శారద లేఖలు (మొదటి సంపుటము)/11-వ లేఖ
సౌభాగ్యవతి కల్పలతకు : -
నెచ్చెలీ !
నీవు వ్రాసిన జాబు చూచితిని. అందు నీవు “ఇటీవల జరుగుచున్న ప్రతిసభలోను పురుషులకు గౌరవబిరుదు లొసంగుచు స్త్రీల కొక్కరికైన నీయక ఆంధ్రమహాజనులు స్త్రీలను చిన్న చూపు చూచుచున్నారు. చూచితివా? బిరుదు లందు కొనదగిన విదుషీరత్నము లాంధ్రస్త్రీలలో లేకనా? లేక స్త్రీల యెడగల నిరసనభావమా? ఏది దీనికి కారణము? ఇప్పటి పురుషులకు స్త్రీలయందు గౌరవభావ మేర్పడుచున్నదని నీవు వాదింతువుగాని నేను నమ్మను” అని నీవు వ్రాసిన వాక్యములు నా కెన్నిమాఱులు తలఁచిన అన్నిమాఱు లత్యధికముగా నవ్వు వచ్చుచున్నది. నీకుగూడ బిరుదులపిచ్చి యున్నదా యేమి? నంద్యాలసభలకు పూర్వ మొకపత్రికలో చదివితిని లెమ్ము. ఇంతకుపూర్వ మిచ్చిన బిరుదులన్నియు బ్రాహ్మణులకే చెందినవి. ఈమాఱు బ్రాహ్మణేతరులకుగూడ నొకబిరుదు నిచ్చుట యవసరమని అందు వ్రాయబడినది. అదిచూచి అర్హతానర్హతలను పరికింపవలసిన వాటికి బ్రాహ్మణ బ్రాహ్మణేతరభేదములు తీయబడుచున్న వేమని విచారించితిని. ఇప్పుడు నీవు స్త్రీ పురుష భేదములను గొనివచ్చితివి. బిరుదులపై మోహముగలవారు స్త్రీలలోగూడ నున్నారని నీ యుత్తరముచూచి ఆశ్చర్యముతో ననుకొంటిని. కాని విచారించిచూడ నా ఆశ్చర్యము పొరఁబాటే! ఏలనందువా? ఈ బిరుదులు మన దేశమునకు క్రొత్తలుగావు. రాజులకు, రాణులకు, మంత్రులకు, సేనాపతులకు, కవులకు, గాయకులకు, పండితులకు, మల్లులకు, శిల్పులకు వేయేల ప్రజ్ఞాచణులైనవారి కెల్లరకు కడుదీర్ఘములైన బిరుదావళులున్నట్లు ప్రాచీన శిలాశాసనములును, గ్రంథములును చాటుచున్నవి. ముఖ్యముగా సుప్రసిద్ధులగు మన ప్రాచీనకవివరేణ్యులలో బిరుదుపదములు లేనివారే లేరు. ఆదికవియైన నన్నయభట్టు వాగనుశాసనుడను బిరుదుపొందెను. ఆరణ్యపర్వశేషపూరణము గావించిన యెఱ్ఱనార్యునకు ప్రబంధ పరమేశ్వరుడను బిరుదుగలదు. తక్కుంగల భారతమును రచియించిన తిక్కయజ్వ కవిబ్రహ్మ యని వినుతిబొందెను. మనుచరిత్ర కావ్యకర్తయైన అల్లసాని పెద్దన ఆంధ్రకవితాపితామహుఁడను బిరుదము నందెను. రమణీయమంజులకవిత కధినాధుండైన శ్రీనాధుండు కవిసార్వభౌముండను బిరుదును బడసెను. ఇఁక కృష్ణదేవరాయాది రాజేంద్రులకును, తిమ్మరుసు మున్నగు మంత్రిసత్తములకును, తదితర రాజకీయోద్యోగులకునుగల బిరుదావళులకు లెక్కయేలేదు. ఇప్పటికిని మన దేశమునందలి సంస్థానాధిపతుల పేరులు చూచిన మన పూర్వులకు బిరుదావళులపై మోహ మెంతగానుండెడిదో విశదమగును.
అలనాటినుండియు మనవారికి ఉండిన బిరుదులపై వాంఛ నేడును మనవారిని వీడదుగదా! ఈ బిరుదులు పలు విధములు. పాండిత్యమునకు మెచ్చి ఈయబడెడివి కొన్ని. ప్రజ్ఞకు సంతసించి యిచ్చెడివి కొన్ని. ఈ బిరుదములను కొన్నిటిని ప్రజలొసంగుదురు. కొన్నిటిని యేవేని విద్యాపీఠములో జాతీయసంస్థలో పరిషత్తులో యొసంగును.
మన దేశమం దసహాయోద్యమము బయలు వెడలిన తరువాత దేశీయులు బహిష్కరింపవలసినవాటిలో ప్రభుత్వపు బిరుదములుగూడ నొకటిగాఁ జేర్పబడినవి. అప్పటినుండి ప్రభుత్వబిరుదములు పలుకుబడి చాలవఱకు సన్నగిల్లినది. మఱియు వానిపై నొకవిధమగు నిరసనభావముగూడ నేర్పడినది. నిరాకరణోద్యమము విస్తరించియున్న యాదినములలో పలువురు పూర్వదత్తబిరుదములను విసర్జించి ప్రజల పొగడ్తల బడసిరి. "బిరుదుపదవులను బురదలో దిగబడి" దేశమును దాస్యములో ముంచకుడని జాతీయాత్మగల కవులు గానము చేసిరి. ఈవిధముగా దొరతనపు సన్నదులపై మోహము జనులకు తొలగింపఁబడినను బిరుదులపై మోహముమాత్రము జనులకు పూర్తిగా వదలలేదు. దొరతనమువారి రావు సాహేబు, రావు, రాయ, దివాన్ బహద్దూర్, సర్ ఇత్యాది బిరుదులపై పోటీకి వచ్చినవో యనినట్లు దేశభక్త, దేశబంధు, దేశోద్ధారక మున్నగు బిరుదులు దేశసేవపరాయణుల పూజ్యనామములకు తగిలించి పిలుచుట అసహాయోద్యమ కాలమునుండి పరిపాటిగానున్నది. దేశపూజ్యులైనవారికి నిండుప్రేమతో ప్రజలొసంగెడి దేశభక్తాది బిరుదములు మాన్య ములేయైనను వీని ఆధిక్యతయేమో నాకు గోచరించుటలేదు. మహాకవియైన రవీంద్రనాథటాగోరుగారికి సర్ బిరుద మీయబడినప్పు డా మహాపురుషు డనెనట. ఏమని? "సర్ రవీంద్రనాథటాగోరు అనుటకంటె నా దేశీయులు 'రవిబాబు' అనుటయే నా కెక్కువ ప్రీతికరము” అని. కాన మహనీయులగు వారికి వారి నామాక్షరములే వేయి బిరుదులపెట్టు. ఎంత గొప్ప బిరుదమైన, వారి నామాక్షరములతో జేరినప్పుడే గదా రాణించును? అయినను స్త్రీలకుగాని పురుషులకుగాని యీ బిరుదులవలన గలుగబోయెడి ప్రయోజనమేమి? మునుపే గౌరవనీయులగువారి కీ బిరుదములవలన గౌరవ మినుమడింప బోదు. గౌరవహీనులగువారి కీ బిరుదులవలన గౌరవము కలుగను కలుగదు. మన ఆంధ్రమహాసభవారు గౌరవనీయులగువారి కీ గౌరవబిరుదములీయు టారంభించినది కీ॥ శే॥ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారికి ఆంధ్రరత్న బిరుద మొసంగుటతో నని జ్ఞాపకము. నాటినుండి యేటేట నొకరికో యిద్దరికో యీ బిరుదములు చదివించుచునేయున్నారు. అన్నిటి కేమిగాని శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారికి దేశోద్ధారక బిరుద మీయబడినదని పత్రికలలో చదివినప్పుడు నిజముగా నాకు నవ్వే వచ్చినది. పత్రికల మూలకముగా, ఉపన్యాసముల మూలకముగా, వితరణలమూలకముగా శ్రీపంతులుగారు దేశమునకు చేయుచున్న సేవ అమూల్యము. వారి సేవానిరతి అసదృశము: వారి దేశభక్తి యనుపమానము: వారి దానశీలత యసామాన్యము: వారి సౌజన్యకారుణ్యాదు లనన్యములు. సర్వతోముఖముగా ఆంధ్రప్రపంచమునకు వారు చేయుచున్న యుపకృతి పారములేనిది. అట్టివారిని బిరుదులు లేకనే ఆంధ్రప్రపంచము గుర్తించుచున్నది; పూజించుచున్నది; గౌరవించుచున్నది. ఇట్లు మునుపే ప్రజల మన్ననల చూరగొన్న యా మహనీయునకు మహాసభ “దేశోద్ధారక” బిరుద మొసంగుట సూర్యునకు దివిటీదానము చేసినట్లున్నది. ఇందువలన పంతులుగారికి ఇనుమడించెడి గౌరవములేదు. చేకూరెడి లాభములేదు. కాని అసాధారణమగు వారి దాతృత్వమునకు మహాసభవా రొకకొలమాన మేర్పరచినట్లైనది. సర్వతోముఖమగు వారి కృషి కొకముఖ మేర్పరచినట్లైనది. అపరిమితమగు వారి దేశసేవకు పరిమితి నేర్పఱచినట్లైనది. అంతియ దాని లాభము.
ఈ యే డాంధ్రమహాసభవారు నల్వురకు బిరుదము లొసంగిరి. వారు నల్వురును ఉత్తమోత్తమములైన యా సామర్థ్యచిహ్నములు పడయదగిన మహాపురుషులే యనుటకు సందియములేదు. కాని ఆ బిరుదులందుటవలన నా మహనీయులకు ప్రయోజనము లేకపోగా ఆంధ్రమహాసభవా రీ బిరుదులొసంగు పద్ధతిని గమనించి మన దేశమునందు కుప్పలు తిప్పలుగా జరుగుచుండెడి కులసభలును తదితర క్షుద్రసభలును చెలరేగి సాధారణులకెల్ల తలయొక బిరుదును నొసంగి ఈ మహనీయుల గొప్పతనమును క్రిందుపఱచునేమోనని భయ మగుచున్నది. ఇప్పటికే కవి, గాయక, నటక లోకమున నిట్టి బిరుదావళు లసంఖ్యాకములుగానుండుట సాధారణముగా జూచుచున్నాము. వారి కాబిరుదము లే సన్మానసభలోనైన నీయబడినవో లేక తమకుఁదామె తెచ్చుకొనినవో దైవమున కెఱుక. అయితే అట్టి బిరుదములను తగిలించుకొనుటచే వారి కార్థికముగా కొంతలాభ ముండవచ్చును. కాని దేశభక్త దేశోద్ధారకాది దేశసేవపరాయణుల కీ బిరుదములతో నేమి ప్రయోజనము? వారి దేశసేవయే వారి కెనలేని సామర్థ్య చిహ్నము. మఱియు వయోవృద్ధులగు వారి కిట్టి సన్మానములు సల్పుట కొంతకు గొంత లగ్గు. కాని చిఱుతప్రాయమువారికి బిరుదులిచ్చుట యోచనలేని సేఁత. బౌద్ధ వాఙ్మయబ్రహ్మ పిన్న వయస్కులని వింటిమి. బుద్ధపురాణము వారిగ్రంథములలో మొట్టమొదటిది. వా రింకను పెక్కు యుద్గ్రంథముల రచియింపవచ్చును. అలవాటుపడినచేయి యూరుకుండునా? చిఱుతవయస్సుననే బౌద్ధమతమును మధించిన యా విన్నాణి ఱేపు వేఱొక మతమునుగూర్చి యాంధ్రలోకమునకు విశదీకరింపవచ్చును. ఆ నా డాంధ్రమహాసభవారు ఆయా మతముల వాఙ్మయబ్రహ్మయని మరల వేఱొక బిరుదమిత్తురా? అటులనే విజయనగర సంగీతసారస్వతాది సభలవారు గూడ మఱల మఱికొందఱికి బిరుదులిచ్చిరి కాబోలు. అవి స్త్రీలకు లేవని నీకేల వలపోత? దీనివలన నారీలోకమునకు కలిగెడు లాభమేమి? స్త్రీలు విద్యావతులును, సుగుణవతులును, నేవాపరాయణలునునైనచో బిరుదులు లేకనే ప్రపం చము వారిని సన్మానించును. ప్రతిఫలరహితమైన ఉపకృతి, ప్రతిఫలరహితమైన వదాన్యత, యుత్తమోత్తమములు. మనుజులు కీర్తికాములగుటగూడ యొకలోపమే. కోరకయే మేఘుడు వర్షించినట్లు, వేడకయే పవనుడు వీచినట్లు, ప్రార్థింపకయే సూర్యుడు వేడివెల్గుల ప్రసాదించినట్లు జనులు స్వధర్మ నిరతులు కావలెను. కృషికి ప్రతిఫలము కోరుట యుత్తమగుణము కాజాలదు. ప్రతిఫలాకాంక్షలేని సేవాపరాయణులను లోకమే గుర్తించి మన్నించును. బాలగంగాధరతిలకునకు లోకమాన్య బిరుదము నేసభవా రొసంగిరి? మోహనదాసు కరంచందుగాంధికి మహాత్మ బిరుద మేసన్మానసభ యొసంగెను? కాన మహనీయులకు అల్పసంఖ్యాకులకూటములు మాత్రమేయగు సభలలో బిరుదులు సమర్పింపబడ నక్కఱలేదు. అవి తమకుఁ దామైవలచి వారిని జెందును.
ఏ యుద్దేశముచేతనో మన ఆంధ్రదేశమునందలి సమావేశములు, కొన్నివత్సరములనుండి దేశములో పెద్ద పెద్దలకు సన్నదులొసంగుట సాగించినవి. ప్రమాదమో బుద్ధిపూర్వకమో అందు స్త్రీలుమాత్ర మింతవఱకు చేరలేదు. అందులకు నాకు సంతోషమే యగుచున్నది.
ఈ బిరుదులపై పిచ్చి మనకే గాదు నాగరకరాజ్యము లని పేరొందిన పశ్చిమఖండములోగూడ బిరుదులపై వ్యామోహ మధికముగానేయున్నది. ఈ బిరుదులు బడయుటకై వారు పలుపాట్లు పడుదురట. ఈ సందర్భమున నేటి బ్రిటిషుకార్మిక రాజ్యాంగమున మంత్రియై ప్రభుపదమును బడసిన సిడ్నీవెబ్బు దొరగారి యిల్లాలైన సిడ్నీ వెబ్బుసతి నిరీహ సంస్తవనీయముగానున్నది. పెనిమిటి ప్రభువైనప్పు డామె ప్రభ్వి కావలెను గదా? కాని ఆమె యాపదముపై నేమాత్రము మోహముజూపక యిట్లనెనట -"ప్రజాహృదయమున మాప్రతిష్ఠ సిడ్నీ వెబ్బు అను నామముచేతనే ఆరూఢమై నెలకొన్నది. కావున కలకాలమువఱకు నేను ఆ నామముచేతనే వ్యవహరింపబడుటకు ప్రియముపడుదును.” కల్పలతా! ఆగష్టు మాసపు 'గృహలక్ష్మి'లో నే నీ వృత్తాంతమును జూచినప్పుడు పరమానందముజెంది నీ వ్యామోహత బాపుట కిది మంచి మందు అనుకొంటిని. సిడ్నీ వెబ్బుసతి నిర్లిప్తత మన ఆంధ్ర మహిళామణుల కాదర్శకమగు గాక!
భావపురి
ఇట్లు మిత్రురాలు,
సెప్టెంబరు 1929
శారద.