Jump to content

శారద లేఖలు (మొదటి సంపుటము)/10-వ లేఖ

వికీసోర్స్ నుండి

సౌభాగ్యవతి కల్పలతకు—

నెచ్చెలీ!

చూచితిని, సమదర్శినీగర్భశుక్తిముక్తాఫలమగు ఉగాది సంచికను చూచితిని. చక్కని కాగితములతో ముచ్చటైన అచ్చుతో రమ్యములైన చిత్తరువులతో మనోహరములైన భావగీతావళులతో దివ్యములైన వ్యాసములతో సంచిక రమణీయమై యొప్పారుచున్నది. ఆఱేండ్లు నిరాఘాటముగా చెన్నరాజధానీప్రజాయత్త శాఖల బాలించిన ప్రతిభాశాలియగు నా సచివశేఖరుని రాజలాంఛనాలంకృతంబగు త్రివర్ణముఖ చిత్రము నిజముగా నాసంచిక కపూర్వశోభనే గూర్చుచున్నది. రాజకీయసాంఘికార్థిక సారస్వతానేక విషయములనుగూర్చి వ్రాయబడిన ప్రసిద్ధవ్యాసములు పునఃపునః పఠనీయములై తనరారు చున్నవి. అందందు తనరారుచున్న పద్యమాల లాసంచికాబాలకు మణిహారములే! సందియములేదు. కాని యెట్టి చక్కదనాలచుక్కకైన ఇంచుకంతలోప ముండకపోదు. విధాతృ సృష్టిలోనే యిట్టిలోటు సర్వసాధారణముగా కనిపించుచుండును. ఇఁక మానవసృష్టియందుండుటలో వింతయేమున్నది? పాశ్చాత్య స్త్రీలనుగూర్చి వ్రాయఁబడిన వ్యాస మాసంచికలోఁ జేరుట నిజముగా నాసంచిక కొకకళంకమనియే చెప్పవచ్చును. అయినను నీ విషయమై యాసంచిక నిర్వాహకులనుగాని యావ్యాసకర్తనుగాని యనవలసిన పనిలేదు. వారి పత్రికానామమే వారి మతమును నిరూపింపుచున్నది. కాన సమదర్శన భావముతో నావ్యాసము నందుకొనిరి. ఇక వ్యాసకర్త విషయమా? ఆ సోదరునకు పాశ్చాత్యస్త్రీలనుగూర్చి తెలిసినంత మాతృదేశ స్త్రీలనుగూర్చి తెలియదు. పాపము తెలిసియుండినచో అంత అసభ్యముగను నంతపేలవముగను వ్రాసియుండరు. దానికేమి? ప్రమాదోధీమతామపి. ధీమంతులకుగూడ నొక్కొక్కప్పుడు పొరబాటు కలుగుచుండును. కాని ఆకథలేమి? మాణిక్యము వంటి సంచికలో మసి చుక్కలుపెట్టినట్లున్న వే? కల్పలతా! ఆకథలను జదువగనే నాకు మితిలేని విచార మొదవినది. ఏమి ప్రయోజనము గోరి యాపట్టభద్రు లిట్టి చెట్టకథలను వ్రాసిరో నేనిప్పటికిని ఊహింపలేకున్నాను.

మానవులు సహజముగా కథాప్రియులు. పాలుత్రాగు పసిబిడ్డగూడ చీమకథనో చేపకథనో చెప్పమొదలిడితిమేని యేడ్పుమాని ఊఁకొట్టును. ఈ పసితనమునాటి కథాప్రియత్వము మనుజులకు వార్ధక్యము వచ్చినను సడలదు. పత్రికా పాఠకులైనవారిలోగూడ సారస్వతవిషయములనిన విసుగుకొనెడి వారును, చారిత్రకవృత్తాంతమనిన తలకంటగించుకొనెడి వారును, ప్రపంచవార్తలనిన వలదనెడి వారును, మతవిషయములనిన మాకెందు కనెడువారును, భావగీతావళులనిన నేవపడెడువారును, కలరుగాని కథలనిన చెవి గోసికొనని వారుండరు. ప్రతినెలయు మాయిరుగు పొరుగు అమ్మలక్కలు “ఏమండీ, గృహలక్ష్మివచ్చిందా? భారతి వచ్చిందా? ఏం కథ లున్నాయి. ఒకమారు చూపరూ” అని కథలకొఱకే భారతీ గృహలక్ష్ముల క్షేమసమాచారము లడుగుచుందురు. ఆపత్రికలలోని యొకటి రెండుకథలు చదివినచో వారి చదువు పూర్తి యైనట్లే. ఇఁక వానిలో వివిధవిషయములను గూర్చి కూర్చిన విజ్ఞానమంతయు వారి దృష్టిలో వట్టిచెత్త. చదువగనే యర్థ మయ్యెడివిని చదివినంతనే యానందమును గూర్చెడివిని కథలు. కాన అన్నివిషయములకంటె కథలనిన ప్రజలకెక్కువమక్కువ. ఈవిధముగా పండితపామరవివక్షతయు, బాలవృద్ధభేదమును లేక యెల్లరియామోదమును బడసెడి కథలెంత - ప్రశస్తములై యుండవలెను? అది యేమిపాపమోగాని ఆధునికకథావాఙ్మయ మట్టి ప్రశస్తతను గోల్పోయియుండుటకు కడుంగడు విచారము గొల్పుచున్నది. ఒకమారు మాఅన్నగారితో మాట్లాడుచుండగా మాటల సందర్భమున “కథలు యెట్లా ఉండాలె?” అని నేను మాసోదరునడిగితిని. "తన వాళ్లను నలుగురిని దగ్గరకూచోపెట్టుకొని చదివేటట్లుండాలె” అని ఆయన అనెను. అంటే? అన్నాను నేను. మగవాడు తన తల్లికి, కొమార్తెకు, తోబుట్టువుకు, భార్యకును; ఆడుది, తన తండ్రికి, సోదరునకు, పెనిమిటికి, పుత్రునకును, చదివి వినిపించుటకు అర్హమైనదిగా ఉండాలె. కథలేగాదు చిత్తరువులుగూడ అట్లే ఉండాలె అని ఆయన యనెను. నాకు హితోపదేశము చేయుటకై మాసోదరు డావాక్యము లనకపోయినను, ఆమాటలు గురుమంత్రమువలె నామనస్సున శాశ్వతముగా నాటిపోయినవి. ఏదేనియొక కథవ్రాయ దొరకొనినచో భావగర్భితమైన యావాక్యము నాకు మాటిమాటికి స్ఫురణకు వచ్చుచు అంధకారపథమున దీపకళికవోలెతోచి నాకర్తవ్యతాపథమును నిరూపింపుచుండును. ఇతరకథలను చదివినప్పుడు గూడ ఆకథలు పైవాక్యమునకు సరిపడియున్న వాయని యోచించుట నాకు పరిపాటి. సమదర్శినీ సంచికలోని కథలను జదివిగూడ నే నిట్టులనేయోచించితిని. రెడ్డిరంగమ్మ యెడ్డెతనపుగాథను జదివి అసభ్యము, అసాధారణము అని మనస్సున చీకాకుపడి, సావిత్రి యను చల్లనిపేరుగాంచి యీకథయైన మనశ్శాంతి నీయకపోదని కుతూహముతో జదివితిని. మొదటికథకంటె నధ్వాన్నముగ నున్నదీ కథ. “మాప్రణయగాథ” సరేసరి. అన్నిటికంటె గొడవగానున్నది అమ్మడు గొడవ. సమదర్శినీపత్రికాధిపతులు తమ సమదర్శకత్వమును తేటపఱచుటకై హితాహితములను గమనింపక యిట్టి కథలకు తావొసంగి రనుకొందము. కాని వ్రాసినవా రివి యెందులకు వ్రాసిరి? ఆకథలు తల్లి, బిడ్డకు చదివి వినిపింప దగినవికావు. బిడ్డ తండ్రికి చదివి వినిపింప దగినవికావు. సోదరుఁడు తోబుట్టువు నాకథలను జదువుమని చెప్ప సాహసింపజాలడు. స్నేహితుఁడు ఒకస్నేహితునిముంద రాకథలను సిగ్గువిడిచి చదువజాలడు. తుదకు అగ్నిసాక్షిగా పెండ్లాడిన ఆలుమగలు కాదుగదా కూరిమికిగూడిన స్త్రీపురుషులైన ఆకథలను జదివి మోదింపజాలరు. సావిత్రివంటి, రెడ్డి రంగమ్మవంటి, పనికిమాలిన స్త్రీలెచ్చటైన నున్నచో వారిని గూర్చి బహిరంగముగా జెప్పుకొనుటకే యోగ్యులైన వారు పూర్వము జడియువారు. మనసున తలపరాని వాక్కున నుచ్చ రింపరాని యట్టి వృత్తాంతము లిప్పుడు విధ్యాధికుల లేఖనీ సన్మానమునందుచు రమణీయకథలై పత్రికలలో పొత్తములలో నెక్కుచున్నవి. ఆహా! కాలమహిమ !

కథ అచ్చుపడి దేశములో ప్రవేశించిన తరువాత అవివాహితయైన బాలిక చదువును. అన్నెపున్నెము లెఱుగని బాలవితంతువు చదువును. సత్యనురక్తయగు నిల్లాలు చదువును. వైరాగ్యోదయమైన వృద్ధురాలు చదువును. అట్లే పురుషులలో గూడ విద్యార్థులు మున్నగు పలురకములవారు చదువుదురు. అందఱు చదువుట కర్హమైనదిగా నుండవలయుట కథారచయితల ముఖ్యధర్మమై యున్నది. కథకులేగాక కథకురాండ్రుగూడ యిట్టి కథలను వ్రాయ సాహసించుచున్నారు. దైవము వీరికి మంచి త్రోవను చూపుగాక.

కల్పలతా! యోచింప, యోచింప, భావకవులనబడెడి వారేదియో యొక ఆడపేరు బట్టుకొని 'ప్రేయసీ! ప్రేయసీ' యని యల్లాడుటయు, కథకులైనవారు 'ప్రేమప్రేమ’యనుచు స్త్రీలనుగూర్చి యిట్టి విపరీతపు అసమంజసపు గాథలల్లుటయు, జూడ ఆంధ్రభాష దురదృష్టమో ఆంధ్రస్త్రీల దురదృష్టమో యోచింపలేకున్నాను.


భావపురి

ఇట్లు

ఆగస్టు 1928

శారద.