేషిణిదా? సోదరీ! ఇట్టి నారీరత్నమును సమర్థింపబూనుట నీ వాదమునకు బలము కాజాలదు. మహాభారతములోని యీ చిన్నయుపకథ భారతమంతయు దూష్యమని దూషించుటకు జాలినంత బలవత్ప్రమాణమును కాదు.

ద్రౌపదిని పందెమిడుట యక్రమమే. కాని యందును ధర్మసూక్ష్మత లేకపోలేదు. అందు కొంత యొప్పిదమేలేకున్న భీమార్జును లప్పుడే తిరుగబడియుందురు. ఇంతకును వారి యపూర్వత్యాగము, కష్టసహిష్ణుత, ధర్మబద్ధత, వినీతవర్తనమే లేకున్న వారు మనకు స్మరణీయులే కాకపోవుదురుగదా! అయినను గుణదోషవిచారణలేక అందలి కథయంతయు సత్యమనియు అనుకరణీయమనియు నేను చెప్పలేదు. చెప్పను. ప్రస్తుత సాంఘికజీవనమున దూష్యములని నిందింపబడెడి యధర్మములెన్నియో అందు ధర్మములుగా నిరూపింపబడి యున్నవి. అవియెల్ల మన మాచరింపదగునని వాదించెడి వెఱ్ఱి నాకులేదు. మహాభారతమున నుత్తమపాత్ర లెన్నియో గలవు. వారి చరిత్రములు మనము పఠించి మన నిత్యజీవితమునకు సాధనములుగాగొని ధర్మమును సత్యమును నీతిని వికాసపఱచుకొనుటలో దోషమేమి? అభిమన్యునివంటి వీర కుమారుని చరిత, కర్ణునివంటి దానశూరుని గాథ, గాంధారివంటి మహాసాధ్వి చరిత్రము, భీష్మునివంటి సత్యవ్రతుని వృత్తాంతము, ద్రౌపదివంటి స్త్రీరత్నముయొక్క ధర్మపరిజ్ఞానము, బుద్ధికౌశలము, గృహనిర్వాహకత్వచాతుర్యము దెల్పెడి వృత్తములు మన కాదర్శపాత్రములు కాకేలపోవును? మఱియు మన కాదర్శపాత్రములగు సావిత్రివంటి మహాసాధ్వీమణుల చరిత్రము లెన్నియో యందుపకథలుగా చేరియున్నవి. సోదరీ! భారతభాగవత రామాయణాది పురాణేతిహాసములు నింద్యములని నిషేధించినచో మీ నాటకకళాపోషణకైన కథలేవి? బహు సాంఘికములు, చారిత్రకములునని మీ యుద్దేశమేమో! ఆ విధముగా చూచినను రామదాసు నాటకమాడినచో నాతని యుపాస్యదైవము రాముడు. మీరాబాయియాడినచో నామె దేవుఁడు కృష్ణుడు. మరల అక్కడగూడ పురాణపురుషులే ప్రత్యక్షము. ఎంత నింద్యములని దూషించినను ఆ పురాణేతిహాసములు విడనాడినచో మనకాడుటకు, పాడుటకు, చెప్పుకొనుటకు వేఱు తెన్నే లేదు. తొలుత యెంత తీవ్రముగ నిరసించినను పురాణగ్రంథముల సహాయమును, జ్ఞానముచే తగినంతమాత్రము అవశ్యముగ తీసుకొనుటకు అభ్యంతరము లేదని, నీవును ఒప్పుకొనక తప్పినదికాదు. ఇఁక నిదియే తగునని చెప్పిన నాపై నిశితవిమర్శన లెందుకు?

శివాజీవంటి మహాశూరుని తయారుజేయుటకు జిజీబాయి పురాణగ్రంథములనే ఆశ్రయించినమాట వాస్తవము. ఆమాట శివాజీ చరిత్రమునందే గలదు. కాని ఆధునిక శివాజీల యుత్పత్తికి నీవు చూపెడి నవరీతులేమో ఆధునిక స్త్రీల వలన నికయెఱుగవలసియున్నది.

కళావంతులనియు, వేశ్యలనియు పిలువబడెడి యొకతెగ వారాంధ్రదేశమున గలరు. నృత్యగీతాభినయాదులు వారి కులవృత్తి. అవివాహితలగు నాస్త్రీలు పురుషులసన్నిధిని నృత్యగీతాదుల ప్రవర్తింప జేయుటచేత వారిలో నీతిభంగదోష మేర్పడినది. నీపోటీవ్యాసమునందిదియు నీవంగీకరించితివి. దీనికాసంఘీయు లిప్పుడు పొందుచున్న విచార మింతయంతగాదు. నృత్యగీతాదులు మానివైచి వివాహములు చేసికొని తొల్లిటి నైచ్యమును తొలగించుకొని సాటిస్త్రీలోకములో సమానత్వమును బడయుటకై వారిప్పుడు మహాకృషి చేయుచున్నారు. తొల్లి నాట్యాభినయములలో పాల్గొనిన వారిస్థితి కన్నులార గాంచుచు మరల కులస్త్రీల నీయగాధకూపమున బడద్రోయ నెంచుటయు, దానికి నీవంటి విదుషీమణులు చేయూతనిచ్చుటయు శ్రేయస్కరముగాదు.

శ్రీరవీంద్రనాధటాగోరుగారును, హరీంద్రనాధచటోపాధ్యాయులును తమ స్త్రీలను రంగభూమికి తెచ్చిరని వ్రాసితివి. అందుల కాప్రాంతీయులెంతకుందుచున్నదియు ఈమధ్య చెన్నపురిలో జరిగిన సనాతనధర్మసభ కేతెంచిన యొక బెంగాలీబాబు స్త్రీలను రంగభూమికితెచ్చి పాడుచేయుచున్నారని చెప్పి విచారించెను. కంటివా? కాన ఈయుద్యమమున కారాష్ట్రీయు లైన యెక్కువ ఆమోదమును తెలుపుటలేదు. హిందూప్రేమ సంఘమువారాడిన నాటకమును చూచి మహాత్ముడు మోదించెనని వ్రాసితివి? సరియే. కాని ఇన్ని పాశ్చాత్యసాంప్రదాయములతో ఇన్ని అంగరంగవైభవములతో స్త్రీపురుషులు రంగభూమిని అభినయించుటను గూర్చి వారి ప్రత్యేకాభిప్రాయము నడిగితెలిసికొంటిరా? గట్టిగా ఆయన అభిప్రాయము కోరినచో మహాత్ముడెప్పుడును అనుకూలాభిప్రాయ మియ్యడనియే నా యభిప్రాయము. అయినను మహాత్ము డంగీకరించినను యెల్లరంగీకరింపవలెనని సిద్ధాంతమా!

నాటకమనిన కేవలము శృంగారమనియే నా భావనకాదు. అందు నవరసము లొలికింపబడునని నేనెఱుఁగుదును. ఏరసమైనను నేవిలాసమైనను నాటకమనిన కపటసంసారము వంటిదనియు, అందొకచో శయ్యాగృహము, ఒకచో కొలువుకూటము, ఒకచో ఉద్యానవనము, ఒకచో యుద్ధము, ఒకచో శ్మశానము రంగస్థలములుగా నుండుననియు నాకు దెలియును. ఇట్టి భిన్నసమావేశముల కాస్పదమగు రంగస్థలమునందు స్త్రీపురుషుల కలయిక కులాంగనలకు సమంజసమును గౌరవాస్పదమును గాదు. ఈసందర్భమున సోదరీ, నీవు గావించిన హిందూవైవాహికప్రస్తావన మిక్కిలి యసమంజసముగా నున్నది. ఎప్పుడు బాలిక కొక పురుషునితో వివాహము చేయబడునో అతడే తనవాడనియు తదన్యులు పరులనియు, విశేషించి సోదరతుల్యులనియు భావించి యాతని యందే లగ్నచిత్తలగుట మన హిందూకుటుంబములయందు సాంప్రదాయముగానున్నది. పెనిమిటి యెంత దుర్మార్గుడైనను నేనతని దానినే యనుకొనును గాని ఆతడయోగ్యుడని పరపురుషవాంఛ కలిగియుండు టనునది దుర్జాతిలక్షణము. ఉత్తమురాలగు నేహైందవకుటుంబినియు నట్టి తలంపుకలిగియుండదు. మన హిందూకుటుంబములలో అందును బ్రాహ్మణకుటుంబములలో పతినివరించి పెండ్లాడెడి పద్ధతియింతవఱకు లేదుగదా. తలిదండ్రులు పరిణయము చేసిన వరునియందే యనురక్తులగుట వధువుల ధర్మముగా నున్నది. శారదాచట్టమువలన మునుముందీ వైవాహికపద్దతి మార్పునొందునేమోకాని యిప్పటిపద్ధతి స్వయంవరము కాదు. అట్టిచో అట్టి వివాహము లన్నియు సక్రమము లనియు నట్టివారు పరపురుష సంపర్కము చేసినవారనియు నిర్ధారించుట సాహసము. తలిదండ్రు లెవనికొసంగిన వానినే పరదైవముగా నెంచి ప్రేమించి గౌరవించెడి హిందూస్త్రీలయెడ చిత్తమొకనికి శరీరమొకనికి యొసగుచున్నారని నీవు వ్రాసినవ్రాత మిక్కిలి యనుచితముగా నున్నది. ఇట్టి యూహ హైందవకుటుంబినుల యెడ తలపరాని విషయము. అటుల భావించినచో మన బ్రాహ్మణ స్త్రీలలో వరించి వివాహమాడిన వారెవరు? అందఱము మన జననీజనకులచే నొకరికి దానము చేయబడిన వారమే. కాన నీమతమే నిజమగుచో మనము, మనతల్లులు, సోదరీమణులు, పుత్రికలు, వేయేల మన భారతమహిళ లెల్లరు చెడ్డవారే యనవలసివచ్చును, సోదరీ! మన వివాహసంస్కారమునందు లోపములున్నచో సంస్కరింప నగునుగాని నీనాటకరంగ ప్రవేశోద్యమసమర్థనముకొఱకు స్త్రీలనెల్లర కట్టగట్టి యిట్టి హేయమగు నిందకు గుఱిసేయుట కడుంగడు సాహసమే గాక యక్రమమనియు బల్క సాహసించినందుకు క్షమింపకోరెదను.

నాటకరంగమున స్త్రీలుచేరుటచే చెడిపోవుదురని నందులకు ఇప్పుడు బాగుగా నున్నవారెవ్వరు? వరించిపెండ్లాడని వానియందు ప్రేమ యెట్లుకుదురును? కాన యిప్పుడు మన స్త్రీలు చేయునది యంతయు పరపురుషసహవాసమేయని వాదింప దగునా? పతిచే పలుబాములు పడుచున్నను ఆతనినే దేవునిగా భావించి బూజించుచున్న వారును, పతి విగతజీవుడుగా సర్వము వర్జించి వీరవైరాగ్యము సలుపుచున్నవారును నైన మన భారత మహిళల హృదయమెఱుగక నీవు వ్రాసిన వాక్యములు వారి మానసము నెంత నొవ్వచేయునోగదా?

జ్ఞానముచే మనస్సును పరిపక్వము చేసికొనిన వారికి పరపురుష సాన్నిధ్యభీతి లేదని వ్రాసితివి. మంచిది. నీవు సుశిక్షితలనుగా జేసిన కులీనస్త్రీ లట్టివారే గావచ్చును. కాని వారితో నభినయింపవచ్చిన పురుషులుగూడ నట్టివారు కావలెనుగదా. సరి. యత్నముమీద వారినిగూడ మంచివారినే సంపాదించెద రనుకొందము. కాని చూడవచ్చిన వారుగూడ బ్రహ్మజ్ఞానులు కావలెనుగదా. లేకున్న వారిచే నైన హేళనలు తప్పవుగదా. సోదరీ! ఏవేషభాషలు లేక బడికివెళ్ళి చదువుకొనివచ్చు కన్యలకే యిక్కాలమున మగ వారిచే మాటలు తప్పకున్నపుడు నాటకము లాడెడి కులీనస్త్రీలెత్తెఱగున మాటలు పడకుందురో నాకు దోఁచలేదు. హిందీప్రేమసంఘమువారాడిన నాటకములకు ఇష్టములేనివారు గూడ వచ్చిరని సంతసముతో దెల్పితివి. అవును ఇష్టములేనివారే యధికముగా వచ్చెదరు. కాని ఆవచ్చుట ఆక్షేపించుటకేగాని ఆమోదించుటకు గాదుసుమా! సోదరీ! మన దేశమున పురుషులింకను స్త్రీలవ్యక్తిత్వమును స్వాతంత్ర్యమును ఆమోదించుట కలవాటుపడలేదు. స్త్రీలయందుగల నీరసభావము తొలగలేదు. వారి యాటపాటలను గౌరవముతో సమానముతో చూచుట నేర్చుకొనలేదు. కాన వారి చిత్తవృత్తులు మార్పు నొందనిది స్త్రీలు రంగభూములెక్కుట యుక్తముకాదు. కాన నీవును కళాభివృద్ధిచింత నటుంచి మన స్త్రీల పురోభివృద్ధినే చిత్తమునందధికమగా నెంచి స్త్రీల యశోహానికరములగు నిట్టి యుద్యమములకు చేయూతనీయవలదని ప్రార్థన. ఇది నాయొక్కతె ప్రార్థనయేగాదు. మన స్త్రీలలో అధికసంఖ్యాకు లిటులనే కోరుచున్నారు. ఇటీవల బెజవాడకు వెళ్లినప్పుడు నేను చాలమంది విద్యావతులతో ఈవిషయమై మాట్లాడితిని. మహాసభలో ప్రస్తావించితిని. అత్యధికసంఖ్యాకు లీయుద్యమమునకెట్టులు ప్రతికూలమున నుండిరో నీవుగూడ వచ్చినచో చక్కగా చూచియుందువు.

ఒక గొప్పస్త్రీవిద్యాసంస్థనడుపుచున్న యొక నారీమణి స్త్రీల నాటకరంగ ప్రవేశమునుగూర్చి ప్రసంగింపుచు ఇట్టు లనెను. "రామదాసు వేషమును రాఘవాచార్యులుగారు వేస్తేబాగుంటుంది. వారివేషధారణమనిన జనులు అధికసంఖ్యాకులు వస్తురు. డబ్బుబాగావచ్చును. కానవారిని మావిద్యాసంస్థసహాయార్థం మొక్కప్రదర్శనమును కోరితె బాగుండు ననుకొంటిని. కాని వారి యిప్పటి స్త్రీల నాటకరంగప్రవేశయత్నమును జూచి సాయము చేయమంటే ఏఆడదాన్నైనా తనతో ఆడజాతికి పట్టుకరమ్మంటారేమో! అట్లా తీసుకురమ్మంటే ఎవతెను తీసుకవచ్చేది? ఏఅమ్మనైనా నీవు వస్తావా? అని అడిగితే నీవే ఆడరాదా? అంటుందేమోనని భయం. మఱిన్నీ రాఘవాచార్యులుగారు రామదాసుపాత్రను ధరించినచో రామచంద్రారెడ్డిగారు కబీరు పాత్రమును ధరించినగాని బాగుండదు. స్త్రీ లెక్కిన రంగభూమి నెక్కనని యీయన వ్రతము. స్త్రీలు స్త్రీపాత్రము ధరించినగాని నాటకమాడనని ఆయనపట్టు. ఈ సంగతి సందర్భములు చూచి వారిసహాయమును కోరుట మానుకున్నాను.”

సోదరీ! స్త్రీల భీతి యిట్టులున్నది. మఱియు నొక మనవి. నీప్రత్యుత్తరము దెల్లెడలను నేను జ్ఞానిని, తత్వజ్ఞురాలను, నాబుద్ధి యసాధారణమైనది యను నాత్మస్తుతియు విూరు వివేకరహితులు, అజ్ఞానులు, దురభిమానులు, అల్పబుద్ధు లనుపరనిందయు గోచరించుచున్నది. జ్ఞానులును విశేషించి తత్వజ్ఞులునునైన వారిట్టివిముందుగా త్రుంచివేసికొనదగినది యని తెలిసికొనగోరెదను.


భావపురి

మిత్రురాలు

జనవరి 1930

శారద.