Jump to content

శారద లేఖలు (మొదటి సంపుటము)/12-వ లేఖ

వికీసోర్స్ నుండి

సౌభాగ్యవతియగు కల్పలతకు : —

నెచ్చెలీ !

నాజీవము ధర్మము. నామతము నీతి. నా లక్ష్యము సతీశ్రేయము. ఈమూటిని సమర్థించుటకే నేను చేతకలము బూనితిని. ఎప్పు డీయాశయత్రయము ననుష్ఠింపజాలకపోదునో ఆనాడు నావ్రాఁతకోఁతలు కట్టిపెట్టుదును. న్యాయమునకు నేను కేలుమోడ్తును. నిష్పాక్షికతకు నేను శిరమువంచుదును. నాకొకరు హితులులేరు. ఒకరహితులులేరు. యుక్తాయుక్తవిచక్షణలేక మతమును నిరసించెడు దురాచారులు నా కెట్లహితులో మతముపేరిట ప్రజలను పీడించెడి దుండగీండ్రును నాకట్లే అహితులు. సాంఘికధర్మముల విచ్ఛిత్తిఁజేయనెంచెడి దుష్ప్రారంభులు నాకెట్లమిత్రులో, సాంఘికరక్షణా వ్యాజమున జనులనలయించెడివారు గూడ నాకట్లేఅమిత్రులు. నిష్కారణముగా భార్యను దుఃఖపెట్టెడి దుర్జనుడు నాకెట్లు కోపకారణుఁడో, భర్త నల్లాడబెట్టెడి దుశ్చరితయు నాకట్లే శత్రురాలు. అభము శుభము నెఱుగని పసిబాలయగు కోడలిని కోడంట్రికముపెట్టెడి అత్త నాకెట్టి శత్రువో, అత్తపొత్తుగిట్టని గయ్యాళియు నాకట్లే పగతురాలు. దేశములోని సదుద్యమముల నిర్మూలింప యత్నించెడి దుశ్శీలురు నాకెట్టి పగతురో, దురుద్యమముల వ్యాపింపఁజేయువారును నాకట్లే పగతురు, దూషణభూషణతిరస్కారములు శరీరమునకు గాని యాత్మకు లేవను వేదాంతుల నానుడిని యొకవిధముగా విమర్శకులు గూడ నాదర్శముగా గొనవలసియుండును. పుఱ్ఱె కొకబుద్ధి జిహ్వ కొకరుచి. ఒక అభిప్రాయము మనము సరికాదనినపుడు దానిని సరియనువారును కుప్పలుతిప్పలుగా నుండనేయుందురు. అయితే ప్రకృతిభేదమునుబట్టి ఆ అవునుకాదనుటలో నొకరి పదప్రయోగము కటువుగను నొకరి పదప్రయోగము మృదులముగను నుండును. అంతమాత్రమునకే మనము కించనొందవలసిన పనిలేదు. అహింసాసత్యములు మహాత్ముని ఆదర్శములు. ప్రాచ్యప్రతీచ్య సమ్మేళనము రవీంద్రుని లక్ష్యము. ఈ ఆదర్శముల నంగీకరించినవారు వారిని కొండంతగ పొగడుచుండ అంగీకరింపనివారు తీవ్రముగ తెగడుచుందురు. అయితే ఆ మహాపురుషులకు నిందాస్తుతులయెడ నొక్కటే అద్వైతము. తమ కర్తవ్యములను సాధించుకొనుటే వారి ఆశయము. మహాత్ముడు ఒకప్పు డేమెనెనో తెలియునా? “లోకములో ఒకే మానవు డున్నంతవఱకు నాసత్యసిద్ధాంతమును బోధింపుచునే యుందును. నాఖద్దరు మంత్రము నుపదేశింపుచునే యుందును” అని. ఖద్దరుద్యమము ఎంతెంతటి మహాపురుషుల నిశితవిమర్శనమునకు గుఱియైనది! అందులకని మహాత్ముఁడెన్నడైనను నిరుత్సాహము జెందెనా? తన సంకల్పము విడనాడెనా? అటులనే స్త్రీలనాటకరంగ ప్రవేశమునుగూర్చి యొకమాఱు దీర్ఘముగా యోచించి అనుచితమైనదని మనస్ఫూర్తిగా నిశ్చయించిన వెనుక పెద్దపెద్ద లెల్లరు దీనికనుకూలముగా నున్నారనియు, ప్రసిద్ధపత్రికాధిపతులెల్లరు దీనికి చేయూత నిచ్చుచున్నారనియు నేనిప్పు డెట్లామోదింతును. అది నామనస్సాక్షికి వ్యతిరేకము గాదా? కాయేన మనసా వాచా నేనిప్పటికిని దానికి వ్యతిరేకనే.

'సాధన' పత్రికనుండి యుద్ధృతమైన నానాటకరంగ విమర్శనాలేఖపై విమర్శనముగల భాగమును నేను 'గృహలక్ష్మి'లో చూడకపోలేదు. చూచితిని. అది నాసరియైన అభిప్రాయమునకు విమర్శనమైనచో దానికి నాసమాధాన మనగత్యము. ఏలనందువా ఎందరో స్త్రీలు నాటకకళాప్రవేశమును సమర్థించుచు వ్రాయుచున్నారు. వారిలో వీరొకరని యూరుకొనియుందును. కాని నాలేఖకు కొన్ని అపార్థములు తీయబడినవి. అవి నాకు కొంచెము మనస్తాపకారణములుగనే యున్నవి. ఆవ్యాసము చూచినది మొదలు స్త్రీల వ్యాసములను విమర్శించునప్పుడే తగుమర్యాద జూపగల సరళభాష నుపయోగింప జాలనివారు స్త్రీలు వేసిన వేషము నేమాత్రపు సరళభావముతోఁ జూడగలరని సందియమగుచున్నది. నాలేఖ నామూలాగ్రముగా జదివిన నక్షరాస్యులకెల్ల నేను స్త్రీల నాటక ధారణావిషయమున ప్రతికూలనని స్పష్టముగా విశదమగుచున్నది. అట్టిచో స్త్రీవేషమువేసి రంగస్థలమున బాగుగా నెగురుటకు వీలులేదని నేను దుఃఖింపుచుంటిననియు, అట్టి నాదుఃఖము అర్థములేదనియు సాధనపత్రిక యెట్లూహించి వ్రాసెనో నాకు తోపకున్నది. ఒకచో శారదమ్మగారనియు, నొకచో శారదమ్మయనియు వ్రాసిన మాత్రమున మనకు లోపములేదు. కాని అది స్త్రీలయెడ వారికిగల యగౌరవ భావమునకు నిదర్శనము కాగలదు. మఱియు అవియేగాదు. విషయము చక్కగా గ్రహింపకయే చేసినవిమర్శనలం దింకను పెక్కులున్నవి. లేఖావిస్తరభీతిచే వానినెల్ల యిందు వివరింపక విడిచితిని. ఏమైన సరియే అర్థముచేసికొన సామర్థ్యమున్నప్పుడే చదువవలయును. వివరింపగల సామర్థ్యమున్నప్పుడే వ్రాయవలయును. ఈ రెండింటికిని చాలనివా రూరక అపార్థములను దీసి రచయితల నగౌరవపఱచెడి కటుపదములతో వ్రాయుటకంటె మిన్నకుండుట మేలు.

ఎవరెన్ని విధముల సమర్థించినను నాట్యకళ యభివృద్ధి జెందునేమోకాని గౌరవస్థానమునకు వచ్చుటమాత్ర మింతలో నయ్యెడిదికాదు. ఈకళకు గౌరవము ముందుకలిగినదిలేదు. ఇఁక ముందు కలుగబోయెడిది గూడ సందేహమే. శైలూష వృత్తిచే జీవించువారు పూర్వమన్ని కులముల వారిచేతను బహిష్కరింపఁబడియే యుండిరి. కులస్థులు వారితో సంబంధబాంధవ్యముల కొప్పకుండుటయేగాక వారితో పంక్తిభోజనముల కంగీకరింపఁకుండిరి. రాజదత్తాగ్రహారములు వారికి చెందకుండునట్లు రాజులు శాసనములు వ్రాసిరి. పగటివేషములు వేయునట్టియు, భాగవతము లాడునట్టియు, బ్రాహ్మణులకు మా యిండ్లలో విడిగా భోజనము పెట్టువారమని యిటీవల మా తల్లిగారు చెప్పినప్పుడు నాకెంతయో ఆశ్చర్యమయ్యెను. ఆధునికనాగరికతామహిమచే సాంఘికవ్యవస్థలు శిథిలమైన యిక్కా లమున అట్టి బాధలు నటకులకు లేక పోవచ్చును. లేకుండుట గూడ సంతోషకరమే. అయినను నాటకకళ కింకను గణ్యత లేదని మాత్రము చెప్పక తప్పదు. పాత్రధారులైన పురుషుల విషయమే యిట్లుండ స్త్రీపాత్రధారులు ప్రజల మన్ననలందుట కెంత కాలము పట్టునో దురూహ్యము. అయినను ఈచర్చలన్నియు పనిలేని పనులు. ఎవరి యిష్టము ప్రకారము వారుండుట కీదినములలో నొకరి నిరోధమేమియు లేదు. ఎవరి పెండ్లాము బిడ్డలు వారి స్వాధీనము. కనుక ఈనవీనోద్యమము నామోదించువారు ఇతర స్త్రీల నీపనిసేయ పురిగొల్పుటకంటె తమకుటుంబము వారితోడనే యీసంస్కరణము నారంభించిన నెంతయు సమంజసముగా నుండును. అట్టివారి నెవరును కాదనరు. ఒకవేళ నావంటి చేదస్తులెవరైన కాదనినను వారికి కలుగు కొదువలేదు. ఏదైనను రంగములోనికి దిగిన గాని రంగుబయట పడదు. తడిసిగాని గుడిసెకట్టరు. త్రాగి గాని తూగరని సామెతగదా! కాన అనుభవముచేతగాని దీని మంచి చెడుగులు తెలియవు.


భావపురి

ఇట్లు

1929 నవంబరు

శారద.