వేమన పద్యాలు ల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

లేఁడు లేఁడనినను లేఁడు లేనేలేఁడు[మార్చు]

లేఁడు లేఁడనినను లేఁడు లేనేలేఁడు
కాఁడు కాఁడటన్న కానెకాఁడు
తోడు తోడనినను తోడనే తోడౌను
విశ్వదాభిరామ వినర వేమ!

లంకపోవునాఁడు లంకాధిపతి రాజ్య[మార్చు]

లంకపోవునాఁడు లంకాధిపతి రాజ్య
మంత కీశసేన లాక్రమించె
చేటుకాలమైనఁ జెఱుప నల్పుఁడె చాలు
విశ్వదాభిరామ వినర వేమ!

లింగ మంగమునను లీలఁ దెలియువెన్క[మార్చు]

లింగ మంగమునను లీలఁ దెలియువెన్క
మనసు లింగమందు మరులుకొనును
మనసు నిల్పనందె మఱిలింగ ముండురా
విశ్వదాభిరామ వినర వేమ!

లింగమందుచూడ లీనమై యుండెనా[మార్చు]

లింగమందుచూడ లీనమై యుండెనా
యంగమందు లింగ మమరియుండు
లింగభావమెఱిఁగి లీనమై యుండరు
విశ్వదాభిరామ వినర వేమ!

లంజ దానియొక్క లాలించిముద్దాడు[మార్చు]

లంజ దానియొక్క లాలించిముద్దాడు
మిండ డరయ లంజమీఁది ప్రేమ
ఆడుదానివంక నందఱు చుట్టముల్‌
విశ్వదాభిరామ వినర వేమ!

లంజ లంజకానిలాగెల్లఁ గొనియాడు[మార్చు]

లంజ లంజకానిలాగెల్లఁ గొనియాడు
లంజతల్లివాని లజ్జ గడుగు
తల్లి గలుగులంజఁ దగులుట దోషంబు
విశ్వదాభిరామ వినర వేమ!

లోక మరసినట్టి లోకోపకారులు[మార్చు]

లోక మరసినట్టి లోకోపకారులు
భోగభాగ్యములను బొంది తుదను
పూర్వవాసన విడిపురహరు తావున
మ్రోగుచుంద్రు తారు మొనసి వేమ!

లోకములకు గురువు లోకులకును గుర్వు[మార్చు]

లోకములకు గురువు లోకులకును గుర్వు
వదియుఁ దెలిసి మోక్ష మందుగోరి
గురునిఁ గనక నరక కూపము నందురు
విశ్వదాభిరామ వినర వేమ!

లక్ష్మియేలినట్టి లంకాధిపతిపురి[మార్చు]

లక్ష్మియేలినట్టి లంకాధిపతిపురి
పిల్లకోతి పౌఁజు కొల్లబెట్టె
కలసి వచ్చువేళ ఘనులౌదు రల్పులు
విశ్వదాభిరామ వినురవేమ!

లేని కాలమునకు లేమిమనము నొందు[మార్చు]

లేని కాలమునకు లేమిమనము నొందు
నీనిన పులిరీతి నెఱుఁగకుండు
కఠినబుద్ధి కిట్లు కలిమేమి గల్గురా
విశ్వదాభిరామ వినర వేమ!

లోన బయలుచేసి లోకంబు దెగటార్చి[మార్చు]

లోన బయలుచేసి లోకంబు దెగటార్చి
కులము గాలఁబెట్టి గుణము వదలి
చింతలోనిచింతఁ జేరిన యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!

లోను చూడఁజూడ లోకాభిరామంబు[మార్చు]

లోను చూడఁజూడ లోకాభిరామంబు
బయలు చూడఁజూడ బంధనంబు
తన్నుఁజూడఁజూడ తారక బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

లోను బదిలపఱచి లోనివికారముల్‌[మార్చు]

లోను బదిలపఱచి లోనివికారముల్‌
దలఁచి మెట్టువారు తెలియువారు
ఆకసమున వేడ్కనరయంగ నుందురు
విశ్వదాభిరామ వినర వేమ!

లోభి వానిఁ జంప లోకంబు లోపల[మార్చు]

లోభి వానిఁ జంప లోకంబు లోపల
మందు వలదు; వేఱె మతము గలదు
పైక మడుగఁ జాల భగ్గున పడి చచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!

లోభమోహములును ప్రాభవములుదప్పు[మార్చు]

లోభమోహములును ప్రాభవములుదప్పు
దలఁచిన పనులెల్లఁ దప్పిచనును
తా మొకటి దలంప దైవమొక్కటిఁదల్చు
విశ్వదాభిరామ వినర వేమ!

లలితశివ తత్వపదమునఁ[మార్చు]

లలితశివ తత్వపదమునఁ
గలసిన శివయోగియేల కలియును జనుల
జలబిందువు ముత్తియమై
కలియునె తొల్లింటి నీటఁగనరా వేమా!

లోకమందుబుట్టి లోకమందె పెరిగి[మార్చు]

లోకమందుబుట్టి లోకమందె పెరిగి
లోక విభవమోర్వలేక జనుడు
లోకమందు జనికి లోబడి చెడిపోవును
విశ్వదాభిరామ వినుర వేమ!


వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |