శారద లేఖలు (మొదటి సంపుటము)/13-వ లేఖ
సౌభాగ్యవతికల్పలతకు: —
నెచ్చెలీ!
బహుకాలమునకు నీకు మన ఆంధ్రమహిళాసభను కన్నారజూచి తెలుపగలుగు భాగ్యమబ్బినందులకు సంతసమగుచున్నది.
నిజముగా ఈ నవంబరునెల మొదటివారము మన ఆంధ్రులకు జాతీయపర్వవారమని చెప్పనొప్పును. అహో! ఎన్నిసభలు! ఎందఱుజనులు! ఏమికోలాహలము! ఎంతయుత్సాహము! వర్ణనాతీతముగదా! కల్పలతా! అమ్మహోత్సవము చూచిన తరువాత నిజముగా నక్కడి కేగుటయు, కనుటయు, వినుటయు మహాభాగ్యమే యనుకొంటిని.
మేము బెజవాడలో 2 - 11 - 29. తేదీని రైలుదిగునప్పటికి స్త్రీ లిరువురు మాకెదురుపడి యొక కరపత్రమొసగి తామేర్పాటుచేసిన బసకు రావలసినదని యాహ్వానించిరి. మా కీయూరబంధువులు గలరు. కాన వారియింటికేగి సభకు హాజరు కాగలమని వాక్రుచ్చితిమి. వారు సరేయని విడిచి పుచ్చిరి. తరువాత వారొసంగిన కరపత్రమును చూచితిమి. మఱునాడు ప్రత్యూషముననే మహిళాసభ ప్రారంభమని అందుండెను. ఆహ్వానసంఘమువారు సభలవిషయమై స్థిరమగు తేదీని ప్రచురింపరైరి. ఎట్లు వెళ్లుదునని తహతహలాడి యెప్పుడు జరిగిననప్పుడే చూడవచ్చునని తేదీ తెలియకనే నేను బెజవాడ వెళ్లితిని. మఱునాడే సభ. నే నేకొంచెమాలస్యము చేసినను మహిళాసభను గాంచెడి భాగ్యము గల్గెడిది కాదు. చాలామంది కట్టి యాశాభంగముకూడ గల్గెను.
ఆరేయి గడచెను. ఉదయమేలేచి ప్రాతఃకృత్యముల నిర్వర్తించుకొని దాదాపు ఎనిమిదిన్నర గంటలవేళ మహిళాసభ జరిగెడి దుర్గావిలాసమున కేగితిమి. అక్కడ సభల సందడేమియు కాన్పింపలేదు. ఆ పెద్దహాలులో కొద్దిమంది స్త్రీలు ఒకమూలకుప్పగా గూర్చుండియుండిరి. "తొమ్మిదిగంటలు కావచ్చినది. సభానిర్వాహకురాండ్రేరి? ఆహ్వానసంఘాధ్యక్షురాలెక్కడ? అధ్యక్షురాలు వచ్చెనా? యని అక్కడివారి నడిగితిని. "అధ్యక్షురాలిని తోడ్కొనివచ్చుటకు స్టేషనుకు వెళ్లినారు. కూర్చోండి. వస్తారు” అని అక్కడ నున్న వారనిరి. సరేనని నేనును మాబంధుస్త్రీలును కూర్చుంటిమి. తొమ్మిదయ్యెను పదియయ్యెను పదునొకండయ్యెను. జాడలేదు!! సభలకై వచ్చి కృష్ణస్నానమున కేగినవారును, కనకదుర్గను జూడనేగినవారును, పురుషుల సభలో జరిగెడిపతాకోత్సవమును జూడనేగినవారును, యుస్సురస్సురనుచు రాసాగిరి. ఇంకను విషయనిర్ణయసభకొఱకు కూర్చుండుట అనవసరమే గాదు దుర్భరమే యనిపించెను. చల్లగా నింటికి వెళ్లిపోతిమి. దాదాపు పదిరెండుగంటల వేళ ముత్తులక్ష్మిరెడ్డిగా రరుదెంచిరనియు విషయ నిర్ణయముల విషయమై సమాలోచన జరిగెననియు వింటిని. మధ్యాహ్న కార్యక్రమము ఒంటిగంటకని ప్రకటనలో నుండుటచే నించుమించుగా మరల ఆవేళకు దుర్గావిలాసమున కరిగితిమి. కాని అప్పుడును సభలసందడి కాన్పింపలేదు. కొద్దిగా పురస్త్రీలు మాత్రము వచ్చుచుండిరి. ఈపూటగూడ సభ యెప్పుడు జరుగునో యనుకొంటిమి. దాదాపు రెండుగంటల వేళ సన్మానసంఘాధ్యక్షురాలును, సభాధ్యక్షురాలును సభకరుదెంచిరి. అంత స్త్రీల సభకై ప్రత్యేకముగా నిర్మింపబడిన విశాలమగు పందిరిలో చేరితిమి. ఇతర పురములనుండి యరుదెంచిన స్త్రీల సందడియేగాని పుర స్త్రీలరాక కొలదిగా నుండెను.
విజయవాడ నాకు చిరపరిచితమైన పురము. ఆ పురస్త్రీలు సిగనిండ పువ్వులు దుఱుముకొని యొడలినిండ నగలుపెట్టుకొని వన్నెవన్నెల విలువచీరలను ధరించి ప్రతి చిన్న హరికథకును, ప్రతి భజనసమాజమునకును తండోపతండములుగ వచ్చుట నే నెఱుంగుదును. ముఖ్యముగా ప్రసిద్ధ నాటకఖేలన మనినచో పురుషులుకూర్చుండు ప్రదేశముకంటె స్త్రీలుకూర్చుండెడితావు క్రిక్కిరిసిపోవుట బెజవాడ నెఱిగిన వారికి క్రొత్తగాదు. కాని మహిళాసభపై వారేలనో శీతకన్ను వేసిరి. వివిధప్రదేశములనుండి పెక్కుమంది విదుషీమణు లరుదెంచి తమయూర గుమికూడి స్త్రీలకు సంబంధించిన పెక్కువిషయములను గూర్చి చర్చించుచుండగా వానిని చూచుట కైనరాని పురస్త్రీల యుదాసీనత యనుచితమును, నక్కజమును అనిపించెను.
అధ్యక్షురాండ్రు సభ కరుదెంచిన తరువాత సభా ప్రారంభమున కాలస్యము జరుగలేదు. శారదానికేతనపు బాలికల సుమధురమైన దైవప్రార్థనతోడను, భరతమాతృస్తవముతోడను, రాట్నగానముతోడను, సభ ప్రారంభమయ్యెను. తదుపరి అధ్యక్షురాలి యెన్నికతంతునడపి శ్రీమతి ముత్తులక్ష్మిరెడ్డిగారిని యగ్రాసన మెక్కించిరి. తరువాత నొక విదుషీమణి అచ్చొత్తిన స్వాగతపద్యములను మనోహరముగ జదివెను. అప్పుడే కళావంతులు, శ్రీ॥ ముత్తులక్ష్మమ్మగారు తమ సంఘమునకు గావించిన యమూల్యోపకారమునకు కృతజ్ఞతా సూచకముగా స్వాగతపత్రమును సమర్పించిరి. అనంతరము ఆహ్వానసంఘాధ్యక్షురాలగు తుర్లపాటి రాజేశ్వరమ్మగారు విషయగర్భితమైన తమ మహోపన్యాసమును జదివిరి. తరువాత అధ్యక్షురాలగు డాక్టరు ముత్తులక్ష్మిరెడ్డిగారి యాంగ్లోపన్యాసమున కాంధ్రానువాదము వేఱొక నారీమణిచే చదువబడెను. మఱియు వారిరువురి యుపన్యాసములును పుస్తకరూపమున ప్రచురితములై సభలో పంచిపెట్టబడెను. మొత్తము మీద రెండుపన్యాసములు స్త్రీలకు సంబంధించిన పెక్కువిషయములతోగూడి భావగర్భితములుగా నుండెను.
తదుపరి తీర్మానము లారంభమయ్యెను. మొట్టమొదటిదే శారదాబిల్లు శాసనమైనందులకు మహిళాసభవారు తమ యామోదమును తెల్పెడి తీర్మానము. పూర్వాచారపరులకు హృదయశల్యమును, సంస్కర్తలకును, దేశహితైకాభిలాషులకును, స్త్రీజనాభ్యుదయ చింతనాపరులకును నానందకరమునునగు నా తీర్మానము నెగ్గినవెనుక ఖద్దరు, హిందీ, స్త్రీపునర్వివాహములు, స్త్రీ వారసత్వములు, గౌరుగారి వయోనిర్ణయశాసనము, సంపూర్ణ స్వాతంత్య్రము, అస్పృశ్యత యనెడి పెక్కు విషయములనుగూర్చి తీర్మానములు చేయబడెను. అగ్రజాతులను కంపితగాత్రులను గావించెడి అస్పృశ్యతా విషయిక తీర్మానము సభలో చర్చకువచ్చునప్పటికి సాయంత్ర మాఱుగంటలు దాటెను. “మాలవాండ్ల నేవిధముగా దరిజేర్చుకొందు మనువారి ఆలాపములును, ఇండ్లకు వెడలవలసినవారి సందడియు నేకమై సభలో కలకలము మెండయ్యెను. ఇదే సమయములో సభలో పాల్గొనుట కవకాశము చిక్కనివారి కసంతృప్తిమెండై యొకచోనలిగి కూర్చుండి వియ్యపురాలి సాధింపులు సాగించిరి. ఇట్టిస్థితిలో సభను సాంతముగా సాగించి ముగించుటకు సాధ్యముగాక మఱునాడు సభను మూడుగంటలకు వాయిదావేసి ముగించిరి.
మఱునాడు కొంచెమాలస్యముగా నేను సభ కేగియుండుటచే నేను వెళ్ళునప్పటికే సభ ప్రారంభమైయుండెను. గత దినపు మహిళాసభ తరువాయియెట్లు సమాప్తము చేయబడెనో నాకు తెలియదు. నేడు తీర్మానములు లేక యెవరికి వారు తమ యభిమాన విషయములను గూర్చి ప్రసంగింప నగునని వాక్రుచ్చిరి. స్త్రీవిద్య, కీ. శే. మాగంటి అన్నపూర్ణాదేవి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, స్త్రీల నాటకరంగప్రవేశ మాదిగా గల పలు విషయములనుగూర్చి పలువురు ప్రసంగించిరి. గతదినము అస్పృశ్యతా తీర్మానమువలె ఆనాడు స్త్రీల నాటకరంగ ప్రవేశము వివాదకారణమయ్యెను. స్త్రీలలో సమాన స్వాతంత్ర్యమునకు హక్కులకును పోరాడెడి నాగరికస్త్రీలుగూడ నాటకరంగప్రవేశమునకు ప్రతికూలత దెలిపిరి. ఒక్కగానొక్క విదుషీమణియే నాటకరంగప్రవేశము వాంఛనీయ మనెను. స్త్రీలకా వాక్యమువినుటకే దుస్సహ మనిపించెను. సభలో కలకల మారంభమయ్యెను. వారిని సమాధానపెట్టుటకు కొంతసమయము కావలసివచ్చెను. తరువాత నొకరిద్ద రుపన్యసించిన వెనుక అగ్రాసనాధిపురాలు అంత్యోపన్యాసము నొసగి సభ ముగింపు చేసెను. సభ జరిగిన రెండుదినములును అగ్రాసనాధిపురాలగు ముత్తులక్ష్మీ రెడ్డిగారి సౌమ్యప్రవర్తనము, సహనము ప్రశంసనీయమై యుండెను. ఆంధ్రస్త్రీల కామె క్రొత్తయైనను చిరపరిచితురాలగు మిత్రురాలివలె నందఱతో నుల్లాసముగా మాట్లాడుచు సహనముతో వినుడని స్త్రీలను హెచ్చరించుచుండెను. వచ్చియు రానితెలుగు మాటలలో స్త్రీలతో నామె గావించిన సంభాషణలు హెచ్చరికలు తన దేశీయులగు స్త్రీలయెడ ఆమెకుగల యత్యంత గౌరవమును తేటపఱచినవి. సభ ముగిసిన వెనుక మేము ప్రదర్శనశాల కరిగితిమి. ప్రదర్శనము చాలచిన్నది. ఖద్దరులో పలురకముల రంగువస్త్రములు, సన్ననూలు వస్త్రములు, జరీ, పట్టు, ఉన్నివస్త్రములు, వానితో తయారుచేయబడిన చేతి రుమాళ్లు, శాలువలు, బిడ్డలచొక్కాయలు, పెక్కులందుండెను. గాంధీగారు వడకిననూలు, తదితరులు వడకిన సన్న నూలు, వివిధరకముల రాట్నములు, ప్రదర్శింపబడి యుండెను. శారదానికేతనపు బాలికలయొక్కయు తదితరచిత్రకారులయొక్కయు చిత్తరువులుగూడ నందు గలవు. ప్రదర్శనద్వారమున కెట్టయెదుట మహాత్మాగాంధీగారి సంపూర్ణ తైలవర్ణ చిత్రపటము ఆకర్షణీయముగ నుంచబడెను.
ఆప్రదర్శనశాలావరణములోనే ఖద్దరువస్త్రములు, పుస్తకములు, ఔషధములు, పేమువస్తువులు నాదిగాగలవి విక్రయించు నంగడులుంచబడి యుండెను. ఇంచుమించుగా వానినెల్ల తిలకించితిమి. ఖద్దరు వస్త్రములు బేరముచేసితిమి. వస్త్రములలో సీతానగరము సత్యాగ్రహాశ్రమము వారియంగడియందును, సి. వెంకటరంగము శ్రేష్ఠివారి యంగడియందును వెలలు సరసముగా నున్నటుల దోచెను. తునివారి విక్రయశాల యన్ని విక్రయశాలలకంటె పెద్దదై పలురకముల వస్త్రములకు నిలయమై యాకర్షణీయముగా నుండెను. వారి విక్రయశాలలో లేనిగుడ్డలేదు. విదేశవస్త్రధారులను గూడ మోహింపజేసెడి గుడ్డలందుగలవు. భీమవరమువారి అంగడి తుండుగుడ్డలకు ప్రశస్తమనిపించుకొనెను. మేమందందు రెవికల గుడ్డలు, తుండ్లు, శాలువలు, కొంటిమి. ఒకమూల నొక స్త్రీ సన్నని నూలు వడుకుట కనువైన యేకులను తయారుచేయుట గాంచితిమి. మఱియొకచో పోరంకి శ్రీరామరాజుగారు నూతనముగా స్థాపిం చిన పేముపరిశ్రమాలయపు అంగడి పూలపుటికలు, తములపాకుల పళ్లెరములు, బిడ్డల ఉయ్యాలలు, పెట్టెలు మున్నగువానితో నొప్పి జనుల నధికముగా నాకర్షింపుచుండెను. ఇన్నిటిమధ్య శారదానికేతనమువారి చిన్నయంగడి పెద్దస్వాగతపటమును గట్టుకొని నికేతనపు బాలికల రచనాకౌశలమునకును, ఉన్నవదంపతుల కార్యదీక్షకును నిదర్శనమై తనరారుచుండెను. వీని నన్నిటిని చూచునప్పటికే ప్రొద్దుక్రుంకెను. ఆసాయంత్రమే స్త్రీలక్లబ్బులో శ్రీ ముత్తులక్ష్మమ్మాళ్ గారికి సన్మానపత్రము సమర్పింపబడుచుండెననియు చాలమంది స్త్రీలక్కడ కరిగిరనియు తెలిసెను. కాని వ్యవధి లేకుండుటచే మే మటకరుగలేదు.
మూడవనాడు అనగా 5-11-29 తేదీని రామమోహన గ్రంథాలయభవనములో స్త్రీల బహిరంగసభయని ప్రకటన పత్రికలు పంచిపెట్టబడెను. దాదాపు మూడుగంటలవేళ ఆమందిరమున కరిగితిమి. పురస్త్రీలు కొందరప్పటికే యట కరుదెంచి కూర్చుండియుండిరి. కాని ఆసభకు నిర్వాహకురాండ్రెవరో యేర్పాటుచేసిన వారెవరో కనుపింపలేదు. గత రెండుదినముల సభలకు కర్తృత్వము వహించిన వారెవ రాసభకు హాజరుకాలేదు. ఇదియేమి ఆశ్చర్యమని యోచించుచుండగా ఇదివారికి సంబంధించినది కాదనియు, పట్టణకాంగ్రెసు సంఘమువారి యేర్పాటనియు కొందఱు చెప్పిరి. ఓహో! అనుకొని ఎవరైన నాయకురాండ్రరుదెంచెదరేమో మఱికొంచెముసేపు చూచి పోవుదముగాక యని మేముగూడ కూర్చుంటిమి. పిలుపు తలపులు లేనియాసభామందిరములో కాపరిలేని గొఱ్ఱెలవలె స్త్రీలు నలువైపుల తిరుగుచుండిరి. కొంతసేపటికి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారరుదెంచిరి. తరువాత బత్తుల కామాక్షమ్మ, వేదాంతము కమలాదేవి, గుమ్మిడదల దుర్గాబాయమ్మ, యామినీపూర్ణతిలకమ్మ గార్లరుదెంచిరి. పేరంటమునకు బోయినచోట యింటి యజమానురాలు లేకపోయినచో తానే పసుపుకుంకుమ లుంచుకొని తాంబూలము తెచ్చుకొనిన చందమున లక్ష్మీబాయమ్మగారు పెద్దఱికము వహించి యెవరో ఒక బొమ్మను అగ్రాసనాధిపురాలుగా నెన్నుకొని సభను ప్రారంభించిరి. అధ్యక్షురాలు 'స్త్రీలు స్వదేశీవస్తువులు' అను విషయమునుగూర్చి చెప్పెను. తరువాత లక్ష్మీబాయమ్మగారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులనుగూర్చి మాట్లాడుచు శారదా చట్టమునుగూర్చి యించుక కదలించి విడిచెను. తదుపరి రాష్ట్రభాషనుగూర్చి ప్రసంగించిన గుమ్మిడిదల దుర్గాబాయమ్మగారును, కాంగ్రెసు విషయమై మాట్లాడిన కమలాదేవిగారును, స్వాతంత్ర్యము విషయమై యుపన్యసించిన యామినీ పూర్ణతిలకమ్మగారును, మతవిషయమై యుపన్యాస మొసంగిన బత్తుల కామాక్షమ్మగారును శారదాచట్టమును విడువక తమ ప్రసంగములలో యామోదమును వెల్లడించిరి. ఉపన్యాసకర్త్రు లొకరివెంట నొకరు శారదా చట్టమునుగూర్చి ప్రస్తావించుటచే ప్రబలమగు నీసంస్కరణమునకు మిన్ను విఱిగి మీద బడ్డటులై మునుపే కలవరచిత్తులైయున్న పూర్వాచారపరాయణలగు వృద్ధస్త్రీలు సహనము గోల్పోయిరి. సభలో గల గల మాట లాడ దొడంగిరి. అందఱొకమారుగ నేల మాట్లాడెదరు మీరు గూడ శారదాశాసనముపై మీఅభిప్రాయము తెలుపుడనిన వినిపించుకొనరు. తాము అఱచుటమానరు! ఒకటేరొద. ఆనాడు మన స్త్రీల అశిక్షితవ్యవహారము బాగుగా విశదమయ్యెను. వైద్యుని ఔషధమున కొప్పుకొనిన తరువాత ఆతఁ డొసగిన చేదుమందుగాని వెగటుమందుగాని ఘాటుమందుగాని విసుగుకొనక వర్జింపక యెట్లు పుచ్చుకొందుమో అటులనే సభలకేగెడు వారుగూడ హితాహితములగు విషయములను వినుటకు తగుసహనమును ఓపికను కలిగియుండుటవిధి. పలువిషయములను చర్చించెడు సభలకేగి మాచెవి కింపైన మాటలనే చెప్పుడు లేకున్న నల్లరిచేయుదుమనుట యసభ్య లక్షణము. కాని పురుషుల సభలలోనే యిట్టి సభానీతి భగ్నమగుచుండుట మనము నిత్యము వినుచున్నమాటయే. ఇఁక ప్రపంచజ్ఞానములేని మనసంగతి చెప్పవలసినదేమి? శారదా చట్టమునుగూర్చి యూరక యుబుసుపోక వాదోపవాదములు చేసికొనుటయేగాని దాన ప్రయోజనమేమి? అది రాజశాసనము. అనుకూలురకును ప్రతికూలురకును తప్పదు. ఇది యుపన్యాసకురాండ్రు తెచ్చిపెట్టినదికాదు. వృద్ధాంగనలు దులుపుకొనినపోదు. కాని సభాప్రేక్షకురాం డ్రావిషయమై యోచింపరైరి. అది ఆయుపన్యాసకురాండ్రే తెచ్చినటుల భ్రమపడి కంగారుపడిరి. ఇచ్చవచ్చినటుల సభలో కేకలు పెట్టిరి. అంతతోఁ బోక వీధి పొడుగునను నోటికి తాళముతీసి బారలుసాచిరి. సోదరీ! నా కీకల్లోలము చూచుటకు చాలకష్ట మనిపించెను. “మన స్త్రీలలో విద్య యెప్పుడు పెంపొందును? ప్రపంచజ్ఞాన మెప్పు డలవడును? సహన మెప్పు డొదువును? తమ దేశసౌభాగ్యమునుగూర్చి జాతిసౌభాగ్యమునుగూర్చి ఎప్పుడు తెలిసికొందురు?" అను మహావిచారముతో మందిరమువీడి వెలుపలికి వచ్చుచుంటిని. ఇంతలో ద్వారముకడ నొకబాలుడు నిలువబడి మన 'గృహలక్ష్మి' పత్రికను చేతి కందించెను. ఆపత్రికను చూచినతోడనే "నే నింటింట ప్రవేశించుట చేతనే మీ మౌఢ్యము తొలగగలదు" అని యా సంచిక మౌనముతో జబాబిచ్చుచున్నదాయనుకొంటిని.
ఇంతియేగాదు. కల్పలతా! వీధిలో నేగోడపై చూచినను గృహలక్ష్మీకరపత్రములే. తెనాలిస్టేషను చేరినది మొదలు మనగృహలక్ష్మి పెక్కుమంది స్త్రీపురుషుల హస్తభూషణమై యలరారుటగన నాకెంతయో ముదంబు గొల్పెను. నిరంతర పత్రికాపఠనమే మనకు జ్ఞానప్రదాయిని కావలెను. మఱియు సభలు నిర్ణీత సమయముల వేళతప్పక జరుపుకొనుటయు సహనము వీడక సభలోని యుపన్యాసములు నాలించుటయు మనస్త్రీలు నేర్చుకొనవలసిన ముఖ్యాంశములుగా నాకాసభలు గనుటవలన తోచెను.
భావపురి
మిత్రురాలు,
డిసెంబరు 1929
శారద.