శశికళ/పరమార్ధము

వికీసోర్స్ నుండి

పరమార్ధము

"ఓశిల్పి! నీ విద్య ఉపదేశమొసగునది
 పరమార్థ మేమం"చు ప్రశ్నించినావు

"సుందరము రేఖలో సొబగైన వర్ణాల
 నారాణి మూర్తింప నావిద్య" లన్నాను.

"ఓ కవీ! నీపాట ఒదుగు మెదుగులలోన
 చెలువొందు భావమ్ము సెలవీయు" మన్నావు.

"జ్వలిత గీతాతటి చ్చలిత కాంతులమధ్య
 నారాణి రూపింప నా తపస్స"న్నాను.

"ఓహో నృత్యోపాసి ! నీ అంగహారాల
 ఓహరిలు గోప్యమ్ము ఊహేది" అన్నావు.

"నృత్త నృత్యాలలో వృత్తిలో చారలో
 దేవి నీకై ఆడి నీవౌదు" నన్నాను.